ఫ్యాన్స్ బాబూ.. ఫ్యాన్స్!

| సాహిత్యం | వ్యాసాలు

ఫ్యాన్స్ బాబూ.. ఫ్యాన్స్!

- బమ్మిడి జగదీశ్వరరావు | 19.10.2017 09:46:33pm

మైడియర్ ఫ్యాన్స్..


మనలోకొందరం పవన్ ఫ్యాన్స్ కావచ్చు! మరికొందరం మహేష్ ఫ్యాన్స్ కావచ్చు! ఇంకొందరు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు!కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు! అల్లూ అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు! నానీ ఫ్యాన్స్ కావచ్చు! ఎవరం యెవరి ఫ్యాన్స్ అయినా కావచ్చు! కాని మనం మనం ఫ్యాన్స్!మన ఫ్యాన్సంతా వొక్కటే!

అసలు మన ఫ్యాన్స్ రోల్ లేని హీరోల్ వున్నారా? హీరోలకు ʹకీʹరోలే మనం!మనం లేకుండా సినిమాలు ఆడుతాయా? మనం లేకుండా కలక్షన్లు కురుస్తాయా? మనం లేకుండా రికార్డులు బద్దలవుతాయా? మనం లేకుండా సినిమాలు చరిత్ర సృష్టిస్తాయా? ʹచరిత్ర సృష్టించాలన్నా మేమే!దాన్ని తిరగ రాయాలన్నా మేమే..ʹ అని హీరో బాలయ్యబాబు డైలాగు చెప్పినా, నిజానికి ఆమాట చెప్పాల్సింది ఫ్యాన్సుగా మనమే!అంతెందుకు.. యే సినిమానయినా సూపర్ డూపర్ హిట్టు చెయ్యాలన్నా చెయ్యించాలన్నా మనమే! మూడు రోజులు కూడా ఆడని సినిమాలనుమూడు వారాలు ఆడాలన్నా ఆడించాలన్నా మనమే! చూసిన సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలన్నా చూపించాలన్నా మనమే! కటౌట్లకు దండ వేసినా- దండం పెట్టినా మనమే! కుంకుమ దిద్దినా- అక్షింతలు చల్లినా మనమే! పూలుచల్లి పూజించినా- పాలుపోసి అభిషేకించినా మనమే! సినిమా రిలీజునుపేద్ద పండగలా చేసిందీ మనమే!

సినిమా ఆడియో ఫంక్షన్లకి మనమే! సినిమా ప్రీ రిలీజు ఫంక్షన్లకి మనమే! రిలీజుకి మనమే! రిలీజుకి ముందు బెనిఫిట్ షోలకి మనమే! ప్రతీ శుక్రవారం ఫస్ట్ డే ఫస్ట్ షోకి మనమే! అడ్వాన్సు బుకింగులకు మనమే! అపరాత్రి నుండి అర్ధరాత్రి నుండి తెల్లవార్లూ ధియేటర్ల ముందు పడిగాపులు పడేది మనమే! టిక్కెట్లు బ్లాకు చేసేది మనమే! బ్లాకులో టిక్కెట్లు కొనేది మనమే! సినిమా చూసి ʹపబ్లిక్ టాక్ʹ యిచ్చేది మనమే! పబ్లిసిటీ తెచ్చేది మనమే! టీవీలోళ్ళు మైకులు పట్టుకు మౌత్ దగ్గర పెడితే ʹహిట్టు.. సూపరు.. కత్తి.. కేక.. పక్కా హండ్రెడ్ డేస్.. బ్లాక్ బాస్టర్..బాక్సాపీస్ షేక్.. యిండస్ట్రీ షేక్.. యెర్త్ క్వేక్..ʹ అని పూనికతో పూనకముతో పిచ్చిగాప్రేమగా రెచ్చిపోయి రెట్టించిన వుత్సాహానికిపోయి గొంతుపట్టేసినాఅరిచి గీపెట్టేది జై కొట్టేది మనమే! ʹఇలాంటి సినిమా మా లైఫ్లో చూడలేదు..మరి రాదు.. మరో సినిమా లేదు..ʹ అని యే సినిమాకి ఆ సినిమాని అమాంతం యెత్తి యెగరేసేది మనమే!

మనమే సినిమా! సినిమాయే మనం! కోట్ల రూపాయల బిజినెస్సుకి హీరోలమే మనం! అసలు హీరోలు వున్నారంటే మనవల్ల! ఇవాళ సినిమా యిండస్ట్రీ వుందంటే రన్ అవుతోందంటే మనవల్ల! కోట్లకు కోట్లు గ్రాస్ వస్తోందంటే మనవల్ల! చెత్త చెత్త సినిమాలు సారీ.. కొత్త కొత్త సినిమాలు తియ్యగలుగుతున్నారంటే.. తీసిన సినిమాలే అటుతిప్పి యిటుతిప్పి మళ్ళీ మళ్ళీ తియ్యగలుగుతున్నారంటే.. అదికూడా మనమున్నామన్న భరోసా వల్ల! ఏది తీసినా మనం చూస్తామన్న ధైర్యం వల్ల! మనలో మనం పోటీ పడి కొట్టుకొని హిట్టు కొట్టేది యిచ్చేదీ యెందువల్ల? మనవల్ల! సినిమా హీరోల కుటుంబాల వారసత్వం కొనసాగుతూ వచ్చేది యెందువల్ల? మనవల్ల! సినిమా హీరోలు ముఖ్యమంత్రులూ మంత్రులూ యమ్పీలూ యమ్మెల్యేలూ నాయకులూ అయ్యేది యెందువల్ల? యెవరివల్ల? మనవల్ల! మనం లేకుండా వుండడం కల్ల!

అలాంటి హార్టుకోరు.. హార్డుకోరు ఫ్యాన్సుగా మనకి కొన్ని హక్కులు వుంటాయ్! ఉన్నాయ్! అవి అనాదిగా మనం వినియోగించుకుంటున్నాం! అసలు ఫ్యాన్స్ అంటే యెవరు? జీన్స్ ఆఫ్ హీరోస్! అంతేనా? ఫ్యాన్స్ ఆర్ రిప్రజెంటింగ్ ది సొసైటీ! రీ-ప్రెజెంటింగ్ ది సొసైటీ!

అలనాడు అన్నగారికి పట్టం కట్టాం! అక్కినేనిగారి వారసుల్నీ నిలబెట్టాం! సూపర్ స్టారు కృష్ణగారి కొడుకుని సూపర్ స్టార్ చేశాం! అదే కృష్ణగారి అమ్మాయి హీరోయినుగా వొస్తే వొద్దన్నాం! ʹఆడపిల్లని ఆపడంలేదు, ఫ్యాన్సు వొద్దని వొత్తిడి తేవడంతో మా అమ్మాయి సినిమాల్లోకి రావాలన్న ఆలోచనని విరమించుకుంది..ʹ అని కృష్ణగారే స్వయంగా ఆనాడు ప్రకటించడం కూడా మర్చిపోలేని మాకిచ్చిన గౌరవమే! ʹషోʹలో మంజుల ఘట్టమనేని హీరోయినుగా నటించినా హీరోగా నటించిన సూర్యాని యెక్కడా కౌగిలించుకోకపోవడం ముట్టుకోకపోవడం నాకు బాగా నచ్చిందన్నట్టుఅప్పట్లోమహేష్ బాబుగారు చెప్పడం స్త్రీలను గౌరవించడమే కాదు, మా మనోభావాలను గౌరవించడం కూడా! మా భావాలూ మా హీరోల భావాలూ కలగలసిపోవడం మనోభావాలకు బలం కూడా! మాకు పితృస్వామిక భావజాలం లేదని చెప్పడానికి చిరంజీవిగారి తమ్ముడు నాగబాబుగారి కూతురు నీహారిక కొణిదెలకూ యాంకరింగులు దాటిʹముద్దపప్పు ఆవకాయలుʹ దాటి ʹఒక మనసుʹతో సినిమా చేసుకోవడానికి అనుమతినిచ్చాం! హారతి పట్టాం! మంచులక్ష్మిగారినీ అభిమానించాం! ఆదరించాం!

అంతే కాదు, పూరీగారన్నట్టుʹబౌన్సర్లు అక్కర్లేని బాలయ్యబాబుʹతో తిట్టించుకున్నాం! కొట్టించుకున్నాం! వరల్డ్ మోస్ట్ డేంజరస్ అని తెలిసి కూడా సేల్ఫీలు దిగాం! మనల్ని గ్రహాంతర వాసులుగా హెల్మెట్లతో వాట్సాపుల్లో వెక్కిరించినా భరించాం! ʹకొడితే కొట్టించుకోవాలి.. కడుపు చేస్తే చేయించుకోవాలి.. కొట్టాలన్నా మేమే.. ముద్దుపెట్టాలన్నా మేమే..ʹ అని బాలయ్యబాబుగారు చెప్పింది హీరోయిన్ల గురించి కాదు, మా అభిమానుల్ని వుద్దేశించిందే! అందుకే ఆయన ఈటీవీ యింటర్వ్యూలో క్లారిటీ కూడా యిచ్చారు! బూటు లేసు జారింది కట్టమని అసిస్టెంటుని చెంపదెబ్బ కొట్టినా- వుప యెన్నికలప్పుడు దండవేయడానికి వొచ్చినవాడి దవడ పగులగొట్టినా- యింటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో చేయి చేసుకున్నా- అలా కొట్టేటప్పుడు చేయి తగలడంలో ఆ టచ్ ని అభిమానులు యెంతో ఎంజాయ్ చేస్తారని, అందుకే కొట్టించుకోవాలని చూస్తారని,మరెంతో హేపీ ఫీలవుతారని మన మనోభావాల్ని ఆయనే స్పష్టంగానే విప్పి చదివి చెప్పేశారు!

ఒకరి భావాల్ని వొకరు.. అంటే హీరోల భావాలని అభిమానులూ- అభిమానుల భావాలని హీరోలూ- చెప్పడం ఆదినుండీ అనాదినుండీ వొస్తున్నదే! అందులో భాగంగానే రేణూ దేశాయ్ యిష్యూని కూడా చూడాలి! అభిమానులకు పవన్ కళ్యాణ్ అన్నయ్య అయితే రేణూ దేశాయ్ వొదిన అయ్యింది, విడిపోయినా విడాకులు తీసుకున్నా కూడా! సో.. ఆమె మరొకర్ని పెళ్లి చేసుకుంటే మాకు వొదిన కాకుండా పోతుంది! ఒదిన అనే గౌరవానికి దూరమవుతుంది! ఆమాటే ఫ్యాన్సుగా చెప్పాం! తప్పేంటి? మా వొదిన మీద మాకు హక్కుండదా? అందుకే కదా.. ఆమె పెళ్ళి ఆలోచన చేస్తే భరించలేకపోయాం! చనువుకొద్దీ బెదిరించాం! హేట్ మెసేజెస్ చాలా పెట్టాం! ఏం?, అభిమానం బెదిరింపు రూపంలో వుండదా.. వుండకూడదా? నిందా స్తుతి మీరు వినలేదా? ఆ భగవంతుడిని నిందించడంలో ఆరాధించడం వున్నట్టే, మా నిందించడంలోనూ అభిమానించడం వుంది! ఆమె మా హీరోకి హీరోయిన్! లైఫ్ లో వైఫ్! కుటుంబసభ్యులుగా కలుగచేసుకోకుండా చూస్తూ వూరుకుంటామా? రోడ్డెక్కితే చూస్తూ వూరుకుంటామా? మీడియాకి యెక్కడం రోడ్డెక్కడం కాదా? అరే.. అన్నయ్య పెళ్ళి చేసుకోలేదా.. వొదిన చేసుకుంటే తప్పేంటి అంటారా? సమానత్వం అంటారా? ఆమెని మా వొదినగా తప్ప మేం మరోలా చూడలేం! పైగా మా రేపటి హీరో అకిరాకు యిది రాబోయే కాలంలో డేమేజ్ కాదా? చెయ్యదా? అందుకే రేణూ వొదిన అలా పెళ్ళి చేసుకోకుండా వుండిపోతే గౌరవం కోల్పోకుండా వుంటుంది! అంతే.. అంతకుమించి యేమీ లేదు! ఒదిన కూడా మన ఫ్యాన్సుని వుద్దేశించి అనలేదని జనరల్ గా అన్నానని చెప్పింది! దానికి మీరేమో ఫ్యాన్సుకు భయపడి చెప్పింది అని అంటారు! ఆర్గ్యుమెంట్లు చేస్తారు! అందుకే కత్తి మహేష్ లాంటి వాళ్ళని చర్చలకు పిలవొద్దన్నది! అలా పిలవొద్దు అంటే హుకుం అంటారు! ఫత్వా అంటారు! ఏదేదో మాట్లాడతారు! మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని అంటారు! అయినా ఆయనయినా యెన్నింటి మీద ట్వీట్లు చేస్తారు?! చేస్తే ట్వీట్లు తప్ప మరేం లేదని మళ్ళీ మీరే అంటారు! ఫ్యాన్స్ అలా మాట్లాడడం తప్పు అని మీరనొచ్చు.. కాని పవన్ కళ్యాణ్ గారు అనలేదు! ఫ్యాన్స్ అంటే ఆయనకు అంత గౌరవం! రేణూ వొదిన కూడా విడిపోయిన యేడేళ్ళలో యెప్పుడూ పెళ్ళి ఆలోచనే రాలేదని- అయితే వొంట్లో బాగోలేనప్పుడు.. పిల్లల్ని చూసుకోనేవాళ్ళు లేనప్పుడు.. లైఫ్ పార్టనర్ వుంటే బాగుండేదని అనుకున్నప్పుడు తాను అలా మాట్లాడానని అంత వివరణ యిచ్చాక- ఆవివరణని కూడా ఫ్యాన్స్ మీదకు నెట్టడం సరికాదు! ఎందుకంటే ఫ్యాన్సును చూసి రేణూ వొదిన భయపడుతున్నట్టు వివరణ యిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది! ఇందులో ఫ్యాన్సుగా మనం భయపెట్టింది యేమీ లేదు! మనం కోరుకున్నాము! రేణూ వొదిన అర్థం చేసుకున్నారు! ఫ్యాన్సుని వుద్దేశించి అనలేదని కూడా క్లియర్ చేశారు!

అయితే అత్యవసరంగా చెప్పాల్సిన విషయం యేంటంటే ప్రతొక్కడూ ఫ్యాన్సు మీద బురదచల్లి మాట్లాడడం ఫ్యాన్సుగా మనం సహించవొద్దు! ఫ్యాన్సుగా మనం వొక్కటిగా లేకపోతే యేకం కాకపోతే ఐక్యంగా వుండకపోతే డేమేజ్ అయిపోయి చాలా నష్టపోతాం! ఇప్పటికే మన ఫ్యాన్సుని ʹఆళ్ళు గొర్రెలతో సమానం..ʹ అనేశాడు సినిమాలు తీసే రాంగోపాలవర్మ! ఇంక మన ఫ్యాన్సుకి విలువేముంది? అంచేత ఫ్యాన్సుగా మనం అలర్ట్ గా వుండాలి! ʹఫ్యాన్స్ అండ్ ఫామిలీస్ʹ అని సినిమా డైలాగులు చెప్పడం కాదు, సినిమా రంగం మొత్తం మన వెనుకే వుందన్న విషయం అర్థమయ్యేలా వెన్నుదన్నుగా నిలవాలి! ʹఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటే మా మనోభావాలూ దెబ్బతింటాయిʹ అని మన హీరోలు ప్రకటించి మనకి మరింత బలం యివ్వాలని కోరుకుంటున్నాను!

సో.. ఫ్యాన్స్ చెపితే హీరోలు చెప్పినట్టేనని ప్రజలూ ప్రేక్షకులూ కూడా భావించాలని మరోసారి గుర్తు చేసుకుంటూ యిప్పటికి సెలవు తీసుకుంటున్నాను!

ఆల్ ఫ్యాన్స్ జిందాబాద్!

యిట్లు
వొక వీర ఫ్యాన్!






No. of visitors : 256
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథ

బమ్మిడి జగదీశ్వరరావు | 03.07.2016 10:39:36pm

మన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం........
...ఇంకా చదవండి

ʹనోట్ʹలో మట్టి!

బమ్మిడి జగదీశ్వరరావు | 20.12.2016 11:23:30pm

పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది. వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద...
...ఇంకా చదవండి

నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.10.2017 11:27:55pm

సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ ......
...ఇంకా చదవండి

100% డిజబులిటి నీడెడ్!

-బమ్మిడి జగదీశ్వరరావు | 06.11.2017 09:04:16am

అన్నిదారులూ మూసేస్తే? తలుపులన్నీ మూసేస్తే? పిల్లి తిరగబడుతుంది.. మనుషులు తిరగబడరా? బడతారు! అవే మిలిటెంటు ఉద్యమాలు అవుతాయి! సాయుధ పోరాటాలు అవుతాయి! చెయ్యవలసి...
...ఇంకా చదవండి

లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.09.2017 11:32:20pm

దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •