ఆగ్ర‌హాన్ని క‌ళాత్మ‌క ఆచ‌ర‌ణ‌లోకి ఒంపిన ఆర్టిస్ట్ మోహ‌న్

| సాహిత్యం | వ్యాసాలు

ఆగ్ర‌హాన్ని క‌ళాత్మ‌క ఆచ‌ర‌ణ‌లోకి ఒంపిన ఆర్టిస్ట్ మోహ‌న్

- వ‌ర‌వ‌ర‌రావు | 07.10.2017 07:47:56am

మోహన్‌ ఆర్టిస్టు. హృదయ దఘ్నంగా కళల్ని ప్రేమించే నాకు కమ్యూనిస్టు అయి ఆర్టిస్టు అయిన వాడు కళకు నిర్వచనంగా నిర్వికారంగా బతికినవాడు మోహన్‌ కళాకారుడు, మోహన్‌ కళాశాల. ఆయనను పాఠశాల అనేవాళ్లు. అనుకునేవాళ్లు ఉన్నారు. అవును కావచ్చు. కాని అది ఒమర్‌ఖయ్యిం పాఠశాల కాదు. అయితే గియితే మీర్జా గాలిబ్‌ పాఠశాల.

మోహన్‌కు ఒమర్‌ ముక్త్యార్‌ ఉత్తేజం. గెలిచే ఓడే తిరుగుబాట్లు కాదు, ఆయనకు తిరుగుబాటు కాదు. ఆధిపత్యంపై ధిక్కారం కావాలి. అది వలసవాదం మీదనో, సామ్రాజ్యవాదం మీదనో అయితే ఇంకా చెప్పేదేముంది. తన నెత్తురులో కుంచె ముంచి, కలం ముంచి గీతలు గీస్తాడు. బొమ్మలు వేస్తాడు. రాస్తాడు . అటువంటప్పుడు ఎప్పుడూ ఆయన మీసాల కొసను కొనగోటితో మీటుతూ ఉంటాడు.

మోహన్‌ కళా చైతన్యం నిండా చేగుచేరా గుబాళిస్తుంటాడు. ఒకచోట విప్లవం ముగిసి మరో విప్లవం కోసం ప్రయాణం చేసే అవిశ్రాంత పథకుడంటే ఆయనకిష్టం.

ఆయనకు ప్రైవేట్‌ ఆస్తే కాదు ప్రైవేటు జీవితమూ లేదు. ఎప్పుడూ సమూహంలో ఏకాంతమే. పబ్లిక్‌లో ప్రైవెసీయే. నిరంతరం మనుషుల మధ్య ఉంటూ బొమ్మలు వేయడం సరే. పోస్టర్లు, బ్యానర్లు, క్యాలెండర్లు తయారు చేయడం సరే. ఎంత దాహంతో పుస్తకాలు చదివేవాడు. అభిరుచి గల పుస్తకం ఇంగ్లిషు, తెలుగుల్లో వచ్చినా అది మోహన్‌ను చేరుతుంది. చుట్టూ ఉండే మనుషులకు, ముఖ్యంగా యువకులకు, విద్యార్థులకు బొమ్మలు వేస్తూ, వేయిస్తూ, ప్రోత్సాహిస్తూ కళల గురించి చెప్తాడు. కళల ప్రయోజనం గురించి చెప్తాడు. డబ్బు, కీర్తికోసం కాకుండా ప్రజల కళల కోసం బతకడం. పని చేయడం ఏమిటో తెరచిన పుస్తకం వంటి ఆయన జీవితమే నిదర్శనం. మోహన్‌ ఎంత మంది, ఎంత సృజనకారులైన కార్టూనిస్టులను కళాకారులను తయారు చేసాడని, చివరిదాకా ఆ పనిలోనే ఉన్నాడు.

మోహన్‌ మార్క్సిజాన్ని సృజనాత్మకంగా ఒంట బట్టించుకున్నాడు. అనార్కిస్టుగానో, బొహేమియన్‌గానో కనిపించే మోహన్‌ గురించి ఈ రాతలేమిటి అనవచ్చు. ఎన్నడూ ఆయన కంపనీలో కనిపించని మోహన్‌కు ఈ టీటోల్లుర్‌ సర్టిఫికేట్లు ఏమిటీ అనుకోవచ్చు.

ఆయన ఇల్లునో, కార్యశాలనో ఒకటి రెండుసార్లు మించి నేను చూసి ఉండను. రెండు సార్లు ఆనంద్‌నగర్‌ (ఖైరతాబాదు)లో ఉన్నప్పుడే వెళ్లాను. అరుంధతీరాయ్‌ ʹవాకింగ్‌ విత్‌ కామ్రేడ్స్‌ʹ తెలుగు అనువాదం ʹమలుపుʹ ప్రచురణగా వెలువడినప్పుడు ఆమెతో పాటు పోలవరం కూడా వెళ్లి విధ్వంసం కానున్న ఆదివాసీ జీవితాలను అధ్యయనం చేయడానికి సుప్రసిద్ధ డాక్యుమెంటరీ నిర్మాత సంజయ్‌కాక్‌ వచ్చాడు. సంజయ్‌కాక్‌ కాశ్మీర్‌ ఆజాదీ పోరాటాన్ని సమర్థించే కాశ్మీర్‌ పండిట్‌. యాక్టివిస్ట్‌. అరుంధతీరాయ్‌తో పాటు దండకారణ్యానికి కూడా వెళ్లి వచ్చి ʹరెడ్‌ ఆంట్‌ డ్రీమ్‌ʹ అనే డాక్యుమెంటరీ కూడా తీసాడు. దాని కన్నా మోహన్‌కు సంజయ్‌కాక్‌ కశ్మీర్‌పై తీసిన డాక్యుమెంటరీ (జష్న్‌ ఏ ఆజాదీ) నచ్చింది. ఒక ఆర్టిస్టును - కవి, చిత్రకారుడు, శిల్పి, గాయకుడు, సినిమా, నాటకరంగాల్లో పర్‌ఫర్మింగ్‌ ఆర్టిస్టు, కథా దర్శకుడు, స్క్రీన్‌ ప్లే రచయిత - ఎవరైనా సరే మనం లలిత కళలుగా చెప్పుకునే వాటిలో ఎవరి ప్రతిభనైన, సృజననైనా పసికట్టే కనిపెట్టే కన్ను మోహన్‌ది. ఆయనవి చాలా విశాలమైన కళ్లు. వినీలాకాశం వంటివి, సూర్యరశ్మిని, పండువెన్నెలనే కాదు, అమవాస్య చీకట్లో నక్షత్రాలలో కాంతిని పోల్చుకునే కళ్లు. రెండు రోజులూ సంజయ్‌కాక్‌తో జట్టీగ తిరిగాడు. తన దగ్గర ఉన్నా విలువయినా కళా ఖండాలను చూపెట్టడానికి తీసుకపోతూ వెంట నన్నూ తీసుకపోయాడు.

సంజయ్‌కాక్‌ మోహన్‌కేదో ఆర్ట్‌ స్టూడియో ఉన్నదనుకుని ఉంటాడు. కొన్ని కాగితాలు, కలాలు, కుంచెలు, పుస్తకాలు వాటిల్లో కనిపించే వాళ్లో, అవి చూడడానికి వచ్చిన వాళ్లో, ఎవరైనా సరే మోహన్‌ కోసం వచ్చిన మనుషులు. మోహనే ఒక చలన లేదా తన దగ్గరికి అందర్నీ రప్పించుకునే స్టూడియో. అప్పుడు నాకు చెప్పాడు సంజయ్‌కాక్‌ కశ్మీరీ డాక్యుమెంటరీలో ఉన్న కళాదృష్టి గురించీ వస్తుగత దృష్టి గురించి, మనిషి తనదనుకునే ప్రతిదీ రద్దు చేసుకుంటే తప్ప సాధ్యం కానిది.

మరొకసారి.. అన్ని లిటిగేషన్లు అధిగమించి చిత్తప్రసాద్‌ వేసిన ప్రతి బొమ్మా సేకరించి వేసిన అద్భుతమైన రెండు సంపుటాలు వెలువడినాయి. అవి చూడాలంటే మాత్రం తన దగ్గరికి రావాల్సే ఉంటుందని చెప్పాడు. వెళ్లాను. చాలా ఓపికగా వివరిస్తూ ఆ అద్భుతమైన చిత్రాలన్నీ చూపెట్టాడు. కలకత్తాలో ఏర్పాటు చేస్తున్న చిత్తాప్రసాద్‌ చిత్రకళా ప్రదర్శనకు పోతున్నానని ఇక్కడ కూడా వేయాలని ఉందని చెప్పాడు. కాకతీయ యూనివర్సీటీ పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు జర్మనీకి వెళ్లినప్పుడు అక్కడ ఆర్ట్‌ మ్యూజియమ్‌లో చిత్తప్రసాద్‌ ఒరిజినల్‌ చిత్రాలు కొన్ని చూసి వాటి ప్రతి కృతులు తెచ్చాడు. వాటి గురించి మోహన్‌నో, చలసాని ప్రసాదరావునునో కూడా కలిసి చర్చించినట్లున్నాడు. ఆయన విప్లవ విద్యార్థి నేపథ్యం నుంచి వచ్చిన మంచి ఉపన్యాసకుడు. వరంగల్‌లో రాడికల్‌ విద్యార్థులకు రాజకీయ పాఠాలు చెప్పేవాడు. ఆయనతో నాకు సన్నిహిత అనుబంధం ఉందని మోహన్‌కు తెలుసు. మోహన్‌ రాతల్లో, గీతల్లో ఎక్కడా దైన్యం కనిపించదు.


మోహన్‌ పుట్టేనాటికే రష్యా, తెలంగాణలో విప్లవం, సామ్యవాదం సద్దుమణిగింది. నెహ్రూ డాంగేల సోషలిజం మాత్రం మిగిలింది. కాని ఆయన తండ్రి అప్పారావు ఏలూరులో కమ్యూనిస్టు నాయకుడు అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో, ముఖ్యంగా 1936-45ల మధ్యన ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌, ఇప్టాలు ఫాసిజానికి వ్యతిరేకంగా చేసిన కళా, సాహిత్యాల కృషి అంతా ఆయన బాల్యం నుంచే ఆయన చేతికి అందివచ్చింది. బోల్షివిక్‌ విప్లవకాలంలో కంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలోనూ తెలుగు కళా సాహిత్యాల మీద కమ్యూనిస్టుల ప్రభావం గాఢమైనందువల్ల మోహన్‌ పికాసో, పాల్‌ రాబ్సన్‌, శ్రీశ్రీ, హారేన్‌ చ‌ట్టోపాధ్యాయ, చిత్త ప్రసాద్‌ ల కళా, సంగీత, సాహిత్య, ప్రదర్శనా ప్రతిభా సృజనాత్మకలను ఆకళించుకోవడంలో ఎదిగాడు. యుక్తవయసులో వియత్నామ్‌, నక్సల్బరీలు, చేగువేరా విప్లవాలు ఉండనే ఉన్నాయి. ఏభై యేళ్ళ నక్సల్బరీ శిశిర వసంతాలు చూసిపోయాడు.

ʹఉదయంʹలో కార్టూనులు వేస్తున్న రోజుల గురించి మోహన్‌ ఒకసారి చెప్పాడు. మాగుంట‌ సుబ్బరామిరెడ్డిగారికి కార్టూనులు, కాలమ్స్‌, స్టోరీస్‌ మధ్య తేడా ఏమిటో తెలియదు. పత్రికల భాష తెలియదు. ఆర్టికల్స్‌ అంటే మాత్రం తల ఊపేవాడని, మ్యాగ్డోనాల్డ్‌ దక్షిణ దేశ ఏజెంటుకు ఆర్టికల్స్‌ అంటే (సరుకుగా) అర్థమవుతుంది గనుక - అందులో సామ్రాజ్యవాద వ్యతిరేకత వగైరా జాన్తానై.

చ‌ల‌సాని తలపెట్టిన శ్రీశ్రీ సంపుటాలకు ముఖ చిత్రాలే కాదు.. లోపలి రచనలకు రేఖా చిత్రాలు, కొకు సాహిత్య, సినిమా వ్యాసాలు దేనికైనా మోహన్‌కే పురమాయింపు.

1990 ఇరవ య్యేళ్ల విరసం మహాసభల కాలం నుంచి విరసంగానీ, 1992 నుంచి ఎఐపిఆర్‌ఎఫ్‌ గానీ, 1993 ఎఐఎల్‌ఆర్‌సి దశాబ్ది ఉత్సవాలు - బాబ్రీమసీదు విధ్వంసం సందర్భంలో హిందూ మతవర్గతత్వం (కమ్యూనలిజం) పై సదస్సు- సభ సందర్భం గానీ, ʹఉద్యమంʹ పత్రికగానీ ʹఅరుణతారʹ గానీ మోహన్‌తో ఎన్ని పోస్టర్లు, బ్యానర్లు రాయించిందో, ఎన్ని పుస్తకాలకు కవర్లు వేయించిందో.. తలచుకుంటే ఆ జాబితా చాంతాడు అవుతుంది. బహుశా ప్రజాస్వామిక, విప్లవ సంఘాలు - ఆ మాటకొస్తే లౌకిక ప్రజాస్వామిక వ్యక్తీకరణ అవసరమైనపుడు కాంగ్రెస్‌, సిపిఐలు మొదలుకొని మోహన్‌తో ఎంత పని చేయించుకున్నారో తలచుకుంటే ఆయన పని రాక్షసుడనిపిస్తుంది. ఆయన‌ కార్టూనిస్టా, ఆర్టిస్టా, సామాజిక వ్యాఖ్యాతనా, సాహిత్య, కళా విమర్శకుడుగా అన్నీ అవును. అయినా... ఈ అన్నింటినీ ప్రజల్లోకి తీసుకుపోయిన పోస్టరే మోహన్‌. ఇప్పుడా పోస్టర్‌ మీద మోహన్‌ను కూడా భారత భూషణ్ తీసిన ఫోటోగానో, మోహన్‌ వేసుకున్న బొమ్మగానో చూసుకోవాల్సిందే. ప్రతి విప్లవ సందర్భానికి, ఉత్సవానికి, సభకు వేదికపై నేపథ్య బ్యానర్‌ మోహన్‌ది ఉండాల్సిందే. నక్సల్బరీ 30 ఏళ్ల సభలు గుంటూరులో ఎఐఎల్‌ఆర్‌సి చేసినపుడు బ్యానర్లు, పోస్టర్లు, బ్యాక్‌డ్రాప్‌తో పాటు లిబరేషన్‌ వ్యాసాల అనువాదం ʹప్రజా ప్రత్యామ్నాయంʹకు ఆయన వేసిన ముఖచిత్రం మళ్లీ జుగాష్‌ విలీ డిజైన్‌ చేసి 50 ఏళ్ల సందర్భంగా పునర్ముద్రణలో వాడుకున్నది శ్రామిక వర్గ ప్రచురణలు.

ఆయనకు చెప్పాల్సిన కృతజ్ఞతలు మ‌రవడకుండా ఉండడానికి గుర్తు చేసుకోవాల్సిందే తప్ప - ఆయనైతే ఒక్క కృతజ్ఞతా పూర్వక మాట చెప్పడం కూడా ఇష్టపడడు. ఇబ్బంది పడతాడు. ఎంబరాస్‌ అవుతాడు. మన ముందు నుంచి తిరిగి చూసే వరకు తప్పుకుంటాడు. ఇంత మనుషుల్లో తిరిగే మనిషి ఎంత బిడియస్తుడో. ప్రతి రచయిత, కళాకారుడు, ఆయనను అభిమానించే వాళ్లు ఆయనతో బొమ్మలు వేయించుకున్నవాళ్లు, ఆయన తమ సభలో మాట్లాడాలని ఆశిస్తారు. కొందరు బలవంతం చేస్తారు. అసలు ఒప్పుకోడు. ఒకవేళ వచ్చినా సభలో ఎక్కడో వెనుక నిలబడి జారుకుంటాడు. వేదిక మీదికి తోస్తే ʹనాకేమీ మాట్లాడడం రాదని వినయంగా దిగిపోతాడు.ʹ

ఆయనకు సంభాషణ తప్ప ఏకపక్ష సందేశాలు పడవు.

పాలమూరు అధ్యయన వేదిక గోరటి వెంకన్న సాహిత్యంపై పెట్టిన సభలో మాత్రం నాతో పాటు వేదిక పంచుకుని కూర్చున్నాడు. మాట్లాడాడు - ముక్తసరిగానే - కాని చాలా విలువైన మాటలు - ప్రజా వాగ్గేయకారుని గురించి, నేను మాట్లాడుతూ పాల్‌రాబ్సన్‌ ప్రస్తావన తెచ్చి ఏదో తప్పు చెప్పాను. కూర్చోగానే చెవిలో సవరించాడు. వెంటనే లేచి నేను - నేను తప్పు మాట్లాడాను - మోహన్‌ సవరించాడని సవరణ చెప్పాను. ఇంకా ఎంత ఇబ్బంది పడిపోయాడో ఇప్పటికీ ఆ మొహం, ఆ మెలికలు తిరిగిన మనిషి కళ్లల్లో ఆడుతున్నాడు. మీకు సమాచారం కోసం చెప్పాను గానీ.. అని వాక్యం పూర్తి చేయలేదు. మా చలసాని ప్రసాద్‌ అంటాడు - అభిప్రాయాలు ఏమైనా కావచ్చు, గానీ ఫ్యాక్ట్‌ విషయంలో ఎవరినైనా సవరించవలసిందే - ఎవరైనా సవరించవచ్చునని అని చెప్పాను.

ఆనిమేషన్ ఆర్ట్‌ను ప్రజా సంఘాలు, విరసం ఎక్కువగా ఉపయోగించుకోవాలని కూడా మోహన్‌ చెప్తుండేవాడు. ఒకసారి ఎందుకో పనిబడి ఫోన్‌ చేసి చెప్పాడు.

2004 జనవరిలో ప్రపంచ సోషల్‌ ఫోరమ్‌ను బహిష్కరించి మేము ముంబైలో ఏర్పాటు చేసిన ముంబై రెసిస్టెన్స్‌ ఫోరమ్‌ - ఎంఎఆర్‌ 2004కు మోహన్‌ చేసిన శ్రమ తీసుకొచ్చిన సామ్రాజ్యవాద వ్యతిరేక కార్టూన్లు పుస్తకం ఎల్ల‌కాలం కోసం నిలిచిపోయేది. ఆ పుస్తకాలను అయిదు వేల కాపీలు ఎంతో విలువగా వేసి ఇచ్చిన కళాజ్యోతి వారి సహకారాన్ని కూడా మరచిపోలేం. ఎబికె ప్రసాద్‌ కూడా ఎంతో గుర్తు బెట్టుకొని అది ప్రస్తావించారు.

మోహన్‌ యాక్టివిస్ట్‌ కూడా. ఇటీవలి జ్ఞాపకాల నుంచే చెప్పాలంటే గుజరాత్‌ గాయం, బాగ్దాద్‌ పై బాంబులు (మే 20, 1990) మొదలుకొని ఇరాన్‌పై 2003 అమెరికా యుద్ధ దాడి, ఆక్రమణల వరకు హైదరాబాద్‌లో కవులు, కళాకారులు, రచయితలు, అరసం నుంచి విరసం దాకా కలిసి చేసిన పత్రి ప్రతిఘటనలోనూ, సభ, ర్యాలీ అన్నింట్లో మోహన్‌ ఉన్నాడు. మౌనం యుద్ధ నేరమని, కనుక ట్యాంక్‌బండ్‌ పైకి వెళ్లి కవిత్వం, ప్రసంగంతో పాటు కాన్వాసుపై బొమ్మలు, సంతకాలతో భూత‌లం నుంచి గగన తలానికి, వైట్‌హౌజ్‌కు వినిపించేలా, కనిపించేలా ప్రొటెస్ట్‌ చేద్దామని, చేసిన వాళ్లలో మోహన్‌ ఉన్నాడు.

మోహన్‌ హైదరాబాద్‌కు 1984లో వచ్చాడనుకుంటాను. నేను 1985-89 ముషీరాబాద్‌ జైల్లో ఉన్న కాలం చాలా దగ్గరలో ʹఉదయంʹ పత్రికలో పని చేసే వాళ్ల హృదయ స్పందనలు వినిపిస్తుండేది. ఆ రోజుల్లో ʹఉదయంస‌తో పాటు అన్ని పత్రికల్లో నా రచనలు వస్తుండేవి. ఎక్కువగా కవితలు. ʹసహచరులుʹ - జేలు లేఖలు, అట్లా మోహన్‌కు నాతో ఒక గాఢానుబంధం పరోక్షంగా ఏర్పడిందో తెలియదు గానీ నేను విడుదల కాగానే ʹఆంధ్రజ్యోతిʹ ఆదివారం సంచికను దేవిప్రియ, మోహన్‌, కె. శ్రీనివాస్‌ కలిసి సంచలన సంచిక చేసారు. అందువల్ల దేవిప్రియ ఉద్యోగం పోగొట్టుకున్నాడని విన్నాను.

ఇక అక్కడి నుంచి మోహన్‌ బొమ్మనో, అక్షరాలో లేకుండా నా ఏ పుస్తకమూ రాలేదు. ముఖ్యంగా నా జైలు కవితలు (85-89) ʹముక్త కంఠంʹకు ముఖ చిత్రం వేయమని ఇస్తే 178 పేజీల సంకలనానికి మర్నాడే బొమ్మ వేసి బాగ్‌లింగంపల్లిలో మా ఎల్‌ఐజి క్వార్టర్‌ కిటికీలోంచి వేసిపోయాడు. ఆ బొమ్మ ఇంక నిర్బంధానికి, జైలుకు, స్వేచ్ఛాకాంక్షకు పేటెంట్‌ అయిపోయింది. ఆయన ఎన్ని చోట్ల వాడుకున్నాడో, నేను నా ʹఉన్నదేదో ఉన్నట్లుʹ కవితా సంకలనం పైనా ఏభై ఏళ్ల కవిత్వం లోపల ఎంత ఇష్టంగా వాడుకున్నానో, జైలు ముళ్ల తీగెలపై కలవ కవల జంటలు నిర్బంధానికి, పోలీసు బులెట్లకు (అవి ఎక్కడా కనిపించవు - కింద పైన పైన నుంచే రాలిపోతున్న పక్షి దాకా - స్వేచ్ఛ ప్రాణాన్ని పణం పెట్టే ఆకాంక్ష కదా).

2006లో జైలు కవితలు ʹఅంతస్సూత్రంʹకు బొమ్మ వేయమన్నాను, నాకు నచ్చలేదు. అక్బర్‌తో వేయించుకున్నాను. కాని మోహన్‌ లేకుండా ఎట్లా - అందుకని ఆయన అక్షరాలు ఉంచాను.

దగ్ధమౌతున్న బాగ్దాద్‌ దీర్ఘ కవితకు బొమ్మలు వేసాడు. మౌనం యుద్ధ‌నేరంకు బొమ్మలు వేసాడు. అయినా నాకు తృప్తి కాక ఆయనతో ముందు మాట రాయించాను. చెప్పాను కదా ఆయన కుంచె ఎంత పదునో - కలం అంత పదను.

అయితే మోహన్‌ చుపే రుస్తుం. గడుసరి. ముందుమాటగా నాకే కాదు, పాఠకుల కోసం ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ చరిత్ర మొత్తం చెప్పాడు. ʹత్యాగం నిలుస్తుందా? దురాక్రమణ నిలుస్తుందా? అని ప్రశ్నతో ప్రారంభించి ʹఇప్పటికి మాత్రం ఇది ఓటమి రక్తసిక్తమైన మరో పరాజయంʹ - అంటూ ఇండోనేషియాలో, ఇరాక్‌లోనూ కమ్యూనిస్టులపై జరిగిన మారణకాండ, ఇప్పుడు ఇరాక్‌లో సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు - అంటే ఎవరో కాదు - మెసపటోమియా నాగరికత వారసులు ముస్లింలపై మారణకాండ మాత్రమే కాదు అంటూ అమెరికా దురాక్రమణపై చాలా ఆగ్రహం ప్రకటించాడు. అక్కడి నుంచి కూడా ఈ పద్నాలుగేళ్లలో చాలా దూరం వచ్చేసాం. మోడీ నుంచి, అఖ్లాక్‌ నుంచి, జునైద్‌ నుంచి, ఉనా నుంచి, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్‌... ఇంకా ఇంకా నేరెళ్ల, తాడ్వాయిల దాకా వచ్చాం. సామ్రాజ్యవాద, భూస్వామ్య వ్యతిరేక - ముఖ్యంగా ఆ భావజాలం ఫాసిజంగా మారిన స్థితిలో ప్రకటించాలని ప్రతిఘటన గురించి వ్యాగ్ర‌త‌ ఉన్న మనిషి మోహన్‌. ఒక పికాసో వంటి, ఒక చిత్త ప్రసాద్‌ వంటి ఆగ్రహం.

ఆ ఆగ్రహాన్ని సృజనాత్మక, నిర్మాణాత్మక, కళాత్మక ఆచరణలో ప్రకటించి ప్రతిఘటించడం మోహన్‌కు చాలా ఇష్టం.

30 సెప్టెంబర్‌ 2017

No. of visitors : 675
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
  అరుణతార సెప్టెంబర్ - 2018
  యాంటి నేషనల్
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
  అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
  కుట్ర
  ఇప్పటికైనా అర్ధమయిందా....?
  యుద్ధానంతర యుద్ధగీతం
  పోలీసుల నీడలో రాపూరు
  అర్హత

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •