ఇక యాక్షన్‌ ప్లాన్‌ 2018

| సంపాద‌కీయం

ఇక యాక్షన్‌ ప్లాన్‌ 2018

- పాణి | 02.11.2017 10:07:56am


అక్టోబర్‌ 10న వైజాగ్‌లో అత్యున్నత స్థాయి పోలీసుల సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల డీజీపీలు, ఇన్‌టెలిజన్స్‌ అధికారులు, స్పెషల్‌ ఇంటెలిజన్స్‌ బ్యూరో అధికారులు వగైరా పాల్గన్నారు. వీళ్లంతా కలిసి ఈ నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమ నిర్మూలనకు పథకం రచించారు. దాని పేరు యాక్షన్‌ ప్లాన్‌ 2018. దీన్ని కొత్తగా తీసుకొచ్చారు. అంతంత మాత్రం వాళ్లకు ఈ పేర్ల వివరాలు గుర్తుండటం కూడా కష్టమే. మావోయిస్టు ఉద్యమ నిర్మూలనకు వరస పెట్టి అన్ని రకాల పథకాలు తీసుకొస్తున్నారు. పేర్లు ఏవైనా తీరు మాత్రం మనుషులను చంపడం. గ్రామాల మీదపడి అత్యాచారాలు చేయడం. తప్పుడు ప్రచారం చేయడం. ఉద్యమ ప్రాంతాల్లోని ప్రజలను సాంస్కృతికంగా, నైతికంగా దెబ్బతీసే ప్రలోభాలను, ఒత్తిళ్లను పెంచడం. తాము చేసిన అకృత్యాలను జనం నమ్ముతారా లేదా? అనే ఇంగితం లేకుండా మావోయిస్టుల మీద వేసేయడం.

ఇన్ని హేయమైన పనులు చేయడానికి ఏడాదికి, ఆర్నెల్లకు ఒక కొత్త పేరును ముందుకు తెస్తున్నారు. ఈ వ్యవహారాలను సభ్య సమాజం అనబడేది ఎంత పట్టించుకుంటున్నదోగాని పోలీసు అధికారుల్లో మావోయిస్టు నిర్మూలన అనే ఉన్మాదం మాత్రం పేట్రేగిపోతోంది. రాజ్యం పోలీసు అధికారులను హంతకులుగా, ఉన్మాదులుగా మార్చేసింది. వర్గ యుద్ధం తీవ్రమయ్యే తరుణంలో ఈ స్థితి అనివార్యమే. ఇందులో తట్టుకొని నిలబడలేని జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడటం కూడా చూస్తున్నాం. దండకారణ్యంలో మావోయిస్టు నిర్మూలన కార్యక్రమానికి వినియోగించిన జవాన్లు ఎందరో అట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దండకారణ్యం గురించి అన్నీ అబద్ధాలే చెప్పడం అలవాటు చేసుకున్న పోలీసు అధికారులు ఈ విషయంలో కూడా నిజాలు చెప్పడం లేదు. ఆ పని కూడా మావోయిస్టులే చెయ్యాల్సి వస్తోంది.

ఇన్ని రకాల మిషన్లు, పథకాలు, యుద్ధతంత్రాలు అన్నీ అమానుష హత్యాకాండ కోసమే. ఈ సంగతి నిస్సిగ్గుగా పోలీసు అధికారులు చెప్పుకుంటున్నారు. గత ఏడాది దాకా మిషన్‌ 2016 అని ఒక దాన్ని నడిపారు. దీని తాత్పర్యం ఏమంటే 2016లోగా మావోయిస్టు ఉద్యమాన్ని దేశంలో లేకుండా నిర్మూలిస్తాం అని. అంతక ముందు పెట్టుకున్న గడువుల్లాగే ఇదీ చెల్లిపోయింది. అంతక ముందు జగదల్‌పూర్‌లో అగ్ని అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో బస్తర్‌ ఐజీ కల్లూరి శివరాం ప్రసాద్‌తోపాటు బస్తర్‌లోని ఏడు జిల్లాల ఎస్పీలు ఉన్నారు. దీని పని పట్టణాల్లో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులను అణచివేయడం. అప్పటి నుంచి విప్లవ ప్రజా ఉద్యమాలపట్ల బాధ్యతాయుతంగా స్పందించే మేధావుల మీద దాడులు మొదలయ్యాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమావేశంలో ఆపరేషన్‌ సమాధాన్‌ అని ఒక దాన్ని తెచ్చారు. మరింత దూకుడుగా ముందుకుసాగి విప్లవోద్యమాన్ని దెబ్బతీయడం లక్ష్యంగా దీన్ని ముందుకు తెచ్చారు. కేవలం ఈ దూకుడు సైనిక రంగంలోనే కాదు. అన్ని రంగాల్లో విప్లవోద్యమాన్ని దెబ్బతీయడానికి దూకుడుగా సాగాలని ప్రభుత్వం పన్నిన వ్యూహమే ఈ సమాధాన్‌. ఇప్పుడు యాక్షన్‌ ప్లాన్‌ 2018.

ముందే అన్నట్లు ఈ హింసోన్మాద పథకాల వల్ల విప్లవోద్యమ ప్రాంతాల్లో తీవ్ర అణచివేత కొనసాగుతోంది. సాధారణ ప్రజలను హత్య చేస్తున్నారు. విప్లవోద్యమ కార్యకర్తల అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లు నిత్యకృత్యమయ్యాయి. ఇన్ని చేసినా విప్లవోద్యమాన్ని వాళ్లు కలగన్నట్లు నిర్మూలించలేకపోయారుగాని భారీ నష్టమైతే జరిగింది. జరుగుతోంది. దండకారణ్య విప్లవోద్యమాన్ని దెబ్బతీయాలనే పథకంలాగే ఏవోబీ ఉద్యమాన్ని అణిచివేయడానికి తాజాగా యాక్షన్‌ ప్లాన్‌ 2018 తీసుకొచ్చారు. సరిగ్గా ఏడాది కింద ఏవోబీలో అక్టోబర్‌ నెలలోనే రాంగుడా ప్రాంతంలో 31 మంది మావోయిస్టులను హత్య చేశారు. ఇది ఉద్యమానికి పెద్ద నష్టమే. ఇది చరిత్రలో అంతక ముందెన్నడూ జరగనంత పెద్ద ఎన్‌కౌంటరే. అయినా అతి కొద్ది కాలంలోనే తిరిగి అక్కడ భారీ స్థాయిలో ప్రజా కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది విప్లవోద్యమ పునాదిని తెలియజేస్తోంది. దీంతో పోలీసు అధికారులు మరీ బరితెగించారు. నిజా4నికి ఇలాంటి యాక్షన్‌ ప్లాన్లతో సంబంధం ఉండీ లేకుండా కూడా అణచివేత మామూలుగానే పెరిగిపోతోంది. రాంగుడా ఎన్‌కౌంటర్‌కు ఒక రకంగా దేశవ్యాప్త నిరసన వచ్చింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆ ప్రాంతంలో ఆదివాసులు పోరాడి సాధించుకున్న కాఫీ తోటలు స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నించింది. ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. కోరాపుట్‌ జిల్లా పొట్టంగిలో తొమ్మిదేళ్ల ఆదివాసీ బాలికను జవాన్లు కిడ్నాప్‌ చేసి తీసికెళ్లారు. సామూహికంగా అత్యాచారం చేశారు. దీనికి వ్యతిరేకంగా వెంటనే అక్టోబర్‌ 10, 11 తేదీల నుంచే విడతవారీగా ప్రజలు ఆందోళనలు చేశారు. ముఖ్యంగా కోరాపుట్‌ జిల్లా వ్యాప్త ఆందోళనలు, బంద్‌లు జరిగాయి. ఈ దుర్మార్గం జవాన్లే చేశారని బాధితురాలు అంటోంటే పోలీసు అధికారులు దీన్ని మావోయిస్టుల మీద వేయాలని చూశారు. వాళ్ల కుటిల నీతిని ప్రజలెవ్వరూ నమ్మలేదు. పోలీసుల మీద తీవ్ర నిరసన తెలిపారు.

మిషన్‌ 2016, సమాధాన్‌, ఇప్పుడు యాక్షన్‌ ప్లాన్‌ 2018 వంటి వాటిల్లో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి దుర్మార్గమైన ప్రకటిత లక్ష్యాలు కొన్ని ఉంటున్నాయి. అప్రకటిత లక్ష్యాలు ఇంకొన్ని ఉంటున్నాయి. వాటిని నేరుగా ఆచరిస్తూపోతుంటారు. వాటిలో తప్పుడు ప్రచారం అతి ముఖ్యమైనది. ఉద్యమ వాస్తవాలను వక్రీకరించడం, పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారంలో పెట్టడం, పైన చెప్పినట్లాంటి దుర్మార్గాలు వాళ్లు చేసి విప్లవకారుల మీద వేసేయడం ఒక ఒరవడివగా పోలీసు అధికారులు కొనసాగిస్తున్నారు.

ఈ నీచమైన పనులు గతంలో కూడా చేశారు. బహుశా ప్రపంచ చరిత్రలో ప్రజా పోరాటాలను దెబ్బతీయడానికి ఆ కాలాల్లోని ప్రభుత్వాలు, వాటి రక్షణ వ్యవస్థలు ఇలాంటివన్నీ చేశాయి. ప్రజాపోరాటాల నైతిక, రాజకీయ ప్రతిపత్తిని దెబ్బతీయడమే వీటి లక్ష్యం. అయితే మనం రాజ్యాంగబద్ధ రాజ్యమని చెప్పుకునే వర్తమాన రాజ్యయంత్రాంగానికి ఈ హేయమైన పనులు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ వనరులు ఉన్నాయి. అణచివేతకు కూడా ఒక వ్యూహాత్మక పథక రచన ఉన్నది. ఉదాహరణకు మంద్రస్థాయి యుద్ధంలాంటిది. ఈ తెలివితేటలు పాత రాజ్యాలకు లేవు. పాశవికమైన అణచివేత ఒక్కటే తెలుసు. మంద్రస్థాయి యుద్ధమనే ప్రతీఘాతుక రణతంత్రం నుంచే ఈ ఆలౌట్‌ వార్‌, మిషన్‌ 2016, సమాధాన్‌, యాక్షన్‌ ప్లాన్‌ 2018 వగైరా అన్నీ పుట్టకొస్తున్నాయి.

ఇది ఎంత లేకిగా ఉంటుందంటే ఆ మధ్య మల్కాన్‌గిరి జిల్లా కలిమెల ప్రాంతంలో మావోయిస్టుల పేరుతో కొన్ని పోస్టర్లు వేశారు. ఊరికి పదిమంది ఆదివాసులు తమ దళాల్లో చేరకపోతే చంపేస్తామని మావోయిస్టుల పేరుతో బెదిరించారు. అక్కడికి ఆగలేదు. మాజీలు కూడా తమకు సహరించాలని, లేకుంటే అంతు చూస్తామని అందులో ఉందట. తమ రాజకీయ విశ్వాసాలు లేని వాళ్లను తీసుకొని ఏం చేయడానికి మావోయిస్టులు ఈ పోస్టర్లు వేస్తారనే ప్రశ్న మామూలు జనాలకు కూడా కలుగుతుందని పోలీసులు అనుకోలేదు. తమను కాదనుకొని ఇంటికి వెళ్లిపోయిన వాళ్లను బెదిరించి పని చేయించుకోవడం నష్టదాయకమని మావోయిస్టులు అనుకుంటారు కదా.. మరి ఇలాంటి పోస్టర్లు వేస్తారనే ప్రశ్న సమాజం నుంచి వస్తుందనే కామన్‌సెన్స్‌ కూడా పోలీసులకు లేదు. అంతగా వాళ్లలో మింసోన్మాదం పేట్రేగిపోతోంది.

ఏవోబీ ప్రాంతంలో ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ఎస్సీలు, డీఎస్పీలు మావోయిస్టు వ్యతిరేక పనులు ఎంత ముమ్మరంగా చేస్తున్నారంటే అదే వాళ్ల దిన చర్య అయింది. ఆదివాసుల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకుంటున్నారని, వాళ్ల వల్ల సమాజానికి ఏ ప్రయోజనం లేదని, ప్రజపట్ల ప్రేమ ఉంటే ఎన్నికల్లోకి వచ్చి అభివృద్ధి చేయాలని.. ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం. ఇవి ఎంత అబద్ధాలైనా ఈ మాటలు రాజకీయ నాయకులు అంటే సబబుగా ఉంటుంది. కానీ ఈ రాజకీయ వ్యవస్థకు పోలీసులు చేస్తున్న ఊడిగాల్లో ఇదీ ఒకటి. ప్రభుత్వం ఇలాంటి రాజకీయ ప్రచార కర్తవ్యాన్ని కూడా పోలీసులకే అప్పగించి చాలా కాలం అయింది. పైన చెప్పిన మాటలన్నీ చింతపల్లి డీఎస్పీ పి. అనిల్‌ అన్నట్లు పత్రికల్లో వచ్చింది. పోలీసుల మాటలు కాబట్టి పత్రికలు నిజాయితీగానే రిపోర్టు చేసి ఉంటాయని నమ్మవచ్చు. ఇప్పుడు చెప్పబోతున్నది దీని గురించి కాదు. వాళ్లిలా అనడం చాలా మామూలే. అసలు కత ఏమంటే సదరు డీఎస్పీ మావోయిస్టులు అభివృద్ధి వ్యతిరేకులైపోయారని చెబుతూ సమాజమంతా ఫోర్‌ జీలో ఉంటే ఆదివాసులు కనీసం టుజీ అయినా వాడుకునే స్థాయికి ఎదగకుండా మావోయిస్టులు అడ్డుపడుతున్నారని అన్నాడు.

ఇదీ ఉన్నత విద్యావంతుడైనా ఓ పోలీసు అధికారికి అభివృద్ధి గురించి, అందునా ఆదివాసుల అభివృద్ధి గురించి ఉన్న అవగాహన. చింతపల్లి ఆదివాసులు రోగాలకు మందుల్లేక, మంచినీళ్లలాంటి కనీస వసతులు లేక ఎంత అల్లాడుతుంటారో తరచూ దినపత్రికల్లో వస్తూనే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆదివాసుల దగగ్గరికి వెళితే తిండి, వైద్యం, చదువు, భూములు అడుగుతారో, కనీసం టుజీ అయినా ఇవ్వరా అంటారో కూడా తెలియని అజ్ఞానంలో పోలీసుల అధికారులు ఉన్నారు. సరిగ్గా పాలకవర్గం తన రాజకీయాలనేగాక తన అభివృద్ధి నమూనాను కూడా పోలీసులకు ఇంతగా ఎక్కించడం చాలా సహజమే. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా కూడా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందని ప్రజలు అంటే.. బతికినా చచ్చినా ఈ విధ్వంసకర అభివృద్ధిలోనే ఉండాలని హింస ప్రయోగించాల్సింది పోలీసులే కదా. అందువల్ల చింతపల్లి డీఎస్పీకి ఆదివాసీ అభివృద్ధి అంటే ఫోర్‌జీ ఒక కొలబద్ద. ఇదీ ఈ వ్యవస్థ అసంబద్ధతకు నిదర్శనం. ఇంతకంటే మరేం కావాలి?

ఆదివాసులకేగాకాదు.. ప్రజలందరికీ ముందు తిండి కావాలి. ఆత్మగౌరవం కావాలి. రోగాలస్తే మందులు కావాలి. నిండైన వ్యక్తిత్వాన్నిచ్చే చదువు కావాలి. లబ్ధిదారులుగా, పింఛన్‌దారులగా కాకుండా సొంత కాళ్లమీద బతకాలంటే భూమి కావాలి.. ఆ తర్వాత ఇంకా జీవిత నాణ్యతకు ఏవైనా కావాలి.. అని మావోయిస్టులు అంటున్నారు. దండకారణ్యంలో వలె ఏవోబీలో కూడా తమకు వీలలైనన్ని చోట్ల ఇలాంటి నిజమైన అభివృద్ధి ఆదివాసులు తమంత తాము సాధించడానికి రాజకీయ మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ ఈ సమాజంలో ప్రజలకు ఏం చేయాలో అది మావోయిస్టుపార్టీ చేస్తున్నది. కనీసం దేశం మొత్తానికి అవసరమైనదాన్ని తాను పని చేస్తున్న చోట చేసి ఒక నమూనాను నిలబెడుతున్నది. ఒక జీవన ఆదర్శాన్ని అందరికీ అనుభవంలోకి తెస్తున్నది. అందుకే ప్రభుత్వం తన అభివృద్ధి నమూనాయే పరమం అని చాటుకోడానికి ఏవోబీ అంతటా తీవ్రమైన నిర్బంధం అమలు చేస్తున్నది. దీని కోసమే తాజాగా ఈ యాక్షన్‌ ప్లాన్‌ 2018.

ఇలాంటి వాటిలో ఇంకో తెంపరితనం కూడా ఉన్నది. అదేమంటే పోటీ ఉద్యమాలు నడపడం. ఇదీ మంద్రస్థాయి యుద్ధంలో ఉన్నది. దీని ప్రకారం అసలైన బాధితులకు పోటీగా కుహనా బాధితులను ముందుకు తేవాలి. అసలు ఈ సమాజంలో బాధితులు అనే పదాన్నే రాజ్యం అత్యంత దుర్మార్గంగా మార్చేసింది. దీనికి మీడియా, పత్రికలు ఎంత బాగా సమకూరాయో చెప్పలేం. పత్రికలు ప్రజలు అనే మాట మర్చిపోయి చాలా దశాబ్దాలైంది. ఇప్పుడు వాటికి ఓటర్లు, లబ్ధిదారులు, పింఛన్‌దారులు, బాధితులు.. అనే భాష మాత్రమే తెలుసు. దీంతో రాజ్యం చాలా తేలిగ్గా ప్రజా పోరాటాల ముందుకు కుహనా బాధితులను తీసుకొని వచ్చి ప్రచారం పొందుతుంది. నిజమైన వ్యవస్థా బాధితులు ఉద్యమ కారులుగా ఎదగకుండా ఈ ప్రచారం అడ్డుకుంటోంది. ఇంకో పక్క నుంచి వ్యవస్థా బాధితులను తీవ్రవాదులని ప్రచారం చేస్తోంది. దీనికి ఉదాహరణ రాంగుడా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో చైతన్యమహిళా సంఘం నాయకులను మావోయిస్టులుగా చిత్రిస్తూ పోలీసుల వాల్‌ పోస్టర్స్‌ ప్రచారం. రాయలసీమలోని మారుమూల పట్టణాల దగ్గరి నుంచి ఆ కొసకారున ఉండే ఉత్తరాంధ్రదాకా అంతా ఈ వాల్‌ పోస్టరింగ్‌ ప్రచారం పోలీసులు ఉధృతంగా సాగిస్తున్నారు.

ఇది ఏ స్థాయికి చేరుకున్నదంటే ఆ మధ్య రెండు నెలల కింద కర్నూల్లో విరసం కథల వర్క్‌షాపు నిర్వహించింది. రాయలసీమ కరువు, నీటి సమస్యలపై పోరాటాలను కథలుగా ఎలా రాయాలి? ఎలాంటి శిల్ప ప్రయోగాలు చేయాలి? ఎలాంటి వైవిధ్యాన్ని సాధించి కథలు బాగా చదివేలాగా రాయాలి? ఈ విషయాలు చర్చించుకోడానికి నలభై యాభై మంది కూర్చునే సమావేశం అది. అక్కడ కూడా తెల్లారే సరికి మూల మలుపు మీద పోస్టర్లు వేసి పోయారు. ఎక్కడ ఏ ప్రజాసంఘం ఏ కార్యక్రమం చేపట్టినా ఇలా వ్యతిరేక క్యాంపెయిన్‌ చేయడం అలవాటైపోయింది.

తాజాగా హైదరాబాదులో తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు మహేష్‌ను, క్రాంతిని అక్రమంగా అరెస్టు చేసి హింసించారు. తెలంగాణ ప్రజా ఆకాంక్షలను ప్రచారం చేస్తే కూడా కేసీఆర్‌ ప్రభుత్వం భరించలేకపోతోంది. అలాగే వైజాగ్‌లో ఇలాంటి వాల్‌ పోస్టర్ల దుష్ప్రచారానికి వ్యతిరేకంగా చైతన్య మహిళా సంఘం ధర్నా చేసింది. యథావిధిగా పోలీసులు ʹమావోయిస్టు బాధితులʹను తరలించి భారీ అందోళన చేయించారు. ఒక పక్క ఈ పని చేయిస్తూనే ఇంకో పక్క చట్టబద్ధ పద్ధతుల్లో ధర్నా చేస్తున్న చైతన్య మహిళా సంఘం వాళ్లను పాశవిక పద్ధతుల్లో కొట్టి అరెస్టు చేసి లాక్కెళ్లారు.

ఇలాంటి వాటిని మరింత ముమ్మరం చేయడానికి యాక్షన్‌ ప్లాన్‌ 2018 రాబోతోంది. ఇదీ ఇంతక ముందటి అభియాన్లలాగే తప్పక ఓడిపోయేదే. కాకపోతే పోరాట ప్రజలూ, ప్రజా సంఘాలూ కొంత నష్టపోవాల్సి ఉంటుంది. మన శక్తులన్నీ కూడగట్టుకొని ఉద్యమిస్తే తక్కువ నష్టంతో బైటపడగలం. దాని కోసం ఏం చేయాలో అందరం ఆలోచించాలి.

No. of visitors : 697
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •