జీవిత కవిత్వం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

జీవిత కవిత్వం

- పాణి | 04.06.2017 12:38:44pm

ʹసత్యమూ మాస్టారు బోధనలేమని అడుగ
నేటి విప్లవ కవుల కావ్యాలు వినిపించాʹలనే మాట విప్లవ కవిత్వ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇవాళ ఐదో దశాబ్దంలో విప్లవ కవిత్వం సాగుతోంది. సత్యం ఎంత విస్తరిస్తున్నదో, ఎలా పురివిప్పుతున్నదో, ఎన్నెన్ని అగాథ తలాల నుంచి నేలను అంటిపెట్టుకొని సాగుతున్నదో ఆ దారెంట విప్లవ కవిత్వం నిత్య వికసన తన లక్షణమని నిరూపించుకుంటున్నది.

విప్లవాన్ని ఎలా కవిత్వం చేయాలో ప్రతి సమయ సందర్భాల్లో కొంగొత్తగా విప్లవ కవులు చాటి చెప్పారు. విప్లవ కవిత్వమంటే జీవిత కవిత్వమని తన దృక్పథంతో, సృజనాత్మకతతో చిత్రికపట్టారు. విప్లవాన్ని తమ అనుభవంగా మార్చుకొని తమ గొంతుతో కవిత్వం చేయడం అనే విద్య ఈ తరం విప్లవ కవులు గొప్పగా అలవచ్చుకున్నారు. గత విప్లవ కవిత్వ సంప్రదాయాన్ని మరింత ఉందుకు తీసుకపోతోందని నోటి మాటగా చెప్పాల్సిన పని లేదు. చదివితే అనుభవమయ్యే విషయం ఇది. నిజానికి గత కవిత్వలోని అత్యున్నత సంప్రదాయాన్ని కొనసాగించడం కొంచెం ఘనంగా చెప్పుకోదగ్గ విషయమే. నిజానికి ఈ కాలానికి, ఈ నాటి భాషా, భావనా ప్రపంచంలో నిలబడి ఈ తరం మానవుల అంతర్బహిర్‌ సంక్షోభాలను ప్రతి కవి తనదే అయిన కొత్త నుడికారంతో కవిత్వం రాస్తున్నారా? లేదా? అనేదే గీటురాయి. ప్రతి విప్లవ కవి తానుగా విప్లవమనే దృక్పథం, లక్ష్యం ఆధారంగా విప్లవం సాగవలసిన ఈ సువిశాలమైన, సంక్లిష్టభరితమైన ప్రపంచాన్ని తెలుసుకోడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అనేదే విప్లవ కవిత్వ అర్థ వివరణకు ఒకానొక ముఖ్యమైన ప్రమాణం. ఈ తరం విప్లవ కవిత్వంలో ఈ లక్షణాల కోసం వెతికే కొద్ది అనేక అద్భుతాలు కనిపిస్తాయి. ఆ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఐదు దశాబ్దాలుగా విప్లవ కవిత్వం ఈ విజయాలు సాధించడం వెనుక మొత్తంగానే విప్లవ కవిత్వానికే ఉన్న అనేక విశిష్ట లక్షణాల్లో కనీసం ఒకటి రెండయినా ప్రస్తావించుకోవాలి. విప్లవోద్యమంతో ముడిపడిన కవిత్వం కాబట్టి ఆ లక్షణాలు స్థూలంగా ఈ ఐదు దశాబ్దాల కవిత్వానికి వర్తిస్తాయి.

*** *** ***

ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలో చప్పున దృష్టి మరల్చే కవితా ధోరణులు వచ్చి ఉండవచ్చు. ఆకర్షణీయమైన వ్యక్తీకరణలూ మనం విని ఉండవచ్చు. తాము రంగం మీదికి వచ్చాకనే చరిత్ర మొదలైందని దబాయించిన కవితా ధోరణులూ ఉండవచ్చు. కానీ సజీవ పరిణామానికి నిదర్శనం మాత్రం ఒక్క విప్లవ కవిత్వమే. సుమారు యాభై ఏళ్లుగా తన తొలి లక్ష్యం పట్ల ఏమరపాటు లేకుండా నిత్య పరిణామానికి లోనవుతున్నది. వందలాది మంది కవులు ఈ ఉద్యమంలో పుట్టి తమదైన సొంత వ్యక్తీకరణను సంతరించుకున్నారు. విప్లవ కవిత్వం మొదలయ్యాక వచ్చిన కవితా ధోరణులు ఎన్నో కొత్తదనాలు అందించాయి. కానీ వాటిలో అంతర్గతంగా సాగిన పరిణామాలేవో చెప్పడం కష్టం. ఉదాహరణకు స్త్రీవాద కవిత్వమే. దాని పరిణామం చెప్పబోతే పుట్టుక తర్వాత పదిహేను ఇరవై ఏళ్లకల్లా తెరమరుగైపోయిందనే ముగింపుకు చేరుకుంటాం. అది అందించిన కవితా దృష్టి మిగిలి ఉండవచ్చు. అది ఇప్పటికీ కొందరు కవుల్లో వ్యక్తం అవుతూ ఉండవచ్చు. ఆ చర్చ పూర్తిగా వేరే విషయం. మరి కొన్ని కవితా ధోరణులూ ఇలాగే కనిపిస్తాయి. ఎందుకిలా అయిందంటే- ఈ కవితా ధోరణుల వెనుక సామాజిక రాజకీయ ఉద్యమాలేవీ లేవు. ప్రజా జీవితంలో ఈ అస్తిత్వ ఆకాంక్షలు, చైతన్యం కొంత కాలం బాగానే వ్యక్తమయ్యాయి. అవి చాలా ప్రభావశీలమైనవే. అయితే అవి మానవాచరణగా మారలేదు. అలాంటి నాయకత్వం లేదు. సంఘటిత నిర్మాణాలంటూ ఏమీ లేవు. ఇవి తొలి రోజుల్లోని సమస్యలని అనుకోడానికి కూడా లేదు. అస్తిత్వ స్పృహ, చైతన్యం, కాంక్షలుగానే ఉండి అలాగే ఆగిపోయాయి. అంటే ఆచరణ, పరిణామం అనే పరీక్షకు గురై నిగ్గుదేలలేకపోయాయి.

పరిణామశీలం అనే గుణం ఆధారంగా పరీక్షకు నిలబడగలిగింది విప్లవ కవిత్వోద్యమమే. ఎందుకంటే అది ఉద్యమం కాబట్టి. ఈ సమాజంలో అట్టడుగు ప్రజల మధ్య సాగుతున్న వర్గ యుద్ధానికి అనుబంధంగా సాగుతున్నది కాబట్టి. మన చుట్టూ ఎన్నో ఉద్యమాలు నడుస్తున్నాయి. అవన్నీ అత్యంత న్యాయమైన నినాదాలతో ఈ సమాజ ప్రజాస్వామికీకరణకూ దోహదపడుతున్నాయి. కానీ వ్యవస్థ మీద రాజీలేని తీవ్ర రాజయకీయార్థిక సాంఘిక సాంస్కృతిక సాయుధ సంఘర్షణ నెరపుతున్నది మాత్రం విప్లవోద్యమమే. అది మహత్తర నక్సల్బరీ వారసత్వం. అంటే కొనసాగింపు. ఇదొక్కటే మిగతా ఉద్యమాల పక్కన నక్సల్బరీని విశిష్టంగా నిలబెడుతుంది. అట్టడుగు కులాలు, వర్గాలు, మహిళలు, ఆసంఖ్యాక ఆదివాసీ తెగలు దశాబ్దాల తరబడి చేస్తున్న ఉద్యమం అది.

కొనసాగింపు లేదా పరిణామం లేదా నిత్య పరివర్తనాగుణం.. ఏ పదంతోనైనా నక్సల్బరీ ప్రత్యేకతను గుర్తించవచ్చు. నక్సల్బరీ సాఫల్య వైఫల్యాల చర్చ కూడా తప్పక చేయవచ్చు. కానీ అవిచ్ఛిన్నంగా నేల మీద నిలబడి పీడిత వర్గంతో, అనేక సాంఘిక అస్తిత్వ సమూహాలతో కలిసి ఒక మహత్తర పోరాటంగా సాగుతున్నది. కొనసాగుతున్నదీ అంటే వర్తమానంలో ఉన్నదీ అని అర్థం. తప్పక భవిష్యత్తులోకి ప్రసరించగల అంతర్గత శక్తి ఉన్న ఉద్యమం కూడా. ఈ నేపథ్యంలో పరిణామం అనే సుగుణం విప్లవ కవిత్వానికి సొంతం. అది సజీవమైనది కాబట్టే ప్రభావం వేయగలుగుతుంది. ప్రభావాలకు లోనవుతుంది. తన మౌలిక లక్ష్యానికి తగినట్లు తనను తాను లోపలి నుంచి మార్చుకుంటుంది. దీనికి తగినవి బైట ఉంటే వాటిని తన స్వభావంలో భాగం చేసుకుంటుంది. ఈ పని నిరంతరాయ ప్రక్రియగా సాగిస్తూ విస్తరిస్తుంది. అచ్చంగా విప్లవ కవిత్వం ఈ ప్రక్రియలను ఐదు దశాబ్దాలుగా సాగిస్తున్నది. అంటే నిత్య పరివర్తనాశీలిగా నిరూపణ అయింది.

విప్లవ కవిత్వాన్ని ఈ స్థూల భావన ఆధారంగా పరిశీలించడం బాగుంటుంది. విప్లవ కవిత్వాన్ని ఎవరైనా విప్లవాభిమాని సొంత మమకారంతో చూస్తే దానిలోని ఏ శక్తిని, ఏ సుగుణాన్ని, ఏ విలక్షణత్వాన్ని వివరించడం సాధ్యంకాదు. అలాగే సొంత ద్వేషాలు, అఇష్టాలు, స్వప్రయోజన సూత్రీకరణలు, పగటి కలల ప్రేలాపనలతో విప్లవ కవిత్వాన్ని తీసి పక్కన పెట్టాలని, అసలు అది లేకపోతేనే బాగుండని బయల్దేరితే సాధించేది ఏమీ ఉండదు. విప్లవ కవిత్వాన్ని ఒక కవితా ఉద్యమంగా విప్లవోద్యమ పరిణామ ప్రభావాల్లో భాగంగా చూడాల్సిందే. ఆ విప్లవోద్యమం ఈ యాభై ఏళ్లలో ఎన్ని అగడ్తలు దాటిందో, ఎన్ని కీకారణ్యాలు నడిచిందో, లక్షలాది మాల మాదిగల, పీడిత కులాల, ఆదివాసీ తెగల పూరి గుడిసెలను ఆలింగనం చేసుకున్నదో, ఎన్ని నెత్తురుటేరులు ఈదిందో.. ఎన్నిసార్లు పడిపోయిందో, అంతకంటే ఎక్కువసార్లు లేచి నిలబడిందో.. అదంతా ఒక నిజ చరిత్ర. సకల సంక్షోభాల్లో పుట్టి పెరిగి, ఒక దీర్ఘ ప్రయాణం చేస్తున్నది. సంక్షోభాలన్నిటికీ తానే ఏకైక పరిష్కారమనే అచంచల ఆత్మవిశ్వాసంతో సాగుతున్నది.

ఈ మొత్తం క్రమం దృష్టిలో పెట్టుకోకుండా విప్లవ కవిత్వ వికాసాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోజాలరు. ఆ విప్లవానికి, ఈ కవిత్వానికి సంబంధం ఏమిటనిగాని, అసలు ఈ సంబంధమే అసంబద్ధమనిగాని అనే వాళ్లకు విప్లవ కవిత్వంలోని ఒక చరణం కూడా అర్థం కాదు. విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు విప్లవ కవిత్వ వికాసం లొంగదు. ఇది విప్లవ కవిత్వానికి సంబంధించిన మరో ముఖ్య లక్షణం. నిజానికి కవిత్వ ధోరణులను కూడా దాని మొత్తంలోంచే పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అస్తిత్వ కవితా ధోరణులను వాటి వెనుక ఏదైనా చైతన్యవంతమైన సంఘటిత విముక్తి ఆచరణ ఉన్నదా? ఉంటే ఎలా ఉన్నది? అని ఇలాగే చూడాలి.

అలాగే విప్లవ కవిత్వానికి దాని స్వభావం వల్లనే ఉండే రాడికల్‌ లక్షణాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చాలా విశాలమైన జీవితావరణలో సాగే విప్లవోద్యమంలోని అనేక ఆటుపోట్ల ప్రత్యేకతలున్నాయి. జయాపజయాలు, గెలుపు ఓటముల సంధ్యావర్ణాలు, దిక్కులు పిక్కటిల్లే విజయధ్వానాలు, దు:ఖమే ఆలంబనగా మారే విషాద సన్నివేశాలు, ఒక్క గెంతు తీసుకోడానికి ఊపిరంతా ఉగ్గబట్టి, సకల శక్తులను కేంద్రీకరించే సాహసాలు.. లక్షలాది ప్రజల ఈ ఆచరణతో సంబంధం లేకుండా విప్లవ కవిత్వం ఎలా ఉంటుంది? వీటన్నిటితో కలగలసిన జీవితావరణలోంచి విప్లవ కవిత్వం పుడుతుంది.

అందువల్ల రాడికల్‌ లక్షణం ఈ యాభై ఏళ్లుగా దాని ప్రాణప్రదం. అయితే దీనికి భిన్నమైన లక్షణాలు విప్లవ కవిత్వానికి లేవా? అనే ప్రశ్న ఎదురవుతుంది. రాడికల్‌ లక్షణాన్ని పలుచన చేసుకోకుండా ఇంకా ఎన్నెన్ని లక్షణాలను సంతరించుకుంటున్నదో ఈ దశాబ్దపు యువ విప్లవ కవుల కవిత్వం చదివితే తెలుస్తుంది. ఆ సంగతికి మళ్లీ వద్దాంగాని విప్లవోద్యమం అడుగుజాడల్లో ప్రతి కవీ తనదైన అన్వేషణకు ఊహాశక్తిని జోడిస్తూ విప్లవ కవిత్వ మౌలికతను బలోపేతం చేస్తూ వచ్చారు. నక్సల్బరీ తన తొలి రోజుల విప్లవ స్వభావాన్ని, లక్ష్యాన్ని మరింత ఇనుమడింపజేసుకుంటూ విస్తరిస్తున్నదో విప్లవ కవిత్వం కూడా 1967, 68 సంవత్సరాల నుంచి అనేక దశల్లో విస్తరిస్తూ కొనసాగుతున్నది.

విప్లవ కవిత్వానికి ఉన్న మరో లక్షణం ప్రజలను కదిలించడం. ఈ కోణంలో పాట వలె వచన కవితకు అంత శక్తి ఉండదు. కానీ ఇప్పటికీ తెలుగులో విప్లవ కవిత్వానికే పాఠకులు అత్యధికులు. పాఠకులను ఒక ఆలోచన దిశగా ప్రేరేపించడం విప్లవ కవిత్వ లక్ష్యం. ఇంకా బాగా చెప్పాలంటే ఏదో ఒక స్థాయిలో ఆచరణకు పురికొల్పడం. ఇది కవిత్వ లక్షణం కాదనే వాళ్లూ ఉండవచ్చు. కవిత్వం ఒక సృజనాత్మక రూపంగా పాఠకులను ఒకరకమైన అన్వేషణకు పురిగొల్పుతుంది. అది తనను తాను అర్థం చేసుకోవడంగా, తనకూ ఈ లోకానికి సరికొత్త సంబంధం పునర్నిర్మించుకునేలా, ఈ లోకంతో తన అసమ్మతిని ప్రకటించుకునే దారిగా, ఇతరేత మాధ్యమాల ద్వారా అర్థం కాని భావనా ప్రపంచానికి చేరుకునేలా ప్రేరేపిస్తుంది. అంతేగాక ఒక పనిలోకి దిగే శక్తినీ ఇస్తుంది. ఈ స్వభావం యాభై ఏళ్ల విప్లవ కవిత్వంలో చాలా సాంద్రంగా చూడవచ్చు. అనేక వైపుల నుంచి పాఠకులు ఈ ప్రయాణాలు సాగించే విస్తృత ఆవరణ విప్లవ కవిత్వంలో ఉన్నది. ఒక దశలో కొద్దికాలంపాటు దళిత కవిత్వానికి చాలా మంది కొత్త కవితా పాఠకులు ఉండేవారు. మిగతా ప్రక్రియలకు కూడా దళిత సాహిత్య ధోరణి చాలా మంది పాఠకులను తయారు చేసుకున్నది.

అయితే విప్లవ కవిత్వానికి ఈ యాభై ఏళ్లుగా చాలా వైవిధ్యభరితమైన పాఠకులు ఉన్నారు. కవిత్వాభిమానులు, సాధారణ కవితా పాఠకులు, అసంఖ్యాక కార్యకర్తలు, విప్లవోద్యమ శ్రేణులు, విప్లవాభిమానులు విప్లవ కవిత్వం చదువుతుంటారు. మామూలుగా అయితే ఎంత గట్టి కవిత్వానికైనా పాఠకులు తక్కువే. తెలుగులో ఇప్పటికీ కవికి, కవిత్వానికి ఏదో ప్రత్యేక స్థానం ఉన్నది. కానీ అది జన సామాన్యానికి కవిత్వానికి బాగా దూరం ఉంటుంది. కవిత్వం కవి బృందాల వ్యవహారంగా మిగిలిపోయింది. కవిత్వ విశ్లేషకులు ధైర్యం చేసి పాఠకులు అనే మాట ఉపయోగించలేదు. కవి పాఠకులు అంటూ ఉంటారు. అస్తిత్వ ధోరణులు వెనక్కి వెళ్లాక తెలుగు కవిత్వంలో అయోమయ కవి బృందాలు ఎక్కువయ్యాయి. ఒక్కో తరహా బృందంలో ఇద్దరో ముగ్గురో కవులు ఉంటారు. వాళ్ల చుట్టూ మరో ఇద్దరు భజన పరులు ఉంటారు. వాళ్లే ఆ కవిత్వంపై విశ్లేషణలు రాస్తుంటారు. ఆ కవిత్వం వలె ఈ విశ్లేషణలూ కవితాత్మక అయోమయంగా ఉంటాయి. కవిత్వ విమర్శ కూడా కవిత్వమే కావడం అనే టెండెన్సీని ఇటీవల గమనిస్తాం. కవితా ప్రపంచంలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పును ఇది సూచిస్తోంది.

ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా కవిత్వానికి, పాఠకులకు మధ్య సంబంధాన్ని విప్లవోద్యమమే నిలబెట్టింది. అనేక ప్రయోగాలు, వైవిధ్యాల వల్ల విప్లవ కవిత్వంతో తమకు ఎడం పెరుగుతున్నదనే విమర్శ విప్లవ కవితా పాఠకుల నుంచి ఈ మధ్య వస్తున్నది. అయినా ప్రయోగాలు, వైవిధ్యాలు సృజనాత్మక రంగంలో తప్పనిసరి. విప్లవ కవిత్వం తన దృక్పథం, ప్రయోజనం గీటురాయి మీద ప్రయోగాలు చేస్తోంది. వైవిధ్యాన్ని సాధిస్తోంది. వీటి వల్లనే పాఠకులతో ఎడం రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నది. కవికి పాఠకులకు సంబంధం ఇంకో ముఖ్య విషయం. ఇందులో కూడా ఇప్పటికీ విప్లవ కవులకే పాఠకులతో ఎక్కువ సంబంధం ఉన్నది. కవికి ఒంటరి కూపం నుంచి విముక్తి ప్రసాదించింది విప్లవోద్యమమే. అయినా కొన్ని రకాల గందరగోళ కవితా ధోరణులకు చెందిన కవులు ప్రజా జీవితానికి దూరంగా ఉండిపోయారు. విప్లవ కవిత్వం పాఠకులను ఆలోచనా, ఆచరణ దిశగా కదిలించడం అనే లక్షణానికి ఇంకో కోణం కూడా ఉన్నది. అది కవి ప్రజల మధ్యకు వెళ్లడం. యాభై ఏళ్ల విప్లవ కవిత్వం సాధించిన ఒక అద్భుతమైన ప్రమాణం ఇది. అనేక ప్రజాస్వామిక పోరాటాల్లో సహితం అనేక మంది కవులు, రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు ప్రజల మధ్యలోకి వెళ్లడానికి విప్లవ కవిత్వం స్పూర్తిని ఇస్తున్నది. ఇవి విప్లవ కవిత్వంలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు మాత్రమే. ఇంకా ఎన్నో ఆది నుంచీ కొనసాగిస్తున్నది. కొత్త లక్షణాలు సంతరించుకుంటున్నది.

వీటన్నిటినీ మౌలిక స్థాయిలో కూడా పరిశీలించవచ్చు. అది చాలా విస్తారమైన పని. చాలా లోతైన పరిశీలనలు ఎన్నో చేయడానికి అవకాశం ఉంటుంది. విప్లవోద్యమ అభివృద్ధి వికాసం ఈ వ్యవస్థలో భాగంగానే జరుగుతున్నది. అందువల్ల విప్లవోద్యమ పరిణామాలు ఈ వ్యవస్థతో ముడిపడినవి. ఇతరేత ప్రజా సంచలనాలు, ప్రజా ఆకాంక్షలు కూడా ఎన్నో ఉన్నాయి. వ్యవస్థను పాలకవర్గం ఒక పథకం ప్రకారం తీర్చిదిద్దాలనుకుంటుంది. ఆ రథ చక్రాల కింద పడిపోయే ప్రజలు తక్షణ, దీర్ఘకాలిక లక్ష్యాలతో పోరాడుతూ ఉంటారు. ప్రత్యామ్నాయాలు నిర్మించే ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ వ్యవస్థ అంచుల్లో ఉన్న ప్రజల ఆలోచనారీతులు, ఆరాటాలు, పోరాటాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ʹప్రధాన స్రవంతిʹ అనబడేదానికి వాళ్ల నిర్వచనాలు, విశ్లేషణలు చాలా విలక్షణంగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ల అస్తిత్వ సాంఘిక సాంస్కృతిక ప్రత్యామ్నాయాలతో సంబంధం లేకుండా వాటిని అర్థం చేసుకోలేం. ఒక కాలంలో విప్లవ కవితా శిల్పంలో వచ్చిన లేదా రావాల్సి ఉండిన మార్పులను కేవలం అతీతశక్తులు ఉన్న కవుల కల్పనా శక్తిగా చూడదు. కవి సృజనాత్మక ప్రతిభను గుర్తిస్తూనే ఆ కవి కూడా ఒక భౌతిక, భావనా ప్రపంచంలో భాగమని మర్చిపోడానికి లేదని విప్లవ దృక్పథం హెచ్చరిస్తుంది.

ఈ స్థూల నేపథ్యంలో నక్సల్బరీ యాభై ఏళ్ల సందర్భంలో ఈ దశాబ్ద విప్లవ కవిత్వం గురించి ఒక పరిశీలన చేయడమే ఉద్దేశం. ముఖ్యంగా 2010 నుంచి కొన్ని అద్భుత విప్లవ కవితా సంకలనాలు వచ్చాయి. షహీదా, కెనరీ, కాశీం, రివేరా, అరసవెల్లి కృష్ణ, కిరణ్‌, మేడక యుగంధర్‌, ఉదయమిత్ర, ఉజ్వల్‌, కెక్యూబ్‌ వర్మ, సూర్యచంద్ర, వడ్డెబోయిన శ్రీనివాస్‌, శాకమూరి రవి, బాసిత్‌, , ఉదయభాను, వరవరరావు తదితరుల సంపుటాలు వచ్చాయి. ఒకటి రెండు విప్లవ కవితా సంకనాలు వచ్చాయి. పుస్తక రూపంలో రాని విప్లవకవులు మరి కొందరు ఉన్నారు. కవిగా వీళ్లదే అయిన సొంత వ్యక్తీకరణ ఏమిటి? గత కొద్ది కాలంలో అందులోని పరిణామమేమిటి? విప్లవ కవిత్వంపై ఈ కవులు విడిగా వేసిన ముద్రలు ఏమిటి? సాధారణ తలంలో విప్లవ కవిత్వానికి వాళ్ల చేర్పు ఏమిటి? అనే కోణాల్లో పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.


No. of visitors : 1708
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి

ఏవోబీ నెత్తురు చిందుతోంది

విరసం | 23.09.2019 01:07:09pm

సీపీఐ మావోయిస్టు అగ్రనేత ఆర్కేను టార్గెట్‌ చేసి ఈ అభియాన్‌ను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు మోదీ రెండోసారి అధికారంలోకి.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
  మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
  మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
  The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  Students and the Revolution
  గోడలమనుషులు
  దగ్ధహృదయమా !
  మూడో కన్ను

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •