ప్రొ. జి.ఎన్‌. సాయిబాబాను కాపాడుకుందాం

| సాహిత్యం | వ్యాసాలు

ప్రొ. జి.ఎన్‌. సాయిబాబాను కాపాడుకుందాం

- వరవరరావు | 04.06.2017 01:01:15pm

ప్రొ. జి.ఎన్‌. సాయిబాబాకు, ఆయన సహ ముద్దాయిలు ప్రశాంత్‌ రాహి, హేమ్‌ మిశ్రా, మహేష్‌, పాండు (ఈ ఇద్దరు ఆదివాసులు) లకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, విజయ టిర్కికి పదేళ్ల శిక్ష వేసి, నాగ్‌పూర్‌ హైసెక్యూరిటీ కేంద్ర కారాగారానికి పంపించి మూడు నెలలు కావస్తున్నది. ప్రొ. జి.ఎన్‌. సాయిబాబా 90 శాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్నది నిజమయినప్పటికీ ఆయన మానసికంగా క్రియాశీలంగా ఉన్నాడని పేర్కొంటూ న్యాయమూర్తి ఎనిమిది వందల పేజీలకు పైగా తీర్పులో మూడు వందల పేజీలకు పైగా ఆయనకు వ్యతిరేకంగానే రాసాడు. ఇంతకన్నా కఠిన శిక్ష వేయకపోవడానికి చట్టమే తన చేతులు కట్టేసిందని గడ్చిరోలి సెషన్స్‌ జడ్జి రాసాడు. 1982 నుంచి గడ్చిరోలి ప్రాంతంలో ఏ అభివృద్ధి జరగపోవడానికి సాయిబాబా వంటి మేధావులే కారణమని కూడా ఆక్రోషం వెలిబుచ్చాడు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలెక్ట్రానిక్‌ ఆధారాల ద్వారా అంటే హార్డ్‌ డిస్క్‌లు, పెన్‌ డ్రైవ్‌లు వంటి వాటి సాక్ష్యాల ద్వారా శిక్ష వేసిన మొట్టమొదటి కేసని ప్రాసిక్యూషన్‌ ఈ కేసు గురించి చాలా సందర్భాల్లో గర్వంగా చెప్పుకున్నది. కార్పొరేట్‌ అభివృద్ధికి అడ్డుపడేవాళ్లు కార్పొరేట్‌ శిక్షలకు కూడా గురవుతారనే సామర్థ్య గర్వంతో ఈ వ్యాఖ్యానాలు చేసారు. వాస్తవమేమిటంటే, ఇందులో ముగ్గురు ఆదివాసులు గడ్చిరోలి జిల్లాకు చెందిన మారుమూల గ్రామాలకు చెందిన వాళ్లు. కంప్యూటర్‌ కాదు కదా వాళ్ల ఊళ్లల్లో కరెంటు కూడా లేదు. శిక్ష పడిన ఆరుగురిలో ముగ్గురి పరిస్థితి అది.

ప్రొ. జి.ఎన్‌. సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌. ఆయన ఆంధ్రప్రదేశ్‌ మొదలు ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలలో, పోరాటాలలో చేసిన కృషిని అలా ఉంచి, ఎకడమిక్‌ రంగంలో చేసిన కృషిని ఒకసారి గుర్తు చేసుకుందాం.

విశ్వవిద్యాలయంలో ఆయన గూగీ వా థియాంగో రాసిన ʹడిడాని కిమాతిʹ నాటకాన్ని, ʹడీ కాలనైజింగ్‌ ది మైండ్‌ʹ (మానసికతను నిర్వలసీకరణ చేయడం) గ్రంథాలను బోధించేవాడు. మొదటి పుస్తకం మౌ మౌ ఉద్యమంలో పాల్గొన్న ప్రజల ఆదివాసి మౌఖిక వాంగ్మూలాల ఆధారంగా ʹడిడాని కిమాతిʹ అనే ఒక ఆదివాసి యోధునిపై బ్రిటిష్‌ వలస ప్రభుత్వ న్యాయస్థానాలు చేసిన నేర విచారణ. గూగీ రచనలో అది వలస న్యాయాన్ని ʹడిడాని కిమాతిʹయే బోన్‌ ఎక్కించడంగా ధిక్కార స్వరంతో చిత్రించబడింది. ఒక అల్లూరి సీతారామరాజు కథ వలె.

ఆరు సుప్రసిద్ధ ఇండియన్‌ ఇంగ్లిష్‌ నవలలను తీసుకొని వాటిపై వలసవాద ప్రభావాన్ని విశ్లేషిస్తూ ఆయన సిద్ధాంత గ్రంథాన్ని రాసాడు. ఇంకా ప్రచురింపబడని ఆ సిద్ధాంత గ్రంథానికి వచ్చిన గుర్తింపుతో ఆయనకు యూరప్‌, అమెరికాలలోని చాలా విశ్వవిద్యాలయాల నుంచి ప్రసంగించడానికి ఆహ్వానం వచ్చింది. అమెరికాలోని జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ (అట్లాంటా) లో ఆఫ్రికన్‌ - అమెరికన్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆయనను ప్రసంగించడానికి 2012 జూన్‌లో ఆహ్వానించింది. ఆయన అమెరికాకు వచ్చాడని తెలిసి గూగీ వా థియాంగో ఆయనకు తన ఆత్మకథ రెండో భాగం (ఇన్‌ ది హౌస్‌ ఆఫ్‌ ది ఇంటర్‌ప్రెటర్‌) ʹసంతకం చేసిʹ పంపించాడు.

అక్కడి నుంచి ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌లో అరుంధతీ రాయ్‌ ʹగాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌ʹ పై ప్రసంగించడానికి వెళ్లాడు. తిరిగి వచ్చిన కొద్దిరోజులకే ఆయన ఢిల్లీ యూనివర్సిటీ గ్వైర్‌ హాల్‌ వసతి గృహంపై మహారాష్ట్ర పోలీలుసులు దాడి చేసి ఒక విచిత్రమైన ఆరోపణ చేసారు. గడ్చిరోలి జిల్లా ఆహిరిలో జరిగిన ఒక దొంగతనానికి సంబంధించిన ఆస్తులు ఇక్కడ ఉన్నాయనే అనుమానంతో జప్తు కోసం వచ్చామని. ఆ ఆస్తులు ఏమిటంటే పెన్‌ డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్క్‌లు, పుస్తకాలు. తిరిగి వెళ్లేప్పుడు మాత్రం నిజం చెప్పారు.

అంటే ఆహిరి మాత్రమే కాదు, గడ్చిరోలి, బస్తర్‌ మొదలుకొని తూర్పు మధ్య భారతాల్లో ఆదివాసుల ప్రకృతి సంపదను కార్పొరేట్‌ శక్తులు దోచుకోవడానికి దళారీలుగా తోడ్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ను ప్రజల మీది యుద్ధమని వాస్తవాలు చెప్తూ ఆయన ʹకమిటీ అగెనెస్ట్‌ వార్‌ ఆన్‌ పీపుల్‌ʹ (ప్రజలపై యుద్ధానికి వ్యతిరేకంగా కమిటీ) ఏర్పాటు చేయడమే రాజ్యం దృష్టిలో అతడు చేసిన నేరం. ఆ నేరం వల్ల అతడు మావోయిస్టు పార్టీ సభ్యుడుగా చిత్రింపబడ్డాడు. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ అర్బన్‌ కనెక్ట్‌గా చిత్రింపబడ్డాడు. ఆ నేరారోపణలు ఎదుర్కొంటూ మూడేళ్లు ఇదే నాగ్‌పూర్‌ హైసెక్యూరిటీ జైల్‌ అండాసెల్‌లో ఉండాల్సి వచ్చిన రోజుల్లో కూడా ఆయన తన అంగవైకల్యంతో, అనారోగ్యంతో పోరాడుతూనే కబీర్‌ దోహాలపై అధ్యయనం చేసాడు. గూగీ వా థియాంగో ఆత్మకథ ʹడ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైమ్‌ ఆఫ్‌ వార్‌ʹ (యుద్ధకాలంలో స్వప్నాలు) అనువాదం చేసాడు. అది ప్రచురణకు వెళ్లే సమయానికి ఆయన యావజ్జీవ శిక్ష పడి మళ్లీ జైలుకు వెళ్లాడు. ఈ స్థితినంతా గూగీ వా థియాంగో ఈ పుస్తకానికి రాసిన ముందు మాటలో ఒక యాదృచ్ఛిక విషాదంగా ఇట్లా పేర్కొన్నాడు:

ʹʹ1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతుల సమస్యపై జరిగిన అంతర్జాతీయ సదస్సు సందర్భంగా కష్టజీవి సాయిబాబాతో నా కలయిక జ్ఞాపకాలను నేనెన్నటికీ మరచిపోలేను. హైదరాబాదులో ఒక పుస్తకాల దుకాణంలో అనుకోకుండా దొరికిన నా పుస్తకం డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌ తన జీవితం మీద ఎంత ప్రభావం వేసిందో ఆయన చెప్పడం నాకింకా గుర్తుంది. నేను ఆ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్‌ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను. నా సాంస్కృతిక కార్యాచరణ వల్ల, ముఖ్యంగా కెన్యాలోని కామిరితు గ్రామంలో రైతులు, కార్మికులు తమ భాషలో తమ పోరాటాల గురించి చెప్పే తమ సొంత నాటకరంగాన్ని సృష్టించాలని చేసిన ప్రయత్నానికి సహకరించినందువల్ల నన్ను జైలులో పెట్టారు. నా పుస్తకాల్లో మరొకదాన్ని అదే సాయిబాబా మహారాష్ట్ర లోని నాగపూర్‌ హైసెక్యూరిటీ జైలులో ఖైదీగా ఉండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?! దుర్భరమైన జైలు పరిస్థితుల్లో అనువాదం చేయడం! ఆయన తన జీవిత, సాంస్కృతిక కార్యాచరణ కోసం జైలు జీవితం గడుపుతున్నాడంటే నాకు ఆయనతో ఇప్పుడు, మరొకసారి, ఒక ప్రత్యేకమైన బంధం ఉందనిపిస్తున్నది.ʹʹ

జి.ఎన్‌. సాయిబాబా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఒక కుగ్రామంలో పుట్టి, బాల్యంలోనే పోలీయోకు గురయ్యాడు. పేదవాడైన ఆయన తండ్రి సైకిల్‌పై తీసుకువచ్చి పాఠశాల దగ్గర దించి మళ్లీ సాయంకాలం తీసుకెళ్లేవాడు. చేతులకు చెప్పులు వేసుకుని ఎంతో కష్టాన్ని ఓర్చి చదువుకోవడానికి తపనపడ్డాడు. చదువు పట్ల ఆయనకున్న దాహాన్ని చూసి ఆమె ఆయన పట్ల ఆసక్తిని పెంచుకున్నది. వాళ్లిద్దరి మధ్య అట్లా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి సాహచర్యానికి దారితీసింది. ఆయన తన స్వీయ స్థితి నుంచి గోదావరి జిల్లాలో అగ్రవర్ణ వ్యవస్థ దాడికి గురవుతున్న దళితులను, ఆదివాసులను చూసాడు. సానుభూతితో అర్థం చేసుకున్నాడు. ఆ దశ నుంచే వాళ్లతో మమేకమయ్యాడు.

సాహిత్యం ద్వారా రాజకీయాలు అర్థం చేసుకున్నాడు. ʹసృజనʹ, రాడికల్‌ విద్యార్థి సంఘం ప్రభావాల్లోకి అమలాపురంలోనే వచ్చాడు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చేరిన తరువాత 1990లలో ఇక్కడి వాతావరణం ఆయనలో బాల్యం నుంచి రగులుతున్న వేదన ఒక ఆగ్రహంగా మారడానికి దోహదం చేసింది. 1991 సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, 1992 బాబ్రీమసీదు విధ్వంసం ఈ భావాలు ఒక నిర్మాణరూపం తీసుకోవడానికి ప్రపంచీకరణ, కాషాయీకరణ విసిరిన సవాళ్లయినవి. అట్లా ఏర్పడిన ఎఐపిఆర్‌ఎఫ్‌ మొదలు అక్కడ నుంచి ప్రతి భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో ఆయన చోదకశక్తిగా ఉన్నాడు.

ఎఐపిఆర్‌ఎఫ్‌, జైలు పోరాటం, జాఫిప్‌, ఫెయిగ్‌, ఎంఆర్‌-2004, కమిటీ అగెనెస్ట్‌ వార్‌ ఆన్‌ పీపుల్‌ నుంచి ఆర్‌డిఎఫ్‌ దాకా ఎన్నో ప్రజాసంఘాల నిర్మాణం చేసి, ఎన్నో ప్రజా ఉద్యమాలను నిర్మించాడు. దేశస్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా.

కాళ్లు లేకున్నా చెప్పులు తొడుక్కున్న చేతులతోనే అనేక ప్రజా వేదికలు ఎక్కి ప్రజా పోరాటాలలో మమేకమైనాడు.

ఆదివాసులు, దళితులు, ముస్లింలు, మహిళలు, రైతాంగం, కార్మికులు, విద్యార్థులు, పీడిత ప్రజలందరికీ ఆయన తన కలాన్ని, గళాన్ని అందించాడు. వాళ్ల కోసం వేదికలు నిర్మించాడు. ఈ కృషినంతా ఆదివాసి ప్రాంతాల్లో 1982 నుంచి ఒక అభివృద్ధి నిరోధక చర్యగా గడ్చిరోలి కోర్టు పేర్కొన్నది. అది సాయిబాబా కృషి మొదలైన కాలం కాదు. గడ్చిరోలిలోకి పీపుల్స్‌వార్‌ పెద్దిశంకర్‌ దళం ప్రవేశించిన కాలం. నిజానికి ఈ పోరాటానికి ఒక వ్యక్తీకరణగా పదేళ్ల తరువాత గాని సాయిబాబా ప్రజా జీవితంలోకి రాలేదు.

కోర్టు ఈ తీర్పు ఇచ్చి అంతకన్నా పెద్ద శిక్ష వేయకుండా చట్టం తన చేతులు కట్టివేసిందని అన్న దగ్గర నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ఉన్నవాళ్లు, మీడియాలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్లు సాయిబాబాకు మరణశిక్ష వేసే ఒక నేర విచారణ కొనసాగిస్తున్నారు.

గతంలోనే అరుంధతీరాయ్‌ రాసినట్టు ఈ యుద్ధ ఖైదీని జైలులో చంపే కుట్ర జరుగుతూ ఉన్నది. ఆయన ఆరోగ్యం గురించి నేషనల్‌ ప్లాట్‌ఫార ఫర్‌ ది రైట్స్‌ ఆఫ్‌ ది డిసేబుల్డ్‌ కార్యదర్శి మురళీధరన్‌ జాతీయ మానవ హక్కుల సంఘానికి రాసిన లేఖపై స్పందించిన ఎన్‌ఎచ్‌ఆర్‌సి అధ్యక్షుడు విచారణకు ఆదేశించాడు. ఇటీవలెనే మే 15న సల్జా అనే ఏక సభ్య విచారణ అధికారి సాయిబాబాను నాగ్‌పూర్‌ జైలులో కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నది.

ప్రస్తుతం ఆయన 19 రకాల తీవ్రమైన, కీలకమైన వ్యాధులతో బాధపడుతున్నాడు. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు అన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2014 మే 9, 10 పోలీసు కస్టడీలో పోలీసులు దురుసుగా వ్యవహరించడంతో ఎడమ చెయ్యి నరాలు దెబ్బతిని ఎడమ చెయ్యి పనిచేయడం లేదు. బెయిల్‌పై ఉన్నప్పుడు హైదరాబాద్‌ కేర్‌ ఆసుపత్రిలో ఆరు వారాల చికిత్స తరువాత కూడా శస్త్ర చికిత్స అప్పుడే సాధ్యం కాదన్నారు. ఈ శిక్ష పడి జైలుకు పంపడానికన్నా ముందు ఢిల్లీలో బెయిల్‌ మీద ఉన్న కాలమంతా ఆయన రాక్‌లాండ్‌ ఆసుపత్రిలో ఈ నరాల సంబంధమైన వ్యాధికై చికిత్స చేయించుకున్నాడు. ప్రయాణం చేసినా, కదిలినా ప్రాణాపాయం అని చెప్పిన స్థితిలో ఆయన తీర్పు రోజు హాజరు కాక తప్పలేదు. నిర్దోషిగా ప్రకటింపబడి హైదరాబాద్‌ వచ్చి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటానని ఆశించాడు. కాని జీవితమంతా జైలులో గడపడానికి తన సహ ముద్దాయిలతో పాటు వెళ్లాల్సి వచ్చింది.

ఈ వాస్తవ స్థితిలో తీవ్ర అనారోగ్య కారణాలతోనైనా, ప్రాణాపాయ స్థితి వల్ల నైనా ఆయనకు హైకోర్టు బెయిల్‌ ఇస్తుందేమోనని, ఇప్పుడు ఇంక మూడు నెలలుగా ఆయన వ్యతిరేకంగా విస్తృత ప్రచారం ఎవరో కాదు, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ స్వయంగా చేస్తున్నారు. పయనీర్‌ సంపాదకుడు, బిజెపి ఎం.పి చందన్‌ మిత్రా ఇంతకాలానికి కొంత న్యాయం జరిగింది అని సంపాదకీయం రాస్తూ, అది మరణశిక్ష కానందుకు బాధపడిపోయాడు.

సుక్మా సంఘటన తరువాత ఇదే పత్రిక (ఆంధ్రజ్యోతి)లో సందర్భం లేకుండా ఒక కేంద్ర మంత్రి జి.ఎన్‌. సాయిబాబా ప్రస్తావన తేవడాన్ని తెలుగు పాఠకులు కూడా చదివే ఉంటారు.

విశ్వాసాల కోసమే ఎవర్నీ శిక్షించడానికి వీల్లేదని జస్టిస్‌ చిన్నపురెడ్డి 1971లో ఇచ్చిన తీర్పుకు ఎంత కాలదోషం పట్టిందో చూడండి. నలభై ఆరు ఏళ్లు గడిచిన తరువాత ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదస్థాయికి దిగజారిందో ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలి!

ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నవాళ్లు, కార్పొరేట్‌ మీడియా అధిపతుల వలెనే ఈ దేశంలో బుద్ధిజీవులు, ప్రజాస్వామ్య వాదులు ఆలోచిస్తున్నారా? భిన్నంగా ఆలోచిస్తున్నారా? ఈ మౌనానికి కారణం ఏమిటి? డా. బినాయక్‌సేన్‌ అరెస్టు సందర్భం నుంచి డా. జి.ఎన్‌. సాయిబాబా అరెస్టు దాకా కనిపించిన స్పందన సాయిబాబా, ఆయన సహచరులకు పడిన శిక్ష తరువాత గత మూడు నెలల్లో కనిపించకపోవడానికి ఏ కార్పొరేట్‌ కాషాయ శక్తుల నియంత్రణ కారణమవుతున్నది?

బుద్ధిజీవులపై ఆ తీర్పు మన మౌనానికి కారణమవుతున్నదా? చట్టం తన చేతులు కట్టేసిందని న్యాయమూర్తి అసహాయతను, మన అసహాయ మౌనం రద్దుచేసి, జైలులో జి.ఎన్‌. సాయిబాబా ప్రాణాలకు జరగకూడనిది ఏమైనా జరిగినప్పుడు మనం ఎవర్ని బాధ్యుల్ని చేద్దాం? పాలకులు కోరిందే జరగనిద్దామా? వ్యక్తీకరణకు అవకాశం లేని అశేష ప్రజానీకం ఆకాంక్షలకు అద్దం పడదామా?

బుద్ధిజీవులకు, ప్రజాస్వామ్యవాదులకు, విప్లవాభిమానులకు ఈ గడిచిన మూడు నెలల మండుటెండల వలెనే ఇది ఒక పరీక్షా సమయం. ఈ గడ్డుకాలాన్ని అధిగమించి, ప్రజాస్వామ్యవాదులు కదులుతారని ఆశిద్దాం. ప్రొ. జి.ఎన్‌. సాయిబాబాను కాపాడుకుని విడుదల చేయిద్దాం. విడుదల చేయించి కాపాడుకుందాం.

No. of visitors : 1203
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •