ఒక పద్మ తల్లి

| సంభాషణ

ఒక పద్మ తల్లి

- - వరవరరావు | 04.05.2017 08:30:49pm


పద్మ తల్లి చనిపోయింది. ఏప్రిల్‌ 29 ఉదయం బాత్‌రూంలోకి వెళ్లి పడిపోయింది. ఏమైందో తెలియదు. మెదడులో నరాలు చిట్లి చనిపోయినట్లు ఆ తరువాత వైద్యుడు చెప్పాడు. అప్పటికామె వారం రోజులుగా నలతగా ఉన్నదని, ఇంక తన పని అయిపోయిందని అంటూ ఉండేదని ఆమె కూతుళ్లు చెప్పారు. పెద్ద కూతురు బాత్‌రూం నుంచి బయటికి తెచ్చి పనిమీద వెళ్లి వచ్చి చాయ్‌ ఇచ్చే వరకే చాయ్‌ నోట్లోకి వెళ్లలేదు. నాలుక బయటికి వచ్చింది.

నలభై ఏళ్లు ఏడుగురు సంతానానికి సేవలు చేసి ఎవరితో చేయించుకోకుండా వెళ్లిపోయింది. యాభై ఏళ్ల నుంచి మానసికంగా ఎదగని కూతురును దగ్గర పెట్టుకొని ఆమె కోసమే ఒక గది, తనదైన ఒక సంసారం ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌లో ఎక్కడో మారుమూలలో ఉంటున్నది. ఆ కూతురును చంటిపాపలా చూసుకుంటున్నది. నిజానికి ఆమెను చంటిపాపలా చూసుకొనే మానసిక వయసు.

పద్మ కోసం ఆమె పదేళ్ల నిరీక్షణ ముగిసింది. బహుశా శనివారం ఏప్రిల్‌ 29 నుంచే ఆమె మట్టిపొరల్లో శాశ్వతంగా నిద్రపోతుంటుంది. ఈ పదేళ్లూ ఎప్పుడూ కంటి మీద కునుకు లేకుండా ఆ కూతురు కోసం నిరీక్షణ.

జీవితంతో నలభై ఏళ్ల పోరు కూడా ముగిసింది. ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు కలిగాక చివరి పాప పుట్టిన ఏడాదికి భర్త చనిపోయాడు. అప్పటికి రెక్కల కష్టం మీద బతికిన వాళ్లే. రెండే రెక్కలు మిగిలాయి. అందులోను రెండు ఆడరెక్కలకు పనుల విషయంలో పరిమితులుంటాయి. అప్పడాలు చేసి, అప్పాలు చేసి ఇంటింటికీ తిరిగి అమ్మి పొట్టపోసుకున్నది. తన ఒక్కర్తి పొట్ట మాత్రమే కాదు. ఎనిమిది మందివి. ఆ ఊళ్లో ఉపాధ్యాయులు ఆమె స్వాభిమానాన్ని చూసి ఆమె దగ్గరే ఇటువంటి అవసరాలు కొనేవాళ్లు. పిల్లలకు చదువు ఈడు వచ్చాక వాళ్లే సహాయం చేసారు. ముఖ్యంగా పెద్దవానికి విద్యాబుద్ధులు వచ్చాయి. కాని వాళ్లకు రెక్కలొచ్చాయి. వాళ్లంతా ఎగిరి హైదరాబాద్‌ వచ్చారు.

హైదరాబాద్‌లో 1990ల ఆరంభంలో ఆమె మూడో కూతురు పద్మకు విప్లవ రాజకీయాలు అబ్బాయి. చైతన్య మహిళా సంఘంలో తొలి నాయకత్వంలో ఆమె ఉన్నారు. వాళ్లు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతి పోరాటంలో ఆమె ఉన్నది. ఎంతో మెత్తటి స్వభావం. ఎంతో కలివిడి స్వభావం. పద్మ తల్లి చనిపోయిందని తెలిసి పద్మ స్నేహితులు హైదరాబాద్‌లో అన్ని మూలల నుంచి వచ్చి అక్కడ ఆమె గది ముందు వాలారు. కొందరు చూసుకోగలిగారు. కొందరు చూసుకోలేకపోయారు. వాళ్లందరిలో ఆమె పద్మను చూసుకుంటున్నది. ఆ విషయం వాళ్లకు తెలుసు. అంతకన్నా వాళ్లు పద్మను తీసుకువచ్చి ఆమెకు చూపలేరు. వాళ్లలో పట్టణాలు, ఊళ్లు, రాష్ట్రాలు దాటి, వాగులు, వంకలు దాటి, అన్నిటికంటే మించి పారా మిలిటరీ క్యాంపులు దాటి జైలులో పద్మను చూసివచ్చి తమ కళ్లల్లో పద్మను చూపిన వాళ్లు ఉన్నారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడో ఐదారేళ్ల కింద తాను వెళ్లి వచ్చి చూసిన ఆమె కళ్లల్లో తన సహచరిని చూసుకున్న వాళ్లు ఉన్నారు.

రెండు రోజుల క్రితమే ఏప్రిల్‌ 27న పద్మ తల్లి ఫోన్‌ చేసింది. ʹʹపద్మను ఈరోజు కోర్టుకు తీసుకు వచ్చారట. ఆమె లాయర్‌ ఫోన్‌ చేసి పద్మ విడుదలవుతుంది, ఎవరినైనా పంపించి తీసుకువెళ్లండిʹʹ అని. తన చిన్న కూతురు, మనమడు వెళ్తారని, ఎక్కడైనా తల తాకట్టు పెట్టయినా కారు ఏర్పాటు చేస్తానని, వెంట ఎవరైనా లాయరు వెళ్తారా అని అడిగింది. మాకు ఆశ్చర్యం అయింది.

మాకు ఎవరికీ తెలియని సమాచారం. ఇంకా రెండు కేసులున్నాయి. ఒక కేసులో వాదనలు ముగిసి మే 15న తీర్పు ఉంది. మరో కేసు ట్రయల్‌కు ఎంత సమయం పడుతుందో తెలియదు. కాకపోతే కొన్నాళ్లుగా జడ్జ్‌ బంధువులు వచ్చి బెయిల్‌ పెట్టి, జమానత్‌ పెట్టి బంధువులే తీసుకుపోతే బెయిల్‌ ఇస్తానని అంటున్నాడట. కొన్నేళ్ల క్రితం తల్లి తప్ప బంధువులు ఎవరూ ఆమెను చూడ్డానికి రాలేదని అతనికి తెలుసు. ఇటీవల కాలంలోనైతే ఆమె లాయర్లు కూడా ఆమెను చాలా అరుదుగా కలుస్తున్నారు.

అయితే ఇది కేవలం ఆమె కోరిక. హలూసినేషన్స్‌ అంటారే అటువంటిది. పైగా వారం రోజులుగా నలతగా ఉంటున్నదని అంటున్నారు కదా, అటువంటి పైత్య స్థితిలో ఒక పలవరింత, ఒక కలవరింత. పద్మ రాదు, రాలేదు. ఆ తల్లి ఇంక ఎదురు చూడలేక వెళ్లిపోయింది.

ఇది ఒక్క పద్మ విషయం కాదు. ఇది ఒక్క పద్మ తల్లి విషయం కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో వేల, లక్షల సంఖ్యలో ఉన్న రాజకీయ ఖైదీల స్థితి. ముఖ్యంగా మహిళా ఖైదీల, ఆదివాసి ఖైదీల స్థితి. మాకు తెలిసిన పద్మలో, ఆమె తల్లిలో వీళ్లందరి గురించి ఊహించుకోవలసిందే తప్ప ఇది ఒక ప్రత్యేకమైన సమస్య కాదు.

ఈ పదేళ్లలో పద్మ రెండుసార్లు విడుదలైంది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌ నగరంలో విడుదలై తీసుకువెళ్లడానికి వచ్చిన న్యాయవాది అసహాయంగా చూస్తూండగానే మళ్లీ పోలీసుల కిడ్నాప్‌కు గురైంది.

ఆ తరువాత మరో హైసెక్యూరిటీ జైలు జగదల్‌పూర్‌కు పంపబడింది. అక్కడ సుదీర్ఘ కాలపు విచారణ తరువాత కేసులన్నీ కొట్టేసి విడుదలవుతాననుకున్న రోజు. తెలంగాణ నుంచి ఇద్దరు న్యాయవాదులు వెళ్లారు. అక్కడ న్యాయవాదులు ఉన్నారు. కోర్టులో కేసు కొట్టేసి, విడుదల ఉత్తర్వులు ఇచ్చి అందుకోసం జైలుకు తిరిగి తీసుకువెళ్లే సమయానికి మరో రెండు కొత్త కేసుల్లో రెండు వారెంట్లు. ఆమె లోపలికి. కోర్టులో నోరు నొచ్చేలా వాదించిన న్యాయవాదులు అసహాయంగా బయటికి. ఈ తంతు నడుస్తూనే ఉంది. ఇది ఒక్క పద్మ విషయంలోనే కాదు. ఇది గోపన్నగా పిలుచుకునే నల్గొండకు చెందిన సత్తిరెడ్డి విషయంలోనూ జరిగింది.

ఈ ఇద్దరికన్నా దారుణమైంది నల్లా భిక్షపతి నిర్బంధం. ఈయన పదేళ్లుగా జార్ఖండ్‌లోని చైబాసా జైలులో మగ్గుతున్నాడు. ఎన్నో కేసులు. ఆయన, ఆయన సహచరి లక్ష్మి జార్ఖండ్‌లోనే ఎంతో కాలంగా విప్లవోద్యమంలో పనిచేస్తున్నారు. ఆమె ప్రసవానికి ఆస్పత్రిలో చేరినప్పుడు భిక్షపతి చూడడానికి వెళ్లి అరెస్టయ్యాడు. ఆమెనూ అరెస్టు చేశారు. కొన్నాళ్ల తరువాత ఆమెను విడుదల చేశారు. ఇంక జార్ఖండ్‌లో ఉంటే బతకడమే కష్టమని హైదరాబాద్‌ వచ్చి ఆమె కష్టం చేసుకొని బతుకుతున్నది. భర్తను చూడడానికి వెళ్లినా అరెస్టు చేస్తారని ఒకటి రెండు ప్రయత్నాల్లో అర్థమైపోయింది. అక్కడ ఒక్కొక్క కేసే కొట్టేయబడుతున్నది, విడుదలవుతున్నాడు. మళ్లీ అరెస్టవుతున్నాడు. అరెస్టయ్యాక చేసిన అన్ని నేరారోపణలు అబద్ధం అని రుజువయ్యాయి.

ఇంక అరెస్టు కేసు ఒక్కటే మిగిలింది. ఆస్పత్రిలో ప్రసవించిన భార్యను చూడడానికి వెళ్లాడని, ఆస్పత్రి వాళ్లు చెపుతారు కదా, కనుక అరెస్టు సందర్భంగా ఒక దాడి చేసో, ఒక హత్య చేసో, ఒక ఆయుధం తోటో దొరకలేదు కనుక విడుదలవుతాడని అందరూ ఆశించారు. అది జరగలేదు. ఏప్రిల్‌ 28న హజారీబాగ్‌ సెషన్స్‌ కోర్టు ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది. నలభై ఐదేళ్ల వయసు. జి.ఎన్‌. సాయిబాబా కన్నా బహుశా ఐదేళ్లు చిన్న. హేమ్‌ మిశ్రా వంటి యువ విద్యార్థి, భిక్షపతి వంటి వాళ్లు జీవితమంతా జైళ్లలోనే గడపాలి. నల్లా భిక్షపతి తెలంగాణ వరంగల్‌ జిల్లా తాటికాయల గ్రామం నుంచి చాలా చిన్న వయసులోనే విప్లవోద్యమంలోకి వచ్చిన మాదిగ యువకుడు. చిన్నతనంలోనే ఈ కుటుంబం వచ్చి అల్వాల్‌లో కష్టం చేసుకొని బతుకుతున్నారు. ఆ కుటుంబం నుంచే విద్యావంతులైన వాళ్లలో భిక్షపతి విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు. సోదరుడు నల్లా రాధాకృష్ణ దళిత ఉద్యమంలో పనిచేస్తున్నాడు.

ఇవి మనకు తెలిసిన పేర్లు. ఈ తెలిసిన చీకటిలోని మసక వెలుగు నుంచి తెలియని గాఢాంధకారాన్ని పోల్చుకోవాలి. పోల్చుకొని ఏం ప్రయోజనం? ఆ చీకట్లను తొలగించగలగాలి. చీకట్లు తొలుగుతాయి. కాని ఇది ప్రకృతి నియమ సూత్రాల వలె ఒక నిర్దిష్ట కాలంలో వాటంతట అవి జరిగేవి కావు. మనం ఎన్నో చేతులు వేసి ఆ చీకట్లను పారదోలాలి.

ఇంతకూ ఈ పద్మ ఎవరు? నక్సల్బరీ రైతాంగ పోరాటం ప్రారంభమైన కాలం నుంచి పద్మ అనే పేరు వింటూనే ఉన్నాం. అది ఇవాళ ఒక సర్వనామం అయిపోయింది. ఆ పేరుతోటే విప్లవోద్యమంలోకి వెళ్లి అజ్ఞాతంలో వేరే పేర్లు పెట్టుకున్న వాళ్లున్నారు. విప్లవోద్యమంలోకి 80ల ఆరంభంలో వచ్చి లింగమూర్తితో పాటు రాయలసీమ ప్రాంతంలో విప్లవోద్యమ నిర్మాణం చేసిన పద్మ పేరు ఆమె అమరత్వం తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఎందరో మహిళలు పెట్టుకున్నారు. కనుక మనకు తల్లిదండ్రులు పేరు ఇచ్చిన పద్మలు, విప్లవం కన్నతల్లి ఇచ్చిన పద్మలు ఉన్నారు.

ఈ పద్మ తల్లి పెట్టిన పేరు. ఆమె ఎక్కువ కాలం బహిరంగ ప్రజా ఉద్యమాల్లోనే పనిచేసింది. హైదరాబాద్‌లో బస్తీల్లో గాని, విద్యార్థుల్లో గాని, హాస్టల్స్‌లో గాని ఆమె మహిళల్లో పనిచేసిన మేర తలలో నాలుకగా పనిచేసింది. తన మెత్తటి నవ్వుతో మృదువైన మాటలతో ఎందరి స్నేహాలనో పొందింది. ఎందరికో సేవలు చేసింది.

చంద్రబాబు నాయుడు 1995 ఆగస్ట్‌లో అధికారానికి వచ్చి సబ్సిడీలు రద్దు చేసినప్పుడు, సారా నిషేధం ఎత్తివేసినప్పుడు అన్ని ప్రజాసంఘాలకు నాయకత్వం వహించి పోరాడింది చైతన్య మహిళా సంఘమే. 2000లో వరదలు వచ్చినప్పుడు బస్తీల్లో ప్రజలకు సహకరించింది చైతన్య మహిళా సంఘమే. 1994 డిసెంబర్‌ నుంచి 1995 మార్చ్‌ వరకు జైలులో ఉన్న నక్సలైటు ఖైదీల, జీవిత ఖైదీల విడుదల కోసం చేసిన పోరాటానికి బయట వెల్లువెత్తిన సంఘీభావంలో చైతన్య మహిళా కెరటం కూడా ఉన్నది.

1999 సెప్టెంబర్‌లో ఈ జైలు పోరాటానికి నాయకత్వం వహించిన రాజకీయ ఖైదీ మోడెం బాలకృష్ణ విడుదలయ్యాడు. బహుశా 2000లో పద్మ బాలకృష్ణ సాహచర్యాన్ని ఎంచుకోవడమే ఆమె చేసిన పెద్ద నేరం అయింది. ఆ సహచర్యంలో ఆమె కొద్ది రోజులైనా గడిపిందో తెలియదు. అప్పటికామె విశాఖపట్నంలో మహిళా ఉద్యమంలో పనిచేస్తున్నది.

పదేళ్ల క్రితం భిలాయిలో ఒక సహచరితో పాటు ఆమె ఒక ఇంటి నుంచి బయటికి వెళ్లింది. తనను ఎందుకో విశాఖపట్నం నుంచే ఎపిఎస్‌ఐబి వాళ్లు వెంటాడుతున్నట్టు ఆమెకు అనుమానంగా ఉన్నది. ఆ ఉదయం మరింత స్పష్టమైంది. వెనుక తరుముతున్నట్లుగా వాళ్లు వస్తున్నారు. నయం, ఇంకా అప్పటికి పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌లు ఉన్నాయి. ఆమె బూత్‌లోకి దూరింది. ఆమె ప్రెసెన్స్‌ ఆఫ్‌ మైండ్‌ పనిచేసింది. ఆ బూత్‌ అద్దాల తలుపులు వేసుకొని అక్కడ నుంచే పియుసిఎల్‌ ఉపాధ్యక్షుడు రాజు సాయెల్‌కు, మీడియాకు ఫోన్‌లు చేసింది. అక్కడ్నించే తనకు తెలిసిన నంబర్లందరికీ, ఆంధ్రప్రదేశ్‌లో హక్కుల సంఘాల నాయకులకూ ఫోన్‌లు చేస్తూ ఉన్నది. కొన్ని మీడియా ఛానెల్స్‌ చేరుకునే దాకా ఆమె ఆ బూత్‌ నుంచి బయటికి రాలేదు. అట్లా ఆమె తన ప్రాణాలు కాపాడుకున్నది. పోలీసులకు ఆ కక్ష ఉన్నది.

ఇంతకూ ఈ పద్మ పదేళ్లుగా ఎదుర్కుంటున్న కేసులు తన మీదివి కావు. ఆమె రాయ్‌పూర్‌ జైలు నుంచి విడుదలైనప్పుడు మిగిలిన కేసులు చూసినప్పుడు అర్థమైంది ఏమిటంటే ఈమె మొదటి అరెస్టు కన్నా ఎంతో ముందే ఆదిలాబాద్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో అమరురాలైన ఒక పద్మ మీద నమోదయి ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను ఈ పద్మ మీద చూపుతున్నారు. వయస్సు, తల్లిదండ్రుల పేర్లు ఏవీ కుదరవు. కాని అడిగేవాళ్లు ఎవరు?

ఛత్తీస్‌ఘడ్‌లో ప్రాసిక్యూషన్‌ ఏది చెపితే అదే కోర్టు కూడా వింటుంది అనడానికి ఏడుగురు తెలంగాణ ప్రజాస్వామిక నాయకత్వం అరెస్టు, ఉన్నత న్యాయస్థానం దాకా బెయిల్‌ నిరాకరణ, మెజిస్ట్రేట్‌ హడావుడిగా ప్రారంభిస్తున్న నేరవిచారణతో మనకెంతో సన్నిహితంగా అర్థమవుతూనే ఉంది కదా.

మధ్యతరగతి నుంచో, దిగువ మధ్యతరగతి నుంచో కొంత చదువు, కొంత జీవించగలిగే స్థితి, సమాజంలో నలుగురిలో గుర్తింపు, ఒక చిరునామా ఉన్న ఇటువంటి వాళ్ల విషయంలోనే ఇవాళ రాజ్యం ఇంత అమానుషంగా ప్రవరిస్తున్నదంటే ఆదివాసులు, ముస్లింలు, దళితులు, మహిళలు, భూమిహీనులు, ఏ ఆస్తులు లేనివాళ్లు, రెక్కల కష్టం మాత్రమే మిగిలిన వాళ్లు, ఎందరో అభాగ్యులు ఈ దేశంలో ఎన్ని ఎన్‌కౌంటర్‌లకు గురవుతున్నారో? ఎన్ని అసహజ మరణాలకు గురవుతున్నారో? వేల లక్షల సంఖ్యలో జైళ్లలో ఎన్నాళ్లుగా మగ్గుతున్నారో? మన చుట్టూ ఉండే అనుభవాలే మనకు కొంత ఎరుకనైనా కలిగించడం లేదా?

రాస్తున్నంత సేపూ నా భయ సందేహాలు ఏమిటంటే చైతన్య మహిళా సంఘం పది మంది నాయకత్వాన్ని మావోయిస్టులని రుజువు చేయడానికి పోస్టర్లు వేసినట్లుగా ఇప్పుడు వాటికి పద్మ ఫొటో కూడా జోడిస్తారేమోనని!

అంతకన్నా తన కష్టాల నుంచి, నిరీక్షణ నుంచి విముక్తమైన ఆ తల్లి గురించి కాదు, థైరాయిడ్‌తో, అనారోగ్యంతో జైలే చిరునామాగా మారిన పద్మ గురించీ కాదు. ఆ తల్లి వదిలి వెళ్లిన ఆ మానసికంగా ఎదగని మధ్యవయస్కురాలైన కూతురు శేషజీవితానికి ఆలనా, పాలనా ఏమిటి?

తన చైతన్యంతో పద్మ ఒక జీవితాన్ని ఎంచుకున్నది. న్యాయమో అన్యాయమో ఈ దోపిడీ వ్యవస్థ వేసే సవాళ్లను, శిక్షలను ఆమె స్వీకరించాలి. స్వీకరిస్తుంది. ఆమె రాజకీయాలను, ఆమె విశ్వాసాలను ప్రేమించే వాళ్లు, గౌరవించే వాళ్లు ఆమెకు అండగా ఉన్నారు. ఉంటారని ఆశిద్దాం.

మరి ఆ తల్లి మరణానికి, ఆ అక్క జీవితానికి ఈ సమాజం బాధ్యత పడవద్దా?!

ఇంతకూ ఆ తల్లి పేరేమిటి?

నాకు తెలుసు, మనకు తెలుసు కనుక నేను పద్మ పేరు రాసాను కాని, జగదల్‌పూర్‌ జైలులో ఆమెను మావోయిస్టు ఖైదీ నెంబర్‌ పలానా అని చెపితే తప్ప జైలు అధికారులకు తెలియదు. వాళ్లు పిలువరు.

1084 మృతదేహం తల్లి పేరేమిటి?!

No. of visitors : 1517
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •