ʹʹత‌ర‌మెల్లిపోతున్న‌దో...ʹʹ - అమరుడు నారాయణ్‌ సన్యాల్‌ స్మృతిలో

| సంభాషణ

ʹʹత‌ర‌మెల్లిపోతున్న‌దో...ʹʹ - అమరుడు నారాయణ్‌ సన్యాల్‌ స్మృతిలో

- వరవరరావు | 06.05.2017 10:11:05pm

వెటరన్‌ కామ్రేడ్స్‌ను తెలుగులో ఏమందాం? కాకలుతీరిన యోధులు అందామా? వైవిధ్యం గల, అపారమైన పోరాట అనుభవం కలిగిన ప్రజాసేవకులు అందామా? వసంత మేఘం అనిపించుకున్న నక్సల్బరీకే యాభై ఏళ్లు వస్తే, దాని నిర్మాతల వయసు కనీసం అరవై ఎనిమిది - డెభ్బై ఏళ్లు ఉంటాయి. నక్సల్బరీ క్షేత్రస్థాయి పోరాటం జరిగిన మూడు రోజులు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవాళ్లయినా, దానికి చోదకులు, నాయకత్వం వహించిన వాళ్లయినా, అప్పటికప్పుడే అమరులైన స్త్రీలు, పిల్లలు, ఇద్దరు పురుషులు కాక మరో ముగ్గురు ఇప్పుడు లేరు. నక్సల్బరీ నిర్మాత చారు మజుందార్‌కయితే ఈ సంవత్సరం శతజయంతి. నక్సల్బరీ సంతాల్‌ తిరుగుబాటు నుంచే రూపొందిన జంగల్‌ సంతాల్‌ ఏనాడో అమరుడయ్యాడు. కానూ సన్యాల్‌ లేడు.

నక్సల్బరీ నిర్మాతల్లో ఒకరు కాకపోయినా, మొదలు ఏర్పడిన సమన్వయ సంఘంలో కాని, కేంద్ర కమిటీలో కాని సభ్యుడు కాకపోయినా నక్సల్బరీ ముందు నుంచే, తనకు జ్ఞానం, చైతన్యం కలిగిన నాటి నుంచే ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం, విప్లవం కోసం పోరాడినవాడు విప్లవశ్రేణులందరికీ విజయ్‌దా గా తెలిసిన నారాయణ్‌ సన్యాల్‌. ఆయన ఏప్రిల్‌ 17న కలకత్తాలో క్యాన్సర్‌ వ్యాధితో కన్నుమూశాడు. అప్పటికి ఆయనకు 82 సంవత్సరాలు.

అవిభక్త బెంగాల్‌లోని ఇప్పటి బంగ్లాదేశ్‌ బోగ్రా జిల్లాలో సంపన్న కుటుంబంలో పుట్టిన నారాయణ్‌ సన్యాల్‌ మొదట ఫుట్‌బాల్‌ క్రీడలో చాల ఆసక్తి చూపాడు. రాజకీయ జీవితం ఎంచుకుంటే అవివాహితులుగా ఉండడం, ఫుట్‌బాల్‌ ఆట బెంగాల్‌ జాతికి ప్రత్యేక లక్షణాలు.

ఆయన కుటుంబం బ్రిటిష్‌ వలసవాద రాజకీయ పోరాటంలో పాల్గొన్నది. డా. బి.సి. రాయ్‌, సరోజిని నాయుడు వంటి వాళ్లతో సన్నిహిత సంబంధాలు ఉన్న కుటుంబం.

సన్యాల్‌ కుటుంబం 1940లో పశ్చిమ బెంగాల్‌కు మారినప్పుడు ఆయన బ్యాంక్‌ ఉద్యోగంలో చేరాడు. 1960ల ఆరంభంలో చిట్టగాంగ్‌ విప్లవ యోధుడైన అనంత్‌సింగ్‌ రాజకీయాల వైపు ఆకర్షితుడై, అమలేందు, మేరీ టేలర్‌లు నిర్మాణం చేసిన ఒక విప్లవ బృందంలో పనిచేసాడు. విప్లవ రాజకీయాల కోసం బ్యాంకు ఉద్యోగం వదిలేసాడు.

1967 నక్సల్బరీ వసంత మేఘగర్జనతో ప్రభావితుడై సిపిఐ (ఎంఎల్‌)లో చేరాడు. సత్యనారాయణ్‌ సింగ్‌ నాయకత్వంలో సిపిఐ (ఎంఎల్‌) చీలినప్పుడు సన్యాల్‌ బీహార్‌లో పనిచేయడానికి వెళ్లాడు. అక్కడ ఆయన వ్యవసాయ కూలీలను, భూమిలేని పేదలను కూడగట్టి విప్లవోద్యమ నిర్మాణం చేసాడు. ఆ పోరాటంలో 1972లో అరెస్టయి అప్పట్నుంచి ఎమర్జెన్సీ కాలం ముగిసే దాకా జైలులో ఉండి 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత విడుదలయ్యాడు. మళ్లీ మధ్య బీహార్‌లో పనిచేయడానికి వెళ్లి చీలిన మార్క్సిస్ట్‌ - లెనినిస్ట్‌ పార్టీలను కలిపే కృషి ప్రారంభించాడు. అందులో భాగంగానే సిపిఐ (ఎంఎల్‌) పార్టీ యూనిటీ ఏర్పడి తిలక్‌ దాస్‌ గుప్తా తరువాత ఆయన ఆ పార్టీ కార్యదర్శి అయ్యాడు. నక్సల్బరీ పంథా నిర్వచించిన ఉత్పత్తి సంబంధాలను ఆ అవగాహనతో కొనసాగించే క్రమంలో ఆయన ఈ బాధ్యతను చేపట్టాడు.

మధ్య బీహార్‌లో ఆయన విప్లవోద్యమం నిర్వహించిన కాలమంతా భూమిహార్‌లు రకరకాల భూమి సేనలతో విప్లవోద్యమం మీద దాడులు చేస్తున్న రోజులు. విప్లవోద్యమం వెనుక ఉన్న దళితుల మీద దాడి చేస్తున్న రోజులు. మరొకవైపు సాయుధ విప్లవోద్యమంలో ఉన్న ప్రధానమైన రెండు పార్టీల మధ్య మొదట, మూడు పార్టీల మధ్య తరువాత సాయుధ ఘర్షణలు కూడా జరుగుతున్న రోజులు. ఈ రక్తసిక్తమమైన మార్గమంతా ఆయన అటు వర్గశత్రువును ఎదుర్కొంటూనే, ఇటు వర్గ పోరాట శక్తులను ఐక్యం చేసే కృషి చేసాడు.

నేను మొట్టమొదట ఆయనను 1996 సెప్టెంబర్‌ నెలలో ఢిల్లీలో చూసాను. ఆల్‌ ఇండియా పీపుల్స్‌ రెసిస్టెన్స్‌ ఫోరం జాతుల సమస్యపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించినప్పుడు ఆ సదస్సును ప్రారంభించడానికి వచ్చిన విలియం హింటన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు అక్కడ నాకు విద్యార్థి దశ నుంచి తెలిసిన మల్లోజుల కోటేశ్వర్‌ (అప్పుడు ఆయన రాంజీ) విజయ్‌దాను పరిచయం చేసాడు. అప్పటికే ఆ ఇద్దరు పీపుల్స్‌వార్‌, పార్టీ యూనిటీ నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. విలియం హింటన్‌తో సుదీర్ఘమైన చర్చల్లో వాళ్లిద్దరూ పాల్గొనడం చూసినప్పుడు నారాయణ్‌ సన్యాల్‌ కున్న రాజకీయ పరిజ్ఞానం, విప్లవాభినివేశం మొదటిసారి గమనించాను. ఆయన సిగరెట్లు ఎక్కువ తాగుతాడని కూడా గమనించాను.

శ్రీకాకుళం సెట్‌బ్యాక్‌ తరువాత సిపిఐ (ఎం.ఎల్‌) మొట్టమొదటి కేంద్ర కమిటీ నాయకత్వాన్ని ఒక చోటికి తెచ్చే ప్రయత్నం కొండపల్లి సీతారామయ్య (కె.ఎస్‌.) 1974లో ప్రారంభించాడు. అట్లా ఏర్పడిందే సిపిఐ (ఎంఎల్‌) సెంట్రల్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ. అందులో అప్పుడు చేరిన శ్రీకాకుళ విప్లవానికి చెందిన అప్పలసూరి కానీ, పంజాబ్‌కు చెందిన శర్మ కానీ ఆ తరువాత ఏర్పడిన పార్టీ యూనిటీలో భాగమయ్యారు. పార్టీ యూనిటీలో అప్పలసూరి కుడిభుజంగా ఉన్న గంటి ప్రసాదం 1972 నుంచే విరసం వల్ల, 1980 తరువాత ఆయన సోదరుడైన గంటి రమేష్‌ (సిపిఐ - ఎం.ఎల్‌. పీపుల్స్‌వార్‌, శ్రీకాకుళం) వల్ల ఈ ఐక్యతా కృషిలో ఉన్నాడు.

1998లో సిపిఐ (ఎం.ఎల్‌.) పీపుల్స్‌వార్‌, పార్టీ యూనిటీ ఐక్యమై సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ ఏర్పడింది. ఈ ఐక్యతా ప్రకటన తెలంగాణలోని ములుగు ఏటూరు నాగారం అడవుల్లో ఆ రెండు పార్టీల కార్యదర్శులు గణపతి, విజయ్‌దా చేసారని, అందులో పాల్గొన్న ముగ్గురు పత్రికా రచయితల్లో ఒక పత్రికా రచయిత నారాయణ్‌ సన్యాల్‌ అమరత్వం తరువాత రాసాడు. ఈ పత్రిక (ఆంధ్రజ్యోతి) రిపోర్టర్‌ కూడా ఈ ఐక్యతా ప్రకటన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడని విన్నాను.

2001లో ఈ విప్లవోద్యమ ఐక్యత ఉత్సవాన్ని కలకత్తాలో నిర్వహించినప్పుడు నేనందులో పాల్గొన్నాను.

2004 సెప్టెంబర్‌లో పీపుల్స్‌వార్‌, ఎంసిసిఐ తో ఐక్యం కావడంలో చేసిన కృషిలో కూడా పీపుల్స్‌వార్‌ నాయకత్వంలో ఒకరుగా విజయ్‌దా ముఖ్య భూమిక నిర్వహించాడని విన్నాను. అందుకు ఆయనకు బెంగాల్‌, బీహార్‌ మొదలుకొని ఉత్తర భారత విప్లవ నిర్మాణాల సమస్యలు ఎక్కువగా తెలియడం తోడ్పడి ఉంటుంది.

2005 ఆగస్ట్‌లో విరసం నిషేధింపబడి అధ్యక్షుడు కళ్యాణ్‌రావు, నేను అరెస్టయి చెంచల్‌గూడ జైలులో ఉన్నప్పుడు 2006 జనవరి 5న నారాయణ్‌ సన్యాల్‌ను భద్రాచలం అడవుల్లో అరెస్టు చేసి మొదట వరంగల్‌కు, తరువాత చర్లపల్లి జైలుకు తీసుకు వచ్చారని విన్నాము. అప్పటికే ఔరంగాబాద్‌లో అరెస్టయి నిజామాబాద్‌ కుట్రకేసు పేరుతో నిజామాబాద్‌ జైలులో ఉన్న గంటి ప్రసాదం కూడా మా దగ్గరికి వచ్చాడు. మా జైలుకు వచ్చిన దగ్గర నుంచి ఆయన అజ్ఞాత జీవితానుభవాలు, పీపుల్స్‌వార్‌తో ఐక్యత కోసం పార్టీ యూనిటీ చేసిన కృషి, అందులో విజయ్‌దా పాత్ర కథలు కథలుగా చెప్తూనే ఉన్నాడు. కలకత్తాలో ఏప్రిల్‌ 27న సన్యాల్‌దా సంస్మరణ సభలో తిలక్‌దాస్‌ గుప్తా గంటి ప్రసాదంను జ్ఞాపకం చేసుకుంటూ మళ్లీ ఆ విషయాలను ప్రస్తావించాడు. ఈ చర్చల్లో అప్పలసూరి అనువాదకుడుగా ప్రసాదం పాల్గొంటుండేవాడని చెప్పాడు.

నిజానికి సన్యాల్‌దాను అరెస్టు చేసింది ఛత్తీస్‌గడ్‌లో. బహుశా రాయ్‌పూర్‌లో. కాని ఆయన, గణపతి రెండు పార్టీల ఐక్యతను తెలంగాణ అడవుల్లో ప్రకటించారు కాబట్టి ఆయన అరెస్టు భద్రాచలంలో చూపారు. అందులో మూడు నెలల్లోనే ఆయనకు బెయిల్‌ వచ్చింది. కాని ఇంక ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌ మొదలైన ఎన్నో రాష్ట్రాల్లో ఆయనపై ఎన్నో కేసులు పెట్టి ఆయా జైళ్లకు తరలించారు. ఆయన మూడు దశాబ్దాలకు పైగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడుగా ఉన్నాడు. విధాన నిర్ణేతల్లో ఒకరుగా ఉన్నాడు. కనకు దేశవ్యాప్తంగా ఆయనను రాజ్యం కుట్ర కేసులో చూపుతూనే ఉంది.

కలకత్తాలో బాల్యం నుంచే తనకు పరిచయం ఉన్న నారాయణ్‌ సన్యాల్‌ను డా. బినాయక్‌ సేన్‌ ఒక వైద్యుడుగా, పియుసిఎల్‌ ఉపాధ్యక్షుడుగా ఆరోగ్యం గురించి పరామర్శించడానికి రాయ్‌పూర్‌ జైలులో కలిసిన నేరానికే ఆయనతో పాటు జీవిత ఖైదు వేసిన విషయం మనకు తెలుసు. నారాయణ్‌ సన్యాల్‌ అమరత్వం నాటికి ఈ ఇద్దరూ ఆ కేసులో బెయిల్‌పైనే ఉన్నారు.

ఏడున్నర సంవత్సరాల జైలు జీవితం నుంచి బెయిలపై ఆయన హజారీబాగ్‌ జైలు నుంచి విడుదలైన తరువాత అరెస్టు కేసులో ఉన్న షరతుల వల్ల ఆయన కొత్తగూడెం పోలీసు స్టేషన్‌లో సంతకం చేయడానికి వెళ్లిన దగ్గర నుంచి ఆయన హైదరాబాద్‌ రావడం ప్రారంభమైంది. ఆయన వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఆ కేసు విచారణ హైదరాబాద్‌కు బదిలీ అయింది.

ఒకసారి కలయిక, పరోక్షంగా దశాబ్దాలుగా ఆయన గురించి వినడం ఒక ఎత్తు, ప్రత్యక్షంగా కలిసి ఉండడం ఒక ఎత్తు. అదీ ప్రత్యక్షంగా ఆయనను నేను సన్నిహితంగా చూసిన కాలం. అప్పటికి ఆయన సిగరెట్లు కూడా మానేశాడు. ఇంట్లో మనిషిలాగా ఇల్లంతా కలియబెడుతూ తిరిగేవాడు. ఆయనకు మన పచ్చళ్లు, కారం చాలా ఇష్టం. రుచులు, అభిరుచులు ఉన్నవాడు. చాల సరదాగానూ, సున్నితమైన హాస్యంతోనూ మాట్లాడేవాడు. ఆయన విడుదలయ్యే కాలానికి దేశంలోని వివిధ జైళ్లలో అరవై ఏళ్లు, డెబ్భై ఏళ్లు పైబడిన రాజకీయ ఖైదీలు, ఆదివాసులు ఎందరో ఉండడం వల్ల పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కూడా పది పన్నెండు మంది దాకా ఉండడం వల్ల ఆయన రాజకీయ ఖైదీల విడుదల పట్ల ఎంతో వ్యగ్రత ప్రదర్శించేవాడు.

బీహార్‌లో మళ్లీ విశాల ప్రజారాశులతో ఒక రైతాంగ ఉద్యమాన్ని నిర్మించాలనేవాడు. ఎంతో క్రియాశీలంగా ఒక యువకునిలా కనిపించేవాడు. ఏ నక్సల్బరీ ఉత్పత్తి సంబంధాల చర్చలో ఆయన నాయకత్వ స్థానానికి వచ్చాడో ఆ ప్రస్తావన నేను చర్చకు పెట్టే సమయానికి ఆయన తిరుగు ప్రయాణం వేళ అయింది. అదే ఆయనను ఆఖరి సారి కలవడం.

ఆయనకు క్యాన్సర్‌ అని బయటపడే దాకా ఆయనకు ఏ రకమైన అనారోగ్యం ఉన్నట్లు కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు. నిజంగానే చాలా ఆరోగ్యంగా కనిపించేవాడు. బహుశా ఆయన స్వభావానికి, చైతన్యానికి సంబంధించిన విషయం అది. అందుకేనేమో ఎందరో నిపుణులు ఆయన రిపోర్టులు చూసి ఆరు నెలలు మించి బతకడు అన్నారు కాని ఆయన ఏడాది మృత్యువుతో కూడా పోరాడుతూ జీవించాడు. ఒక నెల రోజుల క్రితమే కేవలం ఆయనను చూడడానికి కలకత్తా వెళ్లినప్పుడు మొదటిసారిగా ఆయన సుస్తీగా పడుకొని ఉండడం చూసాను.

నేల మీద పాదముద్రలు, మన చుట్టూ ఉన్న వాతావరణంలో జ్ఞాపకాలు అంటారే అట్లా మా ఇంటి నిండా, మా కుటుంబం అంతా ఆయన జ్ఞాపకాలు ఆవరించి ఉన్నాయి. ఆవరించి ఉంటాయి. మాలో, మాతో మిగిలి ఉంటాయి.

అయితే ఒక్క నారాయణ్‌ సన్యాల్‌ గురించే కాదు, ఏప్రిల్‌ 27న ఆయన సంస్మరణ సభలో కొట్టవచ్చినట్టు కనిపించింది ఈ వెటరన్స్‌తో, ఈ కాకలు తీరిన యోధులతో సమాజం ఎట్లా వ్యవహరించాలి అనే అంశం.

ఆ రోజు ఆయన సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన ముగ్గురు డెబ్బై అయిదు సంవత్సరాలు పైబడిన వారు. అందరూ సుదీర్ఘ అజ్ఞాత జీవితాన్ని, జైలు జీవితాన్ని గడిపిన వారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా అరెస్టయి ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపి విడుదలై గౌర్‌ చక్రవర్తి, ఎంసిసి నుంచి ఐక్య మావోయిస్టు పార్టీలో పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఏడేళ్లు జైలు జీవితం గడిపి విడుదలైన పూర్ణేందు ముఖర్జీ, పియు నిర్మాతల్లో ఒకడైన తిలక్‌దాస్‌ గుప్తా ఈ సభను నిర్వహించారు. వక్తలు కూడా ఎక్కువ మంది సుదీర్ఘ విప్లవ జీవితం, జైలు జీవితం ఉన్న వయోవృద్ధులు.

అప్పుడు ఎక్కడో చదివిన ఈ విలువైన మాటలు గుర్తుకొచ్చాయి.

వయో భారంతో, సీరియస్‌ అనారోగ్యంతో బాధపడుతూ, జైళ్ల నుంచి విడుదలైన కామ్రేడ్స్‌ను బహిరంగ జీవితం గడుపుతూ వివిధ రూపాల్లో బాధ్యతలు నిర్వహించడంతో పాటు వారి విప్లవ అనుభవాలను రాయమని కూడా అడగాలి. విప్లవ అనుభవాలు అంటే విప్లవంతో తాదాత్మ్యం చెందిన అనుభవాలే కనుక, ఆ అనుభవాల ద్వారా ఆయా కాలాల్లో విప్లవోద్యమం తీసుకున్న మలుపులను, అది సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తెచ్చిన మార్పులను నిర్దిష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. వాళ్లు ఆ పని చేయడానికి వీలుగా, వాళ్లు బహిరంగ జీవితం గడుపుతున్న క్రమంలో వారికి తగిన సహాయ సహకారాలు, గౌరవం అందేలా చూడాలి. వాళ్లకు వసతి ఏర్పాటు చేసి, వాళ్ల అనారోగ్యాన్ని పట్టించుకొని, ప్రయాణాల్లో, రోజువారీ పనుల్లో సహకరించాలి. ఆర్థిక వగైరా సహాయ సహకారాలతో వారికి పూర్తి మద్దతును అందించాలి.

సుదీర్ఘ విశేష అనుభవం కలిగిన మన వెటరన్‌ కామ్రేడ్స్‌ ఏ రంగంలో ఉన్నా విప్లవ నిర్మాణాలకు, విప్లవోద్యమానికి గొప్ప సంపద. వారి సిద్ధాంత జ్ఞానం, దృఢవైఖరి విప్లవోద్యమాన్ని మార్గం మరలకుండా కాపాడడడానికి తోడ్పడతాయి. వారి అనుభవాలు విప్లవకార్యాచరణను మరింత పురోగమింప చేయడానికి తోడ్పడతాయి. కనుక వారిని గౌరవించడం, కాపాడుకోవడం, వారి అనుభవాలు స్వీకరించడం విప్లవోద్యమానికి ఒక ముఖ్యమైన కర్తవ్యంగా ఉంటుంది.

అదే విధంగా వెటరన్‌ కామ్రేడ్స్‌ కూడా విప్లవ క్రమశిక్షణ అమలు చేసే విషయంలో, ఇతర కామ్రేడ్స్‌తో సత్సంబంధాలు కొనసాగించే విషయంలో తరాల అంతరాలను, ఉద్యమ ఆటుపోట్లను దృష్టిలో పెట్టుకొని పరిస్థితికి అనుగుణంగా కమ్యూనిస్టు స్పిరిట్‌తో ఆదర్శంగా ఉండేందుకు తమ విలువైన అనుభవాలను విప్లవ పురోగమనానికి అందించేందుకు సిద్ధంగా ఉండాలి. కమ్యూనిస్టు చైతన్యంతో ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా విప్లవంలో తమ వంతు పాత్ర నిర్వహించాలి. ఇదే వారి శేష జీవిత కర్తవ్యం. అప్పుడే ప్రాణంతో పాటు అన్నిరకాల స్వీయ ప్రయోజనాలను త్యాగం చేస్తూ విప్లవ పురోగమనంలో నూతన ప్రజాస్వామిక రాజకీయాధికార నిర్మాణంలో ప్రజా నిర్మాణాలల్లో అన్ని శ్రేణులకు, ప్రజలకు గొప్ప విప్లవ స్ఫూర్తిని నింపగలుగుతారు.

వర్గపోరాట సిద్ధాంతాన్ని తమ జీవిత సారంగా చేసుకొని శ్రమదోపిడీ, వర్గసమాజం అందించిన సకల రూపాల పీడనను, స్వార్థాన్ని, అందుకు తోడ్పడే విలువలను, సంస్కృతిని, అలవాట్లను తొలగించడానికి, మానవ సమాజం మరింత ఉన్నత స్థాయిలో పరివర్తన చెందుతూ కమ్యూనిజం చేరడానికి తోడ్పడేలా తుదివరకు పోరాడటం తమ కమ్యూనిస్టు నైతిక నియమావళిగా జీవించిన అమరుల స్ఫూర్తిని మన జీవన శైలిగా మార్చుకోవడమే మనలో వాళ్లను నిలుపుకోవడం.

No. of visitors : 1052
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

వరవరరావు | 11.09.2016 10:16:25am

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •