నడుస్తున్న చరిత్రకు నవలారూపం

| సాహిత్యం | వ్యాసాలు

నడుస్తున్న చరిత్రకు నవలారూపం

- ఖాదర్‌ మొహియుద్దీన్‌ | 19.08.2017 02:45:13am

నిషిధ నల్లూరు రుక్మిణి నవలకు రాసిన ముందుమాట
చరిత్రను ఒక మంచి కథగానో, ఒక బలమైన నవలగానో చిత్రించటం చాలాకష్టం.

ఇక నడుస్తున్న చరిత్రను నవలగా నిర్మించడం అంటే నిస్సందేహంగా అది కత్తిమీద సామే.!

నల్లూరి రుక్మిణి రచన ʹనిషిధʹ నవలా నిర్మాణం ముమ్మాటికీ అసలైన అర్థంలో ఒక అసిధారావ్రతం.

సాధారణంగా మనం చదివే అత్యధికశాతం చరిత్ర పుస్తకాల్లో పేర్లు , తేదీలు మాత్రమే వాస్తవాలు, మిగతావి ముప్పాతిక మువ్వీసం కట్టుకథలు, పుక్కిటి పురాణాలు, అభూత కల్పనలు, మహా అయితే అర్థసత్యాలు.

ʹనిషిధʹలో కేవలం పేర్లు, తేదీలు మాత్రమే అవాస్తవాలు, మిగతావన్నీ పచ్చినిజాలు. ఈ నవలలో ఊరిపేరు, వ్యక్తుల పేర్లు మార్చి రాసినప్పటికీ పాఠకుడికి అసలు పేర్లు అవలీలగా తెలిసిపోతాయి.

దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం గుంటూరు జిల్లా , తెనాలి పట్టణానికి అల్లంత దూరంలో వున్న గ్రామంలో అగ్రకులాలు అత్యంత అమానుషమయిన రీతిలో దళితులపై జరిపిన దారుణ మారణకాండకు అక్షరరూపం ʹనిషిధʹ. ఇది కేవలం ఈ నవలకు యితివృత్తం మాత్రమే. పరిధికాదు. ʹనిషిధʹ విషయపరిధి, భారతదేశంలో పీడితులైన దస్యులు / దళితులు / బహుజనుల చరిత్ర ఎంత ప్రాచీనమయినదో, ఎంత సుదీర్ఘమయినదో అంత ప్రాచీనమయినదీ, సుదీర్ఘమైనదీ.

ఈ నవలలో చిత్రితమయినది కేవలం గత చరిత్రమాత్రమే కాదు, అది నేటి వర్తమానాన్నీ, మరింత గట్టిగా చెప్పదలిస్తే రేపటి వర్తమానాన్నీ కూడా శక్తివంతంగా సుబోధకం చేయగలిగిన గతం. ఈ నవలలోని సంఘటనల క్రమం దేశవ్యాప్తంగా ఇప్పటికీ మరింత కర్కశంగా కొనసాగుతూన్న నిత్య వాస్తవం. అలనాడు అల్లూరులోని అగ్రకులాలవాళ్ళు అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలే ఈనాటి గరగపర్రు వాసులకు మార్గదర్శకం కావడం ఎంత మాత్రం యాదృచ్ఛికం కాదు. ఒక ఉత్తరప్రదేశ్‌ లేదా ఒక గుజరాత్‌లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా, ప్రతిరోజూ ఎక్కడో ఓచోట యధేచ్ఛగా కొనసాగుతున్న దళితుల ఊచకోతలను పరిగణనలోనికి తీసుకున్నట్లయితే నల్లూరి రుక్మిణి ʹనిషిధʹ నవల నిత్య వర్తమానానికి పట్టిన నిలువటద్దం అని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

కనీసం నూరు సంవత్సరాల కథాకాలాన్ని ఆవరించిన ఈ నవల మూడు నాలుగు తరాల దళిత అనుభవాలను అక్షరరూపంలో ఆవిష్కరించింది. కథనంలో సృజియించిన ఆలోచనల అర్ధంలో భారత గ్రామీణ సామాజిక జీవితానికి సంబంధించిన వివిధ పార్శ్వాల్ని స్పష్టంగా గుర్తించవచ్చు. తరతరాలుగా దళితులు ఎదుర్కొంటూ వస్తూన్న పరమ క్రూరమయిన హింసల తాలూకు బాధల గాధల పాటల పల్లవులు నవలలోని ప్రతి పదంలోనూ ప్రతిధ్వనిస్తుంటాయి.

సూక్ష్మపరిశీలనలో భిన్న ప్రపంచాల సమాహారమే గ్రామం అనేది వాస్తవమే అయినప్పటికీ ʹనిషిధʹ నవలలో ప్రధానంగా అది రెండు భిన్న ప్రపంచాలుగా పాఠకుని ముందు పరచుకుంటుంది. ఊరు - పల్లె. తరతరాలుగా జ్ఞానంమీదా, అధికార వ్యవస్థ మీదా పట్టువదలకుండా ఏకఛత్రాధిపత్యాన్ని సాగిస్తూ వస్తూన్న ఊరు అజ్ఞానానికీ, అనాగరికతకీ పల్లెను ప్రమాణంగా చూపిస్తుంది. ఆచరణలో పల్లెపట్ల ఊరు సామాజికంగా, ఆర్థికంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎంత దారుణంగా, ఎంత అమానుషంగా, ఎంత అనాగరికంగా వ్యవహరిస్తుందో ఈ నవల మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. సంఘటనల్ని అతి సాధారణమయిన పదాల సాయంతో బొమ్మకట్టి చూపించే మంత్రవిద్య ఈ రచయిత్రికి చక్కగా అబ్బిందని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

ʹనిషిధʹ కేవలం ఎనిమిదిమంది దళితుల ఊచకోత వృత్తాంతం మాత్రమే కాదు. నిజానికి ఈ నవలకు మూలం కులం అనే ఒక మహావృత్తాంతం. కుల వ్యవస్థ విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఈ నవల, రాజ్యం విశ్వసనీయతని పరిరక్షిస్తూ వస్తూన్న న్యాయవ్యవస్థ నరనరానా జీర్ణించుకుపోతున్న కులతత్వాన్ని బట్టబయలు చేయటం వాస్తవికవాదానికి కొత్త జీవాన్ని అందించింది. వృత్తిపరంగా రచయిత్రి రుక్మిణి ప్రాక్టీస్‌ చేస్తూన్న ఒక న్యాయవాది, కాబట్టి అతి సమీపంగా న్యాయవ్యవస్థ నిజస్వరూపాన్ని నిశితంగా పరిశీలించి సాధికారికంగా చెప్పగలిగారు. అత్యున్నత పీఠాలను అలంకరించిన న్యాయమూర్తులు, ఉన్నత న్యాయస్థానాలు వెలువరించే తీర్పులు ʹఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ʹ స్థాయికి దిగజారడాన్ని ఆమె పసిగట్టారు. నిజానికి చుండూరు ఊచకోత నిందితులు నిర్దోషులని చెబుతూ ఒక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందనగా పీడిత ప్రజల హక్కులకోసం పోరాడే ఒక న్యాయవాది మనసులో పెల్లుబికిన సత్యాగ్రహానికి నవలారూపమే ʹనిషిధʹ.

ʹనిషిధʹ నవల నిజంగా మళ్ళీ కుల సమస్యను బలంగా చర్చకు తీసుకువచ్చింది.

భారత సమాజంలో కులం అనేది అత్యంత దృఢమయిన ఒక సామాజిక నిర్మాణం. మార్పు జీవనాడిగా నిరంతరం కదిలే కాలం కులాన్ని ఏ మాత్రం కదిలించలేకపోయింది. వివిధ వ్యవస్థలు, వ్యవస్థల్లో వచ్చిన మార్పులు, ప్రపంచ పరిణామాలు, రాజకీయాలు, ఆలోచనలు, భావాలు, తత్వశాస్త్రాలు ఏవీ దానిని అణుమాత్రం కూడా ప్రభావితం చేయలేకపోయాయి. తరతరాలుగా ఒక సామాజిక నిర్మాణం ఎటువంటి ప్రభావాలకూ లోనవకుండా, చెక్కుచెదరకుండా ఎలా నిలబడి వుందనేది ఒక గంభీరమయిన ప్రశ్న.

ప్రపంచీకరణ వంటి ఒక విశ్వవ్యాప్త వ్యవస్థ, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లకు వ్యతిరేకంగా అమెరికా సాగించిన యుద్ధం, ఆయిల్‌ ధరల హెచ్చుతగ్గులు, బిన్‌లాడెన్‌ మరణం, బుష్‌ పదవీ విరమణ, బారక్‌ ఒబామా అమెరికా అధ్యక్ష పీఠాలంకరణ, అవినీతి వ్యతిరేక ఉద్యమాలు, అచ్ఛేదిన్‌, సబ్‌కావికాస్‌, అసహనం, గోరక్షిత రాజకీయాలు, పిపరా, పారస్‌భీగా, గోధ్రా, కారంచేడు, చుండూరు - ఏదీ భారత సామాజిక నిర్మాణాన్ని ఇసుమంతైనా ప్రభావితం చేయలేకపోవటం, కులం నిరంతరం మరింత శక్తివంతం, హింసాత్మకం అవుతూ అధికార నిర్మాణానికి అతి సన్నిహితం కావటం దిగ్భ్రాంతికి గురిచేసే వాస్తవాలు. భారత సమాజంలో ఏ మతమయినా, ఏ సంప్రదాయమయినా, సోషలిజం, మార్క్సిజంతో సహా ఏ యిజం అయినా కులం కాటునుంచి తప్పించుకొనటం అసాధ్యం. భారత సామాజిక నిర్మాణంలో కులం ప్రభావం బహుముఖం. ఇక్కడ పెట్టుబడికీ, కులానికీ మధ్య కూడా బలమైన అనుబంధం ఉంది. నిర్దిష్టంగా చెప్పాలంటే భారతజాతీయవాదానికి కులమే మూలం. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించ వలసిన సంస్థలు కుల సమస్య విషయంలో కళ్ళుమూసుకుని వ్యవహరించడం క్షంతవ్యం కాదు.

యూరప్‌లో జాత్యహంకారవాదం (రేసిజం) సుదీర్ఘకాలంపాటు ఒక పెద్ద సమస్యగా వుంది. దీనిని అవగతం చేసుకునేందుకు అక్కడి మేధావులు ఎంతో మధనపడ్డారు. వాళ్ళ దృష్టిలో జాత్యహంకారవాదం, ఇప్పుడు ఒక ప్రత్యేక జాతికి చెందిన ప్రజలు ఇతర జాతులను హేయమైనవని భావించడాన్నీ, చూపించటాన్నీ జస్టిఫై చేసుకునే పద్ధతిమాత్రమే కాదు. ఇప్పుడది పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం పధకం ప్రకారం ప్రయోగించే అధికార భావజాలం. జాత్యహంకారవాదుల ఈ అవగాహన కులాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. జాత్యహంకార వాదానికి అయిదు ప్రత్యేక లక్షణాలుంటాయని గుర్తించాడు కెన్యా రచయిత గూగీ -

సనాతనవాదం లేదా సంప్రదాయవాదం, విభజించి పాలించే విధానం, రాజకీయాధిపత్యం, ప్రాచీన భావాల సాయంతో సాధ్యమయినంత అధికలాభార్జన, పరపీడనం. ʹʹఅత్యధిక సంఖ్యాకుల శ్రమవల్లనే అతికొద్దిమంది పెట్టుబడిదారుల ఐశ్వర్యం అంతులేకుండా పెరిగిపోవటమనే నగ్నసత్యంమీద ముసుగువేసే ఒక బృహత్తరమయిన కూహకంలో భాగమే జాత్యహంకారవాదం. అధికసంఖ్యాకుల శ్రమ కాదు, కొద్దిమంది పెట్టుబడులే జాతీయ సంపద సృష్టికి కారణమవుతుందనే భ్రమను కల్పిస్తుందిʹʹ అంటాడు గూగీ. యూరప్‌, అమెరికా, జపాన్‌ దేశాల సమృద్ధి, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలకు చెందిన మూడో ప్రపంచ దేశాల వల్లనే సాధ్యం అవుతుందనే వాస్తవాన్ని మసకబారేలా చేసేది పాశ్చాత్య, మూడో ప్రపంచ దేశాల మధ్య ఈ జాత్యహంకారవాదమేనని గూగీ వివరిస్తాడు. మొదటి ప్రపంచ దేశాల సమృద్ధి తాలూకు పునాదులు మూడో ప్రపంచ దేశాల్లోని పేదరికంలో వున్నాయి. ఒక పద్ధతి ప్రకారం అధికారం (పెట్టుబడిదారీ విధానం) తనను పరిరక్షించుకునేందుకు ʹవిభజించి పాలించʹటమనే విధానాన్ని అవలంబిస్తుంది.

గూగీ చెప్పిన దాని ప్రకారం జాత్యహంకార విధానం ప్రత్యేకత రాజకీయ ఆధిపత్యం. పెట్టుబడిదారీ విధానం వలసలు, అర్థవలసలు, నయా వలసల్లో తాను పెంచిపోషించిన జాత్యహంకారాన్ని రుచి చూపించింది. ఈ వర్గం తన స్వంత దేశప్రజలనే ద్వేషిస్తుంది. జాత్యహంకార వాదం మూడో లక్షణం రాజకీయ ఆధిపత్యం. ప్రాచీన భావాలకు ప్రాధాన్యత కల్పించటం నాలుగో లక్షణం. తద్వారా యిది తమ ప్రారబ్ధం అని పీడితులు భావించేలా చేస్తుంది. ఇవేవీ పనిచేయని పక్షంలో ప్రత్యక్ష రూపంలో హింసని ప్రయోగించటం ద్వారా అణచివేతకు పాల్పడుతుంది. అణచివేత అమలు విషయంలో పీడితులు సంఘటితం కాకుండా వుండేందుకుగాను వర్గం, మతం, జాతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవహరిస్తుంది. సునిశితంగా పరిశీలించినట్లయితే భారత అధికార వ్యవస్థ కూడా కుడి ఎడంగా ఇదే విధమైన వ్యూహాన్ని అనుసరిస్తూందని అర్ధమవుతుంది.

అంతిమంగా సమాజం ముందున్న ప్రధానమయిన సమస్య పీడిత సముదాయాల విముక్తి. ఈ సముదాయాలలో ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీలు వుంటారు. వీరితోపాటు శ్రమజీవులు, కార్మికులు వుంటారు. అంతేకాదు. దాదాపుగా వినాశనం చివరి అంచుమీద నిలబడివున్న రైతాంగం కూడా పీడిత సముదాయాల నుంచి విడదీయరాని అంతర్భాగమే. ఈ సముదాయాల విముక్తి సమస్య, వాస్తవానికి దేశంలోని దోపిడీ, పీడన, అణచివేతలతో కూడిన సామాజిక నిర్మాణం, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యూహం, భావజాలాలకు వ్యతిరేకంగా ఈ పీడిత సముదాయాలన్నీ సంఘటితంగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే పరిష్కార మవుతుంది. కానీ పరిస్థితి అలా లేదు. ఏదైనా ఒక ప్రత్యేక సముదాయం పీడనకు గురి అయినపుడు ఇతర సముదాయాలు దానికి సంఘీభావం తెలపటం ద్వారా మద్ధతుగా వుద్యమించటానికి ముందంజ వేయడం మాట అటుంచి, కనీసం సాటి పీడిత సముదాయానికి జరుగుతూన్న అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు విప్పే పనికూడా చేయడం లేదు. పీడిత సముదాయాల మధ్య ఐక్యత ఒక ప్రధానమైన అవసరం. ఈ దిశలో నిజాయితీగా జరిగిన బలమయిన ప్రయత్నం ఏదీ కనిపించదు. పీడిత ప్రజల విముక్తిని కమ్యూనిస్టు భావజాలం, వుద్యమాలు సుసాధ్యం చేయగలవనే ఆశ, నమ్మకం వుండేవి. దళితుల ప్రత్యేక పీడన విషయంలో సుదీర్ఘకాలంపాటు కమ్యూనిస్టులు ఉపేక్షవహించారు. స్త్రీల ప్రత్యేక పీడన విషయంలోనూ అంతే. తమ నాయకత్వం కాకుండా, భిన్నంగా , స్వతంత్రంగా ముందుకు వచ్చిన ప్రజా ఉద్యమాలను కమ్యూనిస్టులు పట్టించుకోలేదు. ఆ ప్రజా ఉద్యమాలకు మూలకారణమయిన సమస్యల్నీ, వాస్తవాల్నీ అసలు పట్టించుకోవలసిన అవసరమే లేదని అనుకున్నారు. ఆదివాసీలు ఉద్యమించారు. స్త్రీలు స్వేచ్ఛ కోసం పోరాడారు. దళితులు విముక్తికోసం ఉద్యమాలు చేశారు. వీటన్నింటినీ కమ్యూనిస్టులు ఉపేక్షించారు. కుల సమస్యను ఉపేక్షిస్తే సామ్యవాదం కాదుకదా, కనీస ప్రజాస్వామ్యం కూడా అమలులోకి రాదనే కఠిన వాస్తవాన్ని చూడ నిరాకరించారు. భూస్వామ్య వ్యవస్థ అవశేషంగా మిగిలిన కులం పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రవేశంతో మటుమాయం కాగలదని, సోషలిజం వస్తేచాలు, అన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారం కాగలవని నమ్మబలికారు.

కుల సమస్య విషయంలో భారత కమ్యూనిస్టుల మానసికతని అర్ధం చేసుకోవడానికి ఒక ఉదాహరణ -

1947 సెప్టెంబర్‌ 6న నాటి భారత కమ్యూనిస్టు పార్టీ అధినేత శ్రీపాద అమృత డాంగే నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం సోవియట్‌ యూనియన్‌ వెళ్ళింది. ఈ ప్రతినిధి వర్గంలో ఆంధ్రరాష్ట్రానికి చెందిన కమ్యూనిస్టు అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్యలు కూడా వున్నారు. వీళ్ళు స్టాలిన్‌, సుస్లోవ్‌, ఝడనోవ్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ చర్చల వివరాలు ʹరివల్యూషనరీ డెమోక్రసీʹ 2001 ఏప్రిల్‌ సంచికలో అచ్చయ్యాయి. 1947 సెప్టెంబర్‌ 6న జరిగిన చర్చల్లో భారతదేశంలో బలంగా వేళ్ళూనుకునివున్న కుల వ్యవస్థ గురించీ, కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించటం కోసం చేయవలసిన అత్యవసర పోరాటం గురించీ ఝడనోవ్‌ మాట్లాడుతూ ʹనిశ్శేషంగా కులవ్యవస్థను నిర్మూలించకుండా (సామ్యవాదం దిశగా) అడుగు ముందుకు వేయటం పూర్తిగా అసంభవం అని మేం అనుకుంటున్నాం, వర్గ ప్రాతిపదికన కార్మికులను సంఘటితం చేయటంలో అది అతి ప్రధానమైన ప్రతిబంధకం అవుతుంది కాబట్టి, అది కుల భావనలను పురికొల్పుతుంది. భారత సమాజంలో అత్యంత ప్రమాదకరమయిన తిరోగమన అంశం ఈ కుల వ్యవస్థ. భారత కమ్యూనిస్టుల పాలిట ఇది అత్యంత కష్టసాధ్యమయిన సమస్య అని కూడా మేం భావిస్తున్నాం. కుల వ్యవస్థను నిర్మూలించటం కోసం భారత కమ్యూనిస్టులు తమ శక్తి సామర్ధ్యాలను పరిపూర్ణంగా అమలు చేయవలసి వుంటుంది. అయితే సమీప భవిషత్తులో కుల వ్యవస్థ అంతం కాజాలదని కూడా మేం అనుకుంటున్నాం. ఈ సమస్యని గురించి సీరియస్‌గా ఆలోచించమని భారత కామ్రేడ్స్‌ని కోరుతున్నాంʹʹ అన్నాడు.

1947 నుంచీ ఇప్పటివరకూ భారత కమ్యూనిస్టు పార్టీలు కుల సమస్యని గురించి ఎంత సీరియస్‌గా ఆలోచించాయో, కుల వ్యవస్థను కూకటివేళ్ళతో పెకలించివేయటంకోసం ఎన్ని పోరాటాలు చేసాయో భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రతో పరిచయం వున్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

నిజానికి కుల నిర్మూలన విషయంలో సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ ఆలోచనలకు భారత కమ్యూనిస్టులు కాదు, దళితనేత అంబేద్కర్‌ దగ్గరగా వున్నాడు. భారతదేశంలో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రబోధిస్తున్న విప్లవం విజయవంతం కావాలంటే ముందు ఆచరణలో అంబేద్కర్‌ కుల నిర్మూలన ప్రణాళికను విజయవంతం చేయాలి. సామాజిక పీడనని ఒక రాజకీయ సమస్యగా ప్రజల ముందుకు తీసుకురావటం అనేది కమ్యూనిస్టులు ఏనాడూ చేసి ఎరగరు.

సాంస్కృతిక సమస్యల్ని సామాజిక సమస్యలతోనూ, సామాజిక సమస్యల్ని రాజకీయ సమస్యలతోనూ అనుసంధానం చేయటం ద్వారా దేశంలోని పీడిత ప్రజాసముదాయాల విముక్తి మార్గంలో అడుగు ముందుకు వేసే అవకాశం వుంటుంది.

ప్రస్తుతం మన సమాజం ఖండఖండాలుగా విభజితమై వుంది. దళితులు తమ పోరాటంలో ముస్లింలతో మమేకం కారు. దళితులు, ముస్లింలు, ఆదివాసీలను గురించి ఆలోచించరు. ఈ మూడు సముదాయాలు శ్రామికుల వినాశనం గురించి ఆలోచించరు. ఏ సముదాయానికి ఆ సముదాయం విడివిడిగా విచ్ఛిన్న దశలో వెదజల్లబడి వుంది. పీడిత జనసముదాయాల విముక్తి సమస్య వాస్తవానికి ఒక మానవీయమైన సమస్య. ఒక ప్రజాస్వామిక సమస్య. ఈ దృష్టిలో ఆలోచించి, పనిచేసినపుడే పీడిత సముదాయాల విముక్తి దిశగా మనం అడుగుముందుకు వేయవచ్చు.

మరో విషయం...

మార్క్సిస్టులు మార్క్స్‌ ఆలోచనలకు ఇచ్చినంత ప్రాధాన్యం ఆయన ఆచరణకీ, వ్యక్తిత్వానికీ ఇవ్వరనేది కూడా ఒక వాస్తవం. గ్రీకు దేవగణంలో ప్రొమీధియస్‌ కారల్‌ మార్క్స్‌కు ఆదర్శం. ప్రొమీధియస్‌ని గొప్ప సాధువుగానే కాక, అమరత్వాన్ని సాధించిన ధీరుడుగా కూడా మార్క్స్‌ ప్రశంసించాడు. మానవజాతికోసం ప్రొమీధియస్‌ దేవతలనుంచి అగ్నిని అపహరిస్తాడు. దీంతో దేవరాజు జీయస్‌ కఠిన శిక్ష విధిస్తాడు. ప్రొమీధియస్‌ని ఒక బండరాతికేసి కట్టేస్తారు. రాబందులు అతని ఛాతీని పొడుచుకొని తింటూంటాయి. ఇదీ శిక్ష. బతికివున్న కాలంలో మార్క్స్‌ను ప్రొమీధియస్‌గా అనేకమంది అభివర్ణించారు. యువకుడుగా వున్నప్పుడు మార్క్స్‌ సంపాదకత్వం వహించిన ఒక పత్రికపై నిషేధం విధించారు. నిషేధం అనంతరం ఒక కార్టూన్‌ అచ్చయింది. అందులో ప్రొమీధియస్‌ వేషధారణలో మార్క్స్‌ ఫ్రింటింగ్‌ మిషన్‌కి కట్టివేయబడి వుంటాడు. ప్రభుత్వం అనే రాబందు అతని ఛాతీని పొడుచుకుని తింటూవుంటుంది. తాను ఫాదర్‌ జీయస్‌కు ప్రేమపాత్రుడయిన కుమారుడుగా కన్నా, బండరాతికి కట్టివేయబడి వుండడాన్నే ఎక్కువ ఇష్టపడతానని మార్క్స్‌ ఒక కవితలో చెప్పుకున్నాడు. అయితే, మార్క్స్‌కి వారసులమని చెప్పుకుంటూన్నవారిలో విప్లవభావాలు- శత్రువుల దాడివల్ల కాదు, అనుయాయుల అవకాశవాద ధోరణుల వల్ల మరణిస్తున్నాయనేది ఒక విషాదకరమైన వాస్తవం. బౌద్ధం విషయంలోనూ ఇదే జరిగింది. జర్మన్‌ కవి హన్స్‌ మాగ్నూస్‌ అయిజెన్‌వర్గర్‌ ʹకారల్‌మార్క్స్‌ʹ శీర్షికతో ఒక కవిత రాశాడు.

నేను గమనిస్తున్నాను

నిజంగా నీ అనుయాయులు

నిన్ను మోసం చేశారు

నీ శత్రువులు మాత్రం

అప్పుడు ఎలా వున్నారో

ఇప్పటికీ అలానే ఉన్నారు

దళిత రచయితలలోనూ, మేధావులలోనూ ఈ ధోరణి ప్రబలంగా కనిపిస్తుందనటం అబద్ధం కాదు. అంబేద్కర్‌ ఒక రాడికల్‌ మేధావి. కుల నిర్మూలన ఆయన ప్రధాన లక్ష్యం. కులమనే ఒక మహమ్మారి తాలూకు రోగ లక్షణం అంటరానితనం. కులానికి అనేక పార్శ్వాలున్నాయి. కులానికి తనదైన రాజకీయ పార్శ్వం వుంది. ఆర్ధిక పార్శ్వం వుంది. సామాజిక పార్శ్వం వుంది. సాంస్కృతిక పార్శ్వం కూడా వుంది. అంటరాని తనం కేవలం సామాజిక పార్శ్వానికి సంబంధించిన ఒక అంశం. కాబట్టి ఒక్క అంటరానితనాన్ని అంతం చేసినంత మాత్రాన భీషణమయిన కుల సమస్యకి పరిష్కారం లభించదు. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని స్థాయిల్లోనూ సుసంఘటితమయిన పోరాటం ద్వారా మాత్రమే కుల నిర్మూలన సాధ్యమవుతుంది. అంబేద్కర్‌ కుల నిర్మూలన అనే అంతిమ లక్ష్య సాధనలో భాగంగానే అంటరాని తనాన్ని ప్రస్తావించేవారు తప్ప, అంటరానితనం పోతే కులం పోతుందనే భ్రమ ఆయనకు ఎప్పుడూ లేదు. కులాలు ఉనికిలో వున్నంత కాలం కుల విద్వేషాలు కూడా ఉనికిలో వుంటాయి. అధికారంలోకి రావటం కోసం ఆశించే పీడిత కులాల సమీకరణలను ఒక తాత్కాలిక రాజకీయ వ్యూహంగా కాక అంబేద్కర్‌ ఆలోచనా విధానంలో అంతర్భాగం అనుకోవటం కేవలం దివాళకోరుతనం తప్ప మరొకటి కాదు. కుల నిర్మూలన అనేది ఈనాడు చాలామంది దళిత రచయితలు, మేధావుల ఎజెండా కాదు. దళితుల ఆత్మగౌరవ పోరాటం నూటికి నూరుపాళ్ళూ అభిలషణీయమయిందేగానీ కుల నిర్మూలనకి అది ప్రత్యామ్నాయం అనుకోవటం ఎంత మాత్రం వాంఛనీయం కాదు. ప్రత్యేకించి ఈ లక్ష్యసాధనకోసం ʹకుల నిర్మూలనా పోరాట సమితిʹ (కె.యన్‌.పి.యస్‌.) వంటి సంస్థలు వునికిలోకి రావటం హర్షించదగిన పరిణామం.

అదీగాక మధ్యతరగతి మనస్తత్వం అటు మార్క్సిస్టుల్నీ, ఇటు అంబేద్కరిస్టుల్నీ దార్శనికంగా నిర్వీర్యుల్ని చేస్తున్నదనేది సయితం గుర్తించదగిన ఒక వాస్తవం. మహిళల విషయంలో కూడా ఈ వాస్తవం వర్తిస్తుంది.

ʹనిషిధʹ నవల పీడిత జనసముదాయాల మధ్య ఐక్యతని ప్రతిపాదిస్తుంది.

ఒక స్పష్టమయిన భావజాలం, ఒక నిర్దిష్టమైన రాజకీయ నిర్మాణం పట్ల పూర్తి నిబద్దతకల రచయిత్రి రుక్మిణి, తాను తన రచన ద్వారా అభివ్యక్తం చేయదలచిన అంశాలతో పాటు, ఈ రచన రచయిత్రి ప్రమేయానికి అతీతంగా కూడా కొన్ని అంశాలను పాఠక ప్రపంచం ముందు ప్రదర్శించింది. తాత్వికంగా అదే ʹనిషిధʹ నవల నిజమైన రూపం. ఆ మేరకు రచన అంతిమ రూపం రచయిత్రి ఆకాంక్షలపై ఎగరేసిన విజయ పతాకం. అంతేకాదు, మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచనా విధానం భారతదేశంలో కుల సమస్య పరిష్కారం కోసం అంబేద్కర్‌ ఆలోచనా విధానంతో మమేకం అయే ప్రయత్నంలో ఉందనటానికి ʹనిషిధʹ నవల ఒక తార్కాణం.

భారత దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో దళిత జీవితాన్ని ప్రతిబింబించిన నవలలు ఏవీ వ్యక్తి (హీరో) కేంద్రకాలు కావు, అన్నింటిలోనూ మొత్తంగా దళిత సమాజమే కేంద్రంగా వుంటుంది. నల్లూరి రుక్మిణి ʹనిషిధʹ నవల కూడా దళిత సమాజ కేంద్రకమే. ఈ నవలలో కథానాయిక, కథానాయకుడు అంటూ ఎవరూ లేరు. పుట్టుక రీత్యా దళితులు సృష్టించినదే నూటికి నూరుపాళ్ళూ దళిత సాహిత్యం కాగలదనే వాదన ముమ్మాటికీ నిజమే అయినప్పటికీ, దళితేతరురాలు, విప్లవ రచయితల సంఘం సభ్యురాలు రుక్మిణి రచన ʹనిషిధʹ విప్లవ సాహిత్యంలోనే కాదు, దళిత సాహిత్యంలోనూ నిస్సందేహంగా అంతర్భాగం. ఆరుమాసాలు కలిసివుంటే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టు ఈ 350 పుటల పుస్తకం పూర్తిగా చదివేసరికి అల్లూరు గ్రామం పాఠకుడి అంతరంగంలో భాగమవుతుంది. పాఠకుడు గ్రామనివాసి గాకపోయినా అల్లూరు ప్రవాసిగా మాత్రం తప్పనిసరిగా మారిపోతాడు. ఆఖరి పేజీ ముగించి అలా కళ్ళు మూసుకుంటే పాఠకుడి మనోఫలకం మీద దృశ్యరూపంలో ʹనిషిధʹ నవల ప్రదర్శన ప్రారంభమవుతుంది.No. of visitors : 866
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...

  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •