సామ్రాజ్యవాదయుగంలో సాటిలేని హీరో ఉత్తర కొరియా !

| సాహిత్యం | వ్యాసాలు

సామ్రాజ్యవాదయుగంలో సాటిలేని హీరో ఉత్తర కొరియా !

- పి. ప్రసాదు | 18.10.2017 03:15:47pm

సామ్రాజ్యవాద యుగంలో మూడు రకాల విప్లవ ప్రవాహాలుంటాయి. దేశాలు స్వాతంత్య్రాన్ని కోరడం ఒక విప్లవ ప్రవాహం. జాతులు విముక్తిని కోరడం మరో విప్లవ ప్రవాహం. ప్రజలు విప్లవాన్ని కోరడం ఇంకో విప్లవ ప్రవాహం. మొదటిదీ, రెండవదీ వర్గ పోరాటాలు కానక్కరలేదు. మూడవది మాత్రం వర్గ పోరాటాల రూపాలలో కొనసాగుతుంది. ఇరాక్‌, లిబియా, క్యూబా, వెనిజువెలా, ఇరాన్‌, సిరియాల నుంచి నేటి ఉత్తర కొరియా వరకూ ఆయా దేశాలు తమ స్వాతంత్య్రం, సార్వభౌమాధికారాల పరిరక్షణ కోసం పోరాడుతున్నాయి. ఇవి మొదటి కోవకి చెందిన విప్లవ ప్రవాహాలలోకి వస్తాయి. కాశ్మీరు, పాలస్తీనా, బెలూచీ, ఐరిష్‌, పష్తున్‌ వంటి జాతులు సాగించే పోరాటాలు రెండో కోవలోకి చెందిన విప్లవ ప్రవాహాలలోకి వస్తాయి. వివిధ దేశాలలో పెట్టుబడిదారీ దోపిడీపై కార్మికవర్గం మరియు భూస్వామ్య దోపిడీపై రైతాంగం మౌలిక మార్పు కోసం సాగించే పోరాటాలు మూడో కోవకి చెందిన విప్లవ ప్రవాహంలోకి వస్తాయి. నేడు మొదటి కోవలోని విప్లవ ప్రవాహంలో ప్రయాణిస్తున్న ఉత్తర కొరియా ప్రపంచానికి నేడు ఒక విప్లవ సందేశాన్ని అందిస్తున్నది. దాన్ని సంక్షిప్తంగా అవలోకిద్దాం.

తన దేశ స్వాతంత్య్రం, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం దృఢంగా నిలబడ్డ ఇరాక్‌ను అమెరికా దురాక్రమించింది. అమెరికా బెదిరింపులకు లొంగకుండా ధీరోదాత్తంగా నిటారుగా నిలబడ్డ సద్దామ్‌ హుస్సేన్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. సద్దామ్‌ను బందీగా పట్టి బూటకపు విచారణ చేసి ఉరితీసింది. అదే దారిలో నడిచిన గడాఫీని కూడా హతమార్చి లిబియాని దురాక్రమించడం తెలిసిందే. ముఖ్యంగా ఇరాక్‌లో అణ్వస్త్రాలు లేకపోయినా, ఉన్నాయన్న బూచితో అమెరికా సైనిక దురాక్రమణకి పాల్పడింది. ఈ దురాక్రమణలూ, స్వాతంత్య్ర ప్రభుత్వాల కూల్చివేతలూ, ప్రభుత్వాధినేతల ఉరితీతలూ, కాల్చివేతలూ మూడో ప్రపంచదేశాలకు కొత్త రాజకీయ గుణపాఠాలను అందించాయి. అణ్వస్త్ర అగ్రరాజ్యాల ముప్పు నుంచి మూడో ప్రపంచదేశాల స్వాతంత్య్రాల పరిరక్షణ కోసం ʹపోటీ అణ్వస్త్రాలుʹ (ధిక్కార అణ్వస్త్రాలు) కూడా అవసరమవుతాయన్న గుణపాఠమది. అట్టి గుణపాఠాల వెలుగులో ధిక్కార అణుబాంబుల వ్యవస్థను ఉత్తర కొరియా రూపొందించింది.

పీడిత ప్రజలను అణుబాంబులు చైతన్యపరచలేవు. విప్లవ పోరాటాలను అణ్వస్త్రాలు సృష్టించలేవు. అదే విధంగా వాటిని నిర్మూలించే సామర్ధ్యం కూడా అణుబాంబులకి వుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే విప్లవ పరివర్తనాక్రమంలో బాంబులకు నిర్ణయాత్మక పాత్ర వుండదు. ʹప్రజలే చరిత్ర నిర్మాతలుʹ అన్న చారిత్రిక నియమాన్ని అణుబాంబులు మార్చలేవు. అణుబాంబుల తయారీతో విప్లవ పరివర్తనా క్రమంలో మౌలిక మార్పులు వస్తాయన్న కృశ్చేవ్‌ వాదనను చైనా కమ్యూనిస్టు పార్టీ తిరస్కరిస్తూ యిదే సత్యాన్ని చాటింది. అదే సమయయంలో అణు బాంబుల మీద సామ్రాజ్యవాద దేశాల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడం ప్రపంచ విప్లవగమనానికి సహకరిస్తుందని స్టాలిన్‌, మావో చాటి చెప్పారు. దాన్ని ఆచరణలో నిరూపించారు. అదే బాటలో ఉత్తరకొరియా కిమ్‌-ఇల్‌-సంగ్‌ ప్రభుత్వం 1960వ దశాబ్దం నుంచే అణ్వస్త్ర ఆవశ్యకతకు కట్టుబడింది. ఆనాటి నుంచే అణు పరిశోధనల మీద కేంద్రీకరించింది. ఎట్టకేలకు అది నేడు పూర్తి స్థాయి అణ్వస్త్ర రాజ్యంగా ఎదిగింది.

అణ్వస్త్రాల తయారీ ప్రక్రియ చిన్న విషయం కాదు. అందుకు చిన్న దేశాల ఆర్ధిక వ్యవస్థలు సాధారణంగా సహకరించవు. ఉత్తర కొరియా చాలా చిన్న దేశం. నిరుపేద దేశం. భౌగోళిక వనరులు కూడా తక్కువే. అయినా అది నేడు ఒకవైపు అణుబాంబులనూ, రెండో వైపు క్షిపణులను రూపొందించుకోగలిగింది. వేటగాడి చేతిలో ఒక్క విల్లు ఉన్నంత మాత్రాన సరిపోదు. బాణం కూడా వుండాలి. లక్ష్యాన్ని చేధించే సామర్థ్యం బాణానికే తప్ప విల్లుకు వుండదు. కానీ లక్ష్యాన్ని చేధించే సామర్ధ్యం బాణానికి కల్పించగలిగేది విల్లు మత్రమే. అణు బాంబులను బాణాలతో పోల్చవచ్చు. క్షిపణులను విల్లుతో పోల్చవచ్చు. అది మూడు దశాబ్దాల క్రితం 1976లోనే స్కడ్స్‌తో ప్రారంభించింది తర్వాత స్వల్ప దూర క్షిపణులను కనుగొన్నది. ఆ తర్వాత దేశాంతర క్షిపణులను కనుగొన్నది. ఆ తర్వాత ఎట్టకేలకు ఖండాంతర క్షిపణులను కూడా తాజాగా కనుగొన్నది. ది. 4.7.2017న మొదటిసారి ఖండాంతర క్షిపణి ప్రయోగం చేసింది. ఐదువేల కి.మీ. దూరం వెళ్ళగలిగితే ఖండాంతర క్షిపణి అంటారు. అయితే ఆ తర్వాత మూడు వారాలకే ది. 27.08.2017న 10 వేల కి.మీ. దూరం ప్రయాణించే క్షిపణి ప్రయోగాన్ని చేసింది. దీనితో అమెరికా తూర్పు తీరాన్ని కూడా చేధించే సామర్థ్యాన్ని సాధించింది.

ఇంకోవైపు అణుబాంబుల తయారీ ప్రక్రియలో కూడా ఒక్కొక్క మెట్టును అధిగమించింది. 2016 జనవరిలో నాల్గవ అణ్వస్త్ర ప్రయోగంతోనే దాని పాటవ సామర్ధ్యాన్ని పెద్దరాజ్యాలు గుర్తించాయి. అదే ఏడాది సెప్టెంబరు 9నాటి ఐదవ అణ్వస్త్ర పరీక్షతో అవి కంగుతిన్నాయి. ముఖ్యంగా ఏడాది తర్వాత తాజాగా ది. 3.9.2017 నాటి ఆరవది హైడ్రోజన్‌ బాంబు కావడం అమెరికా వెన్నులో వణుకు పుట్టించింది. ఇప్పుడు బాణాన్ని న్యూయార్కు వరకూ పంపే సామర్థ్యం విల్లుకు వచ్చింది. బాణానికి కూడా విస్పోటనా సామర్ధ్యం పెరిగింది. అందుకే అణుయుద్ధ పాటవంలో ఇప్పుడు అమెరికా దృష్టిలో కొరియా ఎంతో, కొరియా దృష్టిలో అమెరికా కూడా అంతే. సాంప్రదాయ గగనతల భూతల యుద్ధాలలో సైనిక సామర్థ్యాలకు అణుబాంబుల పాటవ సామర్థ్యం పూర్తి భిన్నమైనది.

గగనతల వైమానిక యుద్ధంలో నాడు వియత్నం, ఇరాక్‌, ఆప్ఘనిస్తాన్‌, యుగోస్లావియాల నుంచి నేడు సిరియా వరకూ అమెరికా బాంబింగ్‌చే విధ్వంసం చేయగలిగింది. లక్షలాది పదాతి సేనలతో భూతల యుద్ధాలు చేసి దురాక్రమించగలిగింది. కానీ అణుయుద్ధం అలాంటిది కాదు. ఈ వూరుకు ఆ వూరెంత దూరమో, ఆ వూరుకు యీవూరు కూడా అంతే దూరం వుంటుందన్న చందమిది. కొరియా మీద అమెరికా ఒక అణుబాంబు వేస్తే, అమెరికా మీద కొరియా కూడా వేయగలదు. ఇరాక్‌ మీదికి రెండు లక్షల సేనలను తరలించినట్లు అణ్వస్త్ర రాజ్యమైన ఉత్తర కొరియాకు తరలించడం అమెరికాకి అంత తేలికైనది కాదు. అందుకే నేడు ట్రంప్‌ సర్కార్‌ పైకి ఉత్తర కొరియా మీద నిప్పులు చెరుగుతున్నప్పటికినీ, లోలోపల భీతిల్లుతున్నది. ఇది నేడు ఒక కొత్త పరిస్థితే.

ఉత్తర కొరియాలో వున్న అన్ని అణ్వస్త్ర కేంద్రాలను ఏకకాలంలో విధ్వంసం చేసే సామర్ధ్యం అమెరికా వద్ద వుంది. కానీ వాటి క్షేత్రాలన్నింటి వివరాలు సరిగ్గా తెల్సినప్పుడే అది సాధ్యపడుతుంది. ఉత్తర కొరియా భూభాగంలో మూడువంతుల భాగం కొండలతో నిండింది. ఏ ఏ కొండ గుహలలో రహస్య అణ్వస్త్ర కేంద్రాలను నిర్మించిందీ అమెరికాకి తెలియదు. అవి అమెరికా రాడార్‌ వ్యవస్థకు కూడా దొరకవని అమెరికా నాసా, అణుశాస్త్రవేత్తలు కూడా సృష్టీకరించారు. అమెరికా అలాంటి ముందస్తు దాడులకి దిగిందనుకుందాం. ధ్వంసం కాకుండా మిగిలి పోయిన రహస్య అణ్వస్త్ర కేంద్రాలనుంచి ప్రతీకారంగా అమెరికా, జపాన్‌, ద||కొరియాల మీద అణుబాంబుల ప్రయోగం జరగవచ్చు. ఈ భయం అమెరికాని పట్టి పీడిస్తున్నది. ఈ భయం జపాన్‌, దక్షిణ కొరియాలను కూడా పీడిస్తున్నది. అందుకే ఏదో విధంగా గతంలో నిలిచి పోయిన ఆరు దేశాల చర్చల ప్రక్రియకి అమెరికా దిగివచ్చే అవకాశం వుంది. దానికి ముందు ఉత్తర కొరియానే భీతిల్లి చర్చలకు దిగి వచ్చిందన భావనను ప్రపంచ దేశాలలో కలిగించాలి. లేనిచో అమెరికా ఉపగ్రహ రాజ్యాలు చేజారి పోవచ్చు. అందుకొక మానసిక యుద్ధాన్ని అమెరికా చేయాలి. అవి నేడు జరుగుతున్నదని కొందరు అంతర్జాతీయ రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏది ఏమైనా నేటి సామ్రాజ్యవాద యుగంలో ఉత్తరకొరియా ఒక ప్రతిఘటనా ప్రతీకగా నిలుస్తుంది. ప్రతిఘటనా ప్రపంచానికి ఒక విప్లవ స్ఫూర్తి దాతగా నిలుస్తుంది. అగ్రరాజ్యల దురాక్రమణదారీ విధానాలకు ఒకింత అడ్డుకట్టగా నిలిచింది. ఉత్తర కొరియా ప్రతిఘటనా పతాకం వర్ధిల్లాలి. అమెరికా దురాక్రమణదారీ విధానం నశించాలి. కొరియా ధిక్కార అణ్వస్త్ర విధానాన్ని బేషరతుగా బలపరుద్దాం.


No. of visitors : 884
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఈ బాలుడి కనీటి ప్రశ్నకు న్యాయవ్యవస్థ జవాబు ఏమిటి

పి. ప్రసాదు | 06.04.2017 11:46:57am

దేశ సంపదలను పంది కొక్కుల్లా మెక్కేవారికే,దేశ సంపదలను సృష్టిస్తున్న శ్రమ జీవులకూ మధ్య యిదీ నేడు అమలు జరుగుతున్న వివక్షతా న్యాయం కార్పొరేటు మీడియాలో కార్మికుల...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జనవరి - 2018
  బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ఓడిద్దాం
  విప్లవ రచయితల సంఘం 26వ మహా సభలను విజయవంతం చేద్దాం
  సుఖ విరోచనం!
  కాడిని వొదిలేశాక
  కవిగానం
  సభా దీక్ష
  న్యాయమూ ప్రత్యామ్నాయమూ!
  UNDEMOCRATIC METHODS OF APSIB
  పసిపాపలా౦టి భాష...
  క‌ళావేత్త‌లారా! మీరేవైపు?
  మౌలిక ప్రశ్నలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •