భారతదేశంపై వసంతమేఘం గర్జించింది. డార్జిలింగు ప్రాంతంలోని విప్లవ రైతాంగం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. భారత కమ్యూనిస్టు పార్టీలోని ఒక విప్లవ గ్రూపు నాయకత్వంలో భారతదేశంలోని ఒక ఎర్ర ప్రాంతంలో గ్రామీణ విప్లవ సాయుధ పోరాటం ప్రారంభమయింది. భారత ప్రజల విప్లవ పోరాటంలో ఇది బ్రహ్మాండమైన ప్రాధాన్యతను సంతరించుకొన్న అభివృద్ధి.
కొద్ది నెలల క్రితం ఈ ప్రాంతానికి చెందిన రైతాంగ ప్రజలు భారత కమ్యూనిస్టు పార్టీలోని ఒక విప్లవ గ్రూపు నాయకత్వంలో ఆధునిక రివిజనిస్టు సంకెళ్ళను ఛేదించుకున్నారు. తమను కట్టిపడవేసిన బంధనాలను తుత్తునియలు చేశారు. వాళ్ళు భూస్వాముల నుండి, టీ తోటల యజమానుల నుండి ధాన్యాన్ని, భూమిని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక నియంతలను, దుర్మార్గులైన కులీనులను శిక్షించారు. తమను అణచివేయడానికి వచ్చిన అభివృద్ధి నిరోధక సైన్యాన్ని, పోలీసుల్ని మాటువేసి చంపారు. ఈ విధంగా రైతాంగ సాయుధ విప్లవ పోరాటపు బ్రహ్మాండమైన శక్తిని చాటి చెప్పారు. శత్రువుల్ని మట్టి కరిపించాలని కృతనిశ్చయంతో వున్న విప్లవ రైతాంగం దృష్టిలో సామ్రాజ్యవాదులు, రివిజనిస్టులు, అవినీతి అధికారులు, స్థానిక నియంతలు, దుర్మార్గులైన కులీనులు, అభివృద్ధి నిరోధక సైన్యం, పోలీసులు ఎందుకూ కొరగాకుండా పోయారు. భారత కమ్యూనిస్టు పార్టీలోని విప్లవ గ్రూపు ఖచ్చితంగా సరియైన పని చేసింది. చేసిన పని చక్కగా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న మార్క్సిస్టు - లెనినిస్టులు, విప్లవ ప్రజానీకం, ఎలా సంతోషిస్తారో ఆ విధంగా చైనా ప్రజలు కూడా డార్జిలింగ్ప్రాంతంలోని భారత రైతాంగం సృష్టించిన విప్లవ తుఫానుకు సంతోషంతో జేజేలు పలికారు.
అభివృద్ధి నిరోధక కాంగ్రెసు పాలన ప్రజలకు ఏ ప్రత్యామ్నాయాన్నీ మిగల్చలేదు. అందుచేత భారత రైతాంగం తిరగబడటం. భారత ప్రజలు విప్లవాన్ని విజయవంతం చేయడం ఖాయం. కాంగ్రెసు పాలన భారతదేశానికి నామమాత్రపు స్వాతంత్రాన్ని మాత్రమే మిగిల్చింది. నిజానికి అది అర్థవలస, అర్థ భూస్వామ్య దేశమే కాని, స్వతంత్ర దేశం కాదు. కాంగ్రెసు పాలన భూస్వామ్య ప్రభువుల, బడా భూస్వాముల, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతరంగికంగా అది భారత ప్రజల రక్తాన్ని పీల్చి, నిర్భయంగా వాళ్ళని అణచివేస్తోంది. అంతర్జాతీయంగా తన పాత యజమాని బ్రిటన్‌తో పాటు, కొత్త యజమాని అమెరికా సామ్రాజ్యవాదానికి, దాని మొదటి తోడుదొంగ సోవియట్రివిజనిస్టు పాలకముఠాకు సేవ చేస్తున్నది. ఈ విధంగా దేశ ప్రయోజనాలను పెద్ద ఎత్తున తాకట్టు పెడుతోంది. అందుచేత భారత ప్రజల, ప్రధానంగా కార్మిక, రైతాంగ, శ్రమజీవుల వీపులపై - సామ్రాజ్యవాదం, సోవియట్రివిజనిజం, భూస్వామ్యం, దళారీ నిరంకుశ పెట్టుబడి- అనే నాలుగు పర్వతాలు వున్నాయి.
కాంగ్రెసు పాలన భారత ప్రజలపై దోపిడీని, పీడనను తీవ్రతరం చేసింది. గత కొద్ది సంవత్సరాలుగా జాతివిద్రోహ విధానాలను అవలంబించింది. ప్రతి సంవత్సరం కరువు రక్కసి దేశాన్ని వెన్నాడుతూంది. ఆకలి చావులకు గురైన ప్రజల మృతదేహాలు పొలాలన్నిటా చెల్లాచెదురుగా పడి వున్నాయి. భారత ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి జీవించడమే దుస్సాధ్యమై పోయింది. డార్జిలింగు ప్రాంతంలోని విప్లవ రైతాంగం ఇప్పుడు తిరుగుబాటును, హింసాయుత విప్లవాన్ని ప్రారంభించింది. ఇది దేశవ్యాప్తంగా వున్న కోట్లాది మంది ప్రజలు చేయబోయే హింసాయుత విప్లవానికి నాంది మాత్రమే. భారత ప్రజలు తమ వీపులపై స్వారీ చేస్తున్న ఈ నాలుగు పర్వతాలను వదుల్చుకొని పూర్తి విముక్తిని సాధించడం తప్పనిసరి. ఇది భారత చరిత్ర సాధారణ ధోరణి. భూమి మీద ఏ శక్తీ దీన్ని నిరోధించలేదు.
భారత విప్లవం ఏ మార్గంలో ప్రయాణించాలి? ఇది భారత విప్లవ విజయాన్నీ, 50 కోట్ల మంది భారత ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే మౌలిక ప్రశ్న. రైతాంగం మీద ఆధారపడి, గ్రామీణ ప్రాంతాలలో స్థావర ప్రాంతాల నిర్మాణం చేసి, దీర్ఘకాలిక సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూ, గ్రామీణ ప్రాంతాల నుండి చుట్టుముట్టి చివరకు పట్టణాలను స్వాధీనం చేసుకోవడం అనే మార్గంలోనే భారతవిప్లవం తప్పనిసరిగా ప్రయాణించాల్సి వుంది. ఇది మావో పంథా, చైనా విప్లవాన్ని విజయపథంలో నడిపించిన పంథా. పీడిత జాతుల, ప్రజల అందరి విప్లవ విజయాలకు ఏకైక బాట.
మన గొప్ప నాయకుడైన ఛైర్మన్మావో 40 సంవత్సరాల క్రితమే ఇలా సూచించారు. ʹʹచైనాలోని మధ్య, దక్షిణ, ఉత్తర ప్రాంతాలలోని కోట్లాది మంది రైతులు ఒక తుఫానులా ఉప్పెనలా విజృంభిస్తారు. అది ఎంత శక్తివంతంగా, హింసాత్మకంగా వుంటుందంటే ఏ ఇతర శక్తీ అదెంత గొప్పదైనా సరే దాన్ని నిలువరించలేదు. వాళ్ళు తమను కట్టిపడవేసిన బంధనాలన్నింటినీ తుత్తునియలు చేస్తారు. విముక్తి మార్గంలో వురకలు వేస్తూ సాగిపోతారు. సామ్రాజ్యవాదుల్ని, యుద్ధ ప్రభువుల్ని, అవినీతి అధికారుల్ని, స్థానిక నియంతలని, దుర్మార్గపు కులీనుల్ని, సమాధుల్లో పూడ్చి పెడతారు.ʹʹ
ప్రజల విప్లవంలో రైతాంగ సమస్య అత్యంత ప్రాధాన్యత గల అంశంగా వుంటుందని ఛైర్మన్మావో ఏనాడో స్పష్టంగా చెప్పారు. సామ్రాజ్యవాదానికీ, వాళ్ళ తొత్తులకు వ్యతిరేకంగా జరిగే జాతీయ ప్రజాస్వామ్య విప్లవంలో రైతాంగం ప్రధాన శక్తిగా వుంటుంది. వాళ్ళు కార్మికవర్గానికి అసంఖ్యాకమైన, అత్యంత విశ్వసనీయమైన మిత్రులు. భారతదేశం 50 కోట్ల మంది ప్రజలతో కూడిన విశాలమైన అర్థ వలస అర్థ భూస్వామ్య దేశం. వారిలో అత్యధికులు రైతాంగం. వాళ్ళు ఒక్కసారి చైతన్యవంతమైతే, భారత విప్లవానికి అజేయమైన శక్తిగా మారతారు. రైతాంగంతో మిళితం కావడం ద్వారా భారత శ్రామికవర్గం దేశంలోని విశాలమైన గ్రామీణ ప్రాంతాల రూపురేఖల్ని మార్చివేయగలుగుతుంది. భయంకరంగా జరిగే ప్రజాయుద్ధంలో ఎంతటి శక్తి గల శత్రువునైనా ఓడిస్తుంది.
మన గొప్ప నాయకుడైన ఛైర్మన్మాలో ఇలా అన్నారు. ʹʹసాయుధ శక్తి ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం, యుద్ధం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడం విప్లవానికి కేంద్ర కర్తవ్యం, మరియు అత్యున్నత రూపం. మార్క్సిస్టు - లెనినిస్టు విప్లవ సిద్ధాంతం చైనా తదితర దేశాలతో సహా ప్రపంచానికంతటికీ అన్వయిస్తుంది.
సాయుధ ప్రతీఘాతుక విప్లవానికి వ్యతిరేకంగా సాయుధ విప్లవ పోరాటం అనేది చైనా విప్లవంలో వలె భారత విప్లవానికి కూడా ప్రత్యేక లక్షణం. భారత విప్లవానికి సాయుధ పోరాటం ఒక్కటే సరియైన మార్గం. ఇంక ఏ ఇతర మార్గమూ లేదు. ʹʹగాంధేయవాదంʹʹ ʹʹపార్లమెంటరీ పంథాʹʹ వంటి చెత్త అంతా భారత ప్రజల్ని నిర్వీర్యుల్ని చెయ్యడం కోసం పాలక వర్గాలు ప్రయోగించే నల్లమందు లాంటిది. హింసాయుత విప్లవం మీద ఆధారపడి, సాయుధ పోరాట మార్గంలో ప్రయాణించినపుడు భారతదేశం రక్షింపబడుతుంది. భారత ప్రజలు సంపూర్ణ విముక్తిని పొందుతారు. దీన్ని గురించి ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే రైతాంగాన్ని ధైర్యంగా చైతన్యవంతుల్ని చేసి అభివృద్ధి పరచడం, మావో స్వయంగా రూపొందించిన పరిస్థితుల కనుగుణమైన ప్రజా యుద్ధ వ్యూహాన్ని, ఎత్తుగడలను అవలంబించి, తాత్కాలికంగా విప్లవ శక్తుల కంటే బలంగా వున్న, సామ్రాజ్యవాదుల, అభివృద్ధి నిరోధకుల సాయుధ పోరాటాన్ని అవిశ్రాంతంగా కొనసాగించడం, క్రమక్రమంగా విప్లవాన్ని విజయవంతం చేయడంగా వుంటుంది.
చైనా విప్లవ లక్షణాల వెలుగులో ఛైర్మన్మావో గ్రామణ ప్రాంతాలలో విప్లవ స్ధావరాల ఏర్పాటు ఆవశ్యకతను సూచించారు. ఆయన ఇలా అన్నారు, ʹʹదీర్ఘకాలిక సాయుధ పోరాటాన్ని అవిశ్రాంతంగా కొనసాగించాలంటే, సామ్రాజ్యవాదాన్ని, దాని తొత్తులను ఓడించాలంటే విప్లవ శ్రేణులు వెనుకబడ్డ గ్రామాలను అభివృద్ధి చెందిన గ్రామాలుగా, సంఘటితమైన స్థావర ప్రాంతాలుగా, బలమైన, సైనిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విప్లవ దుర్గాలుగా మార్చక తప్పదు. పట్టణాల నుపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల మీద దాడులు చేస్తున్న దుర్మార్గులైన శత్రువులతో ఆ దుర్గాల నుండి పోరాడాలి. ఈ విధంగా దీర్ఘకాలిక పోరాటం ద్వారా క్రమక్రమంగా సంపూర్ణ విప్లవ విజయాన్ని సాధించాలిʹʹ.
భారతదేశం భౌగోళికంగా విస్తారమైనది. అభివృద్ధి నిరోధకులు గ్రామీణ ప్రాంతాలలో బలహీనులుగా వున్నారు. విప్లవకారులు తమ ఎత్తుగడలను స్వేచ్ఛగా అమలుపరచడానికి అవి అనుకూలంగా వుంటాయి. భారత శ్రామిక వర్గ విప్లవకారులు మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచనా విధానపు విప్లవ పంథాకు కట్టబడి తమ గొప్ప మిత్రుడైన రైతాంగం పై ఆధారపడి వున్నంతకాలం, ఒకదాని తర్వాత మరొక గ్రామీణ విప్లవ స్థావరాలను ఏర్పాటు చేయడం, నూతన తరహా ప్రజా సైన్యాన్ని నిర్మాణం చేయడం పూర్తిగా సాధ్యపడుతుంది. అలాంటి విప్లవ స్థావర ప్రాంతాలను నిర్మించడంలో భారత విప్లవకారులకు ఎన్ని కష్టాలు, ఆటుపోట్లు ఎదురయినప్పటికీ, ప్రారంభంలో విడివిడిగా వున్న చిన్న స్థావర ప్రాంతాలను అలలు అలలుగా విస్తారమైన ప్రాంతాలుగా అభివృద్ధి చేయగలుగుతారు. ఈ విధంగా క్రమంగా పట్టణాలను గ్రామాలు చుట్టుముట్టే స్థితికి భారత విప్లవం చేరుకుంటుంది. నగరాలను, పట్టణాలను శాశ్వతంగా స్వాధీనం చేసుకొని, దేశవ్యాప్త విజయాన్ని సాధించే మార్గం సుగమమవుతుంది.
డార్జిలింగులో ప్రారంభమయిన గ్రామీణ సాయుధ పోరాటం భారత అభివృద్ధి నిరోధకులకు భయోత్పాతాన్ని కలిగించింది. తమకు కలగబోయే విపత్తును వాళ్ళు పసిగట్టారు. డార్జిలింగు రైతుల తిరుగుబాటు ʹʹజాతీయ విపత్తుగా తయారవుతుందనిʹʹ వాళ్ళు గగ్గోలు పెట్టారు. డార్జిలింగు రైతుల సాయుధ తిరుగుబాటుని అణిచివేయడానికి, మొగ్గలోనే తుంచి వేయడానికి, సామ్రాజ్యవాదం, భారత అభివృద్ధి నిరోధకులు వెయ్యిన్నొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. డాంగే రెనగేడ్ముఠా, భారత కమ్యూనిస్టు పార్టీలోని రివిజనిస్టు అధినాయకులు - భారత కమ్యూనిస్టు విప్లవకారులపైనా, డార్జిలింగు విప్లవ రైతాంగం పైనా, వాళ్ళు సాధించిన ఘన విజయాల పైనా, శక్తి వంచన లేకుండా నిందా ప్రచారం చేస్తూ దాడి చేస్తున్నారు. డార్జిలింగు విప్లవ రైతాంగాన్ని రక్తపాతంతో అణచివేయడంలో అభివృద్ధి నిరోధక భారత ప్రభుత్వానికి, పశ్చిమ బెంగాల్‌లోని ʹʹకాంగ్రెసేతరʹʹ ప్రభుత్వంగా చెప్పబడుతున్న ప్రభుత్వం బహిరంగంగా మద్ధతునిస్తోంది. ఈ రెనగేడ్లు, రివిజనిస్టులు అమెరికన్సామ్రాజ్యవాదానికి, సోవియట్రివిజనిజానికి కావలి కుక్కలనీ, భారత బడా భూస్వాములకు, బూర్జువాలకు తొత్తులనీ, మరోసారి సాక్ష్యాధారాలతో రుజువవుతూంది. వాళ్ళు ʹʹకాంగ్రెసేతర ప్రభుత్వంʹʹ అని దేన్నైతే పిలుస్తున్నారో ఆ ప్రభుత్వం భూస్వాముల, బూర్జువాల చేతుల్లో పనిముట్టు మాత్రమే.
విద్రోహానికి, అణచివేతకు సామ్రాజ్యవాదులు, భారత అభివృద్ధి నిరోధకులు, ఆధునిక రివిజనిస్టులు పరస్పరం ఎంత బాగా సహకరించుకుంటున్నప్పటికీ, భారత కమ్యూనిస్టు విప్లవకారులు, రైతాంగ విప్లవకారులు డార్జిలింగులో రగిలించిన సాయుధ పోరాట జ్వాల ఆరిపోదు. ఒక నిప్పురవ్వ దావాగ్నిని రగిలిస్తుంది. డార్జిలింగులోని నిప్పురవ్వ దావాగ్నిని రగిలించి దేశవ్యాప్తంగా పోరాట జ్వాలలను ప్రసరింపజేయడం ఖాయం. ఈ సాయుధ పోరాట విప్లవ తుఫాను ఆసేతు హిమాచల పర్యంతం దేశాన్నంతటినీ ముంచెత్తడం ఖాయం. భారత విప్లవ పోరాట క్రమం సుదీర్ఘమైనదీ, అష్ట కష్టాలతో కూడుకున్నదీ అయినప్పటికీ, మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచనా విధానం వెలుగులో పయనిస్తున్న భారత విప్లవం విజయాన్ని సాధించి తీరుతుంది.
Type in English and Press Space to Convert in Telugu |
నక్సల్బరీయే పీడిత ప్రజల విముక్తి పంథాశ్రీకాకుళం గిరిజన పోరాటం, సిరిసిల్ల - జగిత్యాల పోరాటాలు, గోదారిలోయ ప్రతిఘటనోద్యమం, ఇంద్రవెల్లి ఆదివాసి ఉద్యమం నుండి గోదావరి దాటి విస్తరించిన దండకారణ్య..... |
భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు : విజయాలు-సవాళ్లు యాభై ఏళ్లలో సాధించిన విప్లవోద్యమ పురోగతిని, విజయాలను, సమాజంలోని అన్ని జీవన రంగాలపై నక్సల్బరీ వేసిన ప్రభావాలనేగాక అంతిమ విజయం దిశగా సాగవలసిన నక్సల్బరీకి ఎద... |
Naxalbari Politics: A Feminist Narrativehose were terrible days. Like most others in the movement, I had no shelter and was staying anywhere and everywhere. I was toying with the idea of quitting ... |
All India Seminar on The Impact of Naxalbari on Indian SocietyRevolution is really a splendid concept. Itʹs a great confidence. Itʹs a great dream that will not die in the eyes even when the head is severed. Thatʹs why... |
The Impact of Naxalbari on Indian Society, Its Achievements and ChallengesNaxalbari made an indelible impact not only on the revolutionary movement in the
country but also has a tremendous influence on the social relations, emanci... |
చారిత్రాత్మక మే 25, 1967ఇది నక్సల్బరీకి యాభైవ వసంతం. భారత - నేపాల్సరిహద్దుకు సమాంతరంగా ప్రవహిస్తున్న మేచీ నదీప్రాతంలో ప్రారంభమైన అనన్య సామాన్యమైన ఆ పోరాటానికీ, దాని నిర్మాతలకూ....... |
భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావం (అఖిల భారత సదస్సు)9, 10 సెప్టెంబర్ 2017 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ʹభారత సమాజంపై నక్సల్బరీ ప్రభావం : విజయాలు - సవాళ్లుʹ విరసం అఖిల భారత సదస్సు ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..... |
Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |