ఆ యాభై రోజులు (నవల)

| సాహిత్యం | క‌థ‌లు

ఆ యాభై రోజులు (నవల)

- మెట్టు మురళీధర్‌ | 07.10.2017 11:28:42am

నవంబరు నెల. చలికాలం ప్రారంభమయింది. పగలు ఎండగాను, రాత్రి చలిగాను ఉంది. వానలు పూర్తిగా తగ్గి నెల దాటింది. ప్రకృతి పచ్చగా ఉంది. కార్తీకశోభ నిండుదనాన్నిస్తోంది.

రిజిస్ట్రేషన్‌ ఆఫీసు నుండి అమ్మను వెంటబెట్టుకొని డబ్బుసంచీతో ఇల్లు చేరాడు చందు. అప్పటికి సాయంత్రం ఆరయింది. అమ్మను ఇంట్లో దించి పనుందంటూ బయటకు పోయాడు. ఇంట్లో సాయమ్మ డబ్బుసంచీని జాగ్రత్త చేసింది.

కాసేపు ఆ పనీ, ఈ పనీ చేసుకొని ఇల్లు చేరాడు చందు. అన్నం తిని టి.వి. ముందు కూర్చున్నాడు.

టి.వి.లో ప్రధానమంత్రి ఉపన్యాసం వస్తోంది. ఛానల్‌ మార్చాడు చందు. అందులోనూ అదే వస్తోంది. ఏ ఛానల్‌ చూసినా ఆయన మాటలే. ʹʹఏమిటి ఇవ్వాల?ʹʹ అనుకుంటూ టి.వి. మీద దృష్టి పెట్టాడు. ప్రధానమంత్రి హిందీలో మాట్లాడుతున్నాడు. తెరమీద తెలుగు అనువాదం కనబడుతోంది.

పెద్దాయన మాటలు వింటుంటే చెమటలు పట్టాయి చందుకు.

ʹʹఅమ్మా! కొంప మునిగిందే!ʹʹ అంటూ గట్టిగా అరిచాడు.

కొడుకు అరుపు విని చేస్తున్న పనిని పక్కకు పెట్టి గాబరాపడుతూ వచ్చింది సాయమ్మ. వస్తూనే అంది,

ʹʹఏమయింది కొడుకా?ʹʹ అని.

ʹʹపెద్దనోట్లు రద్దయ్యాయిʹʹ టి.వి. చూస్తూనే చెప్పాడు చందు.

ʹʹఅంటే?ʹʹ సాయమ్మకు అర్థంకాక అడిగింది.

ʹʹఐదు వందలు, వెయ్యి నోట్లు చెల్లయట.ʹʹ

ʹʹఆ!ʹ అంటూ నిర్ఘాంతపోయింది సాయమ్మ. వెంటనే తేరుకొని,

ʹʹఎందుకు బిడ్డా?ʹʹ అంది.

ʹʹవాటిని ప్రభుత్వం రద్దు చేసింది.ʹʹ

ʹʹఎప్పటి నుండి?ʹʹ

ʹʹఇప్పుడేʹʹ

ʹʹఐతే మన దగ్గరున్న పెద్దనోట్లు చెల్లయా?ʹʹ

చందు మాట్లాడలేదు. మళ్ళీ సాయమ్మే అంది.

ʹʹసూడు సూడుమని ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఆ చలపతి ఇయ్యాలనే పైసలిచ్చె. అన్నీ పెద్దనోట్లేనాయె. అవన్నీ చెల్లయా మరి?ʹʹ సాయమ్మ ఆత్రంగా అడిగింది. ఆమె ముఖంలో భయం కనిపిస్తోంది.

ʹʹ50 రోజుల దాకా బ్యాంకులో వేసుకోవచ్చట. తర్వాత చెల్లయట.ʹʹ టి.వి. చూస్తూనే అన్నాడు చందు.

ʹʹమరెట్ల కొడుకా?ʹʹ

చందు ఏమీ చెప్పలేదు.

సాయమ్మ నెత్తీ, నోరూ కొట్టుకుంది. ఇంట్లో ఉన్న 16 లక్షల రూపాయలు ఏమయిపోతాయోనన్న భయం పట్టుకుందామెకు.

చందు టి.వి.లో మునిగిపోయాడు. ప్రధానమంత్రి మాట్లాడుతూనే ఉన్నాడు. పెద్దాయన మాటల్ని టి.వి. ఛానల్లు మాటిమాటికి ప్రసారం చేస్తున్నాయి.

ʹʹప్రియమైన సోదర సోదరీమణులారా! ఈ క్షణం నుండి పెద్దనోట్లు అంటే ఐదు వందలు, వెయ్యి నోట్లు రద్దవుతున్నాయి. రేపు, ఎల్లుండి బ్యాంకులు, ఏ.టి.ఎం.లు పనిచేయవు. తర్వాతి రోజు నుండి పనిచేస్తాయి. ఆరోజు నుండి డిసెంబరు 30 దాకా అంటే 50 రోజుల దాకా వాటిని బ్యాంకుల్లో వేసుకోవచ్చు. తర్వాత చెల్లవు.

పెద్దనోట్లు ఉన్నవారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వారు తమ స్వంత ఖాతాల్లో రెండున్నర లక్షల దాకా డిపాజిట్‌ చేసుకోవచ్చు. వాటికి లెక్క చెప్పాల్సిన పనిలేదు. అంతకు మించి జమచేస్తే లెక్క చెప్పాలి. అవసరమైతే టాక్స్‌ కట్టాలి. ఈ రెండు సెలవురోజుల్లో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

పెద్దనోట్ల రద్దు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. నల్ల కుబేరుల భరతం పట్టడానికి, నల్లడబ్బు వెలికి తీయడానికి చేపట్టిన మహాయజ్ఞమిది. దేశ ప్రజలందరు ఈ యజ్ఞంలో భాగస్వాములై ప్రభుత్వంతో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

50 రోజులు ఓపిక పట్టండి. చిన్న చిన్న కష్టాలను భరించండి. తర్వాత అన్నీ మంచిరోజులే. నల్లధనం లేని నవభారతం ఆవిష్కరించబడుతుంది.ʹʹ

అంటూ పెద్దాయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ మాటల్ని ఛానల్లు మార్చి మార్చి వింటూనే అమ్మ అడిగిన ఒకటి, రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు చందు.

సాయమ్మ దిగులుపడుతూ ఓ మూలకు కూర్చొని ఉంది. అమ్మ పక్కనే కూర్చొని లత అంతే దిగులుగా ఉంది. చందుకు ఏం చేయాలో తోచడం లేదు.

ఆనాడు నవంబరు 8, 2016వ సంవత్సరం. ఆనాటి రాత్రి ప్రధానమంత్రి హఠాత్తుగా పేల్చిన బాంబిది. నల్లకుబేరుల భరతం పట్టడం కోసం, నల్లడబ్బు వెలికితీత కోసం పెద్దనోట్ల రద్దు ఒక దివ్యౌషధంగా భావిస్తున్నాడాయన. ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు ఒకింత గర్వాతిరేకం కనిపిస్తున్నదాయన ముఖంలో.

నవంబరు 8వ తేది మధ్యాహ్నమే సాయమ్మ ఇల్లు కొన్న చలపతి ఇంటిని తనపేర రిజిస్టరు చేసుకున్నాడు. అంతకుముందు ఇచ్చిన అడ్వాన్సు 2 ల్షలు పోను మిగతా 16 లక్షల రూపాయలు రిజస్టరాఫీసులోనే సాయమ్మ చేతికిచ్చాడు చలపతి. డబ్బు తీసుకొని సాయమ్మ వేలిముద్ర వేసింది. చందు సాక్షి సంతకం చేశాడు. పని అయిపోయాక డబ్బుసంచితో సహా కొడుకును తీసుకొని ఇల్లు చేరింది సాయమ్మ.

ఇల్లు అమ్మడం బాధగా ఉన్నా, కూతురు లతకు ఒక మంచి సంబంధం దొరికిందన్న తృప్తి ఉంది సాయమ్మకు. కట్నం డబ్బు, పెళ్ళి ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో చందు కోసం ఒక చిన్నపాటి ఇల్లుజాగా కొనాలనుందామెకు. రెండు, మూడు సంవత్సరాల తర్వాతైనా చందు అందులో ఇల్లు కట్టుకోకపోతాడా? అని భావిస్తోందామె.

ఒక్కసారిగా పెద్దనోట్లు రద్దయేసరికి సాయమ్మ ఊహలన్నీ తారుమారయ్యాయి.

2

ʹʹఇల్లు అమ్మి తప్పు చేశానా?ʹʹ అనిపించింది సాయమ్మకు ఓ క్షణం. అంతలోనే లత కళ్ళముందు మెదిలింది.

లతకిప్పుడు పద్దెనిమిదేండ్లు. పెళ్ళీడుకొచ్చింది. సంవత్సరం క్రిందినుండే సాయమ్మ తెలిసిన వాళ్ళ ద్వారా లతకు సంబంధాల్ని చూస్తూనే ఉంది. ఐతేే చూచిన అందరూ తాగుబోతులే. పనీపాటా లేని జులాయిలే. పైసా ఆస్తిలేనివారే. అలాంటివారు కూడా ఐదారు లక్షల కట్నమడుగుతున్నారు. ఇంకా బండియని, మెడగొలుసని మరో లక్ష కావాలంటున్నారు. సాయమ్మకు చేతిలో చల్లిగవ్వకూడా లేదు. పదహారు సంవత్సరాల క్రిందకొన్న 150 గజాల ఇంటిజాగా, అందులో రెండు గదులున్న చిన్నపాటి ఇల్లు ఉంది. అది తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు.

లతకన్నా మూడేండ్లు పెద్ద చందు. పదోతరగతిలోనే చదువు ఆపేశాడు. ఇంటింటికీ పేపర్లు, పాల ప్యాకెట్లు, నీళ్ళ క్యాన్లు వేసి అమ్మకు సాయమయ్యాడు కొంతకాలం. తర్వాత కారు డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు. రెండు సంవత్సరాల నుండి విలాసరావు దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

రాళ్ళు కొట్టే సామాజిక వర్గమైనా లత బంగారు బొమ్మలా ఉంటుంది. ఆమె బయటకు వస్తే చాలు కుర్రకారు యువకులు ఆమె చెంతకు చేరుతున్నారు. లతకు ఏదో సహాయం చేస్తున్నట్టు నటిస్తూ కావాలని ఆమెను తాకుతున్నారు. కొందరైతే చందును ʹబామ్మర్దిʹ అని పిలుస్తున్నారు. ఇవన్నీ నచ్చడం లేదు చందుకు. అందుకే ఎలాగైనా సరే, చివరికి ఇల్లు అమ్మైనా సరే లతకు పెళ్ళి చేయాలనుందతనికి. ఆ మాటే తల్లితో అన్నాడోసారి.

ʹʹఇల్లు అమ్మి ఏడుంటవు కొడుకా?ʹʹ అంది సాయమ్మ.

ʹʹనాదేందే మగపోరన్ని. ఎక్కడైనా ఉంటʹʹ అన్నాడు చందు.

ʹʹఏమైనా ఇల్లమ్మడం నాకిష్టంలేదు బిడ్డా!ʹʹ

ʹʹమరి లత పెండ్లి ఎట్ల చేద్దాం చెప్పు? ఆ ఇల్లు తప్ప మన దగ్గరేముంది? ముందైతే లత పెండ్లి కానియ్యి. తర్వాత చూదాం.ʹʹ

ʹʹఏమోరా!ʹʹ అనుమానం వ్యక్తం చేసింది సాయమ్మ.

ʹʹఇంత పెద్దూళ్ళె మనిద్దరికి జాగ దొరకదా? నువ్వేం మనసుల పెట్టుకోకు. నాకు రెక్కలున్నయ్‌. నేను బతుకుతా. నిన్ను సాదుకుంటాʹʹ అంటూ తల్లిని ఒప్పించాడు చందు.

స్వంతంగా ఇల్లు అమ్మడం కుదరదని ఒక ఏజెంటును పట్టుకున్నాడు చందు. అతడు తనకు దూరబంధువే. వారం తిరక్కముందే అతడు చలపతి అనే ఓ పార్టీని పట్టుకొచ్చాడు. గజానికి 12 వేల చొప్పున 150 గజాలకు 18 లక్షలు ఇస్తానన్నాడాయన. ఇల్లు ఉన్నా లేనట్టేనని, అందులోనూ అది పాతది కాబట్టి దానికి ధర పెట్టనన్నాడు చలపతి. పైగా దాన్ని కూల్చడం, బయట పారబోయడం తనకే అదనపు ఖర్చన్నాడు.

సాయమ్మ కూడా ఆలోచించింది. ʹతాను కొన్నప్పుడే ఆ ఇల్లు పాతది. ఇప్పుడు మరీ పాతబడిందిʹ అనుకొని 18 లక్షలకు సరే అంది. చందు కూడా ఒప్పుకున్నాడు.

తన దగ్గరున్న 2 లక్షల రూపాయల్ని చలపతి అడ్వాన్సుగా సాయమ్మ చేతికిచ్చాడు. 45 రోజుల వాయిదాతో కాగితం వ్రాయించుకున్నాడు.

ఇటు ఇల్లు అమ్మే ప్రయత్నం చేస్తూనే అటు లతకు పిల్లవాన్ని చూచే ప్రయత్నం తీవ్రం చేసింది సాయమ్మ. చూడగా చూడగా ఆమెకు ఒక సంబంధం నచ్చింది. పిల్లవాని పేరు వాసు. అతని తండ్రి వెంకటయ్య. తల్లి లక్ష్మి. వాసు ఐ.టి.ఐ. చదివి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

వెంకటయ్య దంపతులకు వాసు ఒక్కడే కొడుకు. హైదరాబాద్‌ పక్కనే ఉన్న జగద్గిరిగుట్టలో స్వంత ఇల్లుంది. ఆడబిడ్డలు లేరు. స్వంత ఊర్లో కొంత వ్యవసాయ భూమి కూడా ఉంది.

వాసు తల్లి తండ్రి ఇద్దరు కూడా చాతనైనోల్లే. వాళ్ళు ఖాళీగా ఉండరు. ఏదేదో పని చేస్తుంటారు. ఐతే వాళ్ళు 15 లక్షల కట్నమడిగారు.చివరికి 10 లక్షల కట్నం, బండి-మెడగొలుసు కింద ఒక లక్ష, మొత్తం 11 లక్షలకు ఒప్పుకున్నారు. ఆ సంబంధాన్నే ఖాయం చేసుకుంది సాయమ్మ.

ఇల్లు అమ్మగా వచ్చిన 2 లక్షల అడ్వాన్సులోంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా మొత్తం 2 లక్షల్ని వరపూజగా పిల్లవాని చేతిలో పోసింది సాయమ్మ. నెలలోపు పెళ్ళనుకున్నారు.

పెళ్ళి ఖాయం చేసుకొని ఆ విషయాన్ని చలపతికి చెప్పారు. ఎలాగైనా తొందరగా డబ్బు సర్ది పెళ్ళి గట్టెక్కించాలన్నారు. సాయమ్మ, చందు ఇద్దరూ ప్రాధేయపడితే చివరకు చలపతి సరే అన్నాడు. వాళ్ళ అవసరాన్ని గుర్తించి తన దగ్గర లేకున్నా అప్పటికప్పుడు 16 లక్షలు తయారుచేసి, నవంబరు 8వ తేదీన డబ్బు సాయమ్మ చేతిలో పెట్టి ఇల్లు రిజిస్టరు చేసుకున్నాడు చలపతి. లత పెళ్ళి తర్వాతనే ఇల్లు స్వాధీనం చేస్తానంటే కూడా ఒప్పుకున్నాడు. ఆయనిచ్చిన 16 లక్షలు తీసుకొని సాయమ్మ చందు సాయంత్రం ఇల్లు చేరారో లేదో అదేరోజు రాత్రి పెద్దనోట్లు రద్దయ్యాయి. దాంతో ఏమి చేయాలో తోచక తల్లీ కొడుకులిద్దరూ అయోమయంలో పడ్డారు.

అదంతా జ్ఞాపకమొచ్చి సాయమ్మ ఆందోళన పడుతూ కాసేపు మౌనంగా ఉండిపోయింది. కొద్దిసేపట్లోనే తేరుకొని,

ʹʹచలపతికి ఫోన్‌ చేయిబిడ్డా! ఆయన పైసలు ఆయన తీసుకొని కొత్త పైసలియ్యమని అడుగు.ʹʹ అంది సాయమ్మ. చలపతి మీద కొద్దిగా ఆశ ఉందామెకు.

చందు చలపతికి ఫోన్‌ చేశాడు.

ʹʹఅంకుల్‌! మీరిచ్చిన పెద్దనోట్లు రద్దయినాయి కదా! మీ పైసలు మీరు తీసుకొని కొత్తనోట్లివ్వండి.ʹʹ

ʹʹలేదు చందూ! పైసలు మీకిచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాను. అయిపోయింది. అంతే. మీకిచ్చినపుడు అవి చెల్లే పైసలే కదా? ఇప్పుడు నన్ను తిరిగి తీసుకోమంటే నేనేం చేసుకోను? మీరే ఏమైనా చేసుకొండిʹʹ అన్నాడు చలపతి.

చలపతి మీదున్న కొద్దిపాటి ఆశ తొలగిపోయింది సాయమ్మకు. వెంటనే అంది,

ʹʹకొడుకా! ఈ పైసలు మన దగ్గరుంచుకోవద్దు. రేప్పొద్దున్నే జగద్గిరిగుట్టకు పోయి పిలగానోళ్ళకు మనమింకా ఇయ్యాల్సిన కట్నం బాపతు 8 లక్షలు, బండి-గొలుసు బాపతు లక్ష, మొత్తం తొమ్మిది లక్షలు వాళ్ళకిచ్చిరా. వాళ్ళ బాకీ తీరుతది. మిగిలిన పైసల గురించి అటెంక చూచుకుందాముʹʹ అంది సాయమ్మ చందుతో.

ʹఅమ్మ చెప్పింది బాగానే ఉంది, కాని జగద్గిరిగుట్టవాళ్లు ఈ రద్దయిన నోట్లు తీసుకుంటారా?ʹ అని అనుమానమొచ్చింది చందుకు. అదే మాట తల్లితో అన్నాడు.

ʹʹఈ సమయంలో వాళ్ళు పాతనోట్లు తీసుకుంటారంటావా?ʹʹ అని

చందు మాట విని వెంటనే అంది సాయమ్మ.

ʹʹఅనుమానపడకు బిడ్డా! తీసుకుంటరు. పోవాలె. బతిలాడి, బామాలి ఎట్లనన్న పైసలు వాళ్ళ చేతుల పెట్టి రావలె. వాళ్ళేమన్న చేసుకోని.ʹʹ

అమ్మ మాట విని ʹʹసరే!ʹʹ అన్నాడు చందు.

ʹతీసుకుంటరుʹ అని అమ్మ అనగానే చందుకు కూడా కొద్దిగా ఆశ కలిగింది. ఎందుకంటే వెంకటయ్య మామకు, లక్ష్మి అత్తకు పైసల గురించి, బ్యాంకు వ్యవహారాల గురించి బాగా తెలుసు. వాళ్ళ చేతుల్లో చీటీల డబ్బులు లక్షలకు లక్షలు మెదులుతాయి. ఈ 9 లక్షలు వాళ్ళకు ఓ లెక్క కాదు. పైగా వాళ్ళు తమతో వియ్యమందుకోబోతున్నారు. అందుకే చందుకు కూడా వాళ్ళు తీసుకుంటారనే అనిపించింది.

ʹతీసుకుంటరుʹ అని అంది గాని, సాయమ్మకు జగద్గిరిగుట్టవాళ్ళు తప్పక తీసుకుంటారన్న నమ్మకం మాత్రం లేదు. ఎందుకంటే డబ్బుల దగ్గర వాళ్ళకు ఎలాంటి మొహమాటం ఉండదు. ఆ విషయం వరపూజ నాడే తెలిసింది సాయమ్మకు.

ʹʹఈ రెండు లక్షలిచ్చి ఊరుకుంటే కాదు. మొత్తం పైసలిస్తేనే పుస్తె గట్టుడుʹʹ అని ఆనాడే అంత మందిలో అన్నారు.

ʹఏది ఏమైనా పోతెనే గదా తెలిసేది?ʹ అనుకొని చందును ప్రయాణానికి తయారుచేసింది సాయమ్మ.

సాయమ్మకు మనసు ఆందోళనగా ఉంది. వాళ్ళు తీసుకుంటారో లేదోనన్న బెంగ ఒకవైపు. పైసలేమయిపోతాయోనన్న బాధ మరోవైపు ఆమెను కలచివేస్తున్నాయి. దాంతో అన్నం తినబుద్ధి కాక సాయమ్మ అన్నం తినలేదు. అమ్మ తినలేదు కదా అని లత తినలేదు. ఇద్దరూ తినకపోవడంతో చందుకూ తినబుద్ధి కాలేదు.

ముగ్గురూ పైకి అలా ఉన్నారుగాని, ముగ్గురి మనసులోనూ ఒకరకమైన భయం చోటు చేసుకుంది.

(ఇంకా ఉంది)

No. of visitors : 1035
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •