బోల్షివిక్ విప్లవ కాంతులు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

బోల్షివిక్ విప్లవ కాంతులు

- జగన్ | 05.12.2017 11:22:33pm

బోల్షివిక్ విప్లవంగాను, అక్టోబర్ విప్లవంగాను సుప్రసిద్ధమైన రష్యన్ కార్మికవర్గ విజయానికి ఈ నవంబర్ 7కు నూరేళ్లు పూర్తయినవి. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు మాత్రమే కాదు ప్రజాస్వామ్యవాదులు, ఫాసిజాన్ని ప్రతిఘటించే ప్రజలందరు ఈ విప్లవ శతవార్షికోత్సవాలను ఎంతో ఉత్తేజకరంగా జరుపుకున్నారు. ఇదే సమయంలో ట్రాట్స్కీస్టులు, రాయిస్టులు, రివిజనిస్టులు మొదలు విప్లవ పార్టీల వరకు తమ తమ దృక్పథాల నుంచి బోల్షివిక్ విప్లవ విశ్లేషణ చేస్తున్నారు. ఇక ముందు కూడా చేస్తారు.

బోల్షివిక్ పార్టీ నిర్మాణ సూత్రాల స్పూర్తితోనే చైనాలో 1921లో, ఇండియాలో 1925లో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడినవి. భారత కమ్యూనిస్టుపార్టీ, 1964లో చీలిన తర్వాత సిపిఐ గోర్బచెవ్ కాలం దాకా కూడా రష్యన్ కమ్యూనిస్టు పార్టీ వైపే గైడెన్స్ కోసం చూసింది. అంటే వర్గపోరాట పంధాలో కొనసాగిన కాలంలో మాత్రమే కాదు, వర్గ సామరస్యాన్ని ఎంచుకున్న కాలంలో కూడా రష్యన్ కమ్యూనిస్టు పార్టీయే ఆ రెండు పార్టీలకు సరియైన పార్టీ అనిపించింది.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభించిన కాలంలో తన మార్గం చైనాలో సమకాలికంగా నిర్వహింపబడుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవంలోనే ఉంటుందని పార్టీ నాయకత్వం భావించినా ఇక్కడి పార్టీ నాయకత్వం అచిరకాలంలోనే 1951లో సాయుధ పోరాటం కొనసాగించాలా విరమించాలా అడగడానికి మాత్రం స్టాలిన్ దగ్గరికే వెళ్లింది.

నక్సల్బరీ నేపథ్యంలో సిపిఐ (ఎంఎల్) ఏర్పడి జకోస్లవేకియాపై 1966లో రష్యా దురాక్రమణ చేసిందని, రష్యా 1956 నుంచి కేవలం రివిజనిస్టు రొంపిలోకి దిగడమే కాదు, 1966 నాటికి సోషల్ సామ్రాజ్యవాదంగా మారిందని కూడా విశ్లేషించి ప్రకటించింది. కనుక నక్సల్బరీ పంథాలో విప్లవోద్యమం ప్రారంభమైన కాలం నుంచి విప్లవోద్యమానికి బోల్షివిక్ విప్లవం, స్టాలిన్ నాయకత్వంలో సోషలిస్ట్ రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో నిర్వహించిన పాత్ర, రష్యాలో 1953 దాకా కొనసాగిన సోషలిస్ట్ నిర్మాణం మాత్రమే ఆదర్శంగా నిలిచాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన కొన్ని లోపాల విషయంలో స్టాలిన్ గురించి మావో చేసిన విశ్లేషణతో కూడా విప్లవోద్యమంకు ఏకీభావం ఉన్నది.

ఈ వెలుగులో బోల్షివిక్ విప్లవ కాలం నుంచి ఈనాటి దండకారణ్యంలో పదమూడేళ్లుగా కొనసాగుతున్న నూతన ప్రజాస్వామిక వ్యవస్థ బీజరూపమైన జనతన సర్కార్ సైద్దాంతిక మార్గదర్శకులుగా మార్క్, లెనిన్, స్టాలిన్, మావోలను గుర్తిస్తూ, ప్రాపంచిక దృక్పథంగా మార్క్సిజం, లెనినిజం, మావోయిజంను విప్లవోద్యమం స్వీకరించింది.

ఈ అవగాహనతో బోల్షివిక్ విప్లవ వారసత్వాన్ని స్వీకరిస్తూ విప్లవోద్యమ ప్రాంతాలలోని ప్రజానీకం ఈ నవంబర్ 7 నుంచి 13 వరకు శతవార్షికోత్సవాలను నిర్వహించుకున్నారు.

అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం రష్యాలో సామ్రాజ్యవాద బలహీన గొలుసుగా ఉన్న జారిస్ట్ ప్రభుత్వాన్ని కూల్చి మొట్టమొదటిసారిగా ఒక దేశంలో శ్రామికవర్గ నియంతృత్వాన్ని నెలకొల్పింది. కార్మికవర్గాన్ని పరిపాలక వర్గంగా మార్చింది. తాత్కాలిక బూర్జువా ప్రభుత్వాన్ని కూల్చి సోవియట్లకు రాజ్యాంగ అధికారాన్ని ఇచ్చింది. రష్యాలో ఉన్న నలభై కోట్ల ఎకరాల భూమిని ప్రజలపరం చేసింది. నలభై కోట్ల బంగారురూబుల్స్ రుణాలను రద్దు చేసింది. నూనె, బొగ్గు, ముడిలోహం మొదలైన ఖనిజ సంపదలు, అడవులు, జలవనరులు మొత్తం ప్రకృతి సంపదంతా ప్రజలపరం చేసింది. యావత్తు సంపదలను ప్రజల ఆస్తిగా, సమష్టి ఆస్తిగా మార్చివేసింది. రష్యా సోవియట్ల రెండో కాంగ్రెస్ లెనిన్ అధ్యక్షుడుగా సోవియట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సోవియట్ విప్లవం దేశమంతటా పరిపూర్ణం కావడానికి ఐదు నెలలు పట్టింది. అది ఎంతో వేగంగా వ్యాపించింది. దీన్నే లెనిన్ జైత్రయాత్ర అన్నాడు.

ప్రజలందరికీ సోవియట్ర ప్రభుత్వమే బాధ్యతపడి కూడు, గూడు, గుడ్డ, ఉచిత వైద్యం, ఆరోగ్యం, చదువు కల్పించింది. పిల్లల శిక్షణ, పోషణలకు, వృద్ధుల ఆరోగ్యానికి, సౌకర్యానికి సోవియట్లే హామీ పడినవి. పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు, సమాజంలోను, ప్రభుత్వంలోను బాధ్యతలు సమకూరినవి. సామ్రాజ్యవాద ప్రపంచమంతా 1920 నుంచి 35 దాకా తీవ్ర ఆర్థిక మాంద్యానికి గురయిన కాలంలో ఒక్క సోవియట్ రష్యాలోనే ధరల స్థిరీకరణ, ఆర్థిక సంక్షోభం లేని స్థితి ఉన్నది. ఈ కాలమంతా అన్ని అధికారాలు సోవియట్లకే అనే విధానం ఇంచుమించు అమలైంది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ అవసరాల ఉత్పత్తి మీదనే కేంద్రీకరించవలసి వచ్చినా, 1953 వరకు సోవియట్ రష్యా ఒక సోషలిస్ట్ దేశంగా ముప్పై ఆరు సంవత్సరాలు ఒక ఆదర్శంగా నిలిచింది.

బోల్షివిక్ విప్లవంతో కార్మికవర్గానికి రాజ్యాధికారమే కాకుండా, జాతుల విముక్తి సాధ్యమైంది. అట్లాగే సోవియట్ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రెండో ప్రపంచ యుద్ధంలో రెండు కోట్లమంది రష్యన్లు ప్రాణత్యాగం చేసి, ఫాసిజాన్ని మట్టికరిపించి ప్రజాస్వామిక శక్తులకు విజయం చేకూర్చారు. వలసల విముక్తికి దారి వేశారు. ఇదంతా కమ్యూనిస్టు పార్టీ బోల్షివిక్ నాయకత్వంలో శ్రామికవర్గ నియంతృత్వం వల్ల సాధ్యమైంది.

బోల్షివిక్ విప్లవం నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలు.....

- శ్రామికవర్గ పార్టీ లేనిదే అవకాశవాదం, రాజీ లొంగుబాటు వాదాలతో అంతర్గత పోరాటం జరగనిదే శ్రామికవర్గానికి రాజ్యాధికారం లభించదు. అటువంటి శ్రామివర్గ పార్టీకి సాయుధ వర్గపోరాటం ద్వారా ప్రజలకు రాజ్యాధికారం ఇవ్వాలనే విస్పష్టమైన లక్ష్యం ఉండాలి.

- ఈనాటి మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంతం అర్థం కాకుండా కార్మికవర్గ పార్టీ శ్రామికవర్గ విప్లవ నిర్మాతగా నాయకత్వ పాత్ర నిర్వహించజాలదు. ఆంతరంగిక సంబంధాలను, అభివృద్ధి క్రమాన్ని, పరిష్కార మార్గాన్ని అర్ధం చేసుకోవడానికి సిద్ధాంతం అవసరం. సిద్ధాంతం పిడివాదం కాదు. కార్యాచరణకు మార్గం.

- బోల్షివిక్కులు, మెన్షివిక్కులతో చేసిన పోరాటం వలెనె రివిజనిజంతో, అరాచకవాదులతో, సంకుచిత జాతీయవాదులతో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పోస్టు మాడర్నిజంతో, సామ్రాజ్యవాద ఫాసిజంతో, మన దేశంలో బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంతో నిరంతరం పోరాటం చేయకుండా ఇక్కడ నూతన ప్రజాస్వామ్యం విజయం సాధించడం సాధ్యం కాదు.

- తన వర్గం పట్ల, శ్రామిక ప్రజల పట్ల పార్టీ తన బాధ్యతను మనస్ఫూర్తిగా ఆచరణలో నిర్వహిస్తుందా అని సూటిగా అడుగుతూ లెనిన్ తన తప్పలను నిష్కపటంగా అంగీకరించడం, సరిదిద్దుకోవడానికి మార్గాలను క్షుణ్నంగా చర్చించడం, బాధ్యతగల పార్టీ అలవరచుకోవలసిన బోల్షివిజం అని చెప్పాడు. అది ఎల్లకాలాలకు వర్తించేదే.

- పార్టీకి విశాలమైన ప్రజా సంబంధాలు లేకపోయినట్లయితే, ఆ సంబంధాలను బలపరుచుకోనట్లయితే, ఆ సంబంధాలను శ్రద్ధగా నేర్చుకోకపోయినట్లయితే సంకుచిత పరిధిలోనే ముడుచుకుపోతుంది. అది అప్పుడు బలహీనపడుతుంది. ప్రాచీన గ్రీకు పురాణ గాథల్లో ఆంటీయస్ అనే వీరుడు భూమిని అంటిపెట్టుకున్నంత కాలం విజయుడే. హెర్క్యులస్ ఆంటీయస్ను భూమి నుండి పైకెత్తి గాలిలో నిలబెట్టి గొంతుపిసికి చంపాడు.కమ్యూనిస్టుపార్టీ కూడా ప్రజలు అనే భూమిని వదిలితే నాశనం కాక తప్పదని ఈ గ్రీకు గాథ హెచ్చరిస్తుందని స్టాలిన్ చెప్పాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో బోల్షివిక్ పార్టీ చరిత్రను, బోల్షివిక్ విప్లవాన్ని రష్యాలో సోషలిజం ఆచరణను అధ్యయనం చేసి మన పరిస్థితులకు అన్వయించుకోవాలి. విప్లవ ప్రతీఘాతక శత్రుదాడి మన ముందు కీలక సవాలును ముందుకు తెచ్చింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అది ప్రజలపై యుద్దమే ప్రకటించింది. దీనితో దేశవ్యాప్తంగా ఉద్యమం గడుస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రజా సంబంధాలను దెబ్బతీయడానికి శత్రువు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ప్రజాయుద్ధ చర్యలలో బలహీనతలను అధిగమించి, నిర్దిష్ట అధ్యయనానికి పూనుకొని, రహస్య, బహిరంగ కార్యకలాపాలను సమన్వయించి, సామర్థ్యాన్ని పెంచుకొని, ధీటైన ఎత్తుగడలను రూపొందించుకొని, అన్యవర్గ ధోరణులను అడుగడుగునా పరిహరిస్తూ ముందడుగు వేయాలి.

బోల్షివిక్ విప్లవ కాలంలో స్టోలిపిన్ కాలపు నిర్బంధం వంటివి తప్పనట్లుగానే మన దేశ విప్లవ చరిత్రలో కూడా ఎన్నోసార్లు గడుకాలాలు, ఓటములు ముందుకు వచ్చాయి. వీటన్నిటినీ అధిగమించాం. ఇప్పడు ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి రష్యా బోల్షవిక్ పార్టీ చరిత్రలో కావలసినంత రాజకీయ సైద్దాంతిక జ్ఞానం, అనుభవ జ్ఞానం పొందుపరచబడి ఉన్నాయి. దానిని అధ్యయనం చేస్తూ ఉద్యమాలకు నిర్దిష్టంగా అన్వయించుకుంటూ భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసుకుందాం!

బోల్షివిక్ విప్లవం సోవియట్లకే అన్ని అధికారాలు ఇచ్చింది. చైనా నూతన ప్రజాస్వామిక విప్లవం కమ్యూన్లకే అన్ని అధికారాలు ఇచ్చింది. ప్రజలకే రాజ్యాధికారం ఇచ్చే జనతన సర్కార్ వర్ధిల్లేలా వర్గ పోరాట ఆచరణ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని బోల్షివిక్ విప్లవ స్పూర్తితో మరింత దృఢతరంగా నిర్వహించుకుందాం.

No. of visitors : 1181
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆపరేషన్ సమాధాన్లో భాగ‌మే కాంకేర్ ʹఎన్‌కౌంట‌ర్‌ʹ

జగన్ | 05.03.2018 12:26:56pm

కార్పోరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర,చత్తీస్‌గడ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా దాడులు.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •