ప్రజా వైద్యులు ( నాటకం)

| సాహిత్యం | క‌థ‌లు

ప్రజా వైద్యులు ( నాటకం)

- ఉద‌య‌మిత్ర‌ | 18.08.2017 10:24:20am


పాత్రలు

1.Dr.కునాల్-పట్టణడాక్టర్
2.ఇడిమే-దండకారణ్యడాక్టర్
3.సీతు-ఆదివాసీ
4.సోనాల్- ఆదివాసీ
5.రైను- ఆదివాసీ
6.డాక్టర్ సాబ్- అంతర్ అంకంలోని డాక్టర్..
7.నర్సు- అంతర్ అంకంలోని నర్సు
8.కారూ- ఆదివాసీ
9.రుక్మతి- ఆదివాసీ స్త్రీ
10.రణదేర్- ఆదివాసీ

మొదటి అంకం: Dr కునాల్ గారు ఆదివాసిలకు వైద్యం చేయడానికి అడవిలోకి ప్రవేశిస్తారు.అక్కడ పని చేసే వైద్యురాలు(ఇడిమే) ప్రావిన్యత చూసి ముచ్చటపడ్తాడు.
రెండవ అంకం: నిర్బంధం మీద చర్చ
మూడవ అంకం:కునాల్ ఇడిమే జీవిత చరిత్రలు
అంతర్ అంకం: పట్టణంలోని నాగరికపు డాక్టర్ పేషెంట్ పట్ల గల నిర్లక్ష్యపు దోరణి
నాల్గవ అంకం:అడవిలో ఆదివాసీ పేషెంట్ల మీద చర్చ
ఐదవ అంకం: ఆదివాసీలు అశక్తులు వికలాంగులు ఐన తర్వాత జనతన సర్కార్ ఇచ్చే భరోసా.
ఆరవ అంకం: టెంటులో గాయ పడ్డ ఆదివాసిలతో కునాల్ చర్చ
ఏడో అంకం: ఆత్మీయ వీడుకోలు

పాట
ʹఅదిగదిగో నవ లోకమూ....మన కలల సాకారంʹ
ʹఅదిగదిగోʹ
అడివంటే అమ్మ ఒడి –అడివంటే చేనుమడి
కాదుకాదు కారడవి –విప్లవాల నిలయమది
ʹఅదిగదిగోʹ
ఇది నిత్యం నూతనం-పయనిoచే రుజుమార్గం
సమ న్యాయం ,సమధర్మం-మనకిచ్చే వాగ్దానం
ʹఅదిగదిగోʹ
సెలయేటి నీటి కన్నా-స్వచ్చ మైన మనసురా
ఎగిరేటి పక్షి కన్నా-స్వేఛ్చ ఉన్న భూమి రా
ʹఅదిగదిగోʹ
అడవి సంపదల దోచే-కంపేనీలకు ఎదురు నిల్చి
కూడగట్టి నడుo గట్టి-పడిలేచిన భూమిరా
ʹఅదిగదిగోʹ
ఆదివాసీ చేయి బట్టి –అక్షరాలు దిద్దించెను
అడివి తల్లి ఆయుధమై పోరు బాట రగిలించెను
ʹఅదిగదిగోʹ
ఆదివాసీ కన్నమది –అణువణువు ప్రేమనది
తిరగబడ్డ చరితలకు-చెరగని చిరునామా అది
ʹఅదిగదిగోʹ
రక్తాల చరితంత-గతములోన కలసిపోవు
మన కళ్ళు,మన ఇళ్ళు-కాంతులతో నిండిపోవు
ʹఅదిగదిగోʹ
ఒకరికోసం అందరం-అందరికై ఒక్కరమూ
ఏదిగులులేనట్టి-చరితలోకి పయనిద్దాం.(3)

మొదటి అంకం
(కునాల్ డాక్టర్ అడివిలోకి ప్రవేశిస్తాడు)
(స్వగతం)
ముక్కు మోహము ఈ యువకుని వెనకాల ఈ చిమ్మ చీకట్ల కళ్ళు పొడుచుకుంటూ నడవడమేంది?అసలు నేనెందుకు ఒప్పుకున్నాను?ఈ దినేష్ గాడు ఒకడు నా పాణానికి తలిగిండు...ఐన వాడు చెప్తే మాత్రం నా బుద్ధి ఏ గాడిదల కాసింది.అందరు డాక్టర్ల లాగా సుఖoగా బతకకుండా నాకెందుకు ఈ తిప్పలంతా....హు...

సితూ,సోనూ ఒచ్చి కునాల్ డాక్టర్ ను రిసీవ్ చేసుకుంటారు.
(అడవిలో గుడిసేలోపట పేషెంట్ పడుకొని ఉంటాడు.కళ్ళకు పట్టిలు కట్టి ఉన్నాయి.కునాల్ పేషెంట్ ని పరిశీలిస్తాడు.)
కునాల్: నీ పేరెందయ్య?
పేషెంట్: రైను సర్
కునాల్: నీ పేరెందమ్మ?
యువతి: సోనూ సర్
కునాల్: నీ పేరు?
యువకుడు: సీతు సర్

(ఓ కొత్త వ్యక్తి హడావిడిగా లోపలికి వస్తుంది)
కునాల్: మీరెవరు?

కొత్త వ్యక్తి: సర్ నా పేరు ఇడిమే..నేనిక్కడ డాక్టర్ ని.
కునాల్: ఓ మీరేనా డాక్టర్. గ్లాడ్ టూ మీట్ యు.చెప్పండి ఇక్కడి పరిస్తితి
ఇడిమే: వారం రోజుల కిందట కంపెనీ గూoడాలు పోలీసులు కలసి గూడెల మీద దాడులు చేసారు సర్. మా ఆదివాసులని అడవుల కెళ్ళి పంపనీకే చూస్తున్నారు.
కునాల్: అయ్యో అట్లన....

ఇడిమే: అది అంతే సర్. మా ఆదివాసీలు తిరగబడ్డారు. ఆ దాడిల ఈ రైనుకు ఎడమ కంటికి గాయమైంది. రెండో కంటిల కూడా రజను(చూరు) పడ్డది. దాంతో రెండు కండ్లు కనిపించడం లేదని పక్క వాళ్ళకి చెప్పారు

కునాల్: ఓ..దగ్గర్లో ఎవరైనా డాక్టర్ ఉన్నడా?
ఇడిమే: అవును సర్ వెంటనే దగ్గరల ఉన్న మా డాక్టర్ టీం ఒచ్చేసింది. మేము గాయాలని తుడిచి శుభ్రం చేసి పట్టీలు వేసాము. ఇప్పటికి రెండు కండ్లు కనిపించటం లేదు సర్. ఆంటిబయాటిక్స్ వాడుతున్నాం.

కునాల్: అయ్యో..పేషెంట్ ని బయటికి తీసుకపోయి...కంటి డాక్టర్ కి చూపించే ప్రయత్నo చేయలేదా?

సితూ: తిసుకపోవాలనే అనుకున్నాం సర్..కానీ దాడిల మా వాళ్ళు గాయపడ్డరనేది వాళ్ళకి అర్తం ఐంది. ఇక అంతట నిఘా పెట్టిన్రు.

సోని: మందుల దుకాణంల దగ్గిర కూడా నిఘా పెట్టిండ్రు సర్.ఒక మనిషి కి ఏ డాక్టర్ ఐన నెల రోజులు రాసిన పదిహేను రోజులకే మందులిచ్చి మల్ల రమ్మంటున్నారు.
కునాల్: ఆశర్యంగా ఉందే. నిజంగానే ప్రభుత్వం ఇంత పని చేస్తుందా? చేసిన ఆశ్చర్యపోయేదేమీ లేదు...రొజూ పేపర్లలో వచ్చే గ్రీన్ హంట్ కథనాలు చూస్తుంటే ,నిజమేననిపిస్తున్నది. కాని ఇంత వెనక బడిన ప్రాంతాన ఈ అడివిల ఇలా చేయడం మాములు ఆదివాసీ కి కనీస వైద్యం అందక పోతే ఎంత ప్రాణగండం...ప్చ్...ప్చ్...ప్చ్..
ఇడిమే: సార్...ప్రస్తుతానికి రోజు డ్రెస్సింగ్ చేస్తూ క్లీన్ చేస్తున్నాం.
కునాల్: మీరు చాల మంచి పని చేశరమ్మ. వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్క కన్నైన
పోయిఉండేది. ఇంజెక్షన్లు ఏమైనా ఇస్తున్నార?

ఇడిమే: సెలైన్ పెట్టినప్పుడు IV లో ఈ ఇంజెక్షన్లులు కలిపాo. ఈ ఇంజెక్షన్లులు వేరేగా ఇస్తున్నాం.
కునాల్: గుడ్..మీ అడివి డాక్టర్లు ఏమి తక్కువ లేరే. సరిగ్గా చెప్పాలంటే మా కంటే చాల ముందు ఉన్నారు సుమా..(ఇడిమే...తుంటికి జాగ్రత్తగా ఇంజెక్షన్లు ఇస్తుంది)

కునాల్: వీళ్ళు చాల నయం. ఇంజెక్షన్లు సైతం చక్కగా ఇస్తున్నారు. మా దగ్గర అయితే కొంత మంది RMP, MBBS డాక్టర్లకి సరిగ్గా ఇంజెక్షన్లు ఇచ్చుడే రాదు. ఇంజెక్షన్లు ఇస్తుంటే రక్తం కారుతది..తుడుచుకోమని నిర్లక్ష్యoగా చెప్పేస్తారు. చేయి వాస్తే ఇంటి దగ్గర కాపుకొమ్మని సెలవిస్తారు. ఇంజెక్షన్లు రియాక్షన్ అయి ఎందరి ప్రాణాలు పోయాయో. కొందరి డాక్టర్ల నిర్లక్ష్యం చూస్తే తన్నాలనిపిస్తాది. అది సరే ఈ రైను ముఖం లో కొంచమైన టెన్షన్ లేదేంది. ఈ ఆదివాసిలకి ఇంత గుండె నిబ్బరం ఎక్కడిదో. అది సరే రేపు ఉదయం రైను కి ఆపరేషన్ చేద్దాం.
ఇడిమే: ఓకే సర్..ఇంతకు మీరు ఏమి తినలేదు.సితూ...సర్ ని బోజనానికి తిసుకపొండి.

రెండవ అంకం
(రైను ఇడిమే తప్ప అందరు బయటికి వస్తారు.అందరు బోజనాలు చేసి మాట్లాడుకుంటారు.)
కునాల్: ఇంతకు పేషెంట్ల కి ఏమేమి తిండి పెడ్తున్నారు.
సితూ: రోజు మేం తినేదే పెడుతున్నాం సర్. అన్నం పప్పు తో పాటు ఇంత జావ ఇస్తున్నాం. వీలైన కాడ గుడ్లు తెప్పిస్తున్నాం.

కునాల్: (నవ్వుతూ....) అవును గ్రీన్ హంట్ ప్రబావం గుడ్ల మీద లేదా..
సితూ: ఎందుకు లేద్ సర్..అన్నింటి మీద ఉంది. ఐన మా మార్గాలన్నీ ముసేయ్యడం వాళ్ళ తరం కాదు. సల్వాజుడుo సందర్భంగా సంతల్ని మూసేసారు. గ్రీన్ హంట్ లో కూడా అదే జరిగింది. కాని జనం ప్రతిఘటించడం తో తెరువక తప్పలేదు.

కునాల్: ప్రతిఘటన అంటున్నారు. అంటే ఎట్లా చేస్తారు?
సోనూ: అంటే దర్నాలు ఊరేగింపులు చేస్తారు సంతలు తెరవాలి అని
కునాల్: ఆహా...వెరీ గుడ్

సోని: అయితే సంతలు తెరువడానికి వాళ్ళకి ఇంకో కారణం ఉంది సర్. వాళ్ళకి సమాచారం కావాలి కదా..(ఆమె నిలబడి తింటూ మాట్లాడుతుoది.)

కునాల్: అసలు ప్రభుత్వానికి మి సప్ప్లైలన్ని తెన్చేయడం సాధ్యమేనా?
సితూ: సాద్యం కాదు కాని...వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఫోర్ కట్ పాలసీ తో మా ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తారు.
కునాల్: ఫోర్ కట్ పాలసీ అంటే?

సితూ: అదే సర్...నాలుగింటిని తెంచేయడం. మనకు అందకుండా చేయడం. అవి ప్రజా సైన్యం లోకి రిక్రూట్ చేసుకోవడం..తర్వాత డబ్బులు సమాచారం సప్ప్లైలు తెoచేయడం లాంటివి చేస్తారు.
సోని: (నవ్వుతూ... ) సప్ప్ప్లైలంటే మందులు కూడా సర్..అవి కూడా మాకు అందకుoడ చేస్తారు. ఒకరకంగా చెప్పానంటే నీళ్ళని తోడి...చేపలు పట్టే ప్రయత్నం అన్న మాట..
సితూ: (మందులు చూయిస్తూ)...అందుకనే మా పేషెంట్ లు కోలుకునేది ఈ స్పిరిట్ తో కాదు ..ఈ స్పిరిట్ తో(గుండె వైపు చూపిస్తాడు)

కునాల్: (స్వగతం)..ఇంతకు గుండె బలం గాయాలని మాన్పుతుందా....ఏమో...వీళ్ళయితే చాల విశ్వాసం తో కనబడుతున్నారు....హా..మరిచిపోయిన ఇంటి దగ్గర సునీత పిల్లలు ఎట్లున్నారో.

మూడవ అంకం
(కునాల్ , ఇడిమే ఆపరేషన్ కి పూనుకుంటారు)
కునాల్: ఇగోమ్మ జాగ్రత్తగా చూడు..ఇట్లా ఆపరేషన్ చేయాలి..(కాగితం మీద బొమ్మ వేసి చూపిస్తారు. ఆమె కాగితం చూసి జేబులో పెట్టుకుంటుంది.ఇద్దరు కలసి ఆపరేషన్ చేస్తారు.)
ఏమ్మా...నీ వేళ్ళలో ఎదో మేజిక్ ఉన్నట్టుందే...చాల బాగా చేస్తున్నావ్.
ఇడిమే:నేను ఇంకా చాల నేర్చుకోవాలి సర్.. (సంకోచంగా) డాక్టర్ దాదా మిమ్మల్ని ఒకటి అడగాలి..
కునాల్: ఊ...అడగమ్మా..
ఇడిమే: దాదా.. మీ గురించి మాకు చెప్పరా?

కునాల్: నా గురించి ఎముందమ్మ..నేను అందరిలాంటి డాక్టర్నే ..కాకపోతే గవెర్నమెంట్ డాక్టర్గా చేరాలనుకున్న. అది ఐంది..అయితే ఉచిత వైద్యం చేయడానికి రామ్ గడ్ పోయి వస్తుంట...
ఇడిమే: సొంతూరంటే అంత ఇష్టమా సర్...

కునాల్: ఔను...ఒక్క మా అమ్మ చనిపోయినప్పుడు ఇప్పుడు తప్ప ఎప్పుడు మిస్సయింది లేదు..నా హృదయం లో దానికేదో దైవం లాంటి స్తానం ఉంది..అది సరేగాని..ముందు నీ గురించి చెప్పు మీలాంటి డాక్టర్లను చూస్తుంటే ముచ్చటేస్తది..నువ్వు ఈ ఉద్యమంలోకి ఎట్లవచ్చావో...ముందు చెప్పు..

(చిరునవ్వు నవ్వి సమాదానం చెప్పదు...కొద్ది సేపు మౌనం)
కునాల్: (మళ్ళి) అరే...అలా మౌనంగా ఉండిపోయినవెంది....మీ అడవి డాక్టర్లు ఎట్లా తయారుఅవుతారో చెప్పవెందిమరి?

ఇడిమే: (చిన్నగా నవ్వుతూ) ఇంటి దగ్గర ఉన్నపుడు 8 వ తరగతి చదువుకున్న. ఆ తర్వాత 2౦౦౩ ల ఆదివాసీ ఉద్యమం ల జేరిన....అప్పట్నుంచి డాక్టర్గా, టీచర్ గా, పనికిపెట్టారు. రెండు సంవత్సరాల తర్వాత ఒక డాక్టర్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చిండు. అప్పుడు మా ప్రాంతం లో నన్నుకూడా పంపారు. అప్పట్నుండి నన్ను డాక్టర్ టీం లో పెట్టారు.ఐదేండ్లు గా డాక్టర్ టీం లో పని చేస్తున్న.
కునాల్: మల్ల ఎప్పుడైనా ట్రైనింగ్ అయినవా?

ఇడిమే: ఆ...2009 లో ఒక డాక్టర్ వచ్చిండు. కొన్ని నెలలు ఉన్నాడు. ఆయన తోనే ఉన్న.మొత్తం 20 రోజులు క్యాంప్ ల ట్రైనింగ్ ఇచ్చిoడు. మిగితా సమయాల్లో ఆయనతోనే తిరిగినం.
కునాల్: మీ టీం ఎట్లా పనిచేస్తది....గ్రామాలలో తిరుగుతూ వైద్యం చేస్తారా?

ఇడిమే: అవును...గ్రామాల్లోను క్యాంపుల్లోనూ పని చేస్తాం.పోలీసులు మా మీదకు దాడికి వచ్చినప్పుడు చేసే ప్రతిఘటనలోను మేము అక్కడ డాక్టర్లగా పని చేస్తూ ఉంటాం.
కునాల్: రైను గాయపడినపుడు దాడిలో నువ్వు కూడా అక్కడ ఉన్నట్టున్నావ్ కదా..
ఇడిమే: ఆ...అవును దాదా..అప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసింది నేనే. తర్వాత రైను ను మోసింది కూడా నేనే. ఇదొక్కటే కాదు దాడుల్లో గాయాలవుతుoటే నేనే ఎన్నో సార్లు దెబ్బలు తగిలిన వాళ్ళను మోసుకువచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటాను.

(అంతర అంకం)
(డాక్టర్ సాబ్ ఎవరితోనో మాట్లాడుతుoటాడు)
నర్స్: సార్...సార్....ఎవరో పల్లెటూరినుండి ఆక్సిడెంట్ పేషెంట్ ని తెచ్చింది.
డాక్టర్: (నిర్లక్షంగా)..ఊ...డిపాజిట్ కట్టించుకొని ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్పించు.(నర్స్ వెళ్ళిపోతుంది)
నర్స్: ( పరిగేత్తుకుంటూ వచ్చి ) సార్..పేషెంట్ కండిషన్ బాగా లేదు సార్..రక్తం బాగ పోతున్నది.
డాక్టర్: (అంతే నిర్లక్షంగా)..అయితే ఎం చెయ్యమంటావ్ ముందు ఫీజు కట్టమను.పైసల్లేవ్ గీసల్లేవ్ అంటే అది ఇది అని నసిగితే బయటికి పంపించండి(ఆమె వెళ్ళిపోతుంది)
నర్స్: (మల్ల పరిగెత్తుకొచ్చి) సార్..సార్.పేషెంట్ కి మాటలు కూడా వస్తలేవు..
డాక్టర్: పిచ్చి పట్టిందా నీకు..పొమ్మ పో...ముందు ఈ టెస్ట్ లన్ని చేయమనండి..తర్వాత వచ్చి చూస్తాను.ఇంతకు డబ్బులు కట్టిండా లేదా?
నర్స్: ఇంకా కట్టలేదు..కొంచం తక్కువ పడ్డయంట..
డాక్టర్:పో...ఇది దర్మశాల కాదని చెప్పు..బయటికి పంపించండి...ఎదవసంత
నర్స్:(స్వగతం) పేషెంట్ చచ్చెటట్టున్నాడు. ఈ డాక్టర్ గాడు చస్తే పీడా పోయేది.

(తనలో తనే నవ్వుకుoటాడు కునాల్)
ఇడిమే:ఏం సార్? మీలో మీరే నవ్వుకుంటున్నారు?
కునాల్:ఏం లేదు..మా దగ్గర డాక్టర్లు గుర్తుకొచ్చి నవ్వుకుంటున్న..

నాల్గవ అంకం
కునాల్: ఇడిమే...అడుగు నీకు వైద్య విషయాల్లో ఎమన్నా అడగాలనుకుంటే అడుగు(ఇడిమే ఒక విద్యార్ధిలాగ నోట్ బుక్ పట్టుకొని డాక్టర్ చెప్పే వాన్ని శ్రద్దగా రాసుకుంటుంది)
కునాల్:ఇడిమే...ఇప్పటిదాంక నువ్వు చేసిన వైద్యం లో నీకు బాగ తృప్తి నిచ్చిన పేషెంట్ ఎవరు.
ఇడిమే: నాకు ఏ పేషెంట్ కి వైద్యం చేసిన మంచిగనే అనిపిస్తది సార్.
కునాల్: అది కాదు కాని చావు దగ్గరికి వెళ్లినవాల్లని ఎందరిని బతికించివుంటావు.

ఇడిమే: అట్లా చేసింది ఏమి లేదు దాదా..ఒకసారి పోలీసులు చేసిన దాడిల మా నాయకుడే గాయపడ్డాడు. అతడిని మోసుకు వచ్చినం. రెండు రోజులు బాగానే మాట్లాడిండు.కానీ మూడవ రోజు అమరుడయ్యిండు. అట్లాంటప్పుడు మాకింకా మంచి ట్రైనింగ్ ఉంటె బాగుండుననిపించింది.
కునాల్: చూస్తే తక్కువ మాట్లాడే దానిల కనిపిస్తున్నావ్. ఇప్పుడు ఎంత ధారాళంగా మాట్లాడుతున్నావో.

ఇడిమే: అంతే కాదు దాదా..మా మీద హఠాత్తుగా దాడి జరిగినప్పుడు ఎక్కువ ఇబ్బంది ఐతది.అడివి డాక్టర్లం పెరిగినం కానీ అంతట లేము.అట్లే రక్త స్రావాన్ని అదుపు చేసే మందులు ఇతర ముఖ్యమైన మందులు మా వెంట ఉండడం లేదు.గాయపడ్డవాల్లని చనిపోయినవాల్లని డాక్టర్లు తప్పకుండ తీసుకు రావాలన్నది మా రూలు.చాల సార్లు బ్లీడింగ్ ఎక్కువై చనిపోతువుంటారు ఎం చేయన్నో తోచడం లేదు.

కునాల్: (ఇడిమే చేయి పట్టుకొని) నిజమేనమ్మ మీరు అడవిలో చేస్తున్న వైద్యం చూస్తుంటే మా డాక్టర్లు దేనికి పనికి రారని పిస్తుంది. డబ్బులు గుంజుడు తప్ప పేషెంట్ గురించి ద్యాస నె ఉండదు.సరే...నువ్వు కానియ్యి.

ఇడిమే: గ్రామాల్లో వైద్యానికి మేము సరిపోవడంలేదు దాదా.వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాం.కాని ఇక్కడున్న పరిస్తితులకు ఎంత మంది ఉన్న తక్కువే.మేం ఒక వైపు వైద్యం చేస్తుంటే,మరో వైపు గ్రామంలో ఎంతో మంది రోగాలతో చచ్చిపోతుంటారు దాదా.
కునాల్: మరి ఆదివాసీ స్త్రీల పరిస్తితి..
ఇడిమే: హు...(నిట్టూర్చి) వాల్లదైతే మరీ ఘోరం మాటలకందదు.అసలే వాళ్ళకి రక్తం తక్కువ. 5 లేదా 6 గ్రాములు ఉంటాయి.ప్రసవ సమయంలో నరకమే.నిర్బంద స్తితిలో వైద్యమందకపోతే చావే దిక్కు.ఒక్కోసారి ʹడోలిʹ కట్టుకు కొండలు వాగులు దాటి ప్రసవానికి తీసుకుపోవాలి.
కునాల్: చాల కష్టమే.

ఇడిమే: అవును దాదా..ఇప్పటిదాoక గ్రామాలలో చుసిన దాంట్ల ఎక్కువ మంది స్త్రీలు చనిపోతున్నది లేదా రోగాల పాలవుతున్నది ప్రసవం తోనో లేదా దాని సంబందమైన రోగాలతోనో
కునాల్: అయ్యో...ఈ విషయంలో మీరు ఏమి చేయడం లేదా
ఇడిమే: చేస్తున్నది తక్కువే దాదా తెల్సిన కాడికి చేస్తున్నాం.మాకు రెండు విషయాలల్ల ట్రైనింగ్ కావాలి.ఒకటి డెలివరీ.రెండోవాడి సర్జరీ. ఈ రెండు ఎవరైన వచ్చి నేర్పాల్సిందే.
చాల అవసరం మాకు.

(డాక్టర్ ఆమె నోట్బుక్ తీసుకోని తిరిగేయడం మొదలుపెట్టాడు)
ఇడిమే: దాదా..మీరు అడిగినారు కదా తృప్తి ఇచ్చిన విషయం గురించి చెప్పమని
కునాల్: అవునవును..అడిగిన కానీ చెప్పలేదు కదా
ఇడిమే: ఇప్పుడు చెప్తా..ఒకసారి పోలీసులు గ్రామాలకు దాడికి ఒచ్చినప్పుడు మా ఆదివాసీలు తిరగబడ్డారు.కొందరు పోలీసులు పారిపోతే కొందరు దొరికిన్రు. వారికీ మేమే ఫస్ట్ ఎయిడ్ చేసినాము.
కునాల్: ఏందీ..మీ మీద దాడికి వచ్చినోల్లకి మీరు సేవలు చేసిన్రా?
ఇడిమే: అవును దాదా..వాళ్ళు పేదలే మేము పేదలమే కదా
కునాల్: ఓహో..
ఇడిమే: మేం ఫస్ట్ ఎయిడ్ చేసి బిస్కట్ లు కూడా ఇచ్చినం .ఒక పోలీసు అయితే ʹదీదీ దీదీ నన్ను కాపాడావ్ʹఅంటూ ఒకటే నమస్తే చేసాడు.ఏడ్చాడు..కొంతసేపు రాజకీయాలు చెప్పి ఓదిలిపెట్టినం.నాకు చాల రోజులు దాంక అతను ʹదీదీ దీదీʹఅనడమే గుర్తుకొచ్చింది.వాళ్ళు మారుతామన్నంక వాళ్ళకి వైద్యం చేయడం మంచిదనిపించింది.
(డాక్టర్ గారు తన రుమాలుతో కళ్ళు తుడుచుకుంటాడు)
ఇడిమే: దాదా..అదే మావాళ్ళు గాయపడి పోలీసులకి చిక్కితే...హు...నరకం నాలుగు రెట్లు చూపిస్తారు. క్రూరంగ చిత్రహింసలు పెట్టి చంపి ఎన్కౌంటర్ గా చూపిస్తారు.
కునాల్: అవునవును నేనలాంటి వారిని పోస్టుమార్టం చేసినప్పుడు టార్చర్ చేసిన గుర్తులు కనిపించేవి.ఇంకొకటి చెప్పాలి. మీ ప్రతిఘటనలో గాయపడ్డ పోలీసులకి కూడా నేను చికిత్స చేసిన.
ఇడిమే: మీకేమనిపిస్తుంది దాదా

కునాల్: కనీసం మికైతే మీరు యుద్ధం చేస్తున్నారనే స్పృహ ఉంది ఆత్మ బలం ఉంది.మీరు చావుని కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు.కాని తమది కాని యుద్దంల బలవుతున్న ఆ జవాన్ల నిస్సహాయపు మొఖాల్ని చూస్తే మనసంత భారం ఐతది.

ఆదివాసిల మీద పాట
కొండలకి లేని బలం –గుండెలకి ఎక్కడిది
ఆదివాసీ అంతరంగ మర్మమేమిటి-తెలియని శక్తి ఏమిటి(2)

లేవు నిలువు బంగళాలు-ఉన్నదింత బొడ్డు గుడిసె
బొడ్డుపేగు కోసిన తల్లి-ఏ వెలుగులు చూపినదో...... ʹకొండలకుʹ
చెట్టులెక్కి తేనే తీసి-మనసుకు తాపినదో ఏమో
తేట మాటల తియ్యని పాటలవుతారు-థింసా ఆటలవుతారు..... ʹకొండలకుʹ
గుట్టలు ఎదురెక్కి ఎక్కి-అందని శిఖరాలకెదిగి
ఎడద విశాలతకి వారు-నెలవులైనారు జీవనపాఠమైనారు...ʹకొండలకుʹ
ఆదివాసీ సహనానికి-ఎదురులేని ధీశక్తికి
ఉద్యమమే దినచర్యలో భాగమైంది బతుకు దీపమైనది..... ʹకొండలకుʹ
రాంజీ గోండు వారసులు,కొమరoబీమ్ సాహసులు
గుండాధూర్ దారిలోన-యోదులైనారు సాహస ధీరులైనారు... ʹకొండలకుʹ

ఐదవ అంకం
(ఇడిమే రైను దగ్గర ఉండిపోతుంది. డాక్టర్,కారూ కలసి నడుస్తూ మాట్లాడుకుంటారు)
కునాల్: కారూ నీకేమైనా ఆరోగ్య సమస్యలున్నాయా...
కారూ:ఎం లేవ్ దాదా..అడివి కదా పోలియో ఒస్తది.బాగా నడిస్తే మాత్రం కాలు నొప్పి పెడుతది.
గాయమైంది కదా.
కునాల్: అయ్యో గాయమైంద చెప్పవేం మరీ
కారూ:( ఎడమ ప్యాంటు ఎత్తి గాయమైన చోట చూయించి ) 2008 ల మేము కంపెనీ గుండాలని పోలీసులని ఎదురించినప్పుడు ఒక బుల్లెట్ కాలి తగిలింది. ఎక్కువ సమస్య కాలేదు. నెల రోజులల్ల ఉద్యమంల చెరిపోయిన. నాలుగు గంటలు నడిస్తే అప్పుడప్పుడు నొప్పి పెడతది.
కునాల్: అవును గాని నీకు బయం కలగదా?అప్పుడనే కాదు మీకు అసలు బయమంటూ వేయదా?

కారూ: (నవ్వి)లడాయి కదా దాదా. బయపడితే లడాయి ఎట్లా చేస్తాం.
కునాల్: అవునయ్యా..లడాయే..మరి మొత్తంగా కూలబడితే ఎట్లా?
కారూ:అదంతా మా జనతన సర్కార్ చూసుకుంటది దాదా
కునాల్:అది సంగతన్న మాట.
కారూ: అది సరే అరగంట దూరoల మా పేషెంట్ ల డేరా ఉంది.మా వాళ్ళే వైద్యం చేస్తున్నారు.చూసి ఒద్దామా
కునాల్: ఓ..అరగంట దూరంల నా మరి చెప్పవెందయ్యా
కారూ:లేదు దాదా..మీకు ఇబ్బందవుతదేమోనని
కునాల్:నో నో ...పోదాం పదున్రి

ఆరో అంకం

(కునాల్ కారు టెంట్ ని చేరుకుంటారు.వాళ్ళంతా రేడియో వింటుంటారు)
కారూ: కామ్రేడ్స్...పట్నం కెళ్ళి పెద్ద డాక్టర్ వచ్చిండు
పేషెంట్స్: రామ్ రామ్ దాదా....రామ్ రామ్
కునాల్:రామ్ రామ్..ఏది మి అందర్నీ ఓసారి చూస్తా.

ఏదీ...నోరు తెరువు...ఏది...కళ్ళు చూద్దాం...ఏది చెయ్యి చూద్దాం
(నవ్వుతూ) ఏమైనా మీ ఆదివాసిల దైర్యమే గొప్పదయ్య.ఇన్ని గాయాలైన ఎవరి మొఖాలల్ల బాధ కనపడ్తలేదు.పైగా రేడియో లో చిదంబరం మాట విని నవ్వుకుంటున్నారు.మీ గుండె బలమే గాయాలను మాన్పుతున్నట్టుంది.ఇంతికి నీ పేరెందమ్మ

రుక్మతి: రుక్మతి దాదా..
కునాల్: రుక్మతి..నేనొకటి అడుగుతాను...ఇన్ని గాయాలతో ఇన్ని కష్టాలతో మీరు ఈ అడవిని కాపాడుకుంటాం అనే అనుకుంటున్నారా...మీరు గెలుస్తామనే అనుకుంటున్నారా..
రుక్మతి: తప్పక గెలుస్తాం దాదా...అసలు గెలుస్తాం అని అనుకోక పోతే యుద్ధం ఎట్లా చేస్తారు దాదా..(నవ్వుతుంది) ప్రజలు తప్పక గెలుస్తారు.మేం గాకపోతే మా తర్వాత తరం వాళ్ళు ఆ తర్వాతి వాళ్ళు .(పిడికిలి బిగిస్తూ)అంతిమంగా ప్రజలదే విజయం దాదా..
కునాల్: (నవ్వుతూ)మిమ్ముల్ని చూస్తుంటే నాకు అన్ని ప్రశ్నలే వస్తున్నాయి.
రుక్మతి: అయ్యో అడగండి దాదా..
కునాల్: మీకసలు నేను మూలన పడితే ఎట్లా అని అనిపించలేదా.ఎంత చిన్న వయసు మీ అందరిది. నీకెంత ఉంటాయి...20 ఎండ్లు ఉంటాయా
రుక్మతి: అప్పుడు నాకు చాతనైన పని నేను చేస్తా దాదా..ఉద్యమం ల గాయపడి పనిచేయని స్తితిలో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు.ఒకతను చచ్చి బతికినంత పని చేసిండు.అతనిప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు.
కునాల్: ఓహో...మరి తక్కిన వాళ్ళు?
రుక్మతి: కళ్ళు లేని మరో మిత్రుడు టీచర్ పని చేస్తున్నాడు.గాయాలపాలైన వాళ్ళకి మా ప్రజా ప్రభుత్వంల పని చేయడానికి చాల పనులున్నాయి.
కునాల్:మీ పని చాల బాగుందమ్మా మా దగ్గర వికలాంగుల పరిస్తితి కుక్కలు చింపిన విస్తరే.కాగితాలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగాలి.
రుక్మతి:అయ్యో..మరి ముసలోళ్ళ సంగతి.?
కునాల్: ఆల్లది మరీ ఘోరo..మంచిగుండoగానే ఆశ్రమాల దారి పట్టిస్తున్నారు.చేతకాని వాళ్ళ పట్ల వికలాంగుల పట్ల ప్రభుత్వం ఏమాత్రం బాద్యత వహిoచడం లేదు. మంచిగుoటేనే మనిషి చెడితే చెరువే.

రణదేర్: అదే దాదా ...ఇక్కడ అట్ల కాదు..మా కుటుంబం చాల పెద్దది వేలల్ల లక్షల్ల ఉంటది.మా ఉద్యమం అందరిని ఇముడ్చుకుంటది.అన్నింటిని సమకూర్చుకుంటది.
కునాల్: కానీ డాక్టర్ల కొరత ఉన్నట్టుంది కదా..
రణదేర్: అవును దాదా..మీరు చెప్పింది నిజమే .మా అడివి డాక్టర్లు మా ఉద్యమానికి సరిపోరన్నది మాకే బాగా తెల్సు ..కానీ.. దాని పరిష్కారం మాత్రం మీలాంటి వాళ్ళ చేతుల్లో ఉంది దాదా..

(వీడ్కోలు: కునాల్ అందరికి లాల్ సలాం చేస్తాడు)
కునాల్: ( రణదేర్ బుజం తట్టి) ఏమిటి మల్లి ఉద్యమం లోకేనా?
రణదేర్: అవును దాదా..ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా.
రుక్మతి: నేను కూడా అంతే డాక్టర్...
ఆదివాసీలు: ( అందరు) మేము కూడా అంతే దాదా..
ఇడిమే: సొనూ ఇక టైం అవుతుంది...బయలుదేరుదాం దాదా
కునాల్: సరే సరే

(సోనూ ,సితూ కునాల్ ని వెంబడిస్తారు)

ఏడవ అంకం
సితూ: దాదా..మీలాంటి డాక్టర్లు మాకు ఉంటె మా ఉద్యమం ఇంకా బలపడుతుoది దాదా
కునాల్: మీరంతా జాగ్రతగా ఉండండి
సోని: మీతో ఒక గంటనన్న నిదానంగా మాట్లాడలనుకుంటిని. కుదరకపాయె
కునాల్: పర్వాలేదులే..ఏమో మల్లి కలుస్తామేమో (కొంచం ఆగి, భుజం మీద చెయ్యి వేసి) వచ్చేటప్పుడు సంకోచంతో వచ్చాను.పోయేటప్పుడు సoతోషoగా పోతున్నా. అసలు నేను మీకు నేర్పాలని వచ్చిన కానీ మీ నుండే చాల విషయాలు నేర్చుకున్న(కొద్ది సేపు మౌనం)
సితూ: దాదా..మీరు రాగలిగితే అంత కంటే కావలసింది లేదు.మీరు రాలేకపోతే మా వాళ్ళకి బయటనే ఎక్కడన్నా ట్రైనింగ్ ఇవ్వండి.మీలాగా పేషెంట్ల కోసం ఆలోచించే డాక్టర్లు తక్కువ దాదా
కునాల్: తప్పక ప్రయత్నిస్త.సీరియస్ గ ఐనప్పుడు నన్ను పిలవండి. వచ్చే ప్రయత్నం చేస్తా.
(రైను ని కలుస్తాడు..కళ్ళకి పట్టిల తో ఉంటాడు)

కునాల్: ఎం రైను బాగున్నావా. కళ్ళు బాగైనంక మల్లి ఉద్యమం లోకేనా
రైను: అవును దాదా..ఎంత వీలైతే అంత తొందరగా.
కునాల్: ఇదేమిటి మీకిది ఊత పదమా...(కొంచం ఆగి ) అవును రైను..నీకు పెళ్లైంద
రైను: ఊ..ఐంది దాదా...తను వేరే గగ్రూప్ లో ఉంటది.చాలా దూరం
కునాల్: ని దగ్గర ఉండే వీలు కాదా?
రైను: ఏమో ఎప్పుడు అడగలేదు.
(ఇంతలో ఇడిమే వచ్చి చేరుతుంది)

ఇడిమే: డాక్టర్ దాదా..మాకు సర్జరీ నేర్పేవాళ్ళు కావాలి అది వస్తే మేం గెలిచినట్టే
కునాల్: ప్రయత్నిద్దాం...జాగ్రత్త ఇడిమే.అందరు జాగ్రతగా ఉండండి.(వీడ్కోలు తీసుకుంటాడు)
కునాల్(స్వగతం): అదేమిటో గాని పోలీసు పేషెంట్ల మొఖాలు పదే పదే గుర్తుకొస్తున్నాయి.వారి పేదరికం నిస్సహాయమైన మొఖాలు పదే పదే గుర్తుకొస్తున్నాయి.తమ ముందు ఒక ఆశయం ఉందని తాము గెలవాలని అనుకున్నట్లు అనిపించడం లేదు.యుద్ధం లో ఆదివాసీలు గెలుస్తారో లేదో నేను చెప్పలేను,ʹఒక యుద్ధం లో వాళ్ళు ఇప్పుడే గెలుపు శిఖరాల మీద ఉన్నారుʹ.అని పదే పదే అనిపిస్తుంది. వాళ్ళ గుండెల్లో ఒక ఆత్మవిశ్వాసపు జ్వాల ఉన్నట్టుంది.ఆ జ్వాలనే మాలాంటి వాళ్ళని గెలుచుకుంటుంది.

రామ్ గడ్ కి నా అవసరం ఉంది.కాని దేశం లోని రామ్ గడ్ లను రామ్ గడ్ లాగ వెనకబడి పోనియం అని హామీ ఇస్తున్నారు వీళ్ళు.ఏమైనప్పటికీ వీళ్ళు అసలైన ప్రజావైద్యులు ప్రపంచం వీళ్ళ నుండి చాల నేర్చుకోవాలి.

(నేపథ్యంలో)
ప్రజావైద్యులు-వర్దిల్లాలి
ఆదివాసీ పోరాటాలు _ వర్దిల్లాలి

(పాట)
ʹఓ ప్రజవైద్యులారా.....
చరిత్ర పుటలనిల్చిన
హిమాలయ శిఖరములారʹ
అందుకోండి మా విప్లవ జోహార్లు
మీరందుకొండి మా విప్లవ జోహార్లు ʹఅందుకోండిʹ
లాంగ్ మార్చ్ మార్గంలో ...చైనీయుల హృదయంలో
సుస్తిరముగా నిల్చినావు...అరుణతారవైనావు
ఓ...ఓ..అన్నా...మాకోట్నిస్
అందుకోండి మా విప్లవ జోహార్లు
మీరందుకొండి మా విప్లవ జోహార్లు ʹఅందుకోండిʹ
శ్రీకాకుళ పోరులోన-గిరిజనుల వెన్నుదట్టి
గన్ను బట్టి నిలిచినావు-చరితార్థుడవైనావు
ఓ....ఓ....చాగంటి బాస్కరుడా
అందుకోండి మా విప్లవ జోహార్లు
మీరందుకొండి మా విప్లవ జోహార్లు ʹఅందుకోండిʹ
పౌరహక్కుల ఉద్యమాన-అగ్రగామిగా నిలిచి
పసిపిల్లల డాక్టరయ్యి-ప్రజల గుండె గెలిచినావు
ఓ...ఓ...డాక్టర్ రామనాథం
అందుకోండి మా విప్లవ జోహార్లు
మీరందుకొండి మా విప్లవ జోహార్లు ʹఅందుకోండిʹ
చదువులేమి లేకున్నా జనం డాక్టర్ గా మారి
ఆదివాసీ పోరులోన –భాగమై సాగుతున్న
ఓ...ఓ...ప్రజా వైద్యులారా
అందుకోండి మా విప్లవ జోహార్లు
మీరందుకొండి మా విప్లవ జోహార్లు ʹఅందుకోండిʹ

షహీదా రాసిన ʹఇద్దరు శస్త్రకారులుʹ కథకు నాటక రూపం

(సహకరించిన మిత్రులు KC వెంకటేశ్వరులు, రాఘవాచారి,సుదర్శన్ లకు కృతజ్ఞతలు)No. of visitors : 1250
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


జాజిపూల ప‌రిమ‌ళం

ష‌హీదా | 11.05.2016 01:30:35pm

ఈ క‌థ‌ల నిండా మ‌నిషి ప‌రిమ‌ళం - అది త్యాగానికి, స‌మ‌ష్టి జీవ‌న సౌంద‌ర్యానికి సంబంధించిన ప‌రిమ‌ళం. అది స్వంత ఆస్థిలో ముక్క‌చెక్క‌లై కుళ్లిపోయిన‌ది కాదు. అది ...
...ఇంకా చదవండి

‌వెంట్రుకవాసిలో...

చుంగ్‌ ‌చున్‌-‌షాన్‌ (ఇం‌గ్లిష్‌ ‌నుండి అనువాదం : షహీదా) | 17.06.2016 10:09:27am

మేం గెరిల్లా బలగాలకు తిండిని కూడా సేకరించి తీసుకుపోవాలను కున్నాం. మేం గ్రామంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే శత్రువు మమ్మల్ని చుట్టుముట్టాడు. మేం వస్తు........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...

  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •