భారత కమ్యూనిస్టు ఉద్యమంలో నక్సల్బరీ ఒక మేలి మలుపు. పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించింది. అట్టడుగు ప్రజలకు అండగా నిలబడింది. అయితే నక్సల్బరీ ఆ చరిత్రనంతా గుణాత్మక మలుపు తిప్పింది. అందుకే అప్పటి దాకా జరిగిన పోరాటాల వరుసలో అదీ ఒక పోరాటంగా మిగిలిపోలేదు. ప్రజలకు ఒక విప్లవ కార్యక్రమాన్ని ఇవ్వడంలోనే ఆ విశిష్టత ఉన్నది. నక్సల్బరీ గురించి చెప్పుకోవలసినవి ఎన్నో ఉన్నప్పటికీ ఇది అత్యంత కీలకమైనది. ఆ కార్యక్రమం అమలు చేయడంలో లోటుపాట్లు, సాఫల్య వైఫల్యాల గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అంత వరకు విప్లవం ఎజెండా మీద లేకపోవడం వల్ల సహజంగానే విప్లవ కార్యక్రమం కూడా లేకుండా పోయింది. ఒక వేళ విప్లవాన్ని ఎజెండా మీదికి తెచ్చినా కార్యక్రమం లేకపోయి ఉంటే అది కేవలం విప్లవానికి సంబంధించిన ఒక ఎరుకగానే మిగిలిపోయి ఉండేది కావచ్చు. లేదా ఒక గొప్ప తిరుగుబాటుగా గుర్తుండిపోయేది.
కమ్యూనిస్టుపార్టీ అంటేనే విప్లవ కార్యక్రమంగల కార్మికవర్గ నిర్మాణమని అర్థం. ఆ కార్యక్రమాన్ని అమలు చేయగల శక్తి ఎంత ఉన్నది? ఎంత వరకు అమలు చేస్తున్నది? ఆ సమాజంలో విప్లవం తేవడానికి అది అది ఎంత వరకు సరిపోతుంది? అనే మౌలిక ప్రశ్నలు కూడా ఉంటే ఉండవచ్చు. కానీ విప్లవ కార్యక్రమం ఉన్నదా? లేదా? అనేది చాలా ముఖ్యం. నక్సల్బరీ అలాంటి ఒక కార్యక్రమాన్ని తెచ్చింది.
ఉమ్మడి పార్టీ రోజుల్లోగాని, అది రెండుగా చీలిపోయాక గాని విప్లవ కార్యక్రమం లేకపోవడం అత్యంత విషాదకరం. సీపీఐ, సీపీఎంలకు పార్లమెంటరీ విధానమే పరమ మార్గమైంది. విప్లవం చేసే లక్ష్యం ఉండి అప్పటి నిర్దిష్ట పరిస్థితుల్లో ఒక ఎత్తుగడగా పార్లమెంటులోకి కూడా వెళదాం.. అనే అవగాహనతో కూడా ఆ పార్టీలు వ్యవహరించలేదు. మొత్తంగానే వర్గపోరాటాన్ని వదిలేసి మిగతా బూర్జువా పార్టీల వలె పార్లమెంటరీ పంథాను ఆశ్రయించాయి.
అందువల్ల నక్సల్బరీ సాయుధ పోరాట పంథాను ముందుకు తెచ్చింది. సాయుధ పోరాట పంథాను అర్థం చేసుకోవడంలో, అమలు చేయడంలో తొలి రోజుల్లో అతివాద పోకడలు పోయిన మాట వాస్తవమే. రివిజనిజానికంటే, మితవాదానికంటే అతి వాదం చాలా నయం. రెండూ విప్లవానికి నష్టదాయకం అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రివిజనిజం మీద, పార్లమెంటరీ పంథా మీద ఆగ్రహంతో విప్లవాన్ని రంగం మీదికి తేవడంలో తలెత్తిన పెడ ధోరణి ఇది. ఇంకోలా చెప్పాలంటే రివిజనిజానికి, మితవాదానికి పార్లమెంటరీ విధానం కేంద్రం. అతివాద లక్ష్యం విప్లవం. అయితే విప్లవాన్ని విజయవంతం చేయడానికి అతివాదం ఎంత మాత్రం పనికి రాదు. ఘోరమైన, ఆత్మహత్యా సదృశమైన తప్పిదాలు జరుగతాయి. ఆ నష్టాల నుంచి తిరిగి విప్లవాన్ని రంగం మీదికి తేవడం చాలా కష్టం.
నక్సల్బరీ సాయుధ పోరాట పంథాను ముందుకు తేవడం దాని మౌలిక విశిష్టత. అయితే పంథా ఎన్నెన్ని వస్తుగత విషయాలను పరిగణలోకి తీసుకొని నిర్వచించుకోవలసి ఉన్నదో తొలి రోజుల్లో పట్టించుకోలేదు. విప్లవ పంథా రివిజనిజం మీది ఆగ్రహంతో తయారు కాకూడదు. అదొక శాస్త్రీయ విధానం. అనేక చారిత్రక విశేషాలను, ఆ సమాజంలోని ప్రజల పోరాట అనుభవాలను, ముఖ్యంగా వ్యవస్థ సంక్లిష్టతలను, రాజ్యం ఏర్పడిన తీరును, దాని పనితీరును పరిగణలోకి తీసుకొని పంథాను నిర్వచించవలసి ఉంటుంది. అమలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రజలను అందులో పూర్తి స్థాయిలో భాగం చేయడం కష్టం.
నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా, వారి మధ్య అవసరమైన, అనవసరమైన విభేదాలు ఎన్ని ఉన్నా సరే అందరూ నక్సల్బరీ విశిష్టతను ఈ కోణంలో గుర్తిస్తారు. విప్లవాన్ని కమ్యూనిస్టు శ్రేణుల ఎజెండా చేయడం, అది పార్లమెంటరీ మార్గానికి వెలుపల సాయుధ మార్గమని చెప్పడం వరకు నక్సల్బరీని అందరూ గుర్తిస్తారు. ఎవరెవరి సాయుధ ఆచరణ ఎలా ఉన్నదనేది వేరే విషయం. ఒకరు మరొకరి ఆచరణను అతివాద, ఆత్మహత్యా సదృశమనీ, విశాల ప్రజలకు దూరమైనదనీ అనవచ్చు. లేక నక్సల్బరీ పంథాను గుర్తిస్తున్నామంటూనే మితవాదమార్గమనీ, ప్రచ్ఛన్న పార్లమెంటరీ విధానమనీ అనవచ్చు. ఈ యాభై ఏళ్ల చరిత్ర దీన్ని ఇక ఎంత మాత్రం పండిత చర్చగా కాక ఒక వాస్తవంగా తేల్చేసింది. ఒక రకంగా ఇలాంటి చర్చకు ఎలాంటి ప్రాసంగికత లేని ఆవరణలోకి విప్లవోద్యమం చేరుకున్నది.
ఎప్పుడైనా పంథా గురించిన చర్చ విప్లవ కార్యక్రమంతో ముడిపడి ఉంటుంది. వాస్తవానికి రాజకీయ కార్యక్రమమే స్థూలంగా పంథాను నిర్ణయిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నక్సల్బరీ కాలంలో అదొక పంథాగానే తీవ్ర ప్రభావం వేసింది. పూర్వ రంగంలో కామ్రేడ్ చారుమజుందార్ కమ్యూనిస్టుల పార్లమెంటరీ విధానంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజకీయ కార్యక్రమానికి సంబంధించిన చర్చ చాలానే చేశారు. ఆ కార్యక్రమం ప్రకారం దీర్ఘకాలిక ప్రజాయుద్ధం విప్లవ పంథా. అయితే నక్సల్బరీ ప్రవేశపెట్టిన రాజకీయాలు పంథా మీద ఎక్కువ నొక్కు ప్రకటించాయి. ఇది రివిజనిస్టు నేపథ్యంలో తప్పించుకోని ప్రభావం అయింది. వాస్తవానికి ఆనాటి రచనలు, విశ్లేషణలు చదివితే విప్లవ కార్యక్రమాన్ని, పంథాను చాలా వరకు ఒకటిగానే చూశారని అనిపిస్తుంది. అట్లని ఆ రెంటికీ ఉన్న విడదీయరాని సంబంధాన్ని విస్మరించలేం. ప్రోగ్రాం వైపు నుంచి పంథాను చూసే నొక్కు ఎక్కువగా ఉండి ఉంటే దీర్ఘకాలిక ప్రజాయుద్ధమనేది బలంగా ముందుకు వచ్చి ఉండేది.
ఈ విశ్లేషణ ఆనాటి చైతన్యాన్ని, సంసిద్ధతను తక్కువ చేయడానికి కాదు. ఆ తర్వాత్తర్వాత అతివాద పోకడలు ఉన్న మాట వాస్తవమే అని వేటినైతే సవరించుకోవలసి వచ్చిందో అవి తలెత్తడానికి గల కారణం అర్థం చేసుకోడానికి మాత్రమే.
నక్సల్బరీ ఘటన జరిగాక అదొక పంథాగా దేశవ్యాప్తంగా శక్తివంతంగా ముందుకు వచ్చే నాటికే చారుమజుందార్ రచనల్లో ఈ దేశ విప్లవానికి ఒక విప్లవ కార్యక్రమం దాదాపుగా నిర్ధారణ అయిపోయింది. మావో 1926లో అప్పటి చైనా సమాజంలో వర్గవిశ్లేషణ, 1927లో హూనాన్ రైతాంగ ఉద్యమాలు- ఒక పరిశీలన అనే పత్రాలు రాసి ప్రకటించిన అర్ధ వలస అర్ధ భూస్వామ్యం, నూతన ప్రజాస్వామిక విప్లవ కార్యక్రమం మన దేశంలోనూ అమలు కావాల్సి ఉన్నదనే నిర్ణయమైంది. దీని ప్రకారం గెరిల్లా పద్ధతిలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా ముందుకు వచ్చింది. నక్సల్బరీ ఘటనతో ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే అది అతివాదపోకడలు పోవడం వల్ల చాలా నష్టం వాటిల్లింది. శతృవు దారుణ నిర్బంధంతోపాటు ఈ అతివాదం కూడా నష్టం కలిగించినందు వల్లే ʹగతాన్ని సమీక్షించుకొని పురోగమిద్దాం..ʹ అంటూ ʹవిప్లవానికి బాటʹ వేయాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే అతివాదాన్ని పరిహరించి దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని ముందుకు తేవడమే.
విప్లవ కార్యక్రమం ఉన్నందు వల్లే ఇది సాధ్యమైంది. అందువల్లే చరిత్రలో జరిగిన అనేక తిరుగుబాట్లలో నక్సల్బరీ ఒకటిగా మిగిలిపోలేదు. అసలు నక్సల్బరీ ఘటన జరిగాక ఆ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. అవి అన్నీ నక్సల్బరీ వలె అత్యంత వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాల్లో జరిగాయి. చారుమజుందార్ రచనల్లో విప్లవ కార్యక్రమం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా మామూలు రైతాంగం గురించి, గ్రామాల గురించి, విద్యార్థుల గురించి ప్రముఖంగా కనిపిస్తుంది. అయితే నక్సల్బరీగాని, ఆ ప్రేరణతో సాగిన తిరుగుబాట్లుకాని అన్నీ ఆదివాసీ సమాజాల్లో జరిగాయి. అధికార మార్పిడీ తర్వాత కూడా అంతక ముందటి స్థితి ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతూ వచ్చింది. 1947 నుంచి 1967 దాకా ఆ ప్రాంతాల్లోని ఏ వైరుధ్యం పరిష్కారం కాలేదు. ఆ వాస్తవిత నుంచి అన్ని తిరుగుబాట్లు జరిగాయి. అయితే ఈ వాస్తవికత మరింత గాఢంగా, సంక్లిష్టంగా, తీవ్రంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోకి విప్లవోద్యమం పునర్నిర్మాణ క్రమంలోనే వెళ్లింది. ఈ పని అప్పటి ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా జరిగింది. దెబ్బతినిపోయిన ఉద్యమాన్ని పునర్నిర్మించడం మాత్రమేగాక రివల్యూషనరీ ప్రోగ్రాంను గ్రామాల్లో అన్వయించే ప్రక్రియ తెలంగాణలో మొదలైంది. యాక్సివల్ యాంటీ ఫ్యూడల్ స్ట్రగుల్స్ను విప్లవ కార్యక్రమంలో భాగంగా చేపట్టారు. అంటే ఆ కాలంలో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రబల వాస్తవికతపట్ల గొప్ప ఎరుక కలిగింది. అందువల్లే ఆ వైరుధ్యాన్ని విప్లవోద్యమం ఎదుర్కొన్నది. అది అప్పటికి స్థూలంగా అలాంటి సమాజాలన్నిటికీ వర్తించేది.
దానిలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. 1. ఆదివాసేతర విశాల ప్రాంతాల్లోని ఫ్యూడల్ వ్యతిరేక ఉద్యమాల అనుభవాలు దాదాపుగా తొలిసారి అనుభవంలోకి వచ్చాయి. నక్సల్బరీ ఉద్యమ ప్రభావం తెలుగు సమాజం మీదే ప్రబలంగా పడటానికి ఇదే కారణం. తెలంగాణ సాయుధ పోరాటంతో సహా నక్సల్బరీ వెలుగులో సాగిన పోరాటాలన్నిటి కంటే తెలంగాణలో జరిగిన విప్లవోద్యమం గొప్ప అనుభవాలను గడించింది. అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ఈ యాభై ఏళ్లలో తెలంగాణ విప్లవోద్యమ అనుభవాలతో సాటిరాగల అనుభవాలు విప్లవోద్యమం మరెక్కడా ఆదివాసేత ప్రాంతాల్లో గడించలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. గతాన్ని సమీక్షించుకొని పురోగమించాలనే విప్లవోద్యమ లక్ష్యం అసలు సిసలైన ప్రజాపంథాగా ఆ ప్రాంతంలో అమలైంది. వర్తమానంలో చేసిన తప్పులు, చేయని ఒప్పుల గురించిన ఏ విశ్లేషణ అయినా అప్పట్లో తెలంగాణ గడించిన అనుభవాల వైపు నుంచి చూసుకోవాల్సిన పరిస్థితి ఊరక రాలేదు. సుమారు ఒకటిన్నర దశాబ్దాలపాటు అక్కడి వాస్తవికతను చాలా స్పష్టంగా గుర్తించి సాహసోపేతంగా, సృజనాత్మకంగా విప్లవోద్యమం తలపడింది. 2. ఈ అనుభవాలు ఇతర రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు సహితం ప్రేరణ ఇవ్వడం. అందువల్లే దేశంలో ఇప్పటికీ ఆనాటి తెలంగాణ విప్లవోద్యమ ఆచరణ ఉత్తేజాన్ని ఇస్తుంది. తెలంగాణ వాస్తవికతను గుర్తించినట్లే ప్రతి ప్రాంతంలోని వాస్తవికతను గమనించి విప్లవ కార్యక్రమాన్ని అమలు చేయాలనే పాజిటివ్ స్పిరిట్ అందులో ఉంది. దాన్ని ఎంత భౌతిక దృష్టితో, సృజనాత్మకంగా, వాస్తవికంగా చూసి ఉంటే ఆ మేరకు మిగతా ప్రాంతాల్లో ఉద్యమం ముందడుగు వేసి ఉంటుంది.
తెలంగాణ గ్రామ సమాజంలో విప్లవోద్యమ ఫలితాలు నక్సల్బరీ రాజకీయ కార్యక్రమ ఆచరణ వల్ల వచ్చాయి. ఏ సమాజంలో అయినా దానికి అన్వయమయ్యే ప్రోగ్రాంను అమలు చేస్తే అలా ఫలితాలు వస్తాయని ఇది నిరూపించింది.
Type in English and Press Space to Convert in Telugu |
దండకారణ్యంలో... నక్సల్బరీ 50 వసంతాల వేడుకలునక్సల్బరీ వారసులైన దండకారణ్య మావోయిస్టు విప్లవ కారులు జనతన సర్కార్ నేపథ్యంలో తమకు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్రజలకూ, ప్రపంచ..... |
యాభై వసంతాల అజేయశక్తి నక్సల్బరీఏప్రిల్ 22న శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో విరసం బహిరంగసభ. కామ్రేడ్స్ వరవరరావు, పాణి, కాశీం వక్తలు. ... |
International Seminar on Nationality QuestionAIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky... |
విరసం సాహిత్య పాఠశాలరాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య... |
నోట్ల రద్దు ప్రగతి వ్యతిరేకమైనది : ప్రసాద్విరసం సాహిత్య పాఠశాల (11, 12 ఫిబ్రవరి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల రద్దుపై ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగం... |
సాయిబాబా అనారోగ్యం - బెయిల్ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూకేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్ పిటీషన్ వేయడంలో చాల రిస్క్ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్గా, పొలిటికల... |
సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాంమానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్ విప్లవం. ఈ నవంబర్ 7 నుంచి రష్యన్ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ... |
ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండిఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ... |
Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 1When we look at the lives of these women martyrs many things strike us as extremely significant.The NDR in India is led by the Working class and peasantry..... |
ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాంవిరసం వ్యవస్థాపక సభ్యుడు కా. వరవరరావుపై రాజ్యం మరో కుట్ర కేసు మోసింది. ఈసారి ఏకంగా ఈ దేశ ప్రధానిని హత్య చేయడానికి కుట్రపన్నాడని ఆరోపించింది. కవిగా, అధ్యాపకు... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |