భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

| సాహిత్యం | వ్యాసాలు

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

- పాణి | 22.09.2017 01:18:31pm

కంచె ఐలయ్యగారి తాజా పుస్తకం సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం మీద జరుగుతున్న రాద్ధాంతం చూస్తే విసుగు, భయం రెండూ కలుగుతున్నాయి. మన సమాజం భావాలను చర్చించే స్థాయికి ఇంకా ఎదగలేదనడానికి ఇదొక ఉదాహరణ. చాలా మైల్డ్‌ కమ్యూనిటీ అనుకొనే కోమట్లు ఇంతగా రోడ్డ మీదికి వచ్చి వీరంగం వేయడం ఆశ్చర్యమే. వాళ్లంతా తాము సామాజిక స్మగ్లర్లం కాదు.. అంటూ వ్యాపారులుగానే స్పందిస్తున్నారు తప్ప అక్షరాలు వచ్చినవాళ్లుగా వ్యవహరించడం లేదు. కోమట్లలోనూ అంతో ఇంతో చరిత్ర చదువుకున్నవాళ్లు ఉంటారు కదా.. ఐలయ్య గారి రచన తప్పయితే వాళ్లూ రాయవచ్చుకదా. ఆ పని చేయకుండా ఈ బెదిరింపులేమిటి? విన్యాసాలేమిటి?

అసలు వాళ్లు పుస్తకాన్ని చదివే ఉంటే తప్పక ఈ బెదిరింపులు, ఏడుపులు కాకుండా నాలుగు మాటలు గట్టిగా మాట్లాడి ఉండేవాళ్లు. ఆదేమీ లేదు. పైగా కోమటోళ్లు అంటాడా.. అనే ఫీలింగు ఒకటి. ఐలయ్య ఉత్పత్తి కులాలను కూడా చాకలోళ్లు, గొల్లోళ్లు అనే రాశారు. అది వ్యవహారికం. దానికీ గోలేనా? పైగా ఇంత కాలం దళిత, బహుజన కులాలను ఈ వైశ్యులు, బ్రాహ్మలు, రెడ్లు ఊళ్లలో మాలోల్లు, మాదిగోల్లు, చాకలోల్లనే పిలిచారు. అప్పుడు వాళ్లకు మనోభావాలు అనేవి ఉంటాయని, అవి గాయపడతాయని అనుకోలేదు. వేల ఏండ్ల నుంచీ అనుకోలేదు. ఇప్పుడు ఒక బీసీ వచ్చి కోమటోళ్లు అనే సరికి ఆత్మగౌరం, మనోభావాల సమస్య ముంచుకొచ్చింది. అసలు మనోభావాలనే పేరుతో బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌ చేయడం గత ఇరవై ఏళ్లలో ముందుకు వచ్చిన వికృత సామాజిక సంఘర్షణా రూపం. దాన్ని ఎవవరు ప్రదర్శించినా జుగుప్స కలుగుతుంది. దాని ముందు ఇక ఏ చర్చ ఉండదు. సంభాషణ ఉండదు. సంవాదం సాగదు. సత్యాన్వేషణ ఉండదు. అసలు ఆలోచనకే తావు ఉండదు. అవతలివాళ్లు సాగిలపడాలని కోరుకునే ఆధిపత్యధోరణిగా ఈ మనోభావాలు గాయపడటం మారిపోయింది. ఐలయ్యగారిని అలా లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. భావాల చర్చ జరిగాక సత్యం ప్రాతిపదిక మీద ఒక రచయిత తన పుస్తకం పేరు మార్చుకోవచ్చు. అసలు మౌలిక ప్రతిపాదనలే మార్చుకోవచ్చు. అది ఒక అన్వేషణాక్రమంగా సాగే బాధ్యతాయుతమైన సామాజిక ఆచరణ కావాలి.

కానీ ఇప్పుడు ఈ పుస్తకం విషయంలో అట్లా జరగడం లేదు. మనోభావాలను దెబ్బతీశారని, తమ కులాన్ని కించపరిచారని శబ్ద కాలుష్యం సృస్టిస్తున్నారు? కోమటి నాయకులు అక్కడితో ఆగలేదు. మామూలుగా అయితే కోమట్లు ఇంత తీవ్రమైన మాటలు అనగలరా? అనే సందేహం కలుగుతుంది. కానీ ప్రతి ఊళ్లో ప్రతి చోట ఐలయ్యను బెదిరిస్తూ ప్రకటనలు ఇచ్చారు. చంపుతామంటున్నారు. నరుకుతామంటున్నారు. అత్యల్ప సంఖ్యాకులైన కోమట్లను వాళ్ల నాయకులు ఇన్ని రోజుల నుంచి ఎక్కడో ఒకచోట రోడ్డు మీదికి తెస్తూనే ఉన్నారు.

ఈ సందర్భంలో పై కులాలు సంఘటితం కావడమనే సామాజిక సమీకరణాన్ని విస్మరించడానికి వీల్లేదు. పైకులాల్లోని పేదలు తమ న్యాయమైన సమస్యల మీద కులాలుగా సంఘటితం కావచ్చు. కాక తప్పదు కూడా. కానీ ఇంత మూక స్వభావంతో ఇలా సంఘటితం కావడం మాత్రం ప్రమాదమే. అసలు భారత దేశంలో అగ్రకులాల సంఘటితత్వం సామాజికంగా అవరోధం. శతాబ్దాల నుంచి అధికారం, సంపద ప్రాతిపదిక మీద పైకులాలు సంఘటితంగా ఉండేవి. ఇప్పుడు కింది కులాలు అస్థిత్వ చైతన్యంతో సంఘటితం కావడం మొదలు పెట్టేసరికి వాళ్లు కూడా పున:సంఘటితం అవుతున్నారు. ఇలాంటి ధోరణితో సంఘటితం అయితే సామాజిక ప్రగతికి తప్పక ఆటంకం కలుగుతుంది.

అదీ భావాల మీది కోపంతో గౌరీలంకేష్‌ను సంఘపరివార్‌ హత్య చేసిన ఈ సమయంలోనే కోమటి నాయకులు ఇలా వీధుల్లోకి ఎక్కడం ఆశ్చర్యం కలుగుతోంది. అనేక వైపుల నుంచి భిన్న భావాలను అంగీకరించలేనితనం ఎలా పెరిగిపోతోందో తలుచుకుంటే భయం కూడా కలుగుతోంది.

ఒక రచయిత పుస్తకం రాస్తే చంపుతామనడం, ఆయన దిష్టిబొమ్మలు తగలపెట్టడం.. చూస్తే ఈ సమాజం ఏ కూపస్థ దశలో ఉన్నదా అని విచారం కలుగుతోంది. ఇలా పుస్తకం రాసేసి వివాదాస్పదంగా మారి తేరగా కీర్తి కొట్టేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని మరో ఆరోపణ. కోమట్ల సంఘ నాయకులకు లోకం పట్టకపోవడంతో ఇప్పటికే ఆయనకు ఎంత గుర్తింపు ఉన్నదో తెలియదు. గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న ఐలయ్యగారితో వాదనకు దిగితే కోమటి మేధావులకు కూడా కేజీల లెక్కన గుర్తింపు పెరుగుతుంది కదా. ఆ పని ఎందుకు చేయకూడదు? మధ్యలో కేసులేమిటి? పుస్తక దహనాలేమిటి? అక్కడితో ఆగక ఆ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేయడం ఏమిటి?

ఆంధ్రపద్రేశ్‌ ముఖ్యమంత్రి కోమటి నాయకులకు అనుకూలంగా స్పందించి ఐలయ్యగారి మీద కేసులు పెట్టమని పోలీసులకు పురమాయించాడు. భావాల చర్చలోకి వచ్చే నైతిక అర్హత చంద్రబాబు ఎప్పుడు సంపాదించకున్నాడు? ఆలోచనా ప్రపంచం, భావ సంఘర్షణలాంటివి ఏమీ తెలియని దొడ్డ వ్యాపారి, నేర స్వభావి అయిన చంద్రబాబు వ్యక్తిగా, ప్రభుత్వాధినేతగా కూడా సహజంగానే ఈ సమస్యను క్రైమ్‌గా చూస్తున్నాడు. ఆయన మార్గంలోనే తెలంగాణ హోం మంత్రి కూడా కేసులు పెడతామంటున్నాడు.

ఇంతకూ ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరిశోధన. దీన్ని విస్మరించి మన దేశ సామాజిక చరిత్రను అర్థం చేసుకోవడం కష్టం. దీనికి అయన ఉత్పత్తి కులాల కోణం ఎంచుకున్నారు. ఇది పూర్తి సరైనది. ఆయన ఆధ్యాత్మిక ఫాసిస్టులు బ్రాహ్మణులు అని, సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అని రాసినంత మాత్రాన ఆ కులాల వాళ్లు మమ్మల్ని ఇంత మాట అంటాడా.. అని గింజుకుంటే ఏం ప్రయోజనం లేదు. తప్పనిసరిగా అంటారు. ఆ మాట కాకపోతే మరో మాట. ఐలయ్యగారితో పేచీ ఉంటే ఎవరైనా చర్చించాల్సిందే. నిజానికి ఆయన చెప్పే వివరాలు, ఉపయోగించే భాషే కాదు.. ఆయన మెథడ్‌లోనే కొన్ని తప్పులు ఉన్నాయి. అయినా ఆయన రాసే వాటిలో కొంత తెలుసుకోవాల్సింది ఉంటోంది. ఇప్పుడు ఈ మాట ఆయనకు చెప్పడం, ఆయన ఆలకించడం కూడా కష్టం. పైగా ఇలా ఎవరు మాట్లాడుతున్నారో..వాళ్ల కులాల వివరాలు తెలుసుకొని ఫలానా కులం కాబట్టి ఇలా అంటున్నారని ఆయన అనగలరు. ఇది అయన తప్పు కూడా కాదు. సాంఘిక విముక్తి ఆకాంక్షగల అస్తిత్వ వాద రుగ్మత ఇది. ʹమా ఐలయ్యగారి రచనా పద్ధతి గురించి ఇలా అంటారా?ʹ అని ఆయన కులస్థులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆందోళనకు దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఇది గతంలాగా బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడే శక్తి కోల్పోయింది. కోమట్ల గోల కూడా న్యూస్‌ వ్యాల్యూ, తద్వారా న్యూసెన్సూ తప్ప మరే సామాజిక ప్రభావం లేని ప్రహసనం కావడం చూస్తున్నాం. ఇదంతా పూర్తిగా వేరే విషయం. ఈ వివరాల్లోకి వెళితే ఇప్పుడు అదంతా ఎందుకు ఐలయ్యగారి పక్షమో, కోమటి నాయకుల పక్షమో తీసుకోవాలి గాని అనే వాళ్లూ ఉంటారు. అది చాలా తెలివైన ప్రజాస్వామిక వైఖరి అనిపించుకుంటుందేమోగాని ఎందుకూ పనికి రాదు. ఈ వివాదంలో తప్పక ఐలయ్యగారి పక్షం వహించాల్సిందే. నిస్సందేహం. కానీ ఇవాల్టి ఈ సామాజిక వాతావరణం ఎందుకు ఇలా తయారైంది? కోమట్ల రభసకు వెనుక వాళ్లకు అది ఎలా కలిసి వచ్చింది? దాని స్వభావం ఏమిటి? అనే ప్రశ్నలు వేసుకోకుండా ఎలా ఉండగలం?

కోమట్లు చరిత్రలో ఏ పాత్ర పోషించారనే విషయంలో ఐలయ్యతో విభేదాలు ఉంటే కూడా ఆయన పక్షం తీసుకోవాల్సిందే. ఉత్పత్తి కులాలు, ఉత్పత్తికి బయట ఉన్న కులాలు అనే ప్రధాన కోణం చాలా విలువైనది కాబట్టి. అయితే ప్రపంచీకరణ తర్వాత గతంలాగా వీధిలో దుకాణం పెట్టుకొని వ్యాపారం చేసుకునే పరిస్థితి కోమట్లకు పోయింది. ఈ చిన్న చేపలను పెద్ద చేపలు ఎప్పుడో మింగేశాయి. ఈ తాకిడి మారుమూల పల్లెలకు ఇంకా అంతగా ఉండకపోవచ్చు.

అలాగే ఐలయ్యగారు హేతురహిత వాదనలోకి దిగి విప్లవకారులను ఎంత తిట్టిపోసినా మిత్రవర్గంలోని మేధావి అని వాళ్లు పట్టించుకోకపోవచ్చు. కాని సామాజిక సంఘటిత సమీకరణాలు బలపడిన తరుణంలో అత్యల్ప సంఖ్యాకులైనంత మాత్రాన కోమట్లు ఎందుకు ఊరుకుంటారు? వాళ్లు తమకు నొప్పి కలిగిందని అనగానే ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. తమ దుర్మార్గాన్ని ప్రకటించుకుంటాయి. అంత ప్రాధాన్యత తున్న కులం అది. పైగా ఇది పై కులాలు సంఘటితమవుతున్న కాలం. దాని నష్టం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో! అది ఆందోళనాకరం. ఇప్పటికే కోమట్ల గోలను సంఘపరివార్‌ బాగా సొమ్ము చేసుకుంటోంది. సమాజంలో ఏ చిన్న గొడవ జరిగినా దాన్ని హిందుత్వ శక్తులు వాడుకోవడం ఎప్పుడో మొదలైంది. ఆ గొడవ ఏదైనా, ఎలాంటిదైనా దాన్ని హిందుత్వ సమస్యగా మార్చి మెజారిటీవాదం గొడుగు కిందికి తీసుకరావడంలో సంఘపరివార్‌ విజయవంతమవుతోంది.

అందువల్ల సమాజానికి అవసరమైన, విలువైన కృషిలో విశ్లేషణ సంవిధానం చాలా శాస్త్రీయంగా ఉండాలి. హేతుబద్ధంగా ఉండాలి. అవతలి వాళ్లలో కాస్త ఆలోచించేవాళ్లయినా ఎంగేజ్‌ కాగలిగేలా వాదన పద్ధతి, భాష, సూత్రీకరణలు ఉండాలి. ఈ మాట కోమట్ల పుస్తకం గురించే కాదు.. మొత్తంగానే ఐలయ్యగారి విశ్లేషణ పద్ధతి గురించి. అవతలి వాళ్లు కాకపోతేమానె.. ఇతరులైనా బెస్ట్‌ అనేలా ఉండాలి. కానీ ఐలయ్యగారు ఎంచుకున్న పద్ధతి చాలా కష్టం. ఈ మాట అనడానికి ఆయన రచనల్లోకి వెళ్లి గంభీరంగా చర్చించాల్సిన పని లేదు. ఈ వివాదంలో భాగంగా ఆయన వైశ్య సంఘాలు తీవ్ర వాద సంఘాలుగా మారిపోయాయి అన్నారు. దశాబ్దాలపాటు హక్కుల ఉద్యమంలో పని చేసిన ఐలయ్యగారు ఇలా అనడం ఆశ్చర్యం కాదు. ఇది ఆయన పద్ధతిని పట్టించే మాట. తీవ్రవాదమని ఎవరు అంటారు? ఎవరు ఎవరి మీద ఈ మాటను రూఢి చేశారు? ఇవేవీ ఆయన ఆలోచించరు. ఒక వివాదంలోనే ఇంత లూజ్‌గా సూత్రీకరించగల ఐలయ్యగారు సామాజిక పరిశోధనలో ఉపయోగించే భాష, చేసే నిర్ధారణలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాజిక చరిత్రలో వివిధ కులాలు నిర్వహిస్తూ వచ్చిన పాత్ర మారుతూ వచ్చింది. ఎందుకంటే కులవ్యవస్థ సజీవమైంది కాబట్టి. సజీవమైంది ఏదైనా చలనంలో ఉంటుంది. తన మౌలిక స్వభావం ఏమీ మార్చుకోకుండానే అది చలనం ఉన్నది. అందువల్లే ఒకప్పుడు శూద్రకులాలనబడినవి ఇప్పుడు అగ్ర, ఆధిపత్య కులాలయ్యాయి. దీని మీద ఎంత విశ్లేషణ అయినా ఇచ్చుకోవచ్చు. అందులో బోలెడు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ అందరూ అందించే మౌలిక విషయం ఇది. దీన్ని గుర్తించే మోతాదులో కూడా తేడా ఉంటాయి. కొందరు చాలా మారిందనవచ్చు. మరి కొందరు పెద్దగా మారలేదనవచ్చు. మొత్తం మీద కులాల పాత్ర ఎంతో కొంత మారుతూ ఉన్న క్రమంలో ఆ కులాల్లో వర్గాలు పుట్టుకొచ్చాయని కూడా సులభంగానే తెలుసుకోగలం. రాజకీయార్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులను బట్టి ఉత్పత్తి కులాలు, ఉత్పత్తిలో లేని కులాలు గతంలో నిర్వహించిన పాత్ర మారుతూ ఉన్నది. మామూలు జీవన పరిశీలనకు కూడా అర్థమయ్యే విషయం ఇది. కానీ ఐలయ్యగారికి ఇవి అర్థం కావు. అలాంటి సామాజిక పరిశోధన పద్ధతి ఆయనకు తెలియదు. అందువల్ల ఉత్పత్తి కులాలు, ఇతర కులాలు అనే మంచి పరిశీలనా పద్ధతి చాలా అసమగ్రంగా మిగిలిపోయింది. యాంత్రికమైపోయింది. సమస్యాత్మకమైంది. దాన్నుంచి పుట్టుకొచ్చే వివాదాలను ప్రతీఘాతుక సంఘపరివార్‌ లాంటి శక్తులు చక్కగా వాడుకోవచ్చు. ఆయన ప్రతివాదనను ఇలా వాడుకుంటాయని ఎందుకు అనాలిగాని, ఇప్పుడు వాడుకోవడం అయితే చూస్తునే ఉన్నాం. అందుకనే కాదు, మౌలికంగానే ఒక సామాజిక, చారిత్రక పరిశోధకుడిగా ఆయన పద్ధతిలో ఉన్న సమస్య ఏమిటి? అని ఆలోచనాపరులు పట్టించుకుంటారు. ఆయన స్వీకరించినా, తిరస్కరించినా కూడా. ఎందుకంటే అందరూ ఈ వివాదంలోని కోమటి వాళ్లలాగా స్పందించరు కదా? ఆలోచనా సంఘర్షణకు ఒక శాస్త్రీయ పద్ధతి ఉన్నదా లేదా? అని పట్టించుకునే వాళ్లు, చర్చించే వాళ్లు ఇంకా మన సమాజంలో మిగిలే ఉన్నారు. దానికి సిద్ధం కాకుండా ʹఅతిʹ ఎవరు ప్రదర్శించినా, బ్లాక్‌ మెయిల్‌ చేసినా, సెంటిమెంటలైజ్‌ చేసినా, బెదిరించినా అది ఫాసిజమే అవుతుంది.

No. of visitors : 1759
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి

ఏది సత్యం ? ఏది అసత్యం ?

పాణి | 17.04.2020 01:43:44pm

విరసం ఆచరణలో లోటుపాట్లు ఉన్నాయని శరత్ చంద్ర అనుకుంటే, తాను విప్లవాభిమాని అయితే వాటిని సంస్థకు తెలియజేయవచ్చు. విరసం నిరంతరం అలాంటి సూచనలను గౌరవంగా స్వీకరి......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...

  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •