100% డిజబులిటి నీడెడ్!

| సాహిత్యం | వ్యాసాలు

100% డిజబులిటి నీడెడ్!

- -బమ్మిడి జగదీశ్వరరావు | 06.11.2017 09:04:16am

గోకరకొండ నాగ సాయిబాబా గారూ!

మీరు పుట్టపర్తి సాయిబాబా అండీ బాబూ.. లేదు లేదండీ మీరు అంతకంటే యెక్కువేనండీ.. నిజం చెప్పాలంటే పుట్టపర్తి సాయిబాబా మహత్యాలు చాలా చిన్నవి. గాల్లోంచి విబూది తియ్యడం.. చేతులు తిప్పి చైన్లు తియ్యడం.. నోట్లోంచి శివలింగాలని వాంతిచేసుకుంటూ కక్కడం.. ఇంతే! మరి మీరో? చక్రాల కుర్చీలో వుండి చక్రం తిప్పేస్తున్నారు కదండీ? ఎక్కడ సన్నవిల్లి? ఎక్కడ ఢిల్లీ? తక్కువోరు కాదండీ.. యూనివర్సిటీ దాక యెగబాకేసారు. తెలివైనోరు. కాకపోతే క్లాసుల్లో పాఠాలు చెపుతున్నట్టే కనిపించి యెంతెంత కుట్రలు పన్నారండీ.. హమ్మా.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం సాగించేయడానికి నేరపూరితమైన కుతంత్రాలు చేస్తారాండీ మీరు? ఫ్రంట్ నుండి పాకిస్తాన్.. బ్యాక్ నుండి చైనా.. మధ్యలో మీరు..యుద్ధానికి కాలు దువ్వుతారా? అమ్మో.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వాన్నీ జనసమీకరణతో బలప్రయోగంతో కూలదోసెయ్యాలని చూస్తారండీ మీరు? ప్రజల ప్రాణాలను ఆస్తులను విధ్వంసం చేసేసి భారీ హింసాకాండకు పూనేసుకొని అద్భుతమైన అవిభాజ్యమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజల విశ్వాసాన్ని టుపుక్కున చెదరగొట్టేస్తారండీ మీరు? మావోయిస్టు మంత్రదండంతో మంత్రం వేసి తంత్రం చేసేస్తారాండీ మీరు?

పైగా ఇదేంటండీ మీ మద్దతుదారులు ఫ్రీ సాయిబాబా.. ఫ్రీ సాయిబాబా.. అంటారు? ఫ్రీ దేనికనాలో తెలీదాండీ? ʹరండి బాబూ రండి.. మీకు భూమి ఫ్రీ.. నీళ్ళు ఫ్రీ.. పవర్ ఫ్రీ.. పన్నులు ఫ్రీ.. రాయితీలు ఫ్రీ.. సకల వనరులూ ఫ్రీ.. మీరు ఫ్రీ గా రండి.. ఫ్రీ గా పెట్టుబడులు పెట్టండి. ఫ్రీ గా వుండండి. ఫ్రీ గా రెడ్ కార్పెట్ మీద నడవండి.. మీకు ఫ్రీ గా రక్షణ నిస్తాం.. మీకు ఫ్రీ గా పొల్యూషన్ సర్టిఫికేట్లు కూడా యిస్తాం.. సింగిల్ విండోలో కేవలం మూడంటే మూడ్రోజుల్లో ఫ్రీ గా అన్ని అనుమతులూ యిస్తాం. మానేలా మానీళ్ళూ మాబతుకూ అని అడిగి అడ్డంపడ్డరైతుల్ని ఆదివాసీల్నివాళ్లకు వత్తాసు పలికిన వాళ్ళని మక్కలిరగదన్ని బొక్కలో తోసి మీకు ఫ్రీ గా శాంతి భద్రతలను కూడా కల్పిస్తాం.......ʹ అని ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోరి నెత్తీ నోరూ బాదుకుంటూ వుంటే- మీరు జీతం డబ్బులతో పెళ్ళాం బిడ్డలతో ఫ్రీ గా హాయిగా వుండలేక చత్తీస్ ఘడ్ ఆదివాసీలని రెచ్చగొడతారా? జార్ఖండ్ మహారాష్ట్ర ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ లోని ఆదివాసీలను యెక్కడెక్కడి వాళ్ళని సంసిద్ధం చేస్తారా?

అసలు మీకూ మీ ఐదుగురు శిష్యులకూ గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కాని అంతకంటే పెద్ద శిక్ష విధించాలి. అలా విధించడానికి మన చట్టాలు అవకాశం యివ్వకుండా చేతులు కట్టేసాయి. లేకపోతే మీకు మరణ శిక్ష వేసేయాలి. ఎంత నేరమండీ.. మరెంత ఘోరమండీ.. మనదేశానికి వచ్చే పెట్టుబడులను మీరు అడ్డుకుంటారాండీ? ఒకవైపు ఫారిన్ డైరెక్టు ఇన్వెస్టుమెంటును ఆహ్వానిస్తుంటే మీరేమో ఆదివాసీలు నిరాశ్రయులు అవుతున్నారని గగ్గోలు చేస్తూ ప్రపంచ దేశాలముందు బయట పెడతారా? బద్నాం చేస్తారా? ఎంత ఇన్ కన్వీనియన్సండీ? ఎంత డిస్ ప్లెజరండీ? ఎమ్మెన్సీలు ఎలా చూస్తాయండీ.. మనల్ని.. మన మంత్రుల్నీ? మన ప్రధానమంత్రిగారు దేశ దేశాల ప్రధానుల ముందు తలయెత్తుకోగలరాండీ? పరువుపోయినట్టు కాదండీ? మీరు నవ్వులపాలు చెయ్యడం వల్ల ఇండియా నవ్వులపాలైపోయింది తెలుస్తోందాండీ? ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటే అంతేనా? ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడమేనా? ప్రకృతి సంపదని అప్పనంగా అప్పజెప్పయడమేనా? పర్యావరణాన్ని దెబ్బతీయడమేనా? ఇంకేమీ కనిపించడం లేదా? అభివృద్ధి కనిపించడం లేదా? భారత్ వెలిగిపోతుంటే మీకు కనిపించడం లేదా?

అరే పెన్ను చేతిలో వుందని యేది పడితే అది రాసేయడమేనా? నోరు వుందని యేది పడితే అది మాట్లాడేయడమేనా? ప్రభుత్వాలను విమర్శించేయడం మీకు బాగా ఫ్యాషనయిపోయింది. చాలదని ఎన్జీవోలని కూడా తప్పు పట్టే స్థాయికి వెళ్ళిపోవడమేనా? ఎన్జీవోలు అంటే యెవరనుకున్నారు? ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం. సహ ప్రభుత్వం. సమాంతర ప్రభుత్వం. వారినీ విడిచి పెట్టరే మీరు? అప్పటికీ పోలీసువాళ్లు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేశారు.చేస్తూనే వచ్చారు. రామ్ లీలా మైదానంలో సభప్పుడు మీ చక్రాల కుర్చీని లాగి తిరగేసి తన్ని విపరీతంగా కొట్టారు. అయినా మీరు తగ్గలేదు. మీ ఇంటి మీద నిఘా పెట్టారు. మీ యింట్లో పనిచేసే వాళ్ళని భయపెట్టి పని చేయకుండా చేశారు. డ్రైవర్ల ద్వారా మీ గుట్టుమట్టులన్నీ లాగారు. భయపడి మీకు డ్రైవరుగా వుండడానికి యెవరూ రాలేదు. మీ గురించి చేసిన ప్రచారం వల్ల యెవరూ మీకు యిల్లు అద్దెకివ్వకుండా చేశారు. మిమ్మల్ని కిడ్నాప్ చేసి దాన్ని అరెస్టుగా చూపించి పోలీసు ట్రీట్మెంటు ఇచ్చినా మీరు కాదు కదా మీ ఆవిడా కూతురూ అమ్మా యెవరూభయపడలేదు.ఉద్యోగం సస్పెండయినా పోయినా మీరెవరూ భయపడలేదు. అంటే.. మీరు దేనికీ భయపడడం లేదంటే ఏమిటి అర్థం? మీరు కమిటెడ్ టెర్రరిస్టు అనే కదా? మిమ్మల్ని టెర్రరిస్టు అనడానికి యితకంటే ఆధారాలు కావాలా? మీ హార్డ్ డ్రైవ్ చూసే కాదు, మీ కమిట్మెంటు చూస్తే ʹహార్డ్ కోర్ టెర్రరిస్టుʹ అని జడ్జీగారికే కాదు, మాకూ అనిపిస్తోంది.

అసలు మిమ్మల్ని యెవరయినా యెలా సపోర్ట్ చేస్తారండీ? మీరు నైంటీ పర్సెంట్ డిజేబుల్డ్ అని కొందరు జాలి దయా కరుణా చూపిస్తున్నారే? ఆమాటకొస్తే డిజేబుల్డ్ కానిదెవరు? ప్రభుత్వమూ డిజేబుల్డే! ప్రజలూ డిజేబుల్డే! హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్డ్! హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్డ్! మీలాంటి వొక వ్యక్తికి.. మీ పనులు మీరు చేసుకోలేని మీలాంటి వొక వ్యక్తికి.. ప్రభుత్వం భయపడింది అంటే అది డిజేబుల్డ్ కాదా? ప్రభుత్వమూ దానికి యిన్ని శాఖలూ వుండి.. యింత యంత్రాంగమూ మంత్రాంగమూ వుండి కూడా భయపడి మీ మీద దొంగతనం కేసుయెందుకు పెట్టింది?ఎక్కడో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోవున్న అహేరి పోలీస్టేషను పరిధిలో దొంగతనం జరిగితే, ఆ వస్తువులు ఢిల్లీలో మీ యింట వున్నాయని సెర్చివారెంటుతో పోలీసులు రావలసిన అగత్యమూ ఆంతర్యమూ మీకు తెలియనిదా?అప్పుడే కదా మీ యింట్లో ఎవిడెన్సుకు అవసరమైనవి అన్నీ సీలు చెయ్యకుండా సంతకం తీసుకోకుండా యెత్తుకుపోవడమే కాదు, అన్ సీల్డు కవర్లో పోలీసులు యిచ్చిన తీర్పు న్యాయస్థానం తీర్పుగా రావడం.. మిమ్మల్ని మామూలు సెల్ లో కాకుండా ఆండా సెల్ లో వుంచడం.. మీకు కనీస వైద్యాన్ని నిరాకరించడం.. మందులు అందకుండా చేయడం.. తిరిగి మీ మెదడు చురుకుగా పనిచేస్తున్నది అని అనడం.. మనలో మనమాటగా చెపుతున్నా.. ఇవన్నీ యెందుకు? మీకంటే ప్రభుత్వం డిజేబుల్డ్ అని యింకా అర్థం కావడం లేదా? ఒక వ్యక్తి కంటే వ్యవస్థ డిజేబుల్డ్ గా వుండడం మీకు బాధగా అవమానంగా అపకీర్తిగా అన్యాయంగా అనిపించడం లేదా?

ఇక మీకు మద్దతునిస్తున్నట్టు కనిపిస్తున్న వాళ్ళంతా డిజేబుల్డ్ కాదా? వాళ్ళు జన జీవన స్రవంతిలో వున్నారని మర్చిపోతే యెలా? వాళ్ళకీ భద్ర జీవితాలు వుంటాయి. నెలంతా కష్టపడితే కాని జీతం రాదు. భత్యం వుండదు. పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోలేరు. ఇప్పుడు మీ భార్యా బిడ్డలు పడుతున్న అవస్తలు చూస్తున్న వాళ్ళు.. వాళ్ళు ఆ అవస్తలలోకి కోరి వస్తారా? కొంతమంది సున్నితంగా వుండి అతిగా స్పందించి కవిత్వాలు రాస్తారు. మరికొంతమంది ఖండిస్తూ ప్రకటనలు ఇస్తారు. కాదంటే ఫేస్ బుక్కుల్లో కామెంట్లు రాస్తారు. కొందరు అక్కడితో ఆగకుండా ఓ ఆదివారం చూసి మీటింగు పెట్టుకుంటారు. మళ్ళీ చచ్చినట్టు ఆ ప్రభుత్వాన్నేఅభ్యర్ధిస్తారు. డిమాండ్ అంటూ విజ్ఞాపననీ విన్నపాన్నీ పంపుకుంటారు. పేపర్లో చిన్న కాలమ్ వస్తుంది. మీరన్నట్టు అన్యాయమే అయినా న్యాయస్థానం అధికారిక తీర్పు యిచ్చేసాక అది న్యాయమే! బెయిల్లూ జైల్లూ.. రివ్యూ పిటీషన్లూ పైకోర్టులకు అప్పీల్లూ.. రోజూ వున్నదే జరిగేదే గనుక జన్లూఅక్కడితో మర్చి పోతారు. చలికాలం కదా మీకు దుప్పటి వుందా? లేదా? కాదు, కమ్మగా యెవరి దుప్పట్లో వాళ్ళు దూరి నిద్రపోతారు. అలా అయితే తప్ప బతకలేరు. ఎక్కడో యెప్పుడో మనసు కలుక్కుమంటే లేచి అందరూ కలిసి ఆర్ధిక సాయం చెయ్యాలని అనుకొని చందాలు పోగు చేస్తారు.అంతకన్నా యెక్కువ మాట్లాడిన వాళ్ళని గుర్తించి సాయిబాబా దగ్గరికి పోతావా అని అడగాల్సినవాళ్ళు అడుగుతారు. భయం.. చెప్పినట్టు వింటే విని సైలెంటు అయిపోతే అభయం.. ఇదంతా డిజేబుల్డ్ కాక మరేమిటి?

అంచేత అందరం డిజేబుల్డే! ఆమాటకొస్తే డిజేబుల్టీ లేనిదల్లా మీకే! కాబట్టి డిజేబుల్ గురించి మాట్లాడకండి!

అన్నిదారులూ మూసేస్తే? తలుపులన్నీ మూసేస్తే? పిల్లి తిరగబడుతుంది.. మనుషులు తిరగబడరా? బడతారు! అవే మిలిటెంటు ఉద్యమాలు అవుతాయి! సాయుధ పోరాటాలు అవుతాయి! చెయ్యవలసిన వాటిని విముక్తం చేస్తాయి!అని మీరంటారు! అలాంటి ప్రమాదం జరగకుండా వుండడానికి.. ప్రెజర్ కుక్కర్ కి విజల్ వున్నట్టు.. వుండాల్సినవి వుండాలి! వుంటాయి! అందువల్ల మాత్రమే మీలాంటి వాళ్ళకి బెయిల్ ఆలస్యంగానైనా వస్తుంది! ఇస్తారు! లేదంటే ఆలస్యం కావలసిన తిరుగుబాటు తొందరగా వచ్చే ప్రమాదం వుందని గుర్తిస్తారు! అందువల్ల మీలాంటి వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తారు! అప్పుడు మీరు పొరపాటుగా బతికి పోవచ్చు! బట్టకట్టొచ్చు! లేదంటే యెలాగూ అమరత్వం సిద్ధిస్తుంది! మీకు అమరత్వం అయినా వుంది వేలాదిమంది జైళ్లలో అజ్ఞాతంగా మగ్గి అక్కడే మట్టయిపోతున్నారు! కాదని యీ సమస్యలపై అంతర్జాతీయ సమాజం అడ్డుకుంటుందేమో.. కాని యిది మన దేశ అంతర్గత సమస్య కదండీ.. వారికా హక్కులేదు! మీకు దిక్కులేదు!

చెప్పొచ్చేదేమిటంటే.. మన మూడు కోతులూ యేo చెప్పాయి? నోరున్నది వాక్ స్వాతంత్ర్యానికి కాదు, మూసుకోవడానికి! కళ్ళున్నది కానిస్ట్యూషన్ చదివి వుపయోగించుకోవడానికి కాదు, మూసుకోవడానికి! చెవులున్నది సామన్యుల శోకం విని పోరాడ్డానికి కాదు, మూసుకోవడానికి! అన్ని అంగాలూ మూసుకున్నపుడే

రాజ్యాంగమూ పనిచేస్తుంది! రాజ్యమూ శోభిల్లుతుంది!
జై బోలో భారత్ మాతాకీ - జై!

యిట్లు
వొక సర్వసాక్షి

No. of visitors : 740
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథ

బమ్మిడి జగదీశ్వరరావు | 03.07.2016 10:39:36pm

మన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం........
...ఇంకా చదవండి

మధు వడ్డించిన అన్నం!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.03.2018 08:03:16am

ఆకలి అందరికీ వుండొచ్చు! తినే అర్హత మాత్రం అందరికీ వుండదు! లేదని తిన్నావో నువ్వు దొంగవి! చిరుగుల బట్టా మాసినజుట్టూ అందుకు సాక్ష్యం! అయినా దేశానికి కన్నమేస్తే...
...ఇంకా చదవండి

ʹనోట్ʹలో మట్టి!

బమ్మిడి జగదీశ్వరరావు | 20.12.2016 11:23:30pm

పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది. వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద...
...ఇంకా చదవండి

దునియా అంతా ʹదొరల రాజ్యముʹ షూటింగే గదనే?!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.12.2017 12:38:01am

లేదు.. లేదు.. గిది సినిమా కాదు.. మేం నటించలేదు.. అని లక్ష్మణూ రాజేషూ అంటే గది కూడా స్క్రిప్టే! వాళ్ళ స్క్రిప్టు వాళ్లకుంటది! మన స్క్రిప్టు మనకుంటది! మన సిని...
...ఇంకా చదవండి

ఈ పక్షం బుల్పికలు!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.02.2018 12:30:59pm

రాజ్యాంగం ఏమయ్యింది?" "చిరిగిపోయింది!" "ఎలా..?" "కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టారుగా?...
...ఇంకా చదవండి

నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.10.2017 11:27:55pm

సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ ......
...ఇంకా చదవండి

జై శ్రీరామ్!

బమ్మిడి జగదీశ్వరరావు | 17.11.2019 10:47:06am

రాముడి పేరే పలుకుతూ పెట్రేగిపోతూ హిందూ సేనలు రాముణ్ణి తరిమి తరిమి కొట్టాయి! రాముడు ప్రాణభయంతో పరుగులు తీశాడు! తృటిలో తప్పించుకొని ʹబతుకు జీవుడాʹ అని వూపిరి ...
...ఇంకా చదవండి

లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.09.2017 11:32:20pm

దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్...
...ఇంకా చదవండి

ఫ్యాన్స్ బాబూ.. ఫ్యాన్స్!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.10.2017 09:46:33pm

ప్రతొక్కడూ ఫ్యాన్సు మీద బురదచల్లి మాట్లాడడం ఫ్యాన్సుగా మనం సహించవొద్దు! ఫ్యాన్సుగా మనం వొక్కటిగా లేకపోతే యేకం కాకపోతే ఐక్యంగా వుండకపోతే డేమేజ్ అయిపోయి చాలా ...
...ఇంకా చదవండి

నరʹసింహం!ʹ

బమ్మిడి జగదీశ్వరరావు | 02.11.2019 11:00:17pm

మనిషిలా మాట్లాడుతున్నావే?- అంది కుందేలు! ఏ సర్కస్ సింహం తిరిగి అడవికి వొచ్చి అంటించిందా? లేకపోతే అలనాడు నరసింహుడు అడవిలో అడుగు పెట్టడంవల్ల అబ్బిందా?... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ కు నివాళి
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •