ఏమవుతుంది?

| సాహిత్యం | క‌థ‌లు

ఏమవుతుంది?

- పలమనేరు బాలాజి | 04.09.2017 10:04:25am


అప్పటికీ ఐదారు సార్లు ఫోన్ చేసాను.

సునంద మొబైల్ స్విచ్డ్ ఆఫ్ అనే జవాబు వస్తోంది.ఎడమ చేతికి వాచీ వున్నా,ఇంట్లో కానీ,ఆఫీసులో కానీ ఉన్నప్పుడు ఎందుకో చేతి గడియారం చూడటం నాకు ఇష్టం వుండదు.గోడ గడియారం వైపు చూసాను. తొమ్మిదవటానికి ఇంకో ఐదు నిమిషాలే వుంది.

ఉదయం తొమ్మిది గంటలు! ఎప్పుడూ నా బోర్డర్ టైం అదే. పిల్లలు ఎనిమిది గంటలకు ఇంట్లోంచి కదిలితేనే,వీధి దాటి,మెయిన్ రోడ్డు పైకి వెళ్ళి స్కూల్ వ్యాన్ అందుకోగలుగుతారు. శ్రీవారు శ్రీకాంత్ కి ఒక వేళాపాళా అంటూ వుండదు.ప్రభుత్వశాఖలో మండల స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం. ఇంతకు ముందు ఆర్.డబ్ల్యు.ఎస్.అంటే రూరల్ వాటర్ సప్లై అనే వాళ్ళు. ఈ మధ్య కాలంలోనే వాళ్ళ శాఖకు అదనంగా ఆర్.డబ్ల్యు.ఎస్. అండ్ ఎస్ అని ఇంకో ఎస్ తగిలించినప్పటి నుండి మనిషి మనిషిగా లేడు. ఆ ఇంకో ఎస్ కి అర్థమే శానిటేషన్ అంట. ఒక్కోరోజు ఉదయం ఆరింటికే తయారై టీనో,కాఫీనో ఇంత తాగి, స్కూటర్ పైన క్యాంపుకు వెళ్ళిపోతాడు.కొన్ని సార్లు రిజిష్టర్లు, యం.బుక్కులు, క్యాలిక్యులేటరు ముందేసుకుని,ఇంట్లోనే కంఫ్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చుండి పోతాడు.ఏమంటే టేబుల్ వర్క్ అంతే! అనేస్తాడు. ʹఎందుకండీ ఇంత పని పెరిగింది ఈ మధ్య ?ʹఅని అడిగినప్పుడల్లా ఆయన నోట్లోంచి ఒకే పదం జవాబుగా బయటకు వస్తుందిʹస్వచ్చభారత్ʹ.ఆయనే కాదు పిల్లలు కూడా అదేదే ఊత పదంలా ʹస్వచ్ఛ భారత్ʹ అంటూ వుంటారు.టి.విల్లో,పత్రికల్లో ఆ పేరు విని,చదివీ విసుగొచ్చేసింది.

శ్రీ వారు ఈ రోజైతే ముందు తాను ఇంట్లోనే వుంటానని, టేబుల్ వర్క్ వుందన్నాడు కానీ ,ఏదో ఫోన్ రావటంతో,హడావిడిగా వెళ్ళిపోయాడు.తను ఇంట్లోనే వున్నా,ఇంటికి సంబంధించిన పనుల్లో తను చేయగలిగింది ఏమీ లేదని నాకు బాగా తెలుసు.

మరోసారి గోడ గడియారం వైపు చూసి ʹనీ బోర్డర్ టైం అయిపోయింది గ్రీష్మాʹ అని మనసులోనే అనుకునేసాను. తలుపు తీసి వీధి చివరి వరకూ చూసాను.రాని సునంద కోసం. వస్తుందేమో అన్నట్లు ఆశగా మరోసారి తలతిప్పి ,కళ్లు కొంచెం పెద్దవి చేసుకునే చూసాను,కానీ సునంద వచ్చే జాడే కనబడలేదు.ఇంకోసారి చూద్దామనుకుంటూ సెల్ ఫోన్లో ప్రయత్నంచాను. హమ్మయ్య! ఆమె సెల్ ఇప్పుడు రింగ్ అయ్యింది .దాంతో నాకు ప్రాణం లేచివచ్చినట్లయ్యింది. ఆ ఫోన్ ఎప్పుడూ నాకు అవసరానికి ఉపయోగపడదు. ఆమాటే ఆమెతో అన్నప్పుడు,సునంద గడుసుగా ఇచ్చిన జవాబుతో నా తల తిరిగిపోయింది.మేడం నాసెల్ ఫోన్ నాకోసమే కానీ మీకోసం కాదు కదండీ నాఫోణ్ నాకు ఉపయోగపడాలి కానీ, మీకు కాదు కదా!

తీ.... సునందా.... ఫోన్ తియ్యవే.. బాబూ.. తీసి.. ʹవస్తున్నా మేడం,ఇంకో ఐదు నిమిషాల్లో మీ ముందుంటాʹ అని ఎప్పట్లాగే అను సునందా ! ఎప్పుడు ఆలస్యమైనా ఎప్పుడు నేను ఫోన్ చేసినా, సునంద చెప్పే జవాబులో మార్పంటూ వుండదు. రావటం పావుగంటో, అరగంటో, ఆలస్యమైనా సరే.. చెప్పటంలో మాత్రం ʹఎంత మేడం! ఇదిగో ఐదు నిమిషాల్లో మీముందు వుండనూʹ...అనే మాట్లాడుతుంది. మాట ఇస్తుంది. ఆమె చెప్పిన సమయానికి
ఎప్పుడూ రాదని , రాలేదనీ నాకూ తెలుసు. అయినా ఆ ఫోన్ కాల్ ఎందుకంటే ఆ వంకతో ప్రతిసారీ నేను తెలుసుకోనేది ఒక్కటే.. ఒక చిన్న నిర్థారణ!హమ్మయ్య ఈరోజుకి సమస్యేమీ లేదు. గంట అటో ఇటో అయినా మోత్తానికి ఈరోజు సునంద అయితే వస్తుంది.పని ఎగర కొట్టడం లేదు. అని నిర్థారించుకున్నాక, నాలో నీరసం, నిరుత్సాహపోయి, కొత్త ఉత్సాహమేదో వచ్చి చేరుతుంది ఒంట్లో!

ఆ మాటతో నేను చాలా చురుగ్గా కదిలి చకచకా సర్దాల్సింది సర్ది, వదిలేయాల్సింది వదిలి, ఇంటికి తాళం వేసి తాళం చెవులు పక్కింట్లో బామ్మ దగ్గర ఇచ్చి,ఆమె రోజూ అడిగే కుశల ప్రశ్నలకి ఎప్పట్లాగే నవ్వుతూ బదులిచ్చి సంప్రదాయబద్దంగా ʹవెళ్ళొస్తానండి ఆఫీసుకు టైం అవుతోందిʹ అని సుతి మెత్తగా చెప్పి అక్కడి నుండి బయట పడే ప్రయత్నం చేస్తాను.అలా మొదలవుతుంది ఆఫీసుకి నా ప్రయాణం..... రోజూ!

ఎప్పుడైనా రెండు, మూడు రోజులు వరుసగా సునంద రాలేక పోయినప్పుడు, రానప్పుడూ అప్పుడు మొదలవుతుంది నా గుండెలో దడ! దడ! అప్పుడు మాత్రం సగం రోజో, పూర్తి రోజో ఆఫీసుకు నేను సెలవు పెట్టి ఇంట్లోనే వుండి ఇంటి పనులన్నీ చక్కదిద్దితేతప్ప ఇల్లు నడవదు. ఇల్లు ఇల్లులా కనపడదు. వస్తువులు, దినపత్రికలు, సామాన్లు చిందర వందరగా పడి వుంటాయి. నాకు తప్ప ఎవరికీ ఇంట్లో బాధ్యత వుండదు. పని మనిషి రెండ్రోజులు రాలేదంటే ఇక అంతే! అలాగని సునందను ఎప్పుడూ గట్టిగా ఆమె ఆలస్యం గురించి కానీ, గైర్హాజరు గురించి కానీ అడగలేను. ఆమె నమ్మకమైన మనిషి. అలాంటి నమ్మకస్తులు దొరకడం అరుదు. నిజాయితీగా పనిచేస్తుంది.

మరోసారి ఫోన్ చేసాను.ప్చ్! ఈ రోజూ కథ అంతేనా! సునంద ఫోన్ తియ్యలేదు. తను వస్తానని చెప్పటానికి,వస్తూ వున్నానని చెప్పటానికి మాత్రమే ఫోన్ లో దొరికి ఆమేరకు సమాచారాన్ని మాత్రమే తన రాకను తెలియచేస్తుంది, తప్ప, రాలేనప్పుడు, రానప్పుడు ఫోన్ తియ్యదు.మాట్లాడదు,ఏమాటా చెప్పదు.కానయితే దానర్థం అదే! ఫోన్ తియ్యలేదు, కాబట్టి తను రావటం లేదని మొత్తానికి నిర్థారణ అయ్యింది. రేపయినా వస్తుందో, రాదో తెలియదు.

రేపటికి తను వచ్చినా, తొమ్మిదికి అటూ ఇటూనే వస్తుంది తప్ప, అరగంటయినా ముందుగా రాదు. మొత్తానికి ఇల్లు శుభ్రం చేసుకుని, పాత్రలు,గిన్నెలు శుభ్రం చేసుకోక పోతే, రేపు ఉదయం టీ పెట్టడం కూడా కుదరదు కాక కుదరదు అనుకుంటుంటే ప్రాణం ఉస్సురుమంది. రేపటి కథ తర్వాత,ముందు ఈ రోజూ రాత్రికి వంట కూడా చేసుకోలేను పాత్రలు కడగకుండా! వెంటనే ఆఫీసు మేనేజర్ కి ఫోన్ చేశాను.

ఈ సమయంలో ఫోన్ చేసానంటే ఆలస్యంగా వస్తాననో,అసలు రాలేనని చెప్పటానికో అని, అతడికి బాగా తెలుసు . తెలివైనవాడు.ఫోన్ తియ్యలేదు. నేను ఇంకా తెలివైనదాన్ని అనుకుంటూ ʹపర్సనల్ ప్రాబ్లం సార్ʹ హాఫ్ డే క్యాజువల్ లీవ్ ప్లీజ్ʹ అని సంక్షిప్త సందేశాన్ని టైప్ చేసి, ఎందుకో వద్దనిపించి, మెస్సేజ్ డెలిట్ చేసేసాను. భ్రమరాంబ ఇదే మాదిరి సెలవు కోసం ఫోన్ చేసి, తను ఫోన్ తియ్యకపోతే పెట్టిన ఎస్.ఎం.ఎస్.ని ఆమె పేరు ప్రస్తావించకుండా వాట్సప్ గ్రూప్ లో పెట్టి, దాని కింద మేనేజర్ రాసిన కామెంట్ గుర్తొచ్చింది.

ʹనెలలో రెండు సార్లా?ఎందుకలా?ʹ

కొందరు మసుషులు సభ్యతా,సంస్కారాలు మరచి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తారు కానీ ,ఈ ఉన్మాదుల పట్ల ఉదాసీనంగా ఉండిపోవటం ఎందుకో బాధితులకి బాగా అలవాయిపోయింది. ఎదురు తిరిగితే తప్ప అవతల వాళ్లు కంట్రోల్లో వుండరని తెలుసు ...అయినా గొడవెందుకని సర్దుకోవటం...అలవాటయిపోయింది.

నేను స్టాఫ్ మీటింగ్ లో అడిగేద్దామంటే భ్రమరాంబ ఒప్పుకోలేదు.

ʹగ్రీష్మా ..... సంసారం అన్నాక సవాలక్ష వుంటాయి. ఎప్పుడూ ఏవేవో పనులు పడతానే వుంటాయి.మా ఇంటాయన ఈ పనులన్నీ షేర్ చేసుకునేట్లయితే నాకు పర్మిషన్లూ,సెలవులూ ఈ గాడిద దగ్గర మాటలూ అవసరమే వుండదు కదా.వదిలెయ్యవే వెధవనిʹ అని నాకే సర్ది చెప్పేసింది.అదీగాక ఆఫీసులో జరిగే ఏ చిన్న విషయం అయినా వాళ్ళ ఇంటాయనకి తప్పకుండా ప్రతిరోజూ చెప్పాలంట.ఏరోజూ విషయాలు ఆరోజే మరచిపోకుండా న్యూస్ రీడర్ లా చెప్పుకు పోవాలంట.. లేదంటే...అదో పెద్ద గొడవ అంటుంది భ్రమరాంభ.

అయినా ఇప్పడు నేను మెసేజ్ పెట్టినా, ఏదో ఒకటి గోల చేయకుండా వుండడు.ఎస్.ఎం.ఎస్ ని అందరికీ చూపించినా, చూపించేయ గలడు. కాబట్టి ఎస్.ఎం.ఎస్ కన్నా ఫోన్లో మాట్లాడ్డమే మేలనిపించింది.

ʹసర్ ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ʹ అనో ʹసర్ ట్రైయింగ్ ఫర్ యూ. ప్లీజ్ కాల్ʹ అనో ఎస్.ఎం.ఎస్ ని పెడదామని అనిపించినా,ఎలా పెట్టినా ఆ ఎస్.ఎం.ఎస్ ని ఇంకోరకంగా వెకిలిగా వాడుకోడని గ్యారెంటీ లేదు.ఫోన్ తియ్యనప్పుడు ఎస్.ఎం.ఎస్ లు పెట్టడం సాధారణ విషయమే అయినా ,ఆడవాళ్లు పెట్టె ఎస్.ఎం.ఎస్ లను కొంతమంది మగ ఆఫీసర్లు ఎంత నీచంగా వాడుకుంటారో కొలిగ్స్ చెపుతుంటే.... చిరాకేసింది. అన్నిటికీ అదే అర్థం అనే భావన వీళ్ళల్లో ఎప్పుడు పోతుందో?స్కాండల్స్ ప్రచారంచేసే స్కాండల్స్ కి బుద్ది ఎప్పుడొస్తుందో?తెలిదు.దేశం మారాలి. దేశం స్వచ్ఛంగా వుండాలని ప్రచారాలు చేస్తారు కానీ, ఇలాంటి విషయాల్లో మనుషులు మారటం గురించి ఎవరూ మాట్లాడరు.

ఐదారు సార్లు ప్రయత్నించాక మేనేజరు ఫోన్ తీసాడు. గంభీరంగా ʹచెప్పండిʹ అన్నాడు. ఆ గొంతులోని గాంభీర్యానికి నవ్వొచ్చింది.మోహం బిగించుకుని మహా సీరియస్ గా కింది ఉద్యోగులతో మాట్లాడాలని ఆఫీసర్స్ కు మేనేజర్స్ కు శిక్షణ ఇస్తారేమో అనిపిస్తుంది.

ఒకర్ని చూసి ఒకరు నేర్చుకుంటారేమో ఈ మూతిబిగించు కోవడాలు. అందర్లో ఉన్నప్పుడే ఆఫీసర్లు మూతి బిర్రుగా పెట్టుకుని మాట్లాడతారు.కొంత మంది ఆఫీసర్లు.....ఒక్కరే వున్నప్పుడు ఎంతగా దిగజారి పోతారో,క్రింది స్టాఫ్ మహిళలతో వాళ్లు వ్యవహరించే తీరు ఎంత అసహ్యంగా వుంటుందో అవి పైకి చెప్పలేని విషయాలు ఎన్నో. వెకిలి మాటలు,వెకిలి చేష్టలు,సర్కస్ ఫీట్లు!
ʹసార్.. మార్నింగ్ సార్, నాకు చాలా అర్జెంట్ పని పడింది ఈ రోజు రాలేను సార్ క్యాజువల్ లీవ్ ఈ ఒక్క రోజు సార్ʹ

ʹ... ఆ.. మీ సీట్లో పెండింగ్ ఫైల్స్ ఏమున్నాయండిʹ? మహాసీరియస్ గా అడిగాడు.బహుశా వాళ్లావిడ ముందు మాట్లాడుతున్నాడేమో.

ʹఏమీ లేవ్ సార్ʹ

ʹఇవాళ పైల్స్ క్లియరెన్స్ గురించి మీటింగ్ పెడుతున్నాను. మీరు లేక పోతే ఎలా ?

ʹ సార్ ʹ

ʹ సరే మధ్యాహ్నం రాగలరా ? ʹ

ʹ సార్ ʹ

ʹ వస్తారా ? రారా అది చెప్పండి. ʹఆహా!ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో? ఇదే గొంతు ఆఫీసులో అందరి ముందు ఒకలా వుంటుంది.ఇంట్లో ఇంకోలా వుంటుంది.ఛాంబర్లో నేను ఒక్కదాన్నే వున్నప్పుడు మరోలా వుంటుంది. ఒకే గొంతు రకరకాలుగా పలుకుతుంది. సమయాన్ని బట్టి, సంధర్భాన్ని బట్టి ఆ గొంతు రకరకాలుగా మారుతుంది.

ʹ మద్యాహ్నం వస్తాను సార్ ʹ

ʹ ఓకే. రెండు గంటలకు మీటింగ్, మీరు ఒక గంటకు వచ్చి డ్రాఫ్ట్ నోట్స్, కీపాయింట్స్, అజెండా , మినిట్స్ రెడీ చేసుకోండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మర్చిపోకుʹ

ʹ సరే సార్ ʹ

ఫోన్ పెట్టేశాడు విసురుగా, విసుగ్గా మాట్లాడుతున్న అతగాడి మొహాన్ని ఊహించే ప్రయత్నం చేసే సరికి నవ్వాగలేదు.

ఒక రోజు లీవు ఇవ్వటానికి ఇంత్ బిల్డప్ అవసరమా అనిపించింది. నిజానికి ఈ రోజు స్టాఫ్ మీటింగ్ అని ముందుగా సర్క్యులర్ కూడా ఇవ్వలేదు. నేను లీవు అడిగేసరికి అతడికి మీటింగ్ పెట్టాలని ఆ మిషతో ఎలాగైనా నన్ను ఆఫీసుకు పిలిపించాలనే ఆలోచన వచ్చినట్లుంది.ఇదోరకం శాడిజం.బాస్ ది మరోరకం శాడిజం.

అప్పుడప్పుడూ కొందరు మనుషులు ఆఫీసర్లుగా,మేనేజర్లుగా వస్తారు.హూందాగా,గౌరవంగా నడుచుకుంటారు.ఇలాంటి వాళ్ళతోనే జీవితంపట్లా ఉద్యోగం పట్లా విరక్తి కలిగేది.ఇంట్లో ఒకడే మగడు అని ఇలాంటి వాళ్ళని చూసే అనింటారు.

ఆదివారం వరకూ సెలవు ల్లేవు. ఈ రోజు బధవారం. ఇల్లు చూస్తే యుద్ద రంగంలా ఉంది. పోయిన ఆదివారం డేట్. ఇల్లు సర్దటానికి కుదరలేదు. ఇప్పుడీ రోజు కుదరకపోతే ఆదివారం వరకూ ఎదురుచూడాల్సిందే.

చెత్త ఊడ్చి, పాత్రలు తోమి, బట్టలు ఉతికి ఆరేయకపోతే ఈ వారం కథ ఎలా ఉన్నా రేపు గడవదు. అంతెందుకు ? ఈ సాయంత్రానికి వండాలన్నా పాత్రలు కడగాల్సిందే.యుద్ధరంగంలోకి దూకాల్సిందే.తప్పదు.ఉద్యోగానికి సెలవున్నా, లేకపోయినా పనికి సెలవుండదు ఆడవాళ్ళకు ఆదివారాలు లేవంటే...నిజమే కదా!

మేనేజర్ చెప్పిన పనులన్నీ చేయాలంటే మధ్యాహ్నం ఒక గంటకు వెళ్ళినా టైం చాలదు. ఉదయం సగం రోజు సెలవు పెడదామన్నా కుదరదు, టైంచాలదు.ఇంట్లో ఎవరి పన్లు వాళ్లు చేసుకోగలిగితే టైం సరిపోతుంది. అయీనా నా టైం బాగా లేనప్పుడు ఎవర్నని ఏం లాభం?మొగుడు ఉద్యోగం మాత్రమే చేస్తాడు.పిల్లలు చదవటం మాత్రమే చేస్తారు. గ్రీష్మా మాత్రమే అన్ని పనులు చెయాడానికే పుట్టింది.అయినా భార్య తెచ్చే జీతం మొత్తాన్ని దర్జాగా తీసుకునేవాళ్ళు కొందరు. భార్యల ఎటిఎం కార్డుల్ని కూడా తమ వద్దే వుంచుకునే వాళ్లు మరి కొందరు. భార్య జీతాన్ని స్వేచ్ఛగా వాడుకోగలిగిన వాళ్లు ఆమె కష్టాన్ని,పనుల్ని షేర్ చేసుకోరు ఎందుకో?ఆడవాళ్ల జీతాల్ని వాడుకోవడంలో వాళ్లకి నామోషీ వుండదు.కానీ ఎటొచ్చీ ఇంటి పనుల్లో ఏ మాత్రం సాయం చేయాలన్నా,ఎక్కడలేని ఇగో ఎక్కడినుంచో వచ్చేస్తుంది.చిన్నప్పుడు తను అమ్మకు అన్ని పనుల్లో సాయం చేసేది. ఇప్పుడు తన కూతురు అమృతకి టీ పెట్టడం కూడా చేతకాదు.

ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఒకటే. ఇల్లా, ఆఫీసా ?, సంసారమా, ఉద్యోగమా ?
హల్లో, వంటగదిలో అడ్డదిడ్డంగా పడిపోయిన సరంజామా, బట్టలు, పాత్రలు ఒక వైపు, ఆఫీసు, ఆఫీసులో పని మరొక వైపు.సరిహద్దులో నిలబడ్డానని బాగా అర్థం అయ్యింది. మనసు ఇంటివైపు బుద్ది ఆఫీసు వైపు లాగింది.మనసు,బుద్ది పక్కన పెడితే నాకు మరో మార్గం లేదు నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఆఫీసుకే బయలుదేరేసాను హడావిడిగా బస్ లో సీటు లేదు. పోనీలే బస్సు దొరికింది. అదే చాలనుకున్నాను. బాగా రద్దీగా వుంది. పది నిమిషాల తర్వాత సీటు ఖాళీ కావటంతో కూర్చోగలిగాను. స్కూటర్ కొనుక్కోవాలను కుంటూనే వున్నాను. కానీ ఏవేవో ఖర్చులు,లెక్కలతో కుదరటమే లేదు ʹమా ఇంటి రాష్ట్రపతి ఆమోదముద్ర పడన్దే... చీపురుకట్టయినా కొనడానికి లేదే మన అందరి పరిస్థితే అలాగే వుంది. గ్రీష్మా. జానకిలా మన జీతం మన ఎ.టి.ఎం కార్డు మన వద్దే వుంచుకోవాలంటే అందరికీ కుదరదు కదా!ʹ. అంటుంది కొలిగ్ కోమల మాటల సందర్భంలో.
హ్యండ్ బ్యాగ్ లోంచి యధాలాపంగా సెల్ బయటకు తీసి కీప్యాడ్ ఓపెన్ చేసాను.

వాట్సప్ మొత్తం నానా చెత్త మెస్సేజ్లతో నిండిపోయిది. శుభోదయాలు, శుభరాత్రులు, లేనిపోని కొటేషన్లతో ఆదర్శవంతమైన కథలు, నీతికథలు, నీతివాక్యాలు, సినిమా పాటలు, దేశభక్తికి సంబందించినవి మరికొన్ని. దేశ శుభ్రత దేశరక్షణ సమాజ సేవ,ఆరోగ్యం,దైవారాధనలకి సంబంధించినవి ఏవేవో!

సామాజిక మాద్యమాల్లో మెసేజ్ లు పంపడంతో సామాజిక బాధ్యత తీరిపోయినదని అనుకొనేవాళ్ళు సమాజంలో ఎక్కువైపోయారు. వచ్చిన మెసేజ్ లో వాస్తవం ఎంతో, కల్పన ఎంతో తెలియకుండానే గబగబా మెసేజ్ లు షేర్ చేయటం...అలవాటయిపోయింది చాలా మందికి.

మొన్నోరోజు ఇట్లాగే జరిగింది. తనకు చాలా చాలా ఇష్టమైన కథా,నవల రచయిత ఒకాయన ఆసుపత్రిలో ఉండగానే ఆయన చనిపోయాడని వాట్సప్ లో పోష్టులు, షేరింగ్స్.. ఆయన బ్రతికుండగానే ఆయనకు నివాళులు అర్పించేశారు. ఎంత బాధవుతుందో అలాంటివి జరిగినపుడు.
అప్పుడప్పుడు పేస్ బుక్ లో,వాట్సప్ లో మంచి పోటోలు పోస్టింగ్స్ వస్తాయి. దు:ఖంలోంచి, ఒత్తిడిలోంచి బయటపడేస్తాయి. కొన్ని నవ్వులు తెప్పిస్తాయి. మనుషులను, విలువలను కించపరచని పోస్టింగ్స్ ఎంతో బావుంటాయి. వేలాదిలో ఏవో కొన్ని... వెతుక్కోవాల్సిందే. మనుషుల్లో మనుషులకోసం వెతికినట్లు వెతకాల్సిందే.

వెతికితే కానీ ఏదీ దొరకదు నిజమేనేమో? వెతకటానికి టైం ఏది?ఒక మంచి పాట విని ఎన్నాళ్లవుతోందో? పరుగులే పరుగులు! రన్నింగ్ రేస్ లో పాల్గొంటున్న వాళ్లల్లో మనుషులు పరుగుల మయమై పోతున్నారు.కొన్ని సార్లు తన చిన్నప్పటి సంగతులూ,మంచీ చెడు... ఇవీ...అవీ...మాట్లాడాలని మంచి సంగీతం గురించి,సాహిత్యం గురించి మాట్లాడాలని ప్రయత్నించింది కానీ, మొగుడికి టైం వుండదు. పిల్లలకు ఇంట్రస్ట్ వుండదు. వాళ్ళ మొహాల్లో ఫీలింగ్స్ చూసాక ఆ ప్రయత్నం మరుగున పడింది.సెల్ ఫోన్లు ,ఫేస్ బుక్కులు, టీవీలే... మావారికీ, పిల్లలకు లోకం.అవే లోకం మావాళ్ళకి.ఇంకో లోకం అంటూ వుండదు.అంతే!ఎవరి లోకం వాళ్ళదే!
బస్సు దానిష్టం వచ్చిన రీతిలో వెడుతోంది. కాసేపు చాలా వేగంగా పోతున్నట్లు, మరి కాసేపు చాలా నెమ్మదిగా వెలుతున్నట్లు, మధ్యలో ఇంకాసేపు చాలా విసుగ్గా, విసురుగా వెడుతున్నట్లు అనిపిస్తోంది.

రోడ్లు బీభత్సంగా వున్నాయి. ట్రాఫిక్ భయంకరంగా ఉంది.ఉన్నట్లుండి వాట్సప్ లోకి మొగుడుగారొచ్చారు. ఏవో ఫోటోలు పెట్టారు. ఫోటోలు,ప్రెస్ నోట్, వార్తా కథనాలు చూశాక అర్థం అయ్యింది. దోమకాటువల్ల జ్వారాలు బారిన పడిన పల్లెటూరు.అసలు దోమల వల్ల ,జ్వరాల వల్ల,సరైన వైద్యం అందక ,సకాలంలో చికిత్స పొందక మరణించే వాళ్లు ఎందరో?స్వచ్ఛ భారత్ ఏమో కానీ.....శుచీ,శుభ్రత లేకుంటే... ప్రతి ఇల్లూ,వీధీ....జబ్బులకి కారణం కాక తప్పదు! గురి కాకా తప్పదు

ఈయన గారు దగ్గరుండి, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బందితో కలసి పేడదిబ్బలు ఊరికి దూరంగా తరలించడం, మురికి నీటికాలువలు శుభ్రంచేయించడం, దోమలు వ్యాపించకుండా నీటి కుంటల్లో, మురికినీటి కాలువల్లో వేస్టు ఆయిల్ బాల్స్ వేయించడం, మంచినీటి ట్యాంకులను శుభ్రంచేయించి, క్లోరినేషన్ చేయించడం లాంటి ఫోటోలు.

పిల్లలు అమృత, రవిశంకర్ ఇద్దరూ ఈమధ్య స్కూల్లో కాంపిటేషన్ పెట్టినప్పుడు స్వచ్చభారత్ గురించి వాళ్ళ నాన్న దగ్గర చాలా సమాచారమే సేకరించారు. కంప్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చుని దినపత్రికల్లో వార్తాకథనాలు, ఫోటోలు సేకరించి ప్రాజెక్టు వర్క్ పూర్తి చేశారు. పిల్లలకు మొదటి బహుమతే వచ్చింది. స్వచ్చ భారత్ అంశాలన్నీ నేర్చుకొని స్కూల్లో బహుమతి పొందినప్పటి నుండీ పిల్లలు... వాళ్ళని వాళ్ళు స్వచ్చ భారత్ కి రాయబారులనుకుంటూ వున్నారు.వాట్సప్,ఫేస్ బుక్కుల్లో పెద్దవాళ్ళ ప్రచారం చేసినట్లే పిల్లలు స్కూల్లో వ్యాసాలు రాసి, ఉపన్యాసాలు ఇచ్చి స్వచ్ఛ భారత్ వచ్చేసిందంటున్నారు

ఆఫీసులో పని, సమావేశం ముగిసి ఇంటికి బయలు దేరేసరికి రాత్రి ఏడు గంటలయింది. ఎప్పట్లా గే బస్సు రద్దీగానే వుంది. నులుచున్నాను. మధ్యాహ్నం పని హడావిడిలో సగం క్యారియర్ అయినా ఖాళీ కాలేదు. సాయంత్రం నుండి ఆకలవుతోది. కానీ ఇంట్లో నేను వెళ్ళేటప్పటికి ఇంత అన్నం పెట్టే మనిషి ఎవరున్నారు! ఆకలిని మరచి అన్నీ నేను వండల్సిందే. ఉదయం హడావిడిగా ఆఫీసుకు వచ్చేటప్పుడు మొదలైన తలనొప్పి ఎంతకూ తగ్గనే లేదు.

బస్సులోపల రంగురంగుల్లో స్వచ్చ భారత్ ప్రకటనలు. బస్సులో ఎఫ్.ఎం మధ్య మధ్యలో స్వచ్చ భారత్ ప్రకటనలు అదర గొడుతున్నాయి.ఇంతగా ప్రచారం చేస్తారు కానీ పాఠశాలల్లో,కార్యాలయాల్లో సినిమా థియేటర్స్ లో శుభ్రత వుండదని అందరికీ తెలుసు . స్వచ్చ భారత దేశం గురించి నాకు గాంధీ ఏం చెప్పాడో సరిగ్గా తెలియదు కానీ .సగటు మహిళగా... ఇంట్లో, బయటా సమస్యలు బాగా తెలుసు. స్వచ్ఛత, శుభ్రత కోసం ఎవరు ఏం చెయ్యాలో తెలుసు. నాకు తెలిసిందల్లా ఒక్కటే.అందరూ పనిచెయ్యాలి.ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలిగితే ఆడవాళ్ళ పైనే పనులన్నీ పడవు.ఎక్కువగా ఆడవాళ్ళకే నడుం నొప్పులు,మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు,తల నొప్పులు,ఇంతలా వుండవు. ఇంతచెత్త ఇండ్లల్లో,వీధుల్లో,ఊర్లల్లో,జిల్లాల్లో,రాష్ట్రాల్లో,దేశంలో పేరుకు పోదు.

బస్సులో లేడికండక్టర్ తొక్కుకుంటూ, తోసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ అంతహడావిడిమధ్యలోనూ, నిలబడి, నావైపు చూసి పలకరింపుగానవ్వింది. ఆమె మొహంలో బాగా అలసట కననడుతోంది. నేను ఈ రాత్రి ఎనిమిది గంటలకైనా ఇల్లు చేరుకోగలను. ఆమె డ్యూటీ ముగించి ఇంటికి చేరేసరికి రాత్రి పదైనా అవుతుంది. అంతరాత్రప్పుడు ఆమె గిన్నెలు, పాత్రలు తోమాల్సిందే, వండి వడ్డించాల్సిందే, అందరూ తిన్నాక అందరు తినిన కంచాలను ఆమె ఒక్కటే శుభ్రంచేసుకుంటుందేమో? అందరు ఆడవాళ్ళ పరిస్థితే అంతే. ఇంట్లో వుండేవాళ్ళ పనీ అంతే, ఉద్యోగాలు చేసేవాళ్ళ పనీ అంతే! పరిస్థితిలో, చేసే ఇంటి పనుల్లో మార్పువుండదు.
అనీజీగా అనిపించింది. మెడ అటూ ఇటూ తిప్పాను. చేతివేళ్లు నెటికలు విరుచుకున్నాను. సీటు దొరికింది. కూర్చ్ని రెండు భుజాలను వెనక్కు వంచాను. నడుం నొప్పి మళ్ళీ ఎక్కువైంది. ఇంట్లో కడగాల్సిన పాత్రలు, పళ్ళాలు, చెయ్యాల్సిన పనులు గుర్తొచ్చేసరికి నీరసం ముంచుకొచ్చింది. టాయిలెట్ శుభ్రంచేసి చాలా రోజులవుతోంది. అదేందో ఆపనిపైన నా పేరే రాసారేమో. ఎప్పుడూ నేను కడగాల్సిందే. ఇల్లయినా, ఇంట్లో పాత్రలైనా, టాయిలెట్ అయినా నేను శుభ్రం చేయాల్సిందే. ఒక్క సారైనా మావారు టాయిలెట్ క్లీన్ చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ప్రళయం కానీ, ఉప్పెనకానీ వచ్చి ఇల్లు ఏమైనా కొట్టుకొని పోతుందేమో చూడాలి. అసలు ఆ మాట చెపితే మావారు వింటారా? మారతాడా? ఏమంటాడు? అసలేమైపోతాడో?

ʹగ్రీష్ర్మా .... ఎదుటి వాళ్ళని మార్చాలనుకుంటే .. ముందు నువ్వు మారు గ్రీష్మాʹ అని మనసులోనే గట్టిగా రెండు మూడు సార్లు అనుకున్నాను.

ఇంతలా మొహమాటపడీ, రాజీపడి, సర్దుకునీ బ్రతకడం ఈ వయస్సులో ఇంకా అవసరమా అనిపించింది.

కండక్టర్ లో హుషారు ఎంతమాత్రం తగ్గలేదు. చురుగ్గా వుంది. ఎక్కడా ఏమరిపాటు మచ్చుకైనా కనబడటంలేదు. బస్సులో రద్దీ కొంచెం తగ్గినట్లనిపించింది. ఇండియన్ కాఫీబార్ దాటుతోంది బస్సు. ఎఫ్.ఎమ్.సాండ్ తగ్గింది. కండక్టర్ తన సీట్లో కూర్చుని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది. అవతలవైపు ఆమె కూతురు లైన్ లో వుంది.

బస్సులో డ్యూటీపరంగా పెద్దగొంతుతో కరుగ్గా, రఫ్ గా ఎప్పుడూ అరచినట్లు మాట్లాడే ఆమేనా ఈమె అనిపించింది. బస్సులో అరచే గొంతు ఆమె నిజమైన గొంతు కాకపోవచ్చు బహుశా కొంచెం హూందాగా, కొంచెం ప్రేమగా, కొంచెం లాలనగా అన్నీ కలగలసిపోయినట్లు ఇప్పుడు వినిపిస్తున్నదే ఆమె అసలైన, నిజమైన కంఠస్వరమేమో! ఏమో బాల్యంలో, యవ్వనంలో ఆమె పాటలు కూడా పాడేదేమో!

ఈ కళ్ళతో ఎంత మందిని చూడలేదు! ఆటలు, పాటలు, క్రీడల్లో, వ్యాసాలు రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడంలో, ఎంబ్రాయిడరీ వర్క్ లో, చాలా చాలా వాటిల్లో ప్రతిభ కలిగిన ఆమ్మాయిల కథల ముగింపులన్నీ దాదాపుగా ఒకటిగానే వుంటాయి. పెళ్ళయ్యేంత వరకే అన్నీ. పెళ్ళయ్యాక అవన్నీ ఎక్కడికో ఉన్నట్లుండి మాయమై పోతాయెందుకో!

ʹలలితా .. అర్థమైంది కదమ్మా. ఏం కంగారు పడకు. నిదానంగా జాగ్రత్తగా చెయ్యి, తొందర పడద్దు. ముందు పప్పు రసం పెట్టేసాక, కుక్కర్ లో రైస్ పెట్టేమ్. ఇందూ ప్రియని ... రేపటికి కావల్సిన కూరగాయలు కట్ చేసి ఆకుకూర వలిచి ప్లాస్టిక్ కవర్ లో ఉంచి, ఫ్రిజ్ లో పెట్టమనిచెప్పు. నాన్నకు ముందో కప్పు టీ ఇచ్చాక, సూపర్ మార్కెట్ పని మెళ్ళగా గుర్తు చేయి. అప్పుడు కానీ తను కదలడు. నేను పదిగంటల కళ్ళా ఇంట్లో వుంటాను. ఒకేనా? ...ʹ


అర్థం కానిదేదో అర్థమైనట్లు, అలవాటులేనిదేదో, ఇక పై అలవాటు చేసుకోవాల్సింది ఏదో, ఇంట్లో వాళ్ళకి కొత్తగా అలవాటు చేయించాల్సింది ఏమిటో బుర్రలో తటాలున మెరుపులా మెరిసింది. నేను కొత్తగా మాట్లాడితే, కొత్తగా పనులు పురమాయిస్తే ఏమవుతుంది?
ఏమవుతుందో చూడాలి. ప్రయత్నించకపోతే ప్రపంచంలో ఏ అద్భతమూ జరగదు.జీవితంలో అయినా అంతే!

స్పీడ్ బ్రేకర్ వర్ద బస్సు వేగం తగించుకుని మళ్ళీ క్షణాల్లో వేగం పుంజుకుంది. మూతి బిగించుకున్నట్లున్న సెల్ ఫోన్ ని చేతిలోకి తీసుకుని తెర తొలగించాను.

No. of visitors : 521
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •