జలగలంచ, దేవునిగుట్ట ఆదివాసుల్ని బతకనీయండి!

| సాహిత్యం | వ్యాసాలు

జలగలంచ, దేవునిగుట్ట ఆదివాసుల్ని బతకనీయండి!

- వడ్డెబోయిన శ్రీనివాస్‌ | 05.10.2017 11:16:52pm

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కొద్దిమంది రచయితలం, కవులం గుత్తికోయల మీద విధ్వసం జరిగిన జలగలంచకు సెప్టెంబరు 22న వెళ్లాం. వరంగల్‌ నుండి తాడ్వాయికి వెళ్ళే మార్గంలో, తాడ్వాయి మండలానికి దగ్గరగా ఉన్న లవ్వాల బస్టేజి వద్ద దిగాం. లవ్వాల స్టేజీ కాంచి జలగలంచకు మా వాహనం వెళ్ళడం కష్టం. ఎందుకంటే అక్కడి నుండి కాలిబాట. ఎగుడు దిగుళ్ళబాట. అయితే వర్షం పడ్డ తర్వాత బుల్డోజర్లు, ట్రాక్టర్లు వెళ్ళినందున మన కళ్ళను మాయ చేస్తూ బండ్ల బాటలా భ్రమింపచేస్తుంది. దారిలో వెళ్తుంటే రెండు చిన్న వాగులు వచ్చాయి. పాదాలు మునిగే ప్రవాహం సాగుతోంది. చిన్న చిన్న చేప పిల్లలు స్వేచ్ఛగా ఆడుకుంటున్నాయి. లవ్వాల స్టేజీ దగ్గర నుండి కూడా అడవి దట్టంగానే మొదలై వెళ్తుంటే వెళ్తుంటే ఇంకా చిక్కబడ్తుంది. చిన్న చిన్న టేకు మొక్కలు కన్పిస్తున్నాయి. ఇప్ప చెట్లు, ఇతర చెట్లు కన్పిస్తున్నాయి. కాని ఎక్కడా పెద్ద టేకు చెట్లుకాని, జిట్రేగు కాని, పెద్దగా కాని కన్పించడం లేదు.

ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఎగుడుదిగుడు బాట దాటి మూడు, నాలుగు కి.మీ. అడవిలోకి పోయిన తర్వాత దూరంగా కూలిపోయిన గుడిసె కన్పిస్తోంది. మరో రెండు మూడు వందల అడుగులు వేశామో లేదో కాలిబాట పక్కన నరికేసిన నీలిరంగు నవారు మంచం పడవేసి ఉంది. అక్కడే కాలిబాటకు కుడిపక్క గోంగూర మొక్కలు కన్పించాయి. మరో పది అడుగులు వేయగానే పొట్టకొచ్చిన వరిపొలం అటువైపు ఇటువైపు. దట్టమైన కలుపు మొక్కల మధ్య కన్పిస్తోంది. వర్షం పడినప్పుడు నీరు ఆగే ప్రదేశంలో వడ్లు అలకడం వల్ల ఆ మొక్కలు మొలిచాయి. చుట్టూ... దూరంగా... గుట్టలు... కొండలు... వాటి మీంచి జారి జారి వచ్చే నీరే బహుశా పంటలకు ఆధారం కాబోలు!

అక్కడి నుండి ఇరువై ముప్ఫై అడుగులు వేయగానే వరిపొలం పక్కనే అంటే కాలిబాటకు కుడివైపు వేర్లతో సహా పెకిలించి తీసుకు వచ్చి పడవేసిన బోరు పంపు... హ్యాండిల్‌తో సహా సెట్టుకు సెట్టు గుడిసెలకు దూరంగా ధ్వంసం చేయబడి ఉంది. ఇంకో పదడుగులు వేయగానే స్కేలులో గీతలు కొట్టినట్టుగా ఏపుగా పెరిగిన కంది చేను. కంది సేను గీతకు గీతకు నడుమ కలుపు మొక్కలు. కొన్ని కంది చేను వరసల మీంచి బుల్డోజరు, ట్రాక్టర్లు వెళ్ళి కుళ్ళిపోయిన మొక్కలు. బొబ్బర్లో, పెసల్లో, జొన్నలో, పక్కనే చినుకులు పడితే ఏవో విత్తులు అలకడానికి సిద్ధం చేసిన భూమి. ఆ భూమికి కంది సేనుకు మధ్యనే కాలిబాట. కంది చేను చివరన వస్తుంటే దూరంగా కన్పించిన గుడిసె. పైపెంకలన్నీ పగలగొట్టబడగా... కాల్చని ఎండిన ఇటుకలతో కట్టిన ఇల్లు కూలి కనిపిస్తోంది. అదే జలగలంచ. దూరదూరంగా విసిరేసినట్టుగా ఇండ్లు. అన్నీ కూలగొట్టబడి ధ్వంసం చేయబడినవే! బుల్డోజరు వేటుపడని గుడిసె లేదు. బుల్డోజరు కాటుపడని దడి లేదు. చాలా కుటుంబాల్లో చిన్న పిల్లలున్నారు. వర్షం వస్తే వారి పరిస్థితి ఏమిటనే కనికరం కూడా చూపలేదు.

అక్కడ ఒక కర్రగాని, ఒక సన్న నిట్రాడు దూలంగాని వాళ్ళ అవసరానికి మించి ఒక చిన్న కర్ర కూడా ఎక్కువ లేదు వాళ్ళ దగ్గర. అట్లాగే ఎలాంటి ఎరువులు లేకుండా తమ కుటుంబావసరాలు తీర్చగలిగేలా తలా 3 నుండి 4 ఎకరాల పోడు భూమి మాత్రమే 36 కుటుంబాలకుంది. బాహ్య ప్రపంచ వ్యవసాయ పద్ధతులకు దూరంగా వారసత్వంగా వస్తున్న పోడు వ్యవసాయం ద్వారా పండీ పండని గింజలతోనే కడుపు నింపుకొంటారు వారు. కొంత కాలం నుంచి సాగు ఫల సాయంతో కుటుంబం గడువక తడ్వాయి, పస్రావంటి ప్రాంతాలకు కూలికి కూడా పోతున్నారు.

గుత్తికోయల గూడెం చుట్టూ దట్టమైన అడవి పరుచుకుంది. 18, 20 సంవత్సరాల నుండి జలగలంచ వారి నివాసం. అదే మైదాన ప్రాంతీయులు గనుక అడవిలో నివాసముంటే ఆ ప్రాంతమంతా మైదానమైయ్యేదే! కాని కోయలు తాము, తమ గుడిసెలు తమ సాగు కూడా దగ్గరకు పోయే వరకు మనం గుర్తించలేం.

అడవి చేపలు వాళ్ళు. చెరువులోంచి చేపల్ని గట్టు పడేస్తే ఎలా బతుకులేవో... అడవిలోంచి వారిని మైదాన ప్రాంతానికి తరలిస్తే ఆదివాసులూ బతుకలేరు. మైదాన ప్రాంత వ్యవసాయంలోని ఆత్మహత్యల సాంప్రదాయం, వారు పోడు వ్యవసాయంలో లేదు. అప్పులూ లేవు. వారు అడవికి రక్షణ. అడవి వారికి రక్షణ. అడవి నరికి, అడవిలో అద్దాల మేడ కట్టుకున్న ఆదివాసెవరున్నారు? ఆదివాసుల్ని తరిమి ఖనిజాల కోసం అడవిని నాశనం చేస్తున్నదెవరు?


నిజానికి ఈ వ్యాసం రాస్తున్నప్పుడే సెప్టెంబర్‌ 26వ తేదీన 4 ఎండ్లబండ్లలో కలప తరలిస్తున్న స్మగ్లర్లు ఇద్దర్ని పట్టుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి ఫారెస్టోళ్ళు తరలిస్తాంటే దారి కాచి 50 మంది దుండగులు గొడ్డళ్ళు రాళ్ళతో దాడి చేసి, ఫారెస్టోళ్ళను తరిమి పట్టుబడిన వారిని తీసుకొని పోయినట్టు పత్రికల్లో చదివాం. అలాగే 28 నాడు 8 ఎడ్ల బండ్లల్లో భూపాలపల్లికి స్మగ్లర్లు తరలిస్తుంటే ఫారెస్టోళ్ళు పట్టుకున్నట్టు పత్రికల్లో వార్తలొచ్చాయి. నాటి కొంరంభీం నుంచి నేటి జలగలంచ, దేవునిగుట్ట దాక అడవిని నాశనం చేస్తున్నవారు రాజ్యం కనుసన్నల్లో కదలాడుతున్న వారే కాని ఆదివాసులు కాదు.

200 మంది ఫారెస్టోళ్ళు సెప్టెంబరు 16 నాడు ఉదయం 8 గంటల నుండి సా|| 4 గంటల వరకు జలగలంచ మీద విధ్వంసానికి తెగబడ్డారు. నిజాం కాలంలో కుంరంభీం సంకెనపెల్లి గూడెంలో చూచిన చాలా అనుభవాలు జలగలంచలో కూడా పిల్లలు చవి చూశారు.

8 సంవత్సరాల కిందే గొడ్డళ్ళతో ప్రతీ వస్తువును ముక్కలు చేసి గూడెంను తగలబెట్టారు. మళ్ళీ అదే ఫారెస్టోళ్ళు గుడిసెల మీదకు బుల్డోజరును పంపారు. గుడిసెలు దుగ్గు దుగ్గు అయ్యాయి. కాల్చని ఇటుకల గోడలు మట్టిలో కలిశాయి. కప్పు మీది బెంగుళూరు పెంకులు ముక్కలు ముక్కలయ్యాయి. తిరిగి గుడిసెల కోసం కర్రలను అడవి నుండి సేకరించుకోవాల్సిన పరిస్థితులు ఫారెస్టోళ్ళే కల్పించారు.

ఆ కలనో, మంచినీళ్ళనో పిల్లలు ఏడుస్తున్నప్పుడే, పొద్దున్నే పొయ్యి మీద ఉడుకుతున్న అన్నాల్ని, కూరల్ని మట్టిలో కలిపి ఆనందించారు. మట్టి కుండల్లో మంచినీళ్ళ కింద పారబోసి కుండలు పగలగొట్టారు. తాగునీటి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేయించిన బోరును తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధ్వంసం చేయించింది. ఇంకా రేషన్‌కార్డులు, ఓటరు ఐడీలు తగలబెట్టలేదు నయం!

ఆదివాసుల ఆకలి తీర్చడానికి సిద్ధంగా ఉన్న అనేక పంటల్ని, కూరగాయమొక్కల్ని బుల్డోజరుతో తొక్కించారు. ఆదివాసులు బుల్డోజరుకు అడ్డం బోయినా ఆగలేదు.

కుంజం ఆర్మయ్య ఇంటిలోని 5 సేర్ల ఇప్పసార తాగాక ఫారెస్టోళ్ళ వీరంగానికి హద్దులేకుండా పోయింది. గర్భవతులని కూడా చూడకుండా మడావి అయితమ్మ, (1 సం|| బిడ్డకు తల్లి కూడా) మునితల మీద విరుచుకుపడ్డారు. గర్భానికి తగిలిన దెబ్బలతో అయితమ్మ మేము వెళ్ళే నాటికి కూడా బాధపడుతుంటే, మునితకు సరిగా నడవ రావడం లేదన్నారు. ఈ విషయం చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివాసీల చీరల్నే లాగి, ఆ చీరలతోనే వారిని ఇప్ప చెట్టుకు కట్టేయడం, కొట్టడం జరిగింది. కొందరు ఆదివాసీల మెడలకు, కాళ్ళకు గాయాలు కన్పించాయి. కుందం జ్యోతిని కర్రతో కొట్టడంతో ఆమె చేయి వాసిన తీరును చూపించింది. మరికొద్ది దూరంలో మరో ఇప్ప చెట్టుకు మడావి మంజుల - సోమయ్య అనే భార్యా భర్తల్ని కూడా ఇప్పచెట్టుకు కట్టేసి కొట్టారని చెపాపస్త్ర్ర. ఆదివాసీల ఆహాకారాలు, ఆర్తనాదాల మధ్య దుశ్శాసన పర్వం నిరాటంకంగా సాగింది.

ఫారెస్టోళ్ళ రాకతో భద్రి అనే 9 సంవత్సరాల బాలుడు ఏవైన వస్తువులను ధ్వంసం కాకుండా కాపాడుకోవాలనే తపనతో ఇంటి అటుకెక్కి కింద పడితే, ఆ పిల్లవాడి గజ్జలకు, మర్మావయవాలకు బలమైన దెబ్బ తగలడంతో మేము గూడెంలోకి వెళ్తున్న దారిలోనే భద్రిని వాళ్ళ నాన్న ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. పిల్లాడు బాగా కుంటుకుంటూ నడుస్తున్నాడు.

ఇంత జరిగినా ముక్కలు కాకుండా మిగిలిన పాత్రలు, ఆదివాసీలు దాచుకున్న బియ్యం, ఇప్పపూలు, బోరల కొద్ది వడ్లు, పప్పు దినుసులు దాదాపు 8 ట్రాక్టర్ల నిండా వేసుకొని తాడ్వాయికి దగ్గరగా అడవిలో పడవేయడం జరిగింది. వాటి జాడ కోసం వెళ్ళే సరికి బియ్యం, ఇప్పపువ్వు, వడ్లు తదితరాలు అడవి కోతుల పాలయ్యాయి. పగిల్న సొట్టబోయిన పాత్రల్ని వెనక్కి తెచ్చుకున్నారు.

కొందరి ఇండ్లల్లోని డబ్బులు తీసుకుపోయారని చెప్పారు. ఒకరి సెల్‌ఫోన్‌ కూడా గుంజుకు పోయారట.

వారు నోరు లేనోళ్ళు. అడవిలో అడివై బతికే వాళ్ళను అడవి నుండి బయటకు వెళ్ళమంటే అడివినే అడవిలోంచి వెళ్ళమన్నట్టుంటుంది. అడవిలో ఆకు పెరిగినట్టు, చెట్టు పెరిగినట్టు, జంపువులు పెరిగినట్టు స్వేచ్ఛగా ఆదివాసులూ పెరిగారు. ఆకు తెంపిండ్రనో, పోడు కొట్టిండ్రనో, జంతువును వేటాడిండ్రనో ఆదివాసుల పట్ల అమానవీయత పనికి రాదు.

ప్రభుత్వం దగ్గరకు వాళ్ళను లాక్కొచ్చుకోవడం కాదు. వారి దగ్గరకే ప్రభుత్వం వెళ్లాలి. అడవిలోనే వారి అభివృద్ధికి సహకరించాలి కాని, వారి మీద కేసులు పెట్టి, వారిపై విధ్వంసానికి పూనుకోవడం నాగరిక ప్రభుత్వాలకు న్యాయం కాదు. చిత్రమేమిటంటే గతంలో గూడెంలో తెరిచిన అంగన్‌వాడీ కేంద్రం గత కొంత కాలంగా మూతపడింది.

పోలవరంలో ఆధివాసీలను ముంచి తెచ్చుకున్న తెలంగాణ, అడవిలో ఉన్న ఆదివాసీలకు శాపం కాకూడు. జలగలంచైనా, దేవుని గుట్టైనా, ఆదివాసుల జీవితాన్ని ఆదివాసుల్నే బతకనీయండి. అడవుల్ని ధ్వంసం చేస్తున్నదెవరో? అడవులు నరికి కోట్లు సంపాదిస్తున్నదెవరో? వనరుల విధ్వంసం చేసి సంపద దోచుకుంటున్నదెవరో పాలకులకు తెలియంది కాదు.

ʹʹఈ గాలి, ఈ నీరు, ఇక్కడి ఆకాశం మొత్తం మనవైనప్పుడు, ఈ భూమి, ఈ అడవి మాత్రమే వాళ్ళవెట్లా అయినవి.ʹʹ కుంరంభీం బాలునిగా ఉన్నప్పుడు సంకెనపల్లి గూడెం, ఆదిలాబాద్‌ అడవుల్లో తన వదినె కుకూబాయితో నిజాం జంగ్లాతోళ్ళకు వ్యతిరేకంగా వేసిన ప్రశ్న. ఇది ప్రభుత్వం 9వ తరగతి తెలుగు పాఠ్య గ్రంథంలో ప్రచురించిన ʹకుంరంభీంʹ ఉపవాచక పాఠ్యంశంలోనిది. నిజాం కాలంలో కుంరంభీం వేసిన ప్రశ్న ఇవ్వాల్టి గుత్తికోయ పిల్లవాడి బుర్రోలనూ తిరుగుతోంది.

No. of visitors : 398
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఇంద్రవెల్లి జ్ఞాపకమా!

వడ్డెబోయిన శ్రీనివాస్ | 17.04.2018 12:23:20am

అడవీ మనిషైయ్యింది అడవీ ఆలోచనైంది అడవీ చీమూనెత్తుటి స్పర్శైంది అడవి మనస్సు పుట్టింది అడవి ప్రశ్నైంది ధిక్కారమైంది సంఘమైంది ...
...ఇంకా చదవండి

గుర్మేహర్‌

వడ్టెబోయిన శ్రీనివాస్‌ | 06.07.2017 12:21:58am

నాన్న రుచి కోల్పోయిన జ్ఞాపకాలగాయం నీగుండెల్లో రక్తమొడ్తుండవొచ్చు హిందుత్వవిచ్చుకత్తులవిన్యాసం నీమనస్సుపొక్కిలి పొక్కిలి చేయవచ్చు ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
  అరుణతార సెప్టెంబర్ - 2018
  యాంటి నేషనల్
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
  అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
  కుట్ర
  ఇప్పటికైనా అర్ధమయిందా....?
  యుద్ధానంతర యుద్ధగీతం
  పోలీసుల నీడలో రాపూరు
  అర్హత

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •