ఆ యాభై రోజులు (నవల)

| సాహిత్యం | క‌థ‌లు

ఆ యాభై రోజులు (నవల)

- మెట్టు మురళీధర్‌ | 18.11.2017 12:35:34am


తెల్లవారింది. చందు చేతిలో చిల్లర ఏమీలేదు. ఇంట్లో అన్నీ పెద్దనోట్లే ఉన్నాయి. లతను అడిగితే తాను దాచుకున్న యాభై రూపాయలిచ్చింది. అవి తీసుకొని విలాసరావింటికి బయలు దేరాడు చందు.

అప్పటికి విలాస రావు డ్యూటీకి పోక రెండు రోజులయింది. ఒక రోజు ఇల్లు రిజిస్ట్రేషన్‌ అని పోలేదు. తెల్లవారి పెద్దనోట్ల రద్దు కారణంగా అనుకోకుండా జగద్గిరిగుట్టకు పోవాల్సి వచ్చి పోలేదు. రిజిస్ట్రేషన్‌ అంటే విలాసరావు ఏమీ అనలేదు గాని, తెల్లవారి జగద్గిరిగుట్టకు పోతానంటే కోపానికొచ్చాడు.

ʹʹడ్యూటీ చేస్తావా? నీ స్వంత పనులు చేసుకుంటావా?ʹʹఅంటూ కేకలేశాడు.

చందుకు ఏమనాలో తోచక మౌనంగా ఉండి పోయాడు. అప్పుడు విలాస రావే అన్నాడు.

ʹʹసరే! ఈ ఒక్కరోజు పోయిరా. తర్వాత తప్పిస్తే నేనొప్పుకోనుʹʹ అని గట్టిగానే చెప్పాడు.

నిజానికి చందు ఆరోజు కూడా ఇంట్లోనే అమ్మకు ధైర్యంగా ఉండాలనుకున్నాడు. కాని విలాసరావు ఏమంటాడోనని డ్యూటీకి ఆటోలో బయలుదేరాడు.

విలాసరావు చాలా పెద్ద కంట్రాక్టరు. దాంతో పాటు అతనికి ఎన్నో వ్యాపారాలున్నాయి. రియల్‌ ఎస్టేటు వ్యాపారం అందులో ఒకటి. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద విల్లాలు కట్టి కోట్లకు అమ్ముతుంటాడు. అతనికి లెక్కనేనన్ని పట్టణ ఆస్తులున్నాయి, వ్యవసాయ భూములున్నాయి, పండ్లతోటలున్నాయి. వందల కోట్ల ఆస్తులతో పాటు నగదు నిలువలు కూడా పుష్కలంగా ఉన్నాయి. నగదు దాచుకోవడానికి అతని ఇంట్లో భూగర్బ డంప్‌ ఉందంటారు.

విలాసరావు ఎక్కడకు పోయినా గత రెండు సంవత్సరాల నుండి డ్రైవరుగా చందు అతని వెంటే ఉన్నాడు. విలాసరావు విషయాలు, వ్యవహారాలు తెలిసినా చందు ఎవరితోను, ఏమీ అనడు. ఎక్కడ కూడా అతని సంగతులు బయటపెట్టడు.

ఆస్తులతో పాటు విలాసరావుకు రాజకీయ పలుకుబడి పుష్కలంగా ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అతనితో చాలా సన్నిహితంగా ఉంటారు. జిల్లా టూరు పెట్టుకున్నపుడు మినిష్టర్లు అప్పుడప్పుడు ఆయనింట్లో విడిది చేస్తారు. ఓసారి సీ.యం. కూడా ఆయనింట్లో ఆగాడు. ఇంట్లోనే ఉండి హైదరాబాద్‌లో పనులు చేయించుకునే సమర్ధుడు విలాసరావు.

పోయినసారి ఆ నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్‌ విలాసరావుకే వస్తుందనుకున్నారు. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడు కూడా హామీ ఇచ్చాడట. కానీ సామాజిక సమీకరణాలు కుదరక అది జరగలేదు.

అయినా విలాసరావు తెలివికలవాడు కాబట్టి తొందరపడకుండా అధికార పార్టీకి వీర విధేయుడుగానే ఉన్నాడు. అతని విధేయతకు బహుమతిగా సి.యం. అతనికి జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంకు చైైర్మన్‌ పదవిని కట్టబెట్టాడు. గట్టి పోటీ ఉన్నా సి.యం. ఛాలెంజింగ్‌గా తీసుకొని విలాసరావును గెలిపించాడు.

విలాసరావుది ఆప్రాంతంలోనే అతిపెద్ద బంగళా. డూప్లెక్స్‌ తరహాలో కట్టిన అతి విలాసవంతమైన భవనమది. ఎకరంపైన విస్తీర్ణం గల కాంపౌండులో వాస్తును పాటిస్తూ నిర్మించబడ్డ ప్యాలెస్‌ అది. స్విమ్మింగ్‌ పూల్‌, టెన్నిస్‌కోర్టు, జాగింగ్‌ ట్రాక్‌ మొదలైన ఆధునిక సౌకర్యాలున్నాయందులో.

విలాసరావు భార్యపేరు రాధమ్మ. ఆమె ఒక పెద్దింటి స్త్రీ. కట్నంగా ఆరోజుల్లోనే లక్షలు తెచ్చుకున్న ఇల్లాలామె. సాధారణంగా రాధమ్మ, చందును తప్ప ఎవరినీ లోపలికి రానివ్వదు. ఆమె ఎటన్నా పోతే చందునే డ్రైవర్‌గా తీసుకుపోతుంది. ఆ సమయంలో విలాసరావు వేరే డ్రైవర్‌ను వాడుకుంటాడు.

ఇక సారిక విలాసరావుకు ఏకైక కుమార్తె. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. పెద్ద అందగత్తె కాకపోయినా అలంకరణతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమెకు కూడా ఓ స్వంత కారుంది. ఆమె తన కారు తనే తోలుకుంటుంది. అప్పుడప్పుడు చందును డ్రైవర్‌గా తీసుకుపోతుంది.

సారికకు లెక్కలేనంత మంది స్నేహితులున్నారు. గర్ల్‌ఫ్రెండ్స్‌తో పాటు ఆమెకు బాయ్‌ ఫ్రెండ్స్‌ కూడా ఉన్నారు. ఆమెకు బాయ్‌ఫ్రెండ్‌గా ఉండడం గొప్పగా భావిస్తారు మగపిల్లలు.

ఒకటి, రెండు బ్యాంకుల్లో సారికకు స్వంత అకౌంట్లున్నాయి. అందులోకి విలాసరావు డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఆమె క్రెడిట్‌ కార్డులతోను, డెబిట్‌ కార్డులతోను వాటిల్లోంచి డబ్బు వాడుకుంటుంది. విందులు, వినోదాలు, క్లబ్బులు, పబ్బులు ఆమెకు చాలా ఇష్టం. ఆమె నెలవారీ ఖర్చు లక్షపైనే ఉంటుంది.

సారికకు పెళ్ళి నిశ్చయమైంది. అబ్బాయి అమెరికాలో పెద్ద ఉద్యోగి. కొద్ది రోజుల్లోనే పెళ్ళి ఉన్నా ఆమె విలాసాలు మాత్రం ఆగలేదు.

ʹʹపెళ్ళయ్యేవరకే కదా ఇవన్నీʹʹ అంటుందామె..

ʹʹఔనౌనుʹʹ అంటారు విలాసరావు దంపతులు.

సారికకు చందు అంటే ఒకరకమైన ఇష్టం. ఆమె ఇష్టపడే రకం చందుకు నచ్చేది కాదు. ఐనా యజమాని కూతురు కాబట్టి ఆమెతో పోవడం తప్పకపోయేది.

సారిక అమ్మతోను, నాన్నతోను పోట్లాడి అపుడపుడు చందును డ్రైవరుగా తీసుకపోయేది. చందు డ్రైవరుగా పోయాడంటే సారిక ఇల్లు చేరడానికి అర్ధరాత్రి దాటుతుందని లెక్క. ఐనా విలాసరావు గాని, రాధమ్మగాని ఏమీ అనరు. ఇంతసేపు ఎక్కడ, ఏం చేశావని కూడా అడగరు.

సారికకు నైటు క్లబ్బుల్లో పార్టీ ఉన్నపుడు చందు ఆమె వెంటపోతాడు. సారికను దించి బయట వెయిట్‌ చేస్తుంటాడు. సారిక లోపలికి పోయి కొన్ని గంటలదాకా రాదు. లోపల ఏం చేస్తుందో తెలియదు. వచ్చేటప్పుడు మాత్రం తాగి వస్తుంది. అప్పుడప్పుడు మద్యం ఎక్కువై నడవడం కూడా రాదు. అపుడు చందు ఆమెను కారు దాకా తీసుకుపోతాడు. నడవడం చేతకాక ఆమె చందు మీద వాలిపోతుంది. చందుకివన్ని ఇష్టముండకపోయేది.

సారికను ఇల్లు చేర్చేటప్పటికి రాత్రి పన్నెండయ్యేది. అప్పటికి నైట్‌ వాచ్‌మెన్‌ తప్ప అందరూ నిద్రపోయేవారు. ఇంటి మెయిన్‌ డోర్‌ లాక్‌ చేసి ఉండేది. సారిక దగ్గర తాళం చెవి ఉండేది. తాళం తీసి సారికను మేడమీది గదికి చేర్చి చందు ఇంటికి పోయేవాడు. తమ బెడ్‌రూంలో విలాసరావు దంపతులు పడుకునేవారు. సారిక వచ్చింది కూడా గమనించే వారు కాదు.

నాలుగు రోజుల క్రితం ఇలాగే సారికను బెడ్‌రూంలో వదిలి చందు పోబోయాడు. కానీ సారిక అతన్ని పోనివ్వలేదు. చందును గట్టిగా వాటేసుకుంది. చందు విడిపించుకోబోయాడు. కానీ సారిక అతన్ని వదలలేదు.

ʹʹమనిద్దరిది ఒకే వయసు, నన్ను చూస్తుంటే నీకేం కోరికలు కలుగవా?ʹʹ అంది సారిక.

చందు మాట్లాడలేదు.

ʹʹనువ్వు మగాడివేనా అసలు?ʹʹ అంటూ రెట్టించింది.

ఐనా చందు మాట్లాడలేదు.

చందు మాట్లాడకుండా సారికను విడిపించుకొని ఆమెను మంచంపైకి నెట్టేసి బయటకు వచ్చాడు.

గేట్‌ దాటి వచ్చిన చందుకు సారిక మీద అసహ్యం కలిగింది. ʹఏమిటి ఈ అమ్మాయి ప్రవర్తన?ʹʹ అనిపించింది. ఆ సమయంలో అతనికి తన చెల్లి లత గుర్తుకు వచ్చింది. లతకు, సారికకు ఏమాత్రం పోలిక లేదు. లత ఒక పద్ధతిలో పెరిగిన పిల్ల. మంచి మర్యాదలు ఆమె స్వంతం. చిల్లర, చిలిపి ఆలోచనలు ఆమె దరికి కూడా రావు. అమ్మ చేతిలో పెరిగింది కాబట్టి అన్నీ మంచి గుణాలే వచ్చాయి.

ʹఅలాంటి లతకే ఎందుకు అలా జరగాలి? నాగరాజు ఆమెను ఎందుకు చిత్రహింసలకు గురి చెయ్యాలి? పదో తరగతిలోనే లత చదువు ఎందుకు ఆగిపోవాలి?ʹ ఇలాంటి ప్రశ్నలతో చందు ద్ణుఖపడేవాడు. లత గుర్తుకు వస్తేనే చందు హృదయం ఆర్ధ్రమయ్యేది.

ʹఏ పద్ధతిలేక అల్లరి చిల్లరగా తిరిగిన సారికకు అన్నీ అనుకూలమే. పద్ధతిగా ఉన్న లతకు అన్నీ వ్యతిరేకమే. ఎందుకిలా? డబ్బేనా కారణం? కలిమిలేములు మానవజీవితాలను ఇంతగా ప్రభావితం చేస్తాయా?ʹ అనిపించింది చందుకు.

ఆలోచిస్తుండగానే చందు ఎక్కిన ఆటో విలాసరావు ఇంటిముందాగింది. ఆటోదిగి విలాసరావు కాంపౌండులోకి అడుగు పెట్టాడు చందు.

చందును చూడగానే విలాసరావు,

ʹʹచందూ! వచ్చావా? రా! రా! ఇవ్వాల చాలా పనులున్నాయిʹʹ అంటూ కారెక్కాడు. ఎటుపోవాలో చెప్పాడు.

కారు ముందుకు పోతోంది.

వెనుకసీట్లో కూర్చున్న విలాసరావు అదే పనిగా ఫోన్లు చేస్తున్నాడు. అతడు ఫోన్లు చేసే వాళ్ళందరు బ్యాంకు అధికారులే. ఆ విషయం చందుకు తెలుస్తూనే ఉంది.

ʹʹహలో నాయర్‌! ఏం చేస్తున్నారు ? ఎక్కడున్నారు?ʹʹ

ʹʹహలో సార్‌! బ్యాంకులోనే ఉన్నాను. నిన్న, ఈ రోజు కస్టమర్లకు బ్యాంకు సెలవులు. అయినా మాకు పనుంది. రేపు ఒక్కసారిగా కస్టమర్లు ఎగబడతారు. ఆ ఏర్పాట్లు చేస్తున్నాముʹʹ.

ʹʹసరే నాయర్‌! రేపటి నుండి మీరు మరీ బిజీ అయిపోతారు. ఈ రోజు సాయంత్రం ఒకసారి కలువగలరా?

ʹʹవీలవుతుందో కాదో సార్‌ʹʹ

ʹʹవీలు చేసుకోండి, మాట్లాడేవిషయాలు చాలా ఉన్నాయిʹʹ

ʹʹఏ విషయాలు?ʹʹ

ʹʹవస్తే చెపుతాను. మీకూ లాభమేʹʹ,

ʹʹసరే! ఎప్పుడు రమ్మంటారు?ʹʹ

ʹʹరాత్రి 7 గంటలకు వీలవుతుందా?ʹʹ

ʹʹసరే! వస్తానుʹʹ.

ʹʹకారు పంపించనా?ʹʹ

ʹʹవద్దు, వద్దు. నేనే వస్తాను.ʹʹ

ʹʹఎదిరి చూస్తుంటాను మరి.ʹʹ

ఫోన్‌ పెట్టేశాడు విలాసరావు. అంతసేపు ఏవో కాగితాలు చూస్తూ ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌లోనే ఉంచాడు. అందుకే నాయర్‌ మాటలు కూడా స్పష్టంగా వినిపించాయి చందుకు.

బ్యాంకు అధికారి నాయర్‌తో విలాసరావు మాట్లాడిన మాటల్లోని తాత్పర్యం చందుకు అర్థమయింది. పాత నోట్ల మార్పిడి విషయంలో విలాసరావు, నాయర్‌ సహాయాన్ని కోరుతున్నాడు. అందుకు నాయర్‌కు కూడా భారీ ప్రతిఫలం ముడుతుందని చందుకు అర్థమయింది.

విలాసరావు వద్ద నగదు నిలువ డంప్‌ ఉందంటారు కొంతమంది. చందు ఎపుడూ చూడలేదు గాని అది ఉన్నట్టు చూచాయగా తెలుసు. డంప్‌ విషయం బయటివాళ్ళు ఓసారి చందును అడిగారు కూడా.

ʹʹఅంతా వట్టిదేʹʹ అంటూ కొట్టిపారేశాడు చందు.

చందు డ్యూటీలో చేరిన మొదటిరోజే,

ʹʹఇక్కడ జరిగే విషయాలు, నా మాటల తాత్పర్యాలు బయట ఎక్కడా లీకయినా నీమూలంగానే అనుకుంటాను. ఏ ఒక్కటి బయటపడినా నిన్ను బతుకనివ్వనుʹʹ అంటూ హెచ్చరించాడు విలాసరావు.

అందుకే చందు విలాసరావు మాటలు వింటాడు. మరిచిపోతాడు. ఆ ఇంట్లో జరిగే విషయాలు చూస్తాడు. మరిచిపోతాడు.

విలాసరావు, నాయర్‌తో మాట్లాడిన తర్వాత ʹతన దగ్గర కూడా 18 లక్షల పాత పెద్దనోట్లున్నాయి, అవి మార్పిస్తాడేమో?ʹ అని అడుగుదామనిపించింది చందుకు ఓ క్షణం. వెంటనే భయమేసి మానుకున్నాడు. ఎందుకంటే కొన్ని విషయాల్లో విలాసరావు చాలా కఠినంగా ఉంటాడు.

ʹʹనేనలా చేస్తానని ఎవరు చెప్పారు నీకు?ʹʹ అని అడిగితే తన దగ్గర సమాధానం లేదు. అందుకే నోరు మెదపలేదు చందు.

విలాసరావు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు.

ʹʹహలో మిస్టర్‌ పట్నాయక్‌! కెన్‌ వి మీట్‌ బై యైట్‌?ʹʹ

స్పీకర్‌ ఆన్‌లో లేదు కాబట్టి పట్నాయక్‌ మాట వినిపించలేదు.

ʹʹనైస్‌. థాంక్యూ!ʹʹ అన్నాడు విలాసరావు మళ్ళీ.

తర్వాత మరో ఇద్దరికి ఫోన్‌ చేశాడు విలాసరావు. వారు కూడా బ్యాంకు అధికారులే. వారి పేర్లను బట్టి, విలాసరావు మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది చందుకు.

విలాసరావు పాతనోట్ల మార్పిడి ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తున్నట్టు అర్థమవుతోంది చందుకు. ఆయనది, తనది ఒకే రకమైన పరిస్థితి. ఆయన మార్పిడి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తాను మొదలుపెట్టలేదు. ఆయనకు అన్ని హంగులు, అవకాశాలున్నాయి. తనకు లేవు. తన విషయం ఆలోచిస్తేనే మెదడు మొద్దుబారుతోంది చందుకు.

అంతలోనే విలాసరావు చెప్పిన అడ్రసు వచ్చింది. కారు కాంపౌండు లోకి పోనిచ్చాడు చందు. ఓ పక్క నీడకు కారు ఆపాడు. విలాసరావు దిగి ఇంట్లోకి పోయాడు.

ఆ ఇంటికి ఇంతకు ముందు చాలాసార్లు వచ్చాడు చందు. ఆయనో రాజకీయ నాయకుడు. ఆయన, విలాసరావు స్నేహితులు కూడా.

అప్పటికే అక్కడ మూడు కార్లున్నాయి. లోపల కొందరున్నారు. ఏదో పార్టీ లాంటిది జరుగుతున్నట్టనిపిస్తోంది చందుకు.

ఆ కాంపౌండ్‌లో ఓ పెద్ద వేపచెట్టుంది. దాని కింద సిమెంటు బెంచీ ఉంది. అందులో వెనుకకు ఒరిగి కూర్చున్నాడు చందు.

ఒంటరిగా ఉన్న అతనికి అమ్మ జ్ఞాపకమొచ్చింది.

చందు జగద్గిరిగుట్ట నుండి ఇల్లు చేరేసరికి రాత్రి పదయింది. అప్పటికి సాయమ్మ ఇంకా నిదురపోలేదు. అన్నం కూడా తినలేదు. కొడుకు వచ్చాకనే కలిసి తిందామని ఎదిరిచూస్తూ కూర్చుంది.

చందు వచ్చి అక్కడ జరిగిన విషయాలు చెప్పేసరికి సాయమ్మ హతాశురాలయింది. జగద్గిరిగుట్ట వాళ్ళు అంత కఠినంగా ఉంటారనుకోలేదు సాయమ్మ. వరపూజ నాడిచ్చిన రెండు లక్షలు తిరిగి ఇస్తారని కలలో కూడా అనుకోలేదు. ʹరెండు లక్షలు తిరిగి ఇచ్చారంటే పెళ్ళి సంబంధం ఉన్నట్టా? లేనట్టా?ʹ అర్థం కావడంలేదామెకు. చందు చెప్పడం మొదలుపెట్టగానే సాయమ్మ కళ్ళవెంట నీళ్ళు టపటపా కారడం మొదలయ్యాయి.

ʹʹఏడవకమ్మా! ఏమైనా చేద్దాంʹʹ అంటూ ఊరడించాడు చందు.

ʹʹఏం చేద్దాం బిడ్డా?ʹʹ

ʹʹఆలోచిద్దాం. నువ్వు ధైర్యంగా ఉండుʹʹ అన్నాడు

అలా అన్నాడు గాని ఏం చేయాలనేది ఇదమిద్దంగా చందుకూ తెలియదు. అమ్మకు ధైర్యం చెపుదామని అలా అన్నాడు గాని, నిజానికి చందుకు కూడా ధైర్యం లేదు.

ʹʹఈ పెద్దనోట్ల రద్దు మన గండానికే వచ్చింది కొడుకా!ʹʹ అంది సాయమ్మ చివరికి.

అది మాత్రం నిజమనిపిస్తోంది చందుకు. ఎందుకంటే కోట్లకొద్ది నల్లధనమున్న విలాసరావు ఏ రకంగానూ కంగారు పడుతున్నట్టు లేదు. విలాసంగా పార్టీలు చేసుకుంటున్నాడు. ఫోన్లలోనే పని కానిచ్చుకుంటున్నాడు. బ్యాంకు అధికార్లను ఇంటికే పిలిపించుకుంటున్నాడు. బహుశ్ణ నల్లకుబేరులందరు ఇలాగే నిర్భయంగా ఉండివుంటారు. అమ్మ అన్నట్టు మామూలు వాళ్ళకే ఇది గండంగా పరిణమించింది అనుకున్నాడు చందు.

ఒక్కొక్క ఖాతాలో రెండున్నర లక్షలదాకా వేసుకోవచ్చని ప్రధానమంత్రి అన్నాడు కాబట్టి రేపు డ్యూటీకి పోకుండా అమ్మపేర, తనపేర, లత పేర ఖాతాలు తీయాలనుంది చందుకు. కాని విలాసరావు ఏమంటాడో? జగద్గిరిగుట్టకు పోతానంటేనే ఆ ఒక్కరోజు తప్ప మరో రోజు సెలవివ్వనన్నాడు. అందుకే రేపు సెలవిస్తాడన్న నమ్మకం లేదు. ఐనా ʹఅడిగి చూద్దాంʹ అనుకున్నాడు చందు.

సెలవు విషయం అడుగుదామని కారెక్కిన దగ్గరి నుండి అనుకుంటున్నాడు చందు. కాని వీలు కాలేదు. కారు ఎక్కింది మొదలు విలాసరావు ఫోన్లే ఫోన్లు.

ఆలోచిస్తుండగానే చందు ఫోన్‌ మోగింది. అది విలాసరావు దగ్గరి నుండి.

ʹʹచందూ! అమ్మకు షాపింగ్‌ ఉందట. ఇంటికి వెళ్ళి అమ్మను షాపింగ్‌కు తీసుకుపో. నాలుగ్గంటలకు వచ్చి నన్ను పికప్‌ చేసుకోʹʹ అన్నాడు విలాసరావు.

ʹʹసరే సార్‌ʹʹ అని విలాసరావింటి వైపు కారు పోనిచ్చాడు చందు.

(ఇంకా ఉంది)

No. of visitors : 730
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 20.02.2018 12:38:01am

ʹʹఅసలు మన డబ్బు మనం తీసుకోవడానికి ఇన్ని ఆంక్షలెందుకండీ? నేను దాచుకున్న పైసలు నాకివ్వకపోవడమేమిటి? ఇది ఒకరకంగా హక్కుల భంగమే.ʹʹ ఒకతను చాలా కోపంగా అన్నాడు. .......
...ఇంకా చదవండి

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 20.01.2018 11:13:05am

పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆ 50 రోజుల కాలంలో రైతులు, ఇతరులు ప్రభుత్వానికి చెల్లించవలసిన ఋణాలు పాత పెద్ద నోట్లలో చెల్లించవచ్చని ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. త.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2018
  కత్తి మహేష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం
  కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
  రాజ్య హింసలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలతో తెలుగు ప్రభుత్వాలు కూడా సరిసమానమే
  వీళ్లు చేసిన నేరం ఏంటి?
  జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ
  కార్పోరేట్ కంపెనీల ఏజెంట్‌గా మోదీ స‌ర్కారు
  నెలవంక సందేశం
  The tree of the world
  వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?
  వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి
  రాజ్యం బరితెగింపు వెనక

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •