దు:ఖపు వ్యక్తీకరణగా విప్లవ కవిత్వం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

దు:ఖపు వ్యక్తీకరణగా విప్లవ కవిత్వం

- పాణి | 02.08.2017 10:33:14am

జీవిత కవిత్వం-4

సమూహ కంఠస్వరంతో ఆధునిక ప్రగతిశీల కవి ప్రారంభమయ్యాడు. గొంతెత్తి బిగ్గరగా, అందరి తరపునా అందరికీ వినబడేలా, నడి వీధిలో ఉప్పొంగే కెరటంలా అది ఉండేది. కవిత్వానికి ప్రగతి అనే లక్ష్యం నిర్దేశించుకున్నందు వల్లే కవులు దీన్ని సాధించారు. కాలక్రమంలో ఇది ఇంకా చాలా మారుతూ వచ్చింది. అమూర్త ప్రగతి భావన నిర్దిష్ట విప్లవ చైతన్యం కావడం ఒక ముఖ్య పరిణామం. కవి ఈ చైతన్యాన్ని ప్రదర్శించే తీరునుబట్టి కవిత్వ వ్యక్తీకరణ మారుతూ వచ్చింది. విప్లవ కవిత్వంలోని వైవిధ్యమంతా అదే. గత యాభై ఏళ్లలో ఏ కవి ఎలా తన కవిత్వంలో విప్లవ చైతన్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారనే దాన్ని బట్టి వాళ్ల కంఠ స్వరాన్ని గుర్తించవచ్చు. విప్లవ కవితా ఉద్యమంలోకి వేర్వేరు నేపథ్యాల, అధ్యయనాల, సృజన తలాల నుంచి అసంఖ్యాక కవులు వచ్చారు. ఆ వైవిధ్యాన్నంతా విప్లవ కవితా ధారలో భాగం చేశారు. చేస్తున్నారు.

ఉదాహరణకు బహిరంగ, అజ్ఞాత ప్రజా జీవితాల్లో ఉన్న కవుల కవిత్వంలో స్థూలంగా ఈ తేడాను పసిగట్టవచ్చు. కవిత్వాన్ని అంత మౌలిక స్థాయిలోకి వెళ్లి విశ్లేషించుకోగలిగే శక్తి ఉండాలేగాని సూక్ష్మస్థాయిలో కూడా దాన్ని వివరించుకోవచ్చు. విప్లవాన్ని కవిత్వంలో అర్థం చేసుకోవడంలో, లేదా విప్లవాన్ని కవిత్వం చేయడంలో అజ్ఞాత కవుల్లోనే ఎన్నో తేడాలు ఉన్నాయి. ఎంతో వైవిధ్యం ఉంది. ఈ ఒక్కటే ప్రత్యేకంగా వివరించవలసినంత పెద్ద అంశం. అందువల్ల ఇక్కడ లోపలికి వెళ్లలేం కాని, 1990ల ప్రారంభంలో ఇద్దరు అజ్ఞాత కవులు ఎమ్మెస్సార్‌, సముద్రుడు కవిత్వాన్ని పరిశీలిస్తే చాలు. లేదా ఆ తర్వాతి కాలంలోని కౌముది, షహీదా కవిత్వాన్ని చూచినా చాలు. విప్లవం గురించేగాక, కవిత్వం గురించి కూడా వాళ్ల అవగాహనలోని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

ఈ ఒరవడి విప్లవ కవితా చరిత్రలోని ప్రతి దశకంలో బైటి విప్లవ కవుల్లో కూడా చూడవచ్చు. విప్లవమంటే ఏమిటి? కవిత్వమంటే ఏమిటి? అనే విస్తృత అవగాహన క్షేత్రంలోకి ఒక్కో కవి ఒక్కో వైపు నుంచి చేరుకుంటారు. అది వాళ్ల జీవిత నేపథ్యం, అధ్యయనం, వాటి వల్ల అలవడిన వ్యక్తిగత ప్రతిభ మొదలైన వాటికి సంబంధించింది. విప్లవంతో, కవిత్వంతో ఎక్కడో లంకె కుదురుతుంది. ఏ రూపంలోనో అనుబంధం ఏర్పడుతుంది. అక్కడి నుంచి వాళ్ల ప్రయాణం మొదలవుతుంది. విప్లవమనే ఒక గొప్ప సామూహిక సంరంభం మధ్యలోనే ప్రతి కవీ విప్లవమంటే ఏమిటి? కవిత్వమంటే ఏమిటి? అనే సొంతంగా అన్వేషించుకోవలసి వస్తుంది. బహుశా కళ-సమూహం-వ్యక్తి సంబంధంలో ఇది తప్పించుకోలేనిది కావచ్చు. అనివార్యమైనది కావచ్చు. అందునా కవిత్వానికే ఉండే ప్రత్యేకతల వల్ల కూడా.

ఇక్కడే తొలి కాలపు ప్రగతిశీల కవి కంఠస్వరానికి ఇప్పటి విప్లవ కవితా వ్యక్తీకరణకు ఉన్న తేడా కనిపిస్తుంది. అది కాల సంబంధమైనదే అనుకుంటే పొరబాటు. మౌలికంగా ప్రగతి భావనలోనే ఈ పరిణతి వచ్చింది. దాన్నుంచి కవితా వస్తువులో, ముఖ్యంగా దాన్ని కళ చేయగల శిల్పంలో వచ్చిన మార్పు ఇది. ఈ మార్పు అనేక తలాల్లో ప్రవహిస్తున్నది.

దీనికి భిన్నమైన ఒక చిన్న పాయ తెలుగు కవిత్వంలో ఉన్నది. కళ-వ్యక్తి అనే మార్గంలోకి జారిపోయిన వాళ్ల కవిత్వమది. అందువల్లే ఆ కవిత్వంలో అంతులేని వేలంవెర్రి కనిపిస్తుంది. ఒక్కోసారి అది ఒంటరి ఏడుపు గొంతులోని అత్యంత కళాత్మకమైన జీరగా వినిపిస్తుంటుంది.

దానికీ ఇవ్వాల్టి విప్లవ కవి గొంతులోని విషాద ధ్వనికీ ఒక మౌలికమైన తేడా ఉంది. ఈ విషాదం.. దు:ఖం కూడా కావచ్చు. విప్లవ కవిత్వ తొలినాళ్లలోని ఉత్తేజ స్వరానికి భిన్నమైనది ఇది. విప్లవమనే ఊహే ఉద్విగ్నభరితమైనది. అది ఒక కెరటంలా దూసుకొచ్చిన తొలి రోజుల్లో చాలా ఉద్వేగంగా సాగుతుంది. ఒక పెద్ద సామాజిక విషాదాన్ని రద్దు చేసే క్రమంలో రాజ్య నిర్బంధం, ఆటుపోట్ల మధ్య దు:ఖాన్ని అనుభవిస్తుంది. విప్లవోద్యమ వికాసంలో ఇది తప్పదు.

మన దగ్గర విప్లవోద్యమం అనుభవించిన, అనుభవిస్తున్న దు:ఖం చాలా లోతైనది. దీర్ఘకాలంగా సాగుతున్నది. దీన్ని విప్లవ కవులు ఒక తలంలో రాజకీయంగా విశ్లేషించుకుంటారు. ముఖ్యంగా ప్రతి విప్లవ కవి కార్యకర్త కూడా కాబట్టి ఈ విషాదానికి ఉన్న రాజకీయ అర్థాన్ని చాలా గాఢంగా గుర్తిస్తారు. మరో తలంలో దాన్నంతా కవిత్వంగా వ్యక్తపరుస్తారు. మనుషుల మధ్య, మనుషులు నిర్మించే విప్లవోద్యమం మధ్య కవిత్వం మాత్రమే సాధించే ప్రయోజనం దానికి గీటురాయి. అది సృజన తలానికి చెందినది. దాని లక్ష్యం.. సమాజాన్ని సెన్సిటైజ్‌చేయడం, విప్లవం పట్ల ఒక సున్నిత భావనను విస్తరించజేయడం, ప్రజల కఠిన ఆచరణలోని ఈ సున్నిత పార్శ్వాన్ని సమాజమంతా ప్రసరింపజేయడం.

విప్లవ కవిత్వపు తొలి రోజుల్లోనే దీన్ని శివసాగర్‌తోటరాముని తొడకు.. అనే గీతంలో వినిపించారు. మళ్లీ లేచి నిలబడతామనే ఆశ్వాసాన్నేగాక గాయపడిన విప్లవంలోని దు:ఖపు జీరనూ ఆయన అద్భుతంగా పలికించారు. మొత్తం మీద విప్లవాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా, సామాజిక పరివర్తనగా ప్రకటించి.. అందులోని అందరినీ రమ్మని చెయ్యెత్తి పిలిచే కవితా రూపం ఒకటి. విప్లవాన్ని ఒక సున్నితమైన మానవీయ ప్రక్రియగా ఎత్తిపడుతూ, ఆ సంస్పందనలను స్పృశించే రూపం ఇంకొకటి. ఇందులో అంతులేని విషాదాలు, దు:ఖాలు, ఎడబాటులు ఉంటాయి. ఈ వ్యవస్థలో లేని మానవ సంబంధమైన భావనలు ఉంటాయి. వాటి మారుమూలల్లోకి వెళ్లి అక్కడి నుంచి జీవితాన్ని, చరిత్రను గుర్తించే చూపులు ఉంటాయి. తద్వారా విప్లవం పట్ల మనుషులను సున్నితంగా తీర్చిదిద్దే రూపమిది. విప్లవ దృక్పథంలో కీలకం. చాలా గంభీరమైనది. దీన్ని చేరుకోడానికి ఒక్కో కవి ఒక్కో రకమైన ప్రయాణం చేస్తారు. విప్లవం పెద్ద పెద్ద గెంతులతో పురోగమిస్తున్న కాలంలోకంటే తీవ్రమైన పెనుగులాటలో ఉన్నప్పుడు కవులకు దృష్టి పట్టుబడుతుంది. ఇది స్మృతి కవిత్వానికి ఒక గొప్ప తాత్విక, కళాభరితమైన కొనసాగింపు అని చెప్పుకోవచ్చేమో. నిజానికి స్మృతి కవిత్వమే ప్రతి ఉద్యమ సందర్భంలో మారుతూ, పరిణతి పొందుతూ, గాఢమవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఎడబాటులోని, తలపోతలోని దు:ఖానికన్నా ఇంకా చాలా విశాలమైన ఆవరణలో, స్థాయిలో విప్లవ కవిత్వంలో విషాదం పలుకుతున్నదా? పరిశీలించవచ్చు.

ఈ కోణంలో చూస్తే ..ఈ దశాబ్దంలోని విప్లవ కవిత్వంలో పలుకుతున్న దు:ఖం శుష్క విషాదం కాదు. ఒంటరి విషాదం కాదు. జీవితంలో ఒంటరి విషాదాలూ ఉంటాయి. కానీ అది ఏ ఒక్కరిదీ కాదు. మనుషులు ఎక్కడో గుంపుగానే కోల్పోతుంటారు. అందరి గాయానికి విడిగా నొప్పిపడుతూ ఉంటారు. లేదా మనిషి చేరుకోవాల్సిన తీరం కోసం పడే యాతన అది. విప్లవం గురించి ఈ స్పృహ కలిగాక కవిత్వ దృక్పథమే మారిపోతుంది. శిల్పం సంగతి చెప్పనవసరమే లేదు. ముప్పై నలభై ఏళ్ల కిందే విప్లవ కవిత్వంలో వచ్చిన మార్పు ఇది. ఇటీవల మరీ స్పష్టంగా. దీన్ని కూడా ఏ ఒక్క కవి నుంచో గాక ఒక బృందం వ్యక్తీకరణగానే విశ్లేషించవచ్చు. ఉదాహరణకు కెక్యూబ్‌వర్మ కవిత్వంలోని ఈ విషాదపు జీర మనల్ని నింపాదిగా కూచోనివ్వదు. దాన్ని గుర్తించడానికే కాదు, అనుభవించడానికి కూడా ఇంత సుదీర్ఘ నేపథ్యం అవసరం. లేకపోతే విప్లవం గురించీ, కవిత్వం గురించీ, ముఖ్యంగా జీవితంలోని దు:ఖం గురించీ తెలియని యాంత్రి మేధావులకు విప్లవ కవి ఇలా రాయడం(అలాంటి వాళ్లకు కవిత్వ వాచకం చదవడమే రాకపోవచ్చు.. కాబట్టి ఇబ్బంది ఉండదు..) ఏమిటనే ప్రశ్న ఎదురుపడవచ్చు.

ʹరాతి రెప్పలుʹ అనే కవిత చూడండి

ఇక్కడో చిత్రకారుడు అక్షరాలకు
నెత్తుటి తడిని అద్దుతూ
దేహాన్ని చిత్రిక పడుతున్నాడు

కనులకంటిన చెమ్మను కోల్పోతూ
రాతి రెప్పలను చెక్కుతూ
నరాలను పేనుతున్నాడు

రాలిన కలలను పేరుస్తూ
వాన నీటిలో రెక్కలూడిన
తూనీగకు రంగులద్దుతున్నాడు

ఇన్ని రాలి పడిన పసిపాపల
కనురెప్పలను ఏరుతూ
నిచ్చెన కడుతున్నాడు

తెగిన దారం చివర గాలి పటాన్ని
ఎగరేస్తూ పావురం
గాయానికి లేపనమవుతున్నాడు.

వర్మ ఇంకో చోట ʹకాసిన్ని దు:ఖపు చినుకులను రాల్చే పసి హృదయపు కవిత్వం కావాలʹని అంటాడు. కవిత్వపు స్వభావం, లక్ష్యం రెండూ ఇలా ప్రకటించుకున్నాడు. అందువల్లే ఆయనకు ఒక రకంగా అత్యంత సమీపంలో, మరో రకంగా సుదూరంలో గాయపడుతున్న పావురాలకు లేపనం అద్దే కవిత్వం రాస్తున్నాడు. ఇక అది ఎంత మెత్తగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ కవిత్వంలో ఎన్ని జీవన సందర్భాలున్నాయో, ఎన్ని మూడ్స్‌ఉన్నాయో అన్నిటినీ కవిత్వం చేశాడు. అలా చేయగల కళా దృష్టి ఆయనకు ఉన్నది. విప్లవోద్యమంలోని దు:ఖం మొత్తం సమాజంలోని విషాదంలో భాగం. కవిగా వర్మకు ఇది ఎక్కడెక్కడో అనుభవంలోకి వస్తూ ఉంటుంది. నిజానికి ఇది సమాజ స్థితి. మనిషి స్థితి. అక్కడి నుంచి విప్లవోద్యమంలోకి, ఇక్కడి నుంచి విశాలమైన జీవిత క్షేత్రంలోకి ఒక మూడ్‌తో చేసే ప్రయాణమే ఈ కవిత్వం.

మామూలుగా అయితే ఈ విషాదంలోంచి నిరాశలోకి జారిపోవడం చాలా తేలిక. కవులకు మరీ. కానీ వర్మ తన దృక్పథానికి బైట ఈ విషాదాన్ని చూడటం లేదు. ఒక వాస్తవంగా కూడా ఇది మనిషి లోపలా, బైటా ఉన్నది. చాలా విశాలమైన అర్థంలో చెప్పుకోవాలంటే చరిత్ర తనను తాను పునర్నిర్మించుకోవడంలో ఉండే ఒరిపిడి ఇదంతా.

ʹనువ్వు అడుగుతావు

స్వప్నాలకు చావు ఉందా అని
లేదు లేదు
అవి భుజం మార్చుకుంటాయంతేʹ అని ఒక చోట.. సరిగ్గా ఇలాంటి వ్యక్తీకరణే ఇంకో చోట..

ʹఅతనెత్తి పట్టిన జెండా
అవనతం కాలేదు
భుజం మార్చుకుంటుందంతే.. ʹ అంటాడు.

మామూలుగా కవులు తీవ్రమైన రప్చర్‌ను చూసి బెదిరిపోతారు. చరిత్రపట్ల భౌతిక దృష్టి, ఆశాదృష్టి రెండూ ఉన్న వాళ్లు దాన్ని కాల్పనీకరించడంలో, కళ చేయడంలో ఎలాంటి తడబాటుకు గురికారు. దీనికి అపారమైన ఊహా శక్తి తోడైతే కవిత్వం ఎక్కడెక్కడికో విస్తరిస్తుంది. గొప్ప దృశ్యాలను చూపిస్తుంది. వర్మకు ఉన్న ఊహాశక్తి వల్ల అద్భుతమైన, దు:ఖకరమైన దృశ్యాలు ఎన్నో మన ముందుకు వస్తాయి. ఒక్కోసారి ముట్టుకుంటే, గాలిపారితే మాసిపోతాయా అనేంత సున్నితమైన దృశ్యాలు ఆయన కవిత్వంలో చూస్తాం. దృక్పథం వల్ల వస్తువు కళ కాదని, వస్తువు ఎంపికకే పరిమితి ఏర్పడుతుందని, ప్రయోగానికి అనుమతి ఉండదని, ఊహకు చోటు దొరకదనే ముతక వాదనలు ఇప్పటికీ కొందరు అమాయకులు చేస్తుంటారు. ప్రగతిశీల, విప్లవ కవిత్వాన్ని వ్యతిరేకించడానికి ఇలాంటి వాళ్లకు ఇంకేదైనా వాదన దొరికితే బాగుండు కదా అనిపిస్తుంది.

విప్లవంలో దు:ఖం ఏడుపుగొట్టు వ్యవహారం కాదు. ముక్కుతూ మూలుగుతూ పడి ఉండటం కాదు. దు:ఖం ఒక ఆలంబన. తల్లులందరూ ఒక చోట చేరి అమరులైన తమ బిడ్డల కోసం సొమ్మసిల్లిపోయేలా ఏడ్చి లేచి నిలబడి కడుపు పుట్టిన వాళ్లకే గౌరవంగా జోహార్లు చెప్తారు. మీ రాజకీయాలేవో తెలిసినా.. తెలియకపోయినా మీ మార్గంలోనే మేమూ నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తారు.. విప్లవంలో సామూహికత వల్ల, అమరత్వానికి ఉన్న సామాజికత వల్ల దు:ఖం వలపోతగా కాక ఆలంబన అవుతుంది. మనుసును సున్నితం చేస్తుంది. సునిశితం చేస్తుంది. అంతిమంగా అదొక దృక్పథమవుతుంది. ఇంకా ఇంకా దృక్పథ వైశాల్యాన్ని పెంచుతుంది. లోతైన, గాఢమైన, చెమ్మతో ఉండే భావనలుగా, ఊహలుగా విస్తరించి భౌతిక వాస్తవమవుతుంది. కవిత్వమవుతుంది. దీనికి ఇంకో ఉదాహరణ చూడండి. సాంగ్‌ఆఫ్‌రివర్‌అనే కవితలో..

ఔను
ఇప్పుడు ఒక్కొక్క వాక్యమూ తడిని కోల్పోయి
రాతి నాలుకతో పొడిబారిపోతోంది

రహస్యంగా అతి రహస్యంగా ఒక రావి ఆకును
తుంచి పేజీ మధ్యలో దాచుకొని ఈనెల
గుండా ప్రవహించిన క్షణాలు

ఈ కొండ పాదం అంచున మూలికలన్నీ తాకి
ప్రవహిస్తున్న నదీ జలాన్ని దోసిట పట్టి
దాహంగా స్వీకరిస్తున్న ఘడియలు

మరల మరల నిన్ను ముసురుకుంటున్న
సామూహిక దు:ఖమేదో మేల్కొలిపి
నిన్నో జెండాగా మార్చి ఎగరేస్తుంది.

శిల్పం వల్లే వస్తువు కళ అవుతుంది. సామాజికత వల్లే కళకు జీవం వస్తుంది. లేదంటే అది మ్యూజియంలోని నిర్జీవ సౌందర్యంగా మిగిలిపోతుంది. కళను వ్యక్తికి, వ్యక్తి లోపలి ప్రపంచానికి పరిమితం చేసే వాళ్ల కవిత్వం అలాంటి అద్భుత నిర్జీవ సౌందర్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సామాజికత, లేదా దృక్పథ స్పష్టత సంతరించుకుంటే కవిత్వం ఎంత వైవిధ్యభరితంగా ఉంటుందో, జీవితంలా ఉంటుందో, జీవిత కవిత్వంలా ఉంటుందో వర్మ కవిత్వం ఒక మంచి ఉదాహరణ.

No. of visitors : 754
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •