నక్సల్బరీ నీకు లాల్‌సలాం

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

నక్సల్బరీ నీకు లాల్‌సలాం

- పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

మహాశ్వేతాదేవి నవల ఒక తల్లి కథ ఆధారంగా తీసిన ʹహజార్‌ సౌరాసీ కీ మాʹ సినిమాలోని ఓ సన్నివేశం హృదయాన్ని ద్రవింపజేస్తుంది. మార్చురీలో దుర్గంధం భరించలేక ఆ తల్లి ముక్కు మూసుకుంటుంది. అప్పుడు ఆ తల్లి కళ్లలో గూడుకట్టుకున్న దు:ఖం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఆ తల్లికి తన కొడుకు చనిపోయాడని తెలిసి అక్కడికి వచ్చాక అతడ్ని గుర్తించడానికి అతని బొటనవేలుకి కట్టిన 1084 అనే నంబర్‌ కనిపిస్తుంది. ఆ తర్వాత ముఖం చూడాలని ప్రయత్నిస్తుంది. ఛిద్రమైన అతడి ముఖంపై బట్ట తొలగించగానే ఆమె నవ నాడులూ కుంగిపోయినట్లు అచేతనంగా కూలబడుతుంది. అలా ఆమె ఒక వేయి ఎనభై నాలుగోవాడి తల్లిగా గుర్తింపబడుతుంది.

ఆ దృశ్యం మనకు ఊపిరి సలపనీయదు. ఈ హృదయ విదారక సన్నివేశం నక్సల్బరీ కాలం నాటిది. ఇది ఈనాటికీ కొనసాగుతూనే ఉన్నది. మహోన్నత ఆశయాల కోసం విప్లవకారులు ఎందరో తన రక్తమాంసాలను అర్పిస్తూనే ఉన్నారు.

ఆ తల్లి తన కొడుకు శవాన్ని తీసికెళ్తానని పోలీసుల్ని అడుగుతుంది. కానీ పోలీసులు ఇవ్వమంటారు. అప్పుడామె అతను నా కొడుకు అని అంటుంది. దానికి వాళ్లు అతను నక్సలైట్‌ అంటారు. ఆమె తన మాటలో బిడ్డ మీది మమకారాన్నే కాదు హక్కును చాటుకుంటుంది. అయినా ఇవ్వరు. అక్కడున్న మిగతా నాలుగు శవాలతోపాటు ఆమె బిడ్డ శవాన్ని కూడా వాళ్లే తగలబెడతారు. అయితే ఒక శవానికి సంబంధించిన పేద కుటుంబం మాత్రమే అక్కడ కనిపిస్తుంది. అంటే మిగతా కుటుంబాలకు పోలీసులు కనీసం సమాచారం కూడా ఇచ్చినట్లు లేరు.

ఇది ఆనాటి యదార్థ గాథ. అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర ప్రభుత్వం చంపేసినా ఏ ఒక్కరి అంతిమ సంస్కారాలు కూడా ప్రభుత్వం కనీస సంస్కారవంతంగా నిర్వహించలేదు.

మాయం కాబడిన వాళ్లు మాయంకాగా, పెట్రోలు పోసి సగం కాల్చిన శవాల మిగిలిన శరీర భాగాలను జంతువులు రక్త సంబంధీకుల ముందే లాక్కువెళ్తోంటే చూసి కూడా ఆనాడు ప్రభుత్వాలను నిర్బంధం వల్ల ప్రశ్నించలేకపోయారు. తమ కళ్ల ముందే పిల్లల మృతదేహాల్ని కాల్చేస్తోంటే తమకు ఏమీ సంబంధం లేని వాళ్లుగా ఏడుస్తూ నిలబడిపోయారు. ఇదొక నిస్సహాయస్థితి. దీన్ని ఈ సినిమాలోని తల్లి దగ్గరి నుంచి దశాబ్దాల తరబడి విప్లవకారుల కుటుంబాలు అనుభవించాయి.

తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కమ్యూనిస్టులను పోలీసులు కాల్చేసినట్లు వార్తలు చూడ్డం, వినడమేగాని శవాలను తెచ్చుకోలేదని, అలాంటి ఆలోచన వచ్చే పరిస్థితే లేదని చలసాని ప్రసాద్‌ అన్నాడు. ఆయన కుటుంబంలో ముగ్గురు ఆ పోరాటంలో అమరులయ్యారు. శ్రీకాకుళ పోరాటంలో కూడా అమరుల భౌతిక కాయాలను రక్త సంబంధీకులు తెచ్చుకోలేకపోయారని చెప్పేవాడు. సత్యం, కైలాసాల మృతదేహాలను మాత్రం పోలీసు స్టేషన్‌ దగ్గరికి తీసుకొస్తే కొందరు వెళ్లి చూశారు. ఆ శవాలను కుటుంబసభ్యులు తెచ్చుకున్నారు. కోరన్న, మంగన్నల శవాలకు గ్రామస్థులే అంత్యక్రియలు జరిపారు. మొదటి రోజుల్లో అయినా ఇలాంటి సంఘటనలు చాలా అరుదైనవి. ఆ తర్వాత నాయకులైనా, కార్యకర్తలయినా మృతదేహాలను ఇవ్వలేదు.

నక్సల్బరీ ఉద్యమం విస్తరించే క్రమంలో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు ముందుకు వచ్చాయి. నిర్బంధం ఎంత ఉన్నా ఈ స్థితిలో మార్పు వచ్చింది. మొదటి సారిగా ... మృతదేహాన్ని ప్రజా సంఘాల్లోని కొందరు నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. అలా శవాలను కుటుంబ సభ్యులు తెచ్చుకొనే దారిపడింది. అయితే తీవ్రమైన చిత్రహింసలకు గుర్తుగా కుళ్లిపోయిన ఆ శవాల పక్కటెముకల్లో స్కూృడ్రైవర్లు, బ్లేడ్లు, కత్తులు, మర్మాంగాల నుంచి కర్రలు తీస్తున్నప్పుడు ఆ తల్లులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించేవారు. వాటిని తీసేసి అంతిమ సంస్కారాలు జరుపుకున్నారు. నింగినంటిన ఆ తల్లుల దు:ఖం ఈ దేశ విప్లవ చరిత్రలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ దు:ఖాన్ని, వేదనని అర్థం చేసుకున్న వ్యక్తులు కొద్దిమందే. వాళ్లే శవాల స్వాధీన కమిటీ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. క్రమంగా ఈ పోరాటం బలపడింది.

నక్సల్బరీ చరిత్ర కొనసాగింపులో ఎన్నో పోరాటాలు వచ్చాయి. అంతకు ముందు ఎవ్వరూ, ఎన్నడూ ఊహించని అతి మానవీయమైన డిమాండ్‌గా అమరుల శవాల కోసం సాగిన పోరాటం ఇది. ఉద్యమకారులను కుట్ర పూరితంగా హత్య చేయడమేగాకుండా శవాలపై కూడా కక్షగట్టిన రాజ్యం ఈ పోరాటాన్ని ముందుకు సాగనివ్వదల్చుకోలేదు. తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించింది. శవాల స్వాధీనానికి కుటుంబసభ్యులతోపాటు నిలబడ్డ వాళ్లపై కేసులు, భౌతికదాడులకు పాల్పడి కదలనీయకుండా రాజ్యం అడ్డుకోవడం మొదలు పెట్టింది.

ఈ రాజ్య స్వభావాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో ఇక తమ రక్తసంబంధీకుల శవాలను తామే స్వాధీనం చేసుకోక తప్పని పరిస్థితిని రాజ్యం కల్పిస్తోందని గ్రహించారు. అన్ని దారులను రాజ్యం మూసేసినా తమ వాళ్ల భౌతిక కాయాల్ని తెచ్చుకోవాలనే బలీయమైన కోరిక వాళ్లను సంఘటిత పరిచింది. బిడ్డల్ని, భర్తల్ని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను కోల్పోయిన దు:ఖంలోనే వాళ్లు ధైర్యం చేసి ʹమా వాళ్ల శవాలు మాకివ్వండిʹ అనే నినాదంతో వీధుల్లోకి రావాల్సి వచ్చింది. బిడ్డల రక్తం తడి ఆరని చేతులనే తమలాంటి మరో కుటుంబానికి ఆసరా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తమ భర్తలను చంపి తమ జీవితాల్ని అగాధంలో తోసేసిన ఈ ప్రభుత్వంపై కసితో విప్లవకారుల భార్యలు తమ దు:ఖాన్నే ధిక్కారస్వరంగా మార్చుకున్నారు. ఈ హత్యలకు జవాబు చెప్పాలని, హంతకులపై కేసు నమోదు చేసి న్యాయ విచారణ జరిపించానే చట్టబద్ధ పోరాటాన్ని చేపట్టారు. ఒక వైపు సమాజంలోని మేధావులను ఆలోచింపజేసేదిగా, మరో వైపు ప్రభుత్వాన్ని ఇరకాటాన పడేసేలా ఈ పోరాటం మారింది. అలాంటి చారిత్రక పాత్ర నిర్వర్తించే శక్తిగా అమరుల కుటుంబ సభ్యులు ఎదిగారు. తమ పిల్లలు పుట్టి పెరిగి, ఆడిపాడిన గ్రామ సరిహద్దుల్లోనే వాళ్ల భౌతికకాయాల్ని పూడ్చుకోవాలనే బలమైన తల్లిదండ్రుల ఆశ ఈ పోరాటానికి ఊపిరి పోసింది.

అలాగే తమ కండ్ల ముందే పోరాటంలో నేలరాలిన సహచరుల భౌతిక కాయాలు ఆ కుటుంబాలకు చేరాలనుకున్న విప్లవకారులు తమ మిత్రులతో, మేధావులతో పంచుకున్న ఆలోచనల నుంచి అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భవించింది.

ఇది రాజ్యహింసా బాధితుల సంఘం. ఇది ఉద్యమంలో అమరులైన పిల్లల జ్ఞాపకాలను పదిలపరచుకోడానికి తల్లిదండ్రులు కొనసాగిస్తున్న జీవన్మరణ పోరాటం. ఇందులో తమ పిల్లల ఆశయాలు గొప్పవని, వారు పది మంది కోసం ప్రాణాలు అర్పించారని విశ్వసించిన తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, రక్త సంబంధీకులు చేయి చేయి కలిపారు.

నక్సల్బరీలో చనిపోయిన ఆ ఏడుగురు మహిళలు, ఇద్దరు పిల్లల పేర్లు మాత్రమే మనకు తెలుసు. వీరిలో ఒక మహిళ తన బిడ్డను వీపుకు కట్టుకొని ఉండటంతో బిడ్డతో సహా పోలీసు తూటా తగిలి అమరురాలైంది. ఝాన్సీ లక్ష్మీబాయిలాంటి వాళ్ల గురించి ఎంతో ప్రచారం జరిగింది. నక్సల్బరీలో పిల్లలతోపాటు అమరులైన మహిళలు చరిత్రలో మరుగునపడిపోయారు. వాళ్ల భౌతికకాయాలు ఏమయ్యాయో వాళ్ల అంత్యక్రియలు ఎలా జరిగాయో కూడా మనకు తెలియదు. ఒక తల్లి కథ అంతా తన కొడుకు ఏం చేశాడో, ఏ ఆశయం కోసం చనిపోయాడో, ఆ పోరాటం ఎందుకు కొనసాగుతున్నదో ఆమె తెలుసుకునే ప్రయత్నమే. కొడుకు గురించి ఇతరులు గొప్పగా చెబుతున్నప్పుడు లేదా తన గురించి కొడుకు వాళ్ల దగ్గర చాటుకున్న మమకారం చెబుతున్నప్పుడు ఆమె కళ్లలో కనిపించే మెరుపులో, ఆమె ముఖంలో కనిపించిన చిరునవ్వులో ఏదో గర్వం తొణికిలాడుతుంది.

అలాగే ఈ రోజు అమరుల కుటుంబసభ్యులు తమ వాళ్లు ఈ ఉద్యమంలోకి ఎందుకు వెళ్లారు? వాళ్ల లక్ష్యం ఏమిటి? ఆందులో వాళ్లు ఏమేం చేశారు? తమ నుంచి వెళ్లిపోయాక వాళ్లు ఎక్కడ బతికారు? ఎలాంటి జీవితాన్ని గడిపారు? .. అనేవి తెలుసుకోవాలనుకుంటున్నారు. తమను వదిలేసి వెళ్లినా కూడా తమపట్ల మమకారాన్ని కలిగి ఉండేవారని, చూడలేకపోతున్నందుకు బాధపడుతుండేవారని తెలుసుకొని తమను నిర్లక్ష్యం చేశారనే వెలితి నుంచి బయటపడుతున్నారు. వాళ్ల గురించి తమ ముందు తరాలకు చెప్పాలనుకుంటున్నారు. అది జనమెరిగిన చరిత్రగా నిలిచిపోవాలనుకుంటున్నారు. నక్సల్బరీ కాలంలో మహాశ్వేత ఒక తల్లి అలా చేసిందని కథగా రాసింది. ఇవాళ వేలాది మంది తల్లులు, రక్త సంబంధీకుల యదార్థ గాథ ఇది. నక్సల్బరీ ఈ యాభై ఏళ్లలో ఎన్నో రకాలుగా విస్తరించింది. అందులో ఇదొక పోరాట రూపం. విప్లవకారులు తాము బతికి ఉన్నప్పుడు తమ రాజకీయాల వల్ల, ఆచరణ వల్ల ఎంత మందిపై ప్రభావం వేయగలరో, నూతన సమాజ నిర్మాణానికి తమకై, తాము లిఖించుకున్న మరణశాసనం లాంటి మృత్యువు వల్ల అంతకు ఎన్నో రెట్ల అజేయ శక్తిగా మారి ప్రజలల్లోకి తిరిగి వస్తారు. అంతిమంగా ప్రాణ త్యాగంతో తమను వేలెత్తి చూపలేని మహోన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అందుకే అంతులేని ఆయుధశక్తి ఉన్న ఈ ప్రభుత్వాలు వాళ్ల ముందు మరుగుజ్జులా మారిపోతాయి. వాళ్ల శవాలను చూసి భయపడతాయి. ఆ ప్రభావం ఎంత గొప్పదంటే ఉద్యమంలోనికి వెళుతున్నప్పుడు వద్దని అడ్డుకున్న తల్లిదండ్రులే ఈ రోజు ఒక ఉద్యమ శక్తిగా మారారు. ఇది సామాజిక ప్రయోజనం కోసం చేసిన ప్రాణత్యాగం వల్ల మాత్రమే సాధ్యమైంది.

మిస్సింగ్‌ నవలలో మహిళలు నదిలో కొట్టుకవస్తున్న శవాలు తమ కుటుంబ సభ్యులవి అయినా కాకపోయినా తమవే అంటూ తీసుకవెళ్లేవాళ్లని చదువుతాం. ఒళ్లు జలదరింపజేసే రాజ్యహింస ఒక వైపు, దయనీయ స్థితిలో పేద మహిళలు ఎంత నిస్సహాయ స్థితిలో అయినా రాజ్యానికి గేలిచేస్తూ నిలబడ్డ తీరు మరో వైపు మనకు కనిపిస్తుంది. అలాగే చత్తీస్‌ఘడ్‌లోని శబరి నదిలో సాల్వాజుడుం, గ్రీన్‌హంట్‌ దురాగతాల వల్ల ఎన్ని వందల శవాలు కొట్టుకపోయాయో. కొన్ని శవాల ఆనవాళ్లే లేకుండాపోయాయి. ఇలాంటి సందర్భాల్లో మనుషులు ఉన్నారా? లేరా? లేకుంటే ఎక్కడ ఖననం అయ్యారనే ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. ఈ యాతన ఆ కుటుంబాలకు జీవితాంతం ఉండిపోతుంది. కేవలం ఈ యాతన నుంచే కశ్మీర్‌లాంటి ప్రాంతాల్లో ʹఅదృశ్యమైన వాళ్ల తల్లిదండ్రుల కమిటీʹ ఏర్పడింది. వాళ్లు ఇప్పటికీ తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పాలని, చంపేస్తే ఎక్కడ పూడ్చారో స్థలాన్నయినా చూపాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఇతర జాతి విముక్తి ఉద్యమాల్లో పోరాటకారుల కుటుంబసభ్యులు సైన్యం మధ్యనే ఇలాంటి పోరాటాలనే కొనసాగించడం దశాబ్దాల నుంచి చూస్తున్నాం. ఇది కేవలం వ్యక్తుల వ్యూహాత్మక పోరాటానికి చిహ్నం కాదు. ఆయా కాలాల్లో ఉన్న తీవ్ర నిర్బంధం, అణచివేతల నుంచి వస్తున్న ధిక్కార పోరాటం మాత్రమే. న్యాయం కోసం సగటు తల్లిదండ్రులు రాజ్యంతో తలపడుతున్నారు.

ఇంత న్యాయమూ, మానవీయమూ అయిన ఈ పోరాటంపై ఉద్యమకారుల మీద ప్రయోగించిన హింసనే రాజ్యం అమలు చేస్తున్నది. నక్సల్బరీ ఉద్యమం తీవ్ర నిర్బంధం అనుభవించే క్రమంలోనే వేలాది అమరత్వాలు, వాటి నుంచే అమరుల రక్త సంబంధీకుల పోరాటాలు ముందుకు వచ్చాయి.

అయితే మహాశ్వేత దేవి నవలలోని తల్లి సంపన్న తరగతికి చెందిన స్త్రీ. అలాంటి కుటుంబాల్లో స్త్రీల పట్ల ఉండే బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం నుంచి ఒంటరితనం అనుభవిస్తున్న ఆ తల్లికి ఆ కొడుకు విప్లవ రాజకీయాల వల్లే దగ్గరయ్యాడు. ఆమెకు అత్యంత ప్రియమైనవాడయ్యాడు. తన హృదయాన్ని తెరిచి మాట్లాడుకునే స్నేహితుడయ్యాడు. అందుకే కొడుకు రాజకీయాలేమిటో తెలుసుకోవాలని ఆ తల్లి అన్వేషిస్తుంది. ఆమె చదువుకున్న ఉన్నత వర్గ స్త్రీ. అయితే నక్సల్బరీ ఉద్యమం విస్తరించే క్రమంలో అట్టడుగు కులాలు, తెగలు, పేద వర్గాల నుంచి విప్లవోద్యమంలోకి వెళ్తున్నారు. వాళ్ల తల్లిదండ్రులు, సహచరులు ప్రధానంగా నిరక్షరాస్యులు, లోకం తెలియని వాళ్లు. ఉద్యమకారుల వల్ల మాత్రమే గుర్తింపు పొందినవాళ్లు. వీళ్ల నైతిక, రాజకీయ బలం ఉద్యమకారుల రక్త సంబంధమే. అమరుల నిబద్ధత, త్యాగాలను ఎత్తిపట్టడమే. నక్సల్బరీ ఉద్యమానికి మొదట్లో రాజకీయ అవగాహన ఉన్న వాళ్ల మద్దతు మాత్రమే ఉండేది. ఉద్యమం విస్తరించే క్రమంలో అమరుల తల్లిదండ్రులు, స్నేహితులు తమ వ్యక్తిగత సంబంధం నుంచి కూడా ఉద్యమానికి అభిమానులయ్యారు. అమరుల కుటుంబ సభ్యులు, స్నేహితులు కావడం వల్ల సమాజంలోని అనేక మందికి స్ఫూర్తి అందించే ఉద్యమాభిమానులయ్యారు. అమరుల రక్త తర్పణం నుంచి చిగురించిన పోరాటంగా ఈ రోజు సమాజంలో ఇది గుర్తింపు పొందింది. అజేయమైన యాభై ఏళ్ల నక్సల్బరీ ఉద్యమానికి ఈ పోరాటం జేజేలు పలుకుతోంది. అమరులకు వినమ్రంగా జోహార్లు చెబుతోంది.

No. of visitors : 2321
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 24.11.2016 09:43:08pm

లాసాల్‌ ‌చెప్పేదాని ప్రకారం, కార్మిక సంఘాలు ఉత్పత్తి నిర్వహణను క్రమంగా తమ చేతుల్లోకి తీసుకుంటాయి. సార్వజనిక ఓటు హక్కును ప్రవేశపెట్టిన ఫలితంగా రాజ్యం ʹʹ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •