కవి ఆక్రోశం కవుల సమిష్టి ఆక్రోశం కావాలి

| సాహిత్యం | స‌మీక్ష‌లు

కవి ఆక్రోశం కవుల సమిష్టి ఆక్రోశం కావాలి

- వి. చెంచయ్య | 06.10.2017 12:06:03am


ఒక జేబులో అభ్యుదయ భావాన్నీ, మరొక జేబులో అవకాశ వాదాన్నీ పెట్టుకుని కవిత్వం రాస్తూ, లౌక్యంతో పబ్బం గడుపుకునే రోజుల్లో అమాయకంగా కలం పట్టుకుని కవిత్వం రాయడానికి పూనుకున్న కవిగా బండి చంద్రశేఖర్‌ కనిపిస్తాడు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సాగుతున్న దశలో ఆ ఉద్యమ పరిణామాలను వివరిస్తూ వ్యాసాలు రాసిన చంద్రశేఖర్‌, రాష్ట్రం వచ్చింతర్వాత కవిత్వమై ఆక్రోశిస్తున్నాడు. తీరిగ్గా కలం పట్టుక్కూర్చొని కవిత్వాన్ని చెక్కడం ఇతనికి చేత కాదు. సమాజంలో వస్తున్న అసహజ, అనైతిక పరిణామాల్ని చూసినప్పుడు, అప్పటివరకూ ప్రశాంతంగా కనిపించిన అగ్నిపర్వతం లాంటి అతని గుండెల్లోంచి ఎగజిమ్మిన భావాల లావా ఇతని కవిత్వం. ʹʹసమకాలీన సాహిత్యాన్ని నిరంతర అధ్యయనం చేయకుండా నా ఫేస్‌బుక్‌ స్పందనలను పుస్తక రూపంలో ప్రచురించడం సబబు కాదేమోననిʹʹ కవికి అనిపించినా, మిత్రుల ప్రోద్బలంతో వెలుగు చూసిన కవితా సంపుటి ʹʹఈ మట్టి ఆక్రోశంʹʹ. బండి చంద్రశేఖర్‌ రాసిన ʹఈ మట్టి ఆక్రోశంʹ కవితా సంపుటి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మట్టిబండి ఆక్రోశమే చంద్రశేఖర్‌ కవిత.

ఈ కవిత్వాన్ని కవి తన తల్లిదండ్రులకు అంకితం ఇచ్చాడు. ఇది చాలా మంది చేసే పనే.

కాని -

ʹʹఅమ్మా!... అక్షరాలెవ్వి మీరు నేర్వకపోయినా
బాపూ!... చదువులెవ్వి మీకు తెలియకపోయినా

... ... ... ...

మానవత్వం మీద ఎనలేని మమకారం నాలో పెంచినందుకు
ఎవరినీ ఏది యాచించని వారసత్వం నాకు పంచినందుకుʹʹ
అంకితం ఇస్తున్నానని చెప్పడం గొప్పగా ఉంది.

బహుశ తల్లిదండ్రుల్నుండి వచ్చిన వారసత్వ అనుభవం కాబోలు - ʹʹగుట్టు చప్పుడు కాకుండా / గుట్టల మాటున దాక్కుంటున్న / సూర్యుని కిరణపు జాడకోసం / చీకటితో చెలిమి చెయ్యాల్సిందే...ʹʹ అని వ్యక్తిగతంగానైనా, సామాజికంగానైనా కష్టపడందే ఏదీ దొరకదని కవిత్వంలో సూత్రీకరించడం!

విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం - ఒకటేమిటి, సమస్తం కార్పొరేట్‌ స్వభావాన్ని సంతరించుకుంటున్న కాలంలో మనం ఉన్నామన్న స్పృహ కవికి స్పష్టంగా ఉంది. ఉద్యోగాలు విదేశాల్లో, తల్లిదండ్రులు మన పల్లెల్లో.

ʹʹవాళ్ళిక్కడికి రారు. నేనక్కడికి పోను... అందుకే
రేపో మాపో మట్టిలో కలిసే ఆ మట్టి మనుషులను
వృద్ధాశ్రమంలో చేర్పించి నా ఋణం

తీర్చుకోవడం తప్ప నేనేం చేయగలను...ʹʹ అనుకునే స్థితికి యువత చేరుకుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు... కాదు... సాఫ్ట్‌వేర్‌ మరబొమ్మలు... ఎవరికి ఉపయోగపడుతున్నారు? ఇటు తల్లిదండ్రులకూ కాదు, అటు సమాజానికీ కాదు. కనీసం తను సజీవ వ్యక్తిత్వం గల మనిషిగా బతకడానికి కూడా కాదు. ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం 14-16 గంటల పని దినాన్ని 8 గంటల పనిదినంగా తగ్గించుకోవడం కోసం కార్మికులు చేసిన పోరాటం ఈనాటికి మేడే ఉత్సవంగా మిగిలిందే తప్ప, ఆ స్ఫూర్తి ఏ కోశాన్నైనా సాఫ్ట్‌వేర్‌ ప్రపంచంలో ఉందా? సాఫ్ట్‌వేర్‌ అయితేనే గొప్ప, లేకుంటే మనిషే కాదన్న భ్రమలోకి యువతను నెట్టేసిన ప్రపంచీకరణ సామ్రాజ్యవాద భూతం ఆడిస్తున్న నాటకాన్ని తేలికైన మాటల్లో, భావక్లిష్టత లేని వాక్యాల్లో చంద్రశేఖర్‌ చిత్రించాడు. అది వట్టి చిత్రణ కాదు, కవిత్వ చిత్రణ. విద్య, వైద్యం ప్రభుత్వ సేవా రంగాలన్న విషయాన్ని సగటు మానవుడు మరిచిపోయేట్టు చేస్తున్న వైనాన్ని కవి బలంగా ఆవిష్కరించాడు తన కవిత్వంలో. ప్రయివేటు వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్ళే సేవా సంఘాలను నడిపించగలరని నమ్మించగలగడం సామ్రాజ్యవాద యుగ స్వభావం. అన్ని జెండాలూ, అన్ని పార్టీలూ పోరాట స్వభావాన్ని తమ రక్తంలోంచి తొలగించి సంపదలు పెంచుకోవటం కోసం రాజకీయాల్ని గుప్పెట్లో పెట్టుకుని, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడమే గదా ఈ ఎన్నికల తంతు? కాంట్రాక్టర్లూ, వ్యాపారస్తులూ, పెట్టుబడిదారులేగదా ఇవాళ పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు!

ʹʹచివరాకరకు / ఎవడు గెలిచినా / ఎవడ ఓడినా / ఓటమి ప్రజలదేʹʹ గదా!

అగ్రవర్ణ ఆధిపత్యం మన సమాజంలో అనాదిగా ఉన్నదే. అయితే కులవ్యవస్థలోని లోటుపాట్లను పాలకవర్గం ఎలా తెలివిగా ఉపయోగించుకుంటున్నదో కవి దృష్టిని వదిలిపోలేదు.

ʹʹనాతో నేనే పోట్లాడుకునేటట్లు...
నా తమ్ముడికి నేనే / శత్రువుగా మారేటట్లు...
నా వేలితో నా కంటినే / పొడుచుకునేటట్లు...
నన్ను మారుస్తున్నది / తెలివిగా ఏమారుస్తున్నది...ʹʹ

అని రిజర్వేషన్లను ఆధారం చేసుకొని దళితుల మధ్య చిచ్చుపెట్టి, మాటల గారడీతో, అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకుంటున్న పాలక వర్గ పార్టీల కుటిల నీతిని కవి ఎండగడుతున్నాడు. అయితే దళితుల్లోనే వెనకబడ్డ మాదిగల విషయం గురించి మాలలు సానుభూతిలో ఆలోచించలేకపోవడం కొంతయినా అభివృద్ధి చెందిన మాలల్లో చోటు చేసుకున్న అగ్రవర్ణ ఆధిపత్య స్వభావం లాంటిదే. దీన్ని గుర్తిస్తే కవి అన్నట్టు ʹనా వేలితో నా కంటినేʹ పొడుచుకోవలసిన అవసరం ఉండదు.

ʹʹఅక్షరాలతో మంచి దోస్తానీ లేకపాయే
సాహితీ లోకంలో ఉన్నోళ్ళతో / ఏ బంధుత్వమూ లేకపాయే
ఏది ఎట్లున్న / అణిగి మణిగి / ఉండడం నాకు / తెల్వకపాయే...
గిట్లయితే / నేనెట్ల కవినైత...??ʹʹ

ఈ గుణాలు లేకపోతే నేను కవినెలా అవుతానని కవికి సందేహం వచ్చింది గానీ, నిజానికి ఇవి లేకపోవడం వల్ల ఇతను మంచి కవి అవడానికి దోహదం చేశాయి. అక్షరాలతో దోస్తీ లేకపోవడం అంటే పాండిత్యం లేకపోవడం. సాహితీలోకంలో ఉన్నోళ్ళతో బంధుత్వం లేకపోవడం అంటే చాలా మంది కవుల్లోని లౌక్యం లేకపోవడం. అణిగి మణిగి ఉండడం తెలవకపోవడం అంటే బానిస మనస్తత్వం లేకపోవడం. ఇవన్నీ లేకపోవడం వల్లే చంద్రశేఖర్‌ చాలా నిజాల్ని నిర్భీతితో అమాయకంగా తనదైన సహజ శైలిలో చెప్పగలిగాడు. క్లిష్టత, అస్పష్టత లేని మంచి కవిత్వాన్ని చెప్పగలిగాడు. కృత్రిమ అలంకరణలతో గాక, తన కవిత్వాన్ని సహజ సౌందర్యంతో మన ముందు ఉంచగలిగాడు.

ఈ సంపుటిలోని కవితల్లో ఒకటి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అది ʹʹబన్‌నా హై హమ్‌కో ఉస్‌ కే దళారీʹʹ అనే ఉర్దూ కవిత.

ʹʹజో కోయీ హమ్‌ కో / దేగా పార్టీకా సీట్‌
లగా యేంగే హమ్‌ / ఉసీ కే నారే
జిందాబాద్‌... జిందాబాద్‌...ʹʹ

ఉర్దూలో ఉన్నంత మాత్రాన తెలుగు సాహితీ పాఠకులకు ఇది అర్థంగాకుండా పోదు. అదే ఈ కవితలో విశేషం. కవి తెలంగాణకు సంబంధించినవాడు కావడం వల్ల అది సాధ్యమయింది. తెలంగాణ తెలుగు భాషలో చాలా ఉర్దూ పదాలు కలిసుండడం దీనికి అనుకూలించింది. ఈ విషయంలో కవి చేసిన ప్రయోగం విఫలం కాలేదు.

ఈ కవి అవగాహనలో దొర్లిన కొన్ని పొరపాట్ల గురించి చెప్పకుండా వదిలెయ్యడం కవి అభివృద్ధికి మంచిది కాదని భావిస్తున్నాను. ʹనా ఇష్టంʹ అనే కవితతో ఆధునిక నాగరికత ఎంత కృత్రిమంగా మనిషిని తయారు చేస్తున్నదో బాగా చెప్పాడు. అయితే చివర్లో ʹʹఅర్థమే అన్నిటికీ పరమార్థం కాదని నమ్మిన అనాది మానవున్నే నేనిష్టపడతాʹʹనన్నాడు. వర్గ పూర్వ సమాజంలోని అభద్రతో, అమాయకత్వంతో ఉన్న మానవుడే మేలని అనుకుంటున్నాడు కవి. కాని రాబోయే వర్గరహిత వ్యవస్థలోని మానవుణ్ణి ఆహ్వానిస్తే బాగుండేది. ʹʹదెబ్బలతో అనేక మార్లు ముక్కు వంకర్లు పోయినా ముక్కు సూటిగా నడవడమే వ్యసనమైన కూర్చున్నదిʹʹ అనడం వ్యక్తిత్వాన్ని పెంచే లక్షణమే గాని, సమాజాన్ని మార్చడానికి ఇది మాత్రమే చాలదు. వ్యూహాలూ, ఎత్తుగడలతో సమిష్టిగా యుద్ధం చెయ్యడం అవసరం. అనాథ ముసలిని దగ్గరకు తీసి ఆకలి తీర్చే అమ్మతనం, ఇరుకు గుడిసెల్లో చీమిడి ముక్కూ, చింపిరి జుట్టూ ఉన్న అనాకారితనాన్ని అక్కున చేర్చిన ఎదిగిన మనస్సు కవి భావిస్తున్నట్టు మానవత్వానికి చిహ్నాలే. కవి ఇంతటితోనే సంతృప్తి పడకపోవడం ఒక మంచి లక్షణం. ఈ మిణుగురుల్లాంటి వెలుగుల్ని అఖండ జ్యోతిగా మార్చే శక్తి కోసం, మరో లోకం కోసం కవి ఎదురుచూస్తూ వెతుకుతున్నానంటాడు. దీనికోసం వెతకనక్కర లేదు. కవే దండకారణ్య పోరాటం గురించి ʹజీవంʹ అనే కవితలో చెప్పాడు.

ʹʹబహుళ దేశ సంస్థల విషపు కోరల్లో
దండకారణ్యం విలవిలలాడుతున్నదని
అడవిని నమ్మిన మూలవాసుల
బతుకు బుగ్గిపాలవుతున్నదని
వారికి అండగ నిలిచిన న్యాయానికి
సంఘ విద్రోహిగ బిరుదు ప్రదానం
మోతాదు మించితే బుల్లెట్టే బహుమానంʹʹ

ఒక వైపు దండకారణ్యం విలవిలలాడుతున్నా, మరో వైపు పాలకవర్గాన్నే గడగడలాడిస్తోంది కూడా. ఆదివాసీల సహకారంతో సైన్యాన్ని ఎదిరిస్తూనే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని మావోయిస్టులు నడుపుతున్నారు. అదే జనతన సర్కార్‌. అదే మనకు కనిపించే పరిష్కార మార్గం. అదే కవి దృష్టిలోని ʹʹఎన్నడూ ఆరని అఖండ జ్యోతిలా మార్చి తీర్చే శక్తిʹʹ. ఇంకా కవి దృష్టిలో ఆ ఆదివాసీయే తూర్పున వెలిగే సూర్యుడు, అణ్వాయుధాలకు జడవని గౌరి పుత్రుడు, మానవత్వం మరవని అడవి మనీషి. అడవి మనిషి అనకుండా ʹఅడవి మనీషిʹ అనడంలోనే కవిదృష్టి కనిపిస్తోంది.

చంద్రశేఖర్‌ భాషాపరంగా కొన్ని కొత్త ప్రయోగాలు చేశాడు. ʹస్కూలేజీల్లోʹ అన్నాడు. అంటే స్కూళ్ళలో, కాలేజీల్లో అని ʹమృగాడుʹ అన్నాడు. వాడలో మృగం, మగాడు కలిసున్నాయి. ʹనీటి జైళ్ళుʹ అన్నది మరో ప్రయోగం. పేద ప్రజల్ని నిర్వాసితుల్ని చేస్తూ ఏర్పరచే జలాశయాలు - ప్రాజెక్టులు. చాలా కవితల్లో తెలంగాణ మాండలికం వాడిన కవి కొన్ని చోట్ల అచ్చమైన శిష్ట వ్యావహారికం వాడాడు. ఉదాహరణకు - ʹʹమలి సంధ్యలో అలసిసొలసి / తీవ్రత తగ్గిన భానుడి / క్రీగంటి చూపులతో / సరస సల్లాపాలాడుతున్న / తటాకపు నాట్య విన్యాసాల్ని / గట్టుమీద నుండి వీక్షిస్తూ...ʹʹ లాంటివి. 97వ పేజీలోని ʹʹనేనెట్ల కవినైత...??ʹʹ అనే కవితా, 103వ పేజీలోని ʹʹఇట్లైతే ఎట్ల??ʹʹ అనే కవితా రెండూ ఒకటే. నాలుగైదు చరణాల్లో మాత్రమే తేడా ఉంది.

ʹʹఈయనకు ఏ కవి కులంతో (సంస్థలకు) పొత్తు లేదుʹʹ అని ఒక ముందుమాట రాసిన జీడి రమేష్‌ అనడం అదొక గొప్ప విషయంగా భావిస్తున్నట్టుంది. నిజానికి ఎంత గొప్పవాళ్ళైనా వ్యక్తులు వ్యక్తులుగా చేయగలిగేది తక్కువ. గొప్ప వ్యక్తులైనా సంస్థల ద్వారానే, ప్రజాసమీకరణం ద్వారానే, సంఘటిత శక్తి ద్వారానే ఏదైనా సాధించగలరనేది చరిత్ర చెప్పిన సత్యం.

No. of visitors : 637
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తెలుగు భాషనే ఊపిరిగా పీలుస్తున్న చెన్నైవాసి

వి. చెంచయ్య | 18.11.2017 12:26:42am

తెలుగు భాషను సంబంధించిన అనేక విషయాల్ని సంజీవరావు ఈ 80 పేజీల పుస్తకంలో అద్దంలో చంద్రుడిలాగా వివరించడానికి ప్రయత్నించాడు. వర్ణవిభాగం, పద విభాగం, అర్థం - అన.....
...ఇంకా చదవండి

ఒంటరిగా మిగిలిపోకూడని కవి

వి. చెంచయ్య | 05.09.2017 11:21:59pm

ఈ కవిలో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఒకసారి ఆశ, మరోసారి నిరాశ; ఒకచోట చైతన్యం, మరోచోట వైరాగ్యం. ముందు ముందు ఈ కవి ఎటువైపు మొగ్గుతాడో అనే అనుమానం కలగక మానదు......
...ఇంకా చదవండి

కవిలో చిత్తశుద్ధి ఉంది - అవగాహనే కొరవడింది

వి. చెంచ‌య్య‌ | 06.12.2017 12:51:59am

సిద్ధాంత దృక్పథంతో విషయాల్ని పరిశీలించడంలో మాత్రం పొరబాట్లు జరుగుతున్నాయి. ʹʹఆటవిక యుద్ధాన్ని ఇంకెన్నాళ్ళు చేద్దాం?ʹʹ అన్నప్పుడు కవి ఆటవిక అనే మాటను దుర్మార...
...ఇంకా చదవండి

వర్ణమూ, కులమూ రెండు విభిన్న ఉత్పత్తి విధానాలకు సంబంధించినవి

వి.చెంచయ్య | 20.02.2018 12:40:30am

వర్ణం అనేది మొదట రంగును మాత్రమే సూచించేదిగా ఉన్నదనీ, ఆ తర్వాత మాత్రమే చాతుర్వర్ణ సిద్ధాంతంతో అన్వయం పొందిందనీ రుజువు చేశాడు......
...ఇంకా చదవండి

బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?

వి. చెంచయ్య | 02.11.2017 10:55:39am

అన్ని తాత్విక చింతనలనూ పరిశీలించి, సరైన నిర్ణయానికి రావడానికి బుద్ధుడి జ్ఞాన సిద్ధాంతాన్ని తెలియజేసే కాలామ సుత్తం ఆచరణాత్మకమైన ప్రాతిపదికన అందిస్తుందని రచయ...
...ఇంకా చదవండి

విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి

వి.చెంచ‌య్య‌ | 03.01.2018 11:23:28pm

ఈ చిన్న పుస్తకాంలో ఐలయ్య ఆలోచనలు ఆలోచింప దగినవిగా, కనిపిస్తున్నారయి. ఈ ధోరణిలో ఆలోచిస్తున్న ఐలయ్య కొన్ని వివాదాస్పద ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు.....
...ఇంకా చదవండి

మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...

వి. చెంచయ్య | 28.09.2018 01:10:47am

జాషువా కష్టసుఖాలు రెండూ అనుభవించాడు గాని, వాటికి వశం కాలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ, నిరాశామయ వాతావరణంలోనూ కవిగా నిలదొక్కుకోవడం జాషువా ప్రత్యేకత... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఆత్మీయ కలయిక
  కరవాలం చెప్పిన రహస్యం
  కాశ్మీరు మనది!
  మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది
  అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం
  విరసం తో నా అనుబంధం - అనుభవం
  కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •