31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు

| సాహిత్యం | వ్యాసాలు

31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు

- వరవరరావు | 02.11.2017 11:35:39am


శ్రీకాకుళంలోన చిందింది రక్తము
కొండలెరుపెక్కినాయి పోరాడ బండలే కదిలినాయి

మన దేశంలో సాయుధ రైతాంగ వర్గపోరాటాలకు చరిత్రలో మలుపు అనదగిన తేదీలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. తెలంగాణ రైతాంగ పోరాటానికి జులై 4, 1946 వలె, నక్సల్బరీ మే 23-25, 1967 వలె - శ్రీకాకుళ పోరాటానికి 31 అక్టోబర్‌, 1967.

ఈ మూడు సందర్భాల్లోనూ మైదాన ప్రాంతమైన కడివెండిలో భూస్వామి ఏజెంటు తుపాకి గుండుకు గురయి అమరుడైన దొడ్డి కొమురయ్య బడుగువర్గం నుంచి వచ్చిన వ్యవసాయ కూలీ. నక్సల్బరీలో ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నట్లుగా సంతాల్‌ ఆదివాసీ మహిళలు, పిల్లలు సిఆర్‌పిఎఫ్‌ కాల్పుల్లో, శ్రీకాకుళంలో కోరన్న, మంగన్నలు గిరిజనులు ఒక భూస్వామి తుపాకి గుండ్లకు అమరులైనారు.

1964 కమ్యూనిస్టు పార్టీలో మొదటి చీలిక నాటికే వెంపటాపు సత్యనారాయణ (సత్యం, కొండబారిడి మాస్టారుగా చరిత్రలో నిలిచిపోయిన శ్రీకాకుళ పోరాట నిర్మాత), ఆదిభట్ల కైలాసం శ్రీకాకుళం ఏజెన్సీలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరినీ విప్లవ రాజకీయాల వైపు పురికొల్పిన రాములు ఎక్కువకాలం కొనసాగలేదు. వసంతాడ రామలింగాచారి కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 1964 నుంచీ గిరిజనుల మధ్య పనిచేస్తూ, మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన భూస్వాముల, వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా వారిని సంఘటితపరుస్తూ సత్యం, కైలాసాలు గిరిజనుల చైతన్య స్థాయి పెరిగే క్రమంలో పోరాట స్థాయిని పెంచుతూ పోయారు. గిరిజన సహకార సంఘాలు, గిరిజన సంఘర్షణ సమితులు నెలకొల్పుతూ - అటవీ వస్తువులు సేకరించి విక్రయించినందుకు న్యాయమైన రేట్లు, న్యాయమైన తూనికలు మొదలు ఆర్థిక పోరాటాలు నిర్వహిస్తూ పోడు భూముల్ని తాట్టు పెట్టుకున్న భూముల విముక్తి కోసం, పోడు భూములపై హక్కు కోసం పోరాటాలు నిర్మిస్తూ పోయారు. ముఖ్యంగా గిరిజనుల మౌలిక అవసరాలయిన బియ్యం, ఉప్పు, పప్పుల కోసం విలువయిన అటవీ సంపద మాత్రమే కాకుండా తమ నెత్తురు చెమటయిన పోడు వ్యవసాయంలో తమ భూముల్లో తామే కంబారీ (కూలీ)లయిన బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు ఆయత్తం చేసారు.

అట్లా నిర్మాణం చేస్తూ వచ్చిన గిరిజనుల సంఘటిత శక్తిని ప్రకటించడానికి శ్రీకాకుళం జిల్లా గిరిజన మహాసభను అక్టోబర్‌ 31న మొండెంఖల్లు అనే గ్రామంలో తలపెట్టారు. విస్తృత ప్రచారంతో జరిగిన ఆ సభకు జిల్లా నలుమూలల పోరాట ప్రాంతాల నుంచీ చీమలపుట్ట నుంచి కదలి వచ్చినట్లుగా గిరిజనులు తరలివస్తూ ఉంటే లేవిడి అనే గ్రామం దగ్గర ఒక చెట్టు చాటుకు కాపుగాచిన రాజమండ్రి నుంచి వచ్చిన భూస్వామి సత్యనారాయణ గుంపుపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో అక్కడికక్కడే కోరన్న మంగన్న అనే ఇద్దరు గిరిజనులు నేలకొరిగారు. ఈ వార్త జిల్లా అంతటా దావానలం వలె వ్యాపించి సభా నిర్వహణ సన్నాహాల్లో ఉన్న సత్యం కైలాసాలకు ఈ వార్త తెలిసింది. ఆ సభా వేదిక మీంచే నాయకత్వం ఆత్మరక్షణ కోసమైనా సరే గిరిజనులు ఆయుధం పట్టక తప్పదని ప్రకటించారు.

కోరన్న, మంగన్నల అమరత్వాన్ని, సాయుధ పోరాట ప్రకటనను - అప్పటి వరకు జరిగిన వర్గపోరాట సన్నాహాలను, కృషిని, అప్పటికే 1967 మే 25 నుంచే నక్సల్బరీ పంథా వైపు నీటికి చేపల వలె ఎక్కుతున్న ప్రజల చైతన్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రిస్తూ ప్రజా వాగ్గేయకారుడు సుబ్బారావు పాణిగ్రాహి అక్టోబర్‌ 31 జముకు కథ రాసి ఏలూరు, ఖమ్మంల దాకా కూడా శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటానికి అశేష పీడిత ప్రజల మద్దతునే కాదు ఎందరో బుద్ధిజీవుల, కవుల, కళాకారుల, ప్రజాస్వామ్యవాదుల మద్దతును కూడగట్టాడు.

నక్సల్బరీ పంథా తూర్పు తీరాన తెరిచిన మరొక పోరాట ఫ్రంట్‌ అయింది శ్రీకాకుళం. భూస్వాముల, వడ్డీవ్యాపారుల ఇళ్లపై వందల వేల సంఖ్యలో ప్రజలు దాడి చేయడం, అప్పు పత్రాలు తగులబెట్టడం, రుణవిముక్తి ప్రకటించి, తాకట్టుపడిన పోడు భూములను స్వాధీనం చేసుకోవడం గరుడభద్రపురం, రామభద్రపురం మొదలుకొని శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ తాలూకాలయిన పార్వతీపురం, పాలకొండ, పాతపట్నం, ఉద్దానంలలో కెరటాలుగా కెరటాలుగా విస్తరించింది.

శ్రీకాకుళ పోరాట నాయకత్వం నక్సల్బరీ పంథా వైపే కాకుండా చారుమజుందార్‌ నాయకత్వం పట్ల కూడా విశ్వాసం ప్రకటించి 1969 ఏప్రిల్‌ 22న సిపిఐ (ఎంఎల్‌) ఏర్పాటులోనూ, మేడే రోజు షహీద్‌ మినార్‌, కలకత్తాలో పార్టీ ఆవిర్భావ ప్రకటనలోనూ పాల్గొన్నారు. ఆవిర్భావంలో పాల్గొన్న కొన్ని రోజులు కలకత్తా, ఒరిస్సాలలో పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని వస్తున్న క్రమంలోనే 27 మే 1969న పంచాది కృష్ణమూర్తి, రమేశ్‌చంద్ర సాహు, తామాడ చినబాడు (14 సంవత్సరాల బంగారుబాబు, సుబ్బారావు పాణిగ్రాహి జముకు కథల దళంలో స్త్రీ పాత్ర వేసిన బాలుడు) మొదలైన ఆరుగురు సోంపేట రైల్వేస్టేషన్‌లో అరెస్టయ్యారు. పార్వతీపురం కుట్రకేసు చార్జిషీటులో నమోదయిన ఆధారాల ప్రకారం ʹబంప్‌ దెమ్‌ ఆఫ్‌ʹ అనే హోంమంత్రి వైర్‌లెస్‌ ఆదేశాలతో జరిగిన మొదటి ʹఎన్‌కౌంటర్‌ʹ హత్య అది.

ʹయజ్ఞంʹ కథలో శ్రీరాములు నాయుడుతో పోల్చదగిన పార్లమెంటరీ రాజకీయాల సమర్థమైన నాయకుడు, 17 ఏళ్లు ఆవిచ్ఛన్నంగా ప్రధానిగా పాలించిన జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా అంతకు అయిదేళ్ల ముందు 1964 మే 27ననే మరణించాడు. ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడు మాత్రం అసహజ మరణానికి గురయ్యాడు.

ఇంక అక్కడి నుంచి 1972 దాకా శ్రీకాకుళ చరిత్ర అంతా రక్తసిక్తమైన చరిత్ర. రెంజిమ్‌, తాబేలు నాయుడు కుటుంబంలో పన్నెండు మంది సభ్యులు, అంకమ్మ, సరస్వతి మొదలు అరికె సోములు దాకా ఎందరో ఆదివాసీ యోధులు, సానుభూతిపరులు ఎన్‌కౌంటర్‌లలో అమరులయ్యారు. బొడ్డపాడు వంటి ఉద్దాన ప్రాంతం, ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తామాడ గణపతి, పంచాది నిర్మల, సుబ్బారావు పాణిగ్రాహి, రమణమూర్తి - మైదాన ప్రాంతం నుంచి వచ్చిన డాక్టర్‌ చాగంటి భాస్కరరావు, మల్లికార్జునుడు మొదలు అనంతపురం రీజినల్‌ ఇంజినీరింగ్‌ కాలెజి నుంచి వచ్చిన రాజారాంరెడ్డి దాకా 370 మంది విప్లవకారులు, సానుభూతిపరులు బూటకపు ఎన్‌కౌంటర్‌లలో అమరులయ్యారు.

వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం - 1970 ఫిబ్రవరిలో శ్రీశ్రీ అరవై ఏళ్ల సభలో సాహిత్యంలో పోలరైజేషన్‌ మొదలు జులై 4న ʹవిరసంʹ ఆవిర్భావం వరకు చూసిన శ్రీకాకుళ విప్లవ నాయకత్వం - ఒక వారం రోజులు కూడా గడవక ముందే జులై 10న శత్రువు చేతజిక్కి బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు. మంచాలకు కట్టవేసి ఆ మృతదేహాలను పార్వతీపురం ఆసుపత్రికి పోస్ట్‌మార్టమ్‌ కొరకు తీసుకవచ్చినప్పుడు వేలాదిమంది ప్రజలు తమ కొండబారిడి మాస్టారి కడసారి చూపు కోసం వచ్చారు.

1972లో అరికెసొములు, రాజారాంరెడ్డి దళం ఎన్‌కౌంటర్‌తో శ్రీకాకుళం తుడిచిపెట్టుకపోయింది. ఈ మధ్య కాలమంతా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల ʹకల్లోలిత ప్రాంతాల ప్రకటనʹ, ఎనభై గ్రామాల్లో సిఆర్‌పిఎఫ్‌ క్యాంపులు, ఎన్‌కౌంటర్లు - శ్రీకాకుళంలో నెత్తుర్లు పారాయి.

అయినా బూడిద నుంచి ఫీనిక్స్‌ పక్షి లేచినట్లుగా ʹతిరిగి తిరిగొచ్చింది నక్సల్బరీ, తనకు మరణమే లేదంది నక్సల్బరీʹ అని ఒక కవి రాసినట్లుగా 1980 సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ ఏర్పడిన తర్వాత శ్రీకాకుళంలో మళ్లీ పోరాటం మొదలైంది.

తమ పంటలో దోసెడు గింజలు సత్యం పార్టీ కోసం గాదెలో పోగుచేస్తూ వచ్చిన గిరిజన రైతాంగం మళ్లీ విప్లవానికి దోసిళ్లతో స్వాగతం చెప్పారు. సత్యం తర్వాత మళ్లీ సత్యమంత విశ్వాసాన్ని చూరగొన్న రాజన్న (గంటి రమేశ్‌) నాయకత్వంలో విప్లవ పార్టీ నిర్మాణం, ఒరిస్సా సరిహద్దుల వరకు విస్తరించి దానికి కక్షగానే ʹకోపర్‌డంగ్‌ʹ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆంధ్ర ఎస్‌ఐబి, గ్రేహౌండ్స్‌ సరిహద్దులు దాటి కోపర్‌డంగ్‌ లోయలో ప్లీనమ్‌ జరుపుకుంటున్న అరవై మంది సమావేశంపై గ్రెనేడ్లు విసిరారు. భద్రత కోసం నిలిచిన మహిళా గెరిల్లాలతో సహా అనారోగ్యంతో స్ట్రెచర్‌పై తీసుకువచ్చిన జిల్లా కార్యదర్శి గంటి రమేశ్‌ వరకు 17 మంది ఈ ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు.

1980 నుంచి 97 వరకు విప్లవోద్యమ పునర్నిర్మాణ చరిత్రంతా సృజనాత్మకంగా సువర్ణముఖి కథల్లో చదువుకోవచ్చు.

2000 సంవత్సరం నుంచి శ్రీకాకుళం - ఆరంభ కాలంలో మూడు ఏజెన్సీ తాలూకాలు, ఉద్దానం మాత్రమే ఉన్న శ్రీకాకుళం - ఉత్తరాంధ్ర ఉద్యమంగానే కాదు ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు స్పెషల్‌ గెరిల్లా జోన్‌గా ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు, దక్షిణ ఒరిస్సాలో ఐదు జిల్లాలకు, వెరసి ఎనిమిది జిల్లాలకు విస్తరించింది. ఎఒబి స్పెషల్‌ గెరిల్లా జోన్‌ మొదటి కార్యదర్శిగా కృష్ణగా వడ్కాపురం చంద్రమౌళి, ఆయన సహచరి 2007 పార్టీ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి వెళ్తూ పట్టుబడి ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు.

1987లో తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ఏరియాతో ప్రారంభించి కోరాపుట్‌ ప్రాంతం దాకా కృష్ణ నాయకత్వంలో విజృంభించిన విప్లవోద్యమం ఎన్నో ఆటుపోటులను, వాకపల్లి, భల్లగూడాలను తట్టుకొని నారాయణపట్నా ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయ పరిణతిగా దేశంలో గుర్తింపు పొందింది. 25 సంవత్సరాల క్రితమే నలగొండ జిల్లా వరిగొండ మండలం దాసిరెడ్డి గూడెం నుంచి వెళ్లిన చామల కిష్టయ్య - దయగా ఉద్దానం మొదలు ఎఒబి ప్రాంతమంతా చేసిన ఉద్యమ నిర్మాణం మళ్లా ప్రజల హృదయాల్లో వెంపటాపు సత్యంను ప్రతిష్ఠించింది. ఆదివాసుల నుంచి రాష్ట్ర నాయకత్వానికి బాకూరి వెంకటరమణ ఎదిగాడు. ఎందరో ఆదివాసీ మహిళలు ఎదిగారు. ఇవ్వాళ భూస్వాధీన పోరాటాలు, బాక్సైట్‌ వ్యతిరేక పోరాటాలు మాత్రమే కాకుండా ప్రజా ప్రత్యామ్నాయ విప్లవ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. స్వావలంబనతో కూడిన స్వపరిపాలన చేపట్టారు. అందుకే ఈ ఏబై ఏళ్లలో దేశంలో కనీవిని ఎరగని పెద్ద మారణకాండను తలపించే - రామగూడ ఎన్‌కౌంటర్‌ (24 అక్టోబర్‌, 2016) కు ఆంధ్ర, ఒరిస్సా, కేంద్ర బలగాల ముప్పేట దాడి తలపెట్టింది రాజ్యం.

మూడు వైపుల నీరున్న కటాఫ్‌ ప్రాంతంలో బలిమెల రిజర్వాయర్‌ దగ్గర జరిగిన ఈ మారణకాండలో రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు అధిక సంఖ్యలో ఆదివాసులు, అందులోనూ అధికంగా మహిళలు అమరులయ్యారు. అయినా 1972 శ్రీకాకుళం వలె ఈసారి ఎఒబి తుడిచి పెట్టుకపోలేదు. పైగా ఎంత సంఖ్యలో కోల్పోయారు, అంత సంఖ్యలో రిక్రూట్‌ అయి అమరుల స్మారక భవనం నిర్మించుకొని రెవల్యూషనరీ ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ల నాయకత్వంలో ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయాలతో పురోగమిస్తున్నారు. ఏడాది పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాలపై దాడులు, ముఖ్యంగా అమరుల బంధుమిత్రుల సంఘం, పౌరహక్కుల సంఘం, విరసంపై పోస్టర్లూ, దాడులు, ప్రత్యేకించి చైతన్య మహిళా సంఘాన్ని బద్నామీ చేయాలనే రాజ్యం కక్ష అక్టోబర్‌ 25 దాకా కూడా ప్రత్యక్షంగా చూసాం. ఇంత నిర్బంధం యాభై ఏళ్ల క్రితం శ్రీకాకుళం, నక్సల్బరీ పంథాలో ఎఒబిలో సాధిస్తున్న విజయాలకు దాఖలా.

నక్సల్బరీ, శ్రీకాకుళం మొదలు, ఎమర్జెన్సీ దాకా విప్లవోద్యమంపై, ప్రజాస్వామిక శక్తులపై తీవ్ర రాజ్యహింస అమలు చేసిన ఇందిరా గాంధీ రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత జాతులపై మారణకాండకు పూనుకున్నది. ఆనంద్‌పూర్‌ సాహెబ్‌ తీర్మానం (రక్షణ, కరెన్సీ, విదేశాంగ విధానం, రైల్వేలు మినహా మిగతా శాఖలన్నీ రాష్ట్రాల స్వయం నిర్ణయాలకు వదిలేయాలి. మతం విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు) అమలు మొదలు, ఖలిస్తాన్‌ వరకు 1980-84 మధ్య మిలిటెంట్‌గా పంజాబ్‌లో సిఖక్కు జాతి (ఖౌఁమ్‌) చేపట్టిన ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. పంజాబ్‌ స్వర్ణ మందిరంపై బ్లూస్టార్‌ ఆపరేషన్‌ పేరుతో సైనిక దాడి ఇందుకు పరాకాష్ట. యాదృచ్ఛికమే కావచ్చు కాని మొదలు పదకొండు సంవత్సరాలు, రెండవసారి నాలుగు సంవత్సరాలు దేశ ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ కూడా 1984 అక్టోబర్‌ 31ననే తన అంగరక్షకుల తుపాకి తూటాలకు ప్రధాని నివాసంలోనే కుప్పకూలి అసహజ మరణానికి గురైంది.





No. of visitors : 294
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి

ప్ర‌పంచ చ‌రిత్ర అంతా వ‌ర్గ పోరాటాల చ‌రిత్రే

varavararao | 31.05.2017 06:44:19pm

మే 22 నుంచి 25 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ విర‌సం మార్క్సిస్టు పాఠ‌శాలలో కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు ప్రారంభోప‌న్యాసం...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •