సమాధన్‌కు సవాళ్లు విసరడమే మన సమాధానం

| సంపాద‌కీయం

సమాధన్‌కు సవాళ్లు విసరడమే మన సమాధానం

- వ‌ర‌వ‌ర‌రావు | 04.06.2017 12:26:54pm

ఔను, మనకు సమాధానమే కావాలి. మన పనే సవాళ్లు విసరడం. మన సవాళ్లలో మౌలికమైన సమాధానాలు ఉంటాయి. వైరుధ్యాల పరిష్కారాలు ఉంటాయి. కొత్త వైరుధ్యాలు ముందుకొస్తుంటాయి. అవి పరిష్కారమవుతూ సమాజం ముందుకు పోతూ ఉంటుంది. మనం సారాంశంలో సమాధానం వెతుక్కుంటాం. వాళ్లు రూపంలో వెతుక్కుంటారు. వాళ్లు పరిష్కారాన్ని సమస్యగా చూస్తారు. అందుకని వాళ్లకెప్పుడూ మళ్లీ సమస్యను సృష్టించడమే తెలుస్తుంది తప్ప పరిష్కారాలు దొరకవు. ముఖ్యంగా మనం వాళ్లకు సమస్యగా కనిపిస్తాం. వాళ్లకెట్లాగూ మనం సమస్యనే. ఎందుకంటే వాళ్లు శత్రువులు. పాలకవర్గాలు. దోపిడీ పాలకవర్గాలు. బహువచనంగా చెప్పినప్పుడు భూస్వామ్యమని, సామ్రాజ్యవాదమని, ఈ వ్యవస్థ దళారులని ఇట్లా చెప్పవచ్చు గాని, నిజానికి వాళ్లు బహువచనం కూడా కాదు. ఒకే కేంద్రీకృత స్వార్థానికి ఆయా దశల్లోని వ్యక్తీకరణలైన, సారభూతమైన రూపాలు వాళ్లు.

స్వార్థం శిరస్సును గండ్రగొడ్డలితో నరికి తన నుదుట తాను మరణశాసనం రాసుకొని, పేరు, ఊరు, వ్యక్తిగత ఆస్తి, గుర్తింపే రద్దు చేసుకొని, సేవతో, త్యాగంతో, సాహసంతో, ప్రజావ్యూహంతో, శ్రమైక జీవన సౌందర్యంతో, పోరాటమే జీవితంగా, చలనమే స్వభావంగా, ఘర్షణయే నిత్యకృత్యంగా మార్పువైపు పయనించే మనల్ని అర్థం చేసుకోవడం ఆ స్వార్థానికి సాధ్యం కాదు.

ʹమా భూమిʹ నాటకంలో ఓ గ్రామీణ రైతు పాత్ర - ఈ భూమి తలకిందులుగా నడుస్తున్నది. దానిని సరిచేయడమే విప్లవమంటుంది. ఈ భూమిని సరిచేసే పని ఈ స్వార్థ వ్యవస్థకు ఒక భూకంపం వలె కనిపిస్తుంది. ఒక మందుపాతర వలె కనిపిస్తుంది. ఒక దాడి వలె కనిపిస్తుంది. శ్రమ, సమష్టి భావన తనకు తాను వ్యక్తం కావడం హింసవలె కనిపిస్తుంది. హింసయే స్వభావం గల వ్యవస్థలో ప్రతిహింసయే చైతన్యమైన ప్రజారాశుల సమాధానం దౌర్జన్యంగా కనిపిస్తుంది.

సుకుమాలో ప్రజా గెరిల్లా విముక్తి సైన్యం సిఆర్‌పిఎఫ్‌ జవానులపై దాడి చేసిన తరువాత చాలా చర్చ జరుగుతున్నది. చింతల్‌నార్‌ కంటే ఎక్కువే జరుగుతున్నది. బహుశా చిదంబరం నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌ నాటికి, మన్మోహన్‌ సింగ్‌ నుంచి మోడీ నాటికి ప్రపంచ బ్యాంక్‌ విధించిన షరతుల గడువు వేగిరం అవుతున్నందుకు కావచ్చు. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం ఏర్పడ్డప్పటి (2000) నుంచి బహుళజాతి కంపెనీలతో, బడా కంపెనీలతో చేసుకుంటున్న మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్స్‌ (ఒప్పందాలు) గడువు ఒత్తిడి చేస్తున్నందు వల్ల కావచ్చు. సామ్రాజ్యవాద కాషాయీకరణ మిలాఖతులు మరింత గాఢతరం అవుతున్నందు వల్ల కూడా కావచ్చు.

సందర్భమేదైనా, చీమలు పెడుతున్న పుట్టల్లోకి సరీసృపం ఎందుకు ప్రవేశించాలనుకుంటున్నది? ఎందుకు దండకారణ్యమంతా ఒక ఆక్టోపస్‌ ఆవరించాలనుకుంటున్నది? ఎందుకు ప్రకృతిలోని, మానవ శ్రమలోని ఆకుపచ్చ సారాన్నంతా ఒక గ్రీన్‌హంట్‌ హరించాలనుకుంటున్నది? ఆదిమ మానవుడు, మానవి నుంచే నేర్చుకున్న అనాది జీవన రూపం వేటను వికృతపరిచి రూజ్‌వెల్ట్‌ కాలం నుంచి మన కాలం దాకా నాగరిక ప్రపంచం సాల్వాజుడుం పేరుతోనో, గ్రీన్‌హంట్‌ పేరుతోనో శాంతి, ఆకుపచ్చదనాల విశేషనాలు తగిలించుకొని అశాంతిని, విధ్వంసాన్ని సృష్టించాలని చూస్తున్నది ?

ఇక్కడ ఒక్క మాటకైనా సాధారణ ప్రజలు తమ కామన్‌సెన్స్‌తో లేదా వివేకంతో స్వీకరించే అర్థం ఉందా?

సుకుమాలో మావోయిస్టు దాడి తరువాత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వచ్చి ఒక ʹసమాధాన్‌ʹ ప్రకటించి పోయాడు. అంటే మావోయిస్టులు సమస్య, మోడిత్వ సమాధానం అన్నమాట.

ఇదే తిరగేసి చెప్పడం. ఇదే తలకిందుల సమాధానం. పోనీ కాసేపటికి ఇది సమాధానమేనా? హిందూ హిందుత్వ హిందీలో సమాధానమా? ఇంగ్లిష్‌ సంక్షిప్త అక్షరాల కూర్పుతో సంస్కృతీకరింపబడిన (SAMADHAN) సమాధానమా?

పీడిత వర్గాల నుంచి వ్యక్తిగత ఆస్తి, స్వార్థపూరితంగా సముపార్జించుకునే క్రమంలో దోపిడీ వర్గంలో చేరే వాళ్ల స్వభావం గురించి మొట్టమొదటిసారిగా డా. అంబేడ్కర్‌ సంస్కృతీకరింపబడడం అనే మాట వాడాడు. అంటే బ్రాహ్మణీయ భావజాలాన్ని ఆస్తి పొందే క్రమంలో బ్రాహ్మనేతర వర్గాలు బ్రాహ్మణీయ భావజాలాన్ని అనుకరించే విధానాన్ని ఆయన సంస్కృతీకరించడం అన్నాడు. తరువాత కాలంలో మానుష శాస్త్రవేత్త ఎం.ఎన్‌. శ్రీనివాస్‌ దాన్ని చాలా ప్రచారం చేసాడు.

మోడిత్వ రాజకీయాలు ఇందుకు సరియైన ఉదాహరణ. మోడిత్వలో దాని హంతకాభివృద్ధి స్వభావం వల్ల ప్రపంచీకరణ ఉంది, కాషాయీకరణ ఉంది. సుకుమాకు ʹసమాధాన్‌ʹ అటువంటిదే. పార్లమెంటరీ రాజకీయాల్లో హంతకుడు పాలకుడుగా ఇచ్చే సమాధానం.

ʹSʹ అంటే స్మార్ట్‌ లీడర్‌షిప్‌ (చురుకైన నాయకత్వం).

ʹAʹ అంటే అగ్రెసివ్‌ స్ట్రాటజీ (దూకుడు వ్యూహం).

ʹMʹ అంటే మోటివేషన్‌, ట్రెయినింగ్‌ (ప్రేరణ, శిక్షణ... ఇమడడానికే తప్ప ఇది ఒక్క మాట కాదు. రెండు మాటలు అని తెలుస్తూనే ఉంది.)

ʹAʹ అంటే యాక్షనబుల్‌ ఇంటిలిజెన్స్‌ (కార్యాచరణకు ఉపయోగపడే తెలివితేటలు. ఇవి కూడా ఒకమాటలో ఇమడని రెండు మాటలు.)

ʹDʹ అంటే డాష్‌ బోర్డ్‌ బేస్డ్‌ ఇండికేటర్స్‌ (చేతికి అందుబాటులో ఉండే సూచికలు. అస్సలు కుదరని సంక్షిప్తీకరణ.)

ʹHʹ హార్నెసింగ్‌ టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం. నిజానికి ప్రాధాన్యం ʹటిʹ - టెక్నాలజీకి, హెచ్‌ - హార్నెసింగ్‌కి కాదు).

ʹAʹ అంటే యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ ఈచ్‌ థ్రెట్‌ (ప్రతి సవాలుకు కార్యాచరణ ప్రణాళిక).

ʹNʹ అంటే నో యాక్సెస్‌ టు ఫైనాన్సింగ్‌ (ఆర్థిక వనరులను అడ్డగించడం).

మీడియా వాళ్లకు చివరి మాట ఒక్కటి బాగా అర్థమైనట్టున్నది. మావోయిస్టులకు బయటి నుంచి అందుతున్న ఆర్థిక వనరులన్నీ దిగ్బంధించి, వాళ్ల రెక్కలు విరవాలని ప్రభుత్వం భావిస్తున్నదని రాసాయి. అట్లాగే, రోడ్డు నిర్మాణానికి రక్షణగా వెళుతున్న సిఆర్‌పిఎఫ్‌ బలగాలపై ఆయుధాల కోసం దాడి చేసారు గనుక ఆ ఆయుధాలలో జిపిఎస్‌ ఏర్పాటు చేసి తద్వారా అవి ఎక్కడికి చేరాయో తెలుసుకోవాలని ప్రభుత్వ వ్యూహం అని మరొక అంశం రాసాయి.

అంటే, ప్రభుత్వాలకు, రాజ్యహింసను తమ ప్రయోజనం కోసం బలపరుస్తున్న కార్పొరేట్‌ మీడియాకు కావల్సింది సిఆర్‌పిఎఫ్‌ దుస్తుల్లో ఉన్న మనుషుల ప్రాణాలు కాదు. వాళ్ల చేతుల్లోని ఆయుధాలు కావాలి. ముఖ్యంగా అవి చేసిన శ్రామికుల, శ్రామికవర్గ శక్తుల చేతుల్లోకి అవి పోవడం వాళ్లకు చాలా ప్రమాదకరం.

ఆ మాటకొస్తే సిఆర్‌పిఎఫ్‌లో ఉన్న జవాన్‌లు కూడా అటువంటి ప్రజల, అటువంటి శ్రామికవర్గాల బిడ్డలే. కాని వాళ్ల చేతుల్లోని వాళ్ల ఆయుధాల వలె వాళ్లు కూడా పాలకవర్గాల పనిముట్లుగా ఉపయోగపడుతున్నారు.

పనిముట్లయితే ప్రమాదం లేదు. పనిముట్లతో జరిగే ఉత్పత్తిని ప్రజలు తరువాత స్వాధీనం చేసుకోవచ్చు. ఆయుధాలు కావడమే ప్రమాదం. కనుక, అవి చేసిన ప్రజల చేతుల్లోకి పోవడానికి మామూలుగా మనం చెప్పే ఆత్మ (స్వీయ) రక్షణ, ఎదురు దాడికి పూనుకుంటే తప్ప ప్రజల, ప్రజలపక్షం వహించే విప్లవకారుల ప్రాణాలు దక్కవు. విప్లవకారుల ప్రాణాలు దక్కవు అంటే అది విప్లవానికి ప్రమాదం. విషాదమేమంటే ఎదురుపడి దాడి చేయాల్సి వచ్చేది కూడా పాలకవర్గాల కూలీ తీసుకుంటున్న యూనిఫారాల్లో ఉన్న కష్టజీవుల బిడ్డలే. సమస్యల్లా వాళ్లను నడిపిస్తున్న దోపిడీ వర్గాల వ్యూహంలో ఉన్నది.

పొందికలేని, ఏమాత్రం అతకని, క్లుప్తత లేని, ఒక మాటనే సూచించని ఇంగ్లిష్‌ అక్షరా (ఆల్ఫబెట్‌) లతో అల్లిన ఈ సంస్కృతీకరింపబడిన హిందీ మాట - మాట మాత్రమే కాదు, ఉద్దేశం కూడా ఎక్కడైనా మాట వరుసకైనా ప్రజల ప్రయోజనం సూచిస్తున్నదా? ఈ వ్యూహంలో ఎక్కడైనా రూపానికైనా ఆదివాసి ప్రజా జీవితాన్ని మెరుగుపరిచే ఒక్క మాటైనా ఉన్నదా? అంతా యుద్ధ వ్యూహం. గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ వ్యూహం. ప్రజల మీది యుద్ధ వ్యూహం. కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనం కోసం వ్యూహం. దళారీల యుద్ధ వ్యూహం.

ఇందుకోసం చురుకైన నాయకత్వం, ఇందు కోసం దూకుడు వ్యూహం, ఇందుకోసం ఆయుధాలు, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం. అంతా రాజకీయార్థిక దృష్టి. దోపిడీ పాలకవర్గాల రాజకీయార్థిక దృష్టి. ఎక్కడా ప్రజాకీయాలు లేవు.

తొలి సంతాల్‌ తెగలు ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన దగ్గర నుంచి రాజ్యాంగ రచన దాకా సామ్రాజ్యవాదాన్ని, పెట్టుబడిని, రాజ్యాన్ని, కేంద్రాన్ని నిలువరించి, ప్రశ్నించి, ధిక్కరించి సాధించిన ఫలితాల రూపమైనా రాజ్యాంగ రచనలో కనిపించవచ్చు. నక్సల్బరీ నుంచి నేటి దాకా ఆ పోరాట కొనసాగింపు ఎన్నో చట్టాల రూపంలో వ్యక్తం కావచ్చు. పెసా కావచ్చు, అడవి చట్టాలు కావచ్చు.

కాని ఇప్పుడు ఈ ʹసమాధాన్‌ʹ చూస్తే ఇవేవీ అటువంటి సమాధానాలు కాలేకపోయినవి. బి.డి. శర్మ, అరుంధతీరాయ్‌ పేర్కొన్నట్లు, అభిప్రాయపడ్డట్లు ఆదివాసులకు, రాజ్యాంగమే ఒక సంకెలగా మారిందా? ఈ రిపబ్లిక్‌ ఒక వాగ్దానాల ఉల్లంఘనలోనే అమలవుతూ తన బిడ్డలను తానే చంపుకుంటున్నదా? ఆ చంపుకోవడానికి ఈ ʹసమాధాన్‌ʹ వ్యూహ రచనా?

విప్లవకారులు సమాధానాలు ఇస్తున్నారు. ప్రజలు విప్లవం రూపంలో తమ సమాధానాలు వెతుక్కుంటున్నారు. స్వపరిపాలనలో, స్వావలంబనలో సమాధానాలు వెతుక్కుంటున్నారు. జల్‌, జంగల్‌, జమీన్‌, ఇజ్జత్‌లను కాపాడుకోవడం జనతన సర్కార్‌లో సాకారం చేసుకుంటున్నారు. అందుకు ఈ చట్టాలు, ఈ శాసనాలు, ఈ రాజ్యాంగం, ఈ ప్రభుత్వాలు కాదు, వీటన్నిటినీ రద్దు చేసే ప్రజాయుద్ధంతో. ఆ ప్రజాయుద్ధాన్ని ప్రజలపై యుద్ధానికి సమాధానంగా నిర్వహిస్తున్న ఉక్కు శిక్షణ గల పార్టీ, నాలుగు వర్గాల ఐక్య సంఘటన, స్వపరిపాలన, స్వావలంబన ఫలితాలను పరిరక్షించే ప్రజా గెరిల్లా విముక్తి సైన్యం, భూంకాల్‌ మిలిషియాతో పరిరక్షించుకుంటున్నారు. ʹసమాధాన్‌ʹకు సరియైన సమాధానం ఇస్తున్నారు.

ఆదివాసులకు రాజ్యం భాష ఏమైనా అర్థం అవుతుందా? రోడ్డంటే ఏమిటి? కాలిబాటనా, మార్గమా, రహదారా. ఆ బాటపై, ఆ దారిపై మనుషులు నడుస్తారా, వాహనాలు నడుస్తాయా? రోడ్డు ఎందుకేస్తున్నారు? రోడ్డు ఎందుకు తెస్తున్నారు? రోడ్లు వేయడానికి రక్షణ అవసరమా? ఎవరి నుంచి రక్షణ?

దేశ సరిహద్దుల్లో పొరుగు దేశాల నుంచి రక్షణ కోసం రోడ్డు నిర్మాణంలో ఉన్నవాళ్లకు రోడ్డు నిర్మాణ కార్మికులను రక్షించే ఒక సైనిక బలగం ఉంటుంది. అదీ అర్థరహితమే. ఇరుగు పొరుగు దేశాలను శత్రువులుగా భావించడమే ఇరుగు పొరుగు మనుషులను శత్రువులుగా భావించడమనే స్వార్థం నుంచి, ఆత్మవిశ్వాస రాహిత్యం నుంచి పుట్టుకొచ్చే ఒక వికృత భావన. ఒక నైసర్గికతను, ఒక ప్రాకృతికతను కోల్పోవడం అనేది వ్యక్తిగత ఆస్తి, అధికారం, స్వార్థంతో సాధించడం నుంచి వస్తుంది. మరి ఇక్కడ ఆదివాసి గూడాల్లోకి రోడ్డు? కేవలం ఖనిజాలను దోచుకొని పోవడానికి, భారీ నిర్మాణాలు చేపట్టడానికి కార్పొరేట్‌ కంపెనీలు రావడం కోసం రోడ్డు వస్తుంది. రోడ్డు దోపిడీ స్వభావ భౌతిక వాహికగా వస్తున్నది. శత్రువు ఆదివాసులకు రోడ్డు రూపంలో కనిపిస్తున్నాడు. పెట్టుబడికి, పెట్టుబడికి అండగా ఉండే సైన్యానికి రోడ్డు ఒక రాజమార్గం. అది గూడాల్లో అల్లుకపోయిన కాలిబాటలు మానవ సంబంధాల సమాహారం కాదు. అది ప్రజల మీద విరుచుకుపడే దాడి.

ప్రజల కాళ్లకింది నేలను, ఆ నేల కింది ఖనిజాలను, నేల మీది నీళ్లను, చెట్లను, పర్వతాలను, లోయలను, గాలిని, వెలుగును, సమస్త జీవన సారాన్ని హరించుకుపోవడానికి వస్తున్న పెట్టుబడికి ప్రజల శ్రమతో పరుస్తున్న కారుచీకటి తారుతివాచీ అది. ఇంక మట్టిలోని జీవకణాలు తలయెత్తి చిగురించకుండా దట్టంగా ఉక్కుపాదాల కింద, ఉక్కు చక్రాల వాహనాల కింద పరుచుకున్న సిమెంటు నిర్మాణం అది. దాన్ని చూస్తేనే మట్టి మనుషులకు తాము కోల్పోయిందేమిటో అర్థం అవుతుంది. అడవిలోని కాలి బాటన ఆహారాన్వేషణ కోసం నడిచే మట్టి మనుషులకు ఏ మానవ సారం లేని రూపమేదో తమ గుండెల్లోకి దూసుకు వస్తునట్లుగా ఈ రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు మీద బస్సులో వాళ్లు ప్రయాణం చేయరని కాదు. షేర్డ్‌ ఆటోలల్లో, ఏవో అవసరాలకు చిన్న చిన్న పట్టణాలకు, పొరుగూర్లకు వెళ్లరని కాదు. ఇటీవల కాలంలో ప్రజల ప్రయాణాలకే ఉపయోగించే జీపుల్లో మనుషుల వల్లె కాకుండా సరుకుల వలె కుక్కబడి తిరగడం లేదని కాదు. కాని ఈ క్రమమంతా తిరిగి గూడాలకు చేరేదాకా చుట్టూ ఉక్కుశిరస్త్రాణాలతో, మెరికే ఆయుధాలతో వందలుగా తిరిగే సైనిక పటాలాలు, వాటి రక్షణలో వచ్చే కార్పొరేట్‌ వాహనాలే తిరిగి గూడాలకు అంటు చేరితే వాళ్లకు రాత్రిపూట పీడకలలు. ఈ రోడ్డు వెన్నెల కింద, చుక్కల కింద వాళ్ల నైసర్గిక స్వప్నాలను హరించిన ఒక పరాయీకరణ రూపం. అది మనకు అర్థం కావడం కష్టం. అర్థమైనా మనం జీర్ణించుకోవడం కష్టం.

ఆదివాసుల కోసమే అయితే మరి వాళ్లు ఆహ్వానించే వాళ్లే కదా! ఆదివాసులకు ఇష్టముండదని దళారులకు తెలుసున్నమాట. ప్రతిఘటిస్తారని కూడా తెలుసున్నమాట. అందుకే రోడ్డు నిర్మాణం చేసే వాళ్లకు అండగా రకరకాల అర్ధసైనిక బలగాలు. పెట్టుబడి, సైన్యం ప్రయాణం చేసే ఒక శత్రువు సాధనం ఆదివాసి ప్రాంతాల్లో రోడ్డు. ఇవాళ దండకారణ్యంలో ఒక్క రోడ్డే కాదు, సంత, బడి, ఆసుపత్రి అన్నీ తమ అర్థాలు కోల్పోవడం మాత్రమే కాదు, వ్యతిరేక అర్థంలో అమలవుతున్నాయి. పోలీసు క్యాంపు పక్కన సంత ఉంటుంది. బడిలో సైన్యం ఉంటుంది. ఆసుపత్రిలో సైన్యం ఉంటుంది. సంతకు ఆదివాసులు తమ అవసరాలు తెచ్చుకోవడానికి పోతారని ప్రభుత్వం నమ్మదు. గూడెల్లో తమ ఇంటికి వచ్చే అన్నల కోసం సరుకులు తేవడానికి పోతున్నారని, లేదా సంతకు వచ్చే అన్నలకు సమాచారం ఇవ్వడానికి పోతున్నారని అనుమానిస్తుంది. నమ్ముతుంది. అందుకని లోతట్టు గూడాల నుంచి సంతలను తొలగించి రోడ్డు పక్కన, పోలీసు క్యాంపుల పక్కన ఏర్పాటు చేస్తుంది.

భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉండే ఇంటికే రేషన్‌ తీసుకుపోతున్నారా? ఎంత రేషన్‌ తీసుకుపోతున్నారని స్థనశల్య పరీక్ష చేస్తుంది పోలీసు క్యాంపు. అవును, స్థనశల్య పరీక్షే. దండకారణ్యంలో ఏ ఆదివాసి స్త్రీ ఈ పరీక్ష నుంచి తప్పుకోలేదు. ఇది బతికున్న వాళ్ల గురించి. సామూహిక లైంగిక అత్యాచారానికి గురై చనిపోతున్న వాళ్లెందరో. ఇవాళ ఇది ఒక పురుష వాంఛ నుంచి వ్యక్తమయ్యే హింసా రూపం కాదు. ఇది రాజ్యహింసలో భాగం.

ఇరాన్‌లో విప్లవ మహిళలు మనుషులపై రాజ్యం అమలు చేసే హింసా దౌర్జన్యాల రూపాలలో అదనంగా మహిళలపై మరొక హింసా రూపంగా చూడడంగా విప్లవ క్రమంలో నేర్చుకున్నట్లుగానే ఇవాళ దండకారణ్యంలో పోరాటంలో సగమైన స్త్రీలు నేర్చుకుంటున్నారు. అందుకే మరింత కసిగాను, మరింత కక్షగాను ఇవాళ రాజ్యం దాన్ని ఇక్కడ అమలు చేస్తున్నది.

గ్రామాల్లో విద్యుత్తు ఉండదు. కనీస జీవన ప్రమాణాలకు అవసరమైన ఏ మౌలిక సౌకర్యమూ ఉండదు. ఇవాళ ప్రభుత్వాలకు అర్థమయ్యే మనుషుల ఉనికికి ఆధారమైన ఆధార్‌ కార్డు చేరని గూడాలు అడవిలో ఎన్నో. కాని ఈ సంతలకు ఆధార్‌ కార్డులు లేకుండా రావడం అంటే గూడాల్లో ఉన్న అన్నల కోసమో, సంతలకు వచ్చే అన్నల కోసమో. ఈ భాష నేర్పింది రాజ్యం అర్ధ సైనిక బలగాలకు.

భూమి కొరకు పోరాటం న్యాయం అనుకునేవాళ్లు, భుక్తి కొరకు పోరాటం న్యాయం అనుకునేవాళ్లు, స్వీయ ప్రాణరక్షణ కోసం పోరాటం న్యాయం అనుకునేవాళ్లు, స్త్రీలు, పిల్లలు, నిరాయుధులు, కష్టజీవులు, రైతులు తమను తాము కాపాడుకోవడం కోసం పోరాటం న్యాయం అనుకునేవాళ్లు, విముక్తి పోరాటాన్ని అర్థం చేసుకొని స్వీకరించకపోవడానికి మూలాలు ఈ వ్యవస్థలో ఉన్నాయి. వ్యక్తిగత ఆస్తి న్యాయమైనది అని భావించడంలో ఉన్నాయి.

ఈ శిక్షణ వలన అది పాలకవర్గాల విద్య కావచ్చు, న్యాయం కావచ్చు, పాలన కావచ్చు, సంస్కృతి కావచ్చు. మనం ప్రజల్ని పాలించడానికి ఎవరో ఒకరు ఉండాలనుకుంటాం. ఆయా కాలాల్లో బానిస యజమానుల నుంచి ఇప్పటి ప్రజాస్వామ్యం అని చెప్పబడుతున్న పార్లమెంట్‌ దాకా మనకివ్వబడిన ఈ శిక్షణ వలన ప్రజలు ʹఎన్నుకున్న ప్రతినిధుల సమూహమేʹ ఒక ప్రభుత్వంగా పాలిస్తుందని అనుకోవడమే తప్ప, ప్రజలు తమను తాము పరిపాలించుకునే ఒక వ్యవస్థ ఉంటుందని చారిత్రకంగా, గతితార్కికంగా ఊహించలేకపోవడం నుంచి ఈ భావనలు ఉత్పత్తి అవుతాయి. ఎంత దుర్మార్గమైన పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నా, ఆ వ్యవస్థను కాపాడుతున్న సైన్యం చేతుల్లో, పోలీసుల చేతుల్లో ఆయుధాలు ఉండడం మనకు చట్టబద్ధం అవుతుంది. వాళ్ల ఎన్‌కౌంటర్లు ఎన్ని బూటకమైనా అవి ఆత్మరక్షణ కోసమైతే సమర్థనీయం అవుతాయి గాని, ఆయుధాలు ప్రజల చేతుల్లో ఉండడం ప్రజలు అటువంటి ఎదురుదాడికి పూనుకోవడం మనకు మింగుడు పడదు.

ఒక్కమాటలో, పాల్‌ ఫ్రెయిరీ చెప్పినట్లు - మనం నేర్చుకున్నదంతా రద్దు చేసుకుంటే తప్ప మనం ప్రజల ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేం. ప్రజల స్వపరిపాలనను అర్థం చేసుకోలేం. నూతన ప్రజాస్వామ్య బీజరూపమైన జనతన సర్కార్‌ను అర్థం చేసుకోలేం. ప్రజలపై యుద్ధాన్ని ప్రజాయుద్ధం ద్వారా ఎదుర్కోవడం అర్థం చేసుకోలేం. ప్రజల ఎదురు దాడిలో స్వీయ రక్షణ ఇమిడి ఉందని అర్థం చేసుకోలేం. స్వీయ రక్షణ, ఎదురు దాడి ఒకే నాణెం రెండు రూపాలని, దోపిడీ వ్యవస్థనూ, రాజ్యాన్ని రద్దు చేయడంలో ప్రజాస్వామిక వ్యవస్థ, రాజ్యం నిర్మాణం ఉందని గ్రహించిన నాడు గాని సుకుమా వంటి సంఘటనలను వాటి సారంలోకి వెళ్లి అర్థం చేసుకోలేం.

No. of visitors : 1319
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •