నక్సల్బరీ ఒక ఊరు మాత్రమే కాదు - హస్తభూషణమైన పుస్తకం మాత్రమే కాదు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

నక్సల్బరీ ఒక ఊరు మాత్రమే కాదు - హస్తభూషణమైన పుస్తకం మాత్రమే కాదు

- వ‌ర‌వ‌ర‌రావు | 06.07.2017 01:21:26am

నాలుగు అక్షరాల
ఈ సాధారణ పదం కేవలం ఒక గ్రామం పేరు మాత్రమే కాదని,
అది మొత్తం దేశం పేరని
నాకు తెలుసు

కొండను అద్దంలో చూపేవాళ్లు కొందరైనా ఉండవచ్చు. దోపిడీ కొండలను తవ్వే ముసలి మూర్ఖుల గురించి భావితరాలకు చెప్పేవాళ్లు మాత్రం బహు తక్కువైపోతున్న కాలం ఇది. దేశంలోకెల్లా అందమైన సూర్యోదయానికి బెంగాల్‌లోని డార్జిలింగ్‌ పెట్టింది పేరు. ముసిముసి చీకట్లలో ఆ సూర్యుణ్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వెళ్తారు.

చీకటి బతుకుల్లోకి ఆ సూర్యుడిని తీసుకువచ్చిన సంతాల్‌ రైతాంగ పోరాటానికి ఈ మే 23కు యాభై ఏళ్లు. మరో రెండు రోజుల్లోనే 25న సంతాల్‌ ఆదివాసి మహిళలు ఏడుగురు, పిల్లలు ఇద్దరు తమ నెత్తుటితో దారులు వేసారు. అది ప్రత్యామ్నాయ ప్రజల మార్గం. అది రాజమార్గానికి (ప్రధాన స్రవంతికి) భిన్నమైన కాలిబాట. ఎన్నెన్నో కాలిబాటలు కలిసిన ప్రజల పాదముద్రల బాట. చీకటి బతుకుల దగ్గరికి సూర్యుణ్ని, నిరక్ష్యరాసుల దగ్గరికి చదువును, రోగుల దగ్గరికి వైద్యాన్ని, దున్నేవారి దగ్గరికి భూమిని, దినమంతా కష్టం చేసి, నెత్తురు చెమట చేసి ఆకలితో నకనకలాడిన జానెడు పొట్ట దగ్గరికి రొట్టెను, చలికి ఎండకు పటిళ్లున పగిలిన ఒంటికింత బట్టను తెచ్చిన బాట అది. రొట్టె కోసం చెయ్యి చాచడం కాదు, రెండు చేతులు కష్టం చేయగలిగినట్టే, రెండు చేతులు పనిముట్టు ఉపయోగించినట్టే, నాగలి, సుత్తి, కొడవలి ఉపయోగించినట్టే, ఆ పనిముట్లన్నీ చేసినట్లే అవన్నీ సాధించుకోవడానికి తుపాకిని పట్టవచ్చు. గురిచూసి కొట్టనూ వచ్చు అని నేర్పిందీ ఆ బాటయే.

అన్నిటికన్నా మించి ప్రజల దగ్గరికి పాలనను తెచ్చిన నక్సల్బరీ పంథా అది. అది యాభై ఏళ్లు నడిచి వచ్చింది. గెంతులుగా వచ్చింది. పడి లేచింది. లేచి పడింది. తూర్పున బంగాళాఖాతం దగ్గర నక్సల్బరీ, ఖరీబరీ, ఫాన్సిదేవా పోలీసు స్టేషన్ల పరిధిలో, దిగువన శ్రీకాకుళంలో ఎగసిపడిన కెరటం అది.

ఈ యాభై ఏళ్ల చరిత్రలో ఒక ఇరవై ఐదేళ్ల చరిత్రను ʹనక్సల్బరీ ఒక ఊరు మాత్రమే కాదుʹ (Naxalbari is not just the Name of a Villege) అనే పేరుతో 1992లో ఆల్‌ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఇంగ్లిష్‌లో పుస్తక రూపంలో తెచ్చింది. నక్సల్బరీ వసంత మేఘగర్జనకు ముప్పై ఏళ్లు నిండిన సందర్భంలో మే 1997లో దీని తెలుగు అనువాదం శ్రామికవర్గ ప్రచురణలు తెచ్చింది. ఈ ముప్పై ఏళ్ల సభలను కలకత్తాలో నక్సల్బరీ సన్నాహక కమిటీ నిర్వహించింది. గుంటూరులో ఆల్‌ ఇండియా లీగ్‌ ఫర్‌ రెవల్యూషనరీ కల్చర్‌ (అఖిల భారత విప్లవ సాంస్కృతిక వేదిక) నిర్వహించింది.

మళ్లీ ఇప్పుడు విప్లవ రచయితల సంఘం ప్రచరణగా ఈ యాభై ఏళ్ల సందర్భంగా ఈ పుస్తకం వెలువడింది. సి.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌ అనువాదం చేసాడు.

136 పేజీల ఈ పుస్తకంలో 25 సంవత్సరాల విప్లవోద్యమ చరిత్ర మూడు భాగాలలో పదిహేడు అధ్యాయాలల్లో అలతి అలతి పదాలలో అనల్పార్థ రచనగా సాగింది. సగటున అన్ని అధ్యాయాలు ఎనిమిది పేజీలకు మించవు. పుస్తకం ఆరంభం నుంచి ప్రతి విభాగం అద్భుతమైన, ఉత్తేజకరమైన కవితా చరణాలతో ప్రారంభమవుతుంది. జోహార్లే జోలపాటలుగా వినిపిస్తుంది. ఉద్యమమే ఉగ్గుపాలుగా చెపుతుంది. పోరాటమే నడకలుగా నేర్పుతుంది.

పుస్తకాన్ని చదివించే శైలిని ఎంచుకోవడం ఈ పుస్తకం నుంచి నేర్చుకోవాలి. విషయం ఉంటుంది. వాస్తవికత ప్రాతిపదికగా ఉంటుంది. విశ్లేషణ ఉంటుంది. వ్యాఖ్య ఉంటుంది. స్పష్టత ఉంటుంది. ఈ అన్నిటికీ ఆకరమైన, ఆధారమైన మార్క్సిస్ట్‌ ప్రాపంచిక దృక్పథం ఉంటుంది.

ఇది నక్సల్బరీ చరిత్రను చెపుతుంది. చరిత్ర అంటే గతం వర్తమానంలో నిలబడి భవిష్యత్తుతో చేసే సంభాషణగా చెప్తుంది. అందుకే ఇందులో ఉన్నది ఇరవై ఐదేళ్ల చరిత్రే అయినా, అది 1992లో చెప్పిన దగ్గరే రచనగా ఆగిపోయినా, అది గతం 1967లోకి చూస్తుంది. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావంలోకి చూస్తుంది. 1946-51 మధ్యకాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోకి చూస్తుంది. వర్గపోరాటం కొనసాగినప్పుడు మాత్రమే కాదు ఓటమి నుంచి కూడా పాఠాలు తీసుకుంటుందని చెప్తుంది.

1967 మే 23న మూడు నాలుగు గ్రామాలలో ప్రారంభమైన తిరుగుబాటులో పదివేల మంది ఆదివాసి రైతాంగానికి, వాళ్లను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో వాంగ్టే అనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ చనిపోయాడు. 25న ఆ రైతాంగంపై బెంగాల్‌ ప్రభుత్వం కేంద్ర సిఆర్‌పిఎఫ్‌ బలగాలను కూడా తోడు తెచ్చుకొని కాల్పులు జరిపింది. ఇంక అక్కడి నుంచి ఈ దేశంలో గ్రామాలు అంతకు పూర్వం ఉన్నట్లుగా లేవు. ఇరవై ఐదేళ్లకు చెప్పినా, యాభై ఏళ్లకు చెప్పినా నూతన ప్రజాస్వామిక విప్లవం దాకా చెప్పవలసిన, చెప్పగలిగిన వర్తమాన చరిత్ర ఇది.

ఇది ఒక ఊరు కానట్టే ఒక సంఘటన కూడా కాదు. ఒక నిప్పురవ్వ దావానలం అయినట్టుగా ఇది అప్పటికే రగులుతున్న శ్రీకాకుళం, గోపీవల్లభ్‌పూర్‌, లఖీంపూర్‌ఖేరీ, ముషాహరి, వైనాడ్‌ (కేరళ) వంటి ఆదివాసి ప్రాంతాలు మొదలు సాయుధ పోరాట సంప్రదాయం ఉన్న పంజాబ్‌ దాకా విస్తరించి గదర్‌ పార్టీని, ముఖ్యంగా షహీద్‌ భగత్‌సింగ్‌ను ఆవిష్కరించుకున్నది.

ఈ ఆదివాసి రైతాంగ పోరాటాన్ని నిర్వహించింది అఖిల భారత విప్లవకారుల సమన్వయ కమిటీ. ఒక ప్రాతిపదికను సమకూర్చింది చారు మజుందార్‌ రచించిన తెరాయి (ఎనిమిది) దస్తావేజులు. చైనా యుద్ధం తరువాత పెట్రేగిన జాతీయోన్మాద స్థితిలో సిపిఐ చీలి సిపిఎం కూడా ఏర్పడింది. ప్రజలు, శ్రేణులు ఈ చీలిక - యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చడానికైతే బాగుండునని ఆశపడ్డారు. కావచ్చునని శత్రువు భయపడ్డాడు.

1965లో ప్రారంభమైన తెరాయి దస్తావేజులు 1967 నాటికి పూర్తయ్యాయి. 1967లో ఎన్నికలు జరిగాయి. తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బెంగాల్‌లో బంగ్లా కాంగ్రెస్‌ అజయ్‌ ముఖర్జీ ముఖ్యమంత్రిగా లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. జ్యోతేదార్ల చేతుల్లో ఉన్న ఆరు లక్షల హెక్టార్ల భూమిని భూమిలేని నిరుపేదలకు పంచుతామని సిపిఎం వాగ్దానం. అప్పటికి సిపిఎం సిలిగురి డివిజన్‌ కార్యదర్శిగా ఉన్న చారు మజుందార్‌ నాయకత్వంలో రైతాంగం ఆ పని ప్రారంభించింది. 1967 మార్చ్‌ 3 నుంచి భూస్వాధీన పోరాటం మొదలైంది. ఈ వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

అంతకన్నా నక్సల్బరీ పంథా మొట్టమొదటిసారిగా ఈ దేశ రాజకీయ ఆర్థిక మౌలిక విశ్లేషణ చేసింది. ఇది అర్ధవలస, అర్ధ భూస్వామ్య దళారీ నిరంకుశ వ్యవస్థ అని, ఈ వ్యవస్థను దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారా కూల్చాలని స్పష్టంగా చెప్పింది.

ఈ దేశ స్వభావానికి పార్లమెంటరీ రాజకీయాలు పనికిరావని, నూతన ప్రజాస్వామిక విప్లవం మాత్రమే 1857లో ప్రారంభమైన ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేయగలుగుతుందని చెప్పింది.

ఈ విప్లవం ప్రధానంగా వ్యవసాయిక విప్లవమని, ఈ విప్లవానికి దున్నేవారికే భూమి నినాదం భూమిక అని నిర్వచించింది. గ్రామాలను విముక్తం చేసి, పట్టణాలను చుట్టుముట్టి ప్రజల చేతికి రాజ్యాధికారం ఇవ్వడం కోసం స్థావర యుద్ధ కాలం దాకా గెరిల్లా యుద్ధతంత్రం పాటించబడుతుందని, ఇందు కోసం విముక్తి ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

భూస్వాధీనం అనే ఆర్థిక పోరాటం, అది కాపాడుకోవడానికి గెరిల్లా సైనిక పోరాటం రెండూ సంలీనమై సాధించే ప్రజల చేతికి రాజ్యాధికారం లక్ష్యం. ఇందుకు మావో చెప్పిన మూడు మంత్రదండాలు - ఉక్కు శిక్షణ గల పార్టీ, సామ్రాజ్యవాద, భూస్వామ్య దోపిడీకి గురవుతున్న వర్గాల ఐక్య సంఘటన, ప్రజాసైన్యం - నిర్మించుకునే క్రమంలోనే ఈ వర్గ యుద్ధం కొనసాగుతుంది.

ఈ లక్ష్యం కోసమే 1969 ఏప్రిల్‌ 22న సిపిఐ (ఎంఎల్‌) ఏర్పడింది. నక్సల్బరీ విస్ఫోటనానికి దేశీయంగా ఉన్న బూర్జువా నియంతృత్వం ఒక కారణమయితే, చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం తక్షణ అంతర్జాతీయ విప్లవ ప్రేరణ. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎనభై దేశాల్లో 1969 ఏప్రిల్‌ 22 రోజునే వర్గపోరాటాన్ని కొనసాగించడానికి ఎం.ఎల్‌. పార్టీలు ఏర్పడ్డాయి. 1956 నుంచి 66 దాకా కృశ్చెవ్‌ ఆధునిక రివిజనిజానికి వ్యతిరేకంగా నిర్వహింపబడిన మహత్తర చర్చ ఫలితం అది.

1969 మేడే రోజు సిపిఐ (ఎం.ఎల్‌.) ఏర్పాటు ప్రకటన కలకత్తాలోని షహీద్‌ మినార్‌ మైదానంలో జరిగింది. భూస్వాముల దురాక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడం, వడ్డీ వ్యాపారుల రుణపత్రాలను తగలబెట్టడం, వర్గశత్రువులపై దాడి చేయడం ఈ పోరాట ప్రాంతాలంతటా పోరాట రూపాలుగా ముందుకు వచ్చాయి. వర్గ శత్రువుల నిర్మూలన ఒక ఉన్నత పోరాట రూపం అవుతుందనే భ్రమ కలిగింది. శ్రీకాకుళంలో కోరన్న, మంగన్నల అమరత్వంతో 1967 అక్టోబర్‌ 31న ఇవ్వబడిన సాయుధ పోరాట పిలుపు నవంబర్‌ 25న ఆచరణలోకి వచ్చింది. అంతటా తీవ్రమైన రాజ్యహింస ప్రారంభమైంది.

1972 నాటికి నక్సల్బరీ, శ్రీకాకుళాలు సెట్‌బ్యాక్‌కు గురయ్యాయి. సిపిఐ (ఎం.ఎల్‌.)లో చీలికలు వచ్చినయి. ఈ పుస్తకంలోని చరిత్రంతా 1992 దాకా మళ్లీ విప్లవ శక్తుల పునరేకీకరణ కోసం జరిగిన కృషి, నక్సల్బరీ పంథాలో విశ్వాసం ఉన్న పార్టీలు ఈ కాలమంతా తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూ, భూస్వాధీనం చేసుకుంటూ, వర్గపోరాటం కొనసాగిస్తూ నిర్మాణం చేసిన ప్రత్యామ్నాయ రాజకీయాలు.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలలో సిపిఐ (ఎం.ఎల్‌.) పీపుల్స్‌వార్‌, బెంగాల్‌, బీహార్‌లలో సిపిఐ (ఎం.ఎల్‌.) పార్టీ యూనిటీ, ఇవే రెండు రాష్ట్రాలలో ఎం.సి.సి. ఈ మూడు పార్టీలు ఎన్నికల బహిష్కరణ, సాయుధ పోరాట ప్రధాన పోరాట రూపం, రాజ్యాధికారం లక్ష్యంగా ఈ పోరాటాలు నిర్వహించాయి. ఈ క్రమంలో భౌతిక ఘర్షణలు జరిగాయి. నష్టాలు జరిగాయి. 1999లో సిపిఐ (ఎం.ఎల్‌.) పార్టీ యూనిటీ, పీపుల్స్‌వార్‌ ఐక్యమై సిపిఐ (ఎం.ఎల్‌.) పీపుల్స్‌వార్‌ ఏర్పడింది. 2004లో సిపిఐ (ఎం.ఎల్‌.) పీపుల్స్‌వార్‌, ఎం.సి.సి. ఐక్యమై సిపిఐ (మావోయిస్టు) ఏర్పడింది. 2014 మేడే రోజు ఎస్‌.ఎ. రవూఫ్‌ నాయకత్వంలోని సి.పి.ఐ. (ఎం.ఎల్‌.) కూడా సి.పి.ఐ. (మావోయిస్టు)గా రూపొందింది.

ఈ పుస్తక రచన (1992) నాటికి, మొదటి తెలుగు ముద్రణ (1997) నాటికి ఈ ఐక్యత కృషి మాత్రమే ఉన్నది గాని ఈ రెండో ముద్రణ నాటికి ఈ స్వప్నం సాకారమయింది.

1972 నాటికి నక్సల్బరీ, శ్రీకాకుళాల పోరాటాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. అందుకు కారణాలు కూడా ఈ పుస్తకం చర్చించింది. అటువంటి స్వీయవిమర్శ 1974లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ చేసుకున్నది. దీర్ఘకాలిక సాయుధ పోరాటం చెప్తూనే సత్వర యుద్ధ చర్యలు చేపట్టామని, శ్రీకాకుళం యెనాన్‌గా మారిందని, యాభై వేల సైన్యమైనా శ్రీకాకుళాన్ని ఏమీ చేయలేవని, 1975 నాటికి భారత దేశం విముక్తం అవుతుందని స్వీయాత్మక భావనకు, పవిత్రమైన కోరికలకు పార్టీ గురైంది.

సుధృడమైన ప్రజాపంథా రూపొందించుకొని, ప్రజాసంఘాల నిర్మాణం చేసి వర్గపోరాటాన్ని నిర్వహించాలని సంకల్పించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలపు ఐక్య సంఘటన అనుభవం వల్ల, ప్రజాపంథా అనుభవం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 1972 నాటికే విరసం (1970), జననాట్యమండలి (1972) ఏర్పడినాయి. 1974లో రాడికల్‌ విద్యార్థి సంఘం ఏర్పాటుతో ఒక రాడికల్‌ మార్పు వచ్చింది. 1975 ఫిబ్రవరి ఆర్‌.ఎస్‌.యు. ప్రథమ మహాసభలు, జూన్‌లో ఎమర్జెన్సీ ఆర్‌.ఎస్‌.యు. శ్రేణులకు అజ్ఞాత జీవితాలకు వెళ్లి భూసంబంధాల అధ్యయనానికి శత్రువు కల్పించిన సౌకర్యం అయింది. ఈ కాలమంతా భూసంబంధాల అధ్యయనం, విశ్లేషణ ఎమర్జెన్సీ ఎత్తివేసే నాటికి ఒక వెల్లువ అయింది. 1978 ఫిబ్రవరి-మే నెలల్లో ఆర్‌.ఎస్‌.యు. (వరంగల్‌), ఆర్‌.వై.ఎల్‌. (గుంటూరు) ʹగ్రామాలకు తరలండిʹ పిలుపు ఇచ్చాయి. జగిత్యాల జైత్రయాత్ర నుంచి నక్సల్బరీ పంథా ఆటుపోట్లతోనైనా, లోటుపాట్లతోనైనా అప్రతిహతంగా ఇప్పటికీ కొనసాగుతున్నది.

1980లో సిపిఐ (ఎం.ఎల్‌.) పీపుల్స్‌వార్‌ ఏర్పడి దండకారణ్య పర్‌స్పెక్టివ్స్‌ రచించుకొని విముక్తి ప్రాంతాల నిర్మాణానికి బయలుదేరింది. గడ్చిరోలి (మహారాష్ట్ర), బస్తర్‌లకు దళాలను పంపించింది. గడ్చిరోలిలో పెద్ది శంకర్‌ అమరత్వంతో తాత్కాలికంగా గాయపడినా దండకారణ్య ఉద్యమంగా పిలువబడే ఈ విప్లవం ముప్పై ఐదేళ్లుగా కొనసాగుతూ, అన్ని రకాల రాజ్యహింస అభియాన్‌లు, సాల్వాజుడుం, గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ మూడు దశలు కూడా తట్టుకొని ప్రజల మీది యుద్ధాన్ని ప్రజాయుద్ధంతో తిప్పికొడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా జనతన సర్కార్‌లు నిర్వహిస్తున్నవి. ఇది ఆదివాసి, దళిత, సన్నకారు, చిన్నకారు రైతుల ఐక్య సంఘటన నాయకత్వంలో 2000 సంవత్సరంలో ఏర్పడిన ప్రజా విముక్తి సైన్యంతో సామ్రాజ్యవాద తైనాతీలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఢీకొంటున్నది. స్వావలంబన ప్రాతిపదిక గల స్వపరిపాలనతో బూర్జువా ప్రభుత్వాల ఎన్నికలు, పన్నులు బహిష్కరించి, ప్రజలు తమ అధికారాన్ని, తమ అభివృద్ధిని తమ స్వాధీనంలో అమలు చేస్తున్నారు.

ఇదంతా నెత్తుటి బాటలో, ముళ్ల బాటలో సాగి వచ్చిన నక్సల్బరీ పంథా. నక్సల్బరీ పంథా అంటే ప్రజలు రాజ్యాధికారాన్ని చేపట్టడం. బూర్జువా నియంతృత్వాన్ని కూలదోయడం. ఒక్క దండకారణ్యంలోనేనని కాదు, జార్ఖండ్‌లోని సరండాలో, బెంగాల్‌, బీహార్‌లలో, బెంగాల్‌లోని జంగల్‌మహల్‌లో, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కలిసే ట్రై జంక్షన్‌ అడవుల్లో, పడమటి కనుమల్లో, ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతపు నారాయణపట్నాలో ఈ విముక్తి ప్రాంతాల ప్రయోగం జరుగుతూ ఉన్నది.

ఈ పుస్తకం 1992 బీహార్‌ బెంగాల్‌లో గయా, పాలాము, ఔరంగాబాద్‌, జహనాబాద్‌లో రైతాంగ పోరాటాల గురించి, రైతాంగం సాధించిన విజయాల గురించి మాట్లాడుతుంది. ఎమర్జెన్సీ కన్నా ముందు, ఎమర్జెన్సీ కాలంలోను ఉజ్వలంగా సాగిన భోజ్‌పూర్‌ పోరాటం గురించి మాట్లాడుతుంది. నక్సల్బరీ, శ్రీకాకుళాల పంథాలో సాగిన భోజ్‌పూర్‌ పోరాటపు నాయకత్వం జౌహర్‌ అమరత్వం తరువాత సిపిఐ (ఎం.ఎల్‌.) లిబరేషన్‌ చేతుల్లో మారుతూ వచ్చిన రివిజనిస్టు పోకడల గురించి కూడా మాట్లాడుతుంది.

ఈ పుస్తకం ప్రధానంగా 1992 నాటికే మూడు సాయుధ విప్లవ పార్టీల మీద ఆశలు పెట్టుకొని ఆ మూడు పార్టీల నాయకత్వంలో సాగిన పోరాటాల గురించి, నిర్మాణమైన ప్రజాసంఘాల గురించి మాట్లాడింది. ఒక భవిష్యత్తు దర్శనం లాగా ఈ రెండో ముద్రణ (2017) వెలువడే నాటికి మళ్లీ ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఆ మూడు పార్టీలు, నాలుగోదైన సిపిఐ (ఎం.ఎల్‌.) నక్సల్బరీ ఐక్యమై ఏర్పడిన ఐక్య మావోయిస్టు పార్టీయే ఇవాళ నక్సల్బరీ పంథాను కొనసాగిస్తున్నది.

అట్లని నక్సల్బరీ పంథాను స్వీకరించి, ఆచరిస్తున్న విప్లవ గ్రూప్‌లు, లేదా పార్టీలు బయట ఇంకా మిగిలి లేవని కాదు. ఆ పంథానే 1967 నుంచి నమ్ముతూ ఆచరిస్తున్న వ్యక్తులు లేరని కూడా కాదు. వాళ్లందరినీ తనను తాను బోల్షివీకరించుకునే క్రమంలో విప్లవ పార్టీ నిర్మాణం తనలోకి ఇముడ్చుకోవాలి. దేశానికంతా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లగలగాలి. నక్సల్బరీ స్వప్నాన్ని సాకారం చేయగల ఉక్కు శిక్షణ గల బోల్షివిక్‌ పార్టీ ఏర్పడకుండా భారత దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం విజయవంతం కాదు.

ఆ అవగాహన ఇంత చిన్న పుస్తకంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నది.

1970వ దశకం సిపిఐ (ఎం.ఎల్‌.) చీలికల దశకంగా కనిపిస్తుంది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన దగ్గర నుంచి ఐక్యతా కృషి మొదలైంది. అన్ని పార్టీలు ప్రజాసంఘాల నిర్మాణాల మీద దృష్టి పెట్టాయి. ప్రజాపంథాను అమలు చేయడం మీద దృష్టి పెట్టాయి. సిపిఐ (ఎం.ఎల్‌.) పీపుల్స్‌వార్‌ ఏర్పడిన తరువాత అప్పటికే ఉన్న ఆర్‌.ఎస్‌.యు, ఆర్‌.వై.ఎల్‌.లకు తోడుగా రైతు కూలీ సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్యలు 1981లో ఏర్పడ్డాయి. దండకారణ్యంలో క్రమంగా దండకారణ్య క్రాంతికారీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌, మహిళా సంఘటన్‌లు ఏర్పడ్డాయి. చేతనా నాట్యమంచ్‌ ఏర్పడింది.

బెంగాల్‌, బీహార్‌లు మాత్రమే కాదు, దేశమంతటా అన్ని విప్లవ పార్టీలు ప్రజాసంఘాల నిర్మాణం చేసాయి.

మూడు విప్లవ పార్టీలు ఐక్యమయ్యే కృషిలో భాగంగా అఖిల భారత స్థాయిలో విప్లవ ప్రజాసమాఖ్యలు ఏర్పడ్డాయి. సాహిత్య, కళా, సాంస్కృతిక రంగాల కోసం 1981లో ప్రారంభమై 1983లో ఎఐఎల్‌ఆర్‌సి ఏర్పడింది. 1985లో ఈ పుస్తకం కోసం కూడా అధ్యయనం చేసి, పరిశోధన చేసి వెలువరించిన ఎఐఆర్‌ఎస్‌ఎఫ్‌ ఏర్పడింది. ఇది విప్లవ విద్యార్థుల సమాఖ్య.

దేశ బూర్జువా రాజకీయాలలో ఎమర్జెన్సీ (1975) దాని ఒక నగ్న స్వరూప వ్యక్తీకరణ అయితే, 1984 మరొక బీభత్స వ్యక్తీకరణ. ఎమర్జెన్సీ ప్రాథమిక హక్కులను రద్దు చేయడం మాత్రమే కాదు, పట్టణ సుందరీకరణ, ముస్లింలకు కుటుంబ నియంత్రణ అనే రెండు ప్రపంచ బ్యాంక్‌ కర్తవ్యాల కోసమే విధించబడింది. 1984 సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు, కాషాయీకరణకు రిహార్సల్స్‌ ప్రారంభమైన కాలం. 1991 సామ్రాజ్యవాద ప్రపంచీకరణతో, 1992 బాబ్రీ మసీదు విధ్వంసంతో అది బూర్జువా రాజకీయాల ఎజెండాగా మారింది. దాని ఆక్టోపస్‌ రూపం ఇవాళ మనం చూస్తున్నాం. పార్లమెంటరీ పార్టీలన్నీ ఆ కుదురులోనే ఉన్నాయి. విప్లవోద్యమం ఒక్కటే ప్రజల ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రతిపాదిస్తుంది.

రైతాంగం, కార్మికులు కార్మిక వర్గ నాయకత్వంలో ముందుకు తీసుకొని వెళ్తున్న ఈ నక్సల్బరీ పంథాను ప్రచారం చేయడానికి నక్సల్బరీ కాలంలో వలెనే, జగిత్యాల జైత్రయాత్ర కాలంలో వలెనే ఒక పెద్ద సాంస్కృతిక కదలిక రావల్సి ఉన్నది.

నక్సల్బరీ, ఆదివాసి రైతాంగ పోరాటానికి అండగా చారు మజుందార్‌ విద్యార్థులను, ఉద్యోగులను చదువులను, కొలువులను వదిలి గ్రామాలకు తరలమని చెప్పాడు. కలకత్తా, జాదవ్‌పూర్‌ యూనివర్సీటీలే కాదు, ఆంధ్ర, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి వేలాది మంది విద్యార్థులు ఆ పిలుపు అందుకొని పోరాటంలోకి దూకారు.

1978 ʹగ్రామాలకు తరలండిʹ పిలుపు పీపుల్స్‌వార్‌ పార్టీ నిర్మాణానికే దోహదం చేసింది. ఎందరో పోరాట యోధులను ఇచ్చింది. పోరాట శ్రేణులను ఇచ్చింది. ఎందరో అమరులయ్యారు. ఆ త్యాగాలేవీ వృథా కాలేదు. ఇవాళ మావోయిస్టు పార్టీ శత్రువుకు అత్యంత ప్రమాదకరమైన అంతర్గత శత్రువు అయింది.

రాజ్యాన్ని, కేంద్రాన్ని, మనకివ్వబడిన బూర్జువా వ్యవస్థలన్నిటిని కూలదోసి ఒక ప్రత్యామ్నాయమైన సోషలిజాన్ని నిర్మాణం చేసుకోవడానికి, నూతన ప్రజాస్వామిక విప్లవ దశలో ప్రధాన సాయుధ పోరాట రూపానికి అండగా ఒక విశాల ఐక్య సంఘటన నిర్మాణం చేయడం ఇవాళ నక్సల్బరీ పంథా మనమీద పెడుతున్న బాధ్యత.

సామ్రాజ్యవాద ఫాసిజాన్ని, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ఓడించి, ప్రజల ప్రజాస్వామ్యాన్ని, ప్రజల సంస్కృతిని నెలకొల్పడానికి సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో మనం చేయాల్సిన కృషిని నిర్వచించుకోవడానికి ʹనక్సల్బరీ ఒక ఊరు మాత్రమే కాదుʹ పుస్తకం మన చేతిలో ఒక సూక్ష్మదర్శినిగా, ఒక దూరదర్శినిగా ఉపయోగపడుతుంది.

ʹనక్సల్బరీ ఒక ఊరు మాత్రమే కాదుʹ అనే పుస్తకం హస్తభూషణమైన పుస్తకం మాత్రమే కాదు, అధ్యయనానికి, అవగాహనకు, ఆచరణకు పురికొల్పే ఒక ఆర్గనైజర్‌.

No. of visitors : 990
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  International Seminar on Nationality Question
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  తుఫాను బాధితులకు సాయం చేయడం కూడా నేరమేనా?
  ఎప్పటికప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టి బతికేస్తున్నారు
  కుట్ర
  జర్నలిస్టు జమాల్‌ అహ్మద్‌ ఖషోగి హత్య
  నామ్ కే లియే
  వరి గొలుసుల మార్మిక సవ్వడి
  ఆఖరున కలుసుకున్నాం - అమరత్వాన్ని చూసాం
  చర్చనీయాంశం గద్దరా? విప్లవోద్యమమా?
  పిడికెడు ఆత్మగౌరవం కోసం
  పీక‌ నొక్కు సిద్ధాంతం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •