దోపిడి వర్గాల పునరుత్థానాన్ని ఏవగించుకొనే కథ, ʹతనవి కాని కన్నీళ్లుʹ

| సాహిత్యం | వ్యాసాలు

దోపిడి వర్గాల పునరుత్థానాన్ని ఏవగించుకొనే కథ, ʹతనవి కాని కన్నీళ్లుʹ

- బాసిత్ | 19.10.2017 09:42:40pm


సెప్టెంబర్ 2017, ప్రజాసాహితిలో అమల్ సింగ్ కథ ʹ తనవి కాని కన్నీళ్లుʹ అచ్చయ్యింది. ఈ కథ ఉత్తర, మధ్య భారత భూస్వామ్య వర్గాలలో అనూచానంగా వచ్చే ఒక సంప్రదాయాన్ని వ్యతిరేకించే కథ. రచయిత, అమల్ సింగ్ ఇంగ్లీషులో రాసిన కథను తెలుగులోకి కొల్లూరి సోమ శంకర్ అనువదించారు.

కథ స్థూలంగా.. జమీందారీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే రోదించడానికి కొందరు స్త్రీలను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. ఇట్లా రోదించడం కోసం తమను తాము కెటాయించుకునే స్త్రీలను ʹరుడాలీʹ లంటారు. రామ్ సింగ్ చౌదరి వృద్ధాప్యంతోనో ఎందువల్లనో చనిపోతాడు. ఆనవాయితీ ననుసరించి పది మంది దాకా రుడాలీలు హవేలీకి వస్తారు. ఏడ్వడం చేతకాని జమీందారీ స్త్రీలొక వైపు మూలన ఉంటారు. రుడాలీలు మాత్రం శవం చుట్టు చేరి అదో మాదిరిగా చేతులు తిప్పుతూ గట్టిగా రోదిస్తారు.

బృంద రోదనలకు భిన్నంగా ప్రత్యేకమైన కంఠస్వరంతో లయాత్మకంగా శశి అనే రుడాలి విలపిస్తుంది. శవాన్ని చూస్తున్నప్పుడల్లా ఆమె అంతరంగంలో ఏదో కుదుపుతో ఆత్మీయున్ని కోల్పోయిన విషాద జీర తొంగి చూస్తుంది. తోటి రుడాలీ అంబ, శశిని అలాంటి ప్రత్యేకత చూపనక్కర లేదన్నట్లు హెచ్చరిస్తూ ఆమెను ఆజమాయిషీ చేస్తుంది.కానీ, శశి తన్ను తాను అదుపు చేసుకోలేని స్థితిలో మాత్రమే, అంతటి అభినివేశాన్ని రోదనలో వ్యక్తీకరిస్తుంది.శశి ఆ క్షణంలో ఎందుకంతగా ఊగిపోతుందో అర్థం కాదు.

రుడాలీలకు రోదనలో శిక్షణ ఇచ్చిన మాతాజీ సైతం తన తొలి పాఠంలోనే చనిపోయిన వారి పట్ల అభిమానాలు ఏర్పరచుకోవడాలు గట్రా పెట్టుకోరాదని వృత్తి రుడాలీలందరికీ చెప్తుంది. అదే విషయాన్ని అంబ, శశికి గుర్తు చేస్తుంది. "ఇక మీదట జాగ్రత్తగా ఉంటానని" శశి అంటుంది.

రోదన కార్యక్రమం అనంతరం వాళ్లంతా మాతాజీ సమక్షంలో దాన్నంతా సమీక్షించుకుంటారు.మాతాజీ శశిని, " నువ్వు బాగానే నేర్చుకుంటున్నావు" అంటూ అభినందిస్తుంది. మాతాజీ రుడాలీలకు సూచనలు ఇస్తున్న క్రమంలోనే వీళ్లు చనిపోయాడని రోదించిన జమీందారు రామ్ సింగ్ చౌదరి శవం ప్రాణం పోసుకొని చితి మీది నుంచి లేచిందనే వార్త ఊరంతా పాకింది. ఇది మామూలు విషయం కాదు. "ఒక్కోసారి ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని" మాతాజీ వాళ్లకు చెప్తుంది.

ఈలోగా మోహన్ లాల్ అనే అతడి తండ్రి చనిపోయాడని సమాచారం రావడంతో మళ్లీ ʹరేపు అక్కడికి వెళ్లాలనుకొంటూʹ ఎవరి గుడిసెలోకి వారు వెళ్లిపోతారు.

తెల్లవారుఝామున మోహన్ లాల్ తండ్రి శవం వద్ద రోదించడానికి వెళ్తారు. శవం పక్కన తల దగ్గర కూర్చుని తలను అటూ ఇటూ ఊపుతూ శశి రోదిస్తుంది. నిన్నటి వలె అదుపు కోల్పోకూడదని నిశ్చయించుకొంటుంది. ముసలాయన బంధువుల కళ్లలో ఒక్కచుక్క నీరు ఉండదు. పెద్ద కొడుకు మోహన్ లాల్ మీసాలు మెలేసుకుంటూ కూర్చున్నాడు. అతడిలో దుఃఖఛాయలు లేవు, సరికదా అసహనం ఉంది.

శశి నిర్ణయమైన పద్దతిలో శరీరాన్ని కదుపుతూ బాగానే ఏడుస్తుంది. మిగతా రుడాలీలు ఏడుపుకు, గుండెలు బాదుకోవడానికి సమన్వయం కుదరక యాంత్రికంగా ఏడుస్తున్నారు.

మోహన్ లాల్ కు తండ్రి చావు చాలా అనుకూలమైంది. కానీ, అనూహ్యంగా లేచి కూర్చున్నాడు. కుటుంబ పెద్ద పునర్జీవితుడవడం మిగతా కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించినా, మోహన్ లాల్ కు అసహనం కలిగించింది.

ముసలాయన ఆకలి బాధలో నడవలేని స్థితిలో చేతులను ముందరి కాళ్ల వలె ఉపయోగించి నడుస్తాడు.
రామ్ సింగ్ చౌదరి మాత్రం ఉత్సాహంగా తయారయ్యాడు. వీళ్లిద్దరు చచ్చి మళ్లీ బతకడం ఊళ్లో పెద్ద సంచలనమై పోయింది.

మోహన్ లాల్ కు తండ్రి పునర్జీవితుడవడం ఇష్టం ఉండకపోవడంతో రుడాలీలకు చెల్లించిన కూలీ డబ్బులు వెనక్కి ఇవ్వమంటున్నాడని అంబ, శశితో చెప్తుంది. చచ్చిపోయిన మనిషి బతికినందుకు సంతోషించాలి, కాని, మోహన్ లాల్ అందుకు భిన్నంగా కోపగించుకోవడం వాళ్లకు విస్మయం కల్గిస్తుంది.

అంతలోనే, లోకరీతిలోని మూర్ఖత్వాన్ని, మూఢవిశ్వాసాలను ముచ్చటించుకుంటారు. వాళ్ల ఉనికిని దుశ్శకునంగా భావించుకుంటారనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటారు.

చచ్చినవాళ్లు బతికినందుకు రుడాలీలకు గిరాకీ తగ్గిపోయింది.శశిలాంటి వాళ్లలో ఏదో మంత్ర శక్తి ఉందని నమ్మేవాళ్లు తయారయ్యారు.

శశికి రాత్రిళ్లు నిద్రపట్టక దొర్లుతుంది. చలికి కప్పుకోవడానికి దుప్పటి సరిపోక వణుకుతూ ఉంటుంది.

ఆ చీకటి లో పాకుతూ వదులైపోయిన శరీరంతో మోహన్ లాల్ తండ్రి ఏదో సాయం ఆశించి శశిని కలవడానికి వస్తాడు.
శశిని మంచినీళ్లు అడిగి తీసుకుంటాడు.

తనకీ ప్రపంచం ఇష్టం లేకపోయినా, తనను ఈ లోకంలోకి తెచ్చి నందుకు శశికి రుణ పడిఉంటానంటాడు.శశి అతనితో కఠినంగా మాట్లాడి వెళ్లగొడుతుంది. అతను బతికి రావడం అంతగా ఆసక్తి కలిగించే విషయం కాదామెకు.

శశికి తల్లి గుర్తుకు వస్తుంది.తల్లి భిల్వారాలో ఇక్కడికి చాలా దూరంలో ఉంటుంది.అంత దూరం ఎట్లాగు వెళ్లలేదు. కనీసం తల్లి దగ్గరి నుండి ఉత్తరమైనా వస్తుందేమోననే ఆశతో పోస్టాఫీస్ కు వెళ్తుంది, శశి. చీదరింపుల నడుమ పోస్ట్ మాస్టర్ ఓ ఉత్తరాన్ని వెతికి, ఆమె చేతిలో పెడతాడు. మాతాజీ దగ్గర నేర్చుకున్న కొద్దిపాటి చదువు వల్ల ఆమె ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ ఆ ఉత్తరాన్ని చదువుకోవడం పూర్తి చేస్తుంది. ఆమెకు కాళ్ల కింది నేల కదిలిపోయినట్లనిపించింది. వారం రోజుల కిందనే వాళ్లమ్మ చనిపోయింది. తల్లి కోసం గట్టిగా ఏడ్వాలనుకొంది. కంట్లో ఒక్క నీటి చుక్క లేనంతగా ఆమె నిర్లిప్తంగా మారిపోయింది.ఎందుకంటే, ఆమె కోసం ఏడ్చినా ప్రయోజనం లేదు. ఇప్పటికే కాలి బూడిద అయ్యుంటుంది. ఏ కోశానా ఆమె బతికి వచ్చే అవకాశం లేదు. అద్భుతం జరగడానికి ఆస్కారమే లేదు. ఇతరుల కోసం కార్చిన కన్నీళ్లు తన తల్లి కోసం కార్చలేకపోయింది. ఆమె ఇతరుల కోసం కార్చిన కన్నీరు, నిజానికి తనవి కావు. ఆ కన్నీరు రుడాలివి. గుండెలు బాదుకుంటూ రుడాలీలు ఇతరుల కోసం ఏడుస్తారు. అలాంటి సందర్భాలలో శశి, గుండెలవిసి పోయేలా ఏడుస్తుంది. పేదలకు ఎట్లాగు అట్లాంటి ఏర్పాటు ఉండే అవకాశం లేదు. కాని స్వంత తల్లి కోసం ఏడ్వలేకపోవడం, విషాదాల్లోకెల్లా, గొప్ప విషాదం.

తల్లి కోసం కనీసం చుక్క నీరైనా కార్చని వ్యధతో శశి గుండె బరువెక్కింది. భిల్వారాకి వెళ్లిపోవాలన్న కోరిక మనసులో బలంగా నాటుకుంది. ప్రయాణానికి డబ్బు జమ చేసుకోవడానికి తిండి మానేసింది. ఇక రుడాలీగా ఉండకూడదనుకుంది.ఇంకేదైనా పని చూసుకోవాలనుకుంటుంది. నిద్ర పట్టక శశి అటూ ఇటూ దొర్లుతూ ఉంటుంది. గుమ్మం ముందు రామ్ సింగ్ చౌదరి తచ్చాడుతూ కన్పిస్తాడు. తను, ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికే వచ్చానని చెప్తాడు. తన కొత్త జీవితం శశి వల్లనే కనుక, తనకేదైనా పని తన హవేలీలోనే ఇప్పిస్తానని చెప్తాడు. శశి ఇవన్నీ వినిపించుకోదు. తాను మళ్లీ బతుకకపోయి ఉంటే తాను తన తల్లిని చూసుకోగలగే దాన్నని కఠినంగా చెప్తుంది. కృతజ్ఞతా భావంతో అతను చేయాలనుకున్న సహాయాన్ని సైతం శశి తిరస్కరిస్తుంది.

పుట్టిన ఊరికి వెళ్లే ముందు జమీందారు రామ్ సింగ్ చౌదరి ని కలవాలనుకుంటుంది శశి. అతని హవేలీకి వెళ్లి, తనకు చేస్తానన్న సహాయాన్ని గుర్తు చేస్తుంది. దానికి బదులుగా ʹఈ రుడాలి దురాచారాన్ని ముగించాలనిʹ అతన్నుంచి మాట తీసుకుంటుంది. అతను ప్రయత్నిస్తానంటాడు.ఆ మాట విని అక్కణ్నుంచి వెనక్కి మళ్లుతుంది.

శశి, అమ్మ తాలూకు జ్ఞాపకాలతో, రోడ్డు మీద కూర్చొని రోదిస్తూ, తన గుండె బరువు దించుకొంటూనే భిల్వారా వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తుంది. భిల్వారా బస్సు కోసం ఎదురు చూడడం కొత్త జీవితం కోసం చూడడమే. కథ ఇక్కడ ముగుస్తుంది. ఇది ఆశావహ సూచిక.

కథ చదివాక, "శశి రుడాలిగా తన జీవితాన్ని ఎందుకు ముగించాలనుకొంటుంది?" అనే ప్రశ్న తప్పక ఉదయిస్తుంది.

దీనికి ఆర్థిక కారణాలతో పాటు పితృస్వామిక కుల వ్యవస్థే కారణమని అర్థం అవుతుంది.

ఉన్నత కులాలనబడే వారెవరూ తనలాంటి వృత్తిని ఎంచుకోలేదు. తను ఒళ్లమ్ముకున్నట్లుగా, కన్నీళ్లమ్ముకొనే స్థితికి దిగజారడానికి కారణం ధనిక భూస్వామ్యంతో పాటు వేళ్లూనుకున్న పితృస్వామిక కుల వ్యవస్థ అనేది శశికి జైవికంగానో, సోదాహరణంగానో అర్థం అవుతుంది. ఎందుకంటే, అందుకోసం ʹతనవి కాని కన్నీళ్లుʹ కార్చానని శశి పాత్ర కథలో చెప్పుకుంది. ఎంతగానంటే తన తల్లి కోసం కార్చడానికి ఒక్క చుక్క మిగిల్చుకోనంతగా తను, తన పాత్రలో జీవించింది. అందుకే, తల్లి కోసం ఒక చుక్క కార్చలేని స్థితి ఎవరికీ రాకూడదనుకుంది. ఈ విధానం పోవాలనుకుంది. అందుకోసం తాను చేయగలిగింది చేసింది. జమీందారు నుండి ఈ పద్ధతి నిలుపుదల చేసే మాట తీసుకుంటుంది. ఆ పని మొత్తం ఆమె చేతిలో లేకపోయినా, తనకు తోచింది చేయగలిగిన తృప్తి కలిగింది. గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖానికి కారణమైన దానిని తొలగించుకోవడానికి, తనకు తోచింది తాను చిత్తశుద్ధి తోనే చేసిందనే భావన పాఠకులకు కలుగుతుంది.

కథ చదువుతూ ఉంటే మహాశ్వేతాదేవి, రుడాలి కథ గుర్తుకు వస్తుంది. అత్తారింటి ఆరళ్లు తట్టుకోలేక, బతకడానికి ఇంకో మార్గం లేక కన్నీళ్లు అమ్ముకొనే రుడాలిగా మారిపోయిన కథ, అది.

కానీ అమల్ సింగ్ కథ, ʹతనవి కాని కన్నీళ్లుʹ మహాశ్వేతాదేవి కథకు కొనసాగింపు. కథా కాలం కూడా మహాశ్వేతాదేవి కథానంతర కాలమే నని చెప్పవచ్చు. బహుశా ఇప్పటికీ, ఆ ప్రాంతంలో ఈ సంప్రదాయం కొనసాగుతుండవచ్చు కూడా. లేదా ఇలాంటి కథల వల్ల అక్కడి పరిస్థితిలో మార్పేమైనా వచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ కథ మార్పు ఆశించిన కథ. కథలో ప్రస్తావించిన ʹబిల్వారాʹ రాజస్థాన్ లోని ఒకానొక ప్రాంతం.

ఈ కథ, తనకు కాని వారికోసం కన్నీళ్లమ్ముకొనే జీవితంలోని బూటకత్వాన్ని ప్రశ్నిస్తుంది. కనుక ఇది ఒక ఆశావహమైన కథ. వృత్తి రుడాలి పాత్రలో అందరి కంటె ఎక్కువ మమేకమై జీవించి, మన్ననలు పొందిన పాత్ర , శశి ఈ ప్రశ్నలు వేస్తుంది.తన తల్లి చనిపోయినప్పుడు రోదించడానికి ఎవరూ లేకపోవడంలోని దుర్భర స్థితిని కథలోని పాత్ర సవ్యంగానే ఎత్తి చూపుతుంది. తమలాంటి వాళ్లకు అలాంటి ఏర్పాటు లేకపోవడం ఒక్కటే కాదు, చాలా లేమిని, కనీసం స్వంత ఊరుకు వెళ్లాలన్నా కడుపు మాడ్చుకోగా మిగిలిన బొటా బొటి డబ్బుతో వెళ్లాల్సిన స్థితి ఏమిటనే ప్రశ్నలను సైతం కథ సంధిస్తుంది.

అంటే ఈ కథ వర్గ దోపిడితో పాటు అట్టడుగు వర్గాలకు, కులాలకు ఎదురవుతున్న సాంఘిక దురన్యాయాన్ని, వివక్షను ఎత్తిచూపుతుంది. ఈ కథలో, కవితాన్యాయం ఎక్కడుందంటే, ధనిక భూస్వాములు చచ్చి, పునరుజ్జీవనం చెంది మళ్లీ ప్రజలను దోచుకుంటూ ప్రజల మధ్య హుషారుగా తిరగడానికి రుడాలిగా తాను దోహదం కావడం పట్ల ఏవగింపులో ఉంది. అసలు కథలోని న్యాయబుద్ధి అక్కడ కేంద్రీకృతమైంది. ఆ ఏవగింపు మనుసులో ఉంచుకొనే, ఆ ఎరుకతోనే, తన పట్ల కృతజ్ఞత ఉందంటున్న జమీందారును, రుడాలి దురాచారాన్ని ఆపి వేయగలిగే సహకారాన్ని ఆమె అడుగుతుంది. ఒక జమీందారుగా అతనికి అది కష్ట సాధ్యంʹ అయినా, ʹప్రయత్నిస్తాననిʹ మాట ఇస్తాడు.
భూస్వామి అందించే ఏ వ్యక్తగత సహాయానికి శశి పాత్ర తలొగ్గక పోవడం కథలోని మరో ఔన్నత్య శిఖరం. ఈ ఔన్నత్యం వల్ల సంతరించుకొన్న వ్యక్తిత్వం వల్లనే ఆమె ʹరుడాలి దురాచారాన్నిʹ రూపుమాపడంలో తన వంతు సహాయ సహాకారాలను అందించాలని జమీందారుని కోరుతుంది. కాని వర్గ దోపిడీకి ప్రతీకైన ధనిక భూస్వామి పునరుత్తానాన్ని ప్రతీకాత్మకంగా కోరుకునే రుడాలి తరహా విధానం అంతరించిపోవాలని కోరుకొంది.
అదే ఈ కథలోని సుగుణం.

No. of visitors : 488
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప్ర‌జ‌ల‌ను ముంచి ప్రాజెక్టులా : బాసిత్

| 24.07.2016 09:12:28pm

మ‌ల్ల‌న్న సాగ‌ర్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టించిన విర‌సం బృందం ప‌రిశీలించిన విష‌యాలు నివేదిక రూపంలో విర‌సం స‌భ్యుడు బాసిత్ వివ‌రించారు.......
...ఇంకా చదవండి

హెచ్‌సీయూపై వైమానిక దాడుల‌కు వీసీ విజ్ఞ‌ప్తి

శోవన్ చౌధురి | 15.05.2016 01:15:10pm

"జేఎన్‌యూ వారు కేవలం ఇద్దరు ముగ్గురు విద్యార్థులను మాత్రమే అరెస్టు చేయగా, మేం 30 మంది దాకా విద్యార్థులను జైల్లో పెట్టేసాం. అదృష్టవశాత్తు మేం వైమానిక బలగా...
...ఇంకా చదవండి

కార్పొరేట్ బింకాన్ని గెలిచిన ʹపల్లెకు పోదాంʹ కథ

బాసిత్ | 04.09.2017 09:10:50am

మొత్తం వ్యవస్థ మార్పు దిశలో కృషికి ఇంకొంచెం పెద్ద ప్రయాస అవసరం ఉంటుంది. అప్పుడు వ్యక్తులంతా సమిష్టి పోరాటంలో భాగం కావాల్సి ఉంటుంది....
...ఇంకా చదవండి

వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?

బాసిత్ | 15.06.2018 11:58:23pm

అధికారులు,రాజకీయ నాయకత్వంలో కించిత్ కదలిక లేక పోవడంతో 13 తేదీన దీక్షా శిబిరం నుండి కోలుకొండ దళితులంతా 2 కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లి 197 సర్వే నంబరుతో ఉన్న.....
...ఇంకా చదవండి

మే డే స్ఫూర్తి అజరామరం!

బాసిత్ | 02.05.2018 10:18:41am

8 గంటలు పని, 8 గంటలు మానసికోల్లాసం, 8 గంటలు విశ్రాంతి అనే ప్రామాణిక పని దినం కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం ఇప్పటికే శ్రామిక వర్గ పోరాటాలను ప్రే......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •