తీరుమారని జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు

| సాహిత్యం | వ్యాసాలు

తీరుమారని జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు

- ఎ. నర్సింహ్మా రెడ్డి | 16.07.2017 08:15:28am

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో పాటు 19 కీలక దేశాధినేతలతో ఏర్పాటైన ప్రపంచ ఆర్థిక వ్యూహాత్మక నిర్మాణ వేదిక- జి-20 పన్నెండవ వార్షిక సమావేశం అనిశ్చితిలో ముగిసింది. జూలై 7,8 తేదీలలో జర్మనీలోని హాంబర్గ్‌ పోర్ట్‌ నగరంలో జరిగిన ఈ సమావేశం అంతర్జాతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాలపై ఎలాంటి నిశ్చయాత్మక ఉమ్మడి అవగాహనకు రాలేకపోయింది. 2008 నుంచి ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్న తరుణంలో ఏర్పాటైన ఈ వేదిక ప్రతి వార్షిక సమావేశం ప్రపంచ ఆర్థిక రాజకీయాధిపత్య శక్తుల ʹగోదాʹగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. సమస్త మానవాళికీ లబ్ధి చేకూర్చేలా ఉమ్మడి చొరవతో సాకారమయ్యే ప్రగతి, అసమానతల్ని, పేదరికాన్ని రూపుమాపేందుకు నాణ్యమైన ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ఏర్పాటైన జి-20 ఈ పదేళ్ల ప్రస్థానంలో ఏమీ సాధించలేకపోయింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనే కల్లోలిత జలాల్లో చేపలు పట్టేందుకు ప్రయత్నించినట్లుగా జి-20 పనితీరు కొనసాగింది. గత వార్షిక భేటీల సందర్భంగా పెల్లుబికిన అక్రోశాలు, నిరసనలకు భిన్నంగా ఈసారి సమావేశానికి కొద్ది వారాల ముందునుంచే బెర్లిన్‌ తదితర ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ పరిస్థితులన్నిటికి జి-20 దేశాలు.గత దశాబ్దంగా అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలే ప్రధాన కారణం. యుద్ధాలు, ఆకలి, నిరుద్యోగం, భూతాపం పెరుగుదల, ఆర్థిక అసమానతలకు ఆయా దేశాల పాలకవర్గాలు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు. ప్రజలపై బలవంతాన అమలుజరిపిన ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు వికటించడంతో ఆ భారాలను కార్మికులు, రైతులు, మధ్యతరగతి వర్గాలపై మోపుతున్నారు. మరోపక్క నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వివిధ దేశాల్లో అప్రజాస్వామిక ధోరణులకు దారి తీస్తున్నాయని, ప్రజానీకం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని నిరసనకారుల అక్రోశం. ఈ దుస్థితిని జీర్ణించుకోలేక జి-20 దేశాల నాయకులకు వ్యతిరేకంగా హాంబర్గ్‌ నగరంలో వందలు, వేలమంది ప్రదర్శకులు సమీకృతులయ్యారు. పెట్టుబడిదారీ విధానం నశించాలని, నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కావాలని నినాదాలు చేశారంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలపై ప్రజలలో ఉన్న ఆగ్రహావేశాలకు హాంబర్గ్‌ ప్రదర్శన నిలువెత్తు సాక్ష్యం. ʹʹనరకానికి స్వాగతంʹʹ.. అన్న బ్యానర్‌ పట్టుకొని, చప్పట్లు చరుస్తూ జి-20 దేశాల నాయకుల మాస్క్‌లు ధరించి పోలీసులతో ప్రదర్శకులు తలపడటం చూస్తే హాంబర్గ్‌ నగరం రణరంగంగా మారింది. పోలీసులు సైతం ప్రదర్శకులపై భాష్పవాయువు ప్రయోగించారు.నీటి క్యానన్‌లతో దాడిచేసి లాఠీలకు పనిచెప్పి అనేకమందిని అరెస్టు చేసినా వెనుకంజ వేయలేదు. ప్రజా ఉద్యమాల అణచివేత పెట్టుబడిదారీ వ్యవస్థను, సంస్కృతిని రక్షించలేదు. దానికి వ్యతిరేకులను పెంచుతుంది. ప్రపంచీకరణ ఫలాలు అందరికీ అందాలి. అది జరగాలంటే పెట్టుబడిదారీ విధానం అంతం కావాలి. అదే జి-20 దేశాల అధినాయకులకు వ్యతిరేకంగా జరిగిన హాంబర్గ్‌ ప్రదర్శకుల ప్రదాన లక్ష్యం. ఆశయం, అది ప్రపంచ ప్రజల లక్ష్యంగా మారాలి.

జి-20 దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించడంలో అచేతనంగా వ్యవహరిస్తున్నాయి. అందువల్లే జి-20 సదస్సుకు అతిథ్యమిచ్చిన హాంబర్గ్‌ నగరం ప్రపంచీకరణకు, ప్రపంచీకరణ వ్యతిరేక శక్తులకు మధ్య సంగ్రామ వేదికగా మారింది. సదస్సు లోపల ప్రపంచీకరణ, నయా ఉదారవాద విధానాలే ప్రగతికి చోదకాలు అని జి-20 దేశాల నేతలు ఉద్ఘాటిస్తుంటే, సదస్సు వెలుపల ఈ విధానాలే కార్మికవర్గంపై దోపిడీకి సాధనాలు అని నిరసలు హోరెత్తాయి. ప్రపంచీకరణ విధానాలపై ప్రపంచ వ్యాపితంగా ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహానికి అవి ప్రతీకగా నిలిచాయి. ప్రపంచ అగ్రనాయకులైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారతదేశ ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఈ సమావేశానికి మొత్తం 40 మంది వరకు హాజరయ్యారు. వీరికి రక్షణగా 20,000 మంది పోలీసులు, గగనతలంలో హెలికాప్టర్లు చక్కర్లు, 45 వాటర్‌క్యానన్లు, వందలకొలది వాహనాలను మోహరించారంటే ప్రజా ఉద్యమాలంటే నేతలకుఎంత భయమో అర్థమవుతోంది.

భౌగోళిక రాజకీయాలు ఒక సంక్లిష్ట దశలో ఉన్న నేపథ్యంలో జి-20 దేశాల సమావేశాలు జరిగాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న 2008 ఆర్థిక సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వైఫల్యంతో వివిధ దేశాల మధ్య, ఆయా దేశాలలో ప్రజల మధ్య ఆర్ధిక అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, పెరగడంతో ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యకిరేకతను జాతీయ దురహంకారులు, ఫాసిస్టు నియంతృత్వ శక్తులు ఉపయోగించుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలుపు, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్‌ నిరంకుశ పాలనకు, బ్రిటన్‌ ఈయూ నుండి తొలగడానికి నిర్వహించిన రెఫరెండం బ్రెగ్జిట్‌కు ప్రజామద్దతు, బ్రెజిల్‌లో అధ్యక్షుడు మైఖేల్‌ టెమర్‌ అవినీతి పాలన, ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా రాజకీయ నేపథ్యంలేని వ్యక్తి గెలుపు తదితర అంశాలు ప్రధానంగా ఆందోళన కారుల్ని ప్రభావితం చేశాయి.

జర్మనీ పర్యావరణ గ్రూప్‌ ప్రతినిధి ఒకరు ʹరాయిటర్స్‌ʹతో మాట్లాడుతూ... ʹʹప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో దారుణాల్ని చూస్తున్నాం. అశాంతి, హింస చెలరేగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. అమాయక పౌరులు శరణార్థులుగా మారుతున్నారు. దీనికి కారణం ʹజి-20ʹ దేశాల నాయకులు కాదా?ʹʹ అని ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితిలో 130 దేశాలు అణు నిరాయుధీకరణ దిశగా ఒక చారిత్రాత్మక తీర్మానం చేశారని, కానీ శక్తివంతమైన అణ్వాయుధాల్ని కలిగిన దేశాధినేతలు స్పందించటం లేదని, ఇదే తమ ఆగ్రహానికి కారణమని పర్యావరణ ప్రతినిధి ఒకరు చెప్పారు.

పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళనలో పాల్గొనటం ద్వారా ప్రపంచ దృష్టిని తమవైపుకు తిప్పుకోగలిగారని, వారి గొంతు వినిపించే అవకాశం దక్కిందని ʹయూనివర్శిటీ ఆఫ్‌ టొరొంటోʹ పరిశోధన విద్యార్థి జులియా కులిక్‌ చెప్పడం గమనార్హం. 20-21 మంది వ్యక్తులు ప్రపంచానికి సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవటం సరైంది కాదని, అనేకమందికి ఈ అంశమే నచ్చకపోయి ఉండవచ్చునని కెనడాకు చెందిన ʹగ్లోబల్‌ న్యూస్‌ʹ పేర్కొన్నది. సదస్సుకు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని నిరసనకారులు విజయవంతంగా అమలుజేయగలిగారు. పలు రాజకీయ పార్టీల సహకారంతో వివిధ ఎన్‌జిఓ గ్రూపులు ఈ ఆందోళనల కార్యక్రమానికి నేతృత్వం వహించాయి.

ప్రపంచ శాంతి, తీవ్రవాదం అంతం పేరుతో అమెరికా సామ్రాజ్యవాదం, దాని మిత్రదేశాలైన నాటో సభ్యదేశాలు ప్రారంభించిన దురాక్రమణ విధానాలు మధ్యాసియా దేశాలైన సిరియా, ఇరాక్‌, ఎమెన్‌లను, ఉత్తరాఫ్రికా దేశమైన లిబియాను అంతర్యుద్ధాల ఊబిలోకి నెట్టాయి. తీవ్రవాదుల హత్యలకు ప్రజలు బలవుతున్నారు. భయాందోళనకు గురైన ప్రజల వలసలు యూరప్‌ దేశాలకు గుదిబండగా తయారయ్యాయి. ఒక ప్రక్క వెంటాడుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రాణాలను హరిస్తున్న వాతావరణ కాలుష్యం, మరోప్రక్క తీవ్రవాదుల ఘాతుకాలు, అంతర్యుద్ధాలు, నాటో సైన్యాల మోహరింపులతో ప్రపంచం అట్టుడికిపోతుంటే కనీసం ఉపశమన చర్యలు తీసుకోవడంలో జి-20 దేశాలు విఫలం కావడం వాస్తవం. సమావేశాలు ఆసాంతం కేవలం ఆలింగనాలు, వ్యాపార ఒడంబడికలు, నామమాత్రపు సంయుక్త ప్రకటనలకు పరిమితమయ్యాయి. 1999 సంవత్సరం నుండి ప్రారంభమైన సమావేశాలు 2016 వరకూ తరచుగా జరుగుతూనే ఉన్నా ఫలితం శూన్యం.

2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతుండడంతో అత్యధిక ప్రజానీకం జీవన ప్రమాణాలు దిగజారాయి. తలసరి ఆదాయం పెరిగినా అది సంపన్నుల వద్దే పోగుపడింది. ఇప్పటికీ కోట్లాది మంది దారిద్య్ర రేఖకు దిగువన అలమటిస్తున్నారు. మధ్య తరగతి వారి జీవనంపైనా ఈ విధానాలు తీవ్ర ప్రభావాన్నే చూపాయి. ఆకలి, నిరుద్యోగం, పేదరికం, నిర్వాసితులు, శరణార్థుల సమస్య తీవ్ర రూపం దాల్చడం, వాణిజ్యంలో రక్షణాత్మక విధానాలు, పర్యావరణ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిర అభివృద్ధికి సవాళ్లుగా మారాయి. ఇవన్నీ అంత ముఖ్యమైన సమస్యలుగా జి-20 నేతలకు అనిపించినట్లు లేదు. వారి దృష్టంతా ఆర్థిక సంక్షోభ భారాలను బడుగు దేశాలపైకి ఎలా నెట్టివేద్దామా అన్నదానిపైనే! అనుసంధానతతో కూడిన ప్రపంచమే తన లక్ష్యమని హాంబర్గ్‌ సదస్సు ఉద్ఘాటించినా, ఆ దిశగా ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక వెల్లడించలేకపోయింది.

గత ఏడాది చైనాలోహాంగ్జూలో జరిగిన జి-20 సదస్సు వినూత్న, సాహసోపేతమైన భాగస్వామ్యంతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమని ఉద్ఘాటించింది. ఆ లక్ష్యం ఎంత వరకు నెరవేరిందీ? హాంబర్గ్‌ సదస్సులో ఒక ముక్క కూడా ప్రస్తావించలేదు. మళ్లీ కొత్త లక్ష్యం ప్రకటించింది. ఆచరణ లేని ఉద్ఘాటనల వల్ల శబ్ద కాలుష్యం తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఒకవైపు ఆకలి, పేదరికంతో అసంఖ్యాక ప్రజలు అలమటిస్తుంటే మరోవైపు శత కోటీశ్వరులు అపారంగా పెరిగిపోతున్నారు. ఈ పరిస్థితికి ప్రపంచీకరణ విధానాలే కారణమని ఎవరినడిగినా చెబుతాడు. కానీ, మన ప్రధానితో సహా పలు దేశాధినేతలకు దీనికన్నా తీవ్రవాదమే ప్రధాన సమస్య అయిపోయింది తీవ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి? తీవ్రవాదానికి నిధులు, మద్దతు లభించకుండా ఏం చేయాలి అన్న అంశకం చుట్టూనే చర్చ నడిచింది. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆర్థిక విధానాల్లో మౌలికమైన మార్పులు తీసుకురావడానికి పారిశ్రామిక దేశాలు సుముఖంగా లేరనడానికి వారు ప్రపంచీకరణకు పూర్తి మద్దతు ప్రకటించడమే నిదర్శనం. పర్యావరణం, ఉద్యోగాలు, స్వేచ్ఛా వాణిజ్యం వంటి విషయాల్లో ట్రంప్‌ అనుసరించిన ఒంటెత్తు పోకడలు ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి మరింత ఆజ్యం పోసేవిగా ఉన్నాయి. 2015లో ఐరాస ఆధ్వర్యంలో పర్యావరణ ఒప్పందంపై సంతకం చేసిన అమెరికా ఇప్పుడు అర్ధాంతరంగా తప్పుకోవడంతో పర్యావరణ పరిరక్షణ ప్రమాదంలో పడింది. వాణిజ్యంలో రక్షిత విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన జి-20 కూటమి ఈ విషయంలో అమెరికాను గట్టిగా నిలదీయలేకపోయింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నొచ్చుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారు. పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ఎన్నికల సమయంలోనే ప్రకటించిన ఆయన చివరకు అదే చేశారు. అమెరికా సంతకం చేయకపోయినా, ఆ దేశ అభిప్రాయాలను గుర్తిస్తున్నట్టు ఇతర దేశాలు ప్రకటించాయి. పరిశుద్ధ ఇంధనం వినియోగంపై ఇతర దేశాలతో కలిసి పని చేస్తామని అమెరికా ప్రకటించింది. వాణిజ్య రంగంలో రక్షణాత్మక ధోరణులను వ్యతిరేకిస్తున్నట్టు ఈ సమావేశంలో నిర్ణయించినా, ట్రంప్‌నకు ఇబ్బందిలేకుండా ʹవారి మార్కెట్లను కాపాడడం కోసం చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చʹని అంగీకరించారు. ʹముందు అమెరికాʹ అన్న నినాదంతో ట్రంప్‌ విధానాలను అమలు చేస్తున్న విషయం విధితమే.

ఆధునిక అంతర్జాతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న రెండు మౌలిక సంఘర్షణలు హాంబర్గ్‌ సదస్సు గుర్తించింది. ఒకటి జాతీయ బడా ఫైనాన్స్‌ సంస్థలు, కార్పొరేట్‌ శక్తుల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడం, రెండు అభివృద్ధి చెందిన దేశాల ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై ప్రజల్లో పెరిగిన తీవ్ర అసంతృప్తి. మొదటిది తీర్మానాల్లోనూ, అనిశ్చిత చర్చల్లోనూ బయపడితే, రెండవది లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్న నిరసన కార్యక్రమాల తీవ్రతలో వ్యక్తమయింది. ʹనరకానికి స్వాగతంʹ అనే నినాదంతో నిరసనకారులు ఈ సదస్సును అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ʹషట్‌ డౌన్‌ క్యాపిటలిజంʹ నినాదంతో స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాల నుంచి వచ్చిన నిరసనకారుల ప్రదర్శనపై జర్మనీ పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించిన అమెరికా, బ్రిటన్‌లు- ఇప్పుడు ఆర్థికంగా దివాళా తీసి ఆత్మాశ్రయ విధానాలను అనుసరిస్తున్నాయి. ప్రపంచ వ్యవహారాలను అవి ఇంకెమాత్రం పట్టించుకోలేని స్థితికి చేరాయి. జర్మనీ, చైనా వంటి దేశాలకు ఈ పరిస్థితి బాగా అనుకూలిస్తోంది. అమెరికా, బ్రిటన్‌లను ఇరకాటంలో పడేసే విధంగా వాతావరణ మార్పు, స్వేచ్ఛా వాణిజ్యం, శరణార్ధుల సమస్య, తీవ్రవాదం వంటి అంశాలను జి-20 శిఖరాగ్ర సమావేశం అజెండాగా నిర్ణయించడం ద్వారా జర్మనీ చాలా యుక్తిగా వ్యవహరించింది. ప్రపంచ రాజకీయ ఆర్థిక విధానాల విషయాల్లో అమెరికా, బ్రిటన్‌ల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చే పరిణామమిది. ఈ సదస్సు నేపథ్యంలో ఒకవైపు జర్మనీ, ఐరోపా సమాఖ్య (ఈయూ), మరోవైపు అమెరికా, బ్రిటన్‌ మోహరించడంతో రానున్న కాలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశము ఉంది.

ఉక్కు వాణిజ్య యుద్ధంలో అమెరికా ఈయూ దేశాలు తలపడుతుంటే, వర్ణమాన దేశాలైన భారత్‌, చైనాలు ప్రపంచ ఆర్థిక శక్తుల ఆధిపత్య పోరులో తమ ప్రయోజనం కోసం పరస్పరం పోటీ పడుతున్నాయి. ఈయూ పెట్టుబడి పెంపక కేంద్రంగా మారిన చైనా ఆర్థిక అద్భుతాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌ను అమెరికా మచ్చిక చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా భౌగోళిక సమీకరణల్ల్లో (అఫ్ఘనిస్తాన్‌లో భారత్‌ పాత్ర, ఇజ్రాయిల్‌తో దోస్తీ వగైరా) భారత్‌ కూడా భాగం అయింది. అమెరికాతో పొత్తు ఒక ప్రమాదకర దౌత్యక్రీడగా చరిత్రలో పలు సందర్బాల్లో వ్యక్తమైన అనుభవాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకపోతే ప్రజల్ని ఇబ్బందుల్లో పడేసే ప్రమాదం ఉంది. నైపుణ్యాల్ని కల్పించడం, వాటిని మెరుగుపరచడం, పరస్పరం ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం వంటి చర్యలతో జి-20 దేశాలు పటిష్టమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని, అవినీతి, తీవ్రవాదం మీద ఉమ్మడి పోరు చేయాలని ప్రధాని మోడీ ఈ సదస్సులో పిలుపిచ్చారు. ఈ సదస్సు సందర్భంగా నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫారంలో తమ పింఛను నిధులను మదుపు చేయాలని మోడీ ప్రతిపాదనకు నార్వే ప్రధాని ఎమా సోల్‌మెర్గ్‌ సానుకూలంగా స్పందించడం మినహా పెద్ద ప్రయోజనమేమీ మన దేశానికి చేకూరలేదు. అనిశ్చితంగా ముగిసిన జి-20 సదస్సు అంతర్జాతీయ సమాజంలో తీవ్రతరం కాబోతున్న వైషమ్యాలకు అద్దం పడుతోంది. ప్రపంచీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజల గోడును జి-20 వంటి కూటములు ఆలకించి, తమ విధానాలను తదనుగుణంగా సవరించుకోవాలి. లేకుంటే ప్రజాగ్రహం పెల్లుబికి పెట్టుబడిదారీ వ్యవస్థనే దహించి వేస్తుంది.

జి-20లో అగ్ర రాజ్యాలతో పాటు భారత్‌, చైనా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలుండటం ఒక వైవిద్యం, మరోవైపు సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుద్యాలున్నాయి. హాంబర్గ్‌ సమావేశం ప్రారంభం ముందురోజు జూలై 6వ తేదీన పోలెండ్‌ రాజధాని వార్సాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రసంగం ఈ వైరుద్యాలకు అద్దం పడుతున్నది. పశ్చిమ దేశాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని, సహకారతత్వం లోపించిందని చెప్పడంలో ఆంతర్యం, ప్రపంచాధిపత్యం సాధించడంలో, చైనా, రష్యాలను నిలవరించడంలో సామ్రాజ్యవాద దేశాల మధ్య ఐక్యతలేదన్న అభిప్రాయాన్ని ట్రంప్‌ పరోక్షంగా వ్యక్తం చేశాడు. అదే విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలు చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని ట్రంప్‌ కాలదన్నగా, జర్మన్‌ ఛాన్సలర్‌ ఎంగేలా మోర్కెల్‌, యూరప్‌ దేశాలు పారిస్‌ ఒప్పందాన్ని బలపరుస్తున్నాయి. సిరియా విషయంలో రష్యాది ఒకదారి, అమెరికాది మరోదారి. ప్రపంచ రాజకీయాలు వైరుధ్యాలతో నిండిపోయాయి. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, భౌగోళికాధిపత్యం కొరకు దురాక్రమణపూరిత యుద్ధాలు ప్రపంచాన్ని సామ్రాజ్యవాదులు మూడవ ప్రపంచ యుద్ధపుటంచులకు తీసుకుపోతున్నారు.

No. of visitors : 610
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సిరియాలో శాంతి నెలకొనేనా?

ఎ. నర్సింహారెడ్డి | 01.08.2016 01:17:48am

ఇరాక్‌, ఆఫ్ఘాన్‌, లిబియా దేశాలలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి 1980 నుంచి సృష్టించిన ఉగ్రవాద ముఠాలు చాలవరకు కలిసి ʹఇస్లామిక్‌ స్టేట్‌ʹ గా.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •