గొడ్డలి నీళ్ళలో పడింది! బుడుంగున ములిగింది!
కొమ్మ మీద వుండి కట్టెలు కొడుతుంటే చేజారి పడలేదు?! ఒడ్డున వుండి చేతులారా విసిరితే పడింది!
ʹదేవత ప్రత్యక్షం అవుతుందా..?ʹ చిన్నప్పటినుండి విన్న కథ గుర్తొచ్చి అతడికి నవ్వొచ్చింది!
ఎందుక్కాను?.. అన్నట్టు జలదేవత ప్రత్యక్షమయ్యింది!
కథలు కూడా నిజమవుతాయా? ఒకేలా మొదలవుతాయా? తెలియకుండానే చేతులు జోడించాడు!
ʹనా గొడ్డలి..ʹ చెప్పబోయాడు!?
జలదేవత బంగారు గొడ్డలి తీసిʹయిదేనా?ʹ అని చూపిస్తూ అడిగింది!
కళ్ళు పులుముకు చూసినంత మాత్రాన కళ్ళముందు జరుగుతున్న కథ అబద్దం అయిపోదు! రుజువు చేస్తూ ముద్దపసుపు కాంతి జిగేల్మంది!
ʹనాది కాదు..!ʹ అన్నాడు!
జలదేవత నీళ్ళల్లో ములిగింది! తడవని బట్టలతో తేలింది! ఈ సారి ఆమె చేతిలో వెండి గొడ్డలి వుంది! ʹయిదేనా?ʹ అని చూపిస్తూ అడిగింది!
ʹనాది కాదు..!ʹ అన్నాడు!
మళ్ళీ జలదేవత నీళ్ళల్లో ములిగింది! ఒళ్ళు తడవకుండా తేలింది! ఈ సారి ఆమె చేతిలో యినుప గొడ్డలి వుంది! ʹయిదేనా?ʹ అని చూపిస్తూ అడిగింది!
ʹనాదే..!ʹ అన్నాడు!
జలదేవత జల జలా కన్నీరు కార్చింది! అంతలోనే కళ్ళు తుడుచుకుంది! మెచ్చుకోలుగా చూసింది! ʹనీ నిజాయితీకి మెచ్చితిని! ఈ గొడ్డళ్ళు నువ్వే తీసుకో..ʹ బంగారుగొడ్డలి, వెండిగొడ్డలి, యినుపగొడ్డలి అన్నీ అతని చేతుల్లో పడ్డాయి! అతడు మాడిపోయిన ముఖంతో గొడ్డళ్ళ వంక చూడడం జలదేవత గమనించకపోలేదు!
ʹఈ గొడ్డళ్ళు దేనికి? నెత్తికేసి కొట్టుకోనా..?ʹ అతగాడు ఆగలేక అడిగాడు!
జలదేవత తన నెత్తిన గొడ్డలిపడ్డట్టు తెల్లబోయి చూసింది!
ʹఈ గొడ్డళ్ళు నాకవసరం లేదు.. వీటితో పని లేదు..!ʹ గొడ్డళ్ళు పట్టుకు నీట్లోకి దిగబోయాడు! జలదేవతను చూసి, ఆమె ముఖంలో గొడ్డలి వేటుకు రక్తపుచుక్క కనబడకపోవడం చూసి, ʹగొడ్డళ్ళతో నాకు పని లేదని చెప్పాను కదా..?ʹ అన్నాడు!
ʹగొడ్డళ్ళు కరిగించుకొని అమ్ముకు బతకొచ్చు కదా?ʹ అని జలదేవత అడగాలనుకొని అడగలేకపోయింది!ʹఅప్పుడు అది గొడ్డలయినా వొకటే, వేరొకటయినా వొకటే! గొడ్డలే యెందుకు?ʹ ప్రశ్నా తనదే సమాధానమూ తనదే అయి జలదేవతకు మాట రాలేదు!
ఇంతలో గొడ్డళ్ళు నీళ్ళలోకి విసిరేసి అతగాడు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్నాడు!
జలదేవతకి పిచ్చిలేసింది! విసిరేసిన గొడ్డళ్ళు వెలికితీసి చేతపట్టుకొని పరుగు పరుగున అతని వెంట పడింది! ఆగమంది! ʹనువ్వు నన్ను అవమానిస్తున్నావుʹ అంది!తిరిగి ʹనువ్వే నన్ను అవమానిస్తున్నావుʹ అన్నాడతడు!
ఇంతలో ఆకులు రాలాయి!? లేదు.. అవి ఆకులు కావు! పిట్టలు! పిట్టల్లా రాలుతున్నాయి!
అతడు వొక పిట్టని చేతుల్లోకి తీసుకున్నాడు. సిద్ధార్థుడిలా నిమిరాడు. పైకి యెగరేసాడు. పిట్ట గాల్లో తేలి అలసిన రెక్కల్ని అల్లాడించింది. వాలడానికి కొమ్మ లేక.. తిరిగి తిరిగి తిరగలేక.. యెంతో సేపు గాల్లో యెగురలేక.. నేల మీద వాలింది! కాదు, రాలింది! పిట్టలన్నీ ఆకులు రాలినట్టు రాలుతున్నాయి!
జలదేవత జల జల కరిగి కన్నీరయింది! అడవి అదృశ్యమవడం తడికళ్ళతో చూసింది! ʹచెట్లేవి..? యెటు పోయాయి?ʹ అని అడిగింది!
అతడు చెప్పాడు.ʹహరిత హారంʹ కోసం.. ʹనీరు చెట్టుʹ కోసం.. చెట్లన్నీ కొట్టేసారు.. మొక్కలు నాటుతున్నారు..ʹ అన్నాడు!
ʹచెట్లు కొట్టేయడమెందుకు? మొక్కలు నాటడమెందుకు..?ʹ జలదేవత వెర్రిగా చూసింది!
ʹచెట్లు వుంటేనే వానలు. వానలు వుంటేనే పంటలు. పంటలు వుంటేనే పాడీ పిల్లా జెల్లా సల్లంగా వుండేది. ఆ అవసరం చెప్పడానికి జెండాలూ బేనర్లూ పేపర్లూ కరపత్రాలూ కటౌట్లూ కావాలి గదా?ʹ అడిగాడు అతడు. జలదేవత తలాడించింది. ʹఅవన్నీ యెక్కన్నుంచి వస్తాయి? కలప నుంచే కదా?ʹ అడిగాడు. జలదేవత మళ్ళీ తలాడించింది!
నిశ్శబ్దం..!
ʹఅడవి అంతర్ధానమైనప్పుడు యింకా గొడ్డలి వుంటుందా? గొడ్డలే లేనప్పుడు యింక నీ కథ వుంటుందా? పిల్లలు వింటారా?ʹ అతడు నవ్వాడు!
జంటపిట్టలు యేడుస్తూ నేల రాలాయి!
ʹఅడవి సల్లంగుంటే అన్నానికి కొదువే లేదు.. పంటలింటికొస్తే పండగ చేస్తాము.. రేలా రేలా రేలారే..ʹ పాట గుర్తు చేసుకుంది జలదేవత!
ʹనీకింకా ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి తెలిసినట్టు లేదు! అడవే మనది! అడవిలోని సంపద మీద మనకి హక్కు లేదు! అది వేరేవాళ్ళకి గుత్తకు యిచ్చేసినారు! గనులు ఘనులవి! మనవి కాదని మనవి!ʹ విసుగ్గా అన్నాడతడు!
ʹఅడిగేవాళ్ళు లేరా..?ʹ జలదేవత అడిగింది!
ʹఎందుకు లేరు? ఆండా సెల్లో వున్నారు..!ʹ అన్నాడతడు యేదో గుర్తుచేసుకుంటూ!
పిట్టలు గుంపుగా నేల రాలాయి!
ʹపద.. అడవి వదిలేసి యెక్కడైనా మనం మొక్కలు నాటుదాం..!ʹ అంది జలదేవత!
ʹఎక్కడ నాటుతావ్ తల్లీ? నేలేది?ʹ అసహనంగా అన్నాడతడు!
ʹఇదంతా నేల కాదా?ʹ అయోమయంగా చూసింది జలదేవత!
ʹకాదు, మనది కానే కాదు, రాజధానులకి.. సచివాలయాలకి.. విదేశీ కంపెనీలకి.. ఎయిర్ పోర్టులకి.. పారిశ్రామిక వేత్తలకి వేల యెకరాలు యిచ్చేస్తే యింక నేలెక్కడిది?ʹ అతడు రాలిన పిట్టల్ని యేరి దువ్వుతున్నాడు!
ʹక్కొంచెం కూడా లేదా?ʹ అచ్చం అయిదూళ్ళు అడిగిన పాండవులకు మల్లె అడిగింది జలదేవత!
ʹలేకే స్టార్ హోటళ్ళకి అయిదు వందల యెకరాలు అర్జెంటుగా చూడమని అధికారుల్ని ఆదేశించారు బాబుగారు..ʹ అతడు దువ్వుతుండగానే పిట్టలు కొన్ని మోరలెత్తి కదిపి ప్రాణాలు వదులుతున్నాయి!
జలదేవత జావగారిపోయి బేలగా చూస్తోంది!
ʹఏంటలా చూస్తావ్? చేతిలో గొడ్డలివుంటే మనం యెర్ర చందనం స్మగ్లర్సం అన్చెప్పి స్పాటులో యెన్కౌంటరు చేసేస్తారు.. ఆ గొడ్డళ్ళు పారేయ్ తల్లీ..ʹ అతడు హెచ్చరికగా చూశాడు!
జలదేవత యెవరన్నా యెత్తుకుపోతారన్నట్టు మరింత జాగ్రత్తగా గొడ్డళ్లను గుండెకు అదిమి పట్టుకుంది!
గుంపులు గుంపులుగా పిట్టలు నేల రాలాయి! అవి యెగరడానికి రెక్కలున్నా వాలేందుకు చెట్లు లేక నేలమీద బంగరడం మొదలుపెట్టాయి! రెక్కలు వుండడమే అవరోధంగా భారంగా వున్నాయి! దాంతో నడవలేకున్నాయి! అతడు అంతా గమనించాడు!
జలదేవతను గొడ్డలి యిమ్మని అడిగాడు! యే గొడ్డలి అన్నట్టు చూసింది జలదేవత!
ʹపల్లూడగొట్టుకోడానికి యే రాయి అయితేనేం?ʹ అని అన్నాడు! జలదేవత బంగారు గొడ్డలి అందించింది!
ఒక్కో పిట్టని పట్టి దాన్ని రెండు రెక్కల్నీ గొడ్డలితో నరుకుతున్నాడు! చూడలేక జలదేవత కళ్ళు మూసుకుంది! ఆసక్తిని ఆపుకోలేక తెరచుకొని చూసింది!
అన్నీ రెక్కలు లేని పిట్టలే!
జలదేవత కొయ్యబారిపోయి చూస్తోంది!
పిట్టలు యిప్పుడు యెగరడం లేదు! నడక నేర్చుకున్నాయి! నేల మీద అన్ని జంతువుల్లానే నడుస్తున్నాయి! వాటికి రెక్కలు తెగినాక బాగా బేలన్సు చేసుకోవడం వచ్చింది!
అతడు పిట్టలకు రెక్కలు తెగ్గోసి కడకు తన మెడ తెగ్గోసుకున్నాడు!
జలదేవత స్థాణువై రాయిలా మారిపోయింది!
ఆప్రాంతాన్నినడిచేపిట్టల పర్యాటక స్థలంగా ప్రభుత్వం ప్రకటించి అభివృద్ధి చేసింది!!
Type in English and Press Space to Convert in Telugu |
ప్లీజ్.. ʹనోట్ʹ దిస్ స్టోరీ!ʹమేం దొంగలం కాదు..ʹ అని నిరూపించుకోవడానికి మా దగ్గరున్న ʹఆధార్ʹలన్నీ చూపించాం. గుడ్డా గోచీ విప్పి మొలతాడు తెంపి దిసమొలలతో నిల్చున్నాం. మా పుట్టుమచ్చలు సయితం... |
ఆల్ హేపీస్!కొత్తగా యేర్పడిన రాష్ట్రం మాది. రెండేళ్ళే అయితాంది. అగ్గువచేసి అలుకగా చేసి చూడొద్దు తమ్మీ.. క్రిమినల్ మంత్రులను మేము ఎంకరేజు గట్లా చేస్తున్నం. అన్ని ....... |
గణిత గుణింతము!ʹపవర్లో వుండి సంపాదించుకోకపోతే సంపాదించుకోవడం రాని యెధవ అని అనేస్తారు. చేతకాని దద్దమ్మ.. చవట అని కూడా అనేస్తారు. నాకు మాట పడడం అస్సలు యిష్టం లేదు. సరే, ఈ ల్... |
సమాన స్వాతంత్ర్యం!అన్నిప్రాంతాలకీ సమాన ప్రాతినిధ్యం యివ్వడమంటే స్వాతంత్ర దినాలు జరపడం కాదు, పోలీసు మిలటరీ కవాతులు జరపడం కాదు, తుపాకీలు తిప్పడం కాదు, బూట్ల కాళ్ళని నేలకు తన్నడ... |
పడగ కింద పండు వెన్నెల!చెదిరిన చీమలు పాముల్ని కరవబోయాయి! అంతే... ఫిరంగులు పేలాయి! మట్టి రేగింది! మూడురంగులుగా ముచ్చటగా!
రాజు యెగరేసిన పావురం కత్తిరించిన రెక్కలతో యెగరలేక ఫల్టీకొట్... |
నిలబడిన జాతి గీతం!పౌరుల్లో దేశభక్తి యింకా ప్రబలాలి! ప్రబలిపోవాలి! నార నరాన నాటుకు పోవాలి! అసలు పుట్టగానే వేసే టీకాతో కూడా మన దేశభక్తిని చాటుకోవచ్చు! టీకాగా అశోకచక్రం కలిగిన మ... |
కాశ్మీరు మనది!ʹమేం కాశ్మీరుని చూడలేదు, కాశ్మీరు గురించి మాకు తెలీదు...ʹ చెప్పబోతే- ప్రధాన వుపాధ్యాయులవారు కల్పించుకొని ʹమీరు కాశ్మీరుని చూడకపోయినా పర్లేదు, కాశ్మీరు గురిం... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |