ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

| సాహిత్యం | క‌థ‌లు

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

- - మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 06.12.2017 12:15:09am

అరగంటలో కారు విలాసరావింటికి చేరింది. అప్పటికే విలాసరావు భార్య రాధమ్మ, కూతురు సారిక ఉన్నారు. చందును చూస్తూ అంది రాధమ్మ,

"చందూ! ఈ టిఫిన్లో అన్నం పెట్టాను. మమ్మల్ని బట్టల షాపు దగ్గర దించి నువ్వు అన్నం తిను. సమయం కలిసి వస్తుంది."

అంటూ కారెక్కింది రాధమ్మ. సారిక కూడా అమ్మతో పాటే వెనుక సీట్లో కూర్చుంటుందనుకున్నాడు చందు. కాని ఆమె ముందు సీట్లోనే కూర్చుంది.

సారికను చూడాలంటేనే భయంగా ఉంది చందుకు. అంతకు నాలుగు రోజుల ముందే "నువ్వు మగాడివేనా? అంది సారిక.

కాని సారికకు అదంతా గుర్తున్నట్టు లేదు. ఆమె చందును ముద్దుపెట్టుకున్నట్టు గాని, కౌగిలించుకున్నట్టుగాని ఆమెలో ఏ ఫీలింగ్స్ లేవు. ʹసారికకు నిజంగా గుర్తులేవా? లేక లేనట్టు నటిస్తుందా?ʹ తెలియడం లేదు చందుకు.

ఉన్నట్టుండి వెనక్కి తిరిగి రాధమ్మనడిగింది సారిక,
"మమ్మీ! బంగారం కూడా ఇవ్వాలే కొందామా? అని.
ʹలేదమ్మా! రాత్రి మీ నాన్నగారు కొనేశారు.ʹ
ʹఅదేమిటి? నాకు నచ్చవద్దా?

ʹతన బంగారు కూతురుకు ఏవి నచ్చుతాయో ఏవి నచ్చవో తెలియక మొత్తం షాపంతా రాత్రికి రాత్రే కొనేశారు. అందులోంచి నీకు నచ్చినవి తీసుకోవచ్చుʹ అంది రాధమ్మ.

ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ నోరు తెరువబోయి సడన్గా బ్రేక్ మీద కాలేశాడు చందు.

ʹఏమయిందిరా చందూ? అంది రాధమ్మ

ʹఏమీ లేదండీ" అన్నాడు చందు.

"ఆశ్చర్యపోయినట్టున్నాడు" నవ్వుతూ అంది సారిక,

ʹఎలా గుర్తుపట్టిందబ్బా? అని మళ్ళీ ఆశ్చర్యపోతూ సారిక వంక చూశాడు చందు.

ʹఎలాగుంది? అన్నట్టు కన్నుకొట్టింది సారిక,

వెంటనే చూపులు తిప్పకున్నాడు చందు. సారిక వైపు అసలే చూడగూడదనుకున్నాడు. ఆమె ప్రవర్తన అతనికి అర్థం కావడం లేదు. ʹసారికది చిలపితనమా? లేక తనపట్ల కోరికా?ʹ తెలియడం లేదతనికి.

అంతలోనే షాపు రానే వచ్చింది. రాధమ్మ, సారిక ఇద్దరూ కారు దిగి షాపులోకి పోయారు. కారు పార్కు చేశాడు చందు.

మధ్యాహ్నం పన్నెండు గంటలు. ఆకలవుతోంది చందుకు. రాధమ్మ ఇచ్చిన టిఫిన్ బాక్స్ తెరిచాడు. చికెన్ ముక్కల వాసన ముక్కుకు తగిలింది. నిన్న మధ్యాహ్నం లక్ష్మి అత్త షాకుల మీద షాకులు ఇవ్వడంతో అక్కడ జగద్గిరిగుట్టలో సరిగ్గా అన్నం తినలేదు. రాత్రి అమ్మ ఏడుస్తూ ఉండడంతో రాత్రి కూడా సరిగా తినలేదు. అందుకే ఆకలి దంచుతోంది. టిఫిన్ బాక్స్ పూర్తిగా ఖాళీ చేశాడు.

ఒంటరిగా కూర్చున్న చందుకు సారిక మనస్తత్వం అంతుబట్టడం లేదు. సారిక గుర్తుకు వస్తేనే చందుకు లత కళ్ళలో మొదులుతుంది.

చందు నాన్న పోయేటప్పటికి లతకు రెండు సంవత్సరాలు. భర్త లేకపోవడంతో కుటుంబ భారమంతా సాయమ్మ మీదనే పడింది. అప్పటికి చందు గవర్నమెంటు స్కూలులో ఒకటవ తరగతిలో చేరాడు.

ʹఒక్క దానివేం కష్టపడుతావు? వాన్ని చదువు మానిపించి నీవెంట పనికి తీసుకపో, కలిసి వస్తుంది" అన్నారు వాళ్ళు వీళ్ళు

కాని సాయమ్మకు వాళ్ళ మాటలు నచ్చలేదు. ఎంత కష్టమైనా చందును చదివించాలనే ఉందామెకు. చందును బడికి పంపి లతను తీసుకొని ఒక్కతే పనికిపోయేది. ఎర్రటి ఎండలో రాళ్ళు కొడుతూనే ఉండేది. సెలవు వస్తే చందు కూడా అమ్మకు చేతనైన సహాయం చేసేవాడు.

వయసులో చిన్నవాడైనా చందు ఇంటి విషయాలు ఆలోచించేవాడు. సాయమ్మ పడుతున్న కష్టం చూచి కుమిలిపోయేవాడు.

అప్పటికే సాయమ్మ అప్పచేసి ఇల్లు కొన్నది. ఆ అప్పు తీర్చడం కోసం ఎండా, వానా చూడకుండా పనిచేసేది. లతకు ఐదేళ్ళ నిండగానే ఆమెను కూడా స్కూల్లో వేసే ప్రయత్నం చేసింది సాయమ్మ అప్పుడూ అన్నారు ఇరుగుపొరుగులు,

ʹఆడపిల్లకు చదువెందుకు? దానికి పని నేర్పు" అని.

కాని సాయమ్మ ఒప్పకోలేదు. లతను బడికి పంపింది.

పదమూడు సంవత్సరాలకే లత పెద్దమనిషయింది. పెద్దమనిషయిందంటే చాలు, మగపోరగాండ్ల చూపులన్నీ ఆ పిల్లమీదే అనుకొని సాయమ్మ ఆ విషయాన్ని దాచిపెట్టింది. కాని ఎదిగే పిల్లల వయసును కప్పిపుచ్చినా ఎదుగుదలను దాచలేమని సంవత్సరం లోపే సాయమ్మకు తెలిసివచ్చింది. ఇక ఎంతోకాలం ఆ రహస్యాన్ని దాచలేమని అప్పడే పెద్దమనిషయినట్టుగా లతను కూర్చుండబెట్టింది.

చుట్టాలు, ఇతరులు తెచ్చిన కుడుకలను నూర్చి గరిజెలు చేసి లతకు పెట్టింది సాయమ్మ తనకు ఉన్నంతలో ఫలహారాలు చేసిపెట్టింది. పది రోజుల దాకా లతను ఇంట్లోనే ఉంచి తర్వాత స్కూలుకు పంపింది.

మొదలే తెల్లగా ఉండే లత పదిరోజులు ఇంట్లో నీడకు ఉండి, అవీ ఇవీ తినేసరికి మరింత తెల్లబడి ఆకర్షణీయంగా తయారయింది. శరీరంలో ఆడఛాయలు స్పష్టంగా కనిపించడం మొదలయ్యాయి. దాంతో మగపిల్లల చూపులు లతను చుట్టుముట్టసాగాయి.

అప్పటికి చందు పదోతరగతి ఫెయిలై చదువు మానేశాడు. అంతకు ముందు అన్నాచెల్లెల్లిద్దరు కలిసి స్కూలుకు పోయేవారు. చందు స్కూలు చదువు అయిపోవడంతో లత ఒంటరిగా బడికి పోవలసివచ్చింది.

తొమ్మిదో తరగతి పూర్తయ్యేవరకు లత చదువు నిరాటకంగానే సాగింది. పదో తరగతిలో చేరినప్పటి నుండి ఆమెకు ఇబ్బందులు మొదలయ్యాయి. దానికి కారణం నాగరాజు.

నాగరాజు లత కుటుంబానికి దూరపు బంధువు. నాగరాజు తల్లి చనిపోవడంతో అతడు పెద్దమ్మగడ్డలో ఉన్న వాళ్ళ చిన్నమ్మ ఇంటికి వచ్చాడు. వచ్చీ రావడంతోనే అతని చూపులు లత మీద పడ్డాయి. నాగరాజుకు చదువులేదు. సంస్కారం అసలే లేదు. ఎవరన్నా భయంలేదు. రౌడీ వెధవ, ఓ లక్ష్యం లేదు, జీవితమంటే శ్రద్ధ లేదు. మంచీ మర్యాద లేదు. తాగుబోతు. గుట్కాలు తింటాడు, తిరుగుబోతుకూడా. ఒక్క మంచి లక్షణం కూడా లేని జులాయి వెధవ నాగరాజు.

ఒకనాడు నాగరాజు లత వెంట పడ్డాడు. ʹమరదలు వవుతావంʹటూ మాట కలిపాడు. లత అతన్ని పట్టించుకోలేదు. ఇది చిన్న విషయమే కదా? అని అమ్మకు, అన్నకు చెప్పలేదు.

రోజులు గడుస్తున్న కొద్ది నాగరాజు వింతగాను, విచిత్రంగాను, అసహ్యంగాను మాట్లాడడం మొదలు పెట్టాడు. చందును బామ్మరిదిʹ అంటూ పిలవడం ప్రారంభించాడు. దాంతో ఒకరోజు కోపం వచ్చి చందు నాగరాజును కొట్టాడు. పెద్ద గొడవ జరిగింది. నాగరాజు చిన్నమ్మ సాయమ్మ మీదికి యుద్దాని కొచ్చింది.

ʹమరదలును మరదలంటే తప్పేమిటని, బామ్మరిదిని బామ్మరిది అంటే నేరమేమిటని నానా గొడవ చేసింది. రెండు రూములున్నంత మాత్రన పెపెద్దోళ్ళయిపోతారా? అంటూ నానా యాగీ చేసింది. చిన్నమ్మ అండ ఉండడంతో నాగరాజు మరింత పేట్రీగిపోయాడు. దాంతో లతకు నాగరాజు బాధ ఎక్కువయింది.

అలా ప్రారంభమైన గొడవ రెండు కుటుంబాల మధ్య శతృత్వంగా మారింది. అది సాకుగా నాగరాజు, లతను వేధించడం ఎక్కువ చేశాడు. అప్పుడు ʹఎందుకైన మంచిది, వాడు పిల్లను ఏం చేస్తాడోనʹని భయపడి సాయమ్మ లత చదువు పదో తరగతి మధ్యలోనే ఆపేసింది, ఐనా నాగరాజు లత వెంటబడడం మానలేదు.

చుట్టపు చూపుగా చిన్నమ్మ ఇంటికి వచ్చిన నాగరాజు స్వంత ఊరుకు పోయినా వెంటనే తిరిగొచ్చాడు. ఎందుకంటే భార్య చనిపోవడంతో నాగరాజు తండ్రి వేరే ఆమెను పెళ్ళీ చేసుకున్నాడు. నాగరాజుకది నచ్చక మళ్ళీ చిన్నమ్మ పంచన చేరాడు. అక్క కొడుకే కదా అని ఆమె అతన్ని ఇక్కడే ఉండమంది.

అలా పెద్దమ్మగడ్డలో స్థిరపడ్డ నాగరాజు ఓ పది మంది పోకిరీలను తయారు చేసుకున్నాడు. పొద్దంతా తినడం, తిరగడం, రాత్రయితే చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు నాగరాజు. దొంగిలించిన సొమ్ముతో తాగుడు లాంటి జల్సాలకు అలవాటు పడ్డాడు.

సాయమ్మ కుటుంబం మీద నాగరాజు చిన్నమ్మకు చాలాకాలంగా ఈర్శ్య ఉంది. భర్త పోయినా సాయమ్మ వాళ్ళు మంచిగా బతుకుతున్నారన్న అసూయ అది. ఆ కారణంగా ఆమె మాటి మాటికి నాగరాజును సాయమ్మ కుటుంబం మీదికి ఉసిగొల్పేది. నాగరాజు ఏం చేసినా వెనకేసుకొచ్చేది.

ఓసారి నాగరాజు చందు ఇంట్లోనే దొంగతనం చేశాడు. చందు పోలీసు రిపోర్టిచ్చాడు. పోలీసులు నాగరాజును పట్టుకుపోయి దేహశుద్ధి చేసి వదిలేశారు.

దాంతో నాగరాజుకు చందు కుటుంబం మీద కోపం ఎక్కువయింది. ఓరోజు లతను పెళ్ళి చేసుకుంటానంటూ వెంటబడ్డాడు. మరో రోజు ఆసిడ్ పోస్తానంటూ నానా బీభత్సం చేశాడు. అప్పడు సాయమ్మ పని మానివేసి పది రోజులు లత వెంటే ఉంది.

సద్దుమణిగింది కదా అని పదకొండో రోజు సాయమ్మ పనికి పోయింది. సమయం దొరికిందని ఆరోజు నాగరాజు లత మీదికి ఆసిడ్ విసిరాడు. అదృష్టవశాత్తు అది లత మీద పడలేదు గాని, పడితే లత ముఖం భయంకరంగా కాలిపోయేది.

చందు మళ్ళీ పోలీసు రిపోర్టిచ్చాడు. పోలీసులు పట్టుకుపోయి రెండు రోజులుంచుకొని వదిలేశారు. పోలీసు స్టేషను నుండి వచ్చిన నాగరాజు ఒకరోజు తన గుంపుతో కలిసి చందు మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చందు వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు.

ఈసారి నాగరాజుకు ఒక సంవత్సరం జైలుశిక్ష పడింది. జైలుకు పోతూ వచ్చాక చందును చంపేస్తానని, లతను పెళ్ళి చేసుకుంటానని, ఆమె చేసుకోనంటే ఆమెను కూడా చంపేస్తానని శపథం పూనాడు.

నాగరాజు జైలు శిక్ష ఈ డిసంబరుతో ముగుస్తుంది.

నాగరాజు జైలుకు పోయినప్పటినుండి లత పెళ్ళి ప్రయత్నాలు తీవ్రం చేసింది సాయమ్మ వాడు జైలు నుండి వచ్చేసరికే ఎలాగైనా లత పెళ్ళి చేయాలని భావించింది. చందు కూడా ఇల్లు అమ్మైనా సరే, ఎక్కువ కట్నం ఇచ్చైనా సరే చెల్లి పెండ్లి చేయాలనుకున్నాడు.

అనుకున్నట్టే కలిసి వచ్చింది. ఇల్లు అమ్ముడుపోయింది. లతకు మంచి సంబంధం దొరికింది, డబ్బులు కూడా చేతికి వచ్చాయి. సాయమ్మ చందులు సంతోషపడ్డారు. కాని అంతలోనే పెద్దనోట్ల రద్దు ప్రమాదం ముంచుకొచ్చింది. లత పెళ్లి ప్రతిష్టంభనలో పడింది.

లత గుర్తుకు రాగానే చందు కళ్ళలో నీళ్ళ తిరిగాయి. సారిక లాంటి అమ్మాయికి లేని కష్టాలు లతకు ఎందుకు రావాలో తెలియడం లేదతనికి ʹసారిక ఏం చేసినా కలిమి కాపాడుతున్నది. లత ఏం చేయకపోయినా లేమి కాపాడలేకపోతున్నది. ఏమిటో పరిస్థితి? ఇది వాంఛనీయమేనా? ప్రత్యామ్నయం లేదా? చందులో అన్నీ ప్రశ్నలే.

చందు ఆలోచనలను బ్రేక్ చేసూ ఫోన్ మోగింది.

ʹచందూ! లోపలికి రా!" అంటూ రాధమ్మ ఫోన్

చందు లోపలికి పోయాడు. పెండ్లి బట్టలు ప్యాక్ చేసి పెట్టారు. ఇదువరకు కొన్నవాటితో కలిపి పెద్ద పెద్ద ప్యాక్లు ఐదారున్నాయక్కడ. పెండ్లి చీర, రిసిప్షన్ చీర రెండిటికే 20 లక్షలయిందట. వాటిల్లో బంగారం, వెండిపోగులుంటాయట. రెండు మూడు నెలల ముందే విలాసరావు ఆర్డర్ చేశాడట. వాళ్ళు అనుకుంటుంటే తెలిసింది చందుకు.

బట్టల షాపులో పనిచేసేవాళ్ళు చందు అందరూ కలిసి అవన్నీ కారులో సర్దారు. రాధమ్మ, సారికలను, బట్టలను ఇంట్లో దించి నాలుగు గంటల వరకు విలాసరావును కలిశాడు చందు.

No. of visitors : 939
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

మెట్టు మురళీధర్‌ | 02.11.2017 10:33:52am

అత్త అలా ఎందుకందో అర్ధం కాలేదు చందుకు. కట్నం తీసుకోవడం నేరమనే విషయం తెలుసు లక్ష్మికి. ʹకట్నం ఇచ్చుడు, పుచ్చుకోవడం రహస్యంగా జరగాలి. ఈ విషయం కూడా తెలియని అమాయ...
...ఇంకా చదవండి

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 21.03.2018 10:29:25am

ఇక ఏ.టి.యం ల విషయం ప్రహసనంలా మారింది. దాదాపు అన్ని ఏ.టి.యం. లు మూత పడే ఉన్నారుు. ఏ.టి.యం.లు లోపల పాతనోట్ల సైజుకే సరిచేయబడి ఉన్నాయట. కొత్తనోట్లు పాత వాటిసైజు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జూలై - 2019

  చారిత్రక పత్రం
  రచయితలకు సవాల్ !
  మూడు తరాల, యాభై వసంతాల విరసం
  వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
  రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
  తిరిగి వ‌స్తావ‌ని
  నన్నెక్కనివ్వండి బోను
  కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
  సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
  సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •