పుప్పొడి రేణువుల శిల్పం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

పుప్పొడి రేణువుల శిల్పం

- పాణి | 18.08.2017 12:27:28pm

జీవిత కవిత్వం-5

ʹఅలలది అలసిపోని పాత్ర..ʹ అంటూ విప్లవ కవిత్వంలోకి కొత్త అలలా నాగేశ్వర్‌ 2007లో ప్రవేశించాడు. ఆతొలి కవితా సంపుటి పేరు ʹఅలలుʹ. సూటిదనం, కాస్తంత తాత్వికత కలగలసిన తాజా కవి స్వరం ఆలలు కవితలో ఉంది. ఒక ఫీల్‌ను కవిత్వం చేసే మెలకువల మరింత పెంచుకుంటూ రెండో కవితా సంపుటి ʹపూలు రాలిన చోటʹ ఏముందో మనకు చూపిస్తున్నాడు.

విప్లవ కవిత్వం పూలు పూచే తావులనేగాక అవి రాలిపడిన చోట ఎంత కన్నీరు ఇంకిపోయిందో, ఎంత చైతన్యం పోటెత్తుతున్నదో, ఎంత మానవానుభూతి పోగుపడి ఉన్నదో, తరతరాల చెదరని కలలు తిరిగి తిరిగి ఎలా ఆవిష్కారమవుతున్నవో, సకల మానవ సంస్పందనల పరాగ రేణువులు ప్రకృతి అంతా పునర్జీవితమవుతున్నవో చూపించేలా విస్తరించింది. ఈ తరం విప్లవకవి సంకుల సమరంలాంటి జీవన క్షేత్రంలో నిలబడి రాలిపడిన పువ్వులను, గాయపడిన పువ్వులను వడిలోకి తీసుకున్న నేల తావునూ మనకు చూపిస్తున్నాడు.

నాగేశ్వర్‌ కవి గొంతు ఆయనదే. అచ్చంగా ఆయన మన ఎదుట ఎలా మాట్లాడతాడో అట్లాగే కవిత్వంతో మాట్లాడతాడు. కవిగా మనతో ఆట్లాడతాడు. అంటే కవిత్వాన్ని వెతుక్కొనేదారి ఆయన సొంతంగా వేసుకున్నాడు. కవిత్వాన్ని కనుక్కొనే తీరు సొంతంగా ఆవిష్కరించుకున్నాడు. విప్లవ కవిత్వంలోని ఏ ప్రత్యేకతనైనా కవి కార్యకర్తృత్వంతో సంబంధం లేకుండా చూడటానికి లేదు. అదొక బలమైన రాజకీయ అస్తిత్వం. అక్కడి నుంచి ఏం చూస్తాం? ఏం వింటాం? ఏం మాట్లాడుతూ ఉంటాం? అనేవి విప్లవ కవిత్వ వైవిధ్యానికి కారణం. ఇవన్నీ ఎవరివి వారివే. విప్లవ కవిత్వం నిత్య చలనంలో, పురోగతిలో, అపారమైన వైవిధ్యంతో సాగడానికి కారణం ఇదే. ఈ ఆచరణ అస్తిత్వం నుంచి సొంత గొంతు రూపొందుతుంది. నాగేశ్వర్‌ కవిత్వంలో అది రూపొందే క్రమం అలలు సంపుటిలో మొదలై కెరటాల్లా విస్తరించుకుంటూ పోయింది. వరంగల్‌ కవి కావడం వల్ల విప్లవమనే జీవితానుభవం, దాని గాఢత చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని కవిగా సొంతం చేసుకోవడంలో, కవిత్వంగా వ్యక్తం చేయడంలో ఈ రెండు సంపుటాల్లో చాలా పరిణతి కనిపిస్తుంది.

కార్యకర్తృత్వం వల్ల కవిత్వం సంతరించుకునే లక్షణాల్లో సూటిదనం ఒకటి. ప్రజలకు మామూలు మాటల్లో చెప్పినట్లు కాకుండా భిన్న తలంలో కవిగా సంభాషించడం అనే మెలకువను ఒక్కో విప్లవ కవి ఒక్కోలాగా ప్రదర్శిస్తారు. భిన్నతలంలోని భాషా వినిమయ, భావ వ్యక్తీకరణ ప్రక్రియ అనే ఎరుక వల్ల ఒక ఫీల్‌ లేదా అనుభవం కవిత్వం అవుతోంది. అసలు కవిత్వానికి.. మనిషి జీవితానికి సంబంధమే ఉండదని..రోజువారీ జీవితంతో కవిత్వాన్ని ముడేస్తే అది కళకాదని వాదించే వాళ్ల జోలికి మనం పోనవసరం లేదు. కవిత్వమంటే మామూలు జీవితంలోని భిన్నతలానికి చెందిన మానవ వ్యక్తీకరణ అనే స్థూల నిర్వచనం ఇచ్చుకోవచ్చు. అందువల్ల ప్రజా జీవితం ఉన్న కవుల వ్యక్తీకరణలో సూటిదనం ఒక లక్షణంగా ఉంటుంది. ప్రగతిశీల కవిత్వంలోని ఈ లక్షణాన్ని కొందరు తరచూ వివాదాస్పదం చేస్తుంటారు. సూటిదనమంటే కవిత్వం కాకపోవడం కాదు. మార్మికత లేకపోవడం, అస్పష్టత లేకపోవడం, సంక్లిష్టత కూడా లేకపోవడం, పైగా సంక్లిష్టమైన భావనల సారాన్ని నేరుగా వ్యక్తం చేయడం, అలవిగాని అలంకారం లేకపోవడం. ఆ అర్థంలోనే సూటిదనం వల్ల ప్రగతిశీల కవిత్వం అపారమైన కళాశక్తి సంతరించుకున్నది. ఆధునిక యుగంలో సాహిత్య ప్రియులకు చప్పున స్పురించే కవితా పాదాలన్నీ దాదాపుగా ప్రగతిశీల విప్లవ కవితా సంప్రదాయంలోనివే. కవిత్వ ప్రభావాన్ని అంచనా వేయడానికిది ఒక ప్రమాణం. కవిత్వంలోని వస్తువు వల్ల, దృక్పథం వల్ల మాత్రమే కాదు.. దాని శిల్పంలోని సూటిదనం వల్ల కూడా ఈ శక్తి వచ్చింది. ఒక్కోసారి శిల్పం పాత్రే ఎక్కువ. సూటిదనం అనే కవితా లక్షణం వల్లే అది సాధ్యమైంది. ఇదంతా ఎందుకంటే ప్రగతిశీల, విప్లవ కవిత్వంలోని సూటిదనం అకవితా లక్షణం కాదు, అదే ఒక కవితా లక్షణం అని చెప్పడానికి. అట్లాగే విప్లవ కవిత్వంలో ఎన్ని ప్రయోగాలు జరిగినా, కొత్త వ్యక్తీకరణలు సాధించినా సూటిదనం అనే లక్షణం నిలిచే ఉంటుంది. దానికి ఒక కారణం ఏమంటే.. సూటిదనం కూడా ఒక్కో కవి చేతిలో, ఒక్కో కాలంలో అనేక ప్రయోగాలకు లేదా కొత్తందనాలకు గురవుతూ రావడం. నిజానికి యాభై ఏళ్ల విప్లవ కవిత్వంలోని సూటిదనం అనే కవితా లక్షణం ఎన్నెన్ని రకాలుగా వ్యక్తమైందీ, ఎంత మంది కవులు చేతిలో అది ఎంత వైవిధ్యభరితమైందీ, దాని వల్లే ఆ కవిత్వం సంతరించుకున్న అపారమైన శిల్ప కళా ప్రభావాన్ని వేస్తున్నదీ అదే ఒక పరిశీలనాంశం. ఆశయాలతో నినాదాలతో పేచీ లేదు.. వాటి వ్యక్తీకరణ కూడా కొన్ని మూసల్లో ఒదిగి ఉండాలనే ధోరణి ప్రగతిశీల కవిత్వంలో ఉందనే మూస వాదన చేసేవారు పైన చెప్పిన ఒక్క అంశాన్ని ఎంచుకొని పరిశోధన చేస్తే విప్లవ కవిత్వంలోని వ్యక్తీకరణ వైవిధ్యం స్పష్టమవుతుంది. ప్రగతిశీల కవిత్వానికి ఈ లక్షణం సర్వత్రా ఉన్నదే. బహుశా ఎప్పటికీ ఉంటుంది కావచ్చు.

నాగేశ్వర్‌ కవిత్వ విశ్లేషణ సందర్భానికి ఈ చర్చ చాలా అవసరం. సూటిదనం అనే కవితా లక్షణం నిలబెట్టుకుంటూ అందులోనే ఆయన ఎంత వైవిధ్యం సాధించిందీ చెప్పడానికి పూలు రాలిన చోట సంపుటి మంచి ఉదాహరణ.

ఈ కవిత ఎత్తుగడ చూడండి..

మనుషులు
మరమగ్గం మీద
తెగిపడుతున్న దారాలు

మగ్గమెప్పుడు నిద్రపోవద్దు
మనుషుల్తో మాట్లాడుతూ నడవాలి
మనుషులూ నిద్రపోవద్దు
ఇరవై నాలుగ్గంటలు మగ్గంతో మాటలు కలపాలి...

అని సాగుతుంది. మగ్గం మీద దారాలు తెగిపోకుండా అల్లే మనుషులే తెగిపడుతున్న దారాలయ్యే విషాదకర స్థితి. మనుషుల జీవితాలు, మానవ సంబంధాలు దారప్పోగు మందాన పుటిక్కిన తెగిపోతున్నాయి. సామ్రాజ్యవాదానికి అమెరికా అధ్యక్షుడు వ్యక్తి ప్రతినిధి అయినప్పుడు.. పెద్ద ఎత్తున అగ్రరాజ్య దురహంకార వ్యతిరేక పోరాటాలు సాగని స్థితిలో ఒక వ్యక్తి ఆగ్రహంతో ఆ ప్రతినిధిపై చెప్పు విసిరేసి తన కసి వ్యక్తం చేస్తాడు. అప్పుడు కవి ఆనందంతో ..

మిత్రుడా
నువ్వొంటరి కాదిప్పుడు
భూగోళం మీది ఉడుకు నెత్తురు నీవెంటే నడుస్తోంది

నువ్వు ఏక వచనం కాదిప్పుడు
పశ్చిమాసియాలో
ప్రతి ఇంటా పురుడుపోసుకుంటున్న ముంతదార్‌వి.. అంటాడు.

ఒక సామాజిక వస్తువులో కవిత్వం కాగల అంశం ఏదో గుర్తించడంలో నాగేశ్వర్‌ ఈ సంపుటిలో చాలా పరిణతి సాధించాడు. ఆ అంశంలోని భిన్న తరాల్లోకి వెళ్లి కవిత్వంతో సహచరించే మెలకువలు తెలియడం వల్ల ఈ సంపుటి విప్లవ కవిత్వంలో ఉచితమైన స్థానం సంపాదించుకుంది. ఒక్క మాటలో ఏది కవిత్వమవుతుంది? ఎట్లా కవిత్వమవుతుంది? అనే ప్రశ్నలకు సంబంధించింది ఇది. బహుశా తాను ఎంచుకున్న కవితా మార్గంలో నాగేశ్వర్‌ సాధించిన విజయం ఇది. ఒకచోట..మనిషి ఆకర్షణ చరిత్ర పుటలవ్వొచ్చు.. అంటాడు. ఇదొక విమర్శనాత్మక కవితా వ్యాఖ్య.

నాగేశ్వర్‌ చాలా సరళంగా ఒక దృశ్యాన్ని నిర్మిస్తాడు. అందులో ఎన్నెన్నో అర్థాలు కనిపిస్తాయి. వినిపిస్తాయి. ముదిగొండ కాల్పుల గురించి రాసిన కవితను ఈ దృశ్యంతో ఎత్తుకుంటాడు.

అందరూ చూస్తున్నారు
అంబేద్కరూ చూస్తున్నాడు
అంబేద్కరు నీడలో కూర్చున్న
చర్మకారుడు
పల్లె నాగభూషణం చూస్తున్నాడు..

కవిత అంతా ఆనాటి కాల్పుల ఘటన దృశ్యాల పరంపరతో నడుస్తుంది. ఇంకో కవితలో

ఆకు రాలింది
విద్యానగర్‌ నడి రోడ్డు మీదనే కావచ్చు
పత్రహరితం
తెలంగాణ ఒళ్లంతా పచ్చగా పర్చుకుంది..

ఒక చోట ఆకు రాలిపోతే తెలంగాణ అంతటా పత్రహరితమనే గతితర్కాన్ని కవిత్వం చేశాడు. మరోసారి వెనక్కి వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేనంత సరళంగా, సూటిగా దృశ్యాలను పేర్చుకుంటూ వెళతాడు. కవిత్వం వల్లే సాధ్యమయ్యే సున్నితత్వాన్ని, తీవ్ర ఉద్వేగాన్నీ సమపాళ్లలో వ్యక్తం చేయడమనే విద్య ఈ తరం విప్లవ కవుల ప్రత్యేకత. దీన్ని నాగేశ్వర్‌ చాలా వరకు సాధించాడు. సున్నితత్వానికి తిరుగులేని దాఖలా అని చెప్పగల కవిత ʹపుప్పొడిʹ.

ఈ కవిత ముగింపు ఎలా ఉంటుందంటే..

పూలు రాలిన చోట
పుప్పొడి వెదజల్లబడే ఉంటుంది
పుప్పొడి నెత్తురులోంచి
పిడికిలి
తేటగా తేరుకునే ఉంటుంది..

రాంగుడ ఎన్‌కౌంటర్‌పై రాసిన కవిత ఇది. యాభై ఏళ్లుగా విప్లవ కవిత్వంలోని ఈ వస్తువు ఎంతెంత వైవిధ్యభరితంగా వ్యక్తమైందో సాక్షాధారాలతో విశ్లేషించాల్సిందే. ఏదో ఒక వాక్యం కింద చెప్పగలిగేది కాదిది. ఈ తరం వ్యక్తీకరణను మాత్రమే పై వాక్యాల్లో చూడవచ్చు. రాలిన పూల గురించి కూడా ఎందరో చెప్పి ఉంటారు. కానీ నెత్తురు కక్కుకుంటూ వెదజల్లబడిన పుప్పొడి రేణువులు పిడికిలిగా విప్లవ కవిత్వంలో భాగమయ్యాయి. కఠినమైన వర్గపోరాట ఆచరణలోని ఆశావాదమే ఇంత సున్నితమైన కవిత్వం అయింది. రాలిన పూల పరాగాల గుబాళింపులు, విషాద భీభత్సాలూ విప్లవ కవిత్వం సొంతం. చాలా విస్తారమైన సృజనతలంలో గాఢమైన వ్యక్తీకరణగా మారే జీవితానుభూతి ఇది. ఇదే ఫీలింగ్‌ను నాగేశ్వర్‌ ఇంకో చోట మరో దృశ్యంలోకి మార్చాడు.

చుక్కలు రాలిన చోట
వేన వేల చుక్కలు కనురెప్పలు తెరుస్తోన్న వేకువ.. అంటాడు. ఇది కూడా ముగింపే. ఒక దృశ్యంతో కవితను ఎత్తుకుంటాడు. దాన్ని అలా చదవడం మొదలు పెట్టడమే ఒక గొప్ప అనుభవం. ముగింపులో దాన్ని మరింత ఉన్నత స్థితికి తీసికెళ్లే దృశ్యం ఉంటుంది. విషాదమూ, ఉద్వేగమూ కలగలసిన అనుభవం పాఠకులకు మిగులుతుంది. ఇలా వాచకంలోకి వెళ్లి వివరించ వలసిన కవితలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కవితలు ఒకే శ్రద్ధతో నడిచి ఉండకపోవచ్చుగాని, చాలా కవితల్లో ఎత్తుగడకు సరిపోయిన నడక, బిగువు, పేర్పు ముగింపు దాకా ఉన్నాయి. కవిత్వం చేయగల నేర్పుతోపాటు వస్తువులో ఏది కవిత్వం అవుతుందో గుర్తించే నేర్పు వల్లే ఇది సాధ్యమైంది.

కాస్ట్రో గురించి రాసిన కవిత గురించి కూడా తప్పక చెప్పుకోవాలి. విప్లవ కవిత్వంలోని సూటిదనాన్ని పాటించకపోతే ఇలాంటి కవిత రాయడం ఎవ్వరికైనా కష్టమే. అమెరికాను ఉద్దేశించి యాభై ఏళ్ల నిద్రలేమి కదా నీది.. అని మొదలవుతుంది ఈ కవిత.

సిగార్‌ ఆర్పెయ్యాలని
ఆరువందల ముప్పై ఎనిమిదిసార్లు నీళ్లు చల్లావు
హవానా చుట్ట ఆరిపోయిందెప్పుడు.. అంటాడు.

తొలినాళ్ల విప్లవ కవిత్వ లక్షణాలను స్వీకరించి వాటిని మరింత ముందుకు తీసుకపోయాడు నాగేశ్వర్‌. ఆ మార్గంలో ఇది ఈ తరం వ్యక్తీకరణ. తాజా సూటి శిల్పం. ఉద్వేగమూ, సున్నితత్వమూ సొంతం చేసుకున్న స్వీయ కవితా మార్గమిది. సరళమైన పదాలతో అద్భుత దృశ్యాలు నిర్మించే పనితనం ఆయన శైలి. ఒకసారి చదివాక మెరమెరలాడుతూ ఉంటుంది. వర్తమాన విప్లవ కవిత్వానికి సరికొత్త వన్నె తెచ్చిన కవన రహస్యం ఇందులో ఉంది.

No. of visitors : 636
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!
  అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్
  రాయలసీమ బతుకు పోరాటం
  మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.
  పాలమూరి దుఃఖం
  బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు
  తొలితరం విప్లవ కథకుడు
  స్వేచ్చా స్వప్నం
  సమాజ నగ్న చిత్రం ʹమట్టిరంగు బొమ్మలుʹ
  సామాజిక ఆర్థిక అసమానతలను ప్రశ్నించిన కులవృక్షం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •