మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?

| సాహిత్యం | వ్యాసాలు

మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?

- పి.వరలక్ష్మి | 04.11.2017 07:22:11am

సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో చైతన్య మహిళా సంఘంపైన దుర్మార్గమైన దాడి జరుగుతోంది. మహిళా సంఘం నాయకురాళ్ళ ఫోటోలు పోస్టర్లుగా ముద్రించి వీళ్లు రాక్షసులు, అరాచక శక్తులు, మావోయిస్టులు అని రాసి గోడలకు అంటిస్తున్నారు. ʹమహిళా చైతన్యం పేరుతో వీళ్లు వస్తారు. వీళ్లను నమ్మకండి, మీ పిల్లలను మావోయిస్టుల్లో చేరుస్తారుʹ అనే హెచ్చరిక వీటిల్లో ఉంటుంది. విశాఖపట్నం నుండి కడప దాకా సంఘం ఎక్కడెక్కడ పనిచేస్తోందో ఆ ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా సంఘ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ ఇటువంటి పోస్టర్లు వేస్తున్నారు. ఈ పోస్టర్లు ఎవరు వేస్తున్నారో తెలీదు. ఏ అర్ధరాత్రో అంటించి వెళ్లిపోతారు. విద్యార్థినీ చైతన్య సంఘం అని, ఆదివాసీ విద్యార్థినీ సంఘం అని ఇప్పటి వరకు ఎవరికీ తెలీని సంఘాల పేర్లతో ఇవి ఉంటున్నాయి. ʹఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారు? అదీ దొంగచాటుగా చేయవలసిన అవసరం ఏమిటి? బైటికొచ్చి మాట్లాడండʹని తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ చైతన్య మహిళా సంఘం వాళ్లు మాట్లాడితే అవే సంఘాల పేర్లతో మళ్లీ కరపత్రాల దాడి. దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, నిరసన తెలియజేసినా దాడి కొనసాగుతూనే ఉంది.

కచ్చితంగా దీని వెనక రాజ్యం ఉంది. ముసుగు సంఘాల పేర్లతో అది చైతన్య మహిళా సంఘాన్ని బెదిరిస్తోంది. ఈ అనుభవం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త కాదు. మునుపు చంద్రబాబు పరిపాలనలోనే ముసుగు సంఘాల పేర్లతో ప్రజాసంఘాలకు బెదిరింపులు వచ్చాయి. రాజ్యం చీకటి ముసుగును ధరించి ప్రజాసంఘాల నాయకులను కిడ్నాపులు చేసింది. హత్యలు చేసింది. ఇదే చంద్రబాబు హయాంలో ప్రజాకళాకారిణి బెల్లి లలితను, పౌరహక్కుల సంఘం నాయకుల్ని దారుణంగా చంపివేశారు. ఈ సంస్కృతికి ఆనాడు తెరతీస్తే ఆ తర్వాత గంటి ప్రసాదం హత్యదాకా అది కొనసాగింది. ఇప్పుడు మళ్లీ ముసుగు సంఘాలు మరో పద్ధతిలో దాడి మొదలు పెట్టాయి. ఎన్నడూ వినని పేర్లతో సంఘాలు పుట్టుకురావడం, అవి సమాజంలో వేరే ఏ విషయాల్నీ పట్టించుకోకుండా ప్రజాసంఘాలను లక్ష్యం చేసుకోవడం, ఆ సంఘాలకు మావోయిస్టు సంబంధాలున్నాయని చెప్పడం, ప్రజాసంఘాల నాయకుల కదలికల్ని దగ్గరగా గమనిస్తూ వాళ్లెక్కడికి పోతే అక్కడ పోస్టర్లు వేయటం, ఇవన్నీ రాజ్యం చేసే పనులుగాక మరేమిటి? ఇందులో ఎంత ఆధిపత్య ధోరణి, పితృస్వామిక వైఖరి, పోలీసు బుద్ధి ఉన్నాయంటే దొంగల ఫోటోలు ప్రదర్శించినట్లు మహిళా కార్యకర్తల ఫోటోలు వేసి, వారి వ్యక్తిగత జీవితానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగించాలని ప్రయత్నించడం, మానసికంగా వేధించి పరోక్షంగా హెచ్చరించడం పదేపదే జరుగుతోంది.

దీనిని నిరసిస్తూ విశాఖపట్నంలో సి.యం.ఎస్‌తో పాటు అన్ని ప్రజాసంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాకు సమాధానమన్నట్లు పోలీసులు మూడు డి.సి.యం వాహనాల్లో మనుషుల్ని తరలించి వాళ్లతో ప్లకార్డులు పట్టించి ఇదే మహిళా సంఘం ప్రతినిధుల భారీ ఫోటోలు ప్రదర్శిస్తూ, వాళ్లను దుర్మార్గులుగా చిత్రిస్తూ నగరంలో ఊరేగించారు. అసలు ప్రజాసంఘాలు ధర్నా శిబిరం వద్దకు చేరుకునే వరకే శిబిరం వద్ద సుమారు ఇరవై అడుగుల భారీ ఫ్లెక్సీలు కట్టి ఉంచారు. ఒక్కో మహిళా కార్యకర్త ఫోటో కనీసం నాలుగైదు అడుగుల సైజు ఉంది. చైతన్య మహిళా సంఘంలో వందల మంది సభ్యులున్నారు. కావాలని పోలీసులు దేవేంద్ర ఫోటో వేసి, పక్కన పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన ప్రభాకర్‌ ఫోటో వేసి, ఈమె భర్త ఒక మావోయిస్టు, అని రాశారు. ఒకప్పుడు చైతన్య మహిళా సంఘంలో పని చేసి, ఆ తర్వాత మావోయిస్టు పార్టీ సభ్యురాలై పోలీసుల చేతిలో చిత్రహింసలకు, హత్యకు గురైన భారతి ఫోటో పెట్టారు. ఇక రాజేశ్వరి భర్త మాజీ మావోయిస్టట. ఇటువంటి ఫోటోల కింద ʹఇప్పుడు చెప్పండి మీది మావోయిస్టు అనుబంధ సంఘం కాదనిʹ అని ప్రశ్న ఒకటి. ఈ ఆరోపణలు చేస్తూ ఇంతింత ఫెక్సీలు కట్టింది ఆదివాసీ సంఘం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. నిజానికి విశాఖపట్నం నడిబొడ్డున మీడియా సమక్షంలో ముసుగు బట్టబయలైపోయింది కూడా. పోటీ ధర్నాకు తరలించబడిన మహిళల్ని ʹమా ఫోటోలు పట్టుకొని ఎందుకు ఊరేగిస్తున్నారు, మీకు మేమేం అన్యాయం చేశాంʹ అని సూటిగా అడిగితే ʹమాకు తెలీదు, పోలీసులు మీటింగుకని తీసుకొచ్చారʹని ఒకామె చెప్తుంది. మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఇంకొక మహిళ అంటుంది.ʹ ఏమీ తెలియని నిరుపేద మహిళలను, ఆదివాసులను తీసుకొచ్చి, ఆ ప్రజల కోసమే పని చేస్తున్న సంఘానికి వ్యతిరేకంగా ప్రదర్శన ఇప్పించడం చరిత్రలో ఎక్కడా ఉండి ఉండదు. ఇది ఎంత విషాద బీభత్సం!

వ్యూహం బెడిసికొట్టిందని తెలియగానే పోలీసులు ధర్నా శిబిరం మీద దాడి చేశారు. పైకి లాఠీ చార్జ్‌ చేసినట్లు లేదు కానీ మహిళా సంఘాల బాధ్యులను, కార్యకర్తలను యాభై మందిని లాక్కుపోయి నిర్బంధించే క్రమంలో జుట్టు పట్టి లాగడం దగ్గరి నుండి దుస్తుల్లోపల చేయిపెట్టి హింస పెట్టడం, ఎత్తికుదేయడం, ఒకరి మీద పది మంది పడి శరీరాన్ని నుజ్జు చేయడం అన్నీ చేశారు. మహిళా పోలీసులైనా పోలీసులే కదా అని నిరూపించుకున్నారు. ఇటీవలే పొత్తికడుపు ఆపరేషన్‌ చేయించుకున్న రాజేశ్వరిని మూడుసార్లు ఎత్తి నేల మీద బలవంతంగా పడేసారు. పోలీసుల కనిపించని దెబ్బలకు మరో కార్యకర్త కుమారిని హాస్పిటల్‌కు తరలించి సలైన్‌ ఎక్కించాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు? ధర్నాలు చేయొద్దని దిక్కుమాలిన థర్టీ ఆక్ట్‌ వంటివి ఏవైనా ఉన్నాయా? వాటిని ఉల్లంఘించారని అరెస్టు చేశారా? మరి పోటీ ధర్నాను దగ్గరుండి పోలీసులు ఎలా జరిపిస్తారు? నగరంలో పోస్టర్‌ అంటించడానికి, ఫ్లెక్సీలు వేయడానికి కూడా అనుమతి లేదని చెప్పే పోలీసులు, ఎవరి అనుమతితో మహిళా సంఘం కార్యకర్తల్ని అవమానపరిచే పోస్టర్లు, ఫ్లెక్సీలు పడ్డాయో చెప్పగలరా?

ఒక్క చైతన్య మహిళా సంఘంపైనే కాక పౌరహక్కుల సంఘం, విరసం నాయకత్వంపై కూడా ఇదే తరహాలో ఇటువంటి ప్రచారదాడి జరిగింది. గతేడాది అక్టోబర్‌లో ఆంధ్రా-ఒడిసా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ పేరుతో 31మంది మావోయిస్టులను, ఆదివాసులను చంపిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగానే కాక, దేశంలో అనేక చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. చట్టం పోలీసులకు కూడా వర్తిస్తుందని, ఇష్టం వచ్చినట్లు చంపే హక్కు ఎవరికీ ఉండకూడదని ప్రజాసంఘాలు, వామపక్షాలు, మేధావులు మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌ మృతదేహాలు మాంసపు ముద్దలుగా, తలలేని మొండెం, స్తనాలు కోసేసిన స్త్రీ దేహాలుగా, కుప్పలుగా పోసిన శరీర భాగాలుగా అత్యంత భయానకరంగా ఉండడం బంధువుల్నే కాదు, మానవత్వం ఉన్నవారందర్నీ కదిలించింది. అదిగో, అప్పుడు వ్యక్తమైన పౌరహక్కుల చైతన్యానికి చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పడిపోయింది. అప్పటి నుండి ప్రజాసంఘాలపై దుష్ప్రచార దాడి మొదలైంది.

బాక్సైట్‌ మైనింగ్‌ కోసం నెత్తురు పారించిన రాజ్యం, తన అభివృద్ధి నమూనాను అమలు చేయడానికి ప్రశ్నించేవారందర్నీ లక్ష్యంగా చేసుకుంది. ఏ నిరసననుగానీ, విమర్శను తట్టుకోలేని ప్రభుత్వం అందరి మీదా ఎదురుదాడి పద్ధతిని ఎంచుకుంది. ప్రజాసంఘాలు కాదు, వామపక్షాలు కాదు, ప్రతిపక్షాలు కాదు అందరూ దానికి కంటగింపే. అందరూ అభివృద్ధికి అడ్డంకే. ఈ వైఖరి చివరికి తనకు ఓటు వేయకపోతే తాను వేయించిన రోడ్లపై ఎలా నడుస్తారని, పెన్షెన్లు ఎలా తీసుకుంటారని ముఖ్యమంత్రి ప్రజల్ని దబాయించేదాకా పోయింది. నిరంకుశత్వం ఒక్క దగ్గర ఆగదు కదా! రాజధాని కోసం భూములివ్వను నిరాకరించిన వారిని, ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన వారిని, ఆత్మగౌరవాన్ని చాటుకున్న దళితుల్ని ఏం చేశారో చూశాం. ఇటువంటి ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వొచ్చు. వర్గీకరణ కోసం మాదిగలు సభ పెడితే, వ్యతిరేక వర్గాన్ని రెచ్చగొట్టి సభను భగ్నం చేశారు. కంచె ఐలయ్యకు మద్దతుగా దళిత, బహుజన, ప్రజాసంఘాలు సభ జరపనుపోతే, వైశ్యబ్రాహ్మణ సంఘాలనడ్డుపెట్టి శాంతి భద్రతల పేరుచెప్పి అడ్డుకున్నారు.

ఇటువంటి ప్రభుత్వానికి సహజంగానే మహిళా చైతన్యమంటే మరింత కంటగింపు. సమాజంలో మునుపెన్నడూ లేనంతంగా మహిళల మీద దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్న స్థితిలో ఏమీ చేయలేని ప్రభుత్వం ఒక మహిళా సంఘాన్ని వేధిస్తున్నది. మహిళా సంఘం సభ్యులను, ప్రజాసంఘాలను వెంటాడి, వాళ్లు కార్యక్రమాలు చేపట్టిన చోటల్లా పోస్టర్లు, అంటిస్తూ వాళ్ల మీద దుష్ప్రచారం చేస్తుంది. ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ల మీద రాతలు రాసి గోడలకు అంటిస్తున్నారే, ఈ ప్రభుత్వం మీద, మంత్రులు, ఎమ్మెల్యేల మీద రాతలు రాయను మొదలుపెడితే గోడలు చాలవు, గ్రాంధాలూ చాలవు. పట్టపగలు నడిరోడ్డు మీద మానసిక వైపకల్యంతో ఉన్న మహిళ మీద తప్పతాగి ఒకడు అత్యాచారం చేసే స్థితికి మన నగరాలు చేరుకునన్నాయంటే ఈ ప్రభుత్వం, అంత పెద్ద పోలీసు యంత్రాంగం, స్త్రీ సంక్షేమం కోసమే ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్లు? ఇంత పనికిమాలిన రాజ్యం అదే నగరంలో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల మీద దాడి చేస్తుంది. ఆ పని చేయడం ద్వారా పభుత్వం, పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసం కాదని విశాఖలో స్పష్టంగా చెప్పారు. సరిగ్గా నాలుగు రోజులకే స్త్రీల వ్యక్తిత్వాలను కించపరిచే అందాల పోటీలను వ్యతిరేకిస్తున్న మహిళా సంఘాల మీద దాడి చేసి ఈ విషయాన్ని మరింత నొక్కి చెప్పారు.

ఒక వైపు మహిళల్ని మార్కెట్‌ సరుకుగా, మాంసం ముద్దలుగా చూపించే నిరంతర వాణిజ్య ప్రచారం, మరోవైపు రక్షణ లేదు కాబట్టి స్త్రీలు రోడ్డు మీదికి రాకూడదనే వికృత సాంస్కృతిక పోకడలు శృతి మించుతూ సమాజంలో మహిళల స్థితిని దిగజార్చివేస్తున్నాయి. రోజురోజుకూ ఇళ్లు, బళ్లు, కాలేజీలు అన్నీ నిర్బంధ శిబిరాలై ఆడపిల్లను గడప దాటనివ్వకుండా కుంగదీసి, అవమానపరిచి, నిస్సహాయులుగా తయారుచేసే కొద్దీ అంతకంతగా దాడులు పెరిగిపోతున్నాయి. నోరెత్తని బలహీనులను చేసి ఇంటి దగ్గరి నుండి స్కూలు, కాలేజీ, విశ్వవిద్యాలయం దాకా ఆడపిల్లల మీద విచ్చలవిడిగా అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి అకృత్యాల మధ్య సాహసోపేతంగా సంఘటితంగా ముందుకొచ్చే మహిళా సంఘాల మీద దాడి చేయడానికి ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుండక్కర్లేదా! ఇలాంటి సామాజిక స్థితి, ఇటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట ఇవాల ఎవ్వరికన్నా కూడా సంఘటితం కావాల్సిన అవసరం మహిళలకుంది. ప్రభుత్వం దృష్టిలో మహిళా సంఘాలంటే తమ చేతి కింద ఉండాల్సిన పొదుపు సంఘాలు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు తమ ప్రచార సభలకు తరలివచ్చే గుంపులుగా ఉండాలి. ఆడవాళ్లంటే భర్తలు తాగి తగలేస్తే చాటుగా పొదుపు చేసి గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చే భార్యలుగా మాత్రమే ఉండాలి? దించిన తల ఎత్తకుండా అవమానాలు దిగమింగి, చదువుకొని కట్నం పోసి పెళ్లి చేసుకునే అమ్మాయిలుగా మాత్రమే ఉండాలి? లేకపోతే సరుకుల అమ్మకాలకు ప్రమోట్‌ చేసే అందాల బొమ్మలుగా ఉండాలి. ప్రభుత్వాలు తాగుడును ప్రోత్సహిస్తూ జనాన్ని ఉన్మత్తులుగా, ఏ చైతన్యం లేని పశువులుగా తయారుచేస్తూ ఉంటాయి. అది కూడా సరిపోకపోతే మత పిచ్చిని ఎక్కిస్తాయి. ఎక్కడైనా నోరెత్తేవాళ్లుంటే పోలీసులను ఉసిగొల్పుతాయి.

పాలన ఇంత సాఫీగా సాగిపోవాలి. ఏ చైతన్య మహిళా సంఘమో ఆడవాళ్లను కలిసి రాజకీయాలు అర్థం చేయిస్తే మద్యనిషేధమంటారు, పురుషాధిపత్యం అంటారు, సమానత్వం అంటారు. సకల ఆధిపత్యాలను పోషిస్తూ సకల దుర్గంధాలను వెదజల్లే రాజ్యాన్ని ప్రశ్నిస్తారు. వీరిలో విద్యార్థినులు సంఘాలుగా సంఘటితమైతే మరింత ప్రమాదం. అందుకే మహిళా చైతన్యం కాలేజీలకు, హాస్టళ్లకు వ్యాపించకూడదు. విద్యార్థి సంఘాలన్నా, మహిళా సంఘాలన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అంత ఉలికిపడుతున్నాయంటే అర్థం ఉద్యమాలు నిర్మాణం కావలసిన, కాగలిగిన క్షేత్రాలు అవే. తెలంగాణలో విద్యార్థి సంఘాలను, ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సంఘాలను రాజ్యం అందుకే టార్గెట్‌ చేసుకుంది.


No. of visitors : 588
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వ‌ర్గ పోరాటం - సాంఘీక విముక్తి : వ‌ర‌ల‌క్ష్మి

| 06.07.2016 11:56:11am

దండ‌కార‌ణ్యం ప్ర‌త్యామ్నాయ ప్ర‌జారాజ్యాధికారంలో భాగంగా వ‌ర్గపోరాటం ఎలాంటి సాంఘీక విముక్తిని సాధిస్తోంద‌నే విష‌యాల‌పై వ‌ర‌ల‌క్ష్మి విశ్లేష‌ణ‌......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •