ఈ నెల 13న "మహారాష్ట్ర ట్రైన్ బంద్"కి సర్వ సన్నద్ధమైన స్థితిలో నిన్న 11న రైతుల డిమాండ్స్ పై ఫడ్నవీస్ ప్రభుత్వం దిగివచ్చి ఒప్పందం చేసింది. సమ్మె మూడో రోజు(3న) అక్టోబర్ లోపు పరిష్కారానికి అస్పష్ట హామీతో ఇద్దరు తొత్తు రైతు నేతల అండతో సమ్మె విరమణకు చేసిన పథకం చిత్తు అయ్యుంది. పైగా కొత్త ప్రాంతాలకు సమ్మె విస్తరణ, 5న రాష్ట్ర బంద్ సక్సెస్, 6న MP లో కాల్పులు,7న రాజస్థాన్ కి విస్తరణ,9న గుజరాత్ కి విస్తరణ, 10న ఢిల్లీలో ఉత్తరాది రైతు నేతల బెఠీ, ముఖ్యంగా 13న రైల్ బంద్ కి రైతాంగం పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి 11నాటి ఒప్పందానికి కారణం.ఒప్పంద వివరాల కంటే, మున్ముందు దాని ఫలితాలనూ,ప్రభావాలను అంచనా వేయడం ముఖ్యం.
ఇది సాంకేతికంగా ఒకే రాష్ట్ర ఒప్పందం. కానీ "గొలుసుకట్టు ఒప్పందాల ప్రక్రియ" లో భాగం.ఇది ఇక్కడ ఆగదు. రేపు MP, ఎల్లుండి రాజస్థాన్, తదుపరి గుజరాత్ ఇలా వరస ఒప్పందాలు తప్పదు.తుదకి కేంద్రం లో మోడీ ప్రభుత్వ మెడకు కూడ చుట్టుకోక తప్పదు.గాన మోడీ& ఆర్.ఎస్.ఎస్.ఆమోదం లేకుండా ఫడ్నవీస్ సర్కార్ చేసిన ఒప్పందం కాదు.అరవై దేశాలు చుట్టి వచ్చి, UP, ఢిల్లీ వంటి ప్రతిష్ఠాకర రాష్ట్రాల ఎన్నికలు గెలిచి,నీతి ఆయోగ్,GST ACT, నోట్ల రద్దు అను మూడు ఆర్ధిక విధానాల మూల మార్పులు చేసి, స్వచ్ఛ పాలన, అచ్చే దిన్ పేరిట మధ్యతరగతి జనాన్ని నమ్మిస్తూ దేశ ప్రజలని "పన్నుల వల"లోకి తెలివిగా ఈడ్చుతున్న మోడీ సర్కారు దుందుడుకు పాలనకు ఇది మొట్టమొదటి గట్టి ఎదురు దెబ్బ.భూసేకరణ చట్టం వంటి సందర్భాల్లో తగిలిన ఎదురు దెబ్బలు రాజ్య సభలో బలం లేనందున మాత్రమే. ఈసారి చట్ట సభల్లో కాకుండా కోట్లాది రైతాంగం రోడ్ల మీదికి రావడం వల్ల జరిగింది. ఈ ఎదురు దెబ్బ గుణాత్మకంగా భిన్నమైనది.
మరో గమనార్హ అంశం ఉంది. బ్యాంకుల జాతీయకరణ తర్వాత గత యాబై ఏండ్లు ప్రజల పొదుపు తో, బ్యాంక్ ఉద్యోగుల అదుపులో పెరిగిన మిలియన్ల కోట్ల డబ్బు ని బడా పెట్టుబడిదార్లకి మదుపు గా ఇవ్వడం పెరిగింది.1-పొదుపు 2-అదుపు ప్రజలది కాగా మదుపు పెట్టుబడిదారుల వంతు అయుంది. బ్యాంకులు 18%డబ్బు రైతులకు రుణం ఇవ్వాల్సిన రూల్ కి పాతర వేసి, పందికొక్కులు వంటి అతి సంపన్నులకు లక్షల కోట్లు పారు బాకీల పేరిట మాఫీ చేస్తుంది. ఇది గత కాంగ్రేస్, నేటి BJP తీరే.మోడీ హయాంలోనే 1,14,000 కోట్లమాఫీ అయుంది. ఇది చాలదని పెద్ద నోట్ల రద్దుతో నేడు కొత్తగా బ్యాంకులకి రప్పించిన లక్షల కోట్ల అదనపు డబ్బుతో మరో 8 లక్షల కోట్ల పారు బాకీలని అంబానీ, ఆదానీ వంటి ఊర పందులకి మాఫీ చేయాలని చూస్తుంది.సరిగ్గా ఊర పందులకి వెండి పళ్లెం లో మోడీ సర్కారు పాయసాన్ని వడ్డించబోతున్న సమయంలో ఊరి జనం ఎదురు తిరిగిన చందంగా తాజా రైతాంగ ఉద్యమం ముందుకొచ్చింది. గాన మోదీని గెలిపించుకున్న కార్పొరేట్ శక్తులకి ఇదో అడ్డుకట్ట.
UP ఎన్నికల విజయం కోసం రుణ మాఫీ హామీని మొదటిసారి స్వయంగా మోడీ ఇచ్చాడు. యోగి సర్కార్ పక్షికంగానైనా ఏప్రిల్ 4 నాటి తొలి మంత్రివర్గ సమావేశం అమలు చేసింది. ఇది నాన్BJP కంటే BJP రాష్ట్ర ప్రభుత్వాలనే ఒక కుదుపు కుదిపింది. ఇప్పుడు దేశ వ్యాపిత రైతాంగ ఉద్యమానికి పరోక్షంగా ఊపు ఇచ్చింది మోడీ& యోగీల చర్యలే. వారు తమ తక్షణ గెలుపు కోసం చేపట్టిన చర్యలు దీర్ఘకాలిక ఓటమికి పునాదిగా మారడం గమనార్హం. UP లో మోడీ పులి ఎక్కాడు. అది అడవులు, కొండలు, మైదానాల గుండా తెగ వేగంగా స్వారీ చేస్తున్నది. దేశ ప్రజలు ఆయన్ని పెద్ద పులి పై స్వారీ చేస్తున్న "హీరో"గా చూస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి జనం చప్పట్లతో పులి స్వారీ ప్రదర్శనను తిలకిస్తున్నారు. కానీ పులి వీపు నుండి ఎలా దిగాలో మోడీకి పాలు పోవడం లేదు. కిందికి దూకితే పులి మింగేస్తాది. దిగాకపోతే ముళ్ల కంపలకి వళ్ళు నెత్తుర్లు కారుతుంది ఆయన్ని పులిపై కూర్చోబెట్టిన గాడ్ ఫాదర్ RSS కి ఎలా దింపాలో తెలీక దిమ్మె దిరుగుతున్నది. నేడు మహారాష్ట్రలో ప్రారంభమై వరసగా ఎదురుకానున్న ఎదురుదెబ్బలు చిన్నవి కాదు.గత మూడేళ్లలా నల్లేరు మీది బండిలా ఇక ఉండదు. అయితే రైతాంగంతో సహా నేడు ముందుకొస్తున్న ప్రజా పోరాటాలని పక్క దారి పట్టించేందుకు పధకం ప్రకారం సరిహద్దుల్లో "యుద్ధ సృష్టి" జరగవచ్చు. హఠాత్తుగా "ఉగ్రవాద భూతం" సృష్టించబడవచ్చు. కార్పొరేట్ మీడియా దేశప్రజల్లో "ఉన్మాదం" ని రెచ్చగొట్టసవచ్చు. దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు రుణ మాఫీ అడగడం న్యాయమా అంటూ రైతాంగాన్ని ముద్దాయిని చేయొచ్చు. లేదా కొంత కాలం తొలుత రైతుల కోర్కెలు ఓ మేరకు అమలు చేసి, ఊపిరి పీల్చుకున్న తర్వాత కొత్త వ్యూహంతో దిగొచ్చు. ఫాసిస్ట్ పాలకులు నేటి తమ ఓటమి నుండి కూడా గుణపాఠాలు తీసుకుంటాయి. అయితే రేపు వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసినా, వారు నిన్న పకడ్బందీగా పన్నిన ఎత్తుగడలు ఫలించని అనుభవం ప్రజల కళ్ళెదుట ఈరోజు ఉంది. అది ప్రజలకీ, ప్రజాస్వామ్య శక్తులకీ స్ఫూర్తిని ఇస్తుంది.రేపటి కుట్రలని కూడా ఒడిస్తామన్న ఆత్మవిశ్వాసం ని ఇస్తుంది.
JNU, HCU,బాబ్రీ, ఉనా నుండి నేటి గోస0రక్షణ పేరిట దాడుల వరకు గత మూడేళ్ళుగా పౌర సమాజాన్ని భీతిల్ల జేస్తున్న ప్రభుత్వాన్ని మొదటిసారి మెడలు వంచిన చరిత్ర తాజా రైతాంగ ఉద్యమానికి దక్కుతుంది.అందులో ఎన్ని లోపాలైనా ఉండొచ్చు. దాన్ని నడిపిన ప్రధాన నాయకత్వ వర్గ స్వభావం ఏదయినా కావచ్చు. అది మున్ముందు వెన్నుపోటు కూడా పొడవొచ్చు.నేటి ఒప్పందమ్ జులై 25 లోపు అమలు జరిగే ముందు ఎన్ని మలుపులైనా తిరగవచ్చు. రైతాంగాన్ని ఆశా భంగానికి గురి చేసే ద్రోహాలు కూడ ఈలోపు జరగ వచ్చు. బడా కార్పొరేట్ శక్తులని పంక్తిలో కూర్చోబెట్టి వడ్డించనున్న మోడీ సర్కారు ఈ ఒప్పుఅందాలని సజావుగా అమలు కానిస్టు0దన్న భ్రమలు ఉండనక్కర లేదు.అదే సమయంలో నోటికి అందినట్లే అంది తిరిగి లాక్కునే పరిస్థితి వస్తే రైతాంగం ఇంత కంటే రెట్టింపు ఆగ్రహంతో ఉద్యమిస్తోంది.ఈదృష్టి తో దీని రాజకీయ ప్రాధాన్యతని అర్ధం చేసుకుందాం. మోడీ ఉక్కు పాలకుడేమీ కాదనీ, ఆయన ప్రజా పోరాటాల ఎదుట దూది పింజ మాత్రమేననీ ఇది నిరూపించింది. ఇక కార్మిక వర్గంతో సహా సకల పీడిత వర్గాల ప్రజలు ఉద్యమిస్తే పరిస్థితిని ఊహించుకోవచ్చు.
గత పాతికేళ్ల సరళీకరణ కాలం కంటే మున్ముందు ప్రజలకి మరిన్ని కస్టాలు పెరగనున్నాయి. జులై 1నుండి అమలులోకి రానున్నGST చట్టం ప్రజలపై ఓ ఆర్ధిక ఉగ్రవాద యుద్దం వంటిది. నూరు సోకాల్డ్ టెర్రరిజాల కంటే ప్రజలకి భయాంకరమైనది.
పై నేపథ్యంలో దేశ ప్రజలు మున్ముందు ఓ ధర్మ యుద్దానికి సిద్దం కావాల్సి వస్తుంది. వారికి నేటి రైతాంగ విజయం ఓ స్ఫూర్తి ఇస్తుంది.
Type in English and Press Space to Convert in Telugu |
బలిపీఠం పైకి దేశీయ పాడి పరిశ్రమమొన్న శ్రీరాముడు ద్వారా హిందుత్వ శక్తులు అధికారంలోకి వచ్చాయి. నిన్న ఉమ్మడి పౌరస్మృతి, కాశ్మీరు వంటి బూచితో తమ అధికారాన్ని సుస్థిరపరచుకున్నాయి. నేడు గోజాతితో... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |