మనుషుల్ని కాదు, ఒక జాతి మొత్తాన్నీ నిర్మూలిస్తున్నారు

| సంపాద‌కీయం

మనుషుల్ని కాదు, ఒక జాతి మొత్తాన్నీ నిర్మూలిస్తున్నారు

- పి.వరలక్ష్మి | 19.09.2017 01:30:52pm

మనం జీవించే కాలం ఇంత అమానవీయమవుతున్నదేమిటి? ఎవరో కవి అన్నట్లు కొన్నింటిని చూడటం, వినటమే దుర్భరమైన అనుభవమవ్వటమేమిటి? ఇటుపక్క ఒరిగిపోతున్న మన సహచరులను చూసి దు:ఖించే తీరికైనా దొరకదు. ఘటన వెంట ఘటన తరుముతుంటే పేజీలకొద్దీ ఉద్వేగాలను పేర్చుకొని, తర్వాతివంతు ఎవరిదని సిద్ధపడే కాలాన్ని ఏమందామని తర్కించుకుంటుంటాం. అటునుండి తేలుతున్న శవపేటికల్లో వస్తున్నది మనుషులేనా? మన జాతివాళ్లు కాదు.. మన మతం కాదు.. దేశద్రోహులు.. తీవ్రవాదులు... ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు... ఇవి రోజూ వింటున్నట్లే అనిపిస్తుంది కదా. ఇట్లాగే ఉరుముతూ తరుముకుంటూ వచ్చి దొరికినవారిని దొరికినట్లు నరికి కుప్పలుపోస్తుంటే ప్రాణాలరచేతిలో పెట్టుకొని సముద్రాలను ఈదుతూ ఆ పారిపోయే పడవల్ల్లో ప్రాణం లేని శవాలెన్నో, ప్రాణం ఉన్న శవాలెన్నోగాని వాటిని తేలుతున్న శవపేటికలని ఎవరో సరిగ్గానే అభివర్ణించారు. బుద్ధుడి బోధలు విన్న బర్మాయే అది. బుద్ధిజమే అత్యధికుల మతవిశ్వాసం. ఇక్కడి నుండో ఎంతో మంది బతకను పోయిన పొరుగూరు వంటి దేశమే. చరిత్ర పొడవునా మనం ఎన్నో అనుబంధాలు పేర్చుకున్న నేలనే. ఇట్లాగే బతనుపోయిన వాళ్లనే తరుముతున్నది, మంటల్లో కాలుస్తున్నది, వేలాదిగా చంపివేస్తున్నది? ఎవరీ రోహింగ్యాలు? బుద్ధిస్టులు ఎందుకంతగా పగబట్టారు?

పుట్టి పెరిగి, చెమట నెత్తురు ధారపోసిన నేల నీడనియ్యక తరిమేస్తే, ఇక్కడుంటే చంపేస్తామని దేశమే దండెత్తితే లక్షలాదిగా పొరుగుదేశాలకు శరణుజొచ్చిన వాళ్లు. కాసింత నీడ కోసం బతిమిలాడితే కసిరివేయబడుతున్నవాళ్లు. మయన్మార్‌ పశ్చిమ ప్రాంతాన రఖైన్‌ రాష్ట్రంలో నివసించే రోహింగ్యా జాతిలో ఎక్కువ మంది ఇస్లాం మత విశ్వాసాలు గలవాళ్లే. స్థానిక బర్మీస్‌ భాష కాకుండా వీళ్లు బెంగాలీ మాట్లాడతారు. ఇప్పటి బాంగ్లాదేశ్‌ భూభాగం నుండి ఎప్పుడో వలసపాలన కాలంలో వలసపోయి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇంచుమించు 10 లక్షల జనాభా వారిది. మయన్మార్‌లో దాదాపు 90 శాతం వరకు బౌద్ధుల జనాభా ఉంటే నాలుగు శాతం ముస్లిం జనాభా ఉంది. రోహింగ్యా ముస్లింలు రెండు శాతం ఉంటారు. మయన్మార్‌ చట్టం ప్రకారం రోహింగ్యాలకు పౌరసత్వం లేదు. 1982 పౌరసత్వ చట్టం ప్రకారం 1823కి పూర్వం ఉన్న కుటుంబాల వారసులనే బర్మా పౌరులుగా గుర్తిస్తారు. అట్లా గుర్తింపు నిరాకరించబడిన వాళ్ల మీద అనేక ఆంక్షలు ఉంటాలు. పర్మిషన్‌ లేకుండా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పోడానికి లేదు. ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదు. వారంలో ఒక్కరోజు మిలిటరీ కోసం గాని, ప్రభుత్వం కేటాయించే మరో పనిలోగాని తప్పనిసరిగా చాకిరీ చేయాలి. ప్రభుత్వం రోహింగ్యాలు సాగుచేసుకుంటున్న భూముల్ని బలవంతంగా లాక్కుని బైటి దేశాల నుండి వచ్చిన బౌద్ధులకు ఇచ్చేసింది.

రఖైన్‌ రాష్ట్రం బర్మాలో అత్యంత వెనకబడిన ప్రాంతం. కటిక పేదరికంలో అక్కడి ప్రజలుంటారు. సైనిక పాలకులు అన్నిటికీ కారణంగా మైనారిటీ జాతిని చూపించారు. ఎక్కడి నుండో వచ్చిన వాళ్లు ఇక్కడి ప్రజలకు శత్రువులుగా తయారయ్యారని రోహింగ్యాలను బూచిగా చూపెట్టి వాళ్లను ఒక పద్ధతి ప్రకారం మెజారిటీ ప్రజలకు దూరం చేస్తూ వచ్చారు. దశాబ్దాలుగా వీళ్లను ఘోరమైన వివక్షకు గురిచేస్తూ స్థానికులు కనీసం వీళ్లను పనిలో పెట్టుకోడానికి కూడా నిరాకరించే పరిస్థితి తీసుకొచ్చారు. రోహింగ్యాల్లోనూ ముస్లింల పరిస్థితి మరింత దయనీయం. ʹʹముస్లింలు ఇష్టం వచ్చినట్లు పిల్లల్ని కంటూ వాళ్ల జనాభా పెంచుకుంటూపోతారు. వీళ్లు హింసాత్మకంగా ఉంటారు. జాలీ దయా ఉండదు. తన సంతతిని తానే తినేసే విషపురుగుల జాతి వీళ్లది..ʹʹ ప్రముఖ బౌద్ధజాతీయవాద మత గురువు మాటలివి. మన దేశంలో రోహింగ్యా జాతి ఉండకూడదని మయన్మార్‌ రక్షణశాఖ కమాండర్‌ ప్రసంగిస్తాడు. మాట్లాడితే దేశరక్షణ, దేశప్రయోజనాలు, దేశభక్తే! మనకు చాలా సపరిచితమైన డైలాగులు కదా ఇవి. ఇక్కడ సంఘపరివార్‌ భాష, అక్కడ బౌద్ధ మతగురువులు, సైనిక అధికారులు మాట్లాడే భాష ఒక్కటే. ఇలానే మెదలుపెట్టారు. మెజారిటీ ప్రజల్లో కసిని, ద్వేషాన్ని రగిలిస్తూపోయారు. పేదరికానికి, సామాజిక వెనకబాటుతనానికి నియంతృత్వ పాలకులు మతోన్మాద జాతీయవాదాన్ని ఎరగావేశారు. ఈ భావజాలం మనుషుల్ని ఎంత అమానవీయంగా తయారుచేసిందంటే వేలాది మందిని అత్యంత క్రూరంగా చంపుతున్నా వేడుక చూసేలాగో, మౌనంగా ఉండిపోయేలాగో, ఇదేదో జరగవలసిందే అనుకునేలాగో! ఒక రకంగా డెభ్బైల నుండే మెదలైన జాతిహనన ప్రక్రియ బహూషా ఇప్పుడు పూర్తికాబోతోంది. 1978లోనే చాలా మంది బాంగ్లాదేశ్‌ వెళ్లిపోయారు. 1991-92 మధ్య రెండున్నర లక్షల మంది బాంగ్లాదేశ్‌ పారిపోతే, బాంగ్లాదేశ్‌ ప్రభుత్వం తిరిగి వెళ్లిపొండని ఆదేశించింది. 1997లో సుమారు రెండు లక్షల ముప్పై వేల మంది మయన్మార్‌ తిరిగివెళుతుంటే ఆగస్టు 15 తర్వాత ఇంకెవ్వరినీ అనుమతించమని మయన్మార్‌ ప్రభుత్వం చెప్పేసింది. అట్లా ʹజుంటాʹల పాలనలో ఇది పరాకాష్టకు చేసి, మళ్లీ 2012 అల్లర్లలో సుమారు లక్షా నలభై వేల మంది నిర్వాసితులయ్యారు. 2013-15 వరకు రోహింగ్యాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇంతటి దుస్సహ స్థితి నుండే రోహింగ్యాలు సాయుధ ప్రతిఘటనవైపు పోవలసి వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో ఆరాకన్‌ రోహింగ్యా విముక్తి సేన రఖైన్‌ మిలిటరీ పోస్టుల మీద దాడులు చేసింది. అప్పటి నుండి సైన్యం విచక్షణ లేకుండా రోహింగ్యాల ఆవాసాలపై దాడులు చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఆగస్టు 25న మళ్లీ తిరుగుబాటుదారులు అనేక రక్షణ పోస్టుల మీద దాడులు చేశారు. వాళ్లకు సహకరించారనే మిషతో వేలాది ఇళ్లను సైన్యం తగలబెట్టింది. ఒక ప్రాంతంలో హెలీకాప్టర్‌ నుండి ప్రజల్ని కాల్చుతూ పోయారని కూడా తెలిసింది. చాలారోజుల వరకు మీడియాను అనుమతించకపోవడంతో ఈ విషయాలన్నీ ఆలస్యంగా వెలుగుచూశాయి. బాంగ్లాదేశ్‌ పారిపోయిన వాళ్లు చెప్తున్న కథనాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనమవుతున్నాయి. జాతిహననానికి సజీవ ఉదాహరణ అంటూ చాలా దేశాలు మాట్లాడుతున్నాయి. పసిపిల్లల్ని కూడా మంటల్లో విసిరేసే కథనాలవంటివి మనం 2002లో గుజరాత్‌ నుండి విన్నాం. మరో దశాబ్దానికి ముజఫర్‌నగర్‌ నుండి విన్నాం. ఒక జాతిహననానికి మానసికంగా సిద్ధం చేయడం ఎలా ఉంటుందో, ఆ విషప్రచారాన్నంతా అనుభవిస్తూనే ఉన్నాం. అటువంటి దేశభక్త నియంతలపాలనలోనే ఉన్నాం. రోహింగ్యా మంటల్లో వందలాది గుజరాత్‌లు, కశ్మీర్‌లు కనిపిస్తాయి.

మయన్మార్‌ గురించి ఇంతకు ముందు ఎప్పుడు విన్నాం? కరడుగట్టిన సైనిక పాలన మధ్య నుండి హక్కుల నినాదమై ప్రపంచమంతా ప్రతిధ్వనించిన బక్కపలచని మహిళ అంగ్‌సాన్‌ సూకీ ద్వారానే కదా? పదిహేను సంవత్సరాల సుదీర్ఘ నిర్బంధం నుండి స్టేట్‌ కౌన్సిలర్‌గా నామమాత్రపు ప్రభుత్వ ప్రాతినిధ్యాన్నైనా సాధించడానికి ఎన్ని దేశాల గొంతులు కలిసి మద్దతు ప్రకటించాయి! విదేశీయుడిని పెళ్లి చేసుకుందని మయన్మార్‌ పౌరసత్వ చట్టం సాకుగా చూపి ఎన్నికల్లో గెలిచినా ఆమె ప్రాతినిధ్యాన్ని నిరాకరించి సైన్యం ఆమెను నిర్బంధించింది. తన సహచరున్ని ఎన్నుకునే హక్కు ఆమెకు ఉందని, ఆమె తన భర్తతో, పిల్లలతో జీవించే హక్కును కాదనే అధికారం ఎవరికీ లేదని ప్రపంచం ఆమె పక్షాన నిలబడింది. ఆమే ఇప్పుడెంత సులభంగా సైన్యంతో గొంతు కలుపుతోంది! రోహింగ్యాల విషయంలో గోరంతను కొండంతలు చేసి ప్రచారం చేయకండని మాట్లాడుతోంది? ఆమె పోరాటమైనా పూర్తి కాకుండానే సైనిక నియంతలతో సర్దుబాటు చేసుకుంది!

మయన్మార్‌ వెళ్లొచ్చిన ప్రధానినుండి మనమేం ఆశించలేం. రోహింగ్యా శరణార్థులను వెనక్కు పంపించాలని మాట్లాడ్డంలో ఆశ్చర్యమేముంది? లక్షమంది టిబెట్‌ శరణార్థులతోపాటు ఎప్పటి నుండో ఇక్కడ ఆశ్రయం తీసుకుంటున్న వాళ్ల గురువు దలైలామా మాట్లాడడు. ముస్లింలను అనుమతించకపోవడానికి కారణం ఏ జాతీయ విధానం అనడిగితే ముస్లింలు కాబట్టి ఉగ్రవాదులు ఉండొచ్చు అని అనగలరు. అంతకు మించి సంఘపరివార్‌కు అక్కడి బౌద్ధమతోన్మాదులు, సైన్యం ముచ్చటగొలుపుతూ ఉండొచ్చు. ఏ విధంగా చూసినా రోహింగ్యాలకు మనం బాసటగా నిలవాల్సిన వాళ్లం. ఇప్పటికి నాలుగు లక్షల మంది బంగ్లాదేశ్‌ వలసవచ్చారు. ఎంతమంది అంతరించిపోయాలో ఎప్పటికి లెక్క తేలేను? 21వ శతాబ్దంలో ఒక జాతి నిర్మూలనకు సాక్షులుగా ఉండే స్థితి ఎంత దుర్భరం!

No. of visitors : 518
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  తెగులు సోకిన రచయితలారా రండీ
  ఎవరి ప్రాభవం తండ్రీ..
  వెలివేయబడ్డ అక్షరం
  గుండె గుర్తులు వెతుక్కుంటూ
  ఏ స‌మాజం కోసం?
  సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌
  అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?
  ప్రతివాది
  కవి ఎక్కడ?
  ధిక్కార స్వరాలకు ఆహ్వానం
  సౌందర్యాత్మక కవిత
  అమ్మకొ లేఖ!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •