ఇప్పుడెందుకీ ʹబాహుబలిʹ

| సంభాషణ

ఇప్పుడెందుకీ ʹబాహుబలిʹ

- నల్లూరి రుక్మిణి | 17.11.2017 11:57:57pm

ʹబాహుబలిʹ సినిమా వచ్చినప్పటినుండీ తెలుగు సినిమా రంగం, తెలుగు ప్రేక్షకుల ʹవెర్రిʹ చూస్తుంటే - ఎటుపోతున్నాం మనం అనే దిగులు కమ్ముకుంది. అప్పటి నుండీ పడుతున్న ఆవేదన ఎలాగో నన్నునేను సముదాయించుకుంటూ ʹఇంతేలేʹ లోకం అనే జీవన సిద్ధాంతంతో ముడిపెట్టుకుంటూ వస్తున్నాను.

అయినా సరే సర్దుకోలేని స్థితిని చంద్రబాబు కల్పించాడు.

రాజమౌళి ఎలియాస్‌ జక్కన్నను రాజధాని రూపకల్పనకు తగు సలహాలు యిస్తాడని ప్రత్యేకంగా ఆహ్వానించడం చూస్తుంటే మనుషులింత డొల్లతనంగా తయారవటం ఏమిటి విచిత్రం? కాలమహిమా లేక మాయామశ్ఛీంద్రలా మసిపూసి మారేడుకాయ చేయటమా?... అనిపిస్తుంది.

రాజధాని రూపకల్పన తర్వాత చూద్దాం... అంతర్జాతీయ రాజధానికి బాహుబలి దర్శకుడు చేసేదేమిటి? దీన్ని కూడా కొంచెం ఆగి ఆలోచిద్దాం. అసలు దానికంటే ముందు బాహుబలిలో ఏముంది? దానికి రాజమౌళి చేసిన మంచేమిటి? చేర్పులేమిటి? సమాజానికి చేసిన మేలేమిటి? దాని గురించి ఆలోచిద్దాం.

కథాపరంగా చూద్దామంటే - పాత డొక్కు కథ. అన్నదమ్ములూ, రాజ్యం గొడవే. అప్పట్లో అన్న దృతరాష్రుడు గుడ్డివాడు, ఇక్కడ అవిటివాడు. అక్కడ ఫ్యూడల్‌ రాజులు కనుక తండ్రి పేరుతో కొడుకు రాజ్యం చేస్తాడు. ఇక్కడ భార్య రాజ్యం చేస్తుంది. మరి ఇది ఏనాటి సంప్రదాయమో తెలియదు. మాతృస్వామ్య వ్యవస్తొకటి వేళ్ళూనుకుని స్థిరపడిందనుకుంటే కూడా ఆనాడు రాజులు, రాజ్యాలు లేవు. ద్రౌపది, సీతల అవమానాల కథలే భారత, రామాయణాలు. మరి ఇదెక్కడి ఆడవాళ్ళరాజ్యం రాజమౌళీ?... చరిత్రలోలేని, వ్యవస్థలులేని ఆడవాళ్ళ రాజ్యం ఎక్కడ శిఖిపింఛమౌళీ?... కేరళలోనా?, ఈశాన్య భారతంలోనా? అక్కడ నువ్వు చూపించిన వైభవోపేత రాజ్యాలు ఈనాటికీ లేవే?... అట్టా వుట్టికీ, స్వర్గానికీ లేని కాలాన్నీ, వస్తువును తీసుకుని... అదో గొప్ప కల్పితగాథను తయారుచేసి స్త్రీల ఆధిపత్యాన్ని చూపించినట్టు గొప్ప ఫోజేగాని - మిగిలిన ఆడవాళ్ళకు నువ్వు చేసిన పరాభవం ముందు ఇదెంతా?

ఇక కథేమిటీ? కట్టుబానిస కట్టప్ప... ఆ పాత్ర ఎంత కృత్రిమమైందీ? చరిత్రలో, రాచరికాల్లో కన్నతండ్రిని నరికి రాజ్యానికి వచ్చిన కొడుకులున్నారు. రాజు ఉప్పు తిన్నందుకు ప్రాణాలిచ్చి కాపాడిన సైనికులున్నారు. కాని రాజ్యానికి కట్టుబడి వున్నాననే నెపంతో ఇష్టంలేకపోయినా వెన్నుపోటు పొడిచిన మనుషులు లేరు. అలా పొడిచి వుంటే ఆ రాజ్యం వాడి స్వంతమై హక్కుభుక్తమవుతుందనే ఆశ వుంటేనే! అంతే తప్ప - చివరికి ప్రహ్లాదుడుని చంపమని తండ్రి స్వయంగా అప్పగించినా - సైనికులు చేతులారా ఆ బిడ్డను చంపలేక వదిలేసి వచ్చారు. వాళ్ళు సైనికులే కాదు, మనుషులు ముందు. కాని రాజమౌళి కట్టుబానిస కట్టప్పతో కనీసపు మానవ విలువలను అవహేళన చేయించాడు. ʹʹమామాʹʹ అని నోరారా పిలిచినవాడిని పొడిచిపారేయించి, కథకోసం - విలువల విధ్వంసాన్ని సృష్టించాడు. అట్లా విలువల విధ్వంసం చేసిన కనీసపు సాంఘిక బాధ్యత లేనివాడు రాజమౌళి. నిజానికి కట్టప్ప పాత్ర తల్చుకుంటే మహా రోతపుడుతోంది. అచ్చం ఈనాటి లంపెన్‌ ʹచంపుడుముఠాʹ కోరిలాగా వున్నాడు తప్ప. కనీసపు ఫ్యూడల్‌ సైనికుడి విలువలు ఏ మాత్రం లేనివాడు. ఇలాంటి భావ దారిద్య్రపు దర్శకుడిని గొప్పచేస్తూ మోదీ దగ్గర నుండి చంద్రబాబుదాకా ఆకాశానికి ఎత్తివేయడం వెనుక ఈ రాజకీయ నాయకుల దొంగ ప్రమాణాలు ఎలాంటివో అర్థం చేసుకోవాల్సి వుంది.

ఇక సినిమా తీయడం గురించి - ఈ సినిమాకు ఆస్కార్‌ ఎంట్రీ కూడా రాకుండా పోవటం చాలా ఆనందించదగ్గ విషయం. ఇంకా సినిమా ప్రపంచంలో అక్కడక్కడా కొన్ని ప్రమాణాలు మిగిలి వున్నాయనే ఆశను కలిగించింది.

సినిమా ప్రారంభం నుండి చివరిదాకా - అంతా ʹకాపీʹ కొట్టటమే. ప్రేక్షకులదేముందీ? ఆ రెండు గంటలూ నిశ్చింతగా చూడాలనుకుంటారు. వారికి సినిమా నుండి నేర్చుకునేదేమీ వుండదని ఏనాడో తేల్చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. యాతా వాతా నేర్చుకున్నా - ప్రేమపేరుతో టీనేజ్‌ లవ్‌. ఈ టీనేజ్‌ సినిమాలు - ఏకపక్షప్రేమలూ, ఈవ్‌టీజింగ్‌లు, బలవంతపు అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు, హత్యలు, ఆత్మహత్యలు - ఇదే ఈ రోజు తెలుగు సినిమా రంగం సమాజానికి నేర్పిస్తున్న ʹమహత్తరʹ విషయాలు. వ్యాపారం పేరుతో వీళ్ళు చేస్తున్న ఈ నీచ ప్రచారాలకు, తెలుగు సినిమా నిర్మాతలను ముందు సాంఘిక బహిష్కరణ చేయాలి.

బాహుబలిలో అవంతికను తెరమీద లైంగిక ప్రక్రియ ఒకటి చూపలేదనే కానీ - గుడ్డలూడదీచేసి అన్నంతపనీ చేసారు. హాల్లో కూర్చున్న సగటు ప్రేక్షకులు మానసికంగా, శారీరకంగా ఆ పని చేసేసుకున్నారు. అదీ బాహుబలి సాధించిన ఘన విజయం.

ముఖ్యంగా ʹఅవతార్‌ʹ సినిమా సీన్లు కాపీ కొట్టటంలో ఎంతో ʹవిజయవంతʹమయ్యాడు దర్శకుడు. పైగా అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకుపోయిందని నిస్సిగ్గుగా మీడియా, ప్రింట్‌మీడియాలు ప్రచారాలు. సినిమా ప్రపంచం నవ్విపోతుందనే ఇంగితం కూడా లేదు. శివలింగాన్ని ఈ రోజు ప్రభాస్‌ ఎత్తేదేమిటి? దానికంటే ఏ టెక్నాలిజీ పెరగని రోజుల్లో ʹభూకైలాస్‌ʹ లో ఎన్‌.టి.ఆర్‌ ఇంతకంటే సహజంగా ఎంతో బాగా చేసాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆవేశపూరిత సన్నివేశాలతో ప్రేక్షకుల మనస్సులను తాత్కాలికంగా కలుషితం చేయడం, ఈ బాహుబలి చేసిన హీన అనుకరణ.

ʹʹశిశుర్వేత్తి, పశుర్వేత్తిʹ - అని అన్ని రకాల జీవులను ఆనందింపచేయటానికి, తద్వారా మానసిక ఔన్నత్యాన్ని కలగచేయడం లక్ష్యంగా గల సంగీతం ఈ రోజు ఆవేశానికి, హింసకు ప్రేరణగా వాడబడుతోంది. బాహుబలిలో నలుగురు డాన్సర్లతో ఆ ʹʹతాగుబోతుʹʹ దుకాణంలో చేసిన ఆ విన్యాసాల అర్థం ఏమిటి? సెన్సార్‌వాళ్ళ కళ్ళకు కనబడటం లేదా? అది నిజంగా ఆర్ట్‌ పీసేనా? ప్రభాస్‌ నలుగురు కన్యలతో చేసిన ఆ డాన్సులు ఎక్కడో పాత ʹకామాటిపురʹ లో జరిగేవని విని వున్నాం. అయితే అవి ఆ నాటి వేశ్యావాటికలు. ఆ వేశ్యావాటికలు ఎంతో గంభీరంగా సెక్స్‌ ఎడ్యుకేషన్‌కి - సమాజం అనైతిక వికృతి చేష్టలకు నిలయంగా మారకుండా వుండడం కోసం ఏర్పడ్డ ʹసేఫ్టీవాల్వుʹలాంటివి. కాని ఈ రోజు అలాకాదు. అలాంటి గంభీరమైన స్థావరాలేవీ లేవు. అలాంటి విలువలూ లేవు. కేవలం శరీర వ్యాపారాలు, ఎయిడ్స్‌ కేంద్రాలు మాత్రమే. మరి ఈ సంస్కృతి ఏ సినిమాలవల్ల వ్యాపిస్తోంది? భారతదేశంలో 70శాతం చదువులేని మామూలు మనుషులకి - కడుపు నింపుకోవటం, కోరిక తీర్చుకోవటమనే - సాధారణ ఆలోచన వున్న సగటు మనిషికి ఈ సినిమాలు ఏం చూపిస్తున్నాయి? బాహుబలిలో అంతకంటే మించి చూపించిందేమిటి? అవంతికకు గుడ్డలూడదీయటం, అనుష్కాను హంసవాహనంలో గాల్లో ఎగిరిపోయే డ్యూయెట్‌ పెట్టటం - అంతకు మించి ఆ రెండు పాత్రలు సాధించిందేమిటీ? వాళ్ళు సాధించారా? లేదా అనేది కాదు ప్రశ్న- ప్రేక్షకుడి మనస్సులో మిగిలిన ముద్ర ఏమిటన్నది జవాబు.

ఈలాంటి బాహుబలిని తెలుగు సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకుపోయిందని ఆకాశంలో ఎగిరే గాలి బెలూన్‌లా చేసి - తెలుగు సినిమాను అవహేళన చేయించాడు. బీదలపాట్లు, రాజు - పేద, మాలపిల్ల, మాయాబజార్‌ వంటి సినిమాలు సమాజానికి ఎంత సందేశాన్నిచ్చాయీ? ఆఖరుకు వీరు కాపీ కొట్టిన ʹఅవతార్‌ʹ సినిమా సహితం ప్రపంచానికి ఎంత సందేశాన్ని ఇచ్చింది. దానిలోనూ ప్రేమను చూపించారు. అసలు ఆ పాత్రలకు బట్టలు లేవు. కానీ లేనట్లు ఎక్కడైనా వుందా?

దుర్మార్గులైన సామ్రాజ్యవాదులు తమ గ్రహంమీదకు దండెత్తి నాశనం చేయాలనుకుంటే - ఆ గ్రహవాసులు ఎట్లా దాన్ని ఎదుర్కొన్నారు? ప్రకృతిని ఎలా కాపాడుకోవాలనుకున్నారు? ఆ గ్రహాంతరవాసులకు సహాయం చేయటం కోసం తమ గ్రహం నుండి కూడా మనుషులు ఎలా సహాయపడ్డారు. ఆ క్రమంలో ఇరుగ్రహాల మధ్య జంటకు ఎలా భావసారూప్యం ఏర్పడింది? ఎంత అద్భుతంగా తీశాడు ఆ డైరెక్టరు. చివరికి ఆ గ్రహవాసులు విజయం సాధించడంలో శత్రుగ్రహంవాళ్ళు కూడా ఎలా సహాయపడ్డారో చూపించి - గొప్ప సామాజిక సినిమాను ప్రపంచం ముందు నిలబెట్టాడు జేమ్స్ కామెరూన్.

కాని మన రాజమౌళి అన్నదమ్ముల, అత్తాకోడళ్ళ పాత చింతకాయపచ్చడి (ఇంకా భారతదేశం ఫ్యూడల్‌ భావజాలంతో కునారిల్లుతోందనే దానికి నిదర్శనం) కథను - టెక్నాలిజీని బాగా కాపీ కొట్టటంలో ఆరితేరిన దిట్టగా మిగిలాడు. ఆ సినిమాను పొగడటంలో రాజుగారి మాయావస్త్రాల పొగడ్తలమాదిరి - అందరూ ఎంతో జబ్బలు చరుచుకుంటూ పోటీలు పడ్డారు.

సినిమా వచ్చిందీ? పోయిందీ? ఇప్పుడెందుకీ రభస అనుకోవచ్చుకానీ - అసలు కథ ఇప్పుడే మొదలైంది. అందుకే దీనిమీద జనం ఆలోచించాలనుకుంటున్నాను.

రాజమౌళి ఇంజనీర్‌ కాదు, శాస్త్రవేత్తకాదు, కనీసం కళాకారుడు కాదు - సామాజిక స్పృహ అసలే లేనివాడు. కేవలం తన సొంత కీర్తికోసం అన్ని విలువలను తుంగలో తొక్కి సినిమా కాపీ మసాలాతో వండినవాడు. ఈ రోజు ఇతనే రాజధాని నిర్మాణంలో సలహాదారుడవుతాడు, రేపు ఇతనే రాజధాని నిర్మాణ నిపుణుడు అవుతాడు. ఎల్లుండి ఇతనే ఈ రాజ్యాన్ని ఏలగల సత్తాగలిగిన బాహుబలి అవుతాడు. ఇలా ముందు ముందు రాబోయే ప్రమాదాన్ని జనం గ్రహించాలి.

ఇప్పటికే ఈ రోజు పాలకులు తమ తప్పిదాలకు మై పూతగా సాహిత్యాన్నీ, సంస్కృతిని వాడుకోవాలని తహతహలాడుతున్నారు. అందుకు కవులు, కళాకారులూ ఎగబడి తమ సహకారాన్ని అందిస్తున్న అవమానకర రోజులు ప్రారంభమయ్యాయి. విలువల రాహిత్యంతో రాజకీయ రంగం పుచ్చిపోయింది. నీతిలేని సమాజాన్ని నిస్సిగ్గుగా స్థిరపరచాలని చూస్తున్నారు. అందుకు ఇలాంటి దర్శకుల నైతిక మద్ధతుకూడా తోడైతే ఇక సామాన్యజనం ఆలోచనలకు, బ్రతుకులకు విలువలేకుండా పోతుంది. సంస్కృతి పేరుతో జరగబోయే ఈ ప్రమాదాన్ని తెలుగుజాతి కళ్ళు తెరిచి చూడాలని నా కోరిక.

No. of visitors : 986
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కాలా ఎందుకు చూడాలి ?

నల్లూరి రుక్మిణి | 03.07.2018 01:59:24pm

ʹభూమి మీకు అధికారంʹ ʹభూమి మాకు హక్కుʹ ʹభూమి మీకు సంపదʹ ʹభూమి మాకు జీవితంʹ వంటి సంభాషణలు - అది గుడిసెవాసుల పోరాటమే కావచ్చుగాని నేలకు సంబంధించిన సార్వజనీన.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  తుఫాను బాధితులకు సాయం చేయడం కూడా నేరమేనా?
  ఎప్పటికప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టి బతికేస్తున్నారు
  కుట్ర
  జర్నలిస్టు జమాల్‌ అహ్మద్‌ ఖషోగి హత్య
  నామ్ కే లియే
  వరి గొలుసుల మార్మిక సవ్వడి
  ఆఖరున కలుసుకున్నాం - అమరత్వాన్ని చూసాం
  చర్చనీయాంశం గద్దరా? విప్లవోద్యమమా?
  పిడికెడు ఆత్మగౌరవం కోసం
  పీక‌ నొక్కు సిద్ధాంతం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •