కవిత్వం కొత్తపుంతలు తొక్కుతోంది. పాఠకులతో కొత్త అభిభాషణ, కొత్త వ్యాకరణం, నవీన శిల్పం, నవీన పదజాలం, నవీన దృశ్యీకరణ, నవీన వస్తురూప వ్యవస్థ అలవడింది కవిత్వానికి.
విప్లవ కవిత్వం కూడా దీనికి మినహాయింపు కాదు.
రెండు వేళ్ళ బదులు పది వేళ్ళతో కవిత్వం రాయబడుతోంది. కంప్యూటర్ కూడా ఇప్పటి కవిత్వం ముందు పాతబడిపోయింది. ఇది పద సంబంధమైందీ, రూప సంబంధమైంది కూడా! భావ కవిత్వం కూడా ఇప్పుడు కృష్ణపక్షం దాటింది. ఈ మార్పును కూడా ఆహ్వానించాల్సిందే.
ఆఖరికి కవిత్వంలో కళాత్మకతను వస్తువుతో సంబంధం లేకుండా ఆశ్వాదించే వెసులుబాటును కొంత మంది పీఠాధిపతులు ఏర్పాటు చేశారు కాబట్టి మనం అన్యమనస్కంగానే దీన్నీ మోయక తప్పని పరిస్థితి దాపురించింది. ఇవి పక్కన పెడితే -రాసిలో ఉన్నంతగా వాసిలో ఉన్నదా అన్న ప్రశ్న కూడా ప్రస్తుతం అవసరం. వాసి అంటే ఇక్కడ వస్తువు అనే ఉద్దేశ్యం. ఒక సీరియస్ కవి ఎంచుకునే వస్తువు పాఠకుడు ప్రపంచాన్ని స్పష్టంగా చూడడానికి ఉపయోగపడే దృక్పధంతో ఉండాలి. ప్రపంచాన్ని స్పష్టంగా చూసే పారదర్శకతను చూపుగా కవిత్వం పాఠకుడికి అందివ్వాలి. దృక్పధం పట్ల నీరసం ఆవరించి అటు ప్రకృతి అందాలు ,ఇటు ప్రేమ కవిత్వానికి ఆలంబన అవుతున్న దశలో అసామాజిక అంశాల ప్రాధాన్యం కూడా పెరిగిపోయింది. ఈ దశలో విప్లవ కవిత్వం నిర్వహించవలసిన పాత్ర ఏమిటీ? కాలానుగుణంగా అందులో వచ్చిన మార్పులేమిటీ అనేవి పరిశీలనాంశాలే!
విప్లవ కవిత్వం మిగతా అన్ని ధోరణుల కంటే ఎక్కువ బాధ్యతనీ ఎక్కువ నిజాయితీని నిబధ్ధతను ప్రదర్శించాలనేది ఒక షరతు. ఈ షరతుకు లోబడకపోతే కవిత్వం రాయనవసరం లేదు.
కవిత్వంలో మార్పు కి కాలమనే తూనీక చేర్చిన కొత్త అంశాలేమిటీ అవి సమాజంమ్మీద ఎటువంటి ప్రభావాన్ని వేశాయి. అనేది తర్కించుకోక తప్పదు.
వాస్తవానికి ఈనాటి కవిత్వం అంత సులువుగా అర్థం అయేది కాదు. బాగా అలవాటు పడేదాకా అర్థం చేసుకోవడం కష్టం. కాలం మారింది కాబట్టి సామాజిక సంక్షోభం జీవితం లో సృష్టిస్తున్న సంక్లిష్టత కవిత్వంలో వచ్చి చేరిందా అనే నిర్ధారణ సరైనదా కాదా అనేది కూడా చర్చే. వాస్తవానికి ఈ సంక్లిష్టతలను విడదీసి కొత్త చూపునివ్వాల్సింది ఎవరో కాదు విప్లవ పంధానే. ఎందుకంటే దానికి సైధ్ధాంతిక నిబధ్ధత ఉంది.ఆశ్చర్యకరంగా భాష సరళతరమవుతున్న స్థితిలో భావం సంక్లిష్టంగా మారుతోంది. ఆ దృష్టి తో అవలోకించినపుడు రివెరా కొత్తగా తీసుకొచ్చిన ʹనీదాకా వచ్చినా తాకుతావో లేదో సాయంకాలం వాననిʹ కవిత్వం కూడా నన్ను బాగా కష్టపెట్టింది. కొత్త ని అంత సులువుగా అర్థం చేసుకునే మెదళ్ళు కావు కదా మనవీ. దీన్ని అర్థం చేసుకోడానికి కాసింత కసరత్తు అవసరమైంది. ఇది విప్లవ కవి రాసిన కవిత్వం. విప్లవ కవిత్వంలో కొత్త కవిత్వం. దాదాపు పదహారేళ్ళ కిందటే కూడా రివెర సగం కాలిన వెన్నెల చదివిన వాళ్ళకి రివెరా కాలంతో పాటు ప్రయాణిస్తున్న కవి అని అర్థమైపోతుంది. విప్లవ కవిత్వం నినాద ప్రాయ కవిత్వమనో, శిల్పరాహిత్య కవిత్వమనో అవహేళన చేసే వాళ్ళు వెంటనే చదవవలసిన కవిత్వమిది.
రాజకీయార్థిక విషయాలు సామాజికోద్యమాల పాత్ర చాలా సున్నితమైన అంశాలను కవిత్వంలోకి దిగుమతి చేశాయి. తోట రాముడి తొడకు కాటా తగిలిందాని..వంటివ ఇమేజెస్తో వినూత్నంగా జనం బాధలు వస్తువులుగా గొప్ప కవిత్వాన్ని సృష్టించింది విప్లవ సాంస్కృతిక సాహిత్యం. విప్లవ కవిత్వం అక్కడే ఆగిపోయిందని. వస్తు శిల్ప వైవిధ్యం కొరవడిందని చర్చని సాహిత్య భావవాదులు ముందుకు తెచ్చి సాహిత్యాభిమానుల్లో ఒక రకమైన గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నించారు. ఈ వాస్తవాలను పక్కన పెడితే ఇంటెన్షల్గా దీన్ని ఎదుర్కొడానికి విప్లవ కవిత్వం ఎదైనా కసరత్తు చేసిందా అనిఇంటెన్షనల్గానే కొత్త ప్రయోగాలను చేపట్టిందా అనేది కూడా చర్చనీయాంశమే. రివేరా కవిత్వాన్ని ఈ చర్చలోకి ఖచ్చితంగా చేర్చాలి.
విప్లవ కవిత్వానికి ఆత్మ ప్రజా జీవితమే. ఆ ప్రజా జీవితంలో సంక్షోభాలు తీవ్రమౌతున్నపుడు విభిన్న సామాజిక సమూహాలకు నిలయమైన మన వ్యవస్థలోంచి పుట్టికొచ్చిన అనేక కొత్త మార్పుల ప్రభావం విప్లవ సాహిత్యం పై పడకుండా ఎలా ఉంటుంది? వస్తు నిష్టత విప్లవ కవిత్వానికి ఎప్పుడూ సమస్య కాలేదు. అరసవిల్లి, కెకె, రివేరా, కాశీం ఉదయమిత్ర రాఘవాచారి వెన్నెలవనం రాసిన కొత్తతరం విప్లవకవి చంద్ర విమర్శకులకు ఇప్పటికే చాలా పని కల్పించాల్సింది. అలా జరగకపోవడానికి కారణం సాహిత్యవాతావరణంలో నిజాయితీ కొరవడడమే.
కాలానుగుణంగా వచ్చే మార్పును కొత్త కోణంలో చూపుతూ నీదాకా వచ్చిన తాకుతావో లేదో సాయంకాలం వానని ( చాలా రోజుల తర్వాత ఊరెళ్ళిన ఓ పోరడి ఆలోచన క్రమాన్ని వివరించిన ఏ ఊరునీదంటే అనే కవిత లోని ఓ పాదం ఈ వాక్యం) అనే ఈ సరికొత్త పుస్తకం లో రివేరా స్వయంగా కవులేం రాయాలో వారి కార్య రంగం ఏమిటో కవి ఏమంటావూ అనే కవితలో స్పష్టంగా చెప్పాడు కూడా.
విప్లవం ఒక సృజనాత్మకమైన వ్వవస్థకోసం తన చేతులకీ, చెవులకీ, కళ్ళకీ, మెదడుకీ పనిపెడుతుంది కాబట్టి చాలా సహజంగానే కాళాత్మక సృజనకి అవకాశం ఎక్కువ. ఇది విప్లవసాహిత్యం ప్రత్యేకతే కాదు బలం కూడా. బలహీనంగా అనిపించిన కవిత్వంలో కూడా విషయం ఉండడం దీని ప్రత్యేకత. ఎందుకంటే తక్కువలోతక్కువ ఎక్కువలో ఎక్కువ జీవన ప్రతిఫలనం ఇందులో ముఖ్యం కాబట్టి. అన్ని పార్శ్వాలను తాకడం దీని అసలు సిసలు అచీవ్మెంటు. దీని అసలు సిసలు బలం. అక్కడితో ఆగిపోదు కదా. అన్ని ప్రవాహాల్నీ కలుపుకునే సముద్రం విప్లవం. ప్రపంచవ్యాప్తంగా ఈ సంక్షోభకాలంలో వినిపిస్తున్న బలమైన ఉద్యమనేపాధ్యాల్నీ అంతే బలంగా వినిపిస్తున్నది. ప్రజాబాహుళ్యం భుజంతో భుజం కలపడం ఏ శషభిషలూ ప్రదర్శించని ఓ సైధ్ధాంతిక నిబధ్ధతను కొలమానంగా తీసుకున్నపుడు రివేరా నిబధ్ధత కలిగిన మంచి కవే! అని ఈ పుస్తకం రుజువు చేసింది. విప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే. ఇతడి కవిత్వంలో ప్రయోగశీలతతో పాటు ప్రయోజనశీలత ఉండడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పాఠకుడు చాలా విభిన్నమైన కవితా వస్తువులను కనుగొంటాడీ పుస్తకంలో. నిర్దిష్టమైన అంశాన్ని నిర్దిష్టమైన శిల్పం దానికి తగ్గ భాషని ఎంచుకోవడంలో కవి విజయం సాధించాడనీ అనిపిస్తుంది. ఒక పదం ఇద్దరు కవులు అనే కవిత
గానీ అలసట కవిత గానీ కూర్పు విషయంలో ఈ కవికి ఉన్న పట్టును తెలియజేస్తాయి. అతడెవరు అనే కవిత చురుకైన అభివ్యక్తి ఉన్న కవిత. ఈ కవితలో ఏ కోవకీ చెందకుండా పోతున్న యువతరం పరిస్థితిని చాలా కొత్తపంధాలో వివరించాడు కవి. అలాగే ఈ కాలంలో ఆటలు సామ్రాజ్యవాదాన్ని బలపరిచేవే అని అవి చివరికి బిడ్డలను తల్లులకు కాకుండా మైదానాల పాల్జేస్తున్నాయనీ వివరిస్తాడు. రెప్పలు కప్పని నిద్దుర కవిత భార్యాభర్తల మధ్య ప్రేమని చిగురించనివ్వని కాలాన్ని నిలదీస్తుంది.
ఇలా అన్నీ వినూత్నమైన కవితలే. ప్రశ్న సమాధానం రెండూ తామే అయిన కవితలివి. సమస్యల్ని మూలాల్నించి చూపే కవితలివి. కుళ్ళిపోతున్న వ్యవస్థ మీద కవిత్వం ఇలాంటి ప్రశ్నలు సంధించాలి అని కోరుకునే వాళ్ళందరికీ - రివెరా - సబ్ కా జవాబ్ తూహై కవీ..!
Type in English and Press Space to Convert in Telugu |
మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన : రివేరా9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన పై రివేరా ఉపన్యాసం....... |
చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..పుస్తకాల సంచిని గిరాటేసి
రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం
వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు
స్నేహితుల భుజాలపైనుంచి
నవ్వుతూ చూడటమే చివరిచూపు....... |
ఏప్రిల్ పండు II రివేరాపిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,... |
సాయంకాలం వాన!దుప్పటి కింద, దిండు అడుగున
పిల్లలు చూడకుంటా కప్పెట్టుకొన్న
వరదగూడుని మెలిపెడతావేమో... |
రెప్పని కప్పని నిద్దురఒకే రాత్రిని కప్పుకొన్న మనకి
ఒక్క నిద్దుర చాలదా?
చుక్క కలని పొదువుకోడానికి
ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?... |
ఈ రాక్షస గీతి వింటారా?మనం నిలబడిపోయిన చోట నుంచే
మన నడకలను మోసుకెళుతున్నారు
మనం ఆపేసిన రాగాలనే
తీగలుగా సాగిపోతున్నారు
మన గొంతునీ, మన వంతునీ
మనక్కిచ్చేసి వెళుతు... |
భయం చుట్టూ భయం..వీళ్లెక్కడ చంపుకుతింటారోనని ఆడవాళ్లకు భయం
భయంలేని ఆడవాళ్లంటే మగవాళ్లకు మహా భయం
దొంగలంటే భయం, పోలీసులన్నా మరి భయమే
తాళాలు లేని తలుపులంటే భ... |
నో, ఐ డోన్ట్ లైక్ టమాటటమాట రంగు సరే,
రసాలూరే సరస్సులేమీ..
కొంచెం కరిచిపట్టుకొన్న
మిలమిలా మీనాలేమీ..
పైకి కిందకి మునకలేసే
గత్తరబిత్తర గోళాలేమీ....... |
అద్గదీ...అటో ఇటో వేటో పోటో పడిపోవాల్సిందే!
పాలకులంతా ప్రజాస్వామికవాదులై
ప్రజలేమో నియంతలైతే ఏమి చేస్తాం?... |
యంత్ర భూతమైన ప్రేమలు పత్ర హరితాలు కావాలని..సామాన్యులను అసామాన్య కథానాయకులను చేస్తున్న కాలం ఇది. ఇరాక్, నికరుగువా, పాలస్థీనాల్లో పాల ఫ్యాక్టరీలపై బాంబులు వేస్తున్నవాడినీ, మన గిన్నెల్లో విష క్షీరాలన... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |