పరిణామాలు, ప్రమాణాలు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

పరిణామాలు, ప్రమాణాలు

- పాణి | 18.06.2017 01:20:27pm

పరిణామ శీలమైన విప్లవ కవిత్వాన్ని విశ్లేషించే ప్రమాణాలు కూడా ఈ యాభై ఏళ్లలో మారుతూ వచ్చాయి. అసలు విప్లవ కవిత్వం అంత వరకు ఉన్న అన్ని కవితా ప్రమాణాలను తిరస్కరిస్తూ ఆరంభమైంది. తనవే అయిన సొంత ప్రమాణాలను ముందుకు తీసుకొని వచ్చింది. వాటినీ నిరంతరం మార్చుతోంది. అభివృద్ధి చేస్తోంది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే విప్లవ కవిత్వం మౌలికంగా వస్తువును మార్చేసింది. అందువల్ల సహజంగానే శిల్పంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. విప్లవ కవిత్వానికి ప్రమాణాలంటే శిల్పానికి సంబంధించినవనే కాదు. విప్లవమనేది లక్ష్యం మాత్రమేకాదు, దృక్పథం కూడా. అందువల్ల అనేక వైపుల నుంచి కవితావరణంలో ప్రమాణాలు మారాయి.

విప్లవోద్యమం కవిత్వ పాఠకులను సహితం మార్చేసింది. అంటే తనదైన కొత్త పాఠక జనాన్ని సహజంగానే విప్లవ కవిత్వం తయారు చేసుకున్నది. రాజకీయ రంగంలో ప్రజలు అంటే ఎవరు అనే దానికి బూర్జువా వ్యవస్థ ఎన్నో అర్ధ రహిత నిర్వచనాలు ఇచ్చింది. లేదా ప్రజలకు అలాంటివి ఆపాదించింది. ఎందుకంటే వాళ్లను శాశ్వత పాలితులుగా ఉంచుకోడానికి.

నక్సల్బరీ దీన్ని బద్దలు కొట్టింది. ప్రజలంటే ఓటర్లు కాదు, లేదా ఓట్లు కూడా లేని వాళ్లు కాదు, వాళ్లకు ఓటు హక్కు ఇచ్చి ఇతరులు వేసుకోవడం కాదు, ప్రజా ప్రాతినిధ్యమంటే అంకెల గారడీ కాదు, ఇప్పుడైతే కార్పొరేట్‌ శక్తులు తమ అవసరాలకు తగిన వాళ్లను ఎంచి పార్లమెంట్‌కు పంపడం కాదు. లేదా ఆ శక్తులే నేరుగా పార్లమెంట్‌లోకి వెళ్లడం కాదు... నక్సల్బరీ ఈ తరహా అర్ధాలన్నిటినీ మార్చేసింది. ప్రజలు సంపద సృష్టికర్తలు. కాబట్టి ఈ లోకం వాళ్లది. వాళ్లు దీన్ని జయించాలి.. అని చెప్పింది. కాబట్టి వాళ్లు విప్లవోద్యమాన్ని నిర్మిస్తారు. వాళ్లే నాయకులు, వాళ్లే కార్యకర్తలు. అంటే నక్సల్బరీ అసలైన ప్రజలను రాజకీయ రంగం మీదికి తీసుకొని వచ్చింది.

ఇంత రాడికల్‌ రప్చర్‌ భారత సమాజంలో మరొకటి జరగలేదు. ఈ యాభై ఏళ్లలో ఆ రప్చర్‌ తీవ్ర స్థాయిలో, విశాలమైన కార్యక్షేత్రంలో, అట్టడుగు పొరల నుంచి విస్తరిస్తూనే ఉన్నది. దాన్నుంచి విప్లవ కవిత్వం పుట్టింది. కొనసాగుతున్నది. అదేదో ఒక చిన్న బృందం పూనుకొని చేపట్టిన కవితా విధానం కాదు. అలాంటి కవితా బృందాల సృజనాత్మక రచన కూడా సమాజం మీద ప్రభావం చూపుతుంది. ఎప్పుడంటే.. ఆ నలుగురు ఒక బృందంగా నిలబడటం వెనుక, వాళ్ల వ్యక్తీకరణల వెనుక సామాజిక శక్తుల సంఘర్షణ ప్రత్యక్ష, పరోక్ష ప్రేరణా శక్తిగా ఉన్నప్పుడు.

కానీ సమాజాన్ని మౌలికంగా మార్చే శక్తిగా చరిత్రలోకి వచ్చిన నక్సల్బరీ విప్లవ కవిత్వానికి ప్రత్యక్ష ప్రేరణ. ఇంకా బాగా చెప్పాలంటే ఆ శక్తిలో సాంస్కృతిక శక్తిగా అంతర్భాగం. కవిత్వమే కాదు, పాట, విమర్శ, కథ, సామాజిక విశ్లేషణ మొదలైన ఏ ప్రక్రియ తీసుకున్నా ఇది తెలుస్తుంది.

ఈ ప్రమాణాలు రాజకీయ రంగంలో నక్సల్బరీ పంథా ప్రవేశపెట్టిన ప్రజలు, విప్లవ మౌలిక లక్ష్యాలు, పోరాటరూపాల వంటివి. అంత మౌలిక స్థాయి నుంచి విప్లవ కవిత్వం వచ్చింది. అందువల్లే కొత్త కవితా ప్రమాణాలనేగాక కవిత్వానికిి-పాఠకులకు, కవికి-ప్రజలకు, విప్లవాచరణకు-కవిత్వానికి మధ్య సంబంధాలనే కొత్త ఆవరణను సృష్టించింది.

ఇంకో ముఖ్యమైన పరిణామం జరిగింది. నక్సల్బరీ తనదైన కవులను, రచయితలను, బుద్ధిజీవులను తయారు చేసుకోవడం. ఈ యాభై ఏళ్లలో నక్సల్బరీ నుంచి అసంఖ్యాక కవులు తయారవుతున్నారు. సుప్రసిద్ధ కవుల దగ్గరి నుంచి ఒకటో రెండో ప్రభావశీలమైన పాటలు, కవితలు మాత్రమే రాసి తెరమరుగైపోయిన వాళ్ల దాకా ఎందరో ఉన్నారు. వీళ్లలో అమరులైన వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. పెద్దగా గుర్తింపు లేకపోయినా విప్లవ కవిత్వాన్ని ముందుకు తీసకపోయి ఆయా కాలాల్లో ఒక రాజకీయ, సాహిత్య అవసరం తీర్చిన కవులూ అనేక మంది ఉన్నారు. నక్సల్బరీ అట్టడుగు ప్రజలను విప్లవ కార్యకర్తలను చేసింది. వాళ్లలోంచి అసంఖ్యాకంగా కవులను, కళాకారులను తయారు చేసింది. అంటే ఎవరైతే ఉత్పత్తిలో భాగమవుతున్నారో వాళ్ల నుంచే కవులను తయారు చేయడం అనే సృజన ప్రక్రియ నక్సల్బరీ వల్లనే సాధ్యమైంది.

ఇలాంటి రాజకీయ, సామాజిక ఆవరణతో సంబంధం లేకుండా కొత్త కవితా ప్రమాణాలు రూపొందలేదు. తెలుగు కవిత్వ చరిత్రలో ఇలాంటి సామాజిక, సృజన ఆవరణ నక్సల్బరీకి ముందు లేదు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కొంత ఉన్నదనుకున్నా అది చాలా కొద్ది కాలమే. అందువల్ల అది విస్తృత రూపం తీసుకోకుండానే ఆగిపోయింది. ఇంత దీర్ఘకాలం, ఇంత పెద్ద ఎత్తున నక్సల్బరీలోనే సాధ్యమవుతున్నది. అదీ ఒక పక్క దారుణ నిర్బంధం. ఇంకో పక్క సామాజికంగా తీవ్ర అననుకూలతల మధ్య.

రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి ఫాసిస్టు వ్యతిరేక సాహిత్య కాలంలో కూడా ఈ లక్షణాలు కొన్ని ఉన్నాయి. అయితే.. యుద్ధానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా, సోవియట్‌ విజయంలో ప్రపంచ ప్రజల గెలుపును ఆకాంక్షిస్తూ సాగిన ఆనాటి ఉద్యమంలోని సామాజిక, సృజన ఆవరణకు ఈ నేల మీద అట్టడుగు ప్రజలు దేశ విప్లవానికి సాయుధ పోరాటంలోకి దిగడం వల్ల దానిలో భాగంగా రూపొందిన సామాజిక, సృజన ఆవరణకు మౌలికంగానే తేడా ఉన్నది. ఫాసిస్టు వ్యతిరేక కాలంలో గొప్ప ప్రమాణాలతో సాహిత్యం వచ్చిన మాట నిజమే. అయితే ఆ తర్వాత్తర్వాత ఆ రచయితలు వేర్వేరు రంగాల్లో సుప్రసిద్ధులు కావడం వల్ల కూడా ఫాసిస్టు వ్యతిరేక కాలంలో వచ్చిన సాహిత్యానికి మరింత గౌరవం దక్కిందేమో. ఈ కోణంలో ఆనాటి సాహిత్యాన్ని పరిశీలించవచ్చు.

పై రెండు ఉదాహరణల కంటే నక్సల్బరీకి చాలా రకాలుగా ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్నాయి. అవన్నీ విప్లవ కవిత్వమూ పుణికిపుచ్చుకున్నది. అందువల్ల అంతక ముందున్న ఏ ప్రమాణం ప్రకారం విప్లవ కవిత్వాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. సమాజంలో, విప్లవోద్యమంలో, ఇతర ప్రజాస్వామిక పోరాటాల్లో వచ్చిన పరిణామాల దృష్ట్యా విప్లవ కవిత్వ ప్రమాణాలు కూడా మారుతూ వచ్చాయి. ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకోకుండా విప్లవ కవిత్వ ప్రమాణాలను విశ్లేషించడం వీలు కాదు. విప్లవ సాహిత్య విమర్శ ప్రతి సందర్భంలోనూ వీటికి అనుగుణమైన విశ్లేషణ పద్ధతులను తీసుకొని వచ్చింది.

అయితే తెలుగు సాహిత్య విమర్శకులకు ఏ దశలోకూ విప్లవ కవిత్వాన్ని అంచనా వేసే పద్ధతులు పట్టుపడలేదు. మౌలికంగా విప్లవ కవిత్వ ప్రత్యేకతలు అర్థం చేసుకోగలిగే దృక్పథం అరగొరగా ఉండటమే దీనికి కారణం. కొందరికైతే ఆ దృక్పథం అసలే లేకపోవడం వల్ల చాలా విచిత్రమైన, అభ్యంతరకరమైన సూత్రీకరణలు చేశారు. చాలామటుకు తెలుగు సాహిత్య విమర్శకుల్లో వాచకం చదివి అందులో ఏదో సొగసు కనిపిస్తే ఆహా ఓహో అనే వాళ్లే ఎక్కువ. వాచక విమర్శ మొత్తంగానే తెలుగులో తక్కువే. ఆ పేరుతో కవితా పాదాలు ఉటంకించి మళ్లీ వాటిని వచనంలో చెప్పే విమర్శ మాత్రం చాలా ఎక్కువ. వాచకాన్ని దాని సమగ్ర అర్థంలో స్వీకరించి, అది రూపొందిన సామాజిక సమయ సందర్భాల్లో గుర్తించి, దాని సృజనతలంలో వ్యక్తమైన కళా, తాత్విక విశ్లేషణ చేసే అలవాటు మన విమర్శకుల్లో పెద్దగా లేరు. వ్యక్తీకరణలో ఏదో ప్రత్యేకత కనిపిస్తే దాన్ని మెచ్చుకునే పాఠక ప్రతిస్పందనల స్థాయిలోనే కవితా విమర్శ కొనసాగుతూ వచ్చింది. ఇది ఎక్కడి దాకా పోయిందంటే 1970వ దశకం విప్లవ కవిత్వానిదే అనే కృతకమైన పంపకాలు జరిగాయి. లేదా విప్లవ కవిత్వం రాజకీయ తిరుగుబాట్లకు ప్రేరేపించడంతో ఆగిపోయిందనే వాళ్లూ ఉన్నారు. ఇంకొంచెం గట్టి మాట అనుకొని కొందరు వర్గ దోపిడీ గురించి మాత్రం బాగానే చెప్పినా, జీవితంలోని మిగతా విషయాలు పట్టుకోలేదనే వాళ్లూ ఉన్నారు.

ఇంత అసంబద్ధమైన, అపరిపక్వమైన, అర్థరహితమైన సూత్రీకరణలు చేశారు. విప్లవ కవిత్వాన్ని విశ్లేషించగల గాఢమైన పరికరాలు లేని నిస్సహాయుల నిట్టూర్పులివి. అందువల్ల విప్లవ కవిత్వాన్ని విశ్లేషించలేకపోవడమే కాదు, కనీసంగా వాదనకు నిలబడే సూత్రీకరణలు కూడా చేయలేని విమర్శా బలహీనత చాటుకున్నారు.

నిస్సందేహంగా విప్లవ కవిత్వం వర్గపోరాట రాజకీయాల ప్రచారం కోసమే ఆరంభమైంది. అప్పటికీ ఇప్పటికీ ఈ లక్ష్యం వల్లే విప్లవ కవిత్వం ఒక ప్రవాహగుణాన్ని సంతరించుకొని కొనసాగుతున్నది. తిరుగుబాటు, ధిక్కారం, విమర్శ, త్యాగం, ప్రత్యామ్నాయం అనే లక్షణాలు అందులో ఉన్నాయి. చరిత్ర పొడవునా మానవజాతి అనేక సంఘర్షణలు, విప్లవాలు, విజయాలు, అపజయాల నడుమ వీటిని మోసుకొని ప్రయాణిస్తోంది. మరీ హ్రస్వదృష్టితో బాధపడేవారికి ఇవి తెలియకపోవచ్చు. ప్రతి తరంలో మనుషుల సృజన ప్రక్రియలను ఈ అనుభవాలే తట్టిలేపుతున్నాయి. అత్యంత వైయుక్తిక, చారిత్రక అనుభవాలుగా కళా రూపాలను సంతరించుకుంటున్నాయి. శుష్క సాహిత్యదృష్టికి అందని లోతైన కళా విశేషాలు ఇవి. ఇంత దీర్ఘకాల అవధిలో వర్గపోరాటాల ప్రేరణతో వచ్చే కవిత్వాన్ని ఎలా చదవాలి?

తొలి రోజుల్లో విప్లవ కవులు నక్సల్బరీని కవితామయం చేయడమే లక్ష్యంగా భావించారు. వర్గపోరాట రాజకీయాల వల్లే మిగతా కవిత్వంతో విప్లవ కవిత్వం వేరుపడింది. అందువల్లే అది కవితా ఉద్యమమైంది. విప్లవం తప్ప పరిష్కారం లేదని చెప్పడం, విప్లవించమని ప్రేరణ ఇవ్వడం, తాత్కాలికంగా నక్సల్బరీ దెబ్బతినిపోయినా తిరిగి వర్గపోరాటాలు బద్దలవుతాయని చెప్పడం, దానికి అవసరమైన భావజాల సన్నాహాలు చేయడం.. అప్పటి విప్లవ కవిత్వ లక్ష్యం. ఈ కర్తవ్యాన్ని ఎంతగా సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విప్లవ కవిత్వంలోని కళా విలువల వల్లే ఇదంతా సాధ్యమైంది. రాజకీయాలను కవిత్వం చేయడం వల్లే ప్రజలపై విప్లవ కవులు కళా సంబంధమైన ప్రభావం వేయగలిగారు. ఈ ప్రభావం చూసే 1970ల దశకం విప్లవ కవిత్వానిదే అని అన్నారు. అయితే అది అప్పటి దాకా వచ్చిన విప్లవ కవిత్వాన్ని సాంతం విశ్లేషించి అన్న మాట కాదు. నిజంగానే ఆ దశాబ్దపు విప్లవ కవిత్వాన్ని విశ్లేషించే పరికరాలు ఉండి ఆ పని చేసి ఉంటే ఆ తర్వాతి దశాబ్దంలోని కవిత్వాన్ని కూడా నిష్పాక్షికంగా విశ్లేషించగలిగేవారు. ఏ రాజకీయ, తాత్విక, కళా పునాది లేని పైపై రూప చర్చ చేయడమే సాహిత్య విమర్శగా అప్పటికీ, ఇప్పటికీ చెలామణిలో ఉన్నది. సారంతో ఏ సంబంధం లేని రూప చర్చ చేస్తూ విప్లవ సాహిత్యోద్యమం రూపం పట్టించుకోదనే కొంటె ఆరోపణలు చేయడం అలవాటైపోయింది.

నక్సల్బరీ వల్ల తెలుగు కవిత్వానికి బలమైన సామాజిక పునాది పడింది. ఇది అంతక ముందు నుంచీ ఉన్నదే. గతంలో కూడా సామాజిక చైతన్య ం లేకుండా సాహిత్యం రాసిన వాళ్లు ఉన్నారు. అయితే వాళ్లకు రచయితలుగా గుర్తింపు దక్కలేదు. చాలా వైవిధ్యభరితంగా సామాజిక జీవితాన్ని చిత్రించిన రచనలను, రచయితలను కాస్త అతివాద దృష్టి వల్ల పట్టించుకోకపొయి ఉండవచ్చు. ఇది లోపమే. పూర్తిగా వేరే చర్చ ఇది. కానీ ఈ సామాజిక దృక్పథాన్ని నిర్దిష్టంగా తీర్చిదిద్దింది మాత్రం నక్సల్బరీయే. విప్లవోద్యమ ప్రేరణతో కవులు, రచయితలు తమ సృజనాత్మక సాహిత్యంలో ఎన్నటికీ చెరిగిపోని విధంగా సామాజిక పునాది వేశారు. దానికి విప్లవ విమర్శ సాహిత్యరంగంలో తిరుగులేని సాధికారత తెచ్చిపెట్టింది.

ఇది ఎంత బలమైన పునాది అంటే.. ఇప్పటికీ కొందరు కవులు ఏడుపుగొట్టు కవిత్వం రాస్తూ ఉండవచ్చు.. ఒంటరి కూపాల్లో మునిగితేలుతూ అర్థంపర్థం లేని తాత్విక ప్రేలాపనలు చేస్తూ ఉండవచ్చు. వాటికి ఆ కవి బృందాల్లో తప్ప ఇతరత్రా కవిత్వంగా గుర్తింపు ఏమీ దొరకడం లేదు. కవిత్వానికి తక్కువ మంది పాఠకులు ఉంటారని అనుకున్నా.. ఈ వేలంవెర్రి కవిత్వానికి అసలే పాఠకులు లేరు. అంటే సమాజాన్ని, జీవితాన్ని కాదనుకున్న కవులు ఇంకా ఉన్న మాట వాస్తవమేగాని వాళ్లది కవిత్వమని వాళ్ల కారణం వల్లే గుర్తింపుకు నోచుకోవడం లేదు.

అంటే తెలుగులో సాహిత్యమంటే సామాజిక పునాది గల అనుభవం అని అర్థం. సాహిత్యం కాబట్టి తప్పక మనుషుల అనుభూతులు, స్పందనలు, వాళ్ల అన్వేషణలు, వాళ్లదే అయిన విమర్శలు, అంతర్దర్శనాలు, మానవ సంబంధాల సంఘర్షణలు ఎన్నో ఉంటాయి. ఈ సామాజిక పునాదిని విప్లవ కవిత్వం నిండుగా సంతరించుకున్నది. కాబట్టే 1970లలోనే నక్సల్బరీ ప్రచారంతోపాటు ఎంతో జీవిత దర్శనం కనిపిస్తుంది. నిజానికి నక్సల్బరీ అని, వర్గపోరాటమని రాజకీయ భాషలో అంటున్నాం. కాని సాహిత్యానికి సామాజికత ఉన్నదీ అంటే జీవితమంతా దాని పరిధిలోకి వచ్చినట్లే. ఈ స్పృహ తొలి దశాబ్దంలో కవిత్వం రాసిన విరసం, విప్లవోద్యమ కవులందరికీ ఉన్నది. అంటే విప్లవోద్యమానికే ఉన్నది.

దీని వల్లే విప్లవ కవిత్వం బలమైన సామాజిక, కళా శక్తిగా మారింది. కవితా ప్రమాణాలు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి. అభివృద్ధి చెందుతూ వచ్చాయి. 1970లనాటి కవితా వ్యక్తీకరణలోని వైవిధ్యమే ఆ తర్వాతి దశాబ్దాల్లో అనేక ప్రయోగాలకు, కొత్త కంఠస్వరాలకు కారణం. ఇదంతా కేవలం శిల్పం మీది మోజు కాదు. శిల్పం ప్రాధాన్యత గుర్తించిన దృక్పథవాదం. ముఖ్యంగా విప్లవోద్యమంలో వస్తున్న మార్పులు, సమాజంలో వస్తున్న మార్పులు విప్లవ పాటను, వచన కవిత్వాన్ని తీర్చిదిద్దాయి. ఉద్యమంలో, సమాజంలో వస్తున్న మార్పులతో నిమిత్తం లేకుండా విప్లవ కవిత్వంలోని మార్పులను పరిశీలించే ధోరణి మొదటి నుంచీ ఉన్నది. ఎందుకంటే దానికి చాలా మేధోశ్రమ చేయాలి. పాత విమర్శ సంవిధానాలను మార్చుకోవాలి. కళను అర్థం చేసుకోవడంలో వెంటాడుతున్న ముతక ధోరణులు, అభిరుచులు వదిలించుకోవాలి. ఇవన్నీ చాలా కష్టమైన పనులు. కాబట్టి చాలా మంది విమర్శకులు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు. ఉద్యమంలో వచ్చే మార్పులు ఎలా విప్లవ కవిత్వాన్ని మారుస్తున్నాయి? అనడానికి 1970ల తొలి ఐదారేళ్ల కవిత్వాన్ని - ఆ తర్వాతి కాలంలో తెలుగు సమాజమంతా.. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బలమైన ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటాల కాలంలో వచ్చిన కవిత్వాన్ని, పాటలను పరిశీలిస్తే తెలుస్తుంది. సమాజంలో, దాన్ని మార్చే పోరాటంలో జరుగుతున్న పరిణామాలు కవితా ప్రమాణాలను మార్చుస్తున్నాయి. వాటినీ, వీటినీ విడిగానూ కలిపీ అర్థం చేసుకుంటేనే విప్లవ కవిత్వ వికాసం తెలుస్తుంది.

కేవలం ఒక విడి కవితా ఉద్యమమైతే ఇవన్నీ జరగడం కల్ల. ఇది నైపుణ్యంగల కవుల బృందం చేస్తున్న భాషా క్రీడ కాదు. బలమైన వర్గపోరాటాల్లో కవిత్వ కళను భాగం చేయడం వల్లే ఇదంతా సాధ్యమైంది. విప్లవ కవిత్వం అందించిన సామాజిక పునాది ఎంత బలమైనదంటే..రాజకీయార్థిక వ్యవస్థ బాధితుల అనుభవాలు, ధిక్కారాలే కాదు, అతి ప్రాచీనమైన, అమానవీయమైన సాంఘిక బంధనాల్లో చిక్కుకున్న ప్రజల ఆక్రందనలన్నీ మెల్ల మెల్లగా బయటికి రావడం మొదలైంది. దళిత కవిత్వం, స్త్రీవాద కవిత్వం, ముస్లిం వాద కవిత్వం .. ఇంకా అనేక నిర్దిష్ట సాంఘిక సాంస్కృతిక అనుభవాలు ఒక కాలమంతా బలంగా వ్యక్తం కావడానికి నక్సల్బరీ సాహిత్యానికి అందించిన సామాజిక పునాదే కారణం. ఆ కాలమంతా సమాజంతో సంబంధం లేని కవిత్వ ధోరణులు కూడా వచ్చాయి. కానీ దళితులు, స్త్రీలు, ముస్లింల జీవితాల నుంచి వచ్చిన కవిత్వమే కవిత్వంగా గుర్తింపు పొందింది. ఎందుకంటే ఆ అనుభవాలు ఈ దుర్మార్గ సమాజం నుంచి కలిగిన ఆగ్రహాలు, ధిక్కారాలు.

ఇంత స్పష్టమైన సామాజిక పునాది గల విప్లవ కవితా ఉద్యమం ఐదు దశాబ్దాలుగా సాగుతున్నా, మధ్యలో దళిత, స్త్రీవాద కవితా ధోరణులు కొంత కాలం శక్తివంతంగా నడిచినా సామాజికత గల కవిత్వం మీద తీవ్ర విమర్శలు ఉంటూనే ఉన్నాయి. సామాజిక అనుభవాలను, సంఘర్షణలను, ఆందోళనలను కవిత్వంలో అరుపులు, కేకలు అనే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. కాకపోతే వాళ్లకు సామాజిక జీవితం లేకపోవడం వల్ల వాళ్ల అరుపులు ఎవరికీ వినబడటం లేదు. కవిత్వాన్ని తిరిగి వ్యక్తి మనో ప్రపంచంలోని వికారాలతో బందీని చేసి గానుగెద్దులా అక్కడక్కడే తిప్పాలనే కోరిక కొంత మంది కవులకు, విమర్శకులకు ఉన్నది. కానీ తెలుగు కవిత్వానికి నక్సల్బరీ ఇచ్చిన సామాజిక శక్తి ఇవాళ విప్లవ కవుల్లోనేగాక దళిత కవుల్లో, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్న కవులందరిలో ప్రతిఫలిస్తున్నది. దీన్నంతా ʹపాత వస్తువుʹ కింద కొట్టిపడేసే ఇంకో తరహా విమర్శక బృందం కూడా తయారైంది. వీళ్లు పైన చెప్పిన వాళ్లకంటే భిన్నం. తాము శుద్ధ కవితావాదులం కాదని అవసరం ఉన్నా లేకున్నా చెబుతూ ఉంటారు. సామాజిక వస్తువు గతానికి కొనసాగింపు అని ఈసడించుకుంటూనే దాన్నయినా కవిత్వం చేయాలని అంటారు. పైకి చూస్తే ఉద్యమాల పట్ల వ్యతిరేతక కనిపించదు. సమాజాన్ని గుర్తిస్తున్నట్లే ఉంటుంది. కేవల కవితావాదులుగా, కవిత్వ ప్రేమికులుగా కనిపిస్తారు. కానీ ఉద్యమాన్ని, విప్లవాలను గొప్పగా కవిత్వం చేసిన రచనలను కూడా గుర్తించరు. పరోక్షంగా అలాంటి కవితా వస్తువులుంటే కవిత్వం కాదనే నిశ్చయంతో ఉంటారు. దిన పత్రికలు చదివి రాసే కవిత్వమని అంటారు. బర్నింగ్‌ ఇష్యూస్‌ కోసం ఎదురు చూసి రాయడమని ఈసడించుకుంటారు. ఇంతకూ ఆలాంటి ఇష్యూస్‌ మీద కవిత్వం రాయడం నచ్చలేదా? లేదా అది కవిత్వం కాలేదని ఫిర్యాదా? రెండేదే అయితే వాదన ఈ పద్ధతిలో ఉండదు. పూర్తిగా ఇంకోలా ఉంటుంది. సామాజిక ఇతివృత్తాలపట్ల చిన్న చూపును ఈ పద్ధతి తనంత తానుగా ప్రదర్శించుకుంటోంది. ఈ మాట ఎవ్వరో ఆరోపించాల్సిన పని లేదు. ఏది రాసినా కవిత్వం కావాలనే మాట కొత్తగా ఎందుకు చెబుతున్నట్లు? ఇది చాలా పాత మాటే. కవితా రంగంలో ఉండటమంటేనే దేన్నయినా కవిత్వం చేయడం. ఇది ప్రాథమికం. దీనికి సంబంధించిన గుణదోషాలను ఎంతయినా చర్చించాల్సిందే. కానీ వస్తువు మీద, దృక్పథం మీద ఫిర్యాదు ఎందుకు? ఈసడింపు ఎందుకు?

ఇలాంటి వాళ్లు ఎన్ని ఆరోపణలు చేసినా తెలుగు కవిత్వం తన సామాజికతను వదులుకోవడం లేదు. సామాజిక పునాది మీది నుంచి ఎన్నయినా కొత్త ప్రయోగాలు చేయవచ్చు. కొత్త అనుభవాలు చెప్పవచ్చు. ప్రతి కవీ తనదే అయిన అనుభూతిని చెప్పవచ్చు. అలా చెబితేనే కవిత్వంలో వైవిధ్యం ఉన్నట్లు లెక్క. నిజానికి ఇక్కడే విమర్శ పాత్ర ఉన్నది. ఏ సామాజిక అనుభవం ఎలా వైయుక్తికంగా సొంతమవుతున్నది? ఆ వ్యక్తిదే అయిన సొంత ముద్రతో అది ఎలా కవిత్వమవుతున్నది? అని విడమర్చి చెప్పవచ్చు. విప్లవ కవులకు ఈ విషయంలో దృక్పథ స్పష్టత ఉన్నది. వాళ్లు ఈ యాభై ఏళ్ల విప్లవోద్యమ గతిశీలత, ఆటుపోట్లు, సాఫల్య వైఫల్యాలను సన్నిహితంగా గమనిస్తున్నారు. అందు వల్ల ప్రతి పరిణామాన్ని దాని సమగ్రతలో చూడగలుగుతున్నారు. అంటే సామాజిక, వైయుక్తిక జీవిత ఆవరణలను చూసే వెలుగు రేఖలు నిత్యం వాళ్ల సృజనతలంపై ప్రసరిస్తున్నాయి. అందువల్లే ఈ యాభై ఏళ్లుగా విప్లవ కవిత్వం తన ప్రమాణాలను తానే మార్చుకుంటూ, ఉన్నతీకరించుకుంటూ పురోగమిస్తోంది.

No. of visitors : 964
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •