అణు విద్యుత్ కోసం జ‌నం ప్రాణాలు ఫ‌ణం

| సాహిత్యం | వ్యాసాలు

అణు విద్యుత్ కోసం జ‌నం ప్రాణాలు ఫ‌ణం

- పి.వి. రమణ | 05.07.2017 11:52:27pm


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ శ్రీకాకుళం జిల్లా, కొవ్వాడలో ఎలాగైనా లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం కలిగించే అణువిద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని తొందరపడుతున్నాయి. రియాక్టర్ల నిర్మాణం చేపట్టాల్సిన వెస్టింగ్ హౌస్ కంపెనీ దివాళా తీసిందని తెలిసినా నిర్మాణం ఆగదంటున్నారు. పాటించవలసిన నియమ నిబంధనలను, చట్ట నిబంధనలను సైతం ఉల్లంఘిస్తున్నారని అణుశాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నా ఖాతరు చేయడం లేదు. ఇప్పటివరకూ కేంద్ర అటవీ పర్యాటక శాఖ, కేంద్ర అణు ఇంధన రెగ్యులేటరీ బోర్డ్ (ఎ.ఇ.ఆర్.బి) నుంచి అనుమతులు రాలేదు. అదేవిధంగా భూ సేకరణ చట్టం (2013) ప్రకారం ప్రకటించవలసిన సామాజిక ప్రభావ మదింపును ఇంతవరకూ విడుదలచేయలేదు.

కొవ్వాడలో గతంలో నిర్ణయించిన 6,000 మెగావాట్ల విద్యుత్కేంద్రం స్థాయిని 7,248 మెగా వాట్లకు పెెంచనున్నామని ఆమేరకు పర్యావరణ ప్రభావ మదింపు అధ్యయనాలు చేస్తున్నామని డిసెంబరు 15న రాజ్యసభలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక ప్రశ్న (3204)కు సమాధానంగా చెప్పారు.గతంలో వెస్టింగ్హౌస్ రియాక్టర్లను మితివిర్థిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినా గుజరాత్ ప్రజలు తిరస్కరించడంతో ఆ వెస్టింగ్హౌస్ రియాక్టర్లను కేంద్రం కొవ్వాడకు బదిలీ చేసింది. ఇంతవరకు ఎన్పిసిఐఎల్ చేయించిన అధ్యయనం లైట్ వాటర్ రియాక్టర్ (ఎల్డబ్ల్యుఆర్) కు సంబంధించినది కాగా వెస్టింగ్హౌస్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ (ఎల్డబ్ల్యుఆర్) ఏర్పాటు చేయనుంది. ఈ రెండింటి సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా వేర్వేరు కాబట్టి గతంలో చేసిన పర్యావరణ అధ్యయనాలు ఇప్పుడు కొరగాకుండా పోయాయి.

ప్రాథమికంగా చూస్తే కొవ్వాడ ప్రాంతం భూకంపాల జోన్లో ఉంది. గడిచిన ఏడాది ఆ ప్రాంతంలో భూమి అనేక సార్లు కంపించింది. భూకంపాల ప్రమాదాలను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలతో పరిశీలన జరిపించాల్సి ఉన్నా దాని గురించి ఎటువంటి చర్యలు చేపట్టారో ప్రజలకు సమాచారం లేదు.

కొవ్వాడలో ఆణు విద్యుత్తు కేంద్ర స్థల ఎంపికలో ప్రభుత్వం కనీస భద్రతా ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. అణు విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూపొందించిన ప్రమాణాలను స్థల ఎంపిక నుంచి పాటించాల్సి ఉంటుంది.

ఈ కేంద్రాలకు నిర్దేశించిన స్థలసేకరణ ప్రమాణాల ప్రకారం ప్రతిపాదిత కేంద్రానికి 16 కిలోమీటర్ల లోపులో ఉన్న ప్రాంతాలలో పదివేలకు మించిన జనావాసాలు ఉండరాదు. అదేవిధంగా, లక్షకు మించి జనాభా ఉన్న ప్రాంతాలు ప్రతిపాదిత కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండకూడదు. అయితే, అధికారులు ఈ ప్రమాణాలను పాటించకుండా అణు విద్యుత్తు కేంద్ర స్థాపనకు కొవ్వాడను ఎంపిక చేశారని పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్. టి. శివాజీరావు ప్రకటించారు. కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,37,944 మంది జనాభాతో ఉంది. నేడు అక్కడ జనాభా దాదాపు లక్షన్నర దాటి ఉంటుంది. కొవ్వాడలో అణు విద్యుత్తు కేంద్రాన్ని నెలకొల్పడం వల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాలు కూడా ప్రమాదానికి లోనయ్యే ప్రాంతాల పరిధిలోకి చేరుతాయి.

ప్రమాద తీవ్రత, ఆ సమయంలో నెలకొన్న వాతావరణ సరిస్థితులను బట్టి అణుధార్మిక శక్తి గొల్లప్రోలు, కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తరువాత సాధారణ పరిస్థితులు నెలకొనడానికి సమయం పడుతుందని అంతవరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాల్సిందేనని వీరు స్పష్టంగా చెపుతున్నారు. ప్రమాదం జరిగిన అణు విద్యుత్తు కేంద్రానికి 77 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు 20 సంవత్సరాల తరువాత గాని తిరిగి రావడానికి అవకాశం ఉండదు. 98 కిలోమీటర్ల దూరంలో నివసించినవారు 10 సంవత్సరాల తరువాత, 115 కిలోమీటర్ల దూరంలో నివసించినవారు అయిదు సంవత్సరాలు తరువాత, 140 కిలోమీటర్ల దూరంలో జీవించిన వారు ఏడాది తరువాత తమ తమ ప్రాంతాలకు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. అణు ధార్మికశక్తి ప్రభావం పూర్తిగా తొలగిపోయిందని అధికారులు నిర్దారించిన తరువాత మాత్రమే ఈ ప్రాంతాలు నివాసయోగ్యంగా మారతాయి. అంతవరకు ఈ ప్రాంతాలలో జనజీవనం గాని పశుసంచారం గాని కనిపించ కూడదు.

ప్రమాదాలు జరగకపోయినా విడుదలయ్యే అణుధార్మికత

ప్లాంటు వలన ఎటువంటి ప్రమాదాలు లేవనీ, భవిష్యత్తులో కూడా జరగవనీ, కేవలం కొంతమంది అభివృద్ధి నిరోధకులు ప్రమాదాల పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులను చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అధికారులు ప్రకటిస్తున్నారు.

ప్రమాదాలు జరిగినా జరగక పోయినా అణు విద్యుత్తు కేంద్రాల వల్ల ప్రజలు, పరిసరాలపై అణుధార్మిక శక్తి ప్రభావాన్ని చూపిస్తునే ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అణుధార్మికశక్తి వెలువడి అణు కాలుప్యాన్ని సృష్టిస్తుందని అనుకోవడం పొరపాటు! అణు విద్యుత్తు కేంద్రం సాధారణంగా పనిచేసినప్పుడు కూడా అణుధార్మిక శక్తితో మిళితమైన గాలి వాతావరణంలోకి, నీరు భూమిలోని చేరుతుంది.

అణుధార్మిక శక్తిని క్యూరీలలో కొలుస్తారు. అణుధార్మిక శక్తిని వినియోగించి పనిచేసే 1000 పరిశోధనా శాలలు ఉన్న ఒక వైద్య కేంద్రంలో రెండు క్యూరీల అణుధార్మిక శక్తి విడుదల అవుతుంది. దీనికి భిన్నంగా ఒక సాధారణ అణు విద్యుత్తు కేంద్రం దాదాపు 16 బిలియన్ క్యూరీల అణుధార్మికశక్తిని విడుదల చేస్తుంది.

యంత్రాలు సరిగ్గా సనిచేయకపోయినా, మానవ తప్పిదం జరిగినా అణుధార్మికశక్తి లీకవుతుంది. ఇంధనాన్ని తీసుకొని వెళ్లే పైపులు, రాడ్లు, ట్యాంకులు, వాల్వుల ద్వారా అణుధార్మికశక్తి లీకయి వాతావరణం లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. యంత్రాల జీవితకాలం పెరిగే కొద్దీ లీకుల సమస్య ఎక్కువవుతుంది. వాల్వులు, పైపులు దెబ్బతినకుండా చూడడానికి ఒకోసారి కలుషిత నీటిని రియాక్టర్ నుంచి బయటకి తీసి దానిని వదలివేయడం వల్ల కూడా అణుధార్మికశక్తి వాతావరణంలో ప్రవేశిస్తుంది. శీతలీకరణ టవర్ ఉన్న 1,000 మెగావాట్ల అణు విద్యుత్తు కేంద్రం నిమిషానికి 20,000 గ్యాలన్ల నీటిని ఉపయోగిస్తుంది. ఉత్పత్తి కార్యక్రమాలు జరిగే సమయంలో కొంత నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి ప్రవేశిస్తుంది.

ప్రమాణాలకు లోబడి అణుధార్మికశక్తి కలిగిన నీటిని వాతావరణం లోకి వదలవచ్చునని ప్రభుత్వ నిబంధనలు చెపుతున్నాయి. అయితే, ప్రమాణాలకు లోబడి ఉండడం అంటే భద్రతా ప్రమాణాలకు లోబడి ఉన్నట్టు కాదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆగస్ట్ 2006లో ప్లానింగ్ కమీషన్కు నిపుణుల కమిటీ ʹసమగ్ర ఇంధన విధాన నివేదికʹను సమర్పించింది. దానిలో ప్రత్యేకంగా ʹపర్యావరణంతో ముడిపడిన ఇంధనంʹ అన్న అధ్యాయంలో పర్యావరణంపై అణు ఇంధన ప్రభావం అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ʹప్రధమంగా రేడియేషన్ విడుదలకు సంబంధించిన ప్రమాదంతో అణు విద్యుత్ ముడిపడిఉందిʹ.

ʹపర్యావరణపరంగా అనేక స్థాయిలలో దాని ప్రభావం ఉంటుంది.మైనింగ్ చేసేటప్పుడు జరిగే ప్రమాదాలు, రాడాన్ గాస్ విడుదల, యురేనియం మైన్స్ను తవ్వేటప్పుడు విడుదలయ్యే రేడియేషన్తో కూడిన ధూళి, తవ్వకాల నుండి బయటకు వచ్చిన వ్యర్థాల నుండి, మట్టి నుండి రేడియేషన్ ఊరడమూ, ప్రోసెసింగ్లో ప్రమాదాలు, తక్కువ స్థాయో, ఎక్కువ స్థాయో రేడియోషన్ విదుదల కావడం వంటి ప్రమాదాలన్నీ అణు విద్యుత్తో ముడిపడి ఉన్నాయి.ʹ అని కమిటీ తన నివేదికలో హెచ్చరించింది. అమెరికాకు చెందిన ప్రముఖ అణుశాస్త్రవేత్త ʹʹఅణువిద్యుత్ ప్రక్రియలో 100 శాతం సురక్షితం గురించి కేవలం అవివేకులే మాట్లాడుతారుʹʹ అని అనడం సమస్య తీవ్రతకు అద్దంపడుతుంది.

సంక్షోభంలో తోషీభా, వెస్టింగ్ హౌస్ కంపెనీలు

2006లో అమెరికాలోని వెస్టింగ్ హౌస్ కంపెనీని జపాన్లోని తోషీభా కంపెనీ 5.4 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. కొవ్వాడలో అణురియాక్టర్లను నిర్మిస్తున్న కంపెనీ వెస్టింగ్ హౌస్ కంపెనీయే. అమెరికాలో జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాలలో 2006లోనే వెస్ట్ంగ్ హౌస్ కంపెనీ అణురియాక్టర్లను నిర్మించడానికి ఒప్పందం చేసుకుంది. రియాక్టర్లలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడం వలన నిర్మాణం చాలా ఆలస్యమైంది. అదనపు ఖర్చులు పెరిగిపోవడంతో నిర్మాణ వ్యయం దాదాపు 50 శాతం వరకు పెరిగిపోయింది. దాంతో రియాక్టర్ల బాధ్యతలు చూస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ ʹచికాగో బ్రిడ్జ్ అండ్ ఐరన్ʹ కంపెనీకి, వెస్టింగ్ హౌస్ కంపెనీల మధ్య పెరిగిన వ్యయం ఎవరు భరించాలి అన్న దానిమీద ఘర్షణ ఏర్పడింది. దీంతో వెస్టింగ్ హౌస్ కంపెనీ, చికాగో కంపెనీని కొనేసింది. వీటిన్నింటి వలన భారీగా పెరిగిన వ్యయం కారణంగా అమెరికాలోని వెస్ట్ంగ్ హౌస్ కంపెనీ ఆర్థిక సంక్షోభంలో పడి మార్చి 29న న్యూయార్క్లో దివాలా పిటిషన్ సమర్పించింది. దీంతో అమెరికా, రెండు రాష్ట్రాలలో నిర్మాణమవుతున్న రియాక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఆ రెండు రాష్ట్రాలలో అణుశక్తి రియాక్టర్ల నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ʹసదరన్ʹ, ʹయస్.సి.ఎ.ఎన్.ఎ.ʹ కంపెనీలు తోషిభా కంపెనీ పై నష్టపరిహారం కేసులు వేసే అవకాశం వుందనీ, దీని వలన తోషిభా కంపెనీకి దాదాపు 4.3 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని తెలుస్తుంది.

చైనాలో కూడా ఇదే కంపెనీ రెండు చోట్ల అణురియాక్టర్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. 2013 లోనే పూర్తి చేయాల్సిన నిర్మాణం 2017 కూడా పూర్తిఅయ్యేటట్లు కనిపించడంలేదు. మరో 3,4 సంవత్సరాలు పట్టే అవకాశం వుంది. దీనికి కూడా అమెరికాలో లాగనే అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోవడమే ఆలస్యానికి కారణమని అర్థమవుతుంది. ఈ తీవ్రమైన జాప్యం కారణంగా రియాక్టర్ల నిర్మాణ వ్యయం అనేక రెట్లు పెరిగిపోయింది. ఇలాంటి దివాలా తీస్తున్న కంపెనీలు నిర్మించే రియాక్టర్లలో భద్రతపై అనుమానాలు కలగడం అసహజమేమీ కాదు.

అగ్రరాజ్యాలకే ప్రమాదాలను ఎదుర్కొనే శక్తి లేదు

రష్యాలో చెర్నోబిల్, జపాన్లో ఫుకుషిమాలలో జరిగిన భారీ అణు విద్యుత్ ప్లాంట్ల ప్రమాదాల ఫలితాలను ఆ దేశ ప్రజలు నేటికి అనుభవిస్తూనే ఉన్నారు. అణు వ్యర్ధాలను బలహీనం చేయడంలో, భద్ర పరచడంలో అమెరికాతో సహా అన్ని దేశాలూ నేటికీ పరిష్కార మార్గాన్ని కనుగొనలేకపోయాయి.1986, ఏప్రిల్ 26న రష్యాలో ఉక్రేన్ ప్రిప్యాత్పట్నం దగ్గరలో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ రియాక్టర్-4లో ప్రమాదం జరిగి అణు ప్రమాద స్థాయి నెం:7 కింద వర్గీకరించబడింది. అదే స్థాయి ప్రమాదం జపాన్ ఫుకుషిమాలో కూడా జరిగింది. చెర్నోబిల్ ప్లాంట్ నుండి విడుదలైన రేడియేషన్ గాలి ద్వారా రష్యా, ఉక్రెయిన్, బెలారస్ ప్రాంతాలన్నింటా విస్తరించింది. యూరప్లో చాలా దేశాలలో కూడా ప్రాకింది. 1986 నుండి 2000 వరకూ అక్కడి నుండి 3,50,000 మంది ప్రజలను వేరేచోట్లకు తరలించారు. దుర్ఘటన కారణంగా 30 మంది అణుప్లాంట్ అపరేటర్లు ఫైర్మెన్లు మరణించారు.

ʹరష్యన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ʹ, 2006 నాటికి చెర్నోబిల్ దుర్ఘటనలో 2,12,000 మంది చనిపోయారని ప్రకటించింది. 2009లో ʹనూయార్క్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ʹ ఆధ్వర్యాన రష్యా,బెలారస్కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తల నాయకత్వంలో జరిపిన పరిశోధన అనంతరం ʹచెర్నోబిల్ దుర్ఘటన-ప్రజలు, వాతావరణంపై ప్రభావంʹ అన్న రిపోర్టు విడుదల చేశారు. అలెగ్జీ యాబ్లోకోవ్, వాసిలీ నెస్తారెంకో,అలెగ్జీ నెస్తారెంకోలు ఐదు వేల పరిశోధనా పత్రాలను పరిశీలించి 1986 నుండి 2004 వరకూ చెర్నోబిల్ ప్రమాదం వలన ప్రపంచవ్యాప్తంగా 9,85,000 మంది చనిపోయినట్లు ప్రకటించారు.పై శాస్త్రవేత్తల్లో డాక్టర్ యాబ్లోకోవ్ గతంలో రష్యన్ ప్రెసిడెంట్ గోర్బచేవ్కు పర్యావరణ సలహాదారుగా పని చేశారు. వాసిలీ నెస్తారెంకో బెలోరష్యా అణుశక్తి సెంటర్ డైరక్టర్గా పనిచేసి మొత్తం జీవితమంతా అణు ప్రమాదం గురించిన పరిశోధనల్లోనే గడిపారు. చివరకు రేడియేషన్కే గురై 2008లో మరణించారు. ఆయన కొడుకే అలెగ్జీ నెస్తారెంకో.

2011 మార్చి 11 న జపాన్ ఫుకిషిమాలో జరిగిన అణుప్రమాదం పై జపాన్ పార్లమెంటు ఏర్పాటు చేసిన స్వతంత్ర పరిశోధనా సంఘం ప్రకారం ఫుకిషిమా ప్రమాదం జపాన్ ప్రభుత్వం, ప్రాజెక్ట్ నియంత్రణా సంస్థ టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) భద్రతా చర్యల విషయాలలో కుమ్మక్కవడం వల్ల జరిగింది. ప్లాంట్లో యూనిట్ -1 సునామీ వల్లే కాదు, భూకంపం వల్ల కూడా నాశనం అయ్యింది. కానీ ఈ విషయాన్ని టెప్కో అధికారులు ఒప్పుకోలేదు. యూనిట్ను మూసినా కూడా పెద్ద భూకంప తరంగం ఢీకొంది. దాంతో వినాశనం జరిగింది. ఫుకుషిమాకి విద్యుత్తును సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ సామాన్యమైంది. భూకంపానికి నిలదొక్కుకునే శక్తి దీనికి లేదు.

కనీసం ప్రమాద సమయంలో అణు విద్యుత్కేంద్ర పరిసరాలలో ఉన్న ప్రజలను పూర్తిగా ఖాళీ చేయించాలనే స్ఫృహ కూడా అక్కడ అధికారులకు లేదు. దేశ ప్రధాన మంత్రిని తప్పుదోవ పట్టించి ఖాళీ చేయడానికి ఆదేశాలను ఇవ్వనివ్వకుండా నిరుత్సాహపరిచారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నగరపాలక సంస్థలు ప్రజలకు ప్రమాద స్ధాయిని తెలపకుండా దాచాయి.ఖాళీ చేయమని చెప్పలేదు. అసలు వాళ్లకు నిజంగా ప్రమాదం ఏ స్థాయిలో ఉందో తెలియలేదు. మార్చ్ 11 రాత్రి 9 గంటల 23 నిమిషాలకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని ఖాళీ చేయమన్నారు. 10 కిలోమీటర్ల లోపు వారికి ప్రమాదమని తెలిసినా వాళ్లని తర్వాత రోజు 5 గంటల 44 నిమిషాలకు ఖాళీ చేయమని ఆదేశించారు. ఈలోపల ప్రజల తీవ్రమైన అణు ధార్మికతకు గురయ్యారు. అంతా అయోమయం. ఎంత దూరం ఖాళీ చేయాలో ఎవరికి తెలియలేదు. సరైన సమాచారం లేక ఆగి ఆగి ప్రజలే తరలి వెళ్లారు. ఈలోపల తీవ్రమైన అణుధార్మికతకు గురయ్యారు. రేడియోధార్మిక విస్తృతిని, వ్యాప్తిని, దాని స్థాయి, తీవ్రతను టెప్కోగానీ ప్రభుత్వం గానీ గుర్తించలేదు. టెప్కో ఒక ప్రైవేటు సంస్థగా తన బాధ్యతలు ఏమాత్రం నిర్వర్తించలేదు. తప్పించుకుంది.

ప్రమాదం తరువాత ఆనాటి జపాన్ ప్రధాని నాటోకాన్ మే 28, 2011 పార్లమెంటులో ప్రసంగిస్తూ ʹ టెప్కోతో పాటు ఇతర ఎలక్ట్రిక్ పవర్ కంపెనీలు గత 40 సంవత్సరాలుగా అణుశక్తి పరిశ్రమలపై గుత్యాధిపత్యం చెలాయిస్తున్నాయి. వీరిని విమర్శిస్తున్న పరిశ్రమ నిపుణుల్ని, రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వోద్యోగులను ఈ కుట్రదారులు తయారు చేసిన నియమాలు ద్వారా అణగదొక్కుతున్నారు.మిగిలిన వారంతా తమను తాము రక్షించుకోవడానికి జరుగుతున్న అక్రమాలను చూస్తూ తప్పించుకుంటున్నారు.నాకు కూడా ఈ పాపంలో భాగం వుంది.ʹకనుకనే ఈ విషయం చెపుతున్నాను. స్వార్ధ ప్రయోజనాలు ఇటువంటి కుట్రదారులను సృష్టించాయి. దాన్ని ధ్వంసం చేయాలి. ప్రజానీకంపై వారి ప్రభావాన్ని తొలగించాలి. మొత్తం అణు పరిశ్రమను సంస్కరించడంలో ఇది మొదటి మెట్టుగా చేయాలి. అనేక మంది శాస్త్రజ్ఞలు టెప్కోకు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఆ కంపెనీ కోట్లాది డాలర్లు యూనివర్సిటీలకు విరాళాలిచ్చి వారిని పోషిస్తున్నది. కనుక టెప్కో అక్రమాల గురించి ప్రచురించిన అనేక మంది ప్రముఖులు, పత్రికా రచయితల నోరుమూయించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. చివరిగా అణు విద్యుత్ కార్యక్రమాలను మొత్తంగా రద్దు చేయాలని పార్లమెంటుని కోరుతున్నాను.ʹ అని అన్నారు. దీనిని బట్టి అణు పరిశ్రమలు ఎంతటి అవినీతికైనా,అక్రమాలకైనా దిగజారుతాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు 30 కిలోమీటర్ల లోపున ప్రత్యేకించబడిన ప్రాంతంలో నివసించే 1 లక్ష 25 వేల మంది ప్రజలను సుదూర ప్రాంతాలకు తరలించారు. మూడున్నర సంవత్సరాలు గడిచినా వారు స్వస్ధలాలకు వెళ్లలేని దుర్భర పరిస్థితులలో నేటికీ గడుపుతున్నారు.

జపాన్లో ఫుకూషిమాలో జరిగిన అణుప్రమాదానికి ప్లాంట్ నిర్మాణం చేసిన ʹటోకియో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీʹ (టెప్కో) తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భాధ్యులేనని జపాన్ జిల్లా కోర్టు ప్రకటించింది. ఒక కేసులో 62 మందికి 3,40,000 డాలర్లు నష్టపరిహారం చెల్లించమని తీర్పు ఇచ్చ్దింది. ఇంకా ప్రస్తుతానికి 12 వేల బాధితులకు సంబంధించి 30 కేసులు నడుస్తున్నాయి. ఇంతేకాక ప్రమాదం జరుగుతుందని ముందునుంచి తెలిసి ఉన్నా, అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి నిర్మాణ కంపెనీతో పాటు ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత వహించాలని ప్రకటించింది. ప్రమాదానికి గురైన అణురియాక్టర్ల నుండి వెలువడుతున్న అణుధార్మికతను తొలగించడానికి టెప్కో సంస్థ అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన రోబోట్లను వినియోగించింది. కానీ అవి లోపలికి ప్రవేశించిన తరువాత అణుధార్మికతకు గురై పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ప్రమాదానికి గురైన రియాక్టర్లను చల్లబరచడానికి రోజుకు 400 టన్నుల నీటిని వినియోగిస్తున్నారు. తిరిగి అణుధార్మికతతో కూడిన ఈ నీటిని బయటకు తీసి ఇప్పటివరకూ 1000 ట్యాంకులలో 9,62,000 టన్నుల నీటిని భద్రపరిచారు. ప్రమాదానికి గురైన అణుఅవశేషాలను పూర్తిగా తొలగించడానికి 190 బిలియన్ డాలర్ల వ్యయంతో దాదాపు 40 సంవత్సరాలు పడుతుందని అంచనా. ప్రమాదం జరిగితే ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడం ఎంత కష్టమో, ఎన్ని లక్షల కోట్ల డాలర్లు ఖర్చు అవుతామో దీన్నిబట్టి సులువుగా అర్ధమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ముందు భాగాన వున్న అగ్ర రాజ్యాలే పరిష్కరించలేని పరిస్థితుల్లో మన లాంటి దేశాల గతి ఎలా వుంటుందో చెప్పనక్కర్లేదు.

కూడంకుళం భద్రతపై అనుమానాలు

తమిళనాడు, కూడంకుళంలో రష్యా నిర్మించిన యూనిట్ 1 అణురియాక్టర్లను గ్యారెంటీ క్లాజ్ ప్రకారం పూర్తి భద్రతాపరమైన ఏర్పాట్లుతో నిర్వహించగలిగారు కాబట్టి, కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్ట్ (కె.కె.ఎన్.పి.పి.) యాజమాన్యం ఏప్రిల్ 5న తమ అధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ నిజానికి ఈ ప్లాంట్ పూర్తయి రియాక్టర్ల ఆపరేషన్ డిసెంబర్ 2014లో ప్రారంభమైంది. ఒక సంవత్సరం హామీ నిబంధన ప్రకారం డిసెంబర్ 2015 నాటికి ఈ నమూనా ఆపరేషన్ పూర్తిఅవ్వాలి. కానీ అనేక భద్రతా సమస్యలు కారణంగా ఈ కార్యక్రమం 15 నెలల ఆలస్యం తరువాత పూర్తయ్యింది. ఈ ఆపరేషన్ కాలంలో జరిగిన పరీక్షలలో అనేక భద్రతాపరమైన లోపాలు వెల్లడైనట్లు తెలుస్తుంది. ఇప్పటికి కూడా ఆ ప్లాంట్లో కీలకమైన భద్రతా పరీక్షలు జరగలేనట్లు అనేక మంది అణుశాస్త్ర నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రకటించినా ప్రభుత్వం వాటిని ఏ మాత్రం లెక్కచేయకుండానే ప్లాంట్ నిర్వహణను కొనసాగిస్తుంది.

అణుశక్తి రెగ్యులేటరీ బోర్డు కార్యక్రమాల నిర్వహణపై కాగ్

అంతర్జాతీయ ప్రమాణాలున్నా, అంతర్జాతీయ అణుసంస్థల సిఫారసులు, సూచనలు ఉన్నా అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఎఇఆర్బి) నేటికీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా కాకుండా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే పని చేస్తుంది. తను స్వంతంగా అణుశక్తి గురించీ, రేడియేషన్ గురించీ అవసరమైన సూత్రాలనూ, నిబంధనలనూ చేసే అధికారం కలిగిలేదు. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్,పాకిస్తాన్, అమెరికాలలో స్వయం ప్రతిపత్తిగల చట్టపరమైన రెగ్యులేటరీ సంస్థలు ఉన్నాయి. దేశంలో ఉన్న అణువిద్యుత్ సంస్థల పరిస్థితిని సమీక్షించిన కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) సంస్థ, ఎ.ఇ.ఆర్.బి. ఎంత లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారో వివరించింది.

1. నిబంధనలను పాటించని సంస్థలని, ప్రమాదాలకు కారణమైన వారిని శిక్షించే అధికారం లేకపోవడం.

2. 1983లో రేడియేషన్ భద్రతపై రాజ్యాంగపరమైన ఆదేశాలు ఉన్నప్పటికీ మొత్తం దేశానికి అవసరమైన భద్రతా పాలసీని నేటి వరకూ తయారు చేయకపోవడం.

3. అణు విద్యుత్ సంస్థల్లో రేడియేషన్ ప్రమాదాల గురించి పర్యవేక్షించడం, భద్రతా చర్యల బాధ్యత ప్లాంట్ నిర్వాహకులకే ఉంది. దాంట్లో భారతదేశ అణుశక్తి సంస్థలను రెగ్యులేట్ చేసే ఎఇఆర్బికి అణు విద్యుత్ ప్లాంట్లలో ప్రత్యక్షంగా ఎటువంటి పాత్ర లేదు. రేడియేషన్కు మూలమైన వాటి గురించి ఎటువంటి వివరాలు ఎఇఆర్బి దగ్గర లేవు.

4. ఉపయోగించిన తరువాత అణు వ్యర్ధాలను చాలా భద్రంగా తొలగించాలి. రేడియేషన్ వెలువడే పరికరాలను రవాణా చేస్తున్నప్పుడు వాటిని భద్రంగా తొలగించారా లేదా, రవాణా చేస్తున్న లేదా తొలగించిన పరికరాలు నిర్దేశించిన స్థలాలకు చేరుతున్నాయా లేదా అనే అంశాలపై ఎఇఆర్బి దగ్గర ఎటువంటి కార్యక్రమాలూ లేవు.

5. అణు ప్రమాదం ఏర్పడితే అత్యవసరమైన చర్యలు తీసుకోమని చెప్పే విధానాలు గానీ, అధికారం గానీ ఎఇఆర్బి దగ్గరలేవు.

6. దేశంలో అణు విద్యుత్ ప్లాంట్ల జీవితకాలం ముగిశాక వాటిని తొలగించడానికి అవసరమైన చట్టపరమైన రక్షణలేమీ లేవు. ఎఇఆర్బికి వాటి గురించి చెప్పే అధికారం లేదు. ఎఇఆర్బి 13 సంవత్సరాల క్రితం విడుదల చేసిన భద్రతా మాన్యూల్ ప్రకారం 30 సంవత్సరాల నుంచీ నడుస్తున్న అణు విద్యుత్ ప్లాంట్లతో సహా ఎవరి దగ్గరా ఈ అణుపదార్ధాల తొలగింపు కార్యక్రమాల గురించి ప్లాన్లు లేవు.

7.1962లో విడుదలయిన అటామిక్ ఎనర్జీ చట్టం, తరువాత విడుదలైన రూల్స్లో గానీ,ఈ తొలగింపు కార్యక్రమం గురించి ఎటువంటి నిబంధనలూ లేవు.

8. అంతర్జాతీయ అణుసంస్థలతో సంబంధాలు నడుపుతున్నా వారిచ్చే సూచనలు అవసరమైన పద్దతులను పాటించడంలో చాలా ఆలస్యం జరుగుతోంది.

ప్రమాదాలు జరగవనీ, జరిగినా కాపాడగలమనీ,హామీలిస్తున్న అణుశక్తి రెగ్యులేటరీ బోర్డు నిజానికి ఎంత అశక్తతతో ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది.

అణువిద్యుత్ను తిరస్కరిస్తున్న ప్రపంచ దేశాలు

ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో అణువిద్యుత్ వాటా 2007లో 17 శాతం ఉండగా, 2009 నాటికి అది 13 శాతంకి పడిపోయింది. 2030 నాటికి అణువిద్యుత్ వాటా మరింత తగ్గి 10 శాతంకి చేరుకోగలదని అంచనా. ఈ పరిస్థితి పశ్చిమ యూరప్లో అధికంగా ఉండగలదు. అక్కడ అణువిద్యుత్ వాటా నేటి 29 శాతం నుండి 2030 నాటికి 12 శాతంకి పడిపోగలదని అంచనా. యూరప్లో 1989లో మొత్తం 172 అణు రియాక్టర్లు ఉండగా నేడు అవి 147 కు చేరుకున్నవి (15 శాతం తగ్గాయి) ఇదిలా ఉండగా ప్రజల కోరిక మేరకు జర్మనీ 2020 నాటికి తన 17 రియాక్టర్లను మూసివేసే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జపాన్ (ప్రపంచంలో అమెరికా, ఫ్రాన్స్ తరువాత 3వ స్థానంలో అణువిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశం) తన 55 అణురియాక్టర్లనూ, బెల్జియం తన 7 రియాక్టర్లనూ, స్విట్జర్లాండ్ తన 5 రియాక్టర్లనూ తొలగించడానికి తమ నిర్ణయాలను ప్రకటించాయి. 2030 నాటికి ఫ్రాన్సు కూడా అణువిద్యుత్పై తన ఆధారతను ప్రస్తుత 75 శాతం నుండి 50 శాతం కి తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. గత 2011 జూన్ నెలలో ఇటలీలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తం 94 శాతం ప్రజలు అణువిద్యుత్ను వ్యతిరేకించారు.

ఆస్ట్రియా జ్వెంటెన్ డార్ఫ్లో నిర్మించిన అణురియాక్టరుకు ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో 1978లో అర్థాంతరంగా ఆగిపోయింది. డెన్మార్క్దేశంలో 1985 లో అణురియాక్టర్లు నిషేదిస్తూ ఒక చట్టమే రూపొందిచారు. గ్రీసులో అణుఇంధన కమీషన్ ఏర్పాటు చేశారు. కాని ప్రజాభిప్రాయానికి తలొగ్గి అణువిద్యుత్ పధకాలు చేపట్టలేదు. ఐర్లాండు 4 రియాక్లర్లను నిర్మించే ప్రయత్నం చేసి విపరీత ప్రజావ్యతిరేకత రావడంతో 1981 లో తన ప్రయత్నాలను మానుకుంది. 2007లో ఐర్లాండు మరో ప్రయత్నం చేసి విఫలమైంది. పోర్చుగల్ 1971-2004 మధ్య 8,000 మెగావాట్ల సామర్ధ్యంగల అణువిద్యుత్ కర్మాగారాలను నిర్మించే ప్రయత్నాలకు తిలోదకాలిచ్చింది. న్యూజిలాండ్ తమ దేశ ప్రాంతాన్ని చట్టపరంగా 1987లో ʹʹన్యూక్లియర్ ఫ్రీ జోన్ʹʹ గా ప్రకటించుకుంది. మెక్సికో 2020 నాటికి 10 అణు రియాక్టర్లను నిర్మించతలపెట్టినా, 2011 జపాన్ పుకుషిమా ఘోరప్రమాదం తర్వాత తన నిర్ణయాలను మార్చుకుంది.

అమెరికాలో, చైనాలో వెస్టింగ్ హౌస్ కంపెనీ నిర్వాకాని గ్రహించిన అనేకమంది అణుశాస్త్రవేత్తలు, నిపుణులు కొవ్వాడలో నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ʹʹవెస్టింగ్హౌస్ కంపెనీలో సీనియర్, మధ్య లెవిల్ మేనేజర్లతో మాట్లాడిన తరువాత వారిలో చాలా మంది ఇతర కంపెనీలలో ఉద్యోగాలు చూసుకుంటున్నట్లు తెలిసింది. వెస్టింగ్ హౌస్ నిర్మిస్తున్న ఎ.పి. 1000 అణురియాక్టర్లలో ఒక్కటి గూడా ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా పూర్తి ఆపరేషన్లోకి రాలేదు. పైగా మనదేశంలో నిర్మాణం చేయబోతున్న అణురియాక్టర్ల నిర్మాణం కూడా నిర్ణీత సమయంలో పూర్తయ్యే అవకాశం కనిపించడంలేదు. పైగా ఎన్ని సంవత్సరాలలో పూర్తిచేయగలరో, వాటికి పూర్తి భద్రత ఏర్పాట్లు చేయగలరో లేదో అనే దాని పై కూడా సందేహంగా వుంది. ఈ కారణాల వలన ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ వెస్ట్ంగ్ హౌస్ అణురియాక్టర్ల నిర్మాణాన్ని పూర్తిగా నిలుపుదల చేయడమే మనదేశానికి క్షేమదాయకం.ʹʹ అని అటోమిక్ ఎనర్జీ రెగులెటరీ బోర్డ్ మాజీ చైర్మన్ గోపాలక్రిష్ణన్ స్పష్టంగా ప్రకటించిన సంధర్భంలో ప్రభుత్వం ఇప్పటికైనా కొవ్వాడలో అణువిద్యుత్ ప్రాజెక్టుకు నిర్మాణం ఆపుచేయాల్సి వుంది.

మన దేశ విద్యుత్ అవసరాలను సౌరశక్తి, వాయుశక్తి, బయోమాస్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తీర్చుకోవడానికి అవకాశాలున్నాయి. కానీ ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే అణువిద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తామంటున్నారు మన పాలకులు. సామ్రాజ్యవాద దేశాల ఒత్తిడికి తలొగ్గి ప్రజల ప్రాణాలను బలిపెట్టయినా అణువిద్యుత్ ప్లాంట్ నిర్మిస్తామంటున్నారు. అమెరికాలోని త్రీమైల్ ఐలాండ్, రష్యాలోని ఛెర్నోబిల్ జపాన్లోని ఫుకుషిమాలలో జరిగిన భారీ ప్రమాదాలే కాకుండా ప్రపంచ ప్రజలకు తెలియకుండా దాచేసిన అనేక వేల కొలది ఘటనలలో కాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. ప్రమాదాలు జరిగిన ప్రాంతాలన్నీ స్మశానవాటికలుగా మారాయి. ఇన్ని భయంకరమైన సాక్ష్యాలు కళ్లెదురుగా కనిపిస్తున్నందునే శాస్త్రవేత్తలు, ప్రజలు అణువిద్యుత్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను బలిపెట్టే అధికారం ప్రభుత్వాలకు లేదని ఐక్య ప్రజా పోరాటాల ద్వారా చెప్పాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది.

No. of visitors : 931
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •