పోలీసు, అర్థసైనిక బలగాలకు మా విజ్ఞప్తి

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

పోలీసు, అర్థసైనిక బలగాలకు మా విజ్ఞప్తి

- ప్ర‌తాప్‌ | 16.07.2017 10:36:02am

ఖాకీ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి సమాజంలో గౌరవప్రదంగా జీవించండి

పొట్టకూటికై మీరు చేస్తున్న ఉద్యోగాలు మిమ్మల్ని మీ కుటుంబాలను రోజూ చిత్రవధకు గురిచేస్తున్నాయనడం వాస్తవాన్ని మీ ముందు ఉంచడమే అవుతుంది.

"నా భర్త మానసికంగా చిత్రవధననుభవిస్తున్నాడు. అర్థసైనిక బలగాల జీవితాలలో ఈ దారుణాలను భరించక తప్పదంటే, ఏ తల్లీ తన బిడ్డను దేశ సేవకు పంపదు" (2009 ఏప్రిల్ నాడుచింతగుప్ప వద్ద కోబ్రా జవాన్ సంజయ్ మండల్ భార్య ప్రీతి మనోవేదన)

"నేను నరకయాతన అనుభవిస్తున్నాను. నేను తట్టుకోలేకపోతున్నా ʹʹ (గాయపడిన కరాటే బ్లాక్ బెల్ట్ కోబ్రా జవాన్ మండల్ వ్యధతో ఆసుపత్రిలో అన్నమాటలు)

మండల్ పశ్చిమ బెంగాల్ మర్షిదాబాద్ జిల్లాకు చెందిన పేద కుటుంబంలో పుట్టి అతికష్టంగా విద్యను అభ్యసించి సీఆర్పీఎఫ్‌లో చేరాడు. తన జీతం పైనే తమ్మడిని చదివించక తప్పడం లేదు. పేద కుటుంబాన్ని పోషించాలి. కానీ పై అధికారుల మాట వినని ఫలితంగా తనెదుర్కొంటున్న కష్టాలను మీడియా ముందుంచాడు.

"నా కొడుకు పోయి తొమ్మిదేళ్లు అవుతున్నా ఏ సర్కార్ మమ్మల్ని ఆదుకున్నది లేదు. మా కొడుకు త్యాగాన్ని కీర్తిస్తూ మాకు శాలువా కప్పి కొబ్బరికాయ చేతిలో పెట్టారు." చెప్పలరిగేలా నీరజ్ శర్మ తల్లి అనితా శర్మ పోలీసు హెడ్ క్వార్టర్స్ చుటూ తిరిగి తిరిగి వేసారిపోతోంది. కానీ ప్రభుత్వం హామీ ఇచ్చిన నౌకరీ లేదు. నష్టపరిహారం అంతకన్నా అందలేదంటూ తాజాగా అనితాశర్మ మీడియా ముందు గుండెలవిసేలా తన బాధ చెప్పకుంది. సీఆర్పీ జవాన్ నీరజ్ శర్మ రాజనంద్ గాం (ఛత్తీస్ గధ్)కు చెందిన పేద కుటుంబీకుడు. 2008లో బీజాపర్ జిల్లా మొదుగుపాల్ వద్ద గెరిల్లాల మాటుదాడిలో మరణించాడు.

"నా కొడుకు మరణించినా అతడే నిజమైన హీరో, భూమిని నమ్మకున్న వాళ్లకోసమే అమ్మనొదిలి, ఎందరో అమ్మల కోసం తండ్రీ, కొడుకులిద్దరూ తరలిపోయారు.ʹ (ఒడిశా రామగూడా ఎదురుకాల్పులలో నవయవ్వన ప్రాయంలో ఉన్న తన కొడుకును కోల్పోయిన పట్టెడు దుఖంలో మున్నావాళ్ల తల్లి సాక్షి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నమాటలు)

సంజయ్ మండల్ భార్య ప్రీతి తన భర్త త్వరగా కోలుకోవాలనీ, కుంటివాడైన ఆయనను పట్టించుకోని ప్రభుత్వాన్ని నిందిస్తూ రోదిస్తోంది. చనిపోయిన కొడుకు నీరజ్ శర్మ మరణంపై మాట ఇచ్చిన డబ్బు మాటే ప్రభుత్వం మరిచిపోయిందని అనితా శర్మ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తోంది. మరో తల్లి పద్మ తన కొడుకు ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేశాడని సగర్వంగా ప్రకటిస్తోంది.

సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల జీవితాలకు ప్రీతి మండల్, అనితా శర్మల వేదనలు అద్దం పడుతున్నాయి. సీఆర్పీలో వేలాది జవాన్లు, అధికారులు నౌకర్లు వదలుకోవాలనుకుంటున్నారని అక్కడ నరకయాతన అనుభవిస్తున్న సంజయ్ మండల్ 8 లక్షలకు పైబడిన అర్థసైనిక బలగాల మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాడు. గిట్టని మావోయిస్టులో, హక్కుల కార్యకర్తలో ఈ మాటలను సృష్టించారని ఎవరైనా అనుకుంటే మాత్రం పెద్ద తప్పచేసిన వారవుతారు. వీరి కథనాలన్నీ అంతర్జాలంలో భద్రంగా మీడియా మిత్రులు రికార్డు చేసి పెట్టారు.

ఖాకీబిడ్డలారా!

గడచిన 70 సంవత్సరాలలో దేశంలో మీ సంఖ్య మూడున్నర లక్షల నుండి 47 లక్షలకు పెరిగింది. మిగతా ఏ రంగంలోనూ దేశ యువతకు తగినన్నిఉద్యోగాలు ఇవ్వలేక పోతున్న ప్రభుత్వాలు ఖాకీ ఉద్యోగాలు నింపడానికి, పెంచడానికి మాత్రం చాలా ప్రాధాన్యతను ఇస్తోంది. దేశ ప్రజలలో పెరిగిపోతున్న అశాంతికి, ప్రభుత్వాల వ్యతిరేక ఆగ్రహానికి ఇది సంకేతం, గత 70 సంవత్సరాలలో దేశ జనాభా మూడు రెట్ల పెరిగితే మీ సంఖ్య 15 రెట్లు ఎందుకు పెంచాల్సివచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. దీనికి మావోయిస్టులే కారణమనీ బుద్దిఉన్నవాల్లెవరూ అనరు.

దేశంలోని 47 లక్షల బలగాలలో 14 లక్షలు భారత సైన్యం, 8 లక్షలకు పైగా అర్థసైనిక బలగాలు పోగా మిగతా శక్తి రాష్ట్రాల బలగాలలో ఉంది. వీరిలో 72 శాతం రైతు కుటుంబాల నుండే వచ్చినవారంటూ లెక్కలు చెపుతున్నారు. అంటే ఖాకీ బలగాలలో రైతుబిడ్డల సంఖ్య దాదాపు 34 లక్షలుంటుంది. మిగతా 13 లక్షలలో అత్యధికం కార్మికుల, మధ్య తరగతి కుటుంబాల నుండే చేరినవారుంటారు. ఈ గణాంకాలన్నీ మీ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నవే!

ఉద్యమ ప్రాంతాలలో మీరు ఐదు లక్షలకు పైగా మోహరించబడి ఉన్నారు. ఈ ప్రాంతాలలో మీరు ఏం చేస్తున్నారు? చాలావరకు ఇవి ఆదివాసీ అటవీ ప్రాంతాలు. మన దేశ సంపదలకు నిలయాలివి. తరతరాలుగా ఆదివాసీ ప్రజలు వాటిని దేశం కోసం కాపాడుతున్నారు. కానీ ప్రభుత్వాలు వాటిని ఘరానా పెట్టుబడిదార్లకు అమ్మకానికి పెడుతున్నాయి. వర్తమాన దేశప్రధాని మోదీ ఏకంగా "మేక్ ఇన్ ఇండియాʹ అంటూ విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్నాడు. వారికి ప్రభుత్వం మీ ద్వారా రక్షణ కల్పిస్తోంది. గనుల దగ్గర తవ్వకం పనులకు మీరు కాపలా ఉంటున్నారు. రవాణా మార్గాలకు మీరు రక్షణ కల్పిస్తున్నారు. తవ్వకం పనులతో జీవనోపాధిని కోల్పోతోన్న ఆదివాసీ ప్రజలు అడ్డుకుంటే మీరు వారిపై హత్యలూ, దౌర్జన్యాలకూ పాల్పడుతున్నారు. ఆదివాసీ ఆడపడుచులపై నిస్సిగ్గుగా పాశవికమైన అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఎక్కడ ప్రజలు తమ న్యాయమైన సమస్యలపై రోడ్ల మీదికి వచ్చినా మీరు ప్రత్యక్షమవుతారు.రైతులు, కార్మికులు, విద్యార్ధులు, ఆంగన్వాడీలు, బ్యాంకు ఉద్యోగులు, డాక్టర్లు, నర్సులు, ఉపాధ్యాయులు దేశంలో ఎవరు ఏ సమస్యపై మాట్లాడినా వారిని అణచివేయడమే మీరు నేర్చుకుంటున్నది. వాళ్లందరినీ మీరు చితకబాదుతారు. అధికారుల నుండి ఆర్డర్ వస్తే తుపాకులకు పని కల్పించి వాళ్ల రక్తం కళ్ల చూస్తారు. పేపర్లలో, రేడియోలో, టీవీలలో మీ దుశ్చర్యలను మీరే వింటూ, చూస్తూ చాలా ఘనకార్యం చేశామనుకునే వాళ్లు కూడా మీలో ఉంటారు. దేశ రక్షణ, వుద్యోగ విధి పేరుతో మీకు ఇస్తున్న శిక్షణ అలాంటిది.

ఇక కశ్మీర్, నాగాలాండ్, మణిపూర్ తదితర జాతుల పోరాట ప్రాంతాలలో గానీ, మావోయిస్తు ఉద్యమ ప్రాంతాలలో గానీ మీరు నిర్ధాక్షిణ్యంగానే వ్యవహరించాలని మీకు నేర్పుతుంటారు. వాళ్లంతా టెర్రరిస్టులనే మీకు బోధిస్తుంటారు. కశ్మీర్లో ఇప్పటికే మీరు లక్షకు పైగా జనాలను చంపినారు. మీ ప్రభుత్వాలు కోటానుకోట్ల డబ్బులు గుమ్మరిస్తున్నాయి. అక్కడంతా పాకిస్థాన్ కుట్రలకే ప్రజలు తోకాడిస్తున్నారనీ మీ బుర్రలలో పాలకులు నింపుతుంటారు. మావోయిస్తులంటే విదేశీ శక్తులతో నడిపించబడుతున్నారనో, చైనా సంతానమనో, దేశ ద్రోహులనో మీకు కల్పితాలు చెప్పి వారిపైకి రెచ్చగొడుతుంటారు. ఉద్యమ ప్రాంతాలలో మీరు మారణ హెూమానికి పాల్పడుతున్నారు. మిషన్-2016లో మీరు బస్తర్ ప్రాంతంలో 135 మందిని, మిషన్-2017లో ఇప్పటికే 40 మందిని నిలువనా కాల్చిచంపారు. ఆదివాసీ ఆడపడచులపై పాశవికమైన అత్యాచారాలకు పాల్పడుతున్నారనీ, వారి మర్మావయవాలను మాయం చేస్తున్నారనీ నిజనిర్ధారణ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినా వాళ్లు తమ బతుకు కోసం మీతో పోరాడక తప్పడం కాదు.

మీ మెదళ్లలోకి ఎక్కిస్తున్న తప్పడు దేశభక్తి జాతీయత మీలో ఉన్మాదాన్ని నింపుతోంది. మీకు దొరికే జీతం రాళ్లు మీలో మానవతా విలువలను హరించివేస్తున్నాయి. మీ ఖాకీ డ్రెస్సు, మీ చేతిలో ఆయుధం మిమ్మల్ని మానవ మృగాలుగా మారుస్తున్నాయి. కానీ మీలో అందరూ ఒకేలా లేరు. మీలో కరుడుగట్టిన అధికారుల అడుగులకు మడుగులొత్తే లంపెన్ శక్తులు మినహా జీవిత వ్యధలు అనుభవిస్తున్న వాళ్లే అధికం. మీ జీవితాల్లో ఎక్కడా సంతోషం లేదు. మీరెలాంటి హక్కులకు నోచుకోలేదు. అధికారులకు ఎదురు మాట్లాడలేని అవమానకర జీవితాలు అనుభవిస్తున్నారు. తల్లీ బిడ్డలకు దూరంగా, సుదూర ప్రాంతాలలో కనీస అవసరాలకు నోచుకోకుండా ʹభయంʹ గుప్పెట్లో తల్లడిల్లుతున్న బతుకులు మీవి. ఒక్కసారి మీ జీవన వ్యధలను చూద్దాం.

2009-14 మధ్య గడిచిన ఆరేళ్లలో అర్థసైనిక బలగాల వాళ్లు డ్యూటీలో ఉండగా మూడువేల మంది చనిపోయారు. ఇందులో మావోయిస్తులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయింది తక్కువే. ఈ ఆరేళ్లు భయం కొలిపే గ్రీన్హంట్ ఆపరేషన్ కాలమే అయినా గెరిల్లాల చేతిలో మీ మరణాల సంఖ్య 345 దాటలేదు. అంటే పదవ వంతుకు లోపే. ఇక మిగతా కారణాలతో మృత్యువాత పడిందే ఎక్కువ. ఆత్మహత్యలతో 207 మంది, గుండె ఆగిచనిపోయిన వారు 614 మంది, ఎయిడ్స్ వ్యాధితో 153 మంది, మలేరియాతో 102 క్యాన్సర్తో 231, కాలేయ సంబంధిత వ్యాధులతో 83, ప్రమాదాలలో 544, తల నరాలు చిట్టి 59 మంది, తమలో తాము కాల్చుకొని 36 మంది అంటూ పలు వివరాలతో మీడియా వెల్లడించింది. 2009-12 మధ్య 50 వేలమంది స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. 2013లో 4,186 మంది ఉద్యోగాలు వదిలేశారు. 2014 వచ్చేసరికి ఈ సంఖ్యలో 68 శాతం పెరుగుదల వచ్చి 6,700కు చేరింది.

2015లో బస్తర్ ప్రాంతంలో 60 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిన్నగాక మొన్న సీఆర్‌పీఎఫ్‌ ప్లటూన్ కమాండర్ సూర్యభాను థాపా శంకినీ నదిలో దూకి ప్రాణం తీసుకున్నాడు. మీ బతుకులపై మీ అధికారి ఒకరు "శతృవు చేతిలో కాదు, మా చేతుల్లో మేం చస్తున్నాం, వ్యాధులతో చస్తున్నాం. దోమలూ చంపుతున్నాయి. అంటూ వాపోతే, "మా జవాన్ల జీవితం రెండవ శ్రేణి పౌరులదే, యుద్ద రంగంలో ఓడిపోతున్నాంʹ అంటూ జగదల్పూర్ హాస్పిటల్లో ఓ జవాన్ మీడియా ముందు కన్నీరు పెట్టాడు. ఇక మీకు వైద్యం చేసే వైద్యుడు ప్రకాశ్ తివారీ, "పరిస్థితులు మారకుంటే వ్యాధులు, ఆత్మహత్యలతో చచ్చేవారి సంఖ్య ఇంకా పెరుగుతుందిʹ అని సూటిగానే చెప్పాడు. ఇవీ మీ ఖాకీ బతుకులు. ఇలాంటి మీ జీవితాలను సవాలుగా తీసుకొని సరిదిద్దాల్సిన మీ కేంద్ర పోలీసు మంత్రి రాజనాథ్ సింగ్ ఈ మధ్య సుక్మా జిల్లాలో జరిగిన కొత్త చెరువు, బుర్కపాల్, చింతగుప్ప గెరిల్లా దాడులను సవాలుగా తీసుకుంటానని శపథం చేస్తున్నాడు.

మే 8 నాడు మీ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం చేస్తున్నాడు. అందులో వాళ్లు ఏం నిర్ణయాలు చేస్తారో మీకూ మాకూ తెలవనిది గాదు. మిమ్మల్ని బలిపశువులుగా చేయడానికి ఇంకా అదనపు బలగాలను అడవులకు, ఆదివాసుల మీదికి తరలిస్తామంటారు. మరిన్ని నిధులు గుమ్మరిస్తామంటారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, కనెక్టివిటీ లాంటివి ఎన్నో చర్చించి ఆకాశం దద్దరిల్లేలా చేస్తారు. ఇప్పటికే బస్తర్లో పోలీసు, అర్థసైనిక బలగాలు 65 వేలకు (45000+20000) పైగా ఉ న్నాయి. 800 మందితో మొత్తంగా ఆదివాసీ బిడ్డలతోనే బస్తరియా బెటాలియన్ తయారవుతోంది. రాష్ట్ర-కేంద్ర బలగాల మద్య సమన్వయం మెరుగుపరుస్తామని హామీలు ఇస్తారు. (బుర్కపాల్ సీఆర్పీ మరణాల తర్వాత బీఎస్ఎఫ్ మాజీ డీజీ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ కేంద్ర బలగాలు చస్తూంటే, రాష్ట్ర బలగాలు ఆనందిస్తున్నాయని బీబీసీలో మండిపడ్డాడు. ఫలితంగా మొత్తం ఛత్తీస్గఢ నక్సల్ వ్యవహారాల డీజీడీయం అవస్థీ స్పందిస్తూ అర్ధ సైనిక బలగాలకు తోడుగా సర్వత్రా 25-30 మంది రాష్ట్ర పోలీసు బలగాలు ఉంటాయన్నాడు.)

ఇలా వీళ్ల మీటింగ్ లక్ష్యం అంతా మావోయిస్తు ఉద్యమ ప్రాంతాలలో మీ ఇనుప బూట్లతో అడవులు దద్దరిల్లెలా చేయడమే. ఆదివాసీల జీవితాలను ఛిద్రం చేసే పథకాలకు రూపకల్పన చేయడమే ఉంటుంది. ఇలా చేయకుండా ఇక్కడి వనరులను వాళ్లు కొల్లగొట్టకపోలేరు. ఆదివాసుల సంపదల తరలింపుకు ఫోర్లేన్, సిక్స్లేన్ మార్గాలు సుగమం చేయలేరు. ఈ సందర్భంగా 2011లో జనవరి 6 నాడు దేశ అత్యున్నత స్థాయి న్యాయస్థానం చేసిన వ్యాఖ్య మీ దృష్టిలో కూడా ఉండి ఉంటుంది.

ʹఈ దేశపు అసలు పౌరులు ఆదివాసీలే. మిగతావాళ్లంతా ఆక్రమణదార్ల సంతానమే. వీళ్లు ఆదివాసులతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వాళ్లను రాక్షసులు, అసురులు అంటూ నానా మాటలన్నారు. కానీ గైరాదివాసుల కన్నావీళ్ల మెరుగైన వాళ్లు, అబద్దాలెరుగరు. ఎవరితోనూ మొండిగా ఉండరు. కానీ వీళ్లు నిరంతరం అత్యాచారాలకు గురవుతున్నారు.ʹ
(జస్టిస్ మార్కండేయ కాట్టు, జస్టిస్ జ్ఞాన్సుద్ద మిశ్రా బెంచ్)

ఈ దేశపు ఆదివాసుల జీవితాలను అర్థం చేసుకోవడానికి సుప్రీంకోర్డు వ్యాఖ్యలకు తోడుగా మీ విశ్రాంత అధికారి బీఎస్ఎఫ్ డీజీ రామ్మోహన్ దంతెవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ చనిపోయిన సందర్భంగా ఎంక్వైరీ కమీషన్గా హెూంశాఖ నియమించినపుడు ఏమన్నాడో చదవండి.

ʹఖనిజాలు ఉన్న భూముల గ్రామాలతో ఎంఓయూలు చేసుకోవాలి. కానీ మన దేశంలో ప్రతి ఎంఓయూ స్విస్ బ్యాంకుల లింక్లో ఉంటాయి.ʹ

ఈ దేశ వనరులను ఎవరు లూటీ చేస్తున్నారో మీ బాస్ సూటిగానే చెప్పాడు. ఆలోచించండి. మీ ఉద్యోగాలు ఎవరికోసమో పునరాలోచించండి. ఈ దోళ్లిడీ ప్రభుత్వాల తరపున మీరు ఎవరిని హతమారుస్తున్నారో ఆత్మచింతన చేసుకోండి. మీరంటే ప్రజలలో ఎంతటి భయం, కసి, వ్యతిరేకత, అసహ్యత ఉందో గుర్తించండి. మీ మంత్రి రాజనాథ్సింగ్ ఆదివాసీలకు మావోయిస్టులు పరమశత్రులు అన్నాడు. కానీ ఆదివాసీలను, వారి సంపదలను దోళ్లిడీ చేస్తున్న పాలకులు వారు శత్రువులా! తమ కోసం తాము పోరాడుతోన్న ఆదివాసీ బిడ్డలే ఆదివాసీలకు, వారి అభివృద్ధికి శత్రువులా! మీ బుర్రలతో మీరు ఆలోచించండి. మీ అధికారులు ఎన్నెన్నో తేనెపూసిన మాటలతో పోలీసు మిత్రʹ అంటూ ప్రజల్లో మీ అవతారాలను ప్రవేశపెట్టే అనేక కొంటె చర్యలకు పాల్పడుతున్నారు. కానీ దోపిడీదార్లను రక్షిస్తున్నంత కాలం మీరెన్నటికీ ప్రజలకు మిత్రులు కాలేరు. దోపిడీకి కాపలా కాసినన్ని రోజులు ప్రజలు మిమ్మలను నమ్మరు. మీరు ప్రజల నిర్వాసిత సమస్యలో వారితో మమేకం కండి. జై జవాన్, జైకిసాన్ అంటూ రైతులతో కలిసిపోండి. మహిళలతో, విద్యార్థులతో, సోదర ఉద్యోగులతో, కార్మికులతో ఐక్యం కండి. అపుడు, అప్పడు మాత్రమే గౌరవప్రద జీవితానికి అరులవుతారు.

చివరన మీ దృష్టికి మీ మోదీ గారు ఆకాశానికి ఎత్తుకునే ఐరన్మాన్, దేశ తొలి హెూం మంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉగ్ర హిందుత్వ శక్తి సర్దార్ వల్లభభాయి పటేల్ 1949లో నెహ్రూతో ఇలా అన్నాడు.

"మనం ఆదివాసులతో పోరాడలేం. వాళ్ల మన కన్నాముందు నుండే (1857) దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్లు, ఆదివాసులే ఈ దేశానికి అసలైన జాతీయవాదులుʹ

పోలీసు బిడ్డలారా!

ప్రజల పక్షం నిలవండి. ఖాకీ డాంబీకాన్ని వదలండి. మనుషులుగా జీవించండి. దేశం కోసం విప్లవకారులతో నడుం బిగించండి. భూస్వామ్య, బడా పెట్టుబడిదార్ల, సామ్రాజ్యవాదుల దోపిడీని అంతం చేయ సిద్దం కండి.

No. of visitors : 780
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి -2018
  కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం
  స్టాలిన్‌ వ్యతిరేకత?
  ప్ర‌జ‌ల‌పై యుద్ధం; జ‌న‌త‌న స‌ర్కార్ పాఠ‌శాల‌ల ధ్వంసం
  ట్రాట్స్కీ అసత్యాలు - ఆ అసత్యాల అంతరార్థాలు
  NO TO WAR!
  SOME ASPECTS OF PROLETARIAN INTERNATIONALISM OF STALINIST SOVIET UNION
  స్టాలిన్ కవితలు
  ఆపరేషన్ సమాధాన్లో భాగ‌మే కాంకేర్ ʹఎన్‌కౌంట‌ర్‌ʹ
  పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాల అనివార్యత
  ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
  కడలి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •