తెలుగు భాషనే ఊపిరిగా పీలుస్తున్న చెన్నైవాసి

| సాహిత్యం | స‌మీక్ష‌లు

తెలుగు భాషనే ఊపిరిగా పీలుస్తున్న చెన్నైవాసి

- వి. చెంచయ్య | 18.11.2017 12:26:42am

తెలుగు భాషా సంజీవరావు గారి ʹతెలుగు పదసోపానంʹ ప్రత్యేకంగా చెప్పుకోదగింది. తెలుగువాడైన సంజీవరావు చెన్నైలో ఉంటూ, అక్కడే ఉద్యోగం చేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందినవాడు. విశ్రాంత జీవితంలో కూడా అవిశ్రాంతంగా తెలుగు భాషాభివృద్ధి కోసం తపిస్తున్నవాడు. తమిళనాడులో తెలుగు వాచకాల్లోని తప్పుల్ని సవరించాలని ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోతే కోర్టులో కేసు వేసి విజయం సాధించిన పట్టుదల గల వ్యక్తి. తెలుగు, హిందీ, సంస్కృతం, తత్వశాస్త్రం, భాషాశాస్త్రం మొదలైన విషయాలలో ఎం.ఎ. చేసి సంపాదించిన భాషాజ్ఞానాన్ని సాధారణ తెలుగు పాఠకులకు అందించడమే ధ్యేయంగా పెట్టుకున్న భాషావేత్త. తెలుగు భాషలో మెలకువలు, గాడితప్పిన చదువులు, తెలుగు భాషంటే అలుసా?, తెలుగు భాష ప్రాచీన హోదా - ఒక విహంగ వీక్షణం మొదలైనవి వీరి ఇతర రచనలు. తెలుగు విద్యార్థులు, పత్రికా విలేకరులు, ఉపాధ్యాయులు, రచయితలు అందరికీ ఉపయోగపడే విధంగా చేసిన రచనలివి. ప్రస్తుతం వీరి ʹతెలుగు పదసోపానంʹ గురించి తెలుసుకోవడం ఈ వ్యాసం ఉద్దేశం. పేద విద్యార్థుల ప్రయోజనం కోసం ఏర్పడిన ʹచెన్నపురి తెలుగు వాణిʹ అనే సంస్థ దీనిని 2011లో ప్రచురించింది. సంవత్సర కాలంగా వీరు ʹచెన్నై తెలుగు ప్రకాశంʹ అనే త్రైమాస పత్రికను నడుపుతున్నారు.

తెలుగు భాషను సంబంధించిన అనేక విషయాల్ని సంజీవరావు ఈ 80 పేజీల పుస్తకంలో అద్దంలో చంద్రుడిలాగా వివరించడానికి ప్రయత్నించాడు. వర్ణవిభాగం, పద విభాగం, అర్థం - అనర్థం, వాక్యనిర్మాణ విభాగం, పారిభాషిక పదాలు, అనుబంధం అని ఆరు భాగాలుగా విషయ వివరణ ఉంది. తెలుగులోని అచ్చులు, హల్లులతో మొదలై, పదనిర్మాణ వాక్యనిర్మాణ విశేషాలతో, నానార్థ పర్యాయ పద వివరాలతో, పదాల వ్యుత్పత్యార్థాలతో, సంధి సమాసాల ప్రత్యేకతలతో, పదాల వాడుక సరిగ్గా తెలియకపోతే వచ్చే అనర్థాల వివరణలతో, శబ్దాల గుణదోషాలతో, జాతీయాలు, నుడికారాలు, సామెతలు, ధ్వన్యనుకరణ శబ్దాలు ద్వంద్వపదాల స్వరూపాలతో ఈ పుస్తకం సంక్షిప్తమే అయినా సమగ్రంగా ఉన్న నిఘంటువు లాంటిది.

అయితే ఈ పుస్తకంలో అక్కడక్కడా కొన్ని పొరబాట్లూ, కొన్ని అస్పష్టతలూ, కొన్ని భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి. వీటిని గురించి కూడా కొంత చర్చించడం అవసరమని భావిస్తున్నాను. ప్రతిదానికీ కొన్ని నియమాలున్నట్టే భాషకు కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా ఉంటాయి, ఉండాలి కూడా. అయితే ఆ నియమాలు ఎట్టి పరిస్థితిలోనూ మార్చడానికి వీల్లేని కఠోర నియమాలుగా ఉండకూడదు. ఈ నియమాల్ని వివరించేవే వ్యాకరణాలు. ముందు భాష పుట్టి తర్వాత వ్యాకరణం పుడుతుందిగాని, ముందు వ్యాకరణం పుట్టి తర్వాత భాష పుట్టదు. భాష పుట్టేటప్పుడే కొన్ని నియమాలతోనే పుడుతుంది. లేకపోతే ఒకరి మాటలు ఇంకొకరికి అర్థంగావు. ఈ నియమాన్ని స్థిరికరించి లిఖితరూపంలో వివరించేవి వ్యాకరణాలు కాలక్రమంలో భాషలో మార్పులు రావడం సహజం. ఆ మార్పులు మన వ్యవహార సౌలభ్యం కోసం వచ్చేవే. వీటిని గుర్తించి వ్యాకరణాలు రికార్డు చెస్తే అవి కూడా భాషలాగా సజీవంగా ఉంటాయి. లేకపోతే వ్యాకరణాలు చరిత్రలో భాగం అయిపోతాయి. మన సంప్రదాయ వ్యాకరణ చాలా వరకు ఇలా చరిత్రలో భాగంగా మిగిలిపోయినవే. అవి గ్రాంథిక భాషను దాటి ముందుకు రాలేకపోయాయి. గ్రాంథిóక భాషలో కూడా కవులు స్వతంత్రించి భావస్ఫోరకంగా చేసిన ప్రయోగాలను తప్పు బట్టాయి. ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో రోసీరోయదు, చేసి చేయదు లాంటి ప్రయోగాలు చేశాడు. గ్రాంథిక భాషానియమం ప్రకారం అయితే రోసియ రోయదు, చేసియు చేయదు అనేవి. ఈ రెంటిలో ఏది భావస్ఫోరకంగా ఉందో తెలుస్తూనే ఉంది. నన్నయలాంటి గొప్పవాడు కాబట్టి వాటిని మనం అంగీకరించాలనీ చిన్నయసూరి అన్నాడు. పోతన కవిత్వంలో భాషాఛందో దోషాలున్నాయని అప్పకవి అన్నాడు. వ్యాకరణవేత్తలు నియమాలతో భాషను ఎంత కట్టుదిట్టం చేసినా, అవసరమైనప్పుడు వాటిని కవులు అతిక్రమిస్తూనే ఉన్నారు. అలా అతిక్రమించడం తప్పు అని వ్యాకరణవేత్తలనడం సరైంది కాదు. ఈ విషయంలో ఆధునిక భాషాశాస్త్రం సరైన దారిలో నడుస్తోందని చెప్పొచ్చు.

సంధిని గురించి చెబుతూ రచయిత ఒకచోట రెండక్షరాల కలయికలను సంధి అంటారన్నాడు. మరోచోట రెండు పదాల కలయికను సంధి అంటారన్నాడు. ఇవి చిన్న విషయాలే కావచ్చుగాని పాఠకులలో అస్పష్టత ఏర్పడుతుంది. అయితే రెండు పదాల కలయికను సంధిగా పేర్కొనడంలో రచయిత చూపించిన సాహసం సామాన్యమైంది కాదు. ఎందుకంటే సంప్రదాయ వ్యాకరణాలు సంధి నిర్వచనాన్ని చాదస్తంగా చెప్పాయి. చిన్నయసూరి రెండచ్చుల మధ్య జరిగేదే సంధి అన్నాడు. ఒక అచ్చుకూ, హల్లుకూ, లేదా రెండు హల్లుల మధ్యా జరిగేది సంధి కాదని ఆయన అభిప్రాయాం. నిజానికి ఈ రచయిత చెప్పిన రెండు పదాల కలయిక సంధి అన్నది అన్ని సందర్భాలకూ సరిపోయే నిర్వచనం. సంధి అంటేనే రెండిటి కలయిక. అవి అచ్చులు కావచ్చు హల్లులు కావచ్చు. అచ్చుల మధ్య జరిగేదే సంధి అని చెప్పిన చిన్నయసూరి హల్లుల మధ్య జరిగే మార్పులను కూడా సంధి పరిచ్ఛేదంలోనే ఇవ్వలసి వచ్చింది.

రచనల గ్రాంథిóక భాషనుండి వ్యావహారిక భాషకు మారిన తర్వాత భాషలో కొన్ని మార్పులు జరిగాయి. వాటిలో ఒకటి - పదం మొదట్లో వచ్చే ఇ, ఈ, ఎ, ఏల స్థానంలో యకారాన్ని వాడడం ఉ, ఊ, ఒ, ఓల స్థానంలో వకారాన్ని వాడడం. అంటే ఇప్పుడు, ఇది, ఏది, ఎవరు మొదలైన పదాల్ని యిప్పుడు, యిది, యేది, యెవరు అనే విధంగా రాయడం. అలాగే ఉన్నాడు, ఊరు, ఒక్కడు, ఒత్తిడి మొదలైన పదాల్ని వున్నాడు, వూరు, వొక్కడు (వక్కడు), వొత్తిడి (వత్తిడి) మొదలైన విధంగా రాయడం. నిజానికి ఉచ్ఛారణ ప్రకారం అయితే యకార వకారాన్ని చేర్చి రాయడమే కరక్టు. పదాల మొదట్లో ఉన్న ఈ అచ్చుల్ని కేవలం అచ్చులుగా పలకడం సాధ్యం కాదు. పైగా అలా రాయడం అలవాటయ్యాక దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఈ రచయిత దీన్ని తప్పుబట్టడం గ్రాంథిక భాషా ప్రభావమే. అలాగే ఋ, ౠ, ఏ, ఐ అనే అచ్చుల స్థానంలో ర, ల అనే హల్లుల్ని ఉపయోగించడం కూడా ఇలాంటిదే. ఇవాళ ఋ అనే అచ్చునయినా కొందరు ఋషి, ఋణము లాంటి పదాలలో ఉపయోగిస్తున్నారు కాని ఏ, ఐ అనే అచ్చుల్ని గ్రాంథిక భాషాభిమానులు కూడా ఉపయోగించడం లేదు. ఋషిని, రుషిగా, ఋణాన్ని, రుణంగా రాసినంత మాత్రన వచ్చే నష్టం ఏమీ లేదు.

తెలుగు ప్రధానంగా ధ్వన్యాత్మక లిపి కలిగిన భాష, అంటే ప్రతి ధ్వనికీ ఒక లిపి సంకేతం ఉండడం. తమిళంలో క, ఖ, గ, ఘలకు కలిపి ఒకే లిపి సంకేతం ఉంది. అందుకే తమిళంలో తెలుగులో ఉన్నన్ని వర్ణాలు లేవు. తెలుగులో 56 వర్ణాలుంటే ఇంగ్లీషులో 26 వర్ణాలే ఉన్నాయి. ఇంగ్లీషులో ప్రతిధ్వనికీ ఒక లిపి సంకేతం అనే పద్ధతి లేదు. అందువల్ల ఒక లిపి సంకేతానికే అనేక ధ్వనులుంటాయి. ఉదాహరణకు C ని ఒక చోట సకారంగా (Face), ఒక చోట కకారంగా (Cut) పలుకుతాం. ఇంగ్లీషు లిపి ధ్వన్యాత్మక లిపి కాదు, నిజానికి తెలుగు కూడా నూరుశాతం ధ్వన్యాత్మక లిపి కాదు. ʹతాటాకుʹ అనే పదంలోని ʹటాʹ లోని అచ్చును ʹఆʹ అని కాకుండా భిన్నంగా పలకడాన్ని గమనించవచ్చు. ఇలాంటి కొన్ని లోపాలు తెలుగు లిపిలోనూ ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలోని ఏ భాషకూ ధ్వనులు ఎన్ని ఉన్నాయో అన్ని లిపి సంకేతాలు నూరుశాతం లేవు. ఈ లోపం వల్ల మనకు తెలియని కొత్త భాషను పరిశీలించాలంటే, లేదా మన భాషనే శాస్త్రీయంగా పరిశీలించాలంటే, లేదా ఉన్న ధ్వనుల్ని ఉన్నట్టుగా రికార్డు చెయ్యాలంటే ప్రపంచంలోని ఏ భాషా లిపీ పనికి రాదు. కాబట్టి భాషాశాస్త్ర వేత్తలు International Phonetic Alphabet తయారు చేశారు. ఇందులో చాలా లిపి సంకేతాలుంటాయి. ప్రపంచంలోని ఏ భాషనయినా వాళ్ళు పలికినట్టుగా దీని ద్వారా రికార్డు చెయ్యొచ్చు. అందుకని అన్ని భాషలా ఈలిపినే వాడుకోవచ్చు గదా అంటే అది ఆచారణలో సాధ్యం కాదు. శతాబ్దాల తరబడి అలవాటయిన పద్ధతి అశాస్త్రీయమైనా సులభంగా ఉంటుంది, ముఖ్యంగా భాషల విషయంలో భాషకున్న ఈ స్వభావాన్ని గుర్తిస్తే భాషలో వచ్చే మార్పున్ని సులభంగా అంగీకరించగలం.

ఈ రచయితతో నాకున్న మరొక ముఖ్యమైన పేచీ ఏమిటంటే ʹగ్రామ్యంʹ అనే భావన (Concept) గురించి. గ్రామ్యం అనేది గ్రాంథిక భాషావాదులైన వ్యాకరణవేత్తలు ఉపయోగించున మాట: గ్రాంథిక భాషా వ్యాకరణ విరుద్ధాలైన పదాల్ని గ్రామ్య పదాలన్నారు వీటిని కూడా నింద్యగ్రామ్యాలనీ, అనింద్య గ్రామ్యాలనీ రెండు రకాలుగా విభజించారు. గ్రాంథిక భాషా వ్యాకరణ నియమాలకు విరుద్ధంగా ఉండే పదరూపాలను అంటే వ్యావహారిక భాషా పదరూపాలను నింద్య గ్రామ్యాలన్నారు. దీన్ని బట్టి వ్యావహారిక భాషా స్వరూపం మొత్తం నిందించదగిన గ్రామ్యభాష అవుతుంది. ప్రచార ప్రసార సాధనాల్లోనూ, అన్ని రచనల్లోనూ వ్యావహారిక భాషనే ఉపయోగిస్తున్నా ఈ రోజుల్లో ఈ గ్రాంథిక భాషా చాదస్తం అవసరం లేదనుకుంటాను. ఇక ప్రాచీన కవులు తమ గ్రంథాలలో ఉపయోగించిన వ్యాకరణ విరుద్ధాలైన పదాల్ని అనింద్య గ్రామ్యాలన్నారు. అవి గ్రామ్యపదాలే కానీ, నిందించదాగినవి కాదన్న మాట. ఒక విశేషం ఏమిటంటే ʹతెలుగు పదసోపానంʹ రాసిన ఈ రచయిత తన రచనలన్నిటినీ వ్యావహారిక భాషలోనే రాశాడు.

ఈ రచయిత దృష్టిలో దుస్వప్నము, సన్యాసి అని రాయకూడదు. దుస్వప్నము, సన్న్యాసి అని రాయాలి. నిస్సిగ్గు అనే పదాన్ని అసలు ప్రయోగించకూడదు. అధ్వాన్నం అనేది తప్పు. అధ్వానం అనేదే ఒప్పు. ʹదానితో బాటుʹ అనకూడదు. ʹదానితో పాటుʹ అనే అనాలి, భిక్షువు అనకూడదు, భిక్ష్రుడు అనే అనాలి, దరిద్రం అనకూడదు, దారిద్య్రం అనే అనాలి. భాష విషయంలో ఈ మాత్రం వెసులుబాటు కూడా లేకపోతే ఎలా?

సంస్కృత భాషలో పదాలను పుంలింగాలనీ, స్త్రీలింగాలనీ, నపుసంక లింగాలనీ మూడు రకాలుగా విభిజించారు. విచిత్రం ఏమిటంటే పుంలింగాలనేది పురుష లింగ శబ్దాలు కావు. స్త్రీ లింగాలు స్త్రీ వాచక శబ్దాలు కావు. పురుషుల్ని తెలియజేసే పదాలు స్త్రీ లింగాలు కావచ్చు, స్త్రీలను తెలియజేసే పదాలు పుంలింగాలు కావచ్చు. దారా అంటే భార్య అని అర్థం. కాని ఇది పుంలింగ శబ్దం, సంస్కృత భాషలో లింగ వివక్ష ఇలా గందరగోళంగా ఉంటుంది. ఈ పదాలు తెలుగులో అర్థవంతంగా ఉంటుంది. మహద్వాచకాలంటే పురుషుల్ని తెలియజేసే పదాలు, మహతీ వాచకాలంటే స్త్రీలను తెలియజేసే పదాలు. తక్కిన పదాలన్నిటినీ అమహద్వాచకాలన్నారు. ఈ విషయంలో ఈ రచయిత సాంప్రదాయిక వ్యాకరణ దృక్పథాన్ని పక్కన బెట్టి పుంలింగాన్ని మహద్వాచకంగా, స్త్రీ లింగాన్ని మహతీ వాచకంగా, నా పుంసక లింగాన్ని అమహద్వాచకంగా చెప్పాడు. ఈ రచయిత భావించినట్టు పురుష వాచక శబ్దాన్ని పుంలింగ శబ్దాలనడం, స్త్రీ వాచక శబ్దాన్ని స్త్రీ లింగ శబ్దాలనాడం ఎంతో అర్థవంతంగా, ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.

కొన్ని విషయాలలో ఈ రచయితకున్న ప్రాచీన సాంప్రదాయిక ధోరణిని పక్కన బెడితే ఈ ʹతెలుగు పదసోపానంʹ తెలుగు భాషాభిమానులకు కరదీపిక వంటిదనడంలో సందేహం లేదు. చెన్నైలో ఉంటూ తెలుగు భాషను తన ఊపిరిగా భావించి, దాని అభివృద్ధి కోసం తపన పడుతున్న డా|| తూమాటి సంజీవరావుతో మాట్లాడదల్చుకున్న వారు (0) 988446208 అనే ఆయన సెల్ నంబరుకు ఫోన్ చెయ్యొచ్చు.

No. of visitors : 891
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఒంటరిగా మిగిలిపోకూడని కవి

వి. చెంచయ్య | 05.09.2017 11:21:59pm

ఈ కవిలో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఒకసారి ఆశ, మరోసారి నిరాశ; ఒకచోట చైతన్యం, మరోచోట వైరాగ్యం. ముందు ముందు ఈ కవి ఎటువైపు మొగ్గుతాడో అనే అనుమానం కలగక మానదు......
...ఇంకా చదవండి

కవిలో చిత్తశుద్ధి ఉంది - అవగాహనే కొరవడింది

వి. చెంచ‌య్య‌ | 06.12.2017 12:51:59am

సిద్ధాంత దృక్పథంతో విషయాల్ని పరిశీలించడంలో మాత్రం పొరబాట్లు జరుగుతున్నాయి. ʹʹఆటవిక యుద్ధాన్ని ఇంకెన్నాళ్ళు చేద్దాం?ʹʹ అన్నప్పుడు కవి ఆటవిక అనే మాటను దుర్మార...
...ఇంకా చదవండి

కవి ఆక్రోశం కవుల సమిష్టి ఆక్రోశం కావాలి

వి. చెంచయ్య | 06.10.2017 12:06:03am

అగ్రవర్ణ ఆధిపత్యం మన సమాజంలో అనాదిగా ఉన్నదే. అయితే కులవ్యవస్థలోని లోటుపాట్లను పాలకవర్గం ఎలా తెలివిగా ఉపయోగించుకుంటున్నదో కవి దృష్టిని వదిలిపోలేదు......
...ఇంకా చదవండి

బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?

వి. చెంచయ్య | 02.11.2017 10:55:39am

అన్ని తాత్విక చింతనలనూ పరిశీలించి, సరైన నిర్ణయానికి రావడానికి బుద్ధుడి జ్ఞాన సిద్ధాంతాన్ని తెలియజేసే కాలామ సుత్తం ఆచరణాత్మకమైన ప్రాతిపదికన అందిస్తుందని రచయ...
...ఇంకా చదవండి

విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి

వి.చెంచ‌య్య‌ | 03.01.2018 11:23:28pm

ఈ చిన్న పుస్తకాంలో ఐలయ్య ఆలోచనలు ఆలోచింప దగినవిగా, కనిపిస్తున్నారయి. ఈ ధోరణిలో ఆలోచిస్తున్న ఐలయ్య కొన్ని వివాదాస్పద ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు.....
...ఇంకా చదవండి

వర్ణమూ, కులమూ రెండు విభిన్న ఉత్పత్తి విధానాలకు సంబంధించినవి

వి.చెంచయ్య | 20.02.2018 12:40:30am

వర్ణం అనేది మొదట రంగును మాత్రమే సూచించేదిగా ఉన్నదనీ, ఆ తర్వాత మాత్రమే చాతుర్వర్ణ సిద్ధాంతంతో అన్వయం పొందిందనీ రుజువు చేశాడు......
...ఇంకా చదవండి

మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...

వి. చెంచయ్య | 28.09.2018 01:10:47am

జాషువా కష్టసుఖాలు రెండూ అనుభవించాడు గాని, వాటికి వశం కాలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ, నిరాశామయ వాతావరణంలోనూ కవిగా నిలదొక్కుకోవడం జాషువా ప్రత్యేకత... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •