ఆ యాభై రోజులు (నవల)

| సాహిత్యం | క‌థ‌లు

ఆ యాభై రోజులు (నవల)

- మెట్టు మురళీధర్‌ | 18.10.2017 03:18:56pm

రెండవ భాగం

పొద్దున ఐదు గంటలకే లేచాడు చందు. అతను తయారయ్యేటప్పటికి సాయమ్మ పైసల సంచిని తయారు చేసింది. కూరగాయలు తేవడానికి ఉపయోగపడే ఒక మామూలు చేసంచిని సర్దిపెట్టింది. తొమ్మిది లక్షల రూపాయల్ని ఓ టవల్లో చుట్టింది. అన్నీ వెయ్యి రూపాయల నోట్లే. సంచి క్రింది భాగంలో కొన్ని బట్టలు పెట్టింది. మధ్యలో పైసలు చుట్టిన టవల్ను పెట్టి, పైనుండి మరిన్ని బట్టలు పెట్టింది. పూర్తిగా పైన ఇంకో టవల్ను కప్పింది. చూస్తే అది మామూలు బట్టల సంచీ అనుకునేలా తయారుచేసింది.

అంతలో చందు స్నానం చేసి తయారయ్యాడు. సంచి అతని చేతికిస్తూ.

ʹʹజాగర్త బిడ్డా! సంచినెక్కడా పెట్టవద్దు. ఎప్పుడూ చేతిలోనే ఉంచుకో. ఎవరైనా అడిగితే గాజు సామాన్లున్నాయని చెప్పు. అందులో పైసలున్నట్టు తాపతాపకు సూడకు. అట్లాగని సూడకుండా ఉండకు. ఎవరికీ అనుమానం రాకుండా ఎప్పుడూ సంచి మీదనే కన్నుపెట్టు.ʹʹ

అని చెప్పింది సాయమ్మ. ఈ విషయాన్నే రాత్రి కూడా చెప్పింది. ఐనా ఇప్పుడు మళ్ళీ చెప్పింది.

ʹʹసరేనమ్మా!ʹʹ అన్నాడు చందు.

ʹʹఅక్కడ ఇయ్యంపులోళ్ళతో జాగర్తగా మాట్లాడు కొడుకా! వాళ్ళేమన్నా నువ్వేమి అనకు. మాట పోద్ది.ʹʹ

ʹʹఅలాగేనమ్మా!ʹʹ

ʹʹపైసలిచ్చి అన్ని ముట్టినయని చెప్పు.ʹʹ

ʹʹచెపుతానమ్మా!ʹʹ అన్నాడు చందు.

ఇంకా రకరకాల జాగ్రత్తలు చెప్పి ఇంట్లో ఉన్న మూడు వందల రూపాయలు ఖర్చుల కోసం చందు పై జేబులో పెట్టింది సాయమ్మ.

చందు ఆటో ఎక్కి హన్మకొండ బస్టాండు చేరేసరికి ఉదయం ఆరు దాటింది. ఆరున్నరకు బస్సు.

నవంబరు నెల కాబట్టి అప్పుడప్పుడే తెల్లారుతోంది. చల్లగా కూడా ఉంది. బస్టాండుకు అప్పటికే చాలామంది చేరుకున్నారు. క్యాంటీను, పేపరు షాపులు తెరిచి ఉన్నాయి. అనౌన్సరు బస్సుల గురించి అనౌన్స్ చేస్తున్నాడు.

అక్కడే ఉన్న ఓ టీస్టాల్లో టీ తాగాడు చందు. రాత్రి అన్నం తినలేదు కాబట్టి కడుపు ఖాళీగా ఉంది. టీ తాగగానే కడుపు కాస్త నెమ్మదయింది. ఏమైనా టిఫిన్ తిందామనుకున్నాడు గాని, తర్వాత మానుకున్నాడు. ఆలేరు స్టేషన్లో బస్సు పావుగంట ఆగుతుంది కదా! అక్కడ తిందామనుకున్నాడు. హైదరాబాద్ వైపు వెళ్ళే బస్సు ప్రయాణీకులు చాలా మంది ఆలేరు స్టేషన్లోనే టిఫిన్లు తింటారని చందుకు తెలుసు.

బస్సులో చదువుకోవడానికి ఓ పేపరు కొనుక్కున్నాడు.

సరిగ్గా ఆరున్నరకు జగద్గిరిగుట్ట బస్సు వచ్చింది. 30 మంది ప్యాసింజర్లు ఎక్కారు. చందు ముందుగానే ఎక్కి ఓ కిటికీ పక్కన కూర్చున్నాడు. బస్సుతో సమానంగా వెనక్కి పరుగెత్తే ప్రకృతిని చూస్తూ ప్రయాణించడం చందుకిష్టం. అందుకే ఆ సీటును సెలక్టు చేసుకున్నాడు. అది ఫాస్టు ప్యాసింజరు కాబట్టి ఘన్పూర్, రఘునాధపల్లి, జనగాం మొదలైన స్టేషన్లలో దిగే ప్యాసింజర్లు కూడా అందులో ఎక్కాడు.

కండక్టరు వచ్చి టికెట్లు తీసుకోగానే బస్సును స్టార్టు చేశాడు డ్రైవరు. ఇంకా కొన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ʹఖాజీపేటలో నిండుతాయిలేʹ అనుకుంటూ బస్సును కదిలించాడు డ్రైవరు.

జగద్గిరిగుట్టకు టికెట్ కొనుక్కున్నాడు చందు. పైసల సంచీని కాళ్ళమీదే పెట్టుకున్నాడు. టికెట్ను జాగ్రత్తచేసి, సంచీలోంచి పేపరు తీశారు.

పేపర్ నిండా నోట్ల రద్దు వార్తలే. సైనికుని వేషం వేసుకొని ప్రధానమంత్రి నల్లడబ్బు మీద కత్తి తిప్పుతున్న వీరసైనికునిలా కనిపించాడు మొదటి పేజీలోనే. ఆయన ఫోటో క్రింద ʹబాహుబలిʹ అని వ్రాసి ఉంది. రాత్రి ఆయన తన ఉపన్యాసంలో చెప్పిన మాటలే ఉన్నాయి పేపర్లో.

పేపర్లో ప్రధానమంత్రి నిర్ణయాన్ని చాలామంది విమర్శించారు.

ʹʹనల్లడబ్బు పెద్దనోట్ల రూపంలో కొద్ది శాతం ఉంటుందేమో? మిగతాదంతా ఆస్తుల రూపంలోను, బంగారం మరియు ఇతర విలువైన వజ్రాల రూపంలోను ఉంటుంది. కేవలం పెద్దనోట్లు రద్దుచేస్తే నల్లడబ్బును నిర్మూలించినట్టు ఎలా అవుతుంది?ʹʹ అంటూ ఒక ప్రతిపక్ష నాయకుడు పెద్దాయన నిర్ణయాన్ని ఎద్దేవా చేశాడు.

ʹʹపెద్ద చేతులకు రద్దు నిర్ణయం ముందే తెలిసిందిʹʹ అని ఒక నాయకుడు విమర్శించాడు.

ʹʹస్వంత పార్టీ వాళ్ళు సర్దుకున్నారుʹʹ అంటూ మరో నాయకుడు వెక్కిరించాడు.

తాను ఎక్కువగా చదువకపోయినా, ఆర్థిక విషయాలు తనకు పెద్దగా తెలియకపోయినా ʹపెద్దనోట్ల రద్దువల్ల తమవంటి వారికి ఏమాత్రం లాభంలేదనిʹ అనిపిస్తోంది చందుకు. ʹలాభం లేకపోనీ, అది నష్టదాయకంʹగా కూడా అనిపిస్తోంది. నిన్న రాత్రి నుండి తాము అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి కారణంగా చందులో ఏర్పడిన అభిప్రాయమిది.

బస్సు ఖాజీపేట చేరుకుంది. అక్కడ ఖాళీ సీట్లన్నీ నిండాయి. టికెట్లు తీసుకొని కండక్టరు ʹరైట్ʹ చెప్పగానే బస్సు ముందుకు కదిలింది. ఖాజీపేట సిగ్నల్ దాటి కొంతదూరం పోగానే బస్సు వేగం అందుకుంది.

బస్సు ముందుకు పోతుంటే ఉయ్యాల ఊగినట్టుగా ఉంది. దాంతో బస్సులో ఉన్న కొందరు ప్రయాణీకులు నిద్రలోకి జారుకుంటున్నారు. చందుకు కూడా నిద్రవస్తోంది. కాని అమ్మ మాటలు గుర్తుకు వచ్చి నిద్రను ఆపుకున్నాడు. పేపరు తిరగేశాడు.

ʹʹఅర్థరాత్రి దాటినా తెరచివున్న బంగారం షాపులుʹʹ అని ఒక పేజీలో పెద్ద అక్షరాలతో కనిపించింది చందుకు. ఆ వార్త అతన్ని ఆకర్షించింది. అందులో దృష్టిపెట్టాడు చందు.

ʹనల్లడబ్బు ఉన్నవాళ్ళు రాత్రికి రాత్రే ఎక్కువ ధర పెట్టి కిలోలకొద్ది బంగారాన్ని కొన్నారట. కొందరైతే ఆ షాపులో ఉన్న బంగారు ఆభరణాలు అన్నీ కొనేశారట. ఇంకొందరైతే షాపు లెక్క కట్టి షాపుకు తాళం వేసి తాళాలు తమ చేతికిచ్చి డబ్బులు తీసుకొనిపొమ్మన్నారట.ʹ

ఈ వార్తలు చదువుతుంటే చందుకు ఆశ్చర్యం వేసింది. ʹనల్లకుబేరులకు ఇన్ని ఉపాయాలా?ʹ అనిపించింది. షాపులవారు బంగారాన్ని అమ్మడం, దాన్ని నల్లకుబేరులు తమ నల్లడబ్బు స్థానంలో దాచుకోవడం అన్నీ కొత్తగా అనిపించాయి చందుకు. ఈ విషయాలన్నీ అతనికి ఇంతకు ముందు తెలియవు. పేపరు కూడా అప్పుడప్పుడు చదివేవాడు. కాని ఆరోజు పెద్దనోట్ల రద్దు కారణంగా ఏర్పడ్డ టెన్షన్లో పేపరంతా చదివేశాడు.

బస్సు ముందుకు పోతోంది. కొందరు కిటికీలు తీశారు. కొందరు వేశారు. ఇటు చల్లగాలి, అటు సూర్యకిరణాలు బస్సులోకి రావడంతో సమశీతల వాతావరణం ఏర్పడింది.

బస్సులో తన ముందు, వెనక సీట్లను చూశాడు చందు. చాలా మంది నిద్రపోతున్నారు. చందుకు కూడా నిద్ర వస్తోంది. రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడంతో ఆపుకోవడం కష్టంగా ఉంది. చందు కళ్ళు మూసుకుపోతున్నాయి. కాని అమ్మ మాటలు గుర్తుకు రావడంతో బలవంతంగా తెరుస్తున్నాడు.

ఎంత ఆపుకున్నా నిద్ర ఆగేట్టు లేదని తెలిసిపోయింది చందుకు. అందుకే తన కాళ్ళమీదున్న పైసల సంచీని గట్టిగా ముడివేశాడు. అందులోంచి చిన్న వస్తువు కూడా బయటకు రాదని నిర్ధారించుకున్నాక చేసంచి పట్టుకునే రెండు చేతుల్లోంచి తన ఎడమచేతిని దూర్చి మెలివేశాడు. అప్పుడు సంచి సురక్షితం అనిపించింది. ʹఇక ఫరవాలేదుʹ అనుకోగానే నిద్ర ముంచుకు వచ్చింది చందుకు.

బస్సు ఒకచోట ఆగినట్టనిపించి కళ్ళు తెరిచాడు చందు. అది జనగామ బస్ స్టేషన్. అక్కడ కొందరు దిగారు. కొందరు ఎక్కారు. బస్సు మళ్ళీకదిలింది. కళ్ళు మూసుకున్నాడు చందు.

అరగంట కాకముందే బస్సు ఓ కుదుపు కుదిపింది. కళ్ళు తెరిచాడు. ʹబస్సు టైరు రోడ్డు మీదున్న ఓ గుంతలో పడ్డట్టుంది. అందుకే ఆ కుదుపుʹ అనుకొని బయటకు చూశాడు చందు. బస్సు ఆలేరు సమీపిస్తోంది.

సంచీ చూసుకున్నాడు చందు. అంతా బాగానే ఉంది. కాసేపు నిద్రపోయేసరికి మనసు, శరీరం హాయిగా ఉంది. రాత్రి అన్నం తినకపోవడంతో ఆకలిగా ఉంది. అంతలోనే బస్సు ఆలేరు స్టేషనులో ఆగింది.

ʹʹబస్సు పావుగంట ఆగుతుందిʹʹ అన్నాడు కండక్టరు.

ఆ మాటతో బస్సులో ఉన్న సగానికి పైగా ఉన్న మంది దిగడానికి లేచారు. ఒకరి వెనుక ఒకరు దిగుతున్నారు. దిగేవారిని దిగనివ్వకుండా తినుభండారాలు అమ్మేవాళ్ళు పైకి ఎక్కుతున్నారు.

ʹʹఆ పాప్ కార్న్... పాప్ కార్న్...ʹʹ

ʹʹసమోసాలు... వేడి సమోసాలుʹʹ

ʹʹవాటర్ ప్యాకెట్లు... వాటర్ ప్యాకెట్లుʹʹ

రకరకాల అరుపులతో బస్సు లోపల బయట అంతా కోలాహలంగా ఉంది.

దిగేవాళ్ళు తమ సీట్లమీద బ్యాగులు పెట్టి దిగుతున్నారు. చందు తన సంచీని సీటుమీద పెట్టి దిగేటట్టు లేదు. అందుకే సంచి ముడి విప్పి పైన ఉన్న టవల్ను తీసి, సీటు మీద వేసి కిందికి దిగాడు. సంచీ చేతిలోనే ఉంది.

పూరీ కొనుక్కున్నాడు చందు. పక్కకు కూర్చొని తిని ఓ టీ తాగాడు. కడుపు నిండినట్టయింది. రాత్రి నుండి ఖాళీగా ఉన్న కడుపు శాంతించింది. ఇక చాలు అనుకొని బస్సు ఎక్కి తన సీట్లో కూర్చున్నాడు.

ʹʹఆ సంచీని ఊరికే ఎందుకు మోస్తావు? ఓ చోట పెట్టవచ్చు కదా?ʹʹ అన్నాడు పక్కన కూర్చున్నాయన.

అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చందుకు. ʹఎవరికీ చెప్పకు, ఎవరినీ నమ్మకుʹ అంది అమ్మ వస్తున్నప్పుడు.

ʹʹసంచీలో గాజు సామాన్లున్నాయి. పగులుతాయని జాగ్రత్త పడుతున్నానుʹʹ అన్నాడు చందు. అవి కూడా అమ్మ చెప్పిన మాటలే.

చందు సమాధానంతో ఆయన తృప్తి చెందినట్టున్నాడు. అందుకే మరోప్రశ్న వేయలేదు. ʹఅమ్మయ్యʹ అనుకున్నాడు చందు.

అందరూ ఎక్కాక బస్సు బయలుదేరింది.

ʹʹటికెట్... టికెట్ʹʹ అనుకుంటూ కండక్టరు కొత్తగా ఎక్కిన ప్యాసింజర్ల దగ్గర ఆగుతూ వారికి టికెట్లు ఇస్తున్నాడు.

బస్సు వేగాన్ని పుంజుకుంది.

బస్సు పావుగంట నడిచిందో లేదో ʹʹఢాంʹʹ అని పెద్ద శబ్దం వినిపించింది. బాంబు పేలిన శబ్దంలా ఉందది. బస్సు బ్యాలెన్సు తప్పుతున్నట్టుగా అనిపించింది. వెంటనే డ్రైవర్ బస్సును ఆపేశాడు.

ʹʹటైరు పంచరు అయినట్టుందిʹʹ అంటూ దిగాడు డ్రైవరు.

బస్సులో ఉన్న మగవారు ఒక్కొక్కరే మెల్లిగా దిగారు. అదష్టవశాత్తు బస్సులో స్పేర్ టైర్ ఉంది. డ్రైవరు టైరు మార్చే పనిలో పడ్డాడు. కండక్టరు మరియు ప్యాసింజర్లలో ఒకరిద్దరు పని తెలిసినవారు డ్రైవరుకు సహాయం చేస్తున్నారు.

ʹఎంత ఆలస్యమవుతుందో ఏమో?ʹ అనుకుంటూ చందు కూడా దిగాడు. సంచీ చందు చేతుల్లోనే ఉంది.

బస్సు ఏ ఊరూ కాని చోట మధ్యలో ఆగిపోయింది. ఎక్కడున్నారో తెలియడం లేదు. ఎండ తీవ్రమవుతోంది.

బస్సులోంచి కిందికి దిగినవారు ఒకరికొకరు తెలియదు. ఐనా గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. అందరూ రద్దయిన పెద్దనోట్ల గురించే! చందు అటు యిటు తిరుగుతూ అందరి మాటలు వింటున్నాడు.

ʹʹపెద్దనోట్ల రద్దు మన ప్రాణానికే వచ్చింది. జేబులో ఐదువందల నోట్లున్నాయి. ఏం లాభం? పాతనోట్లు బస్సులో చెల్లుతాయన్నారు. కాని చిల్లర లేదని కండక్టరు తీసుకోలేదు. ఉన్న వంద రూపాయలు బస్సు టికెట్కే అయిపోయాయి. టిఫిన్ తిందామన్నా పైసలు లేవు.ʹʹ అన్నాడు ఆకలితో కడుపు మండిన ఓ ప్యాసింజరు.

ʹʹమీకర్థం కావడంలేదుగాని పెద్దనోట్లు రద్దు చాలా మంచిపని. ప్రధానమంత్రి సాహసంతో తీసుకున్న నిర్ణయమది.ʹʹ

అంటూ ఒకాయన పెద్దనోట్ల రద్దును సమర్ధించాడు.

ʹʹఏం సాహసమది? మామూలోన్ని కష్టపెట్టడం తప్ప? ఇప్పుడు దినసరి కూలి దగ్గర కూడా ఐదు వందల నోట్లుంటున్నాయి. అది పెద్దనోటా? ఇవ్వాల ఐదు వందల నోటు వందతో సమానమయింది. దాన్ని రద్దు చేయడమెందుకు? చేశారే అనుకుందాం. రెండువేల నోటు ప్రవేశపెట్టడమెందుకు? నల్లకుబేరుడు మరింత సులభంగా దాచుకునేందుకేనా?ʹʹ

ʹʹఔను. అర్థం కావడం లేదా? ఇది పెద్దోని ప్రభుత్వమే కాని పేదోని ప్రభుత్వం కాదు.ʹʹ అంటూ ఇంకొకాయన ఆయనను సమర్థించాడు.

ʹʹనల్లడబ్బును వెలికితీయడం ఇది పద్ధతి కాదు.ʹʹ అని ఒకరు.

ʹʹఈ రెండు రోజులు బ్యాంకులు లేవాయె. ఏ.టి.ఎం.లు లేవాయె. పాతనోట్లు చెల్లవాయె. ఎలా మరి?ʹʹ అని మరొకరు రద్దుకు వ్యతిరేకంగా స్పందించారు.

ʹʹకూళ్ళకు పిలిచేటోళ్ళు కూడా పిలుస్తలేరు. మా సంగతేంది?ʹʹ ఒక కూలి మనిషి ప్రశ్నించాడు.

ʹʹనోట్ల రద్దుతో డబ్బున్నవానికి ఏం బాధలేదు. వాని ఏర్పాట్లు వానికుంటాయి. బాధలన్నీ మనలాంటి మామూలోల్లకేʹʹ అంటూ ఓ ముసలి ప్యాసింజరు బాధను వ్యక్తం చేశాడు.

ఇలా ఎవరికి తోచింది వారు అంటున్నారు. ఎదుటివారు వింటున్నారా? లేదా? అని గమనించడం లేదు. అక్కడంతా బాధామయ ప్రపంచమే. చందుకు వాళ్ళ మాటలన్నీ నిజాలనిపిస్తున్నాయి.

ఇంతలో ఒకాయన ఉన్నట్టుంది,

ʹʹనోట్ల రద్దు లీకయింది. అనుమానం లేదు. లేకుంటే కొన్ని టెలికాం కంపెనీలు కోట్ల నష్టంతో ఫ్రీ ఆఫర్లు ప్రకటిస్తాయా? కస్టమర్ల మీద ఇంతకాలం లేని ప్రేమ ఈమధ్యే మొదలయిందా? ప్రేమ లేదు, పాడు లేదు. నల్లడబ్బును తెలుపు చేసుకోవడానికేʹʹ అన్నాడు.

ఈ మాటలు వింటున్న అక్కడున్న మరొకాయన,

ʹʹఔను. నా ఫోన్లో నేను ఫ్రీ సిమ్ వేసుకున్నానుʹʹ అన్నాడు.

ʹʹనాది కూడా ఫ్రీ సిమ్మేʹʹ అన్నాడింకొకాయన.

చందుకు కూడా వారి మాటలు నిజాలే అనిపిస్తున్నాయి. తన స్నేహితులు కొందరు ఫ్రీ సిమ్ వేయించుకుంటుంటే తనూ వేయించుకోవాలనుకున్నాడు. కాని కుదరలేదు. అది మామూలు ఫోన్లో పనిచేయదట. 4జి ఫోన్లోనే పనిచేస్తుందట. తనది మామూలు ఫోనే. అందుకే ఊరుకున్నాడు చందు.

ఇంతకాలం చందు తను, తన పని తప్ప ఇతరాల మీద దృష్టి పెట్టలేదు. నిన్న నోట్ల రద్దు దెబ్బ తాకినప్పటి నుండి వార్తల మీద, వాస్తవాల మీద దృష్టి పెడుతున్నాడు. ఒక్క రోజులోనే చాలా విషయాలు తెలిసినట్టనిపిసున్నాయతనికి.

అంతలోనే డ్రైవరు, ఇతరులు కలిసి టైరు మార్చారు.

ʹʹథ్యాంక్స్ తమ్ముడూ!ʹʹ అన్నాడు డ్రైవరు, తనకు సహాయం చేసిన ఇద్దరు ముగ్గురికి షేక్ హ్యాండిస్తూ.

ʹʹఅయ్యో! దాందేముందన్నా? తెలిసిన పనేగదా?ʹʹ అన్నారు వారు.

ʹʹఎక్కండి, ఎక్కండి. గంట లేటయిందిʹʹ అంటూ డ్రైవరు తన సీట్లో కూర్చున్నాడు.

అందరూ ఎక్కారు. బస్సు బయలుదేరింది.

4

జగద్గిరిగుట్టలో చందు బస్సు దిగేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. హైదరాబాద్ సిటీలో బస్సు ప్రవేశించగానే విపరీతమైన ట్రాఫిక్ మొదలయింది. దానికి తోడు అడుగడుగునా సిగ్నల్సే. దాంతో బస్సు నత్తనడక నడిచింది. ఇదంతా తెలుసు చందుకు. అందుకే ఖాజీపేటలో ʹపుష్పుల్ʹ రైలెక్కుదామనుకున్నాడు. కాని సాయమ్మ వద్దంది.

ʹʹఇక్కడ ఆటో ఎక్కుడు, దిగుడు. రైలు ఎక్కుడు, దిగుడు. మల్ల అక్కడ రెండు లోకల్ బస్సులు ఎక్కుడు, దిగుడు... వద్దు బిడ్డా! ఎక్కేతప్పుడు, దిగేతప్పుడు దొంగలుంటారు. మనం ఎక్కుడు, దిగుడు తొందర్ల ఉంటాము. వాళ్ళు వాళ్ళ పనిల ఉంటారు. వద్దు కొడుకా! పైసలు పట్టుకొని ఆ పని చేయకు. బస్సుకే పో. ఇక్కడెక్కుతె అక్కడ దిగుతవ్. ఓ గంట లేటయితె అయిందిగని బద్రంగ పోవాలె. అక్కడ పైసలు ముట్టాలెʹʹ అంది సాయమ్మ కొడుకుతో.

ʹఔనుʹ అనిపించింది చందుకు.

ʹఅమ్మ అంత జాగ్రత్త మనిషి కాబట్టే నాన్న పోయినా కుటుంబాన్ని పోషిస్తూ, ఆస్తి కొని కాపాడగలిగింది. లేకుంటే రాళ్ళు కొట్టి 18 లక్షల ఆస్తిని సంపాదించడమంటే మాటలా?ʹ అనుకున్నాడు.

చందు బంధువులు చాలామంది తినుడు, తాగుడుకే సరిపోతారు. పెండ్లాం పిల్లల్ని పట్టించుకోరు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు. వాళ్ళు కడుపునిండా తింటారు గాని భార్యాబిడ్డల ఆకలిని చూడరు. రాత్రయిందంటే చాలు, దాదాపు అన్ని ఇండ్లలోనూ గొడవలే. మగవాళ్ళు తాగి రావడం, భార్యాపిల్లల్ని తిట్టడం, కొట్టడం వాళ్ళ ఇండ్లల్లో నిత్యకృత్యంగా ఉంటుంది. అందుకే చందుకు తాగుడంటేనే అసహ్యం. తాగినవాడు విచక్షణ కోల్పోతాడని, మంచీచెడు ఆలోచించడని చందు అభిప్రాయం.

హన్మకొండలో యూనివర్సిటీ నుండి ములుగురోడ్డుకు పోయే దారిలో ఉన్న పెద్దమ్మగడ్డలో ఉంటాడు చందు. చందు బంధువులు ఇరవైమందికి పైగా ఉంటారక్కడ. మొదట్లో అక్కడంతా మురుగునీరే ఉండేది. చిన్నతనంలో ఆ మురుగు నీళ్ళలో ఆడకునేవాడు చందు. సాయమ్మ ఎంత వద్దన్నా వినేవాడు కాదు. చందుకు అది లీలగా గుర్తుంది.

చందు నాన్న బాలరాజు. సాయమ్మకు తగిన భర్త. అన్ని ఇళ్ళల్లోను గొడవ జరిగినా సాయమ్మ ఇంట్లో మాత్రం గొడవ జరిగేది కాదు. బాలరాజుకు ఏ దురలవాటూ లేదు. తన పని, ఇల్లు తప్ప ఏ తగాదాలలోను తలదూర్చేవాడు కాదు. భార్యాపిల్లల్ని ప్రేమించేవాడు. రాళ్ళు కొట్టే జాతిలో అలాంటి వాళ్ళుండడం చాలా అరుదంటారు.

పెద్దమ్మగడ్డ కాస్త వంపుగా ఉండే ప్రాంతం. అందుకే అక్కడ వివిధ కాలనీలలోని మురుగునీరు వచ్చి నిలిచేది. అప్పటికవన్నీ ప్లాట్లే. రాళ్ళు పాతి ఉండేవి. అన్ని ఖాళీ ప్లాట్లే కాబట్టి బాలరాజు దంపతులతో పాటు ఇంకా కొందరు అతని చుట్టాలు, ఇతరులు అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడినుండే పనికి పోయేవారు.

బాలరాజు రాళ్ళు పగులగొట్టడంలో సిద్ధహస్తుడు. ఏ సైజు రాయినైనా అవలీలగా తీసేవాడు. పొడవైన ʹకనీలʹను కూడా సులభంగా తీసేవాడు. ముందుగా రాతిగుట్టకు రంధ్రాలు చేసి, అందులో మందు నింపి, బత్తీకి నిప్పంటించేవాడు. అంతే, కాసేపట్లో పెద్ద శబ్దంతో అనుకున్న సైజులో రాళ్ళు పగిలేవి. చేసిన పనిని బట్టి అతనికి డబ్బు లభించేది.

సమ్మక్క మొదలైన ఆడవాళ్ళు కూడా కంకర కొట్టేవాళ్ళు. చిన్నవి, పెద్దవి సైజుల ప్రకారంగా కుప్పలు, కుప్పలుగా కంకర తయారుచేసేవారు. వారికి కూడా పనిని బట్టి డబ్బు లభించేది.

పెద్దమ్మగడ్డలో బాలరాజు మరియు ఇతరులు వేసుకున్న గుడిసెల అడుగు భాగాలు అన్నీ ప్రైవేటు వ్యక్తులవే. అప్పుడప్పుడు వారు వచ్చి ఆ గుడిసెలను తీయించేవారు. అలాంటప్పుడు ఆ గుడిసెలను అక్కడే ఉన్న వేరే ప్లాట్లల్లో వేసుకునేవారు.

వాళ్ళ స్థావరం అతి సాధారణంగా ఉండేది. నాలుగు దిక్కుల నాలుగు కర్రలు పాతి పక్కలకు మరియు పైన ప్లాస్టిక్ కాగితాలు కప్పుకునేవారు. అందులోనే సంసారాలు సాగించేవారు. అలా కొన్ని సంవత్సరాలు సాయమ్మ కాపురం చేసింది అక్కడే.

పక్కా ఇల్లు లేకపోయినా సాయమ్మ జీవితం చాలా కాలం సజావుగానే సాగింది. చందు, లత అక్కడే పుట్టారు.

చందు పుట్టిన రోజున బాలరాజు సంతోషం ఇంతింత గాదు. తనకు వారసుడు పుట్టాడని, తన తండ్రి చంద్రయ్యే తనకు కొడుకుగా పుట్టాడని మురిసిపోయాడు. అందుకే కొడుక్కు ʹచందుʹ అని పేరు పెట్టుకున్నాడు. చందు తనలా కాకుండా మరోలా బతకాలని అనుకునేవాడు. ఆ మాట సాయమ్మతో కూడా చెప్పేవాడు.

చందుకు మూడు సంవత్సరాలు పడ్డప్పుడు లత కడుపులో పడింది. చందుకు మూడు సంవత్సరాలు నిండడం, లత పుట్టడం దాదాపు రెండూ ఒకేసారి జరిగారుు. లతను బాలరాజు తన ఇంటి మహాలక్ష్మిగా తలచేవాడు. ఇద్దర్నీ ఎత్తుకొని తిరిగేవాడు. ఒకరిని భుజాలమీద, ఒకరిని చంకలో మోస్తూ ఎక్కడికైనా వెళ్ళేవాడు.

సాయమ్మ తన సంసారాన్ని చూచి తనకు తనే మురిసిపోయేది. ʹచల్లని భర్త, చక్కని పిల్లలు. ఇంతకన్నా ఏం కావాలి?ʹ అని సంతోషపడేది. కాని ఆమె సంతోషం ఎంతో కాలం నిలువలేదు.

ఓ రోజు బాలరాజు రాళ్ళు తీయడానికి పోయాడు. సాయమ్మ అక్కడే కొంచెం దూరంగా కంకర కొడుతోంది. పిల్లలిద్దరు అక్కడే ఆడుకుంటున్నారు.ఓ పొడవాటి ʹకనిʹ తీయడానికి బాలరాజు ఐదారు బత్తీలు పెట్టాడు. తర్వాత ముట్టించాడు. అవి ఎంతకూ పేలకపోవడంతో సరిగ్గా అంటుకున్నాయో, లేదో చూద్దామని దగ్గరగా పోయాడు బాలరాజు. బాలరాజు సమీపించడం, అవి పేలడం రెండూ ఒకేసారి జరిగారుు. అంతే. రాళ్ళతో పాటు బాలరాజు శరీరం కూడా ముక్కలైపోరుుంది. బాలరాజు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం, సాయమ్మ కలలు కల్లలైపోవడం ఒక్క క్షణంలోనే జరిగిపోయారుు.బాలరాజు చనిపోయే నాటికి చందుకు ఐదు సంవత్సరాలు. తండ్రి రూపం లీలగా గుర్తుందతనికి.

ప్రతి సంవత్సరం బాలరాజు చనిపోరుున రోజును సాయమ్మ పూర్తి మౌనం పాటించేది. చందు, లతలు కూడా అమ్మ పక్కనే మౌనంగా కూర్చునేవారు. ఆరోజు వాళ్ళింట్లో మౌనం తాండవించేది.

మగదిక్కులేని సంసారం, చిన్నపిల్లలు... ఎలా వెళ్ళదీయాలో సాయమ్మకు అర్థం కాకపోయేది. ఐనా ధైర్యం వీడలేదు. రాళ్ళుకొట్టే పనిని మానలేదు.

సంసారం నడవడం ఒక ఎత్తు కాగా, మాటిమాటికి పాకలు మార్చడం సాయమ్మకు ఇబ్బందిగా ఉండేది.

ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మగడ్డలోనే ఒక 150 గజాల ప్లాటు అమ్మకానికి వచ్చింది. అప్పటికి పెద్దమ్మగడ్డలో అక్కడొకటి, ఇక్కడొకటి ఇండ్లు పడ్డారుు. దాంతో ఆ ప్రాంతంలో ప్లాట్ల ధరలు కొద్దిగా పెరిగారుు. తన దగ్గరున్న కొంత డబ్బు మరియు కొంత అప్పు తీసుకొని సాయమ్మ ఆ ప్లాటు కొన్నది. ఆమె కొనేనాటికి అందులో రెండు చిన్న రూములున్నారుు. చిన్నపిల్లలున్నారు, ఈ అవకాశం పోనివ్వకూడదనుకుంది సాయమ్మ. అందుకే ధైర్యం చేసి ఆ ప్లాటు కొని అందులోకి మారింది.

సాయమ్మ స్థిరపడ్డాకనే ఆమె కులం వాళ్ళు, చుట్టాలు మెల్లిమెల్లిగా ఒక్కొక్కరే అక్కడికి చేరుకున్నారు. తర్వాత పోరాటాలు, విజ్ఞప్తులతో అక్కడ మట్టిరోడ్లు పడ్డారుు. మునిసిపల్ నల్లాలు వెలిశారుు. ఇండ్లు కూడా క్రమేణా పెరిగారుు. దాంతో ఆ ప్రాంతంలో ధరలు కూడా పెరిగారుు. సాయమ్మ గుడిసె వేసుకున్న రోజుకు, ఇప్పటి రోజుకు గుర్తుపట్టలేనంతగా మారిపోరుుందా ప్రాంతం. ఒకనాడు అలా ఉండేదని చెప్పినా ఎవరూ నమ్మరు. అందుకే లక్ష రూపాయలకు కొన్న సాయమ్మ ఇల్లు, ప్లాటు ఇప్పుడు 18 లక్షలకు అమ్ముడుపోరుుంది.

జగద్గిరిగుట్టలో బస్సు దిగి నడుస్తుంటే ఇదంతా గుర్తుకువచ్చింది చందుకు. అమ్మ పడ్డ కష్టాలు జ్ఞాపకమొస్తేనే చందు తల్లడిల్లిపోతాడు. అమ్మ మనసులో మెదిలితేనే చందు హృదయం ఆర్ధ్రమైపోతుంది. ఒక మహోన్నతమైన మనిషి కళ్ళముందు కనిపిస్తుంది.

(ఇంకా ఉంది)

No. of visitors : 710
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •