చారిత్రాత్మక మే 25, 1967

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

చారిత్రాత్మక మే 25, 1967

- ఫరూక్‌చౌధురి | 23.08.2017 03:09:11pm

నక్సల్బరీ ఇప్పటికీ సజీవంగానే వుంది. యాభై సంవత్సరాలు గడిచిన తరవాత కూడా ఆ పోరాటం అరుణవర్ణపు సూరీడులా ప్రకాశిస్తూనే వున్నది. నక్సల్బరీ ప్రజారాజకీయాలలో జీవించే వున్నది. అంతులేని అధికారాన్ని కలిగివున్న ఆధిపత్యవర్గాల రాజకీయాలు, ఇన్ని సంవత్సరాలు గడిచిన తరవాత కూడా నక్సల్బరీని పట్టించుకోక తప్పడంలేదు. ఇప్పుడు రాజకీయాలంటేనే నక్సల్బరీ. ప్రజాపోరాటాల చిత్రపటం నుండి నక్సల్బరీని చెరిపివేయడంలో ఆధిపత్యవర్గాలు విఫలమయ్యాయి.

ఇది నక్సల్బరీకి యాభైవ వసంతం. భారత - నేపాల్‌సరిహద్దుకు సమాంతరంగా ప్రవహిస్తున్న మేచీ నదీప్రాతంలో ప్రారంభమైన అనన్య సామాన్యమైన ఆ పోరాటానికీ, దాని నిర్మాతలకూ, ఆర్గనైజర్లకూ, పోరాటవీరులకూ, అమరులకూ (వీళ్ళల్లో చాలామంది జైళ్ళలో హత్యచేయబడినవారు) పేదరైతాంగానికీ, కార్మికులకూ, యువతకూ, విద్యార్థులకూ, మేధావులకూ జోహార్లు చెప్పవలసిన సమయం ఇది. వీళ్ళందరూ వర్గ పంధాను ఎత్తిపట్టి, దోపిడీకి గురవుతున్న ప్రజలపక్షాన అత్యున్నతమైన త్యాగాలు చేసినవాళ్ళు. 1967 మే 25న నక్సల్బరీ ప్రాంతంలో ఒక ప్రజాసమూహంపై పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురు గ్రామీణ పేద మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలతో సహా తొమ్మిది మందిని అమానుషంగా హత్యచేశారు. ఇలాంటి అమరుల సంఖ్య అసంఖ్యాకం (ʹʹకామ్రేడ్‌అమరులారా! మీరంతా మా జ్ఞాపకాలలో సజీవంగానే వున్నారు.ʹʹ ఒక బెంగాలీ ప్రజా గేయం నుండి)

నక్సల్బరీకి సంబంధించి అనేక రాజకీయ విబేధాలున్నాయి. అవి ఇంకా కొనసాగుతాయి కూడా. మరింత తీవ్రంగా కూడా కొనసాగుతాయి. మార్పును కోరే బలమైన ఉత్సుకత ఉన్న సమాజంలో ప్రజాపోరాటాలు సజీవంగా వున్నాయనటానికి అదే నిదర్శనం. క్రమ క్రమంగా క్షీణించిపోతున్న ఉద్యమాలను గురించి సజీవమైన చర్చలుండవు. కాని నక్సల్బరీ ఇప్పటికీ శక్తివంతమైన చర్చను సృష్టిస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులందరూ - వాళ్ళలో చాలామంది కాల్చి చంపబడ్డారు - ఇప్పటికీ చర్చను సృష్టిస్తూనే వున్నారు. నక్సల్బరీ కొద్దిమందిలో ఎంతటి ద్వేషాన్ని సృష్టిస్తున్నదో, అంతకంటే ఎక్కువ ప్రేమను అనేకమందిలో పొందుతోంది. ఇది వర్గ వైఖరుల సజీవ చిహ్నం.

సమాజాన్ని, ఆస్తి సంబంధాల్ని, అణచివేతకు, దోపిడికీ గురవుతున్న పేద ప్రజలస్థితిని మౌలికంగా మార్చటానికి జరుగుతున్న ప్రజల ప్రయాణంలో నక్సల్బరీ ఒక భాగం. అది ఉన్నతమైన, మానవీయమైన ఆశయం. ఆస్తిపరవర్గాలు, వాటి పాత్ర, వాటి రాజకీయ అధికారానికి సంబంధించిన అంశాలలో దానికి ఎప్పుడూ అస్పస్టత లేదు. దోపిడీకి గురవుతున్న ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడడానికి అది ఎన్నడూ ప్రయత్నించలేదు. దోపిడీ వర్గాలతో రాజీపడలేదు, వాటిని సంతృప్తి పరచలేదు. నక్సల్బరీ చేసిన త్యాగం, దోపిడీకి గురవుతున్న ప్రజలను కాపాడడానికి అది అనుసరించిన సాహసోపేతమైన, గౌరవప్రదమైన వైఖరికి సాక్ష్యం. వ్యూహానికి సంబంధించిన, ఎత్తుగడలకు సంబంధించిన తప్పులుగాని, లోపాలుగాని, ప్రజలు చేసే రాజకీయ పోరాటాలలో నక్సల్బరీ నిర్వహించిన పాత్రను గానీ, ప్రాధాన్యతనుగానీ వమ్ము చేయలేవు. ఈ లోపాలను, పొరపాట్లను మాత్రమే ఖండించడం ద్వారా నక్సల్బరీ చొరవను కించపరచటానికి ప్రయత్నించే శక్తులు ఎన్నటికీ సఫలం కాలేవు. ఏ రాజకీయ చొరవనైనా అంచనా వేయడానికి అది ప్రారంభమైననాటి దృక్పధాన్ని, ఆ దశలో జరిగిన లోపాల్ని, తప్పుల్ని అర్థం చేసుకోవటమనే వైఖరి వాళ్ళకు లేదు.

నక్సల్బరీ ప్రజల ఆశయాలకు వ్యక్తీకరణ. దేశ రాజకీయ ఎజెండాలో తమ ఎజెండాను ప్రవేశపెట్టేటట్లు దోపిడీకి గురవుతున్న ప్రజలను అది ఉత్తేజపరిచింది. ఈ ఉపఖండంలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి పని ఇంత శక్తివంతంగా జరగలేదు. పీడితులైన ప్రజల సమస్య ఇంత శక్తివంతంగా ఇంతకుముందెపుడూ చర్చలోకి రాలేదు. ఈ విప్లవాత్మక చొరవను అణచివేయడానికి అమలు చేయబడిన హింస, ఆ చొరవకున్న శక్తిని అంచనా వేయడానికి ఒక సూచిక.

ʹʹవలసానంతర భారతదేశంలో మారుతున్న, నూతన అధికార రాజకీయాల గురించిన అత్యంత విమర్శనాత్మకమైన ప్రశ్నలు కేవలం గత దశాబ్దంలో (1970లలో మాత్రమే) సంధించబడ్డాయి. నక్సల్బరీకి సైద్ధాంతిక అనుభరాహిత్యం, ఎత్తుగడల పరంగా దుందుడుకు తనం ఉన్నప్పటికీ, భారత ప్రజల సామాజిక చైతన్యంమీదా, ముఖ్యంగా రాజకీయ వ్యక్తీకరణ కలిగిన నాయకత్వపు సెక్షన్లపైనా నక్సల్బరీ ఈ ప్రశ్నలను బలంగా వేసి సవాల్‌విసిరింది.ʹʹ (ప్రమోద్‌సేన్‌గుప్తా రాసిన ʹʹనక్సల్బరీ - భారతవిప్లవంʹʹ అనే పుస్తకానికి జూన్‌2, 1982న పార్ధా ఛటర్జీ ʹముందుమాటనుండిʹ. ఈ పుస్తకాన్ని రీసెర్చ్‌ఇండియా పబ్లికేషన్స్‌కలకత్తా వారు 1983లో ప్రచురించారు) ʹʹవ్యవస్థీకృత అధికారంపైనా, వ్యవస్థల పైనా జరిగే దాడికి ʹనక్సలైట్‌ʹ అనే పదం ప్రతీకగా కొనసాగుతుంది.ʹʹ (సుమంతా బెనర్జీ, ʹʹనక్సల్బరీ వెలుగులోʹʹ సువర్ణరేఖ, కలకత్తా, 1980).

సమాజంలో నెలకొన్న పరిస్థితులకు - అంటే - దాని ఆర్థిక స్థితి, ఆర్థిక వ్యవస్థ నుండి వచ్చే లాభాలన్నింటినీ పాశవికంగా అనుభవిస్తూన్న వర్గాలు, మెజారిటీ ప్రజలకు కనీసపు ఊరటను అందించటంలో ఆధిపత్యవర్గాల వైఫల్యం, పీడనకు గురైన ప్రజాసమూహాల లేమి, ఆక్రోశం, ఆధిపత్య రాజకీయాల - వ్యవస్థల మోసకారితనం, వైఫల్యాలు, కేవలం అణచివేతలో తప్ప ఇంకే రంగంలోనూ అభివృద్ధిని సాధించటంలో ఆధిపత్యవర్గాల వైఫల్యం - నక్సల్బరీ ఒక సూచిక. ఆధిపత్యవర్గాల అశక్తతను నక్సల్బరీ ఎండగట్టింది. వర్గ రాజకీయాల చట్టబద్ధతను, రాజకీయ నిర్ణయీకరణ క్రమాన్ని, సమస్యల పట్ల వాటి ప్రతిస్పందనను, జవాబుదారీ తనాన్ని, పారదర్శకతను, పన్నులు చెల్లిస్తున్న ప్రజల పాత్రను, ప్రాతినిధ్యాన్ని నక్సల్బరీ ప్రశ్నించింది. నక్సల్బరీ విసిరిన రాజకీయ సవాల్‌రాజ్యం ఇంతకాలంగా కప్పుకొన్న ముసుగులన్నింటినీ తొలగించి, దాని హింసాత్మక స్వభావాన్ని బట్టబయలు చేసింది. బూర్జువా చట్టబద్ధత, ప్రజాకర్షక సంస్కరణలు, అసమ్మతిపట్ల సహనం అనే ముసుగుల్ని చీల్చి అసహ్యకరమైన దాని ముఖాన్ని బయటపెట్టింది. (ఛటర్జీ, పై పుస్తకం) రాజ్యానికి వున్న మౌలిక భావజాలాన్ని, వర్గ పునాదిని నక్సల్బరీ ఎండగట్టింది. ప్రజాస్వామిక రాజకీయ జీవితం కోసం ప్రయత్నిస్తున్న ప్రజల రాజకీయ పోరాటంలో ఇవి తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులేమీ కావు.

ʹʹతెరాయ్‌(హిమాలయ పర్వతసానువుల్లో నక్సల్బరీ వున్న ప్రాంతం) రైతాంగం ప్రారంభించిన పోరాటం భూమికోసం జరిగిన సాయుధ పోరాటం కాదు. రాజ్యాధికారం కోసం జరిగిన సాయుధపోరాటం.ʹʹ (కానూసన్యాల్‌, ʹతెరాయ్‌ప్రాంతంలో రైతాంగ ఉద్యమంపై నివేదిక. 1968 నవంబరు లిబరేషన్‌పత్రికలో ఈ నివేదిక అచ్చు అయింది.) సవాల్‌ను ఎదుర్కొన్న రాజ్యం దానికున్న శక్తినంతటినీ ఉపయోగించి ప్రతిఘటించింది. ముందుకు సాగిపోవడంలో నక్సల్బరీ చెల్లించిన మూల్యం దోపిడీ శక్తుల వర్గ ప్రయోజనాల్ని కాపాడే రాజ్యవైఖరికి, దాని అధికారానికి నిదర్శనం.

తెరాయ్‌పోరాట జ్వాలలనుండి నేర్చుకున్న పాఠాలు చాలా విలువైనవి. ఇవే తప్పులు భవిష్యత్తులో కూడా జరగాలా? జరగవనే ఆశిద్దాం. అదే అపరిణితి, విశ్లేషణలో అసంపూర్ణత, సంక్లిష్టమైన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సైద్ధాంతిక సమస్యలకు అదే రకంగా అతి సాధారణమైన సూత్రీకరణలతో కూడిన పరిష్కారాలు, వర్గాలు, వర్గాల మధ్య మైత్రి , ప్రజా సంఘాలు, ప్రజాఉద్యమాలు, ఐక్య సంఘటన, శత్రువర్గాల రాజకీయాధికార కేంద్రాలను చుట్టుముట్టడం వంటి సమస్యల పరిష్కారంలో అదే అపరిపక్వత, అదే తేలిక భావం తిరిగి కొనసాగదని ఆశిద్దాం.

నక్సల్బరీ రైతాంగ పోరాట సహాయక కమిటీ అధ్యక్షుడు ప్రమోద్‌సేన్‌గుప్తా ఇలా రాసారు.

ʹʹభారతదేశ విప్లవోద్యమంలో నక్సల్బరీ రైతాంగ సాయుధ తిరుగుబాటు అత్యంత ప్రాధాన్యత గల ఘట్టం. భారత ప్రజల విముక్తి మార్గంలో నక్సల్బరీ ఒక నూతన శకాన్ని ప్రారంభించింది... భారత కమ్యూనిస్టు పార్టీల రివిజనిస్టు, పార్లమెంటరీ నాయకత్వాల ముసుగును తొలగించడం నక్సల్బరీ సాయుధరైతాంగ తిరుగుబాటు సాధించిన గొప్ప విజయం. అది సాయుధ విప్లవ ఆవశ్యకతను అందరి ముందు ఎత్తిపట్టింది.ʹʹ (పై పుస్తకం మొదటి భాగం ʹʹవిప్లవం అంతర్ధానం అవుతుందా?ʹʹ, మొదటి చాప్టరు, ʹʹభావజాల పోరాటం తప్పనిసరిʹʹ)

ʹʹనక్సల్బరీ పోరాటం భూమికోసం జరిగిన మిలిటెంట్‌రైతాంగ పోరాటంగా ప్రారంభమయింది. పోరాట క్రమంలో అది మెల్లగా ఒక రాజకీయోద్యమంగా పరిణామం చెందింది.ʹʹ (పై పుస్తకం, మొదటి భాగం 12వ అధ్యాయం ʹʹనక్సల్బరీ ఉద్యమం - ఒక సరియైన విశ్లేషణ ఎందుకు జరగలేదు?ʹʹ)

ʹʹనక్సల్బరీ పోరాటం వీరోచితమైనదనడంలోనూ, అది విప్లవాత్మక తెలంగాణా పోరాట మార్గంలో పురోగమిస్తున్నదనడంలోనూ, గత 20 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పాతుకుపోయిన రివిజనిజంపై అది చావుదెబ్బ తీసిందనడంలోనూ, దేశంలోని దోపిడీవర్గాలలో పెద్ద ఎత్తున భయాందోళనలను సృష్టించిందనడంలోనూ, భారత ప్రజాతంత్ర ఉద్యమంలో ఒక నూతన అధ్యయానికి తెర తీసిందనడంలోనూ ఎలాంటి సందేహానికీ తావులేదుʹʹ (పై పుస్తకం)

ప్రతి రాజకీయ పోరాటంలోనూ అన్ని వర్గాలు ఒడుదుడుకుల్ని ఎదుర్కొంటూనే వుంటాయి. ఆయా వర్గాల బలాబలాలో వచ్చే మార్పులే ఇందుకు కారణం. నక్సల్బరీ కూడా ఇలాంటి ఒక అనుభవాన్ని పొందింది. అది ఒక చారిత్రక స్థితి. నక్సల్బరీ ఉద్యమ చొరవ నిర్మాతలలో ప్రధాన వ్యక్తి అయిన చారు మజుందార్‌ఈ వాస్తవాన్ని గుర్తించి ఇలా రాశారు.

ʹʹమనదేశంలో సాయుధపోరాటం ఒక దశకు చేరుకున్నాక వెనకడుగుకు గురైంది. ఇలాంటి సమయంలో పార్టీని సజీవంగా వుంచడమే మన కర్తవ్యం. విశాలమైన కార్మిక , రైతాంగ ప్రజానీకంలో మన పార్టీని మనం నిర్మించాలి. రాజకీయంగా ఐక్యమైన పార్టీని నిర్మాణం చేయకలిగినప్పుడు మాత్రమే ఇలాంటి వెనుకడుగును అధిగమించగలం. పోరాటాన్ని ఉన్నత దశకు అభివృద్ధి చేయగలం. విశాలమైన ఈ దేశంలో ప్రజలు అగ్ని పర్వతాల్లా బద్దలైతే ఏ అభివృద్ధి నిరోధక ప్రభుత్వమూ దాన్ని నిరోధించ లేదు.ʹʹ (ʹʹమజుందార్‌చివరి రచన.ʹʹ ఒక థీసీస్‌కు క్లుప్తీకరణ. ఆయన మరణం తరవాత 1972 జులైలో భా.క.పా. (మా.లె.)బెంగాలీ పత్రిక దేశబ్రతిలో అచ్చయింది.)

వర్గపోరాటానికి మరణం ఎన్నటికీ వుండదు. అలాంటి వర్గపోరాట పునాది ఆధారంగా ప్రారంభమైన నక్సల్బరీ చొరవ ఎన్నటికీ ఓటమిని ఎరుగదు. బలహీనంగా, అగ్నిగోళాలా మండుతున్న కళ్ళు కలిగిన చారు మజుందార్‌గుండె సంబంధమైన ఉబ్బసవ్యాది óగ్రస్తుడు. పోలీసుల వేధింపుల కారణంగా ఆయన మరణించారు. ఆయన ఇలా అనేవారు ʹʹమాటకు ఎన్నటికీ మరణం వుండదు. మనం ఈ రోజున చెప్తున్నదాన్ని ఈ క్షణంలో ప్రజలు ఆమోదించకపోవచ్చు. అయినా మన ప్రచారం వృధాకాదు. మన మాటలు ప్రజలలో కలగలసిపోయి వుంటాయిʹʹ (బెనర్జీ, పై పుస్తకం. ʹʹనక్సల్బరీ నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు అనే చారు మజుందార్‌పుస్తకం నుండి పై వాక్యాలు బెనర్జీ ఉల్లేఖించారు. ఈ పుస్తకాన్ని భా.క.పా. (మా.లె.)కు చెందిన ఉత్తర బెంగాల్‌బీహార్‌సరిహద్దు ప్రాంత కమిటీ ప్రచురించింది.)

నక్సల్బరీ చావుదెబ్బ తిన్నదని గొప్పగొప్ప వాళ్ళే అనేక సందర్భాల్లో చెప్పారు. కలకత్తాకు చెందిన ఒక రచయిత నక్సల్బరీ నాయకులలో ఒకరైన జంగల్‌సంతాల్‌మాటలకు నిస్సిగ్గుగా కువ్యాఖ్యానం చేశారు. నక్సల్బరీ చొరవ ప్రారంభకుల మధ్య మౌలిక ప్రశ్నలపై జరిగిన చర్చలను చూసి కొంతమంది లోలోపల సంతోషించారు.

అయితే వాస్తవం దీనికి భిన్నంగా వుంది. సుమంతా బెనర్జీ 1980లో ఇలా రాశారు. ʹʹఉద్యమానికి అంతిమ నివాళులు అర్పించిన వారందరి అభిప్రాయాలు ఎప్పుడూ అపరిపక్వంగానే వున్నాయనేది రుజువయింది. ఉద్యమాన్ని ఒక ప్రాంతంలో కట్టడి చేస్తే లేదా మరొక ప్రాంతంలో ʹఅణచివేశామనిʹ ప్రకటిస్తే అది త్వరలోనే దేశంలోని వేరొక ప్రాంతంలో బద్దలయ్యింది. కొన్ని సందర్భాలలో అనూహ్యమైన ప్రాంతాలలో ఉద్యమం తలయెత్తింది. నక్సల్బరీని వెన్నంటి శ్రీకాకుళం, శ్రీకాకుళాన్ని వెన్నంటి దేబ్రా గోపీవల్లభపూర్‌, దేబ్రా గోపీవల్లభపూర్‌ని వెన్నంటి బీర్‌భూం ఇలా ఉద్యమం కొనసాగుతూనే వుంది.ʹʹ (పై పుస్తకం) ముషాహరీ, లఖింపూర్‌ఖేరీలలో కూడా ఉద్యమం వ్యాపించింది. మూడు దశాబ్దాల తరవాత మరింత శక్తివంతమైన ఉద్యమ ఉనికిని అరుంధతీరాయ్‌గుర్తించారు. ʹʹమావోయిస్టులు (లేదా వివిధ పేర్లతో వారికి ముందున్న వాళ్ళు) ప్రతి సందర్భంలోనూ ఓడిపోయినట్లే కాక భౌతికంగా నిర్మూలించ బడినట్లుగా కూడా అనిపించేది. కాని ప్రతిసారీ వాళ్ళు మరింత సంఘటితంగా, మరింత కృత నిశ్చయంతో, ఇంతకు ముందుకంటే ప్రభావశీలంగా తిరిగి తలెత్తారుʹʹ (ʹకామ్రేడ్లతో కలసి ప్రయాణంʹ, ఔట్‌లుక్‌పత్రిక మార్చి 29, 2010)

వాస్తవం మీద ఆధారపడిన ఈ పరిశీలనలు చాలా మౌలికమైన ప్రశ్నలకు దారితీస్తాయి. అర్ధనగ్నంగా వుండి, నిత్యం ఆకలిదప్పులు అనుభవిస్తున్న, నిరక్షరాస్యులు లేదా కొద్దిపాటి అక్షరాస్యులు, చెప్పులు లేకుండా ఉత్తకాళ్ళతో నడిచే ప్రజలమీద ఆధారపడి ఈ ఉద్యమం తిరిగి ఎట్లా జీవం పోసుకుంటోంది? ఎలా బలపడుతోంది? దాని భావాలు ఎలా వ్యాపిస్తున్నాయి? ఎలా ప్రతిధ్వనిస్తున్నాయి? అది ఎలా బతకగలుగుతోంది? జీవశక్తిని ఎలా పొందగలుగుతోంది? ఫీనిక్స్‌పక్షిలాగా తనరెక్కల్ని ఎలా విశాల ప్రాంతాలమీద పరుస్తోంది? అది మరణాన్ని ఎలా నిరాకరిస్తోంది?

ఉద్యమం సజీవంగా వుండడానికి అవసరమైన శక్తి వాస్తవంలో నుండే సమకూరుతోంది. ఏమిటా వాస్తవం? గుణాత్మకమైన మార్పు కోసం వెతుకులాటలో వున్న వైరుధ్యాలు, ఈ వైరుధ్యాలను సక్రమంగా పరిష్కరించటంలో వ్యవస్థ వైఫల్యాలు, సమాజాన్ని ముందుకు తీసుకపోవడంలో వైఫల్యాలే ఈ వాస్తవం. అభివృద్ధిని అందించేశక్తి లేని వెనుకబాటు భావజాలం మీద ఇప్పటికీ ఆధిపత్య వర్గాలు మరింతగా ఆధారపడటమే ఈ వాస్తవం. అన్ని జీవన రంగాలలోను వేగంగా సాధికారతను పోగొట్టుకుంటున్న ఆధిపత్యవర్గాల భావజాలం ఈ వాస్తవం. వెనకబడ్డవిగా భావించబడ్డ వర్గాలు ముందుచూపు కలిగిన భావజాలంతో సాయుధం కావటానికి ప్రయత్నిస్తూ వుండటం ఈ వాస్తవం. ఆ భావజాలం మధ్య యుగాలనాటి భావాలపై ఆధారపడిందీకాదు, వాటిని వున్నతమైనవిగా కీర్తించిందీ కాదు. దాని జీవథాతువు వెనకబడ్డ వ్యవస్థలో లేదు. ఆధిపత్య వ్యవస్థకు సంబంధించిన సిద్దాంత వేత్తలు ఆ భావజాలానికి సంబంధించిన జీవథాతువును గ్రహించలేరు. బాహ్య నిఘా వ్యవస్థల అజమాయిషీలో జరుగుతున్న కార్యకలాపాలు దాన్ని గుర్తించలేవు. ఇలాంటి ఈ వాస్తవమే నక్సల్బరీ చొరవకు హేతుబద్ధతను సమకూరుస్తోంది.

నక్సల్బరీ శక్తియుక్తులు ఇక్కడున్నాయి: సంపన్నుల యాజమాన్యంలో వున్న వ్యవస్థ ప్రజల్ని అమాయకులుగా భావించి వాళ్ళను నిర్లక్ష్యం చేసింది. ఆ ప్రజలు అభివృద్ధికరమైన, గుణాత్మకమైన మార్పుకోసం నిరంతరం పోరాడుతున్నారు. ఈ భూమిపై నుండి అసమానతలను, అన్యాయాల్ని తుడిచిపెట్టటానికి అవసరమైన పునాదులు వేయటానికి కృతనిశ్చయంతో ప్రయత్నిస్తున్నారు. సమతా భావంతో కూడిన సమపంపిణీ వ్యవస్థకు అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించడానికి త్యాగాలు చేస్తున్నారు. ఇది మానవత్వంతో కూడిన కర్తవ్యం. ఒక చారిత్రక కర్తవ్యం. ఒక రాజకీయ కర్తవ్యం. స్వభావరీత్యా ప్రజావ్యతిరేకమైన సమాజాన్ని తుత్తునియలు చేసి, మరింత ఉన్నతమైన సమాజాన్ని నిర్మించటమనే చారిత్రక బాధ్యతను నిర్వర్తించే ఈ మార్గంలో ప్రయాణించటానికి, ఈ దేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఏ వర్గమూ ప్రయత్నించలేదు. ఇది తప్ప మరే సాంఘికశక్తీ ప్రజల సామాజికాభివృద్ధిని సాధించలేదని ఈ ప్రజలు నిరూపించారు. ʹʹతెలంగాణా పోరాట కాలం నుండి సిద్ధాంతానికి ఆచరణకు మధ్య గండి నానాటికీ పెరిగిపోతున్న సమయంలోʹʹ నక్సల్బరీ నూతన పంధాలో ప్రయాణం ప్రారంభించిందని కలకత్తాకు చెందిన వారపత్రిక ʹʹఫ్రాంటియర్‌ʹʹ సంపాదకులు సమర్‌సేన్‌అన్నారు. (సేన్‌, పాండా, లహిరిల పై పుస్తకం, మొదటి వాల్యూంకు ముందుమాట, జూన్‌1978) దోపిడీ - అణచివేత - ప్రతిఘటనలతో కూడిన ఈ వాస్తవం నక్సల్బరీని ఎన్నటికీ మరుగున పడనివ్వదు.

భౌతికంగా గాని, సంస్థాపరంగా గాని, సైనికశక్తి పరంగా గాని సంభవించే ఒడిదుడుకులు, ఎదురుదెబ్బలు వర్గపోరాటానికి సంబంధించిన తుది తీర్పును ఇవ్వలేవు. పురోగామి దిశగా నడుస్తున్న వర్గాల పోరాటంలో ఎదురుదెబ్బలు నిరంతరం వుంటూనే వుంటాయి అని ఆలోచించడం చరిత్రను యాంత్రిక దృక్పథంతో పరిశీలించటమే.

ఈ భూమిమీద ఎక్కడా, ఎప్పుడూ మానవ సమాజ ప్రయాణ క్రమంలో కేవలం బలయ్రోగమే నిర్ణయాత్మకం కాలేదు. అలా జరుగుతుందనుకోవడం అమాయకత్వం. నిఘా విభాగాలు సాంఘిక విషయాలను పరిష్కరించే క్రమంలో కూడా కేవలం బలప్రయోగం మీదనే ఆధారపడతాయి. ఇలాంటి ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు. చారు మజుందార్‌1967 ఆకురాలు కాలంలో ఇలా అన్నారు. ʹʹనక్సల్బరీ మరణించలేదు, అది ఎన్నటికీ మరణించదుʹʹ (పై పుస్తకం, బెనర్జీ) చారు మజుందార్‌చెప్పిన ఈ మాటల్ని ఆ వాస్తవం ప్రతిధ్వనిస్తోంది.

(ఫ్రాంటియర్‌, జూన్‌11 - 17, 2017 నుండి)
అనువాదం: సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌


No. of visitors : 2239
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీయే పీడిత ప్రజల విముక్తి పంథా

వి.ఎస్ | 25.05.2016 04:49:40pm

శ్రీకాకుళం గిరిజన పోరాటం, సిరిసిల్ల - జగిత్యాల పోరాటాలు, గోదారిలోయ ప్రతిఘటనోద్యమం, ఇంద్ర‌వెల్లి ఆదివాసి ఉద్యమం నుండి గోదావరి దాటి విస్తరించిన దండకారణ్య.....
...ఇంకా చదవండి

భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు : విజయాలు-సవాళ్లు

విప్లవ రచయితల సంఘం | 17.08.2017 01:53:58pm

యాభై ఏళ్లలో సాధించిన విప్లవోద్యమ పురోగతిని, విజయాలను, సమాజంలోని అన్ని జీవన రంగాలపై నక్సల్బరీ వేసిన ప్రభావాలనేగాక అంతిమ విజయం దిశగా సాగవలసిన నక్సల్బరీకి ఎద...
...ఇంకా చదవండి

Naxalbari Politics: A Feminist Narrative

Krishna Bandyopadhyay | 26.08.2017 11:55:46am

hose were terrible days. Like most others in the movement, I had no shelter and was staying anywhere and everywhere. I was toying with the idea of quitting ...
...ఇంకా చదవండి

All India Seminar on The Impact of Naxalbari on Indian Society

Revolutionary Writers Association | 04.09.2017 05:34:12pm

Revolution is really a splendid concept. Itʹs a great confidence. Itʹs a great dream that will not die in the eyes even when the head is severed. Thatʹs why...
...ఇంకా చదవండి

భారతదేశంపై వసంత మేఘ గర్జన

| 21.08.2017 04:23:33pm

డార్జిలింగులో ప్రారంభమయిన గ్రామీణ సాయుధ పోరాటం భారత అభివృద్ధి నిరోధకులకు భయోత్పాతాన్ని కలిగించింది. తమకు కలగబోయే విపత్తును వాళ్ళు పసిగట్టారు. డార్జిలింగు......
...ఇంకా చదవండి

The Impact of Naxalbari on Indian Society, Its Achievements and Challenges

Virasam | 17.08.2017 02:21:11pm

Naxalbari made an indelible impact not only on the revolutionary movement in the country but also has a tremendous influence on the social relations, emanci...
...ఇంకా చదవండి

భార‌త స‌మాజంపై న‌క్స‌ల్బ‌రీ ప్ర‌భావం (అఖిల భార‌త స‌ద‌స్సు)

విర‌సం | 04.09.2017 06:04:15pm

9, 10 సెప్టెంబ‌ర్ 2017 తేదీల్లో హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న ʹభార‌త స‌మాజంపై న‌క్స‌ల్బ‌రీ ప్ర‌భావం : విజ‌యాలు - స‌వాళ్లుʹ విర‌సం అఖిల భార‌త స‌ద‌స్సు ...
...ఇంకా చదవండి

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

| 25.05.2020 02:33:13am

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.....
...ఇంకా చదవండి

Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2

| 26.05.2019 08:21:42pm

Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •