నాగపూర్ జైలు నుండి ప్రొఫెసర్ సాయిబాబా తన సహచరి వసంతకు రాసిన ఉత్తరం సహజంగానే చాలా స్పందనను తీసుకొచ్చింది. ఆయన కుటుంబానికి సహకారం అందిద్దామని కొంత మంది ముందుకొస్తే (వాళ్లు దాన్ని సున్నితంగా తిరస్కరించారు), ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రజాఉద్యమాన్ని నిర్మించాలని, ఆ ప్రయత్నంలో తాము కూడా భాగమవుతామని ఇంకొంత మంది ముందుకొస్తున్నారు. మరికొందరు దీన్ని అవకాశంగా తీసుకొని ప్రజాసంఘాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. వాస్తవంగా ఈ కేసు విషయంలో ఏం జరుగుతోందో చాలా కొద్ది మందికి తప్ప తెలీదు. అందువల్ల కూడా అనేక వైపుల నుండి ప్రశ్నలు వస్తున్నాయి. ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వక్రీకరణలు కొన్ని, ఉద్దేశపూర్వక ఆరోపణలు కొన్ని, అపోహలు కొన్ని కలగలిసి మరింత గందరగోళం ఏర్పడింది. ఒక న్యాయపోరాటం కొరకు అందరం కలిసి పనిచేయవలసిన అత్యవసర స్థితిలో ఇది వాంఛనీయం కాదు. అసలు జరుగుతున్నదేమిటో, మన చుట్టూ ఆవహించిన వాతావరణం ఎటువంటిదో తెలుసుకోవాలని కోరుతున్నాం.
2013 సెప్టెంబర్‌లో సాయిబాబా ఇంటిపై పోలీసులు రైడ్ చేసారు. ఆయన ఉంటున్న ఢిల్లీ యూనివర్సిటీ గ్వైర్ హాల్‌కు గడ్చిరోలీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొని మహారాష్ట్ర పోలీసులు, ఢిల్లీ పోలీసులు వచ్చారు. ఆహిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించబడిందని చెపుతున్న మాల్ (ప్రాపర్టీ)ని జప్తు చేయడానికని వారెంట్ తెచ్చి ఆయన స్టడీ రూమ్ నుండి పెన్ డ్రైవ్ లను, ఎలెక్ట్రానిక్ పరికరాలను, సాహిత్యాన్ని తీసుకెళ్ళారు. ఎన్ఐఎ సహకారంతో జరిగిన ఆ రైడ్ సాయిబాబా మీద కుట్ర రచనకు నాంది. ఆనాటి నుంచి ఆయనకు న్యాయ సలహా ఇస్తున్న ఒక సుప్రీంకోర్టు న్యాయవాది సూచనల ప్రకారమే సాయిబాబా కేసు నిర్వహణ గాని, బెయిల్ వేసే విషయంలో నిర్ణయం గాని జరుగుతున్నది. ఆయనకు ఆ న్యాయవాదిపై విశ్వాసం ఉన్నందునే డిఫెన్స్ కమిటీ కూడా ఆ విషయాన్ని గౌరవిస్తున్నది. నాగ్‌పూర్‌లో ఆయన కేసు వాదించిన సురేంద్ర గాడ్లింగ్ ఆయనతో రెగ్యులర్ సూచనలు తీసుకున్నాడు. ఈ ఇద్దరి నిర్ణయం, డిఫెన్స్ కమిటీ చైర్మన్ హరగోపాల్ నిర్ణయం తనకు ఆమోదయోగ్యమని ఇప్పటికీ సాయిబాబా అంటున్నాడు.
డిఫెన్స్ కమిటీ ముందు రాంజెఠ్మలాని పేరు వచ్చినప్పుడు అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆయన చేపడితే తాను సహకరిస్తానని సుప్రీంకోర్టు న్యాయవాది చెప్పింది. రాంజెఠ్మలాని ఎండకాలం సెలవులకు ముందే తాను చేస్తానని ప్రకటించి యూరప్ వెళ్లాడు. తిరిగి వచ్చి మనుషులను మరిచిపోవడమో, వసంత, హరగోపాల్లను గుర్తించకపోవడమో, విషయాలే మరిచిపోవడమో, ఇన్కోహెరెంట్గా మాట్లాడడమో చేస్తూ వచ్చాడు. చివరికి ఇరవై రెండు లక్షలు అడిగాడు. ఇప్పుడయితే ఆయన న్యాయవాద వృత్తి నుంచే విరమించుకున్నాడు. అట్లా అయిదు నెలలు వృథా అయింది.
సాయిబాబా కౌన్సెల్ అభిప్రాయం ప్రకారం జీవిత ఖైదు పడిన అయిదుగురిలో ఆయనపై నేరారోపణలకు కోర్టు అంగీకారం తీవ్రమైనది, కఠినమైనది. విజయ్ టిర్కీకి పది సంవత్సరాలే శిక్ష. కనుక ఆయనను మొదట, జీవిత ఖైదీల్లో సాపేక్షంగా బలహీనమైనవి తరువాత, అట్లా సాయిబాబాది చివరికి తీసుకోవాలి. ఇప్పటికీ ఆ న్యాయవాది అభిప్రాయం, సురేంద్ర గాడ్లింగ్ అభిప్రాయం అదే. దానిని కాదని సాయిబాబా సూచించినా, డిఫెన్స్ కమిటీ సూచించినా అట్లే చేయడానికి సురేంద్ర గాడ్లింగ్ సిద్ధంగా ఉన్నాడు.
అయితే రాంజెఠ్మలాని పేరు వచ్చినప్పుడు అంత కఠినమైన, తీవ్రమైన తీర్పు ఉన్న సాయిబాబా విషయంలో ఆయన రాగలిగితే ఇక మిగిలిన వాళ్లది సమస్య కాదు గనుక మిగతా వాళ్లకు కూడా మొదట అయిదు నెలలు బెయిల్ వేయలేదు.
ఇక్కడ మొదట పేర్కొనవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే 2017 మార్చ్ 8న తీర్పు వస్తే నెల రోజులు లోపలే సెషన్స్ కోర్టు తీర్పు అధికార పత్రాలు నాగ్‌పూర్ హైకోర్టుకు తెప్పించి అప్పీల్ వేసి అడ్మిట్ చేయించడం జరిగింది. శిక్ష సస్పెండ్ అయినాకనే హైకోర్టుకు శిక్షపడిన వాళ్లు (కాన్విక్ట్స్) అండర్ ట్రయల్స్ గా మారుతారు. అప్పుడే బెయిల్ వేసుకునే అవకాశం వస్తుంది. సాయిబాబాకు బెయిల్ పిటీషన్ కూడా తయారయింది. ఆయన కౌన్సెల్ చూసింది. ఆ కౌన్సెల్ సలహా పైనే అది ఫైల్ చేయకుండా ఆపడం జరిగింది. విజయ్ టిర్కీ బెయిల్ పిటిషన్ కూడా తయారైంది. అది హైకోర్టులో వేయడం జరిగింది.
అయిదు నెలలు గడిచి రాంజెఠ్మలాని రాడని స్పష్టం అయ్యాక ప్రశాంత్ రాహి సుప్రీంకోర్టు న్యాయవాది నిత్యా రామకృష్ణన్‌ను తన న్యాయవాదిగా పెట్టుకున్నాడు. ఆమె వచ్చి ప్రశాంత్ రాహి కోసం వాదించిన నాడు తాను విజయ్ టిర్కీ కేసు వాదించి ఆ స్థితిని బట్టి మిగతా వాళ్లది వాదించడానికి సురేంద్ర సిద్ధంగా ఉన్నాడు. సాయిబాబా విషయంలో ముందే చెప్పినట్లుగా అది ఆయన కౌన్సెల్ సూచనపై ఆధారపడి ఉంటుంది.
ఈ అయిదు నెలలుగా ప్రాసిక్యూషన్ తీసుకున్న వాయిదాల వల్ల, బెంచి వేసిన వాయిదాల వల్ల, ప్రశాంత్ రాహి న్యాయవాది రాలేకపోవడం వల్ల, అనారోగ్యం వల్ల ఆయన బెయిల్ పిటీషన్ కూడ ఇప్పుడు డిసెంబర్ 6కు వాయిదా పడింది.
నవంబర్ 6న విజయ్ టిర్కీ బెయిల్ పిటీషన్ వినవలసిందిగా సురేంద్ర అభ్యర్థిస్తే ప్రాసిక్యూషన్ తాము సిద్ధంగా లేమని, అది కూడా డిసెంబర్ 6కు వాయిదా వేయమని కోరింది. కోర్టు అనుమతించింది.
క్లుప్తంగా ఇదీ పరిస్థితి.
కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్ పిటీషన్ వేయడంలో చాల రిస్క్ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల్‌గా తీర్పుపై క్రిటికల్‌గా ఉండాలంటున్నాడు. ఆయన కౌన్సెల్ ఉద్దేశం కూడా అదే. పైగా ప్రభుత్వం ఆయనకు చికిత్స చేయిస్తున్నామని, నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకుపోతున్నామని, ఆయనేమో తనకు చికిత్స చేసిన రాక్‌ఫీల్డ్ ఆసుపత్రికి తీసుకుపోవాలని అంటున్నాడని, వెంట కుటుంబం, తన అడ్వకేటు కూడా ఉండాలంటున్నాడని, ఈ విధంగా ఆయన చికిత్సకు సహకరించడం లేదని కోర్టుకు చెపుతున్నది. జైలు వాళ్లు ప్రాణ రక్షకు మందులు, చలికి దుప్పటి కూడా ఇవ్వడం లేదని మనకు తెలుస్తున్నది. కోర్టు ప్రభుత్వం చెప్పిందే నమ్ముతున్నది.
ఆయన ఆరోగ్యం గురించి ఎన్ఎచ్ఆర్సి పంపించిన కమిషన్ నివేదిక ఏమయిందో మూడు నెలలైనా ఏమీ తేలలేదు. ఆ విషయమై వసంత చేసిన విజ్ఞప్తి మనం చూసే ఉన్నాం. కనుక మనం ఆయన ఆరోగ్యంపై ఎన్ఎచ్ఆర్సి నివేదిక వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేయాలి. ఉద్యమం చేయాలి.
లైఫర్కు తన స్వస్థానానికి వెళ్లే హక్కు ఉంటుంది. (మరింక ఏ కేసులు ఆయన మీద లేకపోతే.) కనుక హైదరాబాద్‌కు బదిలీకి పెట్టుకోమని ఆయనకు శిక్ష పడగానే సూచించాము. ఆయన జైలు ద్వారా రాసుకోవలసిందే. ఆయన ఆగస్టు 23న రాసుకున్నాడు. అది ఇంతకాలానికి పూనేలో ఉన్న అడిషనల్ ప్రిజన్స్ డిజిపికి చేరింది. ఈ విషయం హైదరాబాద్‌లో, ముంబైలో ఉన్న బాధ్యులు అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారని చెప్పడం కన్నా వివరంగా చెప్పలేం. డిఫెన్స్ కమిటీ చైర్మన్ కూడా తాను చేయగలిగిన కృషి ఈ విషయంలో చేస్తున్నాడు.
బయట ప్రచారం అవుతున్న సమాచారంలో తెలిసీ తెలియక చేస్తున్న వ్యాఖ్యలున్నాయి.
ఉదాహరణకు, నాగ్‌పూర్ మహారాష్ట్రలో ఉండవచ్చు గాని మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, కేంద్రం మూడు చోట్లా బిజెపి ప్రభుత్వంలో ఉన్నది. ఇది ఒక పార్శ్వం అయితే, మావోయిస్టు పార్టీ రాజకీయ నిర్మాణంలోను, ఉద్యమంలోను గడ్చిరోలీ జిల్లా దండకారణ్యంలో భాగం కావడం మరొక పార్శ్వం. కనుక మావోయిస్టు కేసుల్లో ఖైదీలను ఛత్తీస్‌ఘడ్ జైళ్లలో చూసినట్లే చూస్తారు. పైగా ఇది యుఎపిఎ మాత్రమే కాదు, ఎన్ఐఎ కేసు. కొన్నాళ్లుగా ముఖ్యంగా సాధనాల రామకృష్ణ (కలకత్తా), అతని సహముద్దాయిలు, సాయిబాబా, అతని సహ ముద్దాయిలపై కేసులను స్వయంగా ఎన్ఐఎ పర్యవేక్షిస్తున్నది. గతంలో మావోయిస్టులపై పెట్టిన కేసుల్లో ఎక్కువగా ఆయా రాష్ట్రాల పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ల కింద పెట్టినవే. యుఎపిఎ కింద పెట్టినవి కూడా ఎన్ఐఎ చేపట్టినవి చాలా తక్కువ. అటువంటి వాటిల్లో కూడా ఇంత త్వరలో తీర్పు వచ్చిన మొట్టమొదటి కేసు ప్రొ. సాయిబాబా, అతని సహచరులది. కనుక ప్రభుత్వం ఆయనపట్ల ఎంత కక్షగా ఉన్నదో ఊహించవచ్చు.
గతంలో ముస్లిం, మైనారిటీలు, కశ్మీరీల విషయంలో అవలంబించిన ఈ వ్యూహాన్ని ఇప్పుడు సాధనాల రామకృష్ణ కాలం నుంచి ఎన్ఐఎ మావోయిస్టు పార్టీ విషయంలో అవలంబిస్తున్నది. సాయిబాబాను వైట్ కాలర్ మావోయిస్టులకు గుణపాఠం చెప్పవలసిన ఒక ప్రతినిధిగా ఎంచుకున్నది అనేది స్వయంగా తీర్పు వెలువడిన రోజే ప్రాసిక్యూటర్ చెప్పాడు. ఇది వైట్ కాలర్ మావోయిస్టులకు గుణపాఠం అని.
స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సాయిబాబా గడ్చిరోలి, బస్తర్‌లలో 1982 నుంచి అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాడని ప్రకటనలు ఇచ్చి ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు ఒక ప్రముఖ దినపత్రికలో మావోయిస్టులపై ఆరోపణలు చేస్తూ సాయిబాబా పేరు ప్రస్తావించాడు. మరాఠీ మీడియా, మహారాష్ట్రలో హిందీ మీడియా ఆయన గురించిన ప్రచారం బెయిల్ తెచ్చుకోవడం కొరకని, కనుక ఆయనను ఉరితీయాలని రాస్తున్నవి. పయనీర్ సంపాదకుడు చందన్ మిత్రా కూడా ఈ తీర్పు ఇంతకాలానికి న్యాయం చేసిందని, కనుక ఈ విషయంలో బెయిల్ ఇచ్చి ఉదారవాదం ప్రదర్శించవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.
కనుక ఇది సోషల్ కాపిటల్ మీద ఆధారపడిన కేసు కాదు. ఇది పొలిటికల్ కాపిటల్ మీద ఆధారపడిన కేసు. సాయిబాబా ఆధారపడిన పొలిటికల్ కాపిటల్ సిలిండర్లలో ఆక్సిజన్ పేలేంత ప్రమాదకరంగా ఉన్నదని రాజ్యం భావిస్తున్నది.
నాగ్‌పూర్ ఎంఎల్ఎ క్వార్టర్స్ లో ఇండియన్ లాయర్స్ పీపుల్స్ అసోసియేషన్ (ఐఎల్పిఎ) కార్యవర్గ సమావేశం అయితే అది సాయిబాబా విడుదల గురించే అన్నంత ఉలికిపాటుతో బయట సంఘ్ పరివార్ శక్తులు సాయిబాబాను ఉరితీయాలని ప్లకార్డులతో నినాదాలు ఇస్తూ ప్రదర్శన చేశారు. సాయిబాబా విడుదల కోసం నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రదర్శన చేస్తే పోటీగా మఫ్టీలో పోలీసులు ఆయనను ఉరితీయాలని ప్రదర్శన చేశారు.
విప్లవోద్యమం దివాళాకోరుదైందైతే దాని ʹఅర్బన్ కనెక్ట్ʹ అని భావిస్తున్న సాయిబాబా విషయంలో రాజ్యం ఇంత కాఠిన్యం వహించేది కాదు. అందుకే ఎన్ఐఎ స్వయంగా రాసిందని మేం భావిస్తున్న ఈ తీర్పు ఆయన మెంటల్‌గా అలెర్ట్ గా ఉన్నాడని, అతనికి ప్రవాసమో, ఉరిశిక్షో వేయకపోవడానికి చట్టం తన చేతులు కట్టివేసిందని చెప్పింది.
ఇక్కడ ఎన్ఐఎ చేతులు చట్టం కట్టివేస్తున్నట్లు కనిపిస్తుంది కాని జైల్లోనే అతన్ని యుద్ధఖైదిగా చంపడానికి, దానిని మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారంగా ఉపయోగించుకోవలసినంత సోషల్ కాపిటల్నంతా ఉపయోగిస్తున్నదని మాత్రం స్పష్టం అవుతున్నది.
ఇంత కఠినంగా ఎందుకు రాయాల్సి వస్తుందీ అంటే ప్రచారంలో ఉన్న ఈ వాక్యాలు చదవండి...
ʹʹ...నిజాయితీగా మాట్లాడితే సాయిబాబా అమరత్వం కోసం వేయిట్ చేస్తున్నట్లుగా ఉంది. ఇది అఫెన్సివ్ స్టేట్మెంట్ గాని, ఇందులో వాస్తం ఉంది. అన్ఫార్చునెట్గా ఇది ప్రభుత్వ పరిపాలనలా ఉండదు కాని, ఎంక్వైరీ లా పెడితే చాల అలసత్వం బయట పడుతుంది. సాయిబాబా పోరాట స్థాయికి తగ్గ సోషల్ కాపిటల్ లేదు. తాను ఆధారపడిన ఆక్సిజన్ సిలిండర్‌లో ఆక్సిజన్ ఎంత ఉందో చూడకుండా సముద్రంలో దూకేసిన వ్యక్తి...ʹʹ
ఈ వాక్యాలు రాసిన వాళ్ల దృష్టిలో సాయిబాబా నమ్ముకున్న విప్లవోద్యమం ఖాళీ సిలిండర్. అది దివాళాకోరు విప్లవోద్యమం. ఇతడే ప్రింట్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్యను బట్టి అతడు ఈ రాతలు ఎందుకు రాస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.
ʹʹఈ తీర్పు మొత్తం ఒక నర్మదక్క చుట్టూ తిరుగుతుంది. కాని విచిత్రంగా నర్మదక్క ఈ కేసులో ముద్దాయి కాదు. ఆమెకు శిక్ష పడదు.ʹʹ
నర్మదక్క తల మీద వెల ఉందని ఈయనకు తెలియదా? గడ్చిరోలి ఉద్యమ బాధ్యురాలైన నర్మదక్క ద్వారా మావోయిస్టు జనరల్ సెక్రెటరీకి సాయిబాబా రాసిన లేఖ చిప్ పట్టుబడిందనేది ఆరోపణ. అందుకని, ఆ కేసు, ఆ తీర్పు ఆమె చుట్టు తిరిగింది.
ఇది రాసినతనికి అది తెలుసు. తెలియని సామాన్యుల కోసం ఈ వక్రీకరణ.
కనుక వాస్తవానికి ఇట్ల రాస్తున్న వాళ్లే ఆయన అమరత్వం కోసం ఎదురు చూస్తున్నట్లున్నది. ఆయన అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని, లేదా సోషల్ కాపిటల్‌గా వాడుకొని విప్లవోద్యమంపై, ప్రజాసంఘాలపై ముఖ్యంగా విరసం, సిఆర్‌పిపి, డిఫెన్స్ కమిటీలపై దాడికి పూనుకుంటున్నట్లున్నది.
విప్లవాభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఇటువంటి వక్రీకరణలను, అర్ధ సత్యాలను తోసిరాజని, ప్రొ. జి.ఎన్. సాయిబాబా, ప్రశాంత్ రాహి, హేమ్ మిశ్రాలతో పాటు ముగ్గురు ఆదివాసీ ముద్దాయిలు విజయ్ టిర్కీ, పాండు, మహేష్‌ల విడుదల కోసం ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
మన తక్షణ డిమాండ్స్, ముఖ్యంగా ప్రొ. జి.ఎన్. సాయిబాబాపై -
1) వెంటనే ప్రొ. జి.ఎన్. సాయిబాబాకు ఆయన డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన మందులన్ని రెగ్యులర్‌గా అందే ఏర్పాట్లు మహారాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఈ విషయమై తెలుగు సమాజం మహారాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తులు చేయవచ్చు. డెలిగేషన్గా వెళ్లి కూడా చేయవచ్చు. ఎస్ఎచ్ఆర్సికీ చేయవచ్చు. మళ్లీ ఎన్ఎచ్ఆర్సికి ఆరోగ్య నివేదిక గురించి విజ్ఞప్తి చేయవచ్చు.
2) ప్రొ. జి.ఎన్. సాయిబాబా కోరుకున్నట్లుగా ఆయనను చర్లపల్లి జైలుకు మార్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతించాలని కూడా మహారాష్ట్ర గవర్నర్‌కు రిప్రజేంటేషన్ చేయవచ్చు. ఈ విషయమై వెంటనే తెలుగు సమాజంలోని ప్రముఖ ప్రజాస్వామ్యవాదులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు పూనుకోవచ్చు.
3) ఈరోజు (9 నవంబర్) హిందూలో కల్పన కన్నబిరాన్ రాసినట్లు ఈ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు న్యాయవ్యవస్థ స్పందించేలా ఏమీ చేయవచ్చునో ఆలోచించి స్పందించవచ్చు.
Type in English and Press Space to Convert in Telugu |
దండకారణ్యంలో... నక్సల్బరీ 50 వసంతాల వేడుకలునక్సల్బరీ వారసులైన దండకారణ్య మావోయిస్టు విప్లవ కారులు జనతన సర్కార్ నేపథ్యంలో తమకు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్రజలకూ, ప్రపంచ..... |
యాభై వసంతాల అజేయశక్తి నక్సల్బరీఏప్రిల్ 22న శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో విరసం బహిరంగసభ. కామ్రేడ్స్ వరవరరావు, పాణి, కాశీం వక్తలు. ... |
International Seminar on Nationality QuestionAIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky... |
విరసం సాహిత్య పాఠశాలరాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య... |
నోట్ల రద్దు ప్రగతి వ్యతిరేకమైనది : ప్రసాద్విరసం సాహిత్య పాఠశాల (11, 12 ఫిబ్రవరి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల రద్దుపై ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగం... |
సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాంమానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్ విప్లవం. ఈ నవంబర్ 7 నుంచి రష్యన్ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ... |
ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండిఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ... |
Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 1When we look at the lives of these women martyrs many things strike us as extremely significant.The NDR in India is led by the Working class and peasantry..... |
నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమంనక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా....... |
ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాంవిరసం వ్యవస్థాపక సభ్యుడు కా. వరవరరావుపై రాజ్యం మరో కుట్ర కేసు మోసింది. ఈసారి ఏకంగా ఈ దేశ ప్రధానిని హత్య చేయడానికి కుట్రపన్నాడని ఆరోపించింది. కవిగా, అధ్యాపకు... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |