కవిలో చిత్తశుద్ధి ఉంది - అవగాహనే కొరవడింది

| సాహిత్యం | స‌మీక్ష‌లు

కవిలో చిత్తశుద్ధి ఉంది - అవగాహనే కొరవడింది

- వి. చెంచ‌య్య‌ | 06.12.2017 12:51:59am

కవిత్వం రాసేవాళ్ళలో కొంత మంది విచిత్రంగా కనిపిస్తారు. మంచి కవిత్వం రాస్తారేగాని, ఆ కవిత్వంలో ఎలాంటి భావాలు దొర్లుతున్నాయో వాళ్ళకే తెలియనట్టు అనిపిస్తుంది. భావాలలో వైరుధ్యాలు, గందరగోళం ఉన్నా అది పట్టించుకోకుండా రాసేస్తుంటారు. అభ్యుదయవాదా, విప్లవవాదా, ప్రగతి నిరోధకవాదా అర్థం గాకుండా కవిత్వ రచన చెయ్యడం విచిత్రమే గదా! అన్ని రకాల భావాలూ ఆ కవితల్లో కనిపిస్తాయి. నిజానికి వాళ్ళ మనసులో ఏముంటుంది? ఎక్కువ మంది ప్రగతిశీల భావాలు వ్యక్తం చెయ్యడానికే ఇష్టపడతారనుకుంటాను. అయితే దానికి తగిన అధ్యయనం లేకుండా కవిత్వం రాయడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కవిత్వ వ్యక్తీకరణ శక్తి ఉన్నంత మాత్రాన్నే చాలదు. ఎలా చెప్పాలి అన్నదాంతో బాటు, ఏం చెప్పాలి అనే స్పష్టత కూడా ఉండాలి. ఇవాళ అభ్యుదయకరంగా కవిత్వం రాసేవాళ్ళకు చాలా విషయాలు తెలియాలి. సమకాలీన సామాజిక స్థితిగతులు, రాజకీయ ధోరణులు, పాలకవర్గ స్వభావాలు, ఆర్థిక పరిణామాలు మొదలయిన వాటితో బాటు మార్క్సిస్టు సిద్ధాంత పరిజ్ఞానం కూడా అవసరం. ఈ సైద్ధాంతిక అవగాహన లేకపోవడం వల్లనే చాలా మంది కవుల్లో భావ గందరగోళం ఏర్పడుతోంది. దీనికి ఒక ఉదాహరణ కర్నూలు సాహితీ స్రవంతి ప్రచురించిన కెంగార మోహన్‌ ʹకవన సేద్యంʹ కవితా సంపుటి.

ʹʹవొకడుగు ముందుకు వందడుగులు వెనక్కి
తిరోగమన దిశలో పరిభ్రమిస్తున్న
సమాజాన్ని ప్రశ్నించాలని ఉందిʹʹ
అంటారు కవి. సమాజాన్ని ప్రశ్నించడమనేది స్పష్టత లేని ధోరణి. సమాజం తిరోగమించడానికి కారకులెవరో తెలుసుకోకుండా, వారిని వదిలేసి సమాజాన్ని ప్రశ్నించడం అర్థం లేని పని. సమాజం ఒక ముద్దలాంటిది. అందులో ప్రశ్నించే వాళ్ళు, ప్రశ్నింపబడే వాళ్ళూ ఇద్దరూ ఉంటారు. సమాజాన్ని ప్రశ్నించడమంటే, అసలు ప్రశ్నించవలసిన వాళ్ళని వదిలెయ్యడమే. ఇది తెలిసి చేసే వాళ్ళుంటారు. తెలియక చేసే వాళ్ళుంటారు. తెలిసి చేసే వాళ్ళు పాఠకుల్ని మోసం చేసి అంతిమంగా పాలక దోపిడీ వర్గాలకు ఉపయోగపడతారు. తెలియక చేసేవాళ్ళు తమ అమాయకత్వంతో, అజ్ఞానంతో పాఠకుల్లో సరైన అవగాహన కలిగించలేదు. కెంగార మోహన్‌ ఈ రెండో రకానికి చెందిన కవి. ముందు ముందు సరైన దృక్పథం ఏర్పర్చుకుంటే సమాజానికుపయోగపడేకవి.

ʹʹమాయమవుతున్నది / మనిషొక్కటే కాదు / మాతృభాష కూడా...ʹʹ అన్న ఈ కవిపై ʹʹమాయమైపోతున్నాడమ్మా, మనిషన్నవాడుʹʹ అనే అందెశ్రీ పాట ప్రభావం చూపినట్టుంది. ఈ పాట చాలా మంది శ్రోతలతో బాటు, కవులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపడం గమనించొచ్చు.

పాటలో నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు మనిషిగా మిగిలి ఉన్నాడని చెప్పినా, మనిషి మాయమైపోతున్నా ఉన్నమాటే ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. అందుకని ఎక్కువగా ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తోంది. మనిషి మాయమైపోతున్నాడనే విషయం చాలా మంది తమ జీవితానుభవాల ద్వారా గుర్తిస్తున్న విషయమే. ఎందుకు మాయమైపోతున్నాడనే విషయమే చాలా మందికి తెలియదు. కవి చెప్పవలసింది ఈ విషయాన్ని. కవికి కూడా ఇది తెలియనప్పుడు పాఠకులు ఆ భ్రమలోనే ఉండిపోతారు. మనిషిని మాయం చేస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కుట్రను తమ స్వార్థం కోసం తెలిసి అంగీకరించి అనుసరిస్తున్న పాలక వర్గాల నైజాన్ని విప్పి చెప్పకపోతే అది ఎంత గొప్ప పాటగా ప్రసిద్ధి పొందినా, సమాజానికి నష్టాన్నే కలగజేస్తుంది. సామ్రాజ్యవాదుల కుట్రకు వత్తాసు పలుకుతూ, ప్రజల్ని వంచిస్తున్న మన పాలక వర్గ దుర్మార్గాన్ని ఎదుర్కొని పోరాడుతున్న దండకారణ్య ఆదివాసులలో మనిషి మాయం కాలేదు, మిగిలే ఉన్నాడు. వారిని చైతన్యపరుస్తూ, వారికి అండగా నిలిచి, దేశ సంపదను కాపాడుతూ, ప్రాణాలకు తెగించి పోరాడుతూ, సంపద ఏ కొద్ది మందిదో కాదు, అందరిదీ అని చాటి చెబుతున్న విప్లవకారులలో మనిషి మిగిలే ఉన్నాడు. చూసే చూపు ఉండాలి గాని, మాయమవుతున్న మనిషితో బాటు మనిషిని కాపాడుతున్న మనుషులూ కనిపిస్తారు.

ఈ కవి మనిషితో బాటు మాతృభాష కూడా మాయమైపోతున్నదంటారు. భాష తన ఉనికిని కోల్పోతున్నదనీ, దాన్ని బతికించుకుందామనీ అనడం ఇవాళ ఒక ఫ్యాషన్‌గా కూడా కనిపిస్తోంది. భాషను చంపుతున్న వాళ్ళెవరో కవులకు తెలియదా? వాళ్ళను సూటిగా ఎందుకు ప్రశ్నించరు? మాతృభాషను బతికించండి, అవినీతికి పాల్పడకండి, విలువల్ని పెంచండి అని ప్రజలకు ఊదరగొడితే ఏం లాభం? ఈ పని చేసేవాడు అంతిమంగా పాలకవర్గ ప్రయోజనాలను కాపాడేవాడే. పాలకవర్గాన్ని ప్రశ్నించలేని కవి ప్రజలకు విజ్ఞప్తి చేసే నైతిక హక్కును కోల్పోతాడు.

మానవ మృగాలను తరిమి కొట్టి నడి వీథిలో ఉరివేయాలనే ఆవేశాన్ని ప్రదర్శించిన ఈ కవి ʹʹమానవత్వం మరణ వాంగ్మూలం ఎప్పుడో రాసేసి మనిషి ముఖంపై విసిరేసిందిʹʹ అని అనే కవితలో నిరాశను వ్యక్తం చేస్తాడు. ఓట్ల పచ్చనోట్ల పద్మవ్యూహంలో బందీ అయ్యాక అపహాస్యమవుతున్నది ప్రజాస్వామ్యమే కదా అని అంటున్న కవి ఆ ప్రజాస్వామ్య బందిఖానా నుండి బయటపడాలని ప్రయత్నించాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్న రాజకీయ నాయకులు నీతులు బోధిస్తే వింటారా? హింసను ప్రేరేపిస్తూ శాంతి లేకుండా చేస్తున్న నేతలను అహింసే మా ఆయుధమనీ, శాంతి మీ నినాదమనీ ప్రతిజ్ఞ పూనమంటే ప్రయోజనం ఉంటుందా? నేతల మాటల్ని రాజకీయ వ్యభిచార ప్రసంగాలుగా చెబుతున్న కవి ప్రజలకు ఏం బోధించాలి? ఆకలి తీర్చాలన్నా, అతివను కాపాడాలన్నా చట్టం కావాలని కవి అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజ్యాంగంలో ఇదివరకున్న చట్టాలన్నీ సక్రమంగా అమలవుతున్నట్టు ఇప్పుడు ఇంకో చట్టం కావాలని అడగడం, అందులోనూ మోదీ ఇంద్రజాలాన్నీ ఒక వైపు గుర్తిస్తూనే అడగడాన్ని ఏమనుకోవాలి?

ʹʹగతమెంతో మధురమైంది
వర్తమానమెప్పుడూ ప్రశ్నార్థకమేʹʹ

మరి భవిష్యత్తు సంగతేమిటి? ఆధునిక వేలం వెర్రి ʹʹనాగరికతʹʹలో దొరికే ఆనందం కంటే, పాతకాలపు పల్లెటూరి అనుభవాలలో ఉండే సంతృప్తి గొప్పదే. అందుకని వెనక్కి వెళ్లలేం కాదు. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. చరిత్ర పునరావృత్తం అయినట్టు కనిపిస్తుందే గాని, యధాతథంగా పునరావృత్తం కాదు. అందులో ఎంతో కొంత పురోగతి ఉంటుంది. వర్గ వ్యవస్థలో ఆ కొంచెం పురోగతి ప్రజల అనుభవంలోకి రాదు.

ʹʹఅక్షర ప్రభంజనం
సృష్టించాలని ఉందిʹʹ

ఇది కవి కోరిక. సృష్టించాల్సింది అక్షర ప్రభంజనాన్నే కాదు, ఆచరణ ప్రభంజనాన్ని కూడా. దానికి వ్యక్తి మాత్రుడు చాలడు. సంఘటిత శక్తి కావాలి. కవితా ప్రభంజనానికి సామాజిక ప్రభంజనమే ప్రేరణ. అస్తిత్వం చైతన్యానికి కారణమవుతుంది గాని, చైతన్యం అస్తిత్వానికి కారణం కాదు. ఇది మార్క్సిస్టు మూల సూత్రం. కవులు, కళాకారులు, మేధావులు గుర్తించాల్సిన విషయం ఇది. మానవ సమిష్టి చైతన్యం వైపు కవి కలం ఎక్కు పెట్టాలి.

ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్నాదంటూ ʹʹపారదర్శకత కోసం పరితపిస్తే మిగిలేది వైరాగ్యమేʹʹ అంటాడు మరో కవితలో

ʹʹసిద్దాంత వైరాగ్యాన్ని
మూలాల్లోంచి విసిరేయాల్సిన
సందర్భమెప్పుడో వచ్చేసిందిʹʹ

అంటాడు. సిద్ధాంత వైరాగ్యం లేకుంటే ఏ రకమైన వైరాగ్యమూ ఉండదు, వైరాగ్యమే సిద్ధాంతమైన వాడికి తప్ప. డోలాయమాన స్థితి కవికి పనికి రాదు.

ʹʹమట్టి రేణువు లెంత తహతహ లాడినా, ప్రకృతి కోపం చల్లారడం లేదుʹʹ అని వర్షం రాకపోవడాన్ని కవి ప్రకృతి కోపంగా భావిస్తున్నాడు. ఇవాళ రుతువులు మారిపోవడానికి సామ్రాజ్యవాదులు సృష్టిస్తున్న కాలుష్యమే కారణం. ఇది అన్ని దేశాల ప్రభుత్వాలకూ తెలుసు. అప్పుడప్పుడూ ప్రపంచ పర్యావరణ సదస్సులు పెట్టి, కాలుష్య నివారణకు ఒట్టొట్టి తీర్మానాలు చేసి ప్రజల్ని మభ్యపెడుతుంటారు. కవులు ఎండగట్టాల్సింది ఈ స్వభావాన్ని ʹʹకలం కన్నీళ్ళు కారుస్తూ రక్తాక్షరాలతో కృషీవలుడి చరిత్రనుʹʹ రాయడం వల్ల ప్రయోజనం లేదు.

ʹʹఅన్వేషణʹʹ కవితలో ʹʹమానవతా పరిమళాలను వెదజల్లే మనుషుల కోసం అన్వేషిస్తుంటానుʹʹ అంటాడు. వర్గ సమాజంలో మానవత్వాన్ని అన్వేషిస్తుంటే అదెప్పటికి కనబడదు. కవి తన కలంతో సాంస్కృతిక వర్గ పోరాటం చెయ్యాలి. మానవత్వాన్ని మంటగలిపే శక్తుల్ని అన్వేషిస్తే అవి కనబడతాయి. అన్వేషించవలసింది మానవత్వాన్ని కాదు, దాన్ని మంటగలిపే శక్తుల్ని, వాటిని అణచివెయ్యడానికి అవసరమైన మార్గాల్ని.

రుతువులన్నీ క్రమం తప్పకుండా వస్తాయి. వర్షం తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తిస్తుంది. సూరీడు ఉగ్రరూపం దాల్చరు. భీవర భూకంపాలూ, ప్రళయ సునామీలూ ఉండవు. ఇది కవికొచ్చిన కల. ఇది నిజమైతే ఎంత బాగుంటుందో అని ఆశపడతాడు. కలలు కంటున్నాడు గాని, వాటిని నెరవేర్చుకునే మార్గమే కవికి కనబడడం లేదు. మరో ప్రపంచాన్నీ, సమ సమాజాన్నీ కలగంటూ

ʹʹనడిచే దారిలో ఎన్ని ముళ్ళున్నా
సిద్ధాంత కరవాలంతో ఏరేస్తాʹʹ

అంటాడు. ఆ సిద్ధాంత దృక్పథంతో విషయాల్ని పరిశీలించడంలో మాత్రం పొరబాట్లు జరుగుతున్నాయి. ʹʹఆటవిక యుద్ధాన్ని ఇంకెన్నాళ్ళు చేద్దాం?ʹʹ అన్నప్పుడు కవి ఆటవిక అనే మాటను దుర్మార్గానికి ప్రతీకగా వాడినట్టు కనిపిస్తోంది. ఆటవికులు అడవిలో ఉండేవారు. వారు మన దృష్టిలో అనాగరికులు వారిలో నిజాయితీ ఉంటుంది. ఇవాళ ఆ అటవికులే (ఆదివాసీలే) మన ఖనిజ సంపదను కాపాడుతూ సైన్యంతో పోరాటం చేస్తున్నారు. నాగరికులు అవకాశవాదంతో జీవిస్తూ వారినే తప్పుబడుతున్నారు.

జ్యోతిబసు మృతికి సంతాపంగా రాసిన కవితలో శ్రమైక జీవన సౌందర్యానికి అర్థం చెప్పిన మహర్షి అన్నాడు. 1967లో నక్సల్బరీ రైతులపై పోలీసులు కాల్పులు జరిపినప్పుడు పశ్చిమ బెంగాల్‌కు జ్యోతిబసు హోంమంత్రి. ఆ కాల్పుల ద్వారా ఆయన శ్రమైక జీవన సౌందర్యాన్ని తుపాకీ గొట్టాలకు బలి చేశాడు. పోరాటాన్ని వదిలి, పార్లమెంటరీ పంథాలో సమసమాజాన్ని తెస్తామంటున్న సి.పి.ఐ.(ఎం) పార్టీ నాయకుడాయన. ఇవాళ తక్కిన పార్లమెంటరీ బూర్జువా పార్టీలకూ, రివిజనిస్టు పార్టీలకూ తేడా లేకుండా పోయింది. విప్లవం కోసం కాదు, నాలుగు సీట్ల కోసం ఏ బూర్జువా పార్టీతోనైనా చేతులు కలిపే స్థాయికి ఆ రెండు ʹకమ్యూనిస్ట్‌ʹ పార్టీలూ దిగజారిపోయాయి.

కవి అన్నట్టు ప్రపంచానికి శాంతి అవసరం - నిజమే. శాంతి ఎలా వస్తుంది? అదే పెద్ద ప్రశ్న. సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పలేదా? ఆ యుద్ధాన్ని నిర్మూలించి శాంతిని స్థాపించాలంటే కమ్యూనిస్టు పార్టీ ప్రజాయుద్ధం చెయ్యక తప్పదు.

ఈ మాటలు కవిపైన వ్యతిరేకతతో చెప్పినవి కాదు. కెంగారమోహన్‌ మంచి కవి. అభ్యుదయ దృక్పథంతో కవిత్వం చెప్పడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన కవి. అందులో సందేహం లేదు. అయితే సైద్ధాంతిక అవగాహనలో దొర్లుతున్న పొరబాట్లను సరిదిద్దుకుంటే, వర్గ చైతన్య పరిజ్ఞానాన్ని పెంచుకుంటే పీడిత వర్గం తరఫున సాంస్కృతిక రంగంలో పోరాడే కవి సైనికుడవుతాడు.

No. of visitors : 154
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఒంటరిగా మిగిలిపోకూడని కవి

వి. చెంచయ్య | 05.09.2017 11:21:59pm

ఈ కవిలో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఒకసారి ఆశ, మరోసారి నిరాశ; ఒకచోట చైతన్యం, మరోచోట వైరాగ్యం. ముందు ముందు ఈ కవి ఎటువైపు మొగ్గుతాడో అనే అనుమానం కలగక మానదు......
...ఇంకా చదవండి

తెలుగు భాషనే ఊపిరిగా పీలుస్తున్న చెన్నైవాసి

వి. చెంచయ్య | 18.11.2017 12:26:42am

తెలుగు భాషను సంబంధించిన అనేక విషయాల్ని సంజీవరావు ఈ 80 పేజీల పుస్తకంలో అద్దంలో చంద్రుడిలాగా వివరించడానికి ప్రయత్నించాడు. వర్ణవిభాగం, పద విభాగం, అర్థం - అన.....
...ఇంకా చదవండి

బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?

వి. చెంచయ్య | 02.11.2017 10:55:39am

అన్ని తాత్విక చింతనలనూ పరిశీలించి, సరైన నిర్ణయానికి రావడానికి బుద్ధుడి జ్ఞాన సిద్ధాంతాన్ని తెలియజేసే కాలామ సుత్తం ఆచరణాత్మకమైన ప్రాతిపదికన అందిస్తుందని రచయ...
...ఇంకా చదవండి

కవి ఆక్రోశం కవుల సమిష్టి ఆక్రోశం కావాలి

వి. చెంచయ్య | 06.10.2017 12:06:03am

అగ్రవర్ణ ఆధిపత్యం మన సమాజంలో అనాదిగా ఉన్నదే. అయితే కులవ్యవస్థలోని లోటుపాట్లను పాలకవర్గం ఎలా తెలివిగా ఉపయోగించుకుంటున్నదో కవి దృష్టిని వదిలిపోలేదు......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  తెగులు సోకిన రచయితలారా రండీ
  ఎవరి ప్రాభవం తండ్రీ..
  వెలివేయబడ్డ అక్షరం
  గుండె గుర్తులు వెతుక్కుంటూ
  ఏ స‌మాజం కోసం?
  సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌
  అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?
  ప్రతివాది
  కవి ఎక్కడ?
  ధిక్కార స్వరాలకు ఆహ్వానం
  సౌందర్యాత్మక కవిత
  అమ్మకొ లేఖ!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •