కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

| సాహిత్యం | వ్యాసాలు

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

- పాణి | 07.10.2017 11:08:49am

కంచె ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు పుస్తకం మీది చర్చ మన సామాజిక, రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. ఎక్కడ ఏ చిన్న వివాదం చెలరేగినా అది సామాజిక సంక్లిష్టతను పట్టిస్తోంది. భిన్న భావజాలాలు, ఆలోచనా విధానాలు కత్తులు దూసుకొనే స్థితి ఉన్నది. అంతగా విరుద్ధశక్తులు మోహరించాయి. రోజువారి జీవితంలో ఇవి యథాలాపంగా కనిపించవచ్చు. కానీ ఆలోచనారంగంలో చాలా ప్రస్పుటంగా ఉన్నాయి. ఇలాంటి సంఘర్షణ ఎలా కొనసాగాలి? దానికి ఏం చేయాలి? అనేది పూర్తిగా వేరే చర్చ.

కానీ ఐలయ్య సందర్భంలోని వివాదం పుస్తకం పరిధిని దాటి పోయింది. కోమట్లను సామాజిక స్మగ్లర్లు అనడానికి ఐలయ్య చేసిన వాదన ఏమిటి? ఏ ఆధారాలు చూపారు? ఏ వాద పద్ధతి ద్వారా ఈ సూత్రీకరణ చేశారు? అందులోని తప్పు ఒప్పులు ఏమిటి? అనే చర్చ వైశ్య సంఘాలు చేయదల్చుకోలేదు. ఈ పనిలోకి దిగకుండా తాము వ్యాపారం చేయడం ద్వారా సామాజిక సేవ చేస్తున్నామని, బిజినెస్‌లో సంపాదించిన దాంట్లో కొంత భాగం ప్రజోపయోగానికి వెచ్చిస్తున్నామని ఎన్ని మాటలు చెప్పినా, ఆ ఒరవడిలో పుస్తకాలు రాసేసినా ఐలయ్యతో సంవాదంలోకి దిగినట్లు కాదు. సామాజిక స్మగ్లర్లు అనడం వల్ల తమ వ్యాపారాలకు, సామాజిక హోదాకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వైశ్యులు స్పందిస్తున్నట్లుంది. వాళ్లు అట్ల అనుకోడానికి అవకాశం ఉంది.

నిజానికి ఇప్పుడు ఈ పుస్తకం వివాదంలో కోమట్ల స్పందన కంటే ఆలోచించాల్సిన కోణాలు వేరే ఉన్నాయి. ఇలాంటి పుస్తకం రాసినందుకు ఐలయ్య ఈ దేశంలో ఉండదగ్గ మనిషి కాదని, ఆయన రాజద్రోహానికి పాల్పడ్డారనే వాదన బలపడుతోంది. ఇది చాలా ప్రధాన కోణం. కోమట్లను సామాజిక స్మగ్లర్లు అనడం సబబేనా? అది నిజమా? అనే చర్చ ఎంతయినా చేయవచ్చు. కానీ ఒక కులాని ఇలా అనడమే సమాజ వ్యతిరేకమని అనే క్రమంలో అగ్రకుల శక్తులన్నీ ఏకం అవుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. మన సాంఘిక వ్యవస్థ గురించి కింది కులాల విమర్శను ఎదుర్కోడానికి ఐలయ్య సందర్భాన్ని అగ్రకులాల నాయకులు వాడుకుంటున్నారు. దీనికి సంఘపరివార్‌ భావజాలం బాగా ఉపయోగపడుతున్నది. రెండు రాష్ట్రాల్లో ఐలయ్య పుస్తకానికి వ్యతిరేకంగా జరుగుతున్న వైశ్య అందోళనల్లో సంఘపరివార్‌ శక్తులు చాలా క్రియాశీలంగా ఉన్నాయి. కొన్ని చోట్ల కోమట్లే సంఘపరివార్‌ నాయకులుగా ఉండటం కూడా దీనికి కలిసి వచ్చింది. దీంతో మండల స్థాయి ఆందోళనల్లో కూడా సంఘపరివార్‌ బయటికి వచ్చి ఐలయ్య సామాజికంగా ప్రమాదకారి అని అంటోంది. వాళ్ల దృష్టిలో మన సమాజమంటే కుల సమాజం, హిందూ సమాజం. ఇందులో ఒక అగ్రకులాన్ని ఇలా సూత్రీకరించడం వల్ల సామాజిక కల్లోలాలు తలెత్తుతాయి. అవి కుల వ్యవస్థను దెబ్బతీస్తాయి. హిందుత్వకు సవాల్‌గా మారుతాయి. అగ్రకుల ఆధిక్యంలోని హిందూ సమాజానికి వచ్చే ఏ ఇబ్బంది అయినా రాజ్యానికి ప్రమాదకరం. కాబట్టి ఐలయ్య రాజద్రోహి అవుతాడు. ఇదీ సంఘపరివార్‌ లాజిక్‌.

కులాన్ని ఐలయ్యలాగా చూడకూడదు అనుకున్నా, అలాంటి విభేదాలు ఎన్ని ఉన్నా ఆయన వాదన సమాజానికి సంబంధించింది. అందునా ఆలోచనారంగంలో తేల్చుకోవాల్సిన విషయం అది. కానీ సంఘపరివార్‌ దాన్ని రాజ్యభద్రతా సమస్యగా చిత్రించదలుచుకుంది. బ్రిటీష్‌వాళ్లు శిక్షాస్మృతిలో రాజద్రోహ నేరాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా ఓ పెద్ద రాజద్రోహుల జాబితా ఉంది. వలసవాదులు, భారత పాలకులు రాజ్య వ్యతిరేక పోరాటకారులను, కుహనా దేశ సమైక్యతలో బందీలుగా ఉండమని చెప్పే జాతి విముక్తి ఉద్యమకారులను రాజ్యభద్రతకు ప్రమాదకారులని అంటూ వచ్చారు. అలాంటి పోరాటకారులంటే వలసవాదులకు ఎలా భయం ఉండేదో ʹస్వంతంత్య్రʹ పాలకులకూ అలాగే ఉన్నది. అయితే ʹరాజద్రోహంʹపట్ల ఆ ఇద్దరికీ ఒక స్పష్టత ఉన్నది. ఇది పూర్తిగా రాజ్య వ్యవస్థ స్వభావానికి, దాని పనితీరుకు సంబంధించినది. కానీ సామాజిక వ్యవస్థ మీద విమర్శ పెట్టేవాళ్లను, లేదా ఒక కులం నిర్వహిస్తున్న పాత్రను విమర్శించే వాళ్లను సహితం రాజ్య వ్యతిరేకులుగా, దాని భద్రతకు సమస్యగా సంఘపరివార్‌ చిత్రిస్తున్నది. దాని రాజ్యభావన, జాతీయ భావనల మూలాలు హిందుత్వలో ఉన్నాయి. హిందూ జాతి అని, హిందూ రాజ్యమని అంటుంటారు. ఈ హిందుత్వ ప్రాణం కులవ్యవస్థలో ఉంది. దాని మీద విమర్శ పెట్టడమంటే రాజ్యాన్ని వ్యతిరేకించడమే.

ఈ వైఖరి వాళ్లకు మొదటి నుంచీ ఉన్నదే. ఐలయ్య పుస్తకం సందర్భంలో అది నగ్నంగా బయటికి వచ్చింది. దీనికి ఐలయ్య క్రైస్తవాన్ని సమర్థిస్తాడనేది కూడా సాకు అయింది. మళ్లీ వీళ్లకు వలసవాదులు తీసుకొచ్చిన రాజద్రోహ భావనను వాడుకోడానికి ఏ అభ్యంతరమూ ఉండదు. సంఘపరివార్‌తోపాటు సాధువులు, సన్యాసులు కూడా ఐలయ్య రాజద్రోహి అని, దేశానికి ప్రమాదమని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఐలయ్యను వ్యతిరేకిస్తున్న వాళ్లు తమ వాదనా బలానికి సాధువులను ఆసరా తెచ్చుకుంటున్నారు. వాళ్లు దేశమూ, సమాజమూ అని అంగలార్చుతూ ఐలయ్య మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఆలోచనా సంఘర్షణలో సంఘపరివార్‌ భావజాలం పైచేయి సాధిస్తోందనడానికి ఐలయ్య సందర్భం కూడా ఉదాహరణ. ఈ సందర్భంలోకి కూడా రాజ్యం తన ఉక్కు బాహువులు సాచి ఆలోచనా స్వేచ్ఛను చిదిమివేయడానికి రంగం సిద్ధమవుతున్నది. అందువల్ల ఇప్పుడు ఐలయ్య పుస్తక సందర్భం ఆ వాచకాన్ని దాటి అనేక వైపులకు విస్తరించింది. అగ్రకులతత్వం, సంఘపరివార్‌, రాజ్యం బలోపేతమయ్యేలా ఈ సందర్భం మారిపోతున్నది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఐలయ్య మీద కేసులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. నిజానికి ఒక ఆలోచనా చర్చ తన పరిధిలోకి రాదని, అది భావ సంఘర్షణలో తేల్చుకోమని చెప్పగలిగే కనీస ప్రజాస్వామిక విలువలు మన ప్రభుత్వాలకు లేవు. ఆలోచనలను నేరంగా భావించే నేర స్వభావం గలవారు అధికారంలో ఉన్నందు వల్ల రచయితలు నేరస్థులవుతూనే ఉంటారు.

ఇంతకూ ఐలయ్య ఏం చేశారు? భారత సమాజంలో కులవ్యవస్థ పాత్ర గురించి గత కొన్ని దశాబ్దాలుగా పరిశోధిస్తున్నారు. దానికి ఆయన ఎంచుకున్న పద్ధతి ఏమిటనేది కూడా చర్చనీయాంశమే. అయినా సరే ఇది జరగవలసిన పరిశోధన. దీన్ని ఆయన ఉత్పత్తి కులాలు, ఉత్పత్తితో సంబంధం లేని కులాలు అనే కోణంలో చూస్తున్నారు. సామాజిక పరిధిలో ఇది ఒక ముఖ్య కోణం. అందువల్ల ఆయన రచనల్లో కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటున్నాయి. ఆ రకంగా కుల వ్యవస్థ మీద ఉత్పత్తి కులాల విమర్శగా ఆయన కృషిని గుర్తించవచ్చు. కు లం గురించి పట్టింపుతో ఐలయ్య చేస్తున్న ఆలోచనల మీద హిందుత్వవాదులు, అగ్రకుల శక్తులు, ఉభయ తెలుగు ప్రభుత్వాలు దాడి చేయడం అభ్యంతరకం. ఇది కేవలం ఆయన భావ ప్రకటనా హక్కును గౌరవిస్తూ, ప్రతిఘాతుక శక్తుల దాడిని ఖండిస్తూ తీసుకునే వైఖరే కానవసరం లేదు. ఉత్పత్తి కులాల వైపు నుంచి మన సామాజిక చరిత్రను చూడవలసిన అవసరాన్ని గుర్తించి కూడా ఐలయ్య పక్షం తీసుకోవచ్చు. అంత మాత్రాన ఆయన పరిశీలనా పద్ధతిపట్ల ఏ విమర్శనాత్మక వైఖరి చెప్పకూడదనడానికి వీల్లేదంటే కుదరదు. సామాజిక పరిశోధన నిరంతరం హేతుబుద్ధితో విస్తరిస్తూ ఉంటుంది. సామాజిక విశ్లేషణ పద్ధతి గురించి ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా సంవిధానాన్ని కేంద్రం చేసుకొనే చర్చించాల్సి ఉంటుంది. అది అంత వస్తుగతమైనదీ.. విమర్శనాత్మకత గీటురాయి మీద నిగ్గుదేలేదీ. అక్కడ బెదిరింపులకు, ఉద్వేగాలకు తావు ఉండదు. శాస్త్రీయ విమర్శనాత్మకతను మత వాదులు, ప్రభుత్వాధినేతలు, ఫాసిస్టులు మాత్రమే తిరస్కరిస్తారు. సంపద, అధికారం, అగ్రకులతత్వం, మతతత్వం మీద ఆధారపడ్డ వాళ్లు ఐలయ్య పుస్తకం సందర్భంలో వీరంగం తొక్కడానికి ఇదే కారణం.

అందువల్ల ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గురించో, రాజ్యవ్యవస్థను కూల్చాలనుకుంటున్న విప్లవకారుల గురించో మాట్లాడితే రాజద్రోహిగా ముద్రవేసేవారు. ఇక నుంచి కులం గురించి మాట్లాడినా రాజద్రోహులవుతారు. అట్టడుగు కులాలు ఏం మాట్లాడినా దేశద్రోహులవుతారు. దేశంలో ఉండదగని ప్రమాదకరమైన వ్యక్తులవుతారు. కులం గురించి మాట్లాడితే ప్రభుత్వం ఇలా కేసులు పెట్టాలనుకోవడం, సంఘపరివార్‌ దీన్ని రాజద్రోహంగా ప్రచారం చేయడం అత్యంత ప్రమాద సంకేతం. .

No. of visitors : 1833
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి

ఏది సత్యం ? ఏది అసత్యం ?

పాణి | 17.04.2020 01:43:44pm

విరసం ఆచరణలో లోటుపాట్లు ఉన్నాయని శరత్ చంద్ర అనుకుంటే, తాను విప్లవాభిమాని అయితే వాటిని సంస్థకు తెలియజేయవచ్చు. విరసం నిరంతరం అలాంటి సూచనలను గౌరవంగా స్వీకరి......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •