ఉండవలసిన తీరు

| సాహిత్యం | క‌థ‌లు

ఉండవలసిన తీరు

- పద్మకుమారి | 15.05.2016 01:51:20pm

మధ్యాహ్నం పన్నెండు గంటలకు ధనలక్ష్మి రైల్వే స్టేషన్లో దిగింది. అప్పటికే ట్రైన్‌ అరగంట ఆలస్యమైంది. తన కోసమే ఎదురుచూస్తున్న గౌతమి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. బ్యాగు అందుకొని ఆటో ఎక్కారు. దారిలో అక్కడక్కడా మరాఠి మహిళలు సంప్రదాయక వేషధారణలో కనిపించారు. గంట ప్రయాణం తర్వాత నగర శివారులోని ఒక డాబా ఇంటి ముందు ఆగారు. కొత్తగా కట్టిన ఇల్లులా ఉంది. రంగులు ఇంకా నిగనిగలాడుతున్నాయి. ఇంటి ముందు పూల పాదులు అప్పుడే చిగురిస్తున్నాయి. తమకోసమే ఎదురు చూస్తున్నాడేమో.. గౌతమి భర్త సతీష్‌ నవ్వుతూ ధనలక్ష్మిని పలకరించాడు. ʹఎప్పుడో మా పెండ్లిలో చూశాను. బాగున్నారా?ʹ అన్నాడు.
సమాధానంగా చిన్నగా నవ్వింది ధనలక్ష్మి.

గౌతమి చేతిలోని బ్యాగ్‌ తీసుకుని లోపలికి వెళ్లిపోయాడు సతీష్‌.
ముందు రూంలోని సోఫాలో ధనలక్ష్మి కూచుంది.

గౌతమి వంటగదిలోకి వెళ్లింది. ఆ ఇంట్లో అన్ని వస్తువులూ నీటుగా సర్ది ఉన్నాయి. ఓ వైపు అలమరాలో చాలా పుస్తకాలు కనిపించాయి. గోడపైన మధ్య వయస్సులో ఉన్న దంపతుల ఫొటోలు ఉన్నాయి. బహుశా గౌతమి అత్తామామలు కావచ్చు. ఆ పక్కనే గౌతమీ, సతీష్‌ల ఫొటో ఉంది.

గౌతమి కాఫీ కప్పుతో వచ్చింది. ʹరెస్ట్‌ తీసుకో వంట కావడానికి టైం పడుతుందిʹ అన్నది.
ఆ ఫొటో వైపే చూస్తూ ʹమీ అత్తామామలు కదూʹ అంది ధనలక్ష్మి కాఫీ కప్పు అందుకుంటూ.

ʹఅవును నాగపూర్‌లో సతీష్‌ వాళ్ల అన్నయ్య దగ్గర ఉంటారుʹ
ధనలక్ష్మి పుస్తకాల అలమరా వైపు నడిచింది. కాఫీ తాగుతూ పుస్తకాలు చూస్తోంది. పై వరుసలో తన కిష్టమైన సింహసేనాపతి పుస్తకం కనిపించింది. దాన్ని చేతులోకి తీసుకుంది. దాన్ని తాకడంతోనే మనసులో ఏదో జ్ఞాపకం కదిలాడింది. అన్నయ్య ఆ రోజుల్లో తనకు చదవమని ఇచ్చిన మొదటి పుస్తకం ఇదే. అంత వరకు తనకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.

ʹచాలా మంచి పుస్తకం తీశారే..ʹ సతీష్‌ మాటలతో ఆలోచనలను తెంపుకొని టక్కున వెనక్కి తిరిగింది.

ఆమె చేతిలోని కాఫీ కప్పు తీసుకుంటూ ʹమనం రేప్పొద్దున బయల్దేరాలి. దూర ప్రయాణం. ఈ రోజంతా నిద్రపోండి...ʹ అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు.

ధనలక్ష్మి పక్కనే ఉన్న గదిలోకి వెళ్లిపోయింది. డబుల్‌ కాట్, ఆ పక్కనే స్టడీ టేబుల్‌, దాని పైన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ పక్కనే గోడకు వేలాడుతున్న తల్లీ బిడ్డల టెడ్డీ బేర్‌ బొమ్మ కనిపించింది. పొట్టపైన బిడ్డను హత్తుకొని ఉంది. అది చూడగానే ధనలక్ష్మికి బాబు గుర్తుకు వచ్చాడు. వికాస్‌ అని పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలాగే తన ఒళ్లో వాలి గారాలు పోయేవాడు. వాడికి ఐదేళ్లు కూడా నిండలేదు. అప్పుడే వాడ్ని చూడక కొన్ని గంటలైంది. వాడి అమాయకపు ముఖాన్ని నిన్న ఎంతసేపు చూసినా తనవి తీరలేదు. నిద్రపోతున్న వాడి తలపైన చెయ్యి వేసి ముంగురులు సవరిస్తూ బయల్దేరే వరకు ఉండిపోయింది. రేపటి నుంచి తన కోసం ఎంత ఏడుస్తాడో కదా పిచ్చితండ్రి అనిపించింది. నిన్నటి వరకు అన్నయ్య కనిపించక తల్లి బాధపడుతూ ఉండేది. ఇక నుంచి తను కనబడక వికాస్‌ కూడా అంతే బాధపడతాడేమో. అమ్మకు ఈ వయసులో కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు దూరమైన బాధతోపాటు బాబును పెంచాల్సిన బాధ్యత కూడా నెత్తినపడింది.

మంచం మీద పడుకుంది గాని మనసంతా అలజడిగా ఉంది. పుస్తకం చేతిలో ఉన్నమాటేగాని ఒక్క పేజీ కూడా ముందుకు సాగడం లేదు.

తనది ఎంత చిన్న జీవితం? ఈ ఊరికి వస్తానని ఊహించనేలేదు. అసలు గౌతమి ఈ వైపు ఎట్లా వచ్చింది? చదువుకొనే రోజుల్లో సొంత విషయాలు తప్ప పక్కవాళ్లను పట్టించుకొనేదే కాదు. హైస్కూలు వరకు కలిసే చదువుకున్నారు. అన్నయ్య ఒక సంవత్సరం పెద్ద. ముగ్గురూ కలిసే తిరిగినా ఎవరి తీరు వారే అన్నట్లుండేవారు. ఇప్పుడెలా అందరం ఒకేలా అలోచిస్తున్నాం. ఈ మార్పు అన్నయ్య వల్లేనేనా? ఏమో. తను మాత్రం మారలేదా? అన్నయ్య తిరుగుళ్లు మొదట్లో అమ్మ నాన్నల్లాగే తనకూ నచ్చలేదు. తన బతుకు బండలైపోయి పెళ్లయిన ఏడాదికే పుట్టింటికి చేరుకుంటే అన్నయ్య ఎట్ల చూసుకోవాలి? అప్పట్లో అన్నయ్య తీరు నచ్చలేదు. భర్త, అత్తమామల మీద కేసు వేసి ఆస్తి రాబట్టమని కొందరు అన్నారు.

అన్నయ్య అది కూడా పట్టించుకోలేదు.
ʹవాడ్నే కాదనుకున్నాక వాడి ఆస్తి మనకెందుకు?ʹ అనేవాడు.
అన్నీ ఇలాంటి మాటలే. ఇవేవీ తనకు నచ్చేవి కాదు.
మరి బాబు, తను ఎలా బతకాలి? వాడి భవిష్యత్‌ ఏం కావాలి? ఈ రంధి ఉన్నట్లు కనిపించేవాడే కాదు. అలా తేలిగ్గా వదిలేయడం తనకు ఇష్టం లేదు. వాడ్ని కోర్టుకులాగి, ఆస్తిలో భాగం అడగాలి. కట్నం కింద, లాంఛనాల కింద ముట్టచెప్పింది కూడా తీసుకోవాలి అని తనకు బలంగా ఉండేది.

ʹఆస్తి గొడవలు దేనికిరా. నీవు ఇట్ల ఇంట్లో బాధపడుకుంటూ ఉండిపోతే ఎన్ని లక్షల ఆస్తి ఉన్నా ప్రయోజనం లేదు. బైటికిపోయి నీ కాళ్ల మీద నీవు నిలబడాలి... ʹ అనేవాడు.

ʹనేను బైటికిపోయి సంపాదించుకోవాల్సిందేగాని, నీవేమీ చెయ్యవా?ʹ అని ఆ రోజుల్లో అమాయకంగా అడిగింది.
దానికి అన్నయ్య నవ్వుతూ ʹనీ ఖర్చులకు నవ్వు సంపాదించుకోడానికి ఉద్యోగం చెయ్యమనడం లేదు. నీ జీవితాన్ని నీవే తిరిగి బాగు చేసుకోడానికి బైటికి పొమ్మంటున్నా. బైటికిపోతే లోక జ్ఞానంతోపాటు ధైర్యం వస్తుంది. ఆ రోజు చదువు పూర్తి కాకముందే ఈ పెళ్లి ఏందని నేను బాపుతో గొడవపడ్డానా? లేదా? జీవితంలో ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ రోజుల్లో నీ చేతుల్లో ఏమీ లేదు. ఈ రోజు నీవు ఇంత ఉదాసీనంగా మారిపోయి సర్వం కోల్పోయానని భారంగా బతకాల్సిన పని లేదు. ధైర్యంగా అందరి మధ్య తిరగాలి. అది అలవాటు కావాలి..ʹ అన్నాడు.

అవన్నీ గుర్తుకు వస్తోంటే ధనలక్ష్మికి తన జీవితమే ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. అన్నయ్య సపోర్టుతో మళ్లీ చదువు మొదలు పెట్టి పంతులమ్మ అయి నలుగురికి చదువు చెప్పగలుగుతోంది. బాబుకు, తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన తను కూడా లోపలికి రమ్మని ఎలా రాయగలిగాడు. తన మీద అంత నమ్మకం ఎలా కలిగింది? ఉత్తరం రాసి రమ్మని అనగానే బయల్దేరుతానని? తను మాత్రం ఈ నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? అన్నయ్యను అంతగా ప్రేమించడం వల్లనా? లేక అన్నయ్య రాజకీయ విశ్వాసాలను తనూ అంతగా ప్రేమించడం వల్లనా? పేలవమైన జీవితంలో ఈ మార్పు కొద్ది కాలంగా తను కావాలనుకుంటున్నదే.

డోర్‌ క్టొట్టి సతీష్‌ లోపలికి వచ్చి ఏదో చిరుతిండి ఉన్న ప్లేట్ అందించాడు.
ʹమీరెట్లా నిద్రపోరని తెలుసు. మీకోసం గౌతమి స్పెషల్‌గా వంట తయారు చేస్తోంది. ఇంకా ఆలస్యం కావొచ్చు. అలోగా ఇవి తినండిʹ అని వెళ్లిపోయాడు.

ఏదో మరాఠీ వంటకం. రుచిగా ఉంది. తింటూ మళ్లీ ఆలోచనలోకి వెళ్లిపోయింది.
ధనలక్ష్మి అన్నయ్య రమ్మని ఉత్తరం రాశాడని, దాని పైన నిర్ణయం చెప్పినప్పుడు పోచమ్మ, లింగయ్య నవనాడులు కుంగిపోయినట్లు డీలాపడిపోయారు. తల్లి అయితే కాళ్లూ చేతులు పట్టుకొని ఏడ్చింది. వాడూ పోయి, నీవు పోతే మేమేం కావాలి? మేం చనిపోతే నీ కొడుక్కు దిక్కెవరు? అని తండ్రి వలపోసుకున్నాడు.

నిజమే. బాబుకు తండ్రి ఉన్నా లేనట్టే. తను వెళ్లిపోతే తల్లి కూడా దూరమైనట్టే. ఈ చివరి రోజుల్లో అమ్మా నాన్నలను చూసుకోవడం కూడా తన బాధ్యతే. కానీ ఇక్కడే ఉంటే కొడుకుకు తల్లిగా, తల్లిదండ్రులకు బిడ్డగా బతికిన సంతృప్తి తప్ప మరేమీ ఉండదు. జీవితానికి ఇంకో అర్థమేమీ ఉండదు. అన్నయ్య అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందు రోజుల్లో పెరిగిన సాన్నిత్యం, తనను కూడా ఉద్యమంలోకి తీసికెళ్లాలనే రమేష్‌ బలమైన కోరిక నుంచి ఈ కొత్త ఆలోచనలు కలిగాయి.

కొడుకు గురించి, అమ్మనాన్నల గురించి, తన భవిష్యత్తు గురించి బతకడం కాకుండా ఇంకా అర్థవంతమైన జీవితం కావాలని ఉంది. ఎందుకో అందరిలాగా తన జీవితం సాఫీగా సాగలేదు. పెండ్లయిన నెల నుంచే కష్టాలు. ఇద్దరివి భిన్న మనస్తత్వాలు. అతడు చెడ్డవాడని కాదు. బతుకు ఉండాల్సిన తీరు గురించి తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వాటితో ఆయనకు పొసగలేదు. అక్కడి నుంచి గొడవలు మొదలయ్యాయి. అవి చాలా దూరం పోయాయి. దాంపత్యమంటేనే వెగటు కలిగింది. తను మారుతాడని ఏడాదిపాటు కనురెప్పల కింద కన్నీరు దాచుకొని గడిపింది. బాబు పుట్టాడు. వాడికి ఏడాది వయసు వచ్చేనాటికి తెగతెంపులు చేసుకొని ఇంటికి వచ్చింది. తను కలలుగన్న జీవితమంతా తల్లకిందులైపోయింది. ఆ బాధ చాలా కాలం వెంటాడింది. ఇప్పుడు బాబును చూసుకుంటున్న ఆనందం తప్ప మరేమీ లేదు.

కానీ చాలా అసంతృప్తి. సింగరేణి ప్రాంతంలో బహిరంగంగా విప్లవోద్యమంలో పని చేయలేని పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు సెమీ లీగల్‌గా పని చేసిన అన్నయ్య రమేష్‌ పూర్తి కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సీవోల స్థానంలో వన్‌ ప్లస్‌ టు దళాలుగా ఏర్పడి అడవి.. సింగరేణి పట్టణ సరిహద్దు పల్లెల్లో పని మొదలు పెట్టారు.

ఒక రోజు రమేష్‌ కుటుంబాన్ని మారుమూల గ్రామానికి పిలిపించుకున్నాడు. ఆ రోజంతా కలిసే ఉన్నారు. అప్పుడు రమేష్‌ తను ఇక ముందు కలవడం కుదరకపోవచ్చని చెప్పాడు. పూర్తిగా లోతట్టు అడవిలోకి ఉద్యమ అవసరాల రీత్యా బదిలీ అయ్యానని చెప్పాడు. కోల్‌ బెల్ట్ లో శతృవు ఇన్‌ఫార్మర్‌ నెట్ వర్క్‌ పెంచుకొని భారీ నష్టాలు కలిగించాడు. ఇక్కడ ఇంతకు ముందే మహిళల్ని మూమెంట్ లో కదిలించలేని పరిస్థితి. ఇక ఇప్పుడైతే మరీ దుర్భరం. ఇక్కడ బూర్జువా ట్రేడ్‌ యూనియన్లు తప్ప మనం పని చేయలేని స్థితి వచ్చింది. కాబట్టి నీవు కూడా ఇక్కడే ఉంటే ఉద్యమానికి అభిమానిగా తప్ప కార్యకర్తగా పని చేయలేవు. నీవు మంచి రాజకీయ కార్యకర్తవు కావాలని నా కోరిక అన్నాడు.

ఆరోజు తర్వాత రమేష్‌ మళ్లీ కనిపించలేదు. అప్పుడప్పుడూ ఉత్తరాలు వచ్చేవి. ప్రతిసారీ చివర్లో ధనలక్ష్మిని పుస్తకాలు చదవమని రాసేవాడు. ఆమె లేకపోయినా కుటుంబం ధైర్యంగా నిలబడ్డానికి తగ్గట్టు సిద్ధం చేయమని చెప్పేవాడు. దీంతో తాను పూర్తి కాలం ఉద్యమంలో భాగం కావాలనే అతని కాంక్ష బైట పడేది. అన్నయ్య అంటే ఉన్న అమితమైన ఇష్టం వల్ల కూడా ధనలక్ష్మి అతని మాటల్ని తేలిగ్గా తీసేయలేకపోయేది.

తనింకా ఇల్లూ.. ఉద్యమం మధ్య ఊగిసలాడుతుండగానే రమేష్‌ నుంచి వచ్చేయమని ఉత్తరం వచ్చింది.
రమేష్‌ కలవమని చెప్పిన గడువుకు మధ్యలో ఉన్న ఇరవై రోజులూ ఆలోచించింది. రాత్రింబవళ్లు మధనపడింది.
ʹనీ అవసరం అక్కడి కంటే ఇక్కడే చాలా ఉందʹని స్పష్టంగా రాశాడు రమేష్‌.

ఇంతకాలం ʹ నాలాంటి వాళ్లు అక్కడ చేసే పని ఏముంటుంది?ʹ అని కూడా అనుకునేది. చాలా ప్రత్యేకమైన మనుషులు మాత్రమే లోపలికి వెళ్లి పనిచేస్తారని ఉండేది. దానికి రమేషే కారణం. తనకు ఊహ తెల్సినప్పటి నుంచి అన్నిట్లో భిన్నంగానే ఉండేవాడు. ఆలోచలన్నీ కొత్తగా ఉండేవి. అలాంటి వాళ్లే అంత సాహసమైన నిర్ణయాలు తీసుకుంటారని అనుకునేది.
ʹʹఅదే మాట రమేష్‌తో ఓసారి అంటే - అదేం కాదు. అందరం ఒకటే. చాలా మామూలు మనుషులే పెద్ద పెద్ద పనులు చేస్తారుʹʹ అని ఏవేవో పుస్తకాలిచ్చి చదవమన్నాడు.

ధనలక్ష్మి నవలల్ని చదివి, మొదట ఇవన్నీ కథల్లే అనుకుంది. తర్వాత అవి నిజంగానే జరిగినవని అర్థమయ్యాక, వాటిలోని విలువలకు ఆకర్షితురాలైంది. మనుషులు ఇలా కూడా జీవిస్తారా? అని విస్మయం కలిగింది. అదే ఇక్కడి దాకా నడిపించింది.
అన్నయ్య రాసిన ఉత్తరం చదివి, పసి బిడ్డను, కన్నవాళ్లను వదిలి బ్యాగ్‌ తీసుకుని ఎలా వచ్చేసింది...? ధనలక్ష్మికి ఇప్పటికీ తన నిర్ణయం తలుచుకుంటే కొంచెం ఆందోళనగా ఉంది. ఆశ్చర్యంగానే ఉంది. అయితే స్థిరమైన నిర్ణయంతోనే బయల్దేరింది.

**** **** *****

ʹవంట అయిపోయినట్టే... స్నానం చేసిరా తినేద్దాం...ʹ అని గౌతమి బైటి నుంచే పిలిచింది.
అన్నం తినేటప్పుడు సతీష్‌ తన తునికాకు వ్యాపారం గురించి లాభనష్టాల గురించి చెప్పుకొచ్చాడు. గౌతమి మరాఠీ వాళ్ల ఆలోచనలు, ఆచారాలు చెప్పింది. పార్టీ గురించి, ఇంటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
భోజనాలయ్యాక సతీష్‌ బైటకి వెళ్లిపోయాడు.
ఇంట్లో ఇద్దరే మిగిలారు.
లోపలి గదిలోకి కిటికీలోంచి ఎండ పడకుండా కర్టెన్‌ లాగుతూ గౌతమి ʹబాబు ఎట్లున్నాడు? అమ్మ నాన్న వాళ్లేమన్నారు?ʹ అని నేరుగా మొదలు పెట్టింది.
ధనలక్ష్మి కొంచెం సేపు మౌనం.
గౌతమి తల తిప్పి చూస్తే ఆమె కళ్లలో నీళ్లు కనిపించాయి.
ʹఇదేమిటి?...ʹ గౌతమికి అర్థం కాలేదు. దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసింది.
ʹగుర్తు చేసి బాధ పెట్టానా ధనలక్ష్మీ..?ʹ అని అడిగింది.
ఆమె చిన్నగా ఏడ్చింది.
గౌతమి ఆందోళన పడిపోయింది. అయినా ఆ స్థితిలో ఏమీ అనలేకపోయింది. కొన్ని క్షణాలయ్యాక ధనలక్ష్మి మాట్లాడుతూ.. ʹఇదంతా లోపలికి పోతున్నందుకు కాదు. నేను పూర్తి ఇష్టంగానే ఈ నిర్ణయం తీసుకొని వచ్చాను. ఉద్యమంలో భాగం కావాలనే ఉంది. అయితే ఈ నిర్ణయం తీసుకున్నాక ఈ మధ్య బాబును అమ్మకు మరింత దగ్గరయ్యేలా చేశాను. కానీ ఏదో వదిలేసి వెళ్తున్న వెలితి...ʹ అని ఇంక కొనసాగించలేక చిన్నగా నవ్వేసి కళ్లు తుడుచుకుంది.
ʹఆ వెలితి వికాసే కదూʹ అంది గౌతమి
ʹకాదు .. అమ్మా బాపు కూడాʹ
రమేష్‌ తనకు ఈ మధ్య రాసిన ఉత్తరాలను బట్టి ఇలాంటి నిర్ణయం ఏదో జరుగుతుందని గౌతమి అనుకుంటూనే ఉంది. దీనిపట్ల తనకు అభ్యంతరమా? ఏమో? బాబును వదిలేసి తను ఉండగలదా? ఆ నమ్మకం ఉండబట్టే కదా రమేష్‌ నిర్ణయం తీసుకుంది. తను ఇంకో తీరు ఆలోచించడం సరైంది కాదేమో.

మనుసులో ఇదంతా ఉన్నా బాబు సంగతి అడగకుండా ఎలా ఉంటుంది? ఆమె సంసారం చెడిపోవడం గురించి చాలా పర్సనల్‌ విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఏదైనా మాట్లాడే స్వతంత్రత ఉంది. అందుకే అడిగింది.

అసలు రమేష్‌ ఈ సంగతి తనకు ఎందుకు రాశాడో మొదట అర్థం కాలేదు గౌతమికి. సతీష్‌తో ఎన్నో ముఖ్యమైన పనులు చేయించుకోవడం అలవాటే. అయితే ఇది తనతో చెప్పడానికి బహుశా.. తమ ఇద్దరి అనుబంధం కారణం కావచ్చు.
నిశబ్దాన్ని భగ్నం చేస్తూ ధనలక్ష్మి మాట్లాడటం మొదలు పెట్టింది.

ʹమొదట్లో అమ్మవాళ్లు నాకు మళ్లీ పెళ్లి చేద్దామనుకున్నారు. అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎన్నో సంబంధాలు తెచ్చారు. నాన్న ఓ సంబంధం తెస్తే ఆ అబ్బాయి వల్ల నా జీవితం బాగుపడదని అన్నయ్య వద్దన్నాడు. నాకూ నచ్చలేదు. ఈలోగా అన్నయ్య వచ్చేశాడు. ఇక ఆ సంగతి ఆలోచించలేదు. బాబును చూసుకుంటూ ఉండిపోదామనే అనుకున్నా. కానీ అదీ నచ్చలేదు. ఈ లోగా లోపలికి రమ్మని ఉత్తరం రాశాడు. ఇట్ల వెళ్లిపోతానని అన్నప్పుడు అమ్మా నాన్న బాగా ఏడ్చారు. అన్నం తినకుండా మొండికేశారు. కడుపు నిండా ఇద్దర్ని కంటే ఇద్దరికిద్దరు మమ్ముల ఆగం చేస్తరా? ఈ వయసులో నీ కొడుకును ఎట్ల పెంచాలె? పగోనికి కూడ వద్దు ఈ పాపం జన్మ అని దు:ఖపడ్డారు...ʹ అని ఆగిపోయింది.

అవును కదా! ఇద్దరు పుడితే... ఇద్దరూ ఇట్లా వెళ్లిపోతే ఎంత కష్టం? అనుకుంది గౌతమి.
ఇంతలో ఎవరో వస్తే గౌతమి హాల్లోకి వెళ్లింది.
ధనలక్ష్మికి ఎప్పటెప్పివో గుర్తుకు రాసాగాయి.

**** **** *****

పొద్దున్నే లేచి బయటికి వెళ్లడానికి సైకిల్‌ తీస్తున్న కొడుకును పోశమ్మ ఆపింది. ʹచెల్లెను చూడనీకి వస్తున్నారని చెప్పిన. ఇయ్యల్ల కూడా ఇంట్లో ఉండవా?ʹ అన్నది.
రమేష్‌ ఒక క్షణం ఆలోచించి, సైకిల్‌ స్టాండ్‌ వేశాడు.
మంచినీళ్ల బిందె తీసుకుని లోపలికి పోతున్న చెల్లితో ʹధనమ్మా! ఒక నిమిషం... బిందె లోపల పెట్టిరాʹ అంటూ ఇంటి ముందున్న రేకుల షెడ్‌ కింద కుర్చీలో కూచున్నాడు.
బొగ్గు పొయిలో పొగ తగ్గి నిప్పులు కణకణ మండుతున్నాయి. గుట్టలా పేర్చిన బొగ్గు పెళ్లల్ని కట్టెపుల్లతో పొయ్యిలోకి దిట్టంగా కుదించి వచ్చి రమేష్‌ కుర్చీ పక్కనే ఉన్న మంచంలో కూర్చుంది పోశమ్మ.
ధనలక్ష్మి వచ్చి తల్లి పక్క కూచుంది.
ʹఅమ్మా.. నేనింతకు ముందే చెప్పిన. ఈ సంబంధం మీరు బరువు దించుకోడానికేగాని దాని బతుకు బాగుపడానికి కాదని. చెల్లెకిట్లయిందని తెలిసి కూడా వాళ్లు ముందుకు వచ్చిన్రు. అంత వరకు మంచిదే. నాకు తెలిసి ఆ పిలగాడితో సమస్యలు వస్తయి. మల్లీ అట్లనే అయితది. బాబును వదిలిపెట్టి రావాలని వాల్లంత కరాఖండిగా చెబుతున్నరంటే వాల్ల మనస్తత్వమేందో తెలుస్తంది. దీన్ని వదిలించుకోడానికి మీరేమో బాబును మేం చూసుకుంటంలే అంటున్నరు. పుట్టింటికి రాకపోకలు లేకుండా ఉంటాయా? బాబు మన దగ్గరేనాయె ఉండేది. వాల్లు బాపు పెట్టిస్తాననే ఉద్యోగానికి ఆశపడి వస్తున్నరు గాని బాబును అంగీకరించే పెద్ద మనుసుతో కాదుʹ రమేష్‌ మాటలు పూర్తి కాకముందే..
పోశమ్మ అందుకోని.. ʹఇంకెవడో కన్నోడ్ని వాల్లెందుకు పెంచుకుంటరు?ʹ అన్నది.
రమేష్‌కు తల తిరిగిపోయింది.
చెల్లెలి దిక్కు చూసిండు. ధనలక్ష్మి ముఖం అవమానంతో మాడిపోయింది. కళ్లెంబడి బొటబొట నీళ్లు కారిపోయాయి.
ʹఅమ్మా నువ్వే ఇట్లన్నవంటే.. వాల్లు ఇంకెట్లంటరో ఆలోచించు. అది చూడు ఎంత బాధపడుతున్నదో. ఇంతకూ బాబును వదిలి వెళ్లడానికి ధనాలు సిద్ధంగా ఉందా? దాన్ని ఒక్క మాట అడగకుండా బాబును మేం పెంచుకుంటామని వాళ్లకు మీరే చెప్పి పంపించిండ్లు... అంతే. అందుకే వాళ్లు ముందుకు వచ్చిండ్లు. మీరు, నేను, వాల్లూ కాదు. అదేమనుకుంటుందో ముఖ్యం. ఇప్పుడు అంతా చెల్లె మీద ఆధారపడి ఉంది. ఇప్పటికే అది ఒకసారి దెబ్బతిన్నది. జాగ్రత్తగా తనే నిర్ణయం తీసుకోవాలి. బాబును వదులుకోడానికి సిద్ధపడితేనే ఈ సంబంధం గురించి ఆలోచించాలి. లేదంటే ఇంకో సంబంధం చూసుకోవాల్సిందేʹ అన్నాడు.
ʹఇంకెంత కాలం ఆగుతాం బిడ్డా. పిలగానికి ఇప్పికే మూడేళ్లు వచ్చినై. ఈ లెక్కలు తేలకనే కదా ఇన్ని రోజులైందిʹ అన్నది పోశమ్మ.
ʹʹధనాలు నువ్వేమంటావు?ʹʹ అని సూటిగా అడిగాడు రమేష్‌.
ʹనేనసలు ఇవేమీ ఆలోచిస్త లేను. బాబును ఇచ్చిపోవడం నా వల్ల కాదుʹ అంది ధనలక్ష్మి.
ʹకొడుకును ఇచ్చిపోవడం ఇష్టం లేదా? అసలు పెళ్లే ఇష్టం లేదా?ʹʹ అని పోశమ్మ రోశంగా మాట్లాడింది.
ధనలక్ష్మి పలకలేదు.

విడాకులతో ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకో అయ్య చేతిలో పెట్టాలని వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఈ సంబంధమైనా ఉట్టిగనే వచ్చింది కాదు. లింగయ్య మెడికల్‌ అన్ ఫిట్ అయి డిపెండెంట్ కింద తన స్నేహితుడి కొడుకు కుమారస్వామికి ఉద్యోగం ఇప్పించే వొప్పదం మీద కుదిరింది. ఆ లెక్కన లక్షలు పోసి అల్లుణ్ణి కొనుకున్నట్టే. ఈ ఉద్యోగం బైట వాళ్లకు అమ్ముకున్నా ఐదారు లక్షలు వస్తాయి.
మళ్ళీ పోశమ్మే అందుకుంది.
ʹమీ అన్నను ఉద్యోగం చేయమంటే దేశాలు పట్టి పోతనంటున్నడు. వంశానికి ఒక్కడు. ఇంతితోనే నా వంశం ఆగిపోయినట్టే. ఇంత పాపిస్టి జన్మ నాకు తప్ప ఇంకెవరికి ఉండదు. ఇద్దర్ని కంటే ఇద్దరికి ఇద్దరు బతుకు ఆగం చేసుకుంటుండ్లు. మీకు మీరు బాగుపడేది లేదు. ఒకరు చెబితే చెవికెక్కేది లేదుʹ అన్నది కూతుర్ని ఉద్దేశించి.
రమేష్‌కు మనసు చివుక్కుమన్నది.

అమ్మ కోరికలన్నీ న్యాయమైనవే. కానీ తీర్చలేడు. తను కోరుకుంటున్న భవిష్యత్తుకు.. తల్లి కోరికలకు పొసగదు. ఇంతకాలం తనొక్కడినే అమ్మ అనేది. చెల్లెలు ఇట్ల మొండిగా అవడానికి తనే కారణమని అమ్మనాన్నల నమ్మకం.
చెల్లె జీవితంలో ఎదురైన ఒడుదుడుకుల్నించి, కష్టాల నుంచి బయటపడేయాల్సి వచ్చింది. లోకంలో అందరూ ఒకేలాగా బతకరని, రకరకాల కష్టసుఖాల మధ్యనే రాటు తేలుతారని నచ్చచెబుతూ ఇలాంటి వాటికి ఆనవాళ్లుగా నిలిచిన వాళ్ల్ల కథల్ని, గాథల్ని చదివించాడు. వాటి నుంచి ఆమె ఈ ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టింది. దీంతో ఇంతకు ముందుకంటే ఇద్దరి మధ్య దగ్గరితనం పెరిగింది. దాంతోపాటే అమ్మనాన్నల కోపం కూడా పెరిగింది.
ఆడపిల్లను చెడగొడుతున్నావని ఎన్నోసార్లు ముఖం మీదే అన్నారు. ఇప్పుడు ధనలక్ష్మి ఈ సంబంధాన్ని కాదనడానికి కూడా తనే కారణమని అమ్మ అంటున్నది. బెదిరించి అయినా ఒప్పించాల్సిన అన్న ఇట్ల చేయడం ఏమిటనే ఆవేదన కూడా అందులో ఉన్నది.
ʹనీవు, అదీ ఒకటై మాట్లాడితే కష్టంగా ఉందిరా. మొగ పిలగాడివి. దానికి నచ్చచెప్పాల్సినోడివి. నేనేదో దాని మీద పగపట్టినట్లు మాట్లాడుతున్నవుʹ అంది పోశమ్మ.
రమేష్‌కు మనసు బరువెక్కింది.
కొడుకు ఏమీ మాట్లాడకపోయే సరికి పోశమ్మ మరింత గట్టిగా ʹవాళ్లు వస్తుండ్లు. నువ్వు కూడా కచ్చితంగా ఉండాలెʹ అని పట్టుబట్టింది.
ʹʹఅమ్మా.. అన్నకు పనుంటే పోనివ్వు. బాపు, నీవు ఉన్నరు గదాʹ అని ధనలక్ష్మి తనకా సంగతే ఇష్టం లేనట్టు చరచర లోపలికి వెళ్లిపోయింది. చిన్నప్పటి నుంచి ధనలక్ష్మి అన్నకు ఏ కష్టం రానిచ్చేది కాదు.

**** **** *****

రాత్రి తొమ్మిది గంటలైంది.
తలుపు చప్పుడైతే పోశమ్మ వెళ్లి తీసింది. కొడుకు కోసమే ఎదురు చూస్తున్నట్టుగా లింగయ్య ముందు రూంలోనే కూచున్నాడు. రమేష్‌ లోపలికెళ్లి కాళ్లూ చేతులు కడుక్కొని తండ్రి పక్కనే కూర్చుంటూ చెల్లెలి కోసం అటూ ఇటూ చూశాడు. ఆమె కనిపించలేదు. బహుశా లోపలి గదిలో ఉందేమో.
ʹఏమైంది బాపూ! వాళ్లు పొద్దున వచ్చిండ్లా? ఏమైంది?ʹ అని తండ్రిని అడిగాడు.
లింగయ్యది పోశమ్మలా దూకుడు స్వభావం కాదు.
ʹఆ.. అచ్చిపొయిండ్లుʹ అన్నాడు.
ఆ తర్వాత కూడా బాపే చెప్తాడని చూస్తుండిపోయాడు రమేష్‌. ఆయన కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
ʹవాళ్లకు మనం ముందే మాట ఇచ్చినం కదా. పిల్లగాన్ని ఉంచుకుని పెళ్లి జేస్తమని. ధనాలు ఏమో ససేమిరా అంది. నీకు మేం చూసే సంబంధాలు ఇష్టం లేనట్లే దానికీ ఇష్టం లేకపోయె. పైగా ఒకసారి చదువు ఆపి గొంతు కోసింది చాలదా? అని అందరి ముందే అనె. ఇంకేం మాట్లాడతం. అవతలి వాళ్లు రడీగా ఉన్నా చేసేదేముంది? మిమ్మల్ని కన్నం కాని మీ రాతల్ని కనలేదు కదా. మా చేతిలో ఏముంది చెప్పు. ఎట్లయితే అట్లయితదితియ్‌...ʹʹ అని నిర్లిప్తంగా ముగించాడు.
పోశమ్మకు ఇద్దరి పిల్లలమీద పట్టరానంత కోపంగా ఉంది.
ఆ పూట ఇంట్లో వండలేదు. తినలేదు.

**** **** *****

ధనలక్ష్మి బాగా బిజీ అయిపోయింది. తనంతకు తనుగా ఎంచుకున్న పనులు కొన్ని, అన్న అప్పగించిన చిన్న చిన్న పనులు మరి కొన్ని. పొద్దున్నే బాబును స్కూల్లో వదిలేసి తను స్కూలుకు వెళ్తుంది. సాయంకాలం నాన్న వచ్చి బాబును ఇంటికి తీసికెళ్తాడు. రాత్రిళ్లు పొద్దు పోయేదాకా చదువు, రాత పనులు కూడా పెట్టుంది. ఆమె కోసం ఒకి రెండు సార్లు పోలీసులు స్కూలుకు వచ్చారు.
ʹధనలక్ష్మి ఎవరనుకున్నారు? వాళ్ల అన్న ఇప్పుడు పెద్ద నక్సలైట్ నాయకుడు. ఈమె కూడా వాళ్లతో సంబంధాల్లో ఉంది. వాళ్ల పనులు చేస్తుంది. ఆమె ఉంటే మీ స్కూలుకు ఇబ్బందిʹ అని చెప్పారు.
అన్న ఉన్నప్పుడు తనతో చాలా విషయాలు మాట్లాడేవాడు. ఇప్పుడు పూర్తి ఒంటరిగా ఫీలవుతోంది. ఎటు చూసినా మనుషులు అన్న లాగా కనిపించడం లేదు. అన్నలాంటి వాళ్లెవరైనా స్నేహితులు దొరికితే బాగుండు అనిపించేది. ఈ వెలితిని భర్తీ చేసుకోడానికి పుస్తకాలు చదవడం మొదలుపెట్టింది.

ఇప్పుడు లింగయ్య, పోశమ్మ కూతుర్ని చిన్న పిల్లలా చూడటం మానేశారు. ఆమె తనంతకు తాను బతకగలదనే నమ్మకం కుదిరింది. అన్నికీ బేలగా తలకిందులయ్యే ధనలక్ష్మి ఇప్పుడు వాళ్లకు కొత్తగా కనిపిస్తోంది. అడపాదడపా పోలీసులు ఇంటికి వచ్చి రమేశ్‌ కోసం ఎంక్వెయిరీ చేసి వెళ్తున్నారు. కొడుకును సరెండర్‌ చేయించమని వొత్తిడి తీసుకొని వస్తున్నారు. ముసలి ప్రాణాలకు కొడుకును చూడాలని ఎంతగానో ఉండేది. కానీ బైటకి చెప్పుకోలేరు.

స్కూలుకు మళ్లీ పోలీసులు వచ్చారు.
ఆమె కోసం ఎవరైనా వస్తున్నారా? వస్తే తమకు చెప్పాలని హెడ్మాస్టర్‌కు చెప్పి వెళ్లారు. రమేష్‌ గురించి తెలుసు కాబట్టి ధనలక్ష్మిని పిలిచి హెడ్మాస్టర్‌ ఈ సంగతి చెప్పాడు.
ʹతన కోసం ఎవరొస్తారని?ʹ నవ్వుకుంది ధనలక్ష్మి.
ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె దగ్గరికి తన చిన్న నాటి స్నేహితురాలు గౌతమి వచ్చింది. తనను చూచి రెండెళ్లు కావస్తోంది. ఆమెను మహారాష్ట్రలోని గడ్చిరోలికి ఇచ్చారు. చాలా కాలం తర్వాత గౌతమి రావడంతో ఆ పూట స్కూలుకు సెలవు పెట్టి ఇంటికి వచ్చింది ధనలక్ష్మి.

**** **** *****
ʹఏం బిడ్డా అల్లుడు ఎట్లున్నడు?ʹ అడిగింది పోశమ్మ.
ʹʹఅందరూ బాగున్నారు చిన్నమ్మాʹ అన్నది.
ʹఅన్నం తిని పోదువుగాని ఉండు. ఎన్నాళ్లకు కలిసిండ్రో. ఇద్దరు దోస్తులు కలిసినాక ముచ్చట్లకు తక్కువా?ʹ అని మరో మాటకు అవకాశం లేకుండా పోశమ్మ మార్కెట్ కు వెళ్లిపోయింది.
ʹʹఏంటి విశేషాలు?ʹʹ అని అడిగింది.
ʹʹవిశేషాలా? ఉండవా? చాలా రోజులకు వచ్చాను కదా?ʹʹ అని పర్స్ లోంచి ఒక కవర్‌ తీసి ఇచ్చింది గౌతమి.
ʹʹఏమిటది?ʹʹ
ʹʹచదివితే కదా తెలిసేది.ʹʹ
ఉత్తరం తెరవగానే ధనలక్ష్మి కళ్లు విప్పారాయి.
అది రమేష్‌ నుంచి వచ్చింది.
గతాన్ని తల్చుకుంటూ ధనలక్ష్మి నిద్రలోకి జారుకుంది.

(ఇంకా ఉంది)

No. of visitors : 1540
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ శిరస్సు, స్తనాలు ఏమయ్యాయి?

పద్మకుమారి, కార్యదర్శి, అమరుల బంధుమిత్రుల సంఘం | 18.11.2016 11:48:02am

మర్మాంగాలను ఛిద్రం చేస్తున్న చోట, పాలిచ్చే వక్షోజాలను కోసి పారేస్తున్న చోట, తలెత్తి పోరాడమని ప్రజలకు నేర్పిస్తున్న వాళ్ల తలలు మాయం చేస్తున్నచోట, శవాన్ని ప...
...ఇంకా చదవండి

‌మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

పద్మకుమారి | 17.06.2016 10:57:58am

వాకపల్లి పాతపడిపోయింది. కొత్తగా భల్లుగూడ కూడా మన ముందుకు వచ్చిపోయింది. ఛత్తీస్‌ఘడ్‌లో రోజూ ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అన్నీ పోలీసులు, పారా........
...ఇంకా చదవండి

పయనించిన పాట

పద్మకుమారి | 21.12.2016 12:01:15am

బిడ్డల గురించి తల్లులకు ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని ఎదురు చూపులు. ఇవి తీరేవేనా? ఈ దు:ఖం ఆగిపోయేదేనా? ప్రభా తల్లి ఒక్కరే కాదు. అమరుల ...
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు -2

పద్మకుమారి | 01.06.2016 10:37:59am

కమాండర్‌ వెనక్కి తిరిగి మనం దగ్గరికి వచ్చేశాం. ఇది మనకు బలమైన ప్రాంతం. ఇంకో అరగంటలో గ్రామం అంచులోకి చేరుకుంటాం. ప్రయాణం ఒక రోజు లేటైనా రెండో రోజు ఏపీటీకి...
...ఇంకా చదవండి

విప్లవ వ్యక్తిత్వం

పద్మకుమారి | 16.07.2019 08:07:17pm

భారతి అమరత్వం తర్వాత కలిసినప్పుడు శంకరన్న వాళ్లన్నయ్య దుబాషి యాదయ్య తన జ్ఞాపకాలు పంచుకున్నాడు. చిన్నారి యాదమ్మ ఆ కుటుంబంలో హక్కుల కోసం ఆమె పడిన ఘర్షణ......
...ఇంకా చదవండి

పాల్గుణ

ప‌ద్మ‌కుమారి | 11.05.2016 01:21:15pm

ఇప్పుడు పాల్గుణ అంటే మేఘ‌మే కురుస్తుంది త‌ప్ప పిడుగు రాల‌దు.పిడుగు రాలినా పిడుగంచు విద్యుత్ వెలుగై మ‌నసులోకి ఇంకుతుంది. ...
...ఇంకా చదవండి

త్యాగాల పరంపర

పద్మకుమారి | 17.07.2016 12:35:14am

కుప్పగా పోసిన శవాల్లో తమవాళ్లను గుర్తించి ఏరుకోవడం ఎంత హృదయ విదారకం. సృజన మనసు చాల సున్నితమైనది. పట్టుదలగల అమ్మాయి. మేము ఇలా ఎప్పుడో ఒకప్పుడు చూస్తామని......
...ఇంకా చదవండి

దారులు

ప‌ద్మ‌కుమారి | 15.05.2016 01:10:40pm

ఎక్కడివీ బాటలు ఎవరి జాడలు వెంట పరిగెడుతున్నాయి నీవేనా ? అవి నీవేనా ?...
...ఇంకా చదవండి

వాకపల్లి ఇప్పుడు ఎం చెబుతోంది?

పద్మకుమారి | 04.09.2017 08:58:57am

వాకపల్లి ఒక్కటే కాదు. విప్లవోద్యమ ప్రాంతాల్లో మహిళల రాజ్యం దారుణంగా దాడి చేస్తోంది. బైటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించీ వింటున్నాం. చిన్న ప...
...ఇంకా చదవండి

రమాకాంత్‌ వాళ్లమ్మ

పద్మకుమారి | 17.11.2019 10:25:42am

ʹఆ రోజు అన్నను చంపేసినప్పుడు మన సంగం లేదు కాబట్టి శవాన్ని చూడ్డానికి కూడా కాలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడికోపోయి మనోల్ల శవాలను తెస్తున్నారు. మన సంగం ఉండాలి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •