తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కళా సాహిత్య సాంసృతిక పునరుజ్జీవన ఉద్యమంగా కూడా విస్తరించింది. బహుశా గత ఎనభై తొంభై ఏళ్ల ప్రజా పోరాటాల వెలుగులో సాగిన తెలంగాణ సాంసృతిక వికాసానికి ఇది కొనసాగింపు. తెలుగు సమాజాల్లో ఇది తెలంగాణకే ఉన్న లక్షణం. భాషా సాహిత్యాలకు సంబంధించినంత వరకు తెలంగాణలో గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభల ఉజ్వల వారసత్వమిది. ఇదంతా అట్టడుగు ప్రజా పోరాటాల నుంచి, జన సంచలనాల నుంచి సాగుతూ వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్టంగా ఏర్పడ్డాక తెలుగు భాషా సాహిత్యాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందోగాని ఇప్పుడు ప్రభుత్వం భాషా సాంస్కృతిక వికాసానికి ప్రపంచ తెలుగు మహా సభలు తలపెట్టింది. వీటి ద్వారా తెలుగు భాషా సాహిత్య చరిత్రలో ఇంత కాలం తెలంగాణకు దక్కని చోటును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించదలుచుకున్నదని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ సభల ద్వారా అది నెరవేరుతుందా? లేదా అనేది పూర్తిగా వేరే చర్చ, గతంలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల ద్వారా ప్రభుత్వం తెలుగు భాషా సాహిత్యాలకు ఏం సేవ చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ సభల్లో తెలంగాణకు సముచిత స్థానం లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలపట్ల కనీస పట్టింపు కూడా లేదు. అయితే మిగతా ప్రాంతాల్లో అయినా తెలుగు భాష పరిరక్షణకు ఆ సభలు ఏం దోహదపడ్డాయి? అనే చర్చ చేయవచ్చు. ఇప్పుడు జరిగే ప్రపంచ తెలుగు మహా సభలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నందు వల్ల అక్కడి సంస్కృతీ సాహిత్యాలు కేంద్రంగా జరుగుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివక్షకు ఇది ఆ రకంగా పరిష్కారం. ప్రత్యేక రాష్టం ద్వారా తెలంగాణ సొంతం చేసుకునే వాటిలో ఇదీ ఒకటి.
అయితే ఏ ప్రభుత్వం ముందైనా భాషా సాహిత్యాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఏ సమాజమైనా సరే తన సాంసృతిక అవసరాలను ప్రభుత్వాల ముందు పెడుతూ ఉంటుంది. అవి ఎలాంటి ప్రభుత్వాలైనా సరే. నిజానికి సాంసృతిక అవసరాలు ఇతర రోజువారి అవసరాలకంటే భిన్నమైనవి. వీటి కోసం ప్రజలు తమ సుదీర్ఘ చరిత్రలో తమదైన పద్ధతిలో పెనుగులాడుతూ ఉంటారు. తమ భాషా సాంస్కృతిక విషయాలను నిలబెట్టుకోవడానికి, వాటి మూలాలు అన్వేషించడానికి ప్రతి సమాజానికి ఒక ఒరవడి ఉన్నది. అలా తెలంగాణ ప్రజలకు తమదైన సొంత మార్గం ఉన్నది. దాన్ని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా గొప్పగా ప్రకటించుకున్నారు. అందులో సాంస్కృతిక పునర్వికాసం ఉన్నది. విచిత్రమేమంటే నైజాం పాలనా కాలంలో, ఆ తర్వాత అంతర్గత వలస పాలనా కాలంలో, దానికి వ్యతిరేకంగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో కూడా ఒక కచ్చితమైన రాజకీయ ఆందోళనగా అది సాగింది. అంటే పాలక వర్గాన్ని ధిక్కరించే రాజకీయాల్లో భాగంగా అట్టడుగు నుంచి, శ్రమ కులాల నుంచి, శ్రామిక వర్గ దృష్టికోణం నుంచి మట్టి పొరల్లో ఉండిపోయిన, ఇతరులు మూసేసిన దేశీయ భాషా సాహిత్య సాంసృతికాంశాలన్నీ వెల్లవలా బయటికి వచ్చాయి. అవి యధాతథంగా, నైసర్గిక సౌందర్యంతో, ప్రత్యేకతలతోనేగాక ఒక పోరాట స్వభావంతో పునర్నిర్మాణమవుతూ ప్రజల చేతుల్లోకి వచ్చాయి.
తెలంగాణకే ఉన్న ఈ అద్భుత మార్గాన్ని బహశా ఇంత కంటే గొప్పగా ఇప్పటికే ఎందరో ఎత్తి చూపారు. విశ్లేషించారు. కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్లనవసరం లేదు. అయితే ప్రభుత్వమే ప్రపంచ తెలుగు మహా సభల ద్వారా తెలంగాణ భాషా సాహిత్యాల ఉద్ధరణకు పూనుకున్నదని అనుకుంటున్న ఈ తరుణంలో తెలంగాణ ప్రజలకు ఉన్న భాషా సాంస్కృతిక రంగాల్లోని రాజకీయ పోరాట మార్గం సహజంగానే ప్రస్తావనకు వస్తుంది. పాలకులు ఎన్నడూ ప్రజల భాషా సాహిత్యాలను ఉద్ధరించిన దాఖలాలు చరిత్రలో లేవు. ఆ ప్రజలు పీడిత కులాలుగా, వర్గాలుగా తాము సంతరించుకున్న భాషా సంస్కృతులను తామే కాపాడుకుంటూ వచ్చారు. తెలంగాణలో అయితే ఇదీ మరీ పచ్చి నిజం. భాషా సాహిత్యాల పరిరక్షణ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహా సభల పట్ల విమర్శనాత్మక వైఖరి ఏమిటి? అనేదే ఇవాళ తెలంగాణ సాంసృతిక కార్యకర్తల ముందున్న ప్రశ్న. ఒక ప్రాంతంగా ఇంత కాలం అన్ని రంగాల్లో వలె భాషా సాంసృతిక రంగాల్లో సహితం తెలంగాణకు అన్యాయం జరిగింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రమైంది. ఆ కోణంలో మిగతా అంశాల్లో వలె ప్రభుత్వం తన పద్ధతిలో తాను భాష, సాహిత్య రంగాల్లో కూడా చేసేదేదో చేస్తుంది. అది దాని బాధ్యత. ఎందుకంటే ప్రత్యేక రాష్ట ఆకాంక్షలో నీళ్లు, నిధులు, నియామకాల గురించేగాక భాషా సంస్కృతుల నినాదాలు ఉన్నాయి. నిజానికి తెలంగాణ ఆత్మగౌరవ ఆకాంక్షలు ఈ కోణంలోనే బలంగా వినిపించాయి. కాబట్టి ప్రభుత్వం మిగతా వాటిలాగే వీటి గురించీ మాట్లాడాలి. భాష విషయంలో కోస్తాంధ్ర ప్రాంత వివక్ష నుంచి ఇప్పుడు తన ప్రత్యేకతలను, విశిష్టతలను చాటుకోవాల్సిందే. కానీ భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇంతకూ సంసృతిలోని విశాలమైన అర్ధాన్ని కేసీఆర్ అంగీకరించగలడా? లేక సంస్కృతి అంటే పాత కాలపు జీవన విశేషాలేనా? అవే అని ప్రజాస్వామికవాదులు, రకరకాల అస్తిత్వవాదులు అనుకునేట్లయితే మానవ జీవవ వికాసంలో సంస్కృతి పాత్రను వికృతంగా కుదించినట్లు కాదా? సంస్మృతి అంటే భిన్నాభిప్రాయాల వ్యక్త రూపం. తీవ్రమైన భావజాల సంఘర్షణా వేదిక, దేన్నయినా ప్రగతి అనే గీటురాయి మీద పరీక్షించే అద్భుత జీవన పరికరం. జీవన విధానంగా కనిపిస్తుందిగాని సారాంశంలో రాజకీయం. కల్తీలేని రాజకీయమే సంస్మృతి. ప్రశ్న ఏమిటంటే ఎవరి రాజకీయం? ఎలాంటి రాజకీయం? కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో దిక్కుమాలిన యాగాలు, పూజలు చేయడం కూడా రాజకీయమే. అదీ సంస్కృతే. భక్తి, వాస్తు, కర్మకాండలు, సాధు సంతుల సేవలు చేసే పాలకుడు భాషా సంస్కృతులను పరిరక్షిస్తానని ఫోజు పెడితే ఎలా నమ్మగలం? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం చేస్తున్న భాషా సాంస్కృతిక సేవగా ఈ ప్రపంచ మహా సభలను గుర్తించాల్సిందేనా? దీని మీద విమర్శనాత్మక వైఖరి ఏర్పరుచుకోలేని దర్బలత్వం దేని కోసం? ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, భృత్యులు ఎంతగా తెలంగాణ సాంసృతిక ఉద్ధరణ అని ప్రచారం చేసినా అది ఒక ప్రభుత్వ కార్యక్రమం. అంటే రాజ్య ప్రాయోజిత సాంసృతిక పథకం. మామూలుగా ప్రభుత్వాలు అనేక జనరంజక పథకాలు తీసుకొస్తుంటాయి. ప్రజలను వాటికి లబ్దిదారులుగా మారుస్తుంటాయి. ఇదీ అలాంటి ఒకానొక సాంసృతిక పథకంగా మారి కవులు, రచయితలు, కళాకారులు,బుద్ధిజీవులు దానికి ప్రేక్షకులుగా మారిపోతే తెలంగాణ సమాజం ఎంత నష్టపోతుంది? తెలంగాణలో తరతరాలుగా కవులు, రచయితలు అనధికార ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చారు. ఆ సమాజంలో సృజనకారులు నికార్సయిన రాజకీయవాదులు. అంటే ప్రజల పక్షాన నిలబడి రాజ్యాన్ని ఎదిరించే రాజకీయవేత్తలు. ఇప్పుడు పాలకుల సాంసృతిక వేడుకకు వన్నెతెచ్చే అలంకారప్రాయంగా మారిపోతే తెలంగాణ ప్రజా చరిత్రకు ఎంత నష్టం జరుగుతుంది?
కోస్తాంధ్ర, రాయలసీమ భాషా సాహిత్య చరిత్రకు సరిధీటుగా తెలంగాణను నిలబెట్టడం ప్రభుత్వం నిర్వహించే ఇలాంటి సభల వల్లే సాధ్యమని అనుకునే వాళ్లుంటారు. దానికి ఈ సభల సందర్భంగా ప్రభుత్వం అచ్చేసే పుస్తకాలను, ఇచ్చే పురస్కారాలను, చేసే సన్మానాలను ఉదాహరణగా చూపించవచ్చు. నిజంగానే ఇంత వరకు కోస్తాంధ్ర పాలకులు పట్టించుకోని, కనీసం అక్కడి రచయితలు కూడా పట్టించుకోని రచయితలు, విద్వాంసులు ఎందరో తెలంగాణలో ఉన్నారు. ఈ సభల సందర్భంగా తెలంగాణ తెలుగు అకాడమి అలాంటి ఓ డెబ్బై మంది జీవిత సాహిత్య రేఖలను అచ్చేయవచ్చు. తెలంగాణ సాహిత్య సాంసృతిక రంగాలపై మరిన్ని పుస్తకాలు తీసుకరావచ్చు. నిజానికి మలి దశ తెలంగాణ ఉద్యమం పొడవునా ఎన్ని వందల వేల పుస్తకాలు ఇలాంటివి వచ్చాయి. తెలుగులో కనీ వినీ ఎరుగని భాషా సాహిత్య పరిశోధనలు తెలంగాణలోనే ఈ కాలంలో జరిగాయి. ఇలాంటి ఉద్యమాల వల్ల కూడా కాని పనులు, చేయలేని పనులు ప్రభుత్వం చేయాలని ఒత్తిడి తేవాలి. అది దాని కనీస బాధ్యత. అంతేగాని ఇలాంటి ప్రచురణలు, పురస్కారాలు, గుర్తింపులు చూసి భ్రమసి... ఈ పని అంతా రాజ్యం చేస్తున్నదని మర్చిపోతే ఎలా? తెలంగాణ రాష్ట నినాదం పరిధిలో పరిష్కారాం కావాల్సిన సమస్యలమీద, మౌలికంగా వ్యవస్థను మార్చే పోరాటాల్లో పరిష్కారం కావాల్సిన సమస్యల మీద ప్రజలు వీధుల్లోకి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దమనకాండ ప్రయోగించిందో మర్చిపోతే ఎలా? అందుకే బైటికి సంస్మృతి పరిరక్షణ గురించి ఎన్ని గారడీ మాటలు మాట్లాడినా అణచివేత, దోపిడీ, వంచన, హింస.. పాలకవర్గ సంసృతికి ఆధారం. భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రయోజనాలే కేసీఆర్ పరిభాష. ఆయన మరో భాష మాట్లాడతారని, ప్రజల తెలుగును పరిరక్షిస్తారని అనుకోవడం స్వీయ వంచనే.
ఇంత దూరం ఆలోచించడానికి ఇష్టం లేకపోతే కనీసం భాషోద్యమం పరిధిలోనైనా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పరీక్షించాలి. భాషా ఉద్యమానికి ఎన్ని కర్తవ్యాలున్నప్పటికీ రెండు ప్రధానం. అవి మాతృభాషలో ప్రజా పాలన, విద్యాబోధన. ప్రభుత్వం అనుకుంటే తక్షణం అమలయ్యేవే ఇవి. అన్ని జీవోలలాగే అమలులోని లోటుపాట్ల సంగతి ఎలా ఉన్నా భాష విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వీటిని అమలు చేసే ఉద్దేశం ఉందా? పదో తరగతిదాకా తెలుగు చెప్పాల్సిందే అనే నిర్ణయంతోనే(దీన్ని స్వాగతిసూనే) పులకించిపోవడమమంటే భాషా ఉద్యమ లక్ష్యాలను కూడా అర్థం చేసుకోనట్టే కేసీఆర్ ప్రభుత్వం నిజంగానే తెలుగు భాషను కాపాడదల్చుకుంటే, దానికి సేవ చేయదల్చుకుంటే డిసెంబర్ 15న ప్రపంచ తెలుగు మహా సభలు ఆరంభిచడానికంటే ముందు ఒక పని చేయాలి. ఈ రోజు నుంచి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ పాలన అంతా తెలుగులోనే జరగాలి. ఒక్క ప్రభుత్వ పత్రం మీద ఇంగ్లీషు అక్షరం ఉండటానికి వీల్లేదని నిర్ణయం తీసుకోవాలి. ఇది కనీసం కార్పొరేట్ విద్యాసంస్థల రద్దు, ఉన్నత విద్య అంతా తెలుగు మీడియంలోనే సాగాలి. అనే వాటిని అమలు చేయడం లాంటిది కూడా కాదు. నిజంగానే ఈ విషయాల్లో సమాజంలోనే అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వ పాలన అంతా తెలుగులోనే అంటే కంచె ఐలయ్యగారు కూడా వెంటనే అభ్యంతరం చెప్పకపోవచ్చు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోగలరా? అసాధ్యం. మరి ఆయన భాషా సాహిత్య పరిరక్షణ పట్ల తెలంగాణ రచయితలు, కళాకారులు ఇంత వెర్రి ఆమోదం ఎందుకు తెలియజేస్తున్నారు? దీని వెనుక ఏముంది? ఏ ప్రయోజనాల కోసం ఇదంతా?
Type in English and Press Space to Convert in Telugu |
ధిక్కార స్వరాలకు ఆహ్వానంప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ... |
నీవునీవేనా?నీ దుఃఖం, ఆగ్రహం ఉబికిన
సందర్భం కింద
నెత్తురింకిన నేల ఉంది కదా?
అవునా? కనిపిస్తోందా?
దాన్నొకసారి తాకి చూడు
నెత్తురు పారించినోడు కనిపిస్తాడు... |
కవి ఎక్కడ? కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?... |
వెలివేయబడ్డ అక్షరంఅంటరానితనంతో వెలివేసిన
నా అక్షరాల్ని
ధిక్కార స్వరాలు చేసి
నీ ʹజాతరʹలో నినదించాలని ఉంది... |
గుండె గుర్తులు వెతుక్కుంటూసాలు సాలులో సాగు వీరులు
వరిగి పోతుంటె
నీ కలంలోకి ప్రవహించిన
రైతన్నల వెచ్చటి నెత్తురు
అప్పుడే గడ్డకట్టిందా?!
ఆపదలో అభయాన్నిచ్చే
అక్షర సాహస విత్తనాలు
భూమిన... |
పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాంఅగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే... |
సుఖ విరోచనం!ʹకవిత్వం యెలా వస్తుందో గవర్నరుగారు చెప్పారు..ʹ
ʹఎలా వస్తుంది?ʹ
ʹసుష్టైన భోజనం.. తాంబూలం.. వుంటే వస్తుందని..ʹ
ʹఏమొస్తుంది.. నిద్రా?ʹ
ʹకాదు, కవిత్వం..!ʹ..... |
తెగులు సోకిన రచయితలారా రండీవిలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి..
కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి..
తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ..
మ... |
బుద్ధిజీవుల కర్తవ్యంపోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన... |
కళావేత్తలారా! మీరేవైపు?
1932లో అమెరికా జర్నలిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ( సృజన పత్రిక నుంచి )... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |