బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

| సంపాద‌కీయం

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

- వరవరరావు | 16.12.2017 06:17:47pm

తమకు తాము సిపి (బాట‌) నక్సలైట్లుగా ప్రకటించుకున్న ఎనమండుగురు యువకులను 14వ తేదీ ఉదయం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో అరెస్టు చేసి టేకులపల్లి అడవుల్లో కాల్చివేసి ఎన్‌కౌంటర్‌ ప్రకటించిన ప్రభుత్వం రేపటి (15వ తేదీ) నుంచి నెత్తుటి భాషలో ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. ఇది ఇవాళ కోయా, దళిత, బడుగువర్గాల నుంచి వచ్చిన యువకుల నెత్తుటి తడి మాత్రమే కాదు, మొన్న హైదరాబాద్‌ నగరంలో మానేరు హాస్టల్‌ విద్యార్థి బలవన్మరణం, కొద్ది రోజుల క్రితం ఎంఆర్‌పిఎస్‌ నాయకురాలు భారతిపై పోలీసు దాడివల్ల మరణం వంటి ఎన్నో అసహజ మరణాల నెత్తుటి భాష. ఇది ప్రభుత్వం భాష.

భాష భావ వినిమయ వాహిక. మానవ సంబంధాల వ్యక్తీకరణ సాధనం. మనుషులను ఏకం చేసే భాష పాలకులుగా, పాలితులుగా విభజించి, పీడకులుగా, పీడితులుగా విభజించి ఆధిపత్య భాషగా దౌర్జన్యాన్నీ, హింసనూ కష్టజీవులైన ప్రజలపై ప్రయోగించి ఆధిపత్య భాషా ఉత్సవాలు జరుపుకుంటున్నది. మానవ సంబంధాలను, మానవ వికాసాన్ని, ఉన్నతీకరణను చిత్రించవలసిన సాహిత్యం పాలకవర్గాల దళారీ గ్లోబల్‌ భాషలో సాహిత్య చర్చలు చేయబోతున్నది. వైదిక భావజాలాన్ని, రాజస్థానాలను, సంస్కృత ఛందస్సును ఈసడింజి, చాపకూడు ఏర్పాటు చేసి వీరశైవాన్ని దేశీ జానుతెనుగు ఛందస్సులో ప్రచారం చేసిన పాల్కురికి సోమనాథుని ప్రాంగణంలో బ్రాహ్మణీయ ముహూర్తంలో, సరస్వతీ శ్లోకాలతో, వైదిక మంత్రోచ్ఛారణలతో, అవధానులతో ఫ్యూడల్‌ వాసనలు కరుడుగట్టిన సామ్రాజ్యవాద దళారీ పాలక ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభిస్తున్నది.

గత నాలుగు ప్రపంచ తెలుగు మహాసభలకు, ఈ పాలకవర్గ ప్రపంచ తెలుగు మహాసభలకు రూపంలోనే కాదు సారంలో కూడా తేడా లేదు.

ప్రపంచ తెలుగు మహాసభలను తెలుగు కవులు, కళాకారులు, రచయితలు, బుద్ధిజీవులు ప్రజాస్వామ్యవాదులు ఎందుకు బహిష్కరించాలో ప్రపంచమంతా చర్చించుకుంటున్న మూడు అప్రజాస్వామిక చర్యలను పేర్కొనమంటే వెంటనే స్ఫురించేవి:

1) రోహిత్‌ వేముల స్మృతిబద్ధ హత్య - ఈనాటికీ కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు కుట్రదారులుగా, హంతకులుగా, అబెటర్స్‌గా వ్యవహిస్తున్న తీరు.

ఇది కేవలం ప్రపంచం చర్చిస్తున్న అంశమే కాదు ప్రపంచాన్ని, ప్రజాస్వామ్యవాదులను, బుద్ధిజీవులను కుదిపేసిన అంశం. కుదిపేస్తున్న అంశం. దళిత సమస్యలు, అంటరానితనం రోహిత్‌ వేముల (ఆత్మ) హత్యకు ముందు, అనంతర కాలాలుగా చర్చించబడుతున్న అంశం.

2) ప్రొ. జి.ఎన్‌. సాయిబాబా అరెస్టు యావజ్జీవ కారాగారశిక్ష. ఆయన చావు బతుకుల్లో ఉండి జంతువు వలె బతుకీడుస్తున్నారని రాసినా స్పందించని న్యాయవ్యావస్థ. రాజ్యం. మహారాష్ట్ర పోలీసులు ఢిల్లీలో ఉన్న ప్రొఫెసర్‌ను అరెస్టు చేస్తే తెలుగు సమాజం ఏమి చేస్తుందనేది తప్పించుకునే సాకు అవుతుంది. నూతిలో కప్ప, లేదా ఉష్ట్రపక్షి వైఖరి అవుతుంది. కొందరు ప్రజాస్వామ్యవాదులు స్పందించారు నిజమే. కాని ఏ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునైతే ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆహ్వానిస్తున్నాడో ఆయన వైఖరి తెలుసుకోవాలంటే ప్రొ. జి.ఎన్‌. సాయిబాబా విడుదలకై కొన్నాళ్ల క్రితం నెల్లూరులో, నవంబర్‌ 27న అమలాపురంలో చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన ప్రజాసంఘాలపై నిరసన ప్రదర్శనలు, అరెస్టులు చాలు. జి.ఎన్‌. సాయిబాబాను ఉరితీయాలని ప్రదర్శించిన ప్లకార్డులు, సోషల్‌ మీడియాలో ప్రచారాలు చేపట్టిన శక్తులెవరో అందరికీ తెలుసు. అవి బ్రాహ్మణీయ హిందూ భావజాలానికి, కార్పొరేట్‌ కంపెనీలకు సేవ చేస్తున్న ప్రభుత్వాల, పాలకవర్గాల ఏజెంట్లు.

3) ప్రొ. కంచ ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టులో ఓడిపోయిన ఆర్యవైశ్య, బ్రాహ్మణ వగయిరా ఆధిపత్య కులాలు అంతకు ముందు తర్వాత ఇప్పటివరకూ - ఇటీవలి ఖమ్మంకు వెళ్లిన సందర్భంలో దాడి చేసిన సంఘటన వరకూ ప్రభుత్వాల ఒత్తాసుతోనే దాడులు జరుగుతున్నాయి. ఆయన పుస్తకాన్ని నిషేధించే ఆలోచన చంద్రబాబు చేసాడు. ఆ పుస్తకం నిషేధించ దగిందన్నట్లుగా తెలంగాణ పరిశ్రమల మంత్రి కె.టి.ఆర్‌ వ్యాఖ్యానించాడు. ఇంక టి.జి. వెంకటేశ్‌ వంటి వాళ్లు ఏ తెలుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారో మనందరికీ తెలుసు.

అటువంటి పాలక తెలుగు ప్రతినిధులందరికీ ఈ సభలు స్వాగతం పలుకుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలో కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు, విప్లవాభిమానులు, దళితులు, తెలంగాణ వాదులు, దళితుల్లో ప్రజాస్వామిక వర్గీకరణ కోరుకునేవాళ్లు కష్టజీవులు, సంఘజీవులు - అన్నింటినీ మించి స్నేహానికి, మానవానుబంధాలకు అత్యధిక ప్రాధాన్యాన్ని, విలువను ఇచ్చేవాళ్లు స్పందించవలసిన సందర్భం - ప్రజాకళామండలి ప్రభాకర్‌ను ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో రామగూడలో ఆంధ్ర గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబి వాళ్లు భారీ ఎన్‌కౌంటర్‌లో భాగంగా హత్య చేయడం ఒక ఎత్తు అయితే - అందుకు నిరసనగా హైదరాబాద్‌ ఎన్‌టిఆర్‌ భవన్‌ ముందు ప్రజాసంఘాల నిరసనపై పోలీసు దాడి, అరెస్టులు ఒక ఎత్తు. అక్కడి నుంచీ ఈ ఎన్‌కౌంటర్‌ హత్యలో తెలంగాణ ప్రభుత్వం పాలుపంచుకోవడం ప్రారంభమైంది. ఒక ఏడాది తిరిగే వరకు ఇది పరాకాష్ఠకు చేరుకున్నది. ఎఒబి ఎన్‌కౌంటర్‌కు ఏడాది నిండిన సందర్భంగా ప్రభాకర్‌ పుట్టిన ఊరు యాప్రాల్‌ (కంటోన్మెంట్‌)లో ఎస్‌సిలకు చెందిన స్థలంలో అక్టోబర్‌ 24న చిన్న స్థూపం నిర్మాణం చేసుకొని స్మరించుకుందామని గ్రామ ప్రజలు, ప్రజాసంఘాలు, గ్రామ పెద్దలు తలపెట్టి ప్రయత్నాలు ప్రారంభించిన సాయంత్రమే స్థానిక రియల్‌ ఎస్టేట్‌ మ్యాగ్నెట్‌, స్వార్థ ప్రయోజనం కోసం ప్రభుత్వం పనుపున స్థానిక సిఐ దాడిచేసి ప్రభాకర్‌ కుటుంబ సభ్యులను, పికెఎం కళాకారులను కులం పేరుతో తిడుతూ అరెస్టు చేసి మర్నాటివరకు పోలీసు స్టేషన్‌లో పెట్టారు. ఆ రాత్రంతా పోలీసు స్టేషన్‌లో అన్ని ప్రజాసంఘాల, దళిత సంఘాల, గ్రామ పెద్దలు ఒకవైపు సిఐ ఒకవైపుగా వాగ్యుద్ధమే జరిగింది. చైతన్య మహిళా సంఘం జయ ఎస్‌సి చట్టం కింద కేసు పెట్టినా స్వీకరించకపోవడమే కాదు ఆమెను కూడా దుర్బాషలాడాడు. మరి తెలంగాణలోని కవులు, కళాకారులు, బుద్ధిజీవులు, కొందరు ఆయన అంత్యక్రియల రోజు, సంస్మరణ సభ సందర్భంగా కదిలిన వాళ్లే ఇవ్వాటి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న ప్రధాన బాధ్యుల్లో వారున్నారు.

రానురాను రాజ్యహింసపై, ప్రభుత్వం అణచివేతపై మౌనం గడ్డకట్టడమే కాదు మరొకవైపు భాగస్వామ్యంగా కరిగి ప్రవహిస్తున్నది. పారవశ్యంగా పరవళ్లు తొక్కుతున్నది. రెండు తెలుగులు ఒకటి కాదన్న వాళ్లు, రెండు తెలుగు రాష్ట్రాలనడాన్ని అభ్యంతర పెట్టిన వాళ్లు ఇప్పుడు ఉద్యమ కాలంలో ఎన్నో అంటాం అంటున్నారు.

ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ వరంగల్‌ సదస్సు - డిక్లరేషన్‌ కాలంలో ప్రజాకళామండలి తొలి ఆడియో క్యాసెట్‌ ʹతెలంగాణ లొల్లిʹ వెలువడింది. అందులోనే మొదటిసారిగా నందిని సిధారెడ్డి రాసిన పాట ʹనాగేటి చాళ్లల్లో నా తెలంగాణʹ చోటు చేసుకొని బహుళ ప్రచారం పొందింది. ఆ క్యాసెట్‌ రూపొందించిన ప్రజాకళా మండలి నిర్మాతల్లో ప్రభాకర్‌ ఒకడు. పికెఎం ప్రభాకర్‌గా ప్రజల నోళ్లల్లో, జ్ఞాపకాల్లో నిలబడినవాడే కాదు, ప్రభుత్వం ప్రకటించిన ఎన్‌కౌంటర్‌ జాబితాలో ఆయన ఇంటి పేరు పికెఎం అయింది. కాని ఇవ్వాళ ఆయన ఊరు, ఆయన ఇంటి ముందరి ఆవరణకు పరిమితమై నిర్బంధాల మధ్య, కేసుల మధ్య ఆయన వంటి వాళ్లను తలచుకోవాల్సి వచ్చింది.

ఇదే ఎన్‌కౌంటర్‌లో అమరుడైన దయ మృతదేహాన్ని నలగొండ జిల్లా రామగూడ ఆయన స్వంత ఊరికి తెచ్చినపుడు అంత్యక్రియల సందర్భంగా కూడా సంస్మరణ సభ పెట్టనివ్వలేదు. వెళ్లిన వాళ్లను బెదిరించి చెదరగొట్టారు. ఇంక ఏడాది పైగా ఆయననక్కడ స్మరించుకునే అవకాశమే రాలేదు. ఇరవై అయిదేళ్లు ఎఒబితో పనిచేసి రాష్ట్ర స్థాయికి ఎదిగిన గొప్ప ప్రజా నాయకుడాయన. అక్కడి ప్రజలాయనను వెంపటాపు సత్యం, గంటి రమేష్‌ (రాజన్న)తో పోల్చి స్మరించుకుంటారు. పసిపిల్లలను ప్రేమించే పసిహృదం కలవాడు.

ఎఒబి ఎన్‌కౌంటర్‌లోనే అమరుడైన పృథ్వి (మున్నా)కు అతని తల్లి శిరీష, పెదనాన్న జి. కళ్యాణరావు (విరసం) పూనుకొని జి. కళ్యాణరావు స్వంత స్థలంలో స్థూపం కట్టి ఈ నవంబర్‌లో సంస్మరణ సభ జరపాలనుకున్నారు. పోలీసులు ఎన్ని ఆటంకాలు కలిపించారో. కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన స్థలంలో మావోయిస్టు స్థూపం ఎట్లా కడుతున్నారని కళ్యాణరావుకు షోకాజ్‌ నోటీస్‌ ఇప్పించారు. ఆ నోటీస్‌కు చట్టబద్ధత లేదని, హైకోర్టులో వేయాలని అనుకుంటుండగానే కళ్యాణరావుపై మరో కేసు పెట్టారు. ఆయన బెదిరించి ఈ స్థూప నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఒకరినెవరినో పట్టుకొని, ఫిర్యాదు చేయించి, అది ఆధారంగా కేసు పెట్టారు. స్థూప నిర్మాణం, సభలు అన్నాక ప్రజల నుంచి, అభిమానుల నుంచి, ఇవ్వగలవారి నుంచి విరాళాలు స్వచ్ఛందంగా వసూలు చేయడం కాకుండా, కుటుంబాలుగా, వ్యక్తులుగా చేయగలిగిన కార్యకలాపాలు కావు ఇవి. పైగా ఇవి విప్లవ రాజకీయాలకు సంబంధించినవి. నిషేధిత రాజకీయాలకు సంబంధించినవి. స్వచ్ఛందంగా అడగడాన్ని పోలీసులు జోక్యం చేసుకున్నప్పుడు బెదిరించారని చెప్పడం అభిమానులకు కూడా ఒక్కొక్కసారి తప్పనిసరి అవుతుంది. మిగతా రాజకీయ పార్టీలందరికీ బహిరంగంగా, స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్లు మావోయిస్టు పార్టీకి, లేదా ప్రభుత్వం భావిస్తున్న ఆ భావజాలం ప్రచారం చేసే ప్రజాసంఘాలకు ఇష్టంగానూ, స్వచ్ఛందంగానూ సహాయం చేస్తారంటే పోలీసులు, ప్రభుత్వాలు నమ్మడానికి సిద్ధంగా ఉండవు.

ఏమయినా విరసంపై నిషేధం విధించి, అప్పటి అధ్యక్షుడు కళ్యాణరావును అరెస్టు చేసి, ఆయనపై 8 కేసులు పెట్టినప్పుడు ఇప్పుడు ఈ ప్రపంచ తెలుగు సభల్లో పాల్గొంటున్న రచయితలు, బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించినవాళ్లే. ఎన్నో భాషల్లోకి అనువాదమై, ఎన్నో ఎడిషన్స్‌ ప్రచురింపబడిన ʹఅంటరానివసంతాన్నిʹ అంతా అభిమానించినవాళ్లే. కాని, ఇవాళ ఆయన వేలు పట్టుకొని నడిచి, పెదనాన్న అంటూ ఆయన ఆదర్శాలతో ప్రేరణ పొందిన మున్నా కోసం ఆమె తల్లి కోరికపై తన స్థలంలో స్థూపం కట్టుకుంటే, అందుకు అడుగడుగునా అడ్డుపడుతూ సభ జరుపుకోనివ్వకుండా ప్రభుత్వం నోటీసులు పంపిస్తుంటే, పోలీసులు కేసులు పెడుతుంటే ఈ సభల్లో పాల్గొంటున్న వాళ్లంతా మౌనం వహిస్తున్నారు. బహుశా వీళ్లలో కొందరు అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి, ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్లోను సన్మానాలు, సత్కారాలు పొందేవాళ్లు కూడా ఉంటారు. సభలకు ముందు కాకున్నా కూడా ఏ క్షణమైనా ఆయనను మాత్రం అరెస్టు చేసి జైలుకు పంపవచ్చు. కేసులనేవి ఎప్పుడూ కత్తులుగా వేళ్లాడుతూనే ఉంటాయి.

ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ స్థాపనతో ప్రారంభించి అధ్యాపకుడుగా, కవిగా, గాయకుడుగా, వక్తగా, ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడుగా వేలాది సభల్లో, ప్రదర్శనల్లో, ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు, విరసం కార్యవర్గ సభ్యుడు డా. కాశీంపై యుఎపిఎ కింద కేసులు, అభంగపట్నం దళితులపై దాడి సందర్భంగా వెళ్లడంపై నిషేధాలు, నిర్బంధాలు అమలు చేస్తూ ఏ తెలంగాణ ప్రజాకళల గురించి, భాష గురించి ఈ సభలు చర్చిస్తాయో ఒక్కసారి తెలంగాణలోని ప్రజాస్వామ్య వాదులు ఆలోచించండి.

ఎఒబి ఎన్‌కౌంటర్‌ నాటి నుంచి చైతన్య మహిళా సంఘం నాయకత్వం, కార్యకర్తలపై, విరసం కార్యదర్శి వరలక్ష్మిపై, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పోస్టర్ల, ఫ్లెక్సీల కౌంటర్‌ ప్రదర్శనల దుష్ప్రచారం ఏ మహిళా బుద్ధిజీవి అయినా, రచయితయినా తీవ్రంగా నిరసించవలసిందీ, ఖండించవలసిందీ. ఆనాడు శ్రీకాకుళం రైతాంగ పోరాటంలో పంచాది నిర్మల వలె, అంకమ్మ, సరస్వతుల వలె, ఇప్పటి విప్లవోద్యమంలో ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన శృతి వంటి ఉన్నత విద్యావంతురాలు, భారతి వంటి మధ్యవయస్కురాలు, చైతన్య మహిళా సంఘం నుంచి వచ్చి ఎదిగిన చైతన్యంతో విప్లవోద్యమంలోకి వెళ్లి అమరులైతే, అది సాకుగా ఈ మహిళా ప్రజాసంఘంపై ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయి.

ఆనాడు పద్నాలుగేళ్ల పసిబాలుడు తామాడి చినబాబు వలె, చైల్డ్‌ ప్రాడిగల్‌గా గుర్తింపబడిన వివేక్‌ను తెలంగాణ గ్రేహౌండ్స్‌ ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపితే, ప్రకాశం జిల్లా సూర్యంను ఆంధ్ర గ్రేహౌండ్స్‌ చంపారు.

ఆనాడు వెంపటాపు సత్యం వంటివాళ్లు, ఈనాడు బాకూరి వెంకటరమణ, దయలు. బాకూరి వెంకటరమణ ఆదివాసి సమాజం నుంచి వచ్చి రాష్ట్రస్థాయి విప్లవోద్యమ నాయకుడయ్యాడు. శ్రీకాకుళం ఉద్యమం నాటి తాబేలు నాయుడు కుటుంబం వంటి వందలాది ఆదివాసి కుటుంబాలు ఈనాడు ఆదిలాబాద్‌ మొదలు ఎఒబి సరిహద్దు ప్రాంతాల వరకు రెండు రాష్ట్రాల రాజ్యహింసలో, ఎన్‌కౌంటర్‌లలో అమరులవుతున్నారు.

కేవలం బుద్ధిజీవులకు, మేధావులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు పరిమితమైన రాస్తేనే ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించవలసిన ఇన్ని సందర్భాలు, ఈ నేపథ్యం గలవారికి, ప్రజాస్వామ్యవాదులకు ఉన్నాయని నాకనిపిస్తున్నది.

చండీ యాగాలు చేస్తూ, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో, ముఖ్యమంత్రి సీటులో ఒక వైష్ణవ మతాచార్యుణ్ని కూర్చోబెడుతూ, ప్రభుత్వ ప్రతి కార్యకలాపమూ వైదిక మంత్రోచ్ఛారణతో చేసే ప్రభుత్వానికి పాల్కురికి సోమన ప్రాంగణం నెలకొల్పే అర్హత ఉన్నదా? వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న తెలంగాణలో కవులు హాలికులనైననేమి... అని ఆత్మగౌరవం ప్రకటించిన పోతన వేదిక మీద నిలిచే అర్హత ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ధిక్కార స్వరాలైన కాళోజీ, అలిశెట్టి ప్రభాకర్‌లను స్మరించుకున్నంత మాత్రాన పాలకుల మందిమాగధులకు ప్రజస్వామ్య సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే అర్హత వస్తుందా?

పత్రికా రచయితలకు కూడా ఇటువంటి సందర్భాలు చాలా వచ్చి ఉంటాయి. నిన్నగాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీ మానేరు హాస్టల్‌లో లక్షల ఉద్యోగాల హామీ పడిన కెసిఆర్‌ నియోజకవర్గం నుంచి, బడుగువర్గం నుంచి వచ్చిన మహేందర్‌ అనే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయంగా ఇది ప్రజాస్వామిక తెలంగాణ కోసం బలిదానాలు చేసిన 1400 మంది విద్యార్థుల పరంపరలోనే చూడవలసి ఉంటుంది. ఈ స్థితి ఇంకా ఎందుకు ఉన్నదో అని ఆలోచించకుండా ఇది ప్రభుత్వం కల్పించిన ఆశలవల్ల జరిగిన హత్య అని తప్పు ఒప్పుకోకుండా, ఒక హంతకుడిలాగా వ్యవహరించిన ప్రభుత్వం అర్ధరాత్రి దాటి 3 గంటల సమయంలో, భయంకరమైన చలిలో హాస్టల్‌పై పోలీసులతో దాడి చేయించింది. హాస్టల్‌ తలుపులు పగలగొట్టి పోలీసులు చేసిన లాఠీ దౌర్జన్యం సోషల్‌ మీడియాలో వేలమంది చూసి ఉంటారు. ఒక పత్రికా రచయిత కర్తవ్యంగా దానిని చిత్రించిన రాజ్‌ టివి విలేకరిని పోలీసులు మూడు నాలుగు గంటలు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు.

ఇది ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సంస్కృతిలో భాగం. అనవరత జాగరూకత ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన పత్రికా రంగం వెంగళరావు కాలపు గతకాలపు వైభవాన్ని పునరుజ్జీవింప చేయడానికి ఆయన ప్రారంభించిన ప్రపంచ తెలుగు మహాసభలను ఆయన వారసుడు చంద్రశేఖరరావు నిర్వహిస్తున్నాడని పొగడ్తలు రాస్తున్నది.

చెర్లలో ఆదివాసి నర్సింగరావు హత్యతో ప్రారంభించి, ఇప్పుడు లంబాడలు, ఆదివాసుల మధ్య చిచ్చుపెట్టి ఆదివాసులపై దాడుల చోద్యం చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే ఎందరు ఆదివాసులను, ఆదివాసుల మధ్యన పనిచేస్తున్న బుద్ధిజీవులైన వివేక్‌, శృతి, సాగర్‌, యూసుఫ్‌బీ, సృజన వంటి వాళ్లను ఎన్‌కౌంటర్ల పేరుతో హత్య చేసిందో ఇప్పటికి ఎన్నోమార్లు చెప్పుకున్నాం. వరంగల్‌ జిల్లా మేడారం మడలంలో గుత్తికోయల ఇళ్లు తగలబెట్టడం, శృతి, సాగర్‌లను పట్టుకొని చంపడం, ఇటీవల ఆదివాసీ మహిళలను చెట్లకు కట్టేసి కొట్టడమే కాకుండా, కేసులు పెట్టి హరితహారం పేరుతో పోడు భూముల నుంచి నిర్వాసితులను చేయడం చాలదా! ఆదివాసీ రచయితలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించడానికి కారణం.

వాస్తవానికి ఇంతకన్నా ఆర్భాటంగా జరిగిన జిఇసి ప్రధాన అతిధికి, వివిధ దేశాల నుంచి వచ్చిన బహుళజాతి కంపెనీల, బడా కంపెనీల ఎంటర్‌ప్యునర్స్‌కు దోచి పెట్టడానికే ఈ ఆదివాసీ ప్రజల రక్త మాంసాలను ఖనిజాలతో పాటు, ప్రకృతి సంపదలతోపాటు అప్పగించడానికే దళారీ పాలకులు కప్పుతున్న మేలి ముసుగు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఇటువంటి ఈవెంట్‌ ఒకటి ఇంతకన్నా ఘనంగా కెసిఆర్‌ ఇంకొకటి ఫిబ్రవరిలో నిర్వహిస్తాడట.

దళితుల పట్ల తెరాస ప్రభుత్వ వైఖరికి నేరెళ్ల సంఘటన ఒక్కటే చాలు. మహబూబ్‌నగర్‌ జిల్లా పాతపల్లిది ఇంకా పాతబడక ముందే నేరెళ్ల, పరిసర మూడు గ్రామాల్లో ఇసుక మాఫియా లారీల కింద పడి ఎందరు దళితులు, ఆదివాసీ బడుగు వర్గాలు ప్రాణాలు కోల్పోయారో. ఎన్ని కేసులు, ఎన్ని చిత్రహింసలు భరించారో. చివరికి వీళ్లను ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్సలు కూడా చేయించుకోనివ్వలేదు.

ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రకటించిన నాటి నుంచి నిజామాబాద్‌ జిల్లా అభంగపట్నంలో మరొక మొరం మాఫియా బిజెపి నాయకుడిని ప్రశ్నించిన ఇద్దరు దళిత యువకులను కిడ్నాప్‌ చేసిన ఉదంతం బయటికి వచ్చింది. అది ఇప్పుడు అట్టుడికిపోతున్నది. ఆ బిజెపి నాయకుడిని ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనలో తన పాత్ర ఉందని చెప్పుకున్న ఆ నియోజకవర్గానికి చెందిన ఎం.పి ఉన్నదని చెప్పుకుంటున్నారు.

యాభై ఏళ్ల నక్సలైట్ల చరిత్రతో కూడా పోల్చడానికి మించిన కుఖ్యాతి వహించిన వికారుద్దీన్‌, ఆయన సహచరులు అయిదుగురి జ్యూడీషియల్‌ కస్టడీ ఎన్‌కౌంటర్‌ తెరాస ప్రభుత్వం చేసిందే.

ఆశావర్కర్స్‌పై, అంగన్‌వాడీ వర్కర్స్‌పై తెరాస ప్రభుత్వం చేసిన దాడులు, పెట్టిన చిత్రహింసలు, హర్యానా వలె తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లాలో జరిగిన పరువు హత్యలు తలుచుకోనైనా సిగ్గుపడాలి ఈ సభల్లో పాల్గొంటున్న మహిళా రచయితలు.

జలగం వెంగళరావు నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలను ప్రశ్నిస్తూ శ్రీశ్రీ పంచాది నిర్మలను ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రభుత్వ సభలకు మీరెట్లా పోతారని మహిళా రచయితలను, బుద్ధిజీవులను ప్రశ్నించాడు. ఇవ్వాళ వెంకటరమణ, దయా, భారతి, ప్రభాకర్‌, మున్నా వంటి వాళ్ల సందర్భాల్లో సత్యం, కైలాసం, తామాడ చినబాబు, నిర్మలల ఎన్‌కౌంటర్‌ వంటి ప్రశ్నలే మళ్లీ తలెత్తుతాయి. ఈ సభల్లో పాల్గొంటున్న ప్రతినిధులకు వీటికి జవాబులు ఏమిటి?

దేశంలో అయిదు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే విదర్భ తరువాత స్థానం తెలంగాణదే. లక్షలాది మంది వ్యవసాయ రంగంలోను, కార్మిక రంగంలోను నిరుద్యోగులు ప్రబలుతూ ఉంటే, వ్యవసాయ భూములన్నీ రియల్‌ ఎస్టేట్‌గా, సెజ్‌లుగా, కంపెనీలుగా మారుతున్నాయి. ప్రాజెక్టుల కోసం గోళ్లూడగొట్టి సేకరిస్తున్నానరు. పబ్లిక్‌ రంగంలో మిగిలిన పరిశ్రమలేవైనా ఉంటే ప్రైవేట్‌పరం చేస్తున్నారు. లేదా మూసివేస్తున్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల కోసం జరిగిన ఎన్నికలు సాధారణ ఎన్నికలను మరిపించేంత ప్రతిష్టాత్మకంగా, పెద్ద ఎత్తున చేపట్టి తెరాస తన మనుషులను గెలిపించుకున్నది - ఓపెన్‌ కాస్ట్‌ కోసం తవ్వి తోడిన బొందల గడ్డల మీదుగా బెదిరింపులు, ప్రలోభాలు వెదజల్లి.

క్యాంపస్‌లు ఒకప్పుడు గుమస్తాలను ఉత్పత్తి చేసే కర్మాగారలయితే, ఇప్పుడు ఉద్యోగాల కోసం కాదు ఆత్మహత్యల కోసం ఎదురు చూసే నిరుద్యోగులను ఉత్పత్తి చేస్తున్నాయి. పోరాడే తెలంగాణ విద్యార్థి వేదిక తదితర ప్రజాస్వామిక విద్యార్థి సంఘాలను, వామపక్ష విద్యార్థి సంఘాలను దాడులకు, నిర్బంధాలకు గురి చేస్తున్నాయి.

ఈ అన్ని రంగాలను ఒకప్పుడు చాపకింది నిరులా ప్రవేశించిన బ్రాహ్మణీయ హిందూ భావజాలం ఇప్పుడు అధికారికంగానే తన ఫాసిస్ట్‌ పడగ విప్పింది. ఈ సందర్భాలు ఏవీ సాహిత్యానికి, సంస్కృతికి సంబంధం లేనివి అని భావించే వాళ్లకోసమే నేను ఆరంభంలో కొందరు ప్రపంచానికి తెలిన బుద్ధిజీవులు, మేధావులు, తెలుగు సమాజానికంతా, దేశమంతా తెలిసిన కళాకారులు, సృజనాత్మక రచయితలు ఎదుర్కొన్న బలవన్మరణం, యావజ్జీవ శిక్ష, వెంటాడుతున్న దాడి, ఎన్‌కౌంటర్‌ హత్య, నెత్తిపై వేళ్లాడే కత్తి వంటి కేసులు సంస్మరణను అవరోధించడం, నిషేధం గురించి ప్రస్తావించాను.

ప్రపంచ మహాసభలకు బయలుదేరేముందు ఒక్కసారి ఆలోచించండి.

ఈ సభలు నిర్వహిస్తున్న చంద్రశేఖరరావును గతంలో అశోకునితో, బుద్ధునితో, చేగువేరాతో పోల్చిన కవులూ, కళాకారులూ తప్పకుండా ఈ సభల్లో సన్మానాలు పొందుతారు. ఇప్పుడు ఆయనను కృష్ణదేవరాయలతో, సింగభూపాలునితో, వెంగళరావుతో పోలుస్తున్నారు. ఒక విధంగా అవి న్యాయమైన పోలికలే. కృష్ణదేవరాయలు పొరుగు రాజ్యాలను, లేదా శత్రువులను గెలిచినప్పుడల్లా ఇటువంటి వేడుకలు నిర్వహించుకునేవాడు. వెంగళరావు సంగతి సరేసరే. శ్రీకాకుళం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఆంధ్య్రోద్యమం మొదలు రైల్వే సమ్మెను అణచివేసి ఎమర్జెన్సీ పాలన దాకా ఇందిరా గాంధీతో పాటు దౌర్జన్య హింసా రచన చేసినవాడు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏనుగుపై ఊరేగుతూ ఆకాశం నుంచి హెలికాప్టర్‌తో పూలజల్లు కురిపించుకున్నవాడు.

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైననేమి, కంధమూల గౌద్ధాలికులనైననేమి అని స్వీయ గౌరవం ప్రకటించిన పద్య చరణం గుర్తుపెట్టుకుంటారా!

హైదరాబాద్‌ పరిసరాల్లోని జవహర్‌నగర్‌లో డంపింగ్‌ యార్డ్‌తో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాలుష్యానికి గురిచేస్తూ, వాళ్ల ప్రాణవాయువులను హరిస్తున్న రాంకీ ఫౌండేషన్‌ జనవరి 2012లో ఒంగోలులో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినప్పుడు వెళ్లవద్దని నేను రచయితలకు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేశాను. ఇంత వాతావరణ కాలుష్యానికి కారణమై ప్రాణహానిగా మారిన రాంకీ ఫౌండేషన్‌కు ఇప్పుడు అదే స్థలంలో తెలంగాణ ప్రభుత్వం పవర్‌ ప్లాంట్‌ కూడా అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అక్కడి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్నారు. ఆ రాంకీ ఫౌండేషన్‌ వలనే ఆయనకు అనుమతి ఇచ్చిన తెరాస ప్రభుత్వం కూడా ప్రాణాలు హరిస్తూ వేడుకలు జరుపుకుంటున్నది.

2012లో రాంకీ ఫౌండేషన్‌ నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లడానికి బయలుదేరిన పిఒడబ్ల్యు సంధ్య ఆఖరి క్షణాన నా నుంచి ఆ సభల వెనుక ఉన్న నేపథ్యం విని ఆగిపోయింది. మీలో ప్రజాస్వామికవాదుల్లో అట్లా ఎవరైనా ఆగిపోరా అనే ఆశతో ఈ బహిరంగ విజ్ఞప్తి. పాలకవర్గ ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించండి.

- 11.12.2017

No. of visitors : 1052
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

నీవునీవేనా?

వ‌ర‌ల‌క్ష్మి | 08.12.2017 02:03:34pm

నీ దుఃఖం, ఆగ్రహం ఉబికిన సందర్భం కింద నెత్తురింకిన నేల ఉంది కదా? అవునా? కనిపిస్తోందా? దాన్నొకసారి తాకి చూడు నెత్తురు పారించినోడు కనిపిస్తాడు...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

సుఖ విరోచనం!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.12.2017 11:58:32pm

ʹకవిత్వం యెలా వస్తుందో గవర్నరుగారు చెప్పారు..ʹ ʹఎలా వస్తుంది?ʹ ʹసుష్టైన భోజనం.. తాంబూలం.. వుంటే వస్తుందని..ʹ ʹఏమొస్తుంది.. నిద్రా?ʹ ʹకాదు, కవిత్వం..!ʹ.....
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •