ఒంటరిగా మిగిలిపోకూడని కవి

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ఒంటరిగా మిగిలిపోకూడని కవి

- వి. చెంచయ్య | 05.09.2017 11:21:59pm

ఎలీషా యాదవ్‌ తన మొదటి కవితా సంపుటిలోనే కవిగా నిరూపించుకున్నాడు. కవిత్వానికి కావలసిన ఉపమలు, ఉత్ప్రేక్షలు, భావుకత, ప్రతీకలు, వ్యక్తీకరణలు మొదలైన కవితా సామగ్రిని సమకూర్చుకోవడంలో ఉత్తీర్ణుడయ్యాడు. కవితా సంపుటిని ʹప్రవాహంʹ కవితతో ప్రారంభించడంలోనే జీవితమూ, కవిత్వమూ ప్రవాహశీలమైనవన్న భావనను సూచిస్తున్నాడు. నిలవ నీటికన్నా, ప్రవాహం స్వచ్ఛతకు సంకేతం. ప్రవాహం ముందుకు సాగుతూనే మురికిని కడిగేస్తుంది. మానవ సమాజం కూడా ఇలాగే సాగాలన్న కోరికను వ్యక్తం చేస్తాడు. ఇవాళ మార్కెట్టూ, మీడియా ప్రజలకు అవసరమైన వాటినివ్వకుండా, తమ లాభం కోసం తాము సృష్టించిన చెత్తా చెదారాల్నీ, మత్తునీ, మాయల్నీ ప్రజలు తీసుకునే విధంగా కుట్రపూరిత స్వభావంతో చాపకింద నీరులా వ్యాపిస్తూ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని కవి గమనించాడు. పాలక వర్గ సైనిక బలగాలు విప్లవకారుల కోసం అడవిని జల్లెడపడుతూ ఆదివాసీ కుటుంబాల్ని సోదా చేస్తున్న సందర్భంలో -

ʹʹనా దగ్గరేముందని
పగిలిన గుండె కేక
రగిలిన కడుపు మంటʹʹ

తప్ప అని ఆదివాసీ చేత అనిపించిన కవి అడవిలోని ఖనిజ సంపదను సామ్రాజ్యవాదుల నుండి కాపాడుతున్న ఆదివాసీల జీవన శైలీని, నిర్బంధాన్నేదుర్కుంటున్న వారు ధైర్య స్థైర్యాలను సరిగ్గా గుర్తించినవాడయ్యాడు. అందుకే -

ʹʹపట్టెడన్నం పెట్టె
తొల్లి పొద్దు కోసం
మళ్ళీ మళ్ళీ పుడ్తంʹʹ
అని ఆదివాసీల ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చెయ్యగలిగాడు.

ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కుల ఊచకోతకు, బాబ్రీ మసీదు కూల్చివేతకు కవి హృదయం ద్రవించి, గాయాలు సమాధి కావనీ, మరలా చేతులు కాళ్ళు పుట్టుకొస్తాయనీ, ముందుకు సాగే సమాజ పరిణామ క్రమంపై నమ్మకాన్ని కలిగించాడు. ʹʹఆయుధాలు గుండెల్ని కాల్చలేవు, పోరాటాన్ని కూల్చలేవు, భూమి పుట్టింది మొదలు, మార్పుకోసమే నీ ఆరాటంʹʹ అని సమిష్టి లక్ష్యం కలిగిన మానవ చైతన్యం ముందు ఎంత పెద్ద ఆయుధాలైనా నిలువ లేవన్నాడు. ప్రపంచ పోలీసుగా విర్రవీగుతున్న అమెరికా సామ్రాజ్యవాదం ముందు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనన్నాడు.

ʹʹఅణ్వాయుధాల గుట్టల మాటు నుంచి
అణ్వస్త్రరహిత ప్రపంచాన్ని కాంక్షిస్తావుʹʹ

అంటూ, అణ్వస్త్రరహిత ప్రపంచాన్ని కోరుకుంటున్నట్టు పైకి నటిస్తూ, అణ్వస్త్రాన్ని పెంచుకుంటూపోతున్న అమెరికా ద్వంద్వ రాజనీతిని ఎండగట్టాడు. పెట్రోలు బావుల్నుంచి మనిషఇ రక్తాన్ని చులకనగా చేదుకెళ్ళే ప్రయత్నం చేస్తున్న అమెరికాని ʹʹప్రపంచానికి నువ్వొక సైతాన్‌ సందేశంʹʹ అన్నాడు. ఒక చేత్తో ʹʹడాలర్‌ డాలుʹʹ మరొక చేత్తో ʹʹగ్లోబల్‌ ఖడ్గంʹʹ ధరించి అమెరికా సామ్రాజ్యవాది చేస్తున్న ధ్వంస రచనను బలంగా నిరసించాడు. ఉపాధి లేని జీవితం, పోటెత్తిన యువశక్తి కల్లోలం పుట్టిన చోట దేశం నిండా ప్రశ్నలై మొలుస్తాయంటాడు.

ఇంతటి చైతన్యాన్ని నింపుకొన్న కవి ఎలీషాని చూసి, ముందుమాటలు రాసిన హనుమారెడ్డి - రైతు బాధలపై, కరువుపై, సాయుధపోరాటంపై ఎక్కువ సమయాన్ని వెచ్చించాడని అసంతృప్తి చెందాడు. ఎలీషా పుస్తకాలు ʹʹరక్తసిక్త పేటికలుʹʹ కాకూడదని తన కోరికను వెలిబుచ్చారు. పుస్తకాల పూదోటలలో ప్రయాణం చెయ్యమన్నాడు. ఎందుకంటే పై భావాల్ని బలంగా వ్యక్తీకరించిన ఎలీషా కవిత్వంలోని భాష హనుమారెడ్డికి జుగుప్స కలిగించిందట. ఆ భాషను వదిలెయ్యమన్నాడు. అంటే ఆ భావాల్ని వదిలెయ్యమన్నాడు. న్యాయవాది అయిన హనుమారెడ్డికి ఎలీషా రాసిన ఈ తరహా కవిత్వంలో న్యాయం కనిపించలేదు మరి! సామ్రాజ్యవాదం ద్వారా ప్రపంచానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన ఎలీషా కవిత్వంలో ఆయనకు అన్యాయమే కనిపించింది మరి!

అయితే విచిత్రం ఏమిటంటే హనుమారెడ్డికి నచ్చిన కవి కూడా ఎలీషాలో ఉండడం! బాల్య జ్ఞాపకాల గురించి రాస్తూ ఎలీషా-

ʹʹఆటలంటే చుట్టూ పెనవేసుకున్న మల్లెతీగలు
పాటలంటే నన్నలరించిన
నీటి చలమల మధురిమలుʹʹ

అంటాడు. ఇవి రాయకూడదని కాదు నా అభిప్రాయం. బహుశ ఇలాంటివి మాత్రమే రాయాలని హనుమారెడ్డి కోరిక! గ్లోబల్‌ ఖడ్గాలూ, ప్రపంచీకరణ, కుతంత్రాలూ, సాయుధ పోరాటాలూ, పోగులైన ఆకలి పోగులూ, ప్రపంచ పోలీసు ముఞదు తాకట్టు పెట్టిన ఆత్మగౌరవాలూ కాస్తో కూస్తో రాయోచ్చుగాని, అవి ఎక్కువగా రాయకూడదన్నమాట! అయితే హనుమారెడ్డి భయపడ్డట్టు ఎలీషా ఇలాంటి కవితల్ని ఎక్కువగా ఏమీ రాయలేదు. తక్కువగా రాసినా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కదా!

ముందుమాటలు రాసిన మరొక కవి నాగభైరవ కోటేశ్వరరావు ʹʹకొండ్రెడ్డీ, పాలూరీ, ఎలీషా యాదవ్‌లు - కనిగిరిలో ఆధునిక కవిత్రయంʹʹ అన్నాడు. ఎక్కడ ముగ్గురు కవులు కనిపిస్తే అక్కడ వాళ్ళు ʹకవిత్రయంʹ అయిపోతారు కాబోలు! మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రనలు రాసి పూర్తి చేశారు కాబట్టి వాళ్ళను సంప్రదాయవాదులు కవిత్రయం అన్నారు. ప్రాచీన కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ తన దృష్టిలో కవిత్రయం అని శ్రీశ్రీ మరో కోణం నుంచి అన్నాడు. ఈ రెండు కవిత్రయాలకూ ఒక అర్థం, ఒక దృక్పథం ఉన్నాయి. కవిత్రయాల్ని సృష్టించదల్చుకుంటే, ఆంధ్రదేశంలోని కవులందర్నీ లెక్కగట్టి, మూడుతో భాగించి, వందల కవిత్రయాల్నో, వేల కవిత్రయాల్నో తయారు చెయ్యొచ్చు. దురదృష్టంకొద్దీ ఈ లెక్కలో చివరకు ఒకరో ఇద్దరో మిగిలితే వాళ్ళు కవిత్రయం కాకపోయే ప్రమాదం కూడా ఉంది.

ముందు మాటలు రాసిన ఇంకో కవి శ్రీరామ కవచం సాగర్‌ - ʹʹధిక్కార గొంతులు పల్చబడ్తున్న తరుణంలో ఈ గొంతుని కాపాడుకోవడం ఎలాగ అనేదే నా అసలు దిగులుʹʹ అనడంలో ఒక తపన కనిపిస్తుంది. ధిక్కార స్వరం ఉన్న ఈ కవి పక్కదారి పడతాడేమో అనే అనుమానం సాగర్‌కు రావడానికి ఎలీషా కవిత్వంలోనే ఆధారాలున్నాయి.

ʹʹకాగితం మీద దొర్లిన సిరా
అక్షరాలై అల్లుకుపోయి
అవి ఒక్కొక్కటిగా చూపుల దారానికి
కూర్చుకుని మెళ్ళో హారమౌతుండేదిʹʹ

ʹఎడారిʹ పేరుతో ఉన్న ఈ కవిత అంతటా కవిత్వం పుష్కలంగా ఉంది. అయితే ఈ చరణాల్లో సమాజానికి వ్యతిరేక భావాలు లేకపోయినా, అనుకూల భావాలు కూడా లేవు. కాని ఇదే కవితలో -

ʹʹకాలం సుదర్శన చక్రమై
నిముషాల్ని పెనవేసుకున్న ఆశల్ని
వెంటబడి నరుక్కుంటూ పోతుండేదిʹʹ

అన్న మాటల్లో కాలం తనకు ప్రతికూలంగా ఉందన్న బాధ వ్యక్తమౌతోంది. ʹకాలం కలిసి రావడం లేదుʹ అనే మాట వ్యవహారంలో ఉంది. అంటే - జీవితంలో తన అవసరాలు తీరుకపోవడానికి కారణం తన ప్రయత్న లోపమో, తన చుట్టూ ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులో కాదని, కాలం మీదికి నెట్టేయడం సహజంగా పెద్దగా అవగాహన లేని సామాన్యుడు చేసే పని. కవి సామాన్యుడి స్థాయిలో కాకుండా, ఉన్నత చైతన్య స్థాయిలో ఉండాలి. సామాన్యుడికున్న అవగాహనా లోపాన్ని కవిత్వం తొలగించగలగాలి. కవే కాదు, ఏ కళాకారుడికైనా, ఏ రచయితకైనా ఉండాల్సిన లక్షణం ఇది.

ʹʹనిర్వీర్యమైపోతున్న యువశక్తి
నా దేశానికొక సవాల్‌ విసుర్తుంటే
జవాబు దొరకని చోట
ఎన్నెన్ని దిక్కులు పిక్కటిల్లితే ఏం!?ʹʹ

ఈ మాటల్లో పూర్తి నిరాశ కనిపిస్తుంది. ʹజవాబు కరువైన చోటʹ అని కవితకు పేరు పెట్టడంలోనే కవితలోని సారాంశమంతా తెలిసిపోతోంది. ఎన్ని పోరాటాలు చేసినా ఏం లాభం అనే వైరాగ్యధోరణి కనిపిస్తోంది. మన సమస్యలకు మనం మాత్రమే కారణం కాదు, మన పాలక వర్గాలు మాత్రమే కారణం కాదు, సామ్రాజ్యవాదం, అది అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలూ కారణమే అనే విషయాన్ని గ్రహించడం ఇవాళ కష్టమైన పనేమీ కాదు.

ఎలీషా కవితాసంపుటి పేరు ʹʹఒక్కడు ఒంటరి కాదుʹʹ. ఈ పేరుతో ఒక కవిత కూడా ఉంది. మరో ముందుమాట రాసిన మోతుకూరి నరహరికి ఈ శీర్షికలో ʹʹవ్యక్తికి బహువచనం శక్తిʹʹ అన్న శ్రీశ్రీ వాక్యం గుర్తుకొస్తుందట! ఒక్కడు ఒంటరి కాదు అనే శీర్షిక వాచ్యంగా ఉందికాని, కవితాత్మకంగా లేదు. నిజానికి వ్యక్తికి బహువచనం వ్యక్తులు. కాని శ్రీశ్రీ శక్తి అన్నాడు. ఒక వ్యక్తి కంటే నలుగురు వ్యక్తులు కలిసినప్పుడు అది శక్తిగా మారుతుంది. ఈ స్ఫూర్తి ʹఒక్కడు ఒంటరి కాదుʹ అనడంలో ఎక్కడుంది? ఈ కవితలోని మొదటి రెండు చరణాలు ఇవి-

ʹʹఒక్కడు ఒంటరి కాదు
ఒక సమూహంలోంచి వచ్చినవాడుʹʹ
ఒక్కడు ఒంటరి కాదంటూనే, ఒక సమూహంలోంచి వచ్చినవాడని కవే మళ్ళీ వాచ్యంగానే వివరణ ఇవాల్సి వచ్చింది.

జననం మరణానికే హేతువు, క్లాసు మిస్సయిపోయింది, ఒక్కడు ఒంటరి కాదు లాంటి కవితలు ముందు మాటలు రాసిన వారిచేత తాత్విక కవితలుగా గుర్తింపబడ్డాయి. ఈ మూడు కవితల్లోనూ మెట్ట వేదాంతమే ఉంది. నిరాశా నిస్పృహలతో కూడిన వైరాగ్యభావనే ఉంది. ఈ కవితల్లోని ఈ చరణాలు చూడండి -

ʹʹఈ రోజు నువ్వేదైనా కల కనొచ్చు
రేపు అది మరణించిన వాస్తవమైతే
నిన్ను నూవు సముదాయించుకోవాలిʹ - ʹజననం మరణానికే కేతువుʹ

ʹʹఒక విచిత్రమేమిటంటే
తెలియకుండానే కొన్ని జరిగిపోవటంʹʹ - ʹక్లాస్‌ మిస్సయిపోయిందిʹ

ʹʹసమానత్వం, సామాజిక న్యాయం
దొరికే చోట ఇక్కడేʹ
(ఇక్కడే అంటే స్మశానంలోనే అని) - ʹఒక్కడు ఒంటరి కాదుʹ

ఈ కవితా చరణాలన్నిటిలోనూ రేపటి గురించిన ఆశ కనిపించడం లేదు. అంతేకాదు, నీలో తొంగి చూసుకోగలిగితే ప్రశాంతత దొరుకుతుందంటారు. ఇలాంటి కవితా పాదాల ద్వారా నిజంగానే కవి ఒంటరివాడైపోతున్నాడు.

ఈ మొత్తం చూస్తే ఈ కవిలో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఒకసారి ఆశ, మరోసారి నిరాశ; ఒకచోట చైతన్యం, మరోచోట వైరాగ్యం. ముందు ముందు ఈ కవి ఎటువైపు మొగ్గుతాడో అనే అనుమానం కలగక మానదు. మరొక ముందుమాట రాసిన కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డికి ఈ సందేహం రానే వచ్చింది. ʹʹజీవితంలో ఏదో కోల్పోయిన భావన, తిరిగి పొందాలనే తపన, దానికి తగిన పరిష్కారమార్గం కనిపించని ఆవేదన పాఠకుల చుట్టూ తిప్పగలిగిన నేర్పుందీ కవికి-ʹʹ అని కొండ్రెడ్డి సరిగ్గానే గుర్తించాడు.

పై విషయాల్ని గుర్తించి సవరించుకుంటే ఎలీషా యాదవ్‌ కవిగా ఒంటరిగా మిగిలిపోడు.

No. of visitors : 781
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తెలుగు భాషనే ఊపిరిగా పీలుస్తున్న చెన్నైవాసి

వి. చెంచయ్య | 18.11.2017 12:26:42am

తెలుగు భాషను సంబంధించిన అనేక విషయాల్ని సంజీవరావు ఈ 80 పేజీల పుస్తకంలో అద్దంలో చంద్రుడిలాగా వివరించడానికి ప్రయత్నించాడు. వర్ణవిభాగం, పద విభాగం, అర్థం - అన.....
...ఇంకా చదవండి

కవిలో చిత్తశుద్ధి ఉంది - అవగాహనే కొరవడింది

వి. చెంచ‌య్య‌ | 06.12.2017 12:51:59am

సిద్ధాంత దృక్పథంతో విషయాల్ని పరిశీలించడంలో మాత్రం పొరబాట్లు జరుగుతున్నాయి. ʹʹఆటవిక యుద్ధాన్ని ఇంకెన్నాళ్ళు చేద్దాం?ʹʹ అన్నప్పుడు కవి ఆటవిక అనే మాటను దుర్మార...
...ఇంకా చదవండి

కవి ఆక్రోశం కవుల సమిష్టి ఆక్రోశం కావాలి

వి. చెంచయ్య | 06.10.2017 12:06:03am

అగ్రవర్ణ ఆధిపత్యం మన సమాజంలో అనాదిగా ఉన్నదే. అయితే కులవ్యవస్థలోని లోటుపాట్లను పాలకవర్గం ఎలా తెలివిగా ఉపయోగించుకుంటున్నదో కవి దృష్టిని వదిలిపోలేదు......
...ఇంకా చదవండి

బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?

వి. చెంచయ్య | 02.11.2017 10:55:39am

అన్ని తాత్విక చింతనలనూ పరిశీలించి, సరైన నిర్ణయానికి రావడానికి బుద్ధుడి జ్ఞాన సిద్ధాంతాన్ని తెలియజేసే కాలామ సుత్తం ఆచరణాత్మకమైన ప్రాతిపదికన అందిస్తుందని రచయ...
...ఇంకా చదవండి

విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి

వి.చెంచ‌య్య‌ | 03.01.2018 11:23:28pm

ఈ చిన్న పుస్తకాంలో ఐలయ్య ఆలోచనలు ఆలోచింప దగినవిగా, కనిపిస్తున్నారయి. ఈ ధోరణిలో ఆలోచిస్తున్న ఐలయ్య కొన్ని వివాదాస్పద ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు.....
...ఇంకా చదవండి

వర్ణమూ, కులమూ రెండు విభిన్న ఉత్పత్తి విధానాలకు సంబంధించినవి

వి.చెంచయ్య | 20.02.2018 12:40:30am

వర్ణం అనేది మొదట రంగును మాత్రమే సూచించేదిగా ఉన్నదనీ, ఆ తర్వాత మాత్రమే చాతుర్వర్ణ సిద్ధాంతంతో అన్వయం పొందిందనీ రుజువు చేశాడు......
...ఇంకా చదవండి

మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...

వి. చెంచయ్య | 28.09.2018 01:10:47am

జాషువా కష్టసుఖాలు రెండూ అనుభవించాడు గాని, వాటికి వశం కాలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ, నిరాశామయ వాతావరణంలోనూ కవిగా నిలదొక్కుకోవడం జాషువా ప్రత్యేకత... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జూలై - 2019

  చారిత్రక పత్రం
  రచయితలకు సవాల్ !
  మూడు తరాల, యాభై వసంతాల విరసం
  వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
  రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
  తిరిగి వ‌స్తావ‌ని
  నన్నెక్కనివ్వండి బోను
  కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
  సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
  సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •