దళితులు, ఆదివాసులు, ముస్లింలు మొదలైన పీడిత ప్రజలను షహీద్ భగత్‌సింగ్ కాలం నుంచి కర్షక, కార్మిక రాజ్యం కోసం జరిగే పోరాటంలోకి విప్లవకారులు తెస్తూనే ఉన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నుంచి అది సాయుధ పోరాట ప్రధాన రూపమైన వర్గపోరాటం అయింది. నాయకత్వ ద్రోహంతో ఆ పోరాట విరమణ తరువాత పదహారు సంవత్సరాలు పార్టీ రివిజనిజానికి గురైంది. అధికార మార్పిడి జరిగిన దేశం అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దళారీ దోపిడీకి గురైంది. ఈ మధ్యకాలంలో 1962లో చైనాతో యుద్ధం వచ్చింది. ఈ యుద్ధ నేపథ్యంలో కమ్యూనిస్టు శ్రేణులతో సహా ఇప్పటి వలెనె జాతీయోన్మాదం వెర్రితలలు వేసింది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలికకు అది కూడా ఒక కారణమైంది.
ఈ జాతీయోన్మాదానికి నిరసనగా రివిజనిజం, కుహనా దేశభక్తిపై అసహ్యంతో చారు మజుందార్ ʹచైనా చైర్మన్ మన చైర్మన్ʹ అనే పిలుపు ఇచ్చాడు. అది మితవాదం పట్ల రోతతో వచ్చిన ఒక అతివాదమే. దాన్ని ఖండించడానికి వర్గ శత్రు నిర్మూలనను వ్యక్తి నిర్మూలనగా చిత్రించడం కూడా అతివాదమే అవుతుంది.
చారు మజుందార్ ఇంతకన్నా కొన్ని మౌలిక అంశాలు ప్రతిపాదించాడు. ఆయననే కాదు, ఆయన నాయకత్వంలో యాభై ఏళ్ల క్రితం గర్జించిన నక్సల్బరీ వసంత మేఘం భారతీయ సామాజిక వ్యవస్థను, రాజ్య స్వభావాన్ని, ఉత్పత్తి సంబంధాలను నిర్వచించింది. ఆదివాసులు, దళితులు, పీడిత ప్రజలు భూమిని స్వాధీనం చేసుకోవాలంటే గెరిల్లా పోరాటం చేయాలని, ఆ పోరాట ఫలితాలను స్థిరపరుచుకోవాలంటే రాజ్యాధికారానికి రావాలని నక్సల్బరీ ప్రతిపాదించింది. అది నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే సాధ్యమనే లక్ష్యాన్ని ప్రకటించింది.
ʹʹప్రజల మొబిలైజేషన్ మీద అంతో ఇంతో ఒప్పుకోదగ్గ స్థాయిలోనే ఉద్యమాలు చేపడుతున్నాయనడానికి బస్తర్‌లో జరుగుతున్న ఆదివాసిల ఉద్యమం అద్దం పడుతుందిʹʹ అని ఒప్పుకున్నప్పుడు అది నక్సల్బరీ పంథా ప్రతిపాదించిన అన్ని అంశాలను ఒప్పుకోవడమే అవుతుంది. అది ఏమిటంటే, ఈ అర్ధవలస, అర్ధ భూస్వామ్య దళారీ నిరంకుశ వ్యవస్థను కూలదోయాలంటే 1967 నాటికే నిలువ నీరైపోయిన, సాలెగూడుగా మారిన పార్లమెంటరీ వ్యవస్థను కూలదోసి, రైతాంగ విప్లవాన్ని విజయంవంతం చేయాలి. దానికి ప్రాతిపదిక భూమిలేని పీడిత ప్రజలు, రైతాంగం, ముఖ్యంగా దళితులు, ఆదివాసులు భూమిని స్వాధీనం చేసుకోవాలి. భూస్వాముల నుండి, పెత్తందారుల నుండి, వాళ్లకు అండగా వచ్చే రాజ్యం నుంచి గ్రామాలను విముక్తం చేసుకోవడానికి గెరిల్లా పోరాటం చేయాలి. ఇది దీర్ఘకాల పోరాటంగా ఉంటుంది. దీనికి ప్రధాన రూపం సాయుధ పోరాటమే. దీని చుట్టూ ప్రజాసంఘాల నిర్మాణం, ప్రజా ఉద్యమాలు, పోరాటాలు ఉంటాయి.
ఇవాళ బస్తర్‌లో పదివేల సంఖ్య కలిగిన చేతనా నాట్యమంచ్, ఒక లక్ష పైగా సభ్యత్వం ఉన్న దండకారణ్య క్రాంతికారీ మహిళా సంఘటన్ వంటి సంస్థలే కాదు, ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా వేల సంఖ్యలో ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఉన్నది. భూంకాల్ మిలిషియాగా పిలుచుకునే పీపుల్స్ మిలిషియా ఉన్నది. ఐక్య సంఘటన ప్రభుత్వం ఉన్నది.
చారు మజుందార్ రెలెవెన్స్ ఎందుకంటే ఈ నూతన ప్రజాస్వామిక విప్లవ పంథాను నిర్దేశించినందుకు. పార్లమెంటరీ రాజకీయాల పేరుతో అమలవుతున్న దళారీ వ్యవస్థను సాయుధంగా కూలదోయమని చెప్పడమే కాకుండా, రివిజనిజం నడ్డి విరగ్గొట్టాలని చెప్పినందుకు. స్వయంగా బెంగాల్లో సిపిఎం సిలిగురి డివిజన్ కార్యదర్శిగా ఉంటూనే 1965-67 దాకా తెరాయ్ దస్తావేజులు రచించి ఆ పని తన నాయకత్వంలో నక్సల్బరీలో చేసినందుకు. అక్కడ పదివేల మందికి పైగా సంతాల్ ఆదివాసులను సమీకరించి, అక్కడి నుంచి దేశంలో ఒక రైతాంగ విప్లవాన్ని ప్రారంభించినందుకు. ఆ రైతాంగ విప్లవ మార్గాన్ని, లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించినందుకు.
ఆయుధాలు పట్టడం ప్రధానం కాదని వర్గపోరాటం లక్ష్యంగా పనిచేసే ఏ కమ్యూనిస్టు పార్టీ చెప్పదు. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయంవంతం అయ్యేదాకా అదే ప్రధాన పోరాట రూపం అవుతుంది. దాని చుట్టూ ప్రజా సమీకరణ ఉంటుంది. మన వంటి దేశంలో ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటాలు, జాతుల విముక్తి పోరాటాలు, అస్తిత్వ పోరాటాలు అందులో భాగంగానే కొనసాగుతాయి.
అందుకే నక్సల్బరీ ఆదివాసుల పోరాటం కలకత్తా జాదవ్‌పూర్ మొదలు ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు వరకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, బుద్ధిజీవులు, మేధావులు, కవులు, కళాకారులు అందరినీ ప్రభావితం చేసింది. పునాది ఉపరితల రంగాలన్నిటినీ ఒక కుదుపు కుదిపింది. విగ్రహ విధ్వంసం పేరుతో విగ్రహ మాత్రంగా మిగిలిన విలువలను, ఆదర్శాలను ఆచరణలోకి తెచ్చింది.
కనుక అది ఒక చారు మజుందార్ త్యాగనిరతి, క్రమశిక్షణ, దృఢవిశ్వాసం మాత్రమే కాదు. ఇవాళ్టికీ దేశవ్యాప్తంగా ఈ నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన కోసం పోరాడుతున్న, ప్రాణాలర్పిస్తున్న ప్రతి ఒక్కరి త్యాగనిరతి, క్రమశిక్షణ, దృఢవిశ్వాసాలు కూడా. ఇది చారు మజుందార్ విషయంలోనే కాదు. అంబేడ్కర్ విషయంలో కూడా వ్యక్తిగతమైన సైద్ధాంతిక నిష్కపటత్వం కాజాలదు. అట్లా అనడం వాళ్ల ప్రభావాన్ని నిరాకరించడం అవుతుంది.
చారు మజుందార్ పీడిత వర్గం గురించి ఆలోచించాడు. ఆ లక్షణాలు ఆ పీడిత వర్గానికంతా వర్తిస్తాయి. అంబేడ్కర్ లక్షణాలు ఆయన ప్రాతినిధ్యం వహించే నిర్మాణమై, ఐక్యమై, పోరాడదలుచుకున్న సమాజానికంతా వర్తిస్తాయి. సమస్యల్లా అంబేడ్కర్ ప్రతిపాదించిన అంశాలకు పరిష్కారం పార్లమెంటరీ రాజకీయాల్లో చూసాడు. ఆయన రాజ్యాంగ రచన కాలానికే అది సాధ్యం కాని స్థితి దేశంలో ఉంది. అది ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం, ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ విప్లవం నాటికే రిలెవెంట్ అయి సామ్రాజ్యవాద దశ నాటికి కాలం చెల్లినవి అయిపోయినవి. అవి బూర్జువా నియంతృత్వంగా మారినయి. వాటి స్థానంలో కార్మికవర్గ నియంతృత్వాన్ని అమలు చేసే సిద్ధాంతం బోల్షివిక్ విప్లవ కాలానికే వచ్చింది.
అంబేద్కర్ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు కాని నాడు దాన్ని తగలబెట్టడానికి అందరికన్నా ముందే ఉంటానన్నాడు. సామాజిక, ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వలేని రాజకీయ స్వేచ్ఛ అది స్వేచ్ఛ కాదన్నాడు. ఒక రాజకీయార్థిక వ్యవస్థలోనే కాదు, ఆయన హిందూ వ్యవస్థలో కూడా ఇమడలేకనే బౌద్ధాన్ని స్వీకరించాడు.
చారు మజుందార్ సిపిఐ, సిపిఎం చుట్టూ తిరగడం ఏమిటి? 1964లో సిపిఐ చీలినప్పుడు వర్గపోరాటం కొరకే చీలిందని, శ్రేణులు, ప్రజలు ఆకాంక్షించినట్టుగానే చారు మజుందార్ ఆకాంక్షించాడు. 1965లో సిపిఎం నాయకత్వమంతా జైళ్ల పాలయినప్పుడు ఆయన వర్గపోరాట సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ దస్తావేజులు రచించడం ప్రారంభించాడు. సిలిగురి డివిజన్ కార్యదర్శిగా అందుకు కృషి ప్రారంభించాడు. 1967 నక్సల్బరీ నాటికి ఎనిమిది దస్తావేజులు పూర్తి చేయడమే కాదు, రివిజనిజంపై మాత్రమే కాదు దళారీ వ్యవస్థపై కూడా సాయుధ తిరుగుబాటు ప్రారంభించాడు. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని దిద్టుబాట్లతోనైనా సరే అది ఇవాళ్టికీ కొనసాగుతున్నది.
చారు మజుందార్ నక్సల్బరీ విస్ఫోటనం తరువాత విద్యార్థి, యువతరానికి త్యాగాలకు, బలిదానాలకు పిలుపునిస్తూ ʹగ్రామాలకు తరవి వెళ్లమనిʹ పిలుపు ఇచ్చాడు. అట్లా గ్రామాలకు వెళ్లినప్పుడు ఎస్.సి. వాడలలో (అప్పటికి దళిత అనే మాట ఇంత ప్రాచుర్యంలోకి రాలేదు) నే నివసించి, ప్రతి ఇంటికి తిరిగి జోలెలో అన్నం అడుక్కుని, ఆ క్రమంలో వాళ్లందరినీ ఒక చోట చేర్చి, వాళ్లకు విప్లవ రాజకీయాలు చెప్పాలని, వాళ్ల నుంచి గ్రామాల్లో భూసంబంధాల గురించి సమాచారం సేకరించాలని చెప్పాడు. గ్రామాలకు తరలండి అని 1978 ఫిబ్రవరి (వరంగల్), జూన్ (గుంటూర్) నెలల్లో రాడికల్ విద్యార్థి, యువజన సంఘాల సభల్లో ఇచ్చిన పిలుపు ఫలితమే జగిత్యాల జైత్రయాత్ర, ఆదిలాబాద్ - కరీంనగర్ రైతాంగ పోరాట ఫలితాలు, దండకారణ్య పర్స్పెక్టివ్, జనతన సర్కార్ ఏర్పాటు. వీటిలోని లోటుపాట్ల గురించి, తప్పొప్పుల గురించి, వెలుగు నీడల గురించి ఎంత చర్చయినా చేయవచ్చు. కాని నూతన ప్రజాస్వామిక విప్లవం మాత్రమే దళితులు, ఆదివాసులు మొదలైన పీడిత ప్రజల ముందు ఉన్న ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయ మార్గం.
చారు మజుందార్ చెప్పిందే ఆచరణలోకి రావడానికి పదేళ్లు ఎందుకు పట్టింది అని ప్రశ్నించవచ్చు. నక్సల్బరీ ఎజెండా మీదికి తెచ్చిన ప్రజా పంథా ఆచరణలో అమలు కాలేదు. స్వీయాత్మతకకు గురైంది. అందులో నాయకత్వం స్వీయాకాంక్షల లోపమే ఎక్కువ. నక్సల్బరీ, శ్రీకాకుళాల సెట్‌బ్యాక్ తరువాత ఆత్మ (స్వీయ) విమర్శ చేసుకుని ప్రజాపంథాను ఆచరించకపోవడం వల్లనే ఈ సెట్‌బ్యాక్ ఏర్పడిందని గ్రహించారు. ప్రజాపంథాను సుధృడంగా అమలు చేసే క్రమంలో ప్రజాసంఘాల, పోరాటాల నిర్మాణం చేశారు. దాని ఫలితమే ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతున్న ప్రజాపంథా జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలతో ప్రారంభమైంది. అంతకు ముందే తెలంగాణ ప్రాంతీయ కమిటీ సమావేశంలో ʹవిప్లవానికి బాటʹ - రోడ్ టు రెవల్యూషన్ - రూపొందించుకొని ఎమర్జెన్సీ కాలమంతా గ్రామాల్లో భూసంబంధాల అధ్యయనం వల్ల సాధ్యమైంది.
కనుక ఆత్మవిమర్శ అనేది ఒక వెక్కిరింతగానో, వ్యక్తుల పట్ల దురుద్దేశంతో చేసేదిగానో కాకుండా కమ్యూనిస్టు ఆచరణలోను, ఆలోచనలోను ఒక అనివార్యమైన సంస్కృతిగా చూడాల్సి ఉంటుంది. మనిషి తప్పు చేస్తాడు, చేస్తుంది. కాని మనిషి మాత్రమే దిద్దుకుంటాడు, దిద్దుకుంటుంది. స్వీయ విమర్శను, దిద్టుబాటును వెక్కిరించేవాళ్లు తప్పువైపు ఎల్లప్పటికీ చూపే వేలు తమవైపే చూపిస్తుంటుందని గ్రహించలేరు.
Type in English and Press Space to Convert in Telugu |
నయీం ఎన్కౌంటర్... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యంహతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే... |
వర్గ సమాజం ఉన్నంత కాలం వర్గ పోరాటం ఉంటుందిమహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవానికి యాబై నిండిన సందర్భంగా ... కామ్రేడ్ వరవరరావు సాంస్కృతిక విప్లవం లేవనెత్తిన మౌళిక అంశాలను విశ్లేషిస్తు... |
సోషలిజమే ప్రత్యామ్నాయం : వరవరరావుఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్రపంచానికి సోషలిజమే ప్రత్యామ్నాయమని మరోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవసరముంది................. |
చెరసాలలో చామంతులు - 2అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద...... |
దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటుతెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను... |
ఇప్పుడు... దండకారణ్య సందర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులుదండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను... |
Condemn the Nilambur Fake Encounter : RDFRDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the... |
ప్రభాకరుడే గంగాధరుడుప్రభాకర్ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్ఫర్మేషన్)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ... |
Bhoomaiah, Kishta Goud, Bhabani Da and Sumanta - Down Memory LaneOn 25th December early morning hours before unlocking the cells and barracks, the news spread that in the wee hours of 26th December, Bhoomaiah and Kishta G... |
ఎస్సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదికఎస్సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |