ప్రమాదకరమైన పవర్‌ గ్రిడ్‌కు వ్యతిరేకంగా భాంగార్‌ ప్రజల ఉద్యమం

| సాహిత్యం | వ్యాసాలు

ప్రమాదకరమైన పవర్‌ గ్రిడ్‌కు వ్యతిరేకంగా భాంగార్‌ ప్రజల ఉద్యమం

- పి.వి. రమణ | 16.07.2017 02:03:47am

తమ భూములను రక్షించుకోవడానికి సింగూర్‌, నందిగ్రామ్‌లలో జరిగిన ప్రజా ఉద్యమాలకు మద్దతు ప్రకటించి, 34 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన సి.పి.ఎమ్‌. ప్రభుత్వాన్ని దించేసి అధికారంలోకి వచ్చింది తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మమతా బెనర్జీ. అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పేరుతో రైతుల భూములను ఎట్టి పరిస్థితిలోనూ బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తన హయాంలో ఉండదని ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ, బూర్జువా రాజకీయ పార్టీల హామీలు నీటిమూటలేనని ప్రజలు గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదు.

2013లో మొదట చిన్న పవర్‌ హౌస్‌ నిర్మిస్తామని ప్రజలను మోసగించి, భాంగార్‌, ఖామారైత్‌, మచ్చి బంగా, అలోనా, పద్మపుకుర్‌ గ్రామాల నుండి 13.5 ఎకరాల పంట భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఘర్షణ ప్రారంభమైంది. తూర్పు ప్రాంత అభివృద్ధికి అవసరమైన విద్యుత్‌ సరఫరాకు ఉపయోగపడే విద్యుత్‌ సరఫరా స్టేషన్‌ నిర్మాణానికి ʹపవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాʹ (పి.జి.సి.ఐ.ఎల్‌) పశ్చిమ బెంగాల్‌, 24 పరగణాల జిల్లాలో, భాంగార్‌ బ్లాక్‌ పరిధిలో నిర్మించే ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 డిసెంబర్‌ 2015 న అనుమతి ఇచ్చింది.

ఈ 400 కె.వి సబ్‌స్టేషన్‌ కోసం ఏర్పరిచే 16 ట్రాన్స్‌ మిషన్‌ లైనులు ఆ చుట్టు ప్రక్కల అనేక గ్రామాల మీద ప్రభావం చూపుతాయి. ప్రత్యేకంగా 16 గ్రామాల మీద వెంటనే ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతంలో మూడు పంటలు పండే వ్యవసాయ భూములు, విరివిగా చేపలు లభించే అనేక చెరువులు ఉన్నాయి. ఈ 16 గ్రామాలలో ట్రాన్స్‌ మిషన్‌ లైన్లక్రింద ఉన్న దాదాపు 1000ఎకరాల పైన తీవ్రప్రభావం చూపుతుంది. భవిష్యత్‌ లో ఆ ప్రాంత భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోయే అవకాశం ఉంది. అయినా ఆ ప్రాంతరైతులకు ఎటువంటి నష్ట పరిహారం ప్రకటించలేదు. స్వాధీనం చేసుకున్న 13.5 ఎకరాల భూమికి సంబంధించిన 11 మంది రైతులు నేటికీ నష్టపరిహారం తీసుకోకుండా పోరాటం చేస్తున్నారు.

ప్రభుత్వ నవరత్నాల కంపెనీలలో ఒకటైన పి.జి.సి.ఐ.ఎల్‌ ʹʹరాజర్‌హాట్‌ 400/220 కె.వి, ఎస్‌.ఎఫ్‌. 6 గ్యాస్‌ ఇన్స్‌లేటెడ్‌ సబ్‌స్టేషన్‌ʹʹ దానికిఅవసరమైన 953 కిలోమీటర్ల పొడవైన 400 కె.వి సర్‌క్యూట్‌, 450 ఎమ్‌. డబ్ల్యు ట్రాన్స్‌ మిషన్‌ లైన్లు నిర్మాణానికి ప్రణాళిక వేసారు. దానిపేరు రాజర్‌హాట్‌ అని పెట్టినా, ఇది నిజానికి భాంగార్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ సబ్‌స్టేషన్‌ నుండి ప్రారంభమైన ట్రాన్స్‌మిషన్‌ వైర్‌ లైన్లు 7 జిల్లాల్లో (దక్షిణ 24 పరగణాస్‌, పశ్చిమ 24 పరగణాస్‌, నాడియా, హుగ్లి, బర్ద్వాన్‌, ముషీరాబాద్‌, బీర్‌భూమ్‌,) గల 80 గ్రామాలగుండా ప్రయాణించి జార్ఖండ్‌, బీహార్‌ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తుంది.

కొత్త భూసేకరణ చట్టప్రకారం మొదట భూమి దేనికోసం తీసుకుంటున్నారో చెప్పకుండానే భూమిని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేటప్పడు ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలో సామాజిక, పర్యావరణ పరమైన అంశాలలో జరిగే మార్పుల గురించి అధ్యయనం చేసి సామాజిక ప్రభావ నివేదికను ప్రజలందరికి అర్ధమైయే భాషలో వివరించి, గ్రామ సభలలో వారి అభిప్రాయాలను తీసుకున్న తరువాతే ప్రాజెక్టును ప్రారంభించాలి. బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన ఈ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించింది.

ప్రమాదకరమైన ఎస్‌.ఎఫ్‌. గాస్‌

ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకరంగా మారిన భూతాపానికి కారణమైన హరిత గృహ వాయువులలో (గ్రీన్‌హౌస్‌ గ్యాసస్‌) లో సల్ఫర్‌ హెక్సా ఫ్లోరైడ్‌ (ఎస్‌.ఎఫ్‌.6) ఒకటి. ఇది కార్భన్‌ డై ఆక్సైడ్‌ కన్నా 23,900 రెట్లు ప్రమాదకరమైనది. దీనిని విద్యుత్‌ పరిశ్రమల్లో హై వోల్టేేజ్‌ సర్క్యూట్‌ బ్రేకర్స్‌, స్విచ్‌ గేర్‌, ఇతర విద్యుత్‌ పరికరాల తయారీలో వినియోగిస్తారు. ఈ గ్యాస్‌ వాతావరణంలోకి విడుదల అయితే చాలా దీర్ఘకాలం అంటే దాదాపు 800 నుండి 3200 సంవత్సరాల వరకు నిలిచి పోతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. యూరప్‌లో దీనిని ʹఎఫ్‌ గ్యాస్‌ʹ అని పిలుస్తారు. హైవోల్టేజ్‌ స్విచ్‌ గేర్లలో తప్ప, ఇతర అవసరాలకు దీనిని వినియోగించడాన్ని అక్కడ జనవరి 1, 2006 నుండి నిషేదించారు.

రాజర్‌హాట్‌ గ్రిడ్‌ నుండి సాగే 9 నుండి 12 వైర్‌లైన్లు కేవలం దక్షిణ 24 పరిగణాల జిల్లాలోనే, దాదాపు 30,000 మంది జనాభాపై ప్రభావం చూపుతాయి. ఈ లైన్లనుండి ప్రవహించే మాగ్నటిక్‌ ఫీల్డ్‌ కారణంగా గొడుగులతో క్రింద నుండి నడుస్తున్న మనుషులకు ఎలక్ట్రిక్‌ షాక్‌ తగులుతుంది. ఈ లైన్ల క్రింద ట్యూబ్‌ లైట్లు వైర్ల కనెక్షన్‌ లేకుండానే వెలుగుతాయని నిపుణుల తెలుపుతున్నారు. అమెరికా, బ్రిస్టల్‌ యూనివర్శిటీలో 400 కె.వి లైన్ల క్రింద ఏర్పాటు చేసిన వందలాది ట్యూబ్‌ లైట్లు వెలుగుతాయని దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ మేగ్నటిక్‌ ఫీల్డ్‌ నుండి విడుదల అయ్యే ధార్మిక శక్తి మానవ ఆరోగ్యంపై 40 సంవత్సరాల వరకు ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ లైన్లకు దగ్గరగా నివసించే వారికి లుకేమియ, బ్రెయిన్‌ క్యాన్సర్‌, అల్జిమిర్‌, గర్భస్రావాలు, అంగవైకల్యంతో పుట్టే శిశువులు, మనోవ్యాధి, గుండె జబ్బులు, నరాల జబ్బులు, నిద్రలేమి లాంటి అనేక రోగాలపాలవుతారని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి.

ప్రమాదకరమైన యస్‌.ఎఫ్‌. గ్యాస్‌ వాడకాన్ని తగ్గించడానికి, దీని స్థానంలో మరో ప్రమాదరహితమైన గ్యాసు వాడటానికి అంతర్జాతీయంగా పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని వినియోగించేటప్పుడు చేపట్టాల్సిన భద్రతా చర్యలు ఏవీ తీసుకోకుండానే ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగించే కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకుంది. అందుకే ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

ఒకసారి ఈ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ వేసిన తర్వాత దానికింద ఉన్న భూములపై రైతులకు ఎటువంటి హక్కులూ వుండవు. మెయింట్‌నెన్స్‌ కోసం, అప్పడప్పడు జరిగే అకస్మాత్‌ విద్యుత్‌ ప్రమాదాల నివారణ కోసం, ఆ ప్రాంతాల భూములలో చెట్లు నరికివేయడం, పొలాల్లో పంటలను ధ్వంసం చేయడం జరుగుతుంది. ఈ కరెెంట్‌ లైన్‌లు చేపలు సమృద్ధిగా లభించే చెరువుల మీదుగా సాగడం వలన, ఎలక్ట్రో మేగ్నెటిక్‌ కరెంట్‌ ప్రభావంతో చెరువులలో జీవావరణం ప్రభావితమవడమే కాకుండా, చేపలు ఉత్పత్తి పూర్తిగా దెబ్బతింటుంది, వ్యవసాయానికి అనువైన భూమి స్వభావం దెబ్బతింటుంది.

పర్యావరణ నిపుణులు, శాస్త్రజ్ఞులు, వైద్యులు, వైద్యసిబ్బంది కలిపి ఏర్పాటు చేసిన ʹసిటిజన్‌ కన్స్‌ర్నడ్‌ ఓవర్‌ భాంగార్‌ʹ (సి.సి.ఓ.బి) సంస్థ ఆధ్వర్యంలో భాంగార్‌, ఇతర ప్రాంతాలను పరిశీలించి ʹహై వోల్టేజ్‌ భాంగార్‌ʹ అనే పుస్తకాన్ని విడుదల చేసారు. దానిలోని ప్రధాన అంశాలు

1. ప్రాజక్ట్‌కు ఎంపిక చేసిన భాంగార్‌ పరిసర ప్రాంతమంతా ప్రజలకు ఉపయోగపడే విలక్షణమైన బీలభూమి, ఈ ప్రాంతంలో పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయడం అనర్ధదాయకం.

2. ఇటువంటి ప్రమాదకరమైన ప్రాజెక్టుకు జీవావరణ, సామాజిక ప్రభావంపై అధ్యాయనం చేసి ఆ ప్రాంత ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వం ఆ పనిచేయకుండా ప్రాజెక్టుపని ప్రారంభించింది.

3. ఈ ప్రాజెక్టు ప్రభావం చూపే 4000 చదరపు మైళ్ల ప్రాంతంలో వేలాది మంది జనాభా నివసిస్తున్నారు. వీరి నష్ట పరిహారం గురించి ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదు.

4. హై ఓల్టేజ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ వలన ఆ ప్రాంతాల జంతుజీవజాలం, మనుషుల ఆరోగ్యంపై తీవ్రమైన చెడుప్రభావం కలుగజేస్తుందని అనేక శాస్త్రవేత్తల, నిపుణుల నివేదికలు తెలుపుతున్నాయి.

5. ఎస్‌.ఎఫ్‌, 6 గ్యాస్‌ వాతావరణంలో చాలా కాలం నిలిచిపోయే హరిత గృహవాయువులలో ఒకటి. దాని ఉత్పత్తులు, వ్యర్థాలు చాలా ప్రమాదకరమైన రసాయనిక వాయువులను విడుదల చేస్తాయి. దీని వలన ఆ ప్రాంతపు మొత్తం జీవావరణం విధ్వంసానికి గురవుతుంది.

ప్రజా ఉద్యమం

ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2013 నుండి మూడు సంవత్సరాలుగా సాగుతున్న ప్రజల తీవ్ర నిరసనల ఫలితంగా మమతా బెనర్జి ఈ ప్రాజెక్టు పనిని ప్రస్తుతానికి నిలుపుదల చేస్తున్నామని 2015లో ప్రకటించింది. కొద్ది నెలల కాలంలోనే తిరిగి 2016 జనవరి నెల ప్రారంభంలో ప్రాజెక్టు దాదాపు పూర్తిఅయిపోయిందని, త్వరలోనే ప్రారంభిస్తారని ప్రకటించడంతో ప్రజల ఉద్యమం మళ్లీ తీవ్రమైంది.

3 నవంబర్‌ 2016న ట్రాన్స్‌మిషన్‌ లైన్ల గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే పోలీసులు దాడి చేసి 6మందిని అరెస్టు చేశారు. 18 రోజుల పాటు గ్రామాన్ని అదుపులోకి తీసుకున్నారు.

గవర్నర్‌కు మెమొరాండం ఇచ్చేందుకు డిసెంబర్‌ 22ను భారీ ప్రజాసమూహంతో రాజ్‌భవన్‌కు ఊరేగింపుగా బయలుదేరారు. ఆరోజు కలకత్తా రోడ్లన్నీ బందయిపోయాయి. తర్వాత 60 వేలమంది పైగా ప్రజలు పాల్గొన్న నిరసన ప్రదర్శనతో లావుహార్టీ నుండి భాంగార్‌ వరకు దాదాపు 10 కిలోమీటర్ల పొడువునా రోడ్లన్ని బందయిపోయాయి.

జనవరి 11న నిరవధిక రోడ్ల బంద్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి, సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్‌ మంత్రి, విద్యుత్‌ అధికారులు ఇచ్చిన హామీతో కార్యక్రమాన్ని నిలుపుదల చేశారు.

జనవరి 16 నుండి పోలీసులు మళ్ళీ దాడులు సాగించారు. ఈ దాడుల్లో వృద్ధురాలైన మయుర్‌ జాన్‌ బీబీ చేయి విరిగింది. షాప్‌లు బద్దలుగొట్టారు, ఇళ్లను ధ్వంసంచేశారు. అరెస్టు చేసిన వారిపై తీవ్రమైన హింసను ప్రయోగించారు. బాలుడైన జహీర్‌ హుస్సేన్‌ వేళ్లు, చేయి విరిగిపోయాయి, 6 రోజులు వైద్యం లేకుండానే గడపవలసివచ్చింది. మన్‌హార్‌ బీబీ పై అత్యాచారం జరిపి, వికలాంగుడైన ఆమె భర్తను చితకబాదారు.

జనవరి 16 తేదీనుండే ప్రజల నిరసన ప్రదర్శనలు కూడా ప్రారంభమయాయి. ఆ రోజు రాత్రి ఉద్యమ నాయకుడు కాలూషేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొనడంతో, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలందరు వీధుల్లోకి వచ్చి రోడ్లన్నీ బందు చేయడంతో అతనిని విడిచిపెట్టక తప్పలేదు.

జనవరి 17న ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పులలో 32 సంవత్సరాల మేఫిజల్‌ఖాన్‌, 22 సంవత్సరాల అలాంగిర్‌ ప్రాణాలు కోల్పోయారు. తుపాకి గుండు తగిలి అలాంగీర్‌ పడిపోయినా, పోలీసులు అత్యంత దుర్మార్గంగా తన్నుకుంటూ మరోసారి అతి దగ్గరగా కాల్పులు జరిపి చంపారు. మేఫిజల్‌ఖాన్‌ తన పనినుండి ఇంటికి తిరిగివస్తుండగా కాల్పులకు గురయ్యాడు. పోలీసులు ఆ కాల్పులు తాము జరపలేదని బయటవారెవరో జరిపారని, పోలీసు డైరక్టర్‌ జనరల్‌ అనూజ్‌ శర్మ ప్రకటించారు.

గతంలో సి.పి.ఐ.(ఎమ్‌) లో రెవెన్యూ మంత్రిగా ఉంటూ 2015లో పార్టీకి రాజీనామా చేసి టి.ఎమ్‌.సి లోకి మారిపోయి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎమ్‌.ఎల్‌.ఏ. అబ్దుల్‌ రెజాక్‌ మోల్లాతో పాటు మాజీ టి.ఎమ్‌.సి. ఎమ్‌.ఎల్‌.ఏ. అరబుల్‌ ఇస్లాం పోలీసుల సహకారంతో ప్రజలపై దాడులు చేస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్‌.ఎల్‌.ఎ. అరబుల్‌ ఇస్లామ్‌ ముఠాకు చెందిన గూండాలు పోలీసు దుస్తులలో నిరసన కారులపై కాల్పులు జరిపి బాంబులు వేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

జనవరి17న ప్రదర్శన, కాల్పుల తర్వాత రెడ్‌స్టార్‌కు చెందిన షర్మిస్టా చౌధరిని ఉపా చట్టం కింద అరెస్టు చేసి 5 నెలలుగా అలీపుర్‌ జైల్లో ఉంచారు. కాల్పుల సంఘటన తరువాత మమతాబెనర్జీ అవసరమైతే ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలిస్తామని ప్రకటించింది.

ఉద్యమం సాగుతున్న గ్రామాలలో ప్రభుత్వం ఆర్థిక దిగ్బంధన కొనసాగిస్తుంది. గ్రామాలలో ప్రజలు తమ కూరగాయలు, చేపలు, అమ్ముకోవడానికి గ్రామం బయటికి రాగానే పోలీసులు వారిని అరెస్టులు చేస్తున్నారు.

జనవరి 22న కలకత్తా రైల్వేస్టేషన్‌లో రెడ్‌స్టార్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌. రామచంద్రన్‌ను పోలీసులు అరెస్టు చేసి 26 గంటలు కస్టడీలో ఉంచి, చివరకు ఢిల్లీలో విడుదల చేశారు.

పోలీసులు, గుండాల కాల్పులలో చనిపోయిన కామ్రేడ్స్‌ స్మృతిలో జనవరి 30న ప్రజలు భారీ నిరసన ప్రదర్శనలు జరిపారు.

ఫిబ్రవరి 19న ఏర్పాటు అయిన నిరసన ప్రదర్శనల్లో తృణముల్‌ కాంగ్రెస్‌, బి.జె.పి. పార్టీలు మినహాయించి, మిగతా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. దీనిలో రెడ్‌స్టార్‌ నాయకుడు, అలీక్‌ చక్రవర్తి, తదితరులు ఉపన్యసించారు.

అనేక విప్లవ గ్రూపులు, వామపక్ష పార్టీలు, ఏప్రిల్‌ 11న చర్చించి, మే 8న రాజ్‌భవన్‌ కు ఊరేగింపుగా వెళ్ళి గవర్నర్‌కు మెమోరాండం సమర్పించాలని నిర్ణయించారు.

అనేక మంది మేధావులు, రచయితలు, కళాకారులు, అనేక ప్రజాసంఘాలు, సాంస్కృతిక బృందాలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించి నిరసన ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. వీరిలో ప్రముఖ చలనచిత్ర దర్శకులు తరుణ్‌ మజుందార్‌, కవి మందక్రాంత్‌ సేన్‌, న్యాయవాది వికాస్‌రంజన్‌ భట్టాచర్య, సామాజిక కార్యకర్త మిరాతున్‌ నాహార్‌లు వున్నారు.

మే 8న రాజ్‌భవన్‌కు వేలాదిమంది ప్రజలతో నిరసన ప్రదర్శన సాగింది. దీనిలో సి.పి.ఐ.(ఎమ్‌.ఎల్‌) రెడ్‌స్టార్‌ కార్యదర్శి కె.ఎన్‌. రామచంద్రన్‌, సి.పి.ఐ.(ఎమ్‌.ఎల్‌) లిబరేషన్‌ కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచర్య, మజ్దూర్‌ క్రాంతి పరిషత్‌ నాయకుడు అబ్బాస్‌ మున్షి, పి. యస్‌.ఎన్‌. నాయకులు సమీర్‌ పుటటుండు, ఎన్‌. టి. యు.ఐ. నాయకులు స్వపన్‌ గంగూలీ, సి.పి.ఎమ్‌. నాయకులు బిమన్‌బోస్‌, అస్లెంబీ ప్రతిపక్ష నాయకుడు అబ్ధుల్‌ మన్నన్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ ఉద్యమానికి స్థానికులు కాకుండా, బయటవారు నాయకత్వం వహిస్తున్నారని, వారిలో మావోయిస్టులు కూడా వున్నారని తృణముల్‌ ప్రభుత్వం, పోలీసులు, మీడియా, అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడానకి జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ నుండి వెళ్లిన 40 మంది విద్యార్ధులలో మావోయిస్టులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పటికి 36మంది మీద ఉపాచట్టం కింద కేసులు నడుస్తున్నాయి. 19 మంది జైళ్లలో ఉన్నారు.

ప్రజలు ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రగతిశీల శక్తులు చురుకుగా పాల్గొంటున్నాయి. ప్రధానంగా సి.పి.ఐ. (ఎమ్‌.ఎల్‌) రెడ్‌ స్టార్‌ ప్రధాన పాత్ర వహిస్తూ డిసెంబర్‌ 2016 నుండి ప్రారంభించిన ʹʹభూమి, భుక్తి, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ కమిటీʹʹ ఆధ్వర్యంలో ఇతర అభ్యుదయ, ప్రగతిశీల శక్తులు, ప్రజాసంఘాల సహకారంతో ఈ ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. పోలీసుల తీవ్రమైన నిర్బంధాన్ని, కాల్పులను, అరెస్టులను, కేసులను లెక్కచేయకుండా కొనసాగిస్తున్న ఈ భాంగార్‌ ప్రజా ఉద్యమానికి ప్రగతిశీల శక్తులన్నీ మద్ధతు ప్రకటించి సహకారం అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

No. of visitors : 563
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జనవరి - 2020
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •